
ఈ మధ్య చుసిన "కొత్త బంగారు లోకం" సినిమా నా ఇంటర్ కళాశాల జ్ఞాపకాలను పదే పదే గుర్తుచేసింది...సినిమా లో ఉన్నంత కలర్ఫుల్ గా కాకపోయినా ఆ రోజులు నా జీవితం లో మరచిపోలేని ఉగాది పచ్చడి లాంటి జ్ఞాపకాలు. కంప్యూటర్ ముందు కూర్చొని కోడింగ్ చేస్తూ అపుడపుడు అలా పాత జ్ఞాపకాలు తలచుకుంటూ ఉంటా, పక్కనే ఉండే మేనేజర్ (నా ఖర్మ కొద్దీ ) "హే వాట్స్ అప్ డూడ్...వాట్స్ గోయింగ్ ఆన్" అంటూ నా జ్ఞాపకాల దొంతరలను తెరలు తెరలుగా తన వాడి చూపులతో తూట్లు పోడిచెంతవరకు.....
1998 , మే నెల.... హాయిగా సమ్మర్ ఎంజాయ్ చేస్తూ... మా ఊరులో పొలాల వెంబడి..గట్ల వెంబడి ఎండకు తిరుగుతూ, చెరువు పక్కన చింత చెట్టుకి రాళ్ళు విసిరి చింతకాయలు ఏరుకుంటూ, రాత్రి ఏడు గంటలకల్లా నానమ్మ పప్పు,నెయ్యి వేసి కలిపి ముద్దలు పెడితే తింటూ....కాలం గడుపుతున్న సమయం లో ఇంటి నుంచి ఫోన్ వచ్చింది త్వరగా రమ్మని (మా నానమ్మ వాళ్ళది పల్లెటూరు... మేము ఉండేది వేరే టౌన్ లో )... మరుసటి రోజు ఊరికి బైల్దేరాను అయిష్టంతోనే...ఇంటిలో ఈ సరదాలు ఏవీ కుదరవు కదా...ఇంటికి వెళ్ళాక తెల్సింది నన్ను ఇంటర్మీడియట్ కాలేజీ లో వెంటనే జాయిన్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యారని...అది కూడా హాస్టల్ లో...నాకు హాస్టల్ అప్పటిదాకా అలవాటు లేదు..పైగా సమ్మర్ సెలవులు ఒక నెల కూడా ఎంజాయ్ చెయ్యకుండా మళ్ళి బుక్స్ పట్టాలి అనే ఆలోచన నాకు చిరాకు తెప్పించింది కానీ చేసేది ఏముంది...మరుసటి రోజు గుంటూరు ప్రయాణం...
విద్వాన్ జూనియర్ కాలేజీ...నేను చదవబోయే కాలేజీ పేరు అని తెల్సుకున్నాను...అక్కడ డైరెక్టర్ ఎవరో మా అన్నయ్యకి తెలుసట అందుకని మా అన్నయే ఆ కాలేజీ లో చేర్పించమన్నాడు...నేను, అమ్మ, నాన్న, అన్నయ్య కల్సి గుంటూరు బైల్దేరాము.. కాలేజీ ఫీజు ౩౦ వేలు అని తెలిసాక సన్నగా నా వెన్నులో చలి ప్రారంభం అయింది... ఇంత ఖర్చు పెడుతున్నారంటే ఫలితం అంత కన్నా కాస్ట్లీగా ఆశిస్తున్నారు అని అర్థం అయింది... ఫీజు కట్టాక నాకు కేటాయించిన హాస్టల్ కి వచ్చాం... వరసగా ఒక ఎనిమిది బెడ్లు ఉన్నాయ్.. నేను వెళ్లి ఒక బెడ్ మీద నా లగేజి పెట్టి అటు ప్రక్కగా ఉన్నా విండో లోనుంచి చుట్టూ చూసాను....చుట్టూ అపార్టుమెంట్లు, డుప్లెక్స్ ఇళ్ళు..బాగా రిచ్ ఏరియా అనుకుంట...అమ్మ ఎందుకో పిలిస్తే వెనక్కి తిరగబోయి ఎందుకో మళ్ళి కిటికీవైపు చూసా..ఓ అమ్మాయి జీన్స్ లో కనిపించింది ..కళ్లు ఓ సారి మెరిసాయి ...... "పిలిస్తుంటే కిటికీ దెగ్గర ఏమి చేస్తున్నావ్ రా " అమ్మ పిలిచే సరికి టక్కున కిటికీ మూసి వచ్చేసాను...నా వస్తువులు అన్ని అమ్మ చక్కగా సర్ది పెట్టింది...కొత్తగా కొన్న బకెట్, ట్రంక్ పెట్టె, అద్దం, సబ్బు, పౌడర్ వీటితో పాటు పుస్తకాల మూట - వగైరా వస్తువులని చూస్తుంటే నన్ను సర్వత్రా యుద్దానికి సిద్దం చేస్తున్నారా అనిపించింది...నాతో పాటు కాసేపు ఉండి జాగ్రతలు అన్ని చెప్పాక అమ్మ వాళ్ళు ఇంటికి బైల్దేరారు.....
