Search This Blog

Wednesday, 9 March, 2011

కిట్టిగాడు loves ఎదురింటి అమ్మాయి - 5***************Kittigadu is BACK******************
"నిజంగా నమ్మలేకపోతున్నా ... I just can't believe it that you are here!!" అన్నాడు కిట్టూ సుస్మీతో కలిసి క్యాంటీన్ లో కాఫీ తాగుతూ ....
"నాకూ వింతగానే ఉంది మిమ్మల్ని ఇక్కడ కలవడం ... ఇన్నాళ్ళ తరువాత మళ్ళీ మిమ్మల్ని చూడటం హ్యాపీగా ఉంది .." అంది కాఫీ సిప్ చేస్తూ ...
"నాకు కూడా ... " అంటూ ఆమెనే గమనిస్తున్నాడు ... రెండేళ్లలో ఆమెలో ఎంతో మార్పు కనిపిస్తుంది కిట్టూకి ... ఇంతముందు అమాయకత్వంతో అందంగా ఉండేది ... ఇప్పుడు తెలివితో అందంగా ఉంది ... 'ఆ కళ్ళు ...ఆ బుగ్గ మీద సొట్ట .. అవే.. అవే నా కొంప ముంచాయి ... ఇప్పుడు మళ్ళీ అవే నా గుండెలో ఆర్పేసిన దీపాన్ని ఆన్ చేసేలా ఉన్నాయి' అనుకున్నాడు ...

"ఆ రోజు మీరు నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు మీ కాలేజీకి ... అప్పుడు నాకు చాలా బాధ కలిగింది .. నేను మిమ్మల్ని నాకు తెలియకుండా ఏమన్నా హార్ట్ చేశానేమో అనిపించింది .." అంది సుస్మి ...
అసలు అనవసరంగా అప్పుడు సుస్మీని అవాయిడ్ చేశాడేమో అనిపించింది కిట్టిగాడికి ఒక్కసారిగా ... ఎందుకో సుస్మీని చాలా మిస్ అయిన ఫీలింగ్ కలిగింది ... "అదేమీ లేదు ... ఏంటో అప్పుడు సడన్ గా కాలేజీకి వెళ్ళాల్సి వచ్చి వెళ్లాను ..." అన్నాడు నెమ్మదిగా ...
"హమ్ .... ఇంకా ఏంటి సంగతులు ... మేనేజర్ గారు చెప్పారు ఇక్కడ కిట్టూ అంటే జావాకి సినానిమ్ ఆటగా ... గ్రేట్ .. నాకు తెలుసు కదా మీరు జావాలో కింగని .. ఇంజినీరింగ్ లోనే జావాని ఫుట్ బాల్ ఆడుకున్నారు .. ఇప్పుడొక లెక్కా" అందామె ప్రశంశాపూర్వకంగా ...
"అవును కరెక్టే ..." అన్నాడు జావాలో సెవెంత్ అటెంప్ట్ కి పాస్ అయిన విషయం గుర్తుతెచ్చుకొని...
"అప్పుడు ఎలాగూ మీ దెగ్గర జావా పెద్దగా నేర్చుకునే అవకాశం రాలేదు ... ఇప్పుడు మీరే నన్ను ట్రయిన్ చెయ్యబోతున్నారు .. యాం సో లక్కీ .. "
"హమ్... నేను కూడా... అది సరే ... నీ ఫ్రెండ్ కిరణ్ ఎలా ఉన్నాడు ..." అన్నాడు ... కిట్టూకి ఎందుకో ఆ కిరణ్ గురుంచిన టాపిక్ తీసుకురావాలి అనిపించలేదు ... కానీ ఎదో తెలుసుకోవాలి అన్న ఉత్సుకతని ఆపుకోలేకపోయ్యాడు ...
"ఓ నీకు కిరణ్ ఇంకా గుర్తున్నాడా! .. జస్ట్ ఒకేఒక్కసారి కదా నేను అతని గురుంచి నీకు చెప్పింది ... Wow you are awesome.. " అంది నవ్వుతూ ...
'వాడినెలా మరచిపోగలను ... నా ఆశల అంతస్తులని ఆటమ్ బాంబుతో కుప్పకూల్చాడు .... నా ప్రేమ పావురాన్ని తుపాకితో కాల్చాడు ...' అనుకున్నాడు కసిగా ...
"నీ గురుంచిన ప్రతి విషయం నాకు గుర్తుంది సుస్మీ ..." అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ ... 'ఒకప్పుడు నా ప్రపంచమే నువ్వు తెలుసా..' అనే మాట మాత్రం అతని పెదవుల చాటునే ఆగిపోయింది ...
"That's nice of you kittu... యా హీ ఈజ్ ఫైన్ ... యు నో తను కూడా ఇదే కంపెనీలో జాయిన్ అయ్యాడు ... అక్చువల్లీ మేమిద్దరం ఇంటర్వ్యుకి కలిసే వచ్చాం ... We both got selected." అంది ...
కిట్టిగాడికి కోసి కారం పెట్టినట్లు అనిపించింది ... మిరపకాయ నూరి పుండు మీద అద్దినట్లు అనిపించింది ...
'వాడెక్కడున్నాడో చెప్పు, వెళ్లి  పీ.సీ. పాతరేస్తా ..' అనుకొని "ఓహ్ ... గ్రేట్ ... తను ఏ ప్రాజెక్ట్ .." అన్నాడు..
"తనని ఇంకా ఏ ప్రాజెక్ట్ కి మ్యాప్ చెయ్యలేదు.. తనకి నేనున్న ప్రాజెక్ట్ కి రావాలని ఉంది .. అదే రిక్వస్ట్ చేస్తాను అన్నాడు మన మేనేజర్ ని ..." అంది సుస్మి ..
'నా కంఠంలో జావా ఉండగా అది మాత్రం జరగనివ్వను' అనుకొని "వావ్ గ్రేట్ ... " అన్నాడు ...

