Search This Blog

Thursday, 10 September, 2009

జీవితం గురుంచి నేర్పిన ఐ.టీ ప్రాజెక్ట్ (మొదటి భాగం)

అవి మేము బీ-టెక్ ఐ.టీ ఆఖరి సంవత్సరంలో ప్రాజెక్ట్ ఏ ప్లాట్ ఫాం మీద చేద్దాం అని తీవ్రంగా చర్చించుకుంటున్న రోజులు....అప్పటిదాకా రైల్వే ప్లాట్ ఫాం తప్ప సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫాం అంటే ఏంటో తెలీదు... కొంత మంది సహా విద్యార్ధులు చెప్పిన విషయాలు కొంత నాకు నేనుగా ఊహించుకున్న విషయాలు కలిపి సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫాం అనగా - ఒక సాఫ్ట్ వేర్ భాష కాని డేటాబేస్ కాని దేని ద్వారా అయితే మనం సాఫ్ట్ వేర్ తయారుచేస్తామో దానినే ప్లాట్ ఫాం అంటారు అని తెలుసుకున్నాను. ఈ విష్యం తెలుసుకునేసరికి నా ఆఖరి సంవత్సరం మొదలయింది...

"ఒరేయ్ మనం జావా మీద ప్రాజెక్ట్ చేద్దాం...రేపు మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన రెస్యుమేలో జావా ప్రాజెక్ట్ ఉంటే మనం త్రూ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ.." అన్నాడు సునీల్ గాడు అన్నం లో సాంబార్ పోసుకుంటూ...
"కాదు...మనం డాట్ నెట్ లో చేద్దాం...అదే ఇప్పుడు మార్కెట్ లో హాట్ ప్లాట్ ఫాం..." అన్నాడు కృష్ణా గాడు చేతికి అంటిన పెరుగుని అమృతంలా నాక్కుంటూ...
"ఇవేమీ కాదు...మనం ముల్టీమీడియాలో చేద్దాం...గ్రాపిక్స్ కూడా పెట్టి మంచి ప్రాజెక్ట్ చేద్దాం .." రెండు కళ్ళు సపోటా పళ్ళంత చేసి చెప్పాడు శీను గాడు...
"అసలు మనకి ఇవేమీ రావు కదరా..." ధర్మ సందేహం వెలిబుచ్చాను నేను పళ్ళెం అంచులు కూడా జుర్రెసుకుంటూ...
"నీ మొహం...అందరూ అన్నీ వచ్చే చేస్తున్నారా??...వంద వెధవపనులకి శతకోటి మార్గాలు..." గీతోపదేశం మొదలెట్టాడు కృష్ణుడు.... 

తర్వాత కాలేజీలో మాకు ఏది నచ్చితే ఆ ప్రాజెక్ట్ చెయ్యడానికీ వీల్లేదని, బైర్రాజు ఫౌండేషన్( సత్యం) వాళ్ళతో మా కాలేజీ వాళ్ళు టై-అప్ అయ్యి వాళ్ళు ఎన్నిక చేసిన ప్రాజెక్ట్లులలో ఏదోకటి మేము ఎన్నుకోవాలని తెల్సింది. "విలేజ్ స్కిల్ ప్రొఫైలింగ్" అనే ప్రాజెక్ట్ ఎన్నుకున్నాం మేము ఓ అయిదుగురు బాచ్ గా కలిసి. ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఏమిటంటే...మేము అంతా కలిసి కొన్ని గ్రామాలు తిరిగి, ఇంటింటికీ వెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు...వాళ్ళకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి - ఉదాహరణకి కొంత మంది వడ్రంగి పని చేస్తారు, కొంత మంది కల్లుగీత కార్మికులు, కొంత మంది వ్యవసాయం, కొంత మంది చెక్క పని చేస్తారు...ఇలా వాళ్ళ వాళ్ళ స్కిల్స్ ని మేము నోట్ చెయ్యాలి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికీ వెళ్లి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మాకు కొన్ని గ్రామాలు అప్పజెప్పారు. బైర్రాజు ఫౌండేషన్ వాళ్ళు కొన్ని గ్రామాలు దత్తతు తీసుకున్నారు. ఈ గ్రామాలలో జీవన ప్రమాణాలు మెరుగు పరచి, అందరికి కనీస సౌకర్యాలు కల్పించడం, అందరికి పని దొరికేలా చూడడం ఈ ఫౌండేషన్ వారి సదుద్దేశం.
 