కాసేపు అలాగే బెడ్ మీద పడుకొని లేచాను...సాయంత్రం అయింది ....కొత్తగా కాలేజీ లో చేరేవాళ్ళతో హాస్టల్ మొత్తం సందడిగా ఉంది...ప్రొద్దుటి నుంచి తిరగడం వల్ల బడలికగా ఉండటంతో స్నానం చేద్దామని అనుకోని బాత్ రూమ్స్ ఎక్కడ అని వెతక సాగాను..హాస్టల్ చివరలో వరసగా ఉన్నాయి బత్రూమ్స్..లోపలికి వెళ్తే అంతా ఓపెన్ బత్రూమ్స్...ఓపెన్ గా అలా ఎలా స్నానం చెయ్యాలి రా అనుకోని కంగారు పడి స్నానం చెయ్యకుండానే రూం కి వచేశాను..చూసేసరికి రూం లో ముగ్గురు తయారయ్యారు అప్పుడే ..వాళ్ళతో పాటు వాళ్ళ బంధువులు ఎవరూ లేరు..నేను నా అంతగా పరిచయం చేసుకొనే టైపు కాదు..కొంచెం రిజర్వుడు కేటగిరి లెండి..సైలెంటు గా వెళ్లి నా బెడ్ పైన కూర్చున్నాను...వాళ్ల ముగ్గురు బాగా తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుకోడం బట్టి వాళ్ళు ఒకే ఊరి వాళ్ళు అని అర్థం అయింది...ఒకడి పేరు రాజేంద్ర, ఒకడు మునీంద్ర , ఇంకొకడు స్వామి రెడ్డి. రాత్రి భోజనానికి వెళ్ళాను ...అస్సలు తిన బుద్ధి కాలేదు. తింటుంటే ఎందుకో అమ్మ జ్ఞాపకం వచ్చింది.. రేపటి నుంచి నాకు నేను సొంతగా అన్ని పనులు చేసుకోవాలి..అమ్మ ఉండదు ఇక్కడ..అమ్మని మళ్ళి ఎపుడు చూస్తానో?..ఇలా ఆలోచించగానే మనసంత కొంచెం బాధతో నిండిపోయింది....రూంకి వచ్చి పడుకున్నాను..అందరు నిద్రపోయాక లేచి మెల్లిగా వెళ్లి ఓపెన్ బాత్రూం లో స్నానం చక చకా చేసి వచ్చి పడుకున్నాను...ఛీ ఏంటి ఈ జీవితం స్నానం కూడా ఇలా దొంగ చాటుగా చెయ్యాల్సిన కర్మెంతో నాకు అర్థం కాలేదు...బాగా నిద్ర పట్టేసింది...ఎప్పటికో టక టకా గట్టి శబ్దాలు రావడం తో ఉలిక్కిపడి లేచాను...ఎవరో కర్రలతో మా డోర్స్ మీద తెగ బాదుతున్నారు....ఏమిటో అర్థం కాలేదు..ఈ లోపు ఒకడు లేచి తలుపు తీసి మళ్ళి పడుకోబోతుంటే వాడి పిర్ర మీద ఒకటి వేసాడు లోపలి వచినవాడు..టైం చూసుకున్నాను...నాలుగు అయింది.."నిద్ర పోయింది చాల్లే..తొందరగా లేచి స్నానం చేసి స్టడీ అవర్స్ కి నడవండి...మీ ఇంట్లో ఉన్నట్లు కుదరదు ఇక్కడ " అన్నాడు వాళ్ళలో ఉన్న ఒకడు ..తర్వాత తెల్సింది వాడు వార్డెన్ అని...నా లైఫ్ లో ఎప్పుడు నేను నాలుగు ఇంటికి లేచి ఎరుగను..లేవాలంటే చాలా బద్ధకం వేసింది..ఛీ ఏంటి ఈ జీవితం ఇన్ని కష్టాలు పడి ఇక్కడ పీకేదేమిటో నాకు అర్థం కాలేదు ..చేరిన మొదటి రోజే రెండు సార్లు జీవితాన్ని తిట్టుకున్నాను..ఇంకా ఇక్కడ రెండు ఏళ్ళు ఉండాలి..