                                                   *****
"చైతూ ... మనకి ఇంకో న్యూ ట్రయినీ వచ్చాడప్పా... అంద పయ్యన్ పేరు కిరణ్ అనుకుంటా ..."అన్నాడు కందసామి కిట్టిగాడి డెస్క్ దెగ్గరికి వచ్చి ...
డీబగ్గింగ్ చేస్తున్న కిట్టిగాడికి డ్యామేజింగ్ న్యూస్ వచ్చేసరికి "వాట్?" అన్నాడు
"ఏమప్పా అవళ టెన్షన్.. కొత్త పయ్యన్ దా వచ్చాడు ప్రాజెక్ట్ కి.. ఏమయ్యింది ఇప్పుడు?"
'నీ కంద మొహాన్ని కోడిగుడ్డెట్టి కొట్టా ... ఆడిని ప్రాజెక్టులోకి తెచ్చావో సచ్చావే ...'అనుకోని "కందాజీ.. ఇప్పుడు మనకి ఇంకో ట్రయినీ అవసరం ఏముంది చెప్పండీ.. ఈ ట్రయినీలతో ఎదవ నస, మనకి ఇంకో ట్రైనీ వద్దండీ" అన్నాడు కిట్టిగాడు..
"ఈ ట్రైనీలే మనకి అవసరం, సేలరీ తక్కువ వేళ ఎక్కువ సేయించుకోవచ్చు... వీళ్ళని ఒక నెలలో షార్పుగా తయారుచెయ్యడానికి నువ్వుదా ఉండావు .. ఎప్డి ఇరుకు నా ఆలోచన.." అన్నాడు కళ్ళేగరేస్తూ..
'నీ బొందలా ఇరుకు... నీ గుండు మీద బొచ్చు లేనట్లే, నీ మెదడులో గుజ్జు లేదురా పిచ్చ నాయాలా..' అనుకోని "వద్దు కందాజీ ఎదవ గోల ... మనకి ఇప్పుడు ఇంకో రిసోర్స్ తో పనేంటి?.... క్లైంట్ కి బిల్లింగ్ సేవ్ చేస్తే మీకే కదా పేరు.. పైగా మిగిలిన ఎదవ చాకిరీ మొత్తం నేనే కదా చేస్తున్నా.. " అన్నాడు చిరాగ్గా..
"అదిదా చైతు ఎన్ బాధ.. అందుకే నీకు భారం దా తగ్గించాలి .. అందుకే వీడిని మన ప్రాజెక్ట్ కి మ్యాప్ చేశా.." అంటూ అక్కడనుంచి వెళ్ళిపోయాడు కందసామి..
'నీ ఎబ్బ కందగా...నా జీవితంతో ఆడుకోకురా ... ఆడొస్తే మళ్ళీ లేనిపోని త్రికోణ ప్రేమలు ..' అనుకొని వెంటనే ఎదో విషయం గుర్తొచ్చిన వాడిలా గడ్డం కింద చెయ్యేసుకొని "అసలు వాళ్ళ మేటర్ ఏమిటో కనుక్కోవాలి ముందు ... వీడి ప్రపోసల్ సుస్మీ యాక్సెప్ట్ చేసిందో లేదో తేల్చుకోవాలి .." అనుకున్నాడు ..