మాకు అందరికి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఎంతో కొంత సోషల్ వర్క్ చెయ్యబోతున్నాం అని తెగ ఫీల్ అయిపోయాం. దీనికి ఐ.టీ ప్రాజెక్ట్ కి సంబంధం ఏమిటా అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నా, ఈ విధంగా సేకరించిన స్కిల్స్ సమాచారం మొత్తం మేము ఒక డేటాబేసులో పొందుపరచాలి. ఇలా పొందుపరచిన సమాచారం మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చేలా ఫ్రంట్-ఎండ్ తాయారు చేస్తాం - అంటే మనకు కనిపించే స్క్రీన్ అనమాట, ఒక వెబ్ సైట్ లాగ. ఈ వెబ్ సైట్ కి వెళ్లి ఆ గ్రామానికి సంబంధిన స్కిల్స్ సమాచారం మొత్తం రాబట్టవచ్చు. ఇది రియల్ టైంలో ఏ విధంగా ఉపయోగ పడుతుంది అంటే - ఉదాహరణకు ఒక ఇంటికి చెక్కపని చెయ్యాలనుకోండి, మాములుగా అయితే ఒక మధ్యవర్తి ద్వారా చెక్కపని వాడిని కుదుర్చుకోవడం జరిగుతుంది. కాని ఇక్కడ ఎవరికైనా ఏ పని తెల్సిన వాడు కావాలన్న ఈ వెబ్ సైట్ ద్వారా పొంది, ఆ మనిషిని పిలిపించవచ్చు. ఈ పల్లెటూరులలో ఈ వెబ్ సైట్ చూసి మనిషిని కాంటాక్ట్ చేసే అంత సీన్ ఉండదు అనుకుంటున్నారు కదా. నిజమే, అందుకే ప్రతి గ్రామం సెంటర్ లో బైర్రాజు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసారు. మీరు వీళ్ళకి ఒక్క కాల్ చేసి మీకు ఫలానా పని వాడు కావలి అని కబురంపితే చాలు , వీళ్ళే ఆ వెబ్ సైట్ ద్వారా సమాచారం పొంది పని వాళ్ళకు కబురంపి మీ ఇంటికి పంపుతారు. ఈ సర్వీసు పూర్తి ఉచితంగా చేస్తారు అనమాట. ఈ విధంగా గ్రామస్తులకి పని కల్పించినట్లు అవుతుందీ, మధ్యవర్తుల కమీషన్ లాంటివి ఉండవు, పూర్తి పని జీతం పనివాడికే చెందుతుంది. బాగుంది కదా కాన్సెప్ట్. అవును, అందుకే మాకు కూడా బాగా నచ్చింది...
మాకు అప్పగించిన గ్రామాలు తణుకు చుట్టుప్రక్కల గ్రామాలు - రేలంగి తదితర గ్రామాలు. సునీల్ గాడిది రేలంగి. ఈ ప్రాజెక్ట్ కోసం సమాచారం సేకరించడానికి ఒక పది రోజులు అయినా పడుతుంది, అప్పటిదాకా ఉండటానికి బైర్రాజు వాళ్ళు గెస్ట్-హౌస్ ఇస్తామన్నారు. కాని సునీల్ గాడు, పట్టుబట్టి వాళ్ళింట్లోనే ఉండాలని తీర్మానించాడు. నాకు అసలే కొత్త వాళ్ళ ఇంట్లో సిగ్గెక్కువ, వద్దులేరా అన్నా వినలేదు వాడు. ఒకానొక రోజు సుముహూర్తం చూసికొని అందరం కల్సి రేలంగి బైల్దేరం తణుకు గుండా. నాకు కొంచెం లోపల ఏదో ఫీలింగ్, పాపం ఆంటీ మమ్మల్ని అయిదు రోజులు మేపాలి అంటే సామాన్యం కాదు కదా. కానీ అక్కడికి వెళ్ళాక తెల్సింది ఆంటీ అంకుల్ మమ్మల్ని కూడా వాళ్ళ అబ్బాయి లాగానే చూసారు. నాకు వాళ్ళు చాలా బాగా నచ్చారు. అసలు నాకు ఈ ప్రాజెక్ట్ జీవితం గురుంచి ఎన్నో నేర్పింది, ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, పల్లెటూరి ప్రజల జీవన శైలి, వారి మధ్య అనుబంధాలు, ఎన్నెన్నో చెప్పుకోలేని బాధలు....ఇలా చాలా తెల్సుకున్నాను...ఇది నా అకాడెమిక్ ప్రాజెక్ట్ అనే కన్నా, నా జీవితానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ అని అనడం కరెక్ట్. అక్కడ గ్రామాలలో జరిగిన విశేషాలు అన్ని త్వరలోనే మీతో పంచుకుంటాను, అంతవరకు సెలవు మరి.