పాపం నా జీవితం ఎన్ని సార్లు బలవుతుందో..."ఇంకా పడుకొని ఉన్నారేంటి లేవండి.." ఈ సారి వార్డెన్ కర్రతో కొట్టే ఫోస్ పెట్టాడు...ఆ టైం లో లేచి చన్నీళ్ళ స్నానం...పైగా ఓపెన్ బత్రూమ్స్..మన వాళ్ళ కాదనుకొని బ్రష్ చేసుకొని, ముఖం కడుక్కొని కొన్ని పుస్తకాలూ చంకన వేసుకొని స్టడీ హౌర్ కి బైల్దేరాను...
అప్పటికే స్టడీ హౌర్ కి కొంత మంది కూర్చొని ఉన్నారు...కొంత మంది అయితే ఒక గ్రంధం లాంటి పుస్తకాన్ని ముందేసుకొని తెగ చదివేస్తునారు...ఇంతకముందు నేను భగవద్గీత తప్ప అంత పెద్ద గ్రంధం ఎపుడూ చూడలేదు...మనం కూడా ఇంతింత పెద్ద గ్రంధాలు చదవాలా ఏమిటి?...ఒకరకమైన భయం స్టార్ట్ అయింది అపుడే.."టిఫిన్ చెయ్యని వాళ్ళు వెంటనే టిఫిన్ చేసి వచ్చి స్టడీ అవర్స్ లో కూర్చోండి." ఒక బొండం విత్ బట్ట తల వ్యక్తి వచ్చి గట్టిగా అరిచాడు...వాడే మన్మధ రావు ,మా కాలేజీ కి మేనేజర్ ....ఆ అరుపు వినగానే మా నానమ్మ వాళ్ళ ఊరిలో తూర్పు పొలం లో పనిచేసే ఎసుదానం గుర్తోచాడు...తూర్పు పొలం నుంచి పడమటి పొలం దాకా వినిపిస్తుంది వాడి అరుపు...అయినా ఇంత పొద్దుటే టిఫిన్ ఏంట్రా బాబు..టైం చుస్తే అయిదు కూడా సరిగ్గా కాలేదు.....అయిష్టంగానే వెళ్ళాను...టిఫిన్ చుస్తే ఇడ్లీ..బాబోయ్ డెడ్లీ అనిపించింది..ఒక ఇడ్లి తిని కొంచెం టీ త్రాగి బైట పడ్డాను..అందరికి చైర్స్ సప్లై చేస్తున్నారు రోల్ నంబర్లు ప్రకారం ..నా చైర్ నేను తీసుకొని..మంచి ప్లేస్ చూసుకొని కూర్చొని చదవడం స్టార్ట్ చేశాను..ఏమి చదువుతున్నానో అర్థం కావడం లేదు...అలా అలా ఏడు అయింది...బెల్ కొట్టారు..ఇంటర్వెల్ టైం అది..ఒక పావుగంట బ్రేక్ అనమాట...నాకు బాగా ఆకలి వేసింది, అకడ దేగ్గరిలో ఒక కాంటీన్ ఉంది..అది కాలేజీ వాళ్ళదే..ఇక్కడ పఫ్స్, బన్స్ ఇలా ఫాస్ట్ ఫుడ్స్ అమ్ముతారు..వెళ్లి ఒక బన్ కొనుక్కొని తిన్నాను..చాలా లోన్లీ గా ఫీల్ అవడం స్టార్ట్ అయాను.. "హాయ్ ఏంటి పెద్దగా మాట్లాడవా? రూం లో కూడా మాతో ఏమీ మాట్లాడలేదు.." ఎదురుగ స్వామి రెడ్డి .."అబ్బే అదేం లేదు...కొంచెం హోం సిక్ ఫీల్ అవుతున్న అంతే.." అన్నాను.." ఏమి పర్లేదు..ఫ్రెండ్స్, చదువులో పడితే అవేం గుర్తురావు...అయినా ఇంకో నెలలో మనకి ఒక పది రోజులు హోం సిక్ సెలవులు ఇస్తారు."అన్నాడు..ఆ వార్త నాకు చాలా నచ్చింది...అలాగే స్వామి రెడ్డి కూడా...నాకు ఇప్పటికీ స్వామి బెస్ట్ ఫ్రెండ్.....