                                                                *******
సుస్మీ బైల్దేరబోతుండగా కిట్టూ వచ్చాడు తన దెగ్గరికి...                                                             
"సుస్మీ..."
"చెప్పు కిట్టూ ..."
"సో ... హైదరాబాద్ లో ఎక్కడుంటున్నావ్?"
"ప్రస్తుతం హాస్టల్లో ... కానీ నాకు హాస్టల్ ఫుడ్ పడదని, నెక్స్ట్ మంత్ మమ్మీ డాడీ వస్తున్నారు .. సో ఇల్లు తీసుకుంటాం ."
"గుడ్ ... హా ఇంకా ఏంటి విశేషాలు ..."
"చెప్పాలి నువ్వే .."
"అప్పుడు కిరణ్ నీకు ప్రపోస్ చేస్తాడు అని చెప్పావ్ ... చేసాడా? ... నువ్వు యాక్సెప్ట్ చేసావా??"
"హా ..."
"హా నా... " కిట్టిగాడి బ్రెయిన్ లో సెరిబ్రం.. సెరిబెల్లం..నెర్వస్ సిస్టం ..బొంగు బోషాణం అన్ని షాక్ తగిలి తెగి అవతల పడ్డాయి .. కొద్దిసేపు షార్ట్ సర్క్యూట్ అయిన పిచ్చి కాకిలా అలాగే నిలబడ్డాడు ...
"అదే ... హా అంటే .. ప్రపోస్ చేశాడు ... నాకే కంఫ్యూజన్.. ఏమీ చెప్పాలో అర్థం కాలేదు ... తనకి మాత్రం నేనంటే ఇష్టం .. తను క్లియర్ గానే ఉన్నాడు ... నాకే కంఫ్యూజన్ .. చూస్తాను ... మనం ప్రేమించే వాళ్ళ కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళను చేసుకుంటే సుఖపడతాం కదా ..." అంది
కిట్టిగాడికి సర్రున కాలింది... 'నో ... నేనొప్పుకోను ... ఇది తొండి ...ఫస్ట్ నేనే లవ్ చేశా .... వాడికంటే ఎక్కువ ఇష్టపడ్డాను ... సో నువ్వు నాకే దక్కాలి ... అంతే యువరానర్ .. అంతే ..' అనుకుంటూ ఒక ఎర్రి మొహం ఏసుకొని ఆ పిల్ల వైపే చూస్తున్నాడు ...
ఆ పిల్ల వీడు-నాకు-అర్థంకాడు అనే లుక్కు బాణం విసిరేసరికి, అది గుచ్చుకొని తేరుకొని "నిజమే సుస్మీ.. కానీ నిన్ను అంతకన్నా ప్రాణంగా ప్రేమించే వాడు దొరకొచ్చేమో.. తొందర పడి నిర్ణయం తీసుకోకు .. someone better might be waiting for u... " అన్నాడు someone అనే పదం నొక్కి చెపుతూ, పిడికిలితో మెల్లిగా గుండెకేసి గుద్దుకుంటూ ..... కానీ ఆ సైగలు అర్థం చేసుకుంటే ఆ పిల్ల సుస్మీ ఎందుకు అవుద్ది ... అంత అదృష్టం ఉంటే ఆడు కిట్టిగాడు ఎందుకు అవుతాడు ...
"ఏమో ... ప్రస్తుతానికి అయితే నాకలాంటి ఆలోచన ఏమీ లేదు ..."