క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి..వరసగా అయుదు పిరిడ్స్..నోట్స్ చాలా జాగ్రత్తగా రాసుకున్నాను..పన్నెండున్నర అవడం తో లంచ్ కి పిల్చారు..మమ్మల్ని బాచేస్ గా లంచ్ కి పిలుస్తారు...ఆకలి గా ఉండటం తో రుచి మాట పక్కన పెట్టి బాగా తిన్నాను..ఆ తర్వాత ఒక గంట రెస్ట్..మళ్ళి రెండింటికీ కాలేజీ స్టార్ట్...ఆ గంటలో రూం కి వెళ్లి కాసేపు పడుకున్నాను...మళ్ళి ఎలాగూ కొద్దిసేపట్లో లేవాలి అనే విషయం పదే పదే గుర్తురావడం తో సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు..మళ్ళి ఓ సారి జీవితాన్ని తిట్టుకున్నాను...రెండింటి కల్లా క్లాసు రూం కి చేరుకున్నాను...అక్కడ ఇంకా కొందరు గ్రంధాలతో కుస్తీ పడుతున్నారు..వాళ్ళను చూస్తుంటే నాకేమో టెన్షన్ స్టార్ట్...అసలే బద్ధకస్తుల జాబితాలో ప్రధముడిగా నిలుస్తుంటాను ఎప్పుడు, ఇంతింత పెద్ద గ్రంథాలు, ఇన్నిన్ని గంటల స్టడీ అవర్స్ మన వాళ్ళ అవుతాయా అసలు??...నా మనసులో ఇలాంటి ప్రశ్నలు మొదలు అయ్యాయి....రెండు నుంచి అయిదు దాక స్టడీ అవర్స్ ఆ తర్వాత ఒక గంట విరామం..తరువాత ఆరు నుంచి మళ్ళి క్లాసెస్ స్టార్ట్..రెండు నుంచి అయిదు దాకా నేను చదవడం పక్కన పెడితే , చుట్టూ ఉన్న వాళ్ళు ఏమేమి చదువుతున్నారో చూడటమే సరిపోయింది నాకు.."వీడేంటి రా బాబు అపుడే మాథ్స్ బుక్ లో సగం పేజెస్ అవ్వగోట్టాడు...వీడేంటి ఆ గ్రంథం వెయిట్ లో సగం ఉండడు, దాంతో కుస్తీ పడుతున్నాడు...వాడేంటి ఫిజిక్స్ బుక్ ముందేసుకొని మాథ్స్ చేస్తున్నాడు (ఫిజిక్స్ లో మాథ్స్ కంటే ఘోరంగా ప్రొబ్లెమ్స్ ఉంటాయని మనకి తెలీదు అపుడు)..." ఇలా నా మనసు తెగ ఆలోచిస్తూ నాకు టెన్షన్ పెట్టడం స్టార్ట్ చేసింది....అయిదు ఇంటికి మళ్ళి బ్రేక్ స్టార్ట్ అయింది..అందరు స్నానాలు చేస్తున్నారు...నాకు మళ్ళి ప్రాబ్లం స్టార్ట్ ,అసలే ప్రొద్దుటి నుంచి స్నానం చెయ్యలేదు..ఇంతలొ స్వామి స్నానం చేసి వచ్చాడు.."ఏంటి ఇంకా స్నానం చెయ్యలేదా, త్వరగా చేసి రా ...కాలేజీ కి వెళ్దాం" అన్నాడు..నేను నా ప్రాబ్లం చెప్పాను...వాడు పక పకా నవ్వాడు..కొంచెం కోపం వచ్చింది నాకు.."భలే వాడివే...కింద ఫ్లోర్ లో క్లోసేడ్ బత్రూమ్స్ కూడా ఉన్నాయ్...నేను కూడా అక్కడే చేస్తాను.." అన్నాడు...ఆహ ఎంత శుభవార్త చెప్పావురా అనుకోని, బకెట్ తీసుకొని కింద ఫ్లోర్ కి పరుగో పరుగు..తనివి తీరా ఒక ఇరవై నిముషాలు స్నానం చేసి..ఫ్రెష్ గా రెడీ అయ్యి మళ్ళి కాలేజీ కి బైల్దేరాను...ఆరు నుంచి ఎనిమిది దాకా క్లాసెస్ జరిగాయి...తర్వాత డిన్నర్ కి బాచేస్ గా పిలిచారు..తినేసి వచ్చి మళ్ళి స్టడీ అవర్స్ లో కూర్చున్నాం...ఆ రోజు ప్రేపర్ చేసుకొన్న నోట్స్ తిరగెయ్యడం స్టార్ట్ చేశాను..ఎందుకో సడన్ గా ఇల్లు గుర్తుకొచ్చింది..ఈ టైం లో ఇంట్లో ఉంటే అమ్మ చేతి వంట కమ్మగా తింటూ టీవీ చూస్తూ..ఎందుకో ఆ ఆలోచనతోనే నా కళ్ళు చెమ్మగిల్లాయి..అమ్మ నాన్నలను చూడాలని అనిపించింది.." రామక్రిష్ణా రెడ్డి....రామక్రిష్ణా రెడ్డి .." గట్టిగా ఎవరో పిలుస్తున్నారు..నేను లేచాను.."నీకు ఫోన్ వచ్చింది...మీ నాన్న గారు చేసారు" ..ఒక్కసారిగా ఎక్కడలేని ఆనందం వచ్చింది..వెళ్లి ఫోన్ కాల్స్ అటెండ్ అయ్యే రూం లో కూర్చున్నాను..ఒక పది నిముషాలకు ఫోన్ వచ్చింది "ఎరా రాము బాగున్నావా? అడ్జస్ట్ అయ్యావా అక్కడ?" అడిగారు నాన్న.."ఆ పర్లేదు.." చెప్పాను నేను.."బాగా చదువుకో...ఇదుగో అమ్మతో మాట్లాడు.." అని అమ్మకు ఫోన్ ఇచ్చాడు నాన్న.."చిన్నా..బాగున్నావామ్మా..దిగులు ఏమి పెట్టుకోవద్దు.." అంతే ఇక నాకు కన్నీళ్ళు ఆగలేదు.."అమ్మా నాకిక్కడ ఏమీ నచ్చలేదు..అసలు ఉండ బుద్ధి కావడం లేదు..మీరు అందరూ గుర్తుకువస్తున్నారు .."అన్నాను .."అలా అనకూడదు నాన్నా ..నాన్న అంత ఖర్చు పెట్టి నిన్ను అక్కడ చేర్పించింది చదువుకోవాలనే కదా...కొన్ని రోజులు పోతే అదే అలవాటు అవుతుంది కదా" అని నచ్చచెప్పింది ...భారంగానే ఫోన్ పెట్టేసి నడుచుకుంటూ వెళ్లి మళ్ళీ స్టడీ అవర్స్ లో కూర్చున్నాను.... (ఇప్పటికే చాలా లెంగ్త్ అయింది అనుకుంటా.. .తరువాయి భాగం మళ్ళీ కలిసినపుడు.....ఇక ఉంటా మరి)
22 comments:
wow
ur explation is very good than ur experience.just i am also experienced that feeling while reading, what u experienced that time.
waiting for yr next post
hi,ne article to chalamandi past years okkasari kalla mundiki tepinchav really ela chalamandi experience iyuntaru but ade nelanti valu matrame express cheyagalugutunnaru edi chadivi andaru valalo unna talent ni bitiki tevalani.... nuv elane inka enno rayalani... manchi writer kavalani korutu........