                                                         ********
కిట్టిగాడు ఇంటికి వచ్చేసరికి వాడి ఫ్రెండు రాజు చద్దన్నంలో ఎండు మిరపకాయ పచ్చడి కలుపుకొని తింటూ వడియాలు నంజుకుంటూ విస్కీ సిప్ చేస్తూ టాం అండ్ జెర్రీ చూస్తున్నాడు..
"ఆ తింగరి తిండేట్రా సప్పర నాయాలా... పైగా విస్కీ ఒకటి మొహానికి..." అన్నాడు కిట్టిగాడు చిరాగ్గా..
"కిట్టిగా కేక టేస్టెహె... నువ్వూ ట్రై చేద్దువు దా.."
"టేస్టు సంగతి తర్వాత... ఇంటర్వ్యూ సంగతి ఏమైంది?" అడిగాడు షూస్ విప్పుతూ..
"ఆ వాడు కాల్ చేసాడు... ఎలాగు టెలిఫోనిక్ కదా అని నువ్వు చెప్పిన ఇంపార్టెంట్ కొస్చేన్స్ కి ఆన్సర్స్ అన్నీ కొన్ని పేపర్లలో రాసుకొని నేలమీద చుట్టూ పరచుకొని మధ్యలో నేను కూర్చున్న... వాడు కాల్ చేసి ఇంటర్యు మొదలెట్టాడు.. ఏదో ప్రశ్నకి ఆన్సర్ వెదుకుతూ అటూ ఇటూ గుండ్రంగా తిరిగేసరికి పేపర్ల శబ్దం వచ్చింది... వాడు వెంటనే అడిగాడు నువ్వు చూసి ఆన్సర్లు చెప్తున్నావా అని... నేను దాన్ని తీవ్రంగా ఖండించాను... అప్పుడు వాడు సడన్గా నువ్వు వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ పేరేంటి అని అడిగాడు ... నాకు సడన్గా గుర్తుకురాలేదు ... నువ్వు ఫేక్ కదా అని అడిగాడు.. కాదు అన్నాను... నిజం చెప్తే నిన్ను సెలెక్ట్ చేస్తా అన్నాడు... అప్పుడు నేను అవును అన్నాను... దానికి వాడు వెరీ గుడ్ అని ఫోన్ పెట్టేసాడు... ఇంతకీ వాడు నన్ను సెలెక్ట్ చేస్తాడు అంటావా కిట్టిగా..." అన్నాడు విస్కీ సిప్ చేసి వేళ్ళకి అంటుకున్న మిరపకాయ పచ్చడి నాకుతూ...
"చేస్తాడు రా.. చేస్తాడు.. నువ్వేమో విస్కీ తాగుతూ టాం అండ్ జెర్రీ చూడు... అయినా చూసి కూడా సరిగ్గా చెప్పడం చేతకాకపోతే ఎలారా?... అయినా పెట్టిన ప్రాజెక్ట్ కూడా మర్చిపోవడం ఏమిటి తమరి డాష్..."


"రేపు ఇంకోటి ఉంది ఇంటర్యూ.. ఇరగదీస్తా చూడు... అయినా నువ్వేంట్రా కొంచెం టెన్షన్ గా ఉన్నావ్... నేను సెటిల్ కాలేనేమో అని ఎంత బాధ పడుతున్నావురా నువ్వు... నీలాంటి మిత్రుడు ఒక్కడు చాలు ... ఏమైనా సాధించేస్తా .." అన్నాడు విస్కీ ఇచ్చిన మత్తుతో ముద్దముద్దగా...
"నీబొంద... అదేం కాదులే... ఈ రోజు నా జీవితం మలుపు తిరిగే షాక్ ఒకటి తగిలింది..."
"అవునా... ఏంట్రా అది..." అన్నాడు రాజుగాడు కొంచెం అటేన్షన్ కి వచ్చి 
"సుస్మీ గుర్తుందిగా నీకు... అదే రాజమండ్రిలో మా ఎదురింటి అమ్మాయి.. తను ఈ రోజు మా ఆఫీస్ లో జాయిన్  అయిందిరా..."
"అవునా..." రాజుగాడికి తాగింది మొత్తం దిగింది "నువ్వు లవ్ చేసిన సుస్మీనా... నువ్వు లవ్ చేసావ్ అని ఆళ్ళ ఈళ్ల కాళ్ళు పట్టుకొని అప్పటిదాకా పుస్తకం కూడా తెరవని నేను జావా కాన్సెప్టులు అడిగి నీకు చెప్పాను... ఆ సుస్మీ నా... ఇంకెవడో ప్రోపోస్ చెయ్యబోతున్నాడు అని చెప్పావ్... ఆ సుస్మీనా... " అన్నాడు
"అవునేహే ఆ సుస్మీనే...."
"కేక... ఇంకేంటి... వెళ్లి ప్రపోస్ చెయ్యి ... దీర్ఘసుమంగళీభవ..." అన్నాడు విస్కీ చివరి పెగ్గు తాగుతూ...
"దీర్ఘసుమంగళీభవ ఏంట్రా?" అన్నాడు చిర్రెత్తి..
"అంటే ప్రపోస్ చేసి పెళ్లి చేసుకుంటావు కదా... అందుకే అలా దీవించా... ఇప్పుడు అలా దీవించట్లేదా?"
"నీ తాడి మొహాన్ని తోడేళ్ళు తిన.... అలా దీవించేది లేడీస్ ని... అదీ పెళ్ళయ్యాక..."