ఒక్క మాటలో చెప్పలంటే చాలా బాగా రాసారు,మొదటి పోస్ట్ నే చక్కని సరళమైన భాషలో బాగా రాసారు .. అభినందనలు :)
విజయ్ మరియు ప్రియాంక...మీ అభిమానానికి ధన్యవాదములు
నేస్తం మీ వ్యాక్య చూసాక చాలా సంతోషపడ్డాను... చాలా థాంక్స్ అండి మీ కామెంట్ కి.. వీలున్నపుడు నా బ్లాగ్ ని దర్శిస్తూ ఉండండి, తరచుగానే రాస్తుంటాను కొత్త పోస్ట్ లను....మీ తదుపరి పోస్ట్ ఎపుడో ?
రెడ్డి గారూ..
బాగుందండీ మీ అనుభవం..
నేను కూడా గుంటూరులోని "గూడవల్లి గౌతం"లో ఎంసెట్ లాంగ్ టర్మ్ చేరినప్పుడు ఇవే అనుభూతులు పొందాను. గౌతం మాతోటే మొదలయింది గుంటూరులో, 2000లో. అవి మర్చిపోలేకపోయినా.. ఇప్పుడు మళ్లీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
మొదటి టపాలోనే ఇరగదీశారు!
నరేష్ గారు మీ అభిమానానికి ధన్యవాదాలు... ప్రతి ఒక్కరి జీవితం లో ఇంటర్మీడియట్ ఒక అందమైన అనుభవాల సమాహారం... ఈ టపా వల్ల మీ అనుభవాలను మరొక్కసారి జ్ఞప్తికి తెచ్చినందుకు నేను ధన్యుడిని...
Hey chala chala bagundhi..professional telugu writers rasinatlu vundhi..Eagerly waiting for that your next part.
Hey Kishen very very Nice blog..Patha Gnapakalu anni gurthu vachayi okkasariga.Chala baga rasav.Neelo oka manchi writer vunnadu.Ilage continue chesthe nee blog ki chala mandhi fans avutharu.And andulo first nene vuntanu. Eagerly waiting for your next part.
వెన్నెల ...మీ అభిమానానికి నా ధన్యవాదములు...
కిషన్ గారు, మనసుని తట్టి లేపే చక్కని శైలి మీ సొంతం ! అప్పుడే అయిపోయిందా అనిపించింది చదువుతుంటే !
చాల బాగా రాస్తున్నారు ! మీ కొత్త పోస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను !
చాలా బాగా narrate చేసావ్..ఫోన్ లో మాట్లాడుతున్నపుడు నా కళ్ళు కూడా చేమర్చేలా చేసావ్.. అభినందనలు
కిషన్ గారూ ! బావున్నాయండీ మీ కళాశాల కబుర్లు ! టైటిల్ ఆసక్తి కలిగించేలా ఉంది . కొత్తగా మొదలైన మీ బ్లాగ్ ప్రయాణం అలుపెరుగక
ఇలాగే కొనసాగాలని ....All the best!
anonymous : మీ అభిమానానికి థాంక్స్...మీ పేరు కూడా జతచేసి ఉంటే బాగుండేది..
హరే కృష్ణ గారు, అప్పటి నా భావాన్ని మీలో కూడా కలిగించగలిగినందుకు నేను కృతజ్ఞుడిని... మీ అభిమానానికి ధన్యుడిని ..
పరిమళం గారు, థాంక్స్ అండి... మీ అభిమానం ఉండగా నా బ్లాగ్ ప్రయాణానికి అలుపు ఉండదు లెండి.. మరొక్కసారి మీ అభిమానానికి థాంక్స్ అండి..
బాగుందండీ మీ అనుభవం
excellent man.............u have nice narration skills............though its ur first post u did it welll..............carryon.............
hi kishen,
bagundi.....bhasha chala bagundi.....akkadakkada pattu vidinattu anipinchindi....kani motham meeda chala bagundi....
bagundi post...motham meeda....manchi pattu kanipinchindi.....modati post kanna chala bagundi....
anonymous and vinay: thanks for your wishes...
Sundeep thanks a lot for the comments..
nenu ede chadivina taruvata koddisepu naku edupu vachindi... anta emotional ke feel chesindi...evarina valla coll days lo sads nee rayadam istapadaru...but aa kastanni kuda meeru istam ga rasaru...
nd finally tnks naa old nd golden days ne gurtuchesinanduku through dis post....it just rockss
saketh...thanks a lot..nuv anta emotional feel ayyavante, nenu baga rasinatle...thank u :)...
Post a Comment