"ఓహో... అలాగా... నాకేం తెలుసు నా మొహం.. చిన్నపుడు కృష్ణారెడ్డి  ఆ పేరుతో ఒక సినిమా తీశాడు కదా.. అతను మగ జంటే కాబట్టి ఆ దీవెన మొగోళ్ళకే అనుకున్నా..."
"ఆపుతావా సోది... దానితో పాటు దాన్ని లవ్ చేసే ఆ కిరణ్ గాడు కూడా చేరాడు మా ఆఫీసులో... ఇప్పుడదొక తలనొప్పి... కాకపోతే సుస్మీ ఆడి ప్రపోజల్ ఇంకా ఒప్పుకోలేదట.." 
"గుడ్... ఇంకేంటి... వెళ్లి ప్రపోస్ చెయ్యి... లేట్ చెయ్యకు..."
"నిజమే... అయితే ఒక మాంచి లవ్ లెటర్ రాయమంటావా?"  
"లవ్ లెటర్లు మామూలు లవ్వర్లకి... నువ్వు జావా లవ్వరెహే... కనుక జావాలో లవ్వు లెటర్ రాయి... ఒక మాంచి ప్రోగ్రాం రాయి... అది ఎక్జిగ్యుట్ చెయ్యగానే నీ ప్రేమ మొత్తం ఆ పిల్లకి తెలియాలి... మాంచి కలర్ఫుల్ గా ఉండాలి అవుట్ పుట్... ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ పిల్ల నిన్ను లవ్ చేస్తుందిరా ... ఇప్పటిదాకా ఇలా జావాలో ఎవరూ ప్రపోజ్ చేసి ఉండరు.."
"వావ్... వాట్ ఏ ఐడియా.... రాజుగా అందుకేరా నువ్వంటే అంత ఇష్టం నాకు... నాకోసం మోకాల్లో ఉన్న బుర్రని నిముషాల్లో తలలోకి ఎకించి థింక్ చేసేత్తావ్.... కేకరా నువ్వు..." అని చెప్పి ఆఘమేఘాల మీద ల్యాప్ టాప్ వోపెన్ చేసి ప్రోగ్రాం రాయడం మొదలెట్టాడు... 


                                                              *******
కిట్టిగాడు ఆఫీసుకి వచ్చి తన సిస్టంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూట్ చేసి... అవుట్ పుట్ చూసి తనని తనే మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు... 'అవుట్ పుట్ అద్దిరింది... ఈ అవుట్ పుట్ చూస్తే సుస్మీ ఏంటి సుస్మితా సేన్ అయినా లవ్ లో పడాల్సిందే.. ఈ దెబ్బతో లవ్వర్లందరూ జావాలో ప్రపోజ్ చెయ్యాల్సిందే... దెబ్బకి జావా లవ్వర్స్ లాంగ్వేజ్ అయిపోవాలి అంతే' అనుకోని... వెంటనే ఆ ప్రోగ్రాం ని ఒక షేర్డ్ ఫోల్డర్ లో సేవ్ చేసి... సుస్మీ కి మెయిల్ చేసాడు ఇలా .."సుస్మీ.... నేను నీకోసం ఒక ప్రోగ్రాం రాసా... అది నా మనసు నీకు తెలుపుతుంది.. మనసు తెలుపుటకు మాట్లాడే బాషలో మాటలు కరువయినపుడు... కంప్యూటర్ బాషలో నా భావం నీకు తెలియజేస్తున్నాను... ఈ క్రింది షేర్డ్ ఫోల్డర్ లో ఆ ప్రోగ్రాం ఉంది ... దాన్ని ఎగ్జిక్యూట్ చెయ్యి... నీ రిప్లై కోసం ఎదురుచూస్తూ ఉంటాను..." అని మెయిల్ చేసేసి... అలా చైర్ లో వెనక్కి జారాగిలబడి రకరకాల లవ్ సాంగ్స్ ఊహించుకుంటూ అలా తెలిపోతుండగా... రిప్లై వచ్చినట్లుగా చిన్న బీప్ వచ్చింది...
'వావ్ అప్పుడే రిప్లై' అనుకుంటూ తెరిచి చూసాడు... "గుడ్ జాబ్....  I have successfully executed the program... Output is outstanding.. can you please come to my cabin" అని ఉంది... 
కిట్టిగాడు అప్పుడు చూసాడు ఆ రిప్లై వచ్చింది మేనేజర్ నుంచి...
వెంటనే సెండ్ మెయిల్స్ చూసాడు.... కంప్యూటర్ వైర్లు ముట్టుకోకుండానే కరెంటు షాక్ కొట్టింది... మైండు మొద్దుబారింది... సుస్మీ కి పంపాల్సిన మెయిల్ కందసామికి పంపాడు మన కిట్టిగాడు.*** చాలా ఆలస్యంగా, ఆరు నెలల తరువాత కిట్టిగాడి పోస్టు వేసినందుకు బ్లాగ్మిత్రులు అందరూ నన్ను క్షమించాలి... మిత్రులు అందరూ నన్ను ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు, కిట్టిగాడి పోస్టు ఎప్పుడు అని.. నాకు ఇంతవరకు కుదరనేలేదు... ఎలా ఉన్నారు అందరూ .. కుశలమే కదా................................ మీ రామకృష్ణారెడ్డి కోట్ల ***

Tuesday, 8 March, 2011

కావాలి మీ సలహా

ఈ మధ్య ఓ రోజు తెల్లవారు ఝామునే పదింటికి లేచి నా పిల్లో వైపు చూసుకొని "కెవ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్ ...." అని అరిచాను ... మాంచి ఘాడ నిద్రలో ఉన్న నా రూమ్మేట్ దెబ్బకి లేచి పిచ్చి చూపులు చూసి బుర్ర గోక్కొని మళ్ళీ పడుకున్నాడు... నేను మాత్రం అలానే విస్మయంతో పిల్లో వైపు చూసుకుంటూ "ఇలా పిల్లోకి ఇంస్టాలుమెంటు పద్దతిలో రోజుకి కొంత జుట్టు ముట్టజెపితే రేపు ఏ పిల్లయినా నా వైపు చూస్తుందా?" అనే భయంకరమైన ఆలోచన రాగానే విస్మయం కాస్తా బాధగా రూపాంతరంచెంది కన్నీళ్లుగా ధ్రవీభవించి ధారాపాతంగా కారి పిల్లో తడిచింది...

ఆ తరువాత తల దువ్వేప్పుడు దువ్వెనతో, స్నానం చేసేప్పుడు చేతితో, కంప్యూటర్ ముందు పనిచేసేప్పుడు కీ బోర్డ్ తో నా జుట్టు మైత్రి కొనసాగించి నాకు ముచ్చెమటలు పట్టించడం మొదలెట్టింది. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, భొంచేసేప్పుడు, చివరికి నిద్రపోయేప్పుడు కూడా నా ఆలోచనలు నా జుట్టు మీద కేంద్రీకృతం అయ్యేవి. ఒక రోజు అర్థరాత్రి ఉలిక్కిపడి లేచి "కెవ్వ్ వ్వ్ వ్వ్ ..." అని మళ్ళీ అరిచాను... నా మిత్రుడు మళ్ళీ లేచి పిచ్చి చూపులు చూడటం మొదలెట్టాడు "నువ్వెక్కడ దొరికావురా సేతురాజా...ఆ చూపెంట్రా దెయ్యాలని దడిపించే వాడిలా" అనేసరికి పాపం బాబ్బున్నాడు.. నేను మెల్లిగా వణికే చేతులతో "దేవుడా దేవుడా .." అనుకుంటూ నా తలని తడుముకున్నాను... హమ్మయ్యా నా జుట్టు అలాగే ఉంది ... బట్టతల రాలేదు ... జరిగిన విషయం ఏమిటంటే, అప్పుడే నాకొక భయంకరమైన కల వచ్చింది నాకు బట్ట తల వచ్చినట్లు.. నా సీట్ పక్కన ఉండే బట్టతల కొలీగ్ నాతో "ఒక బట్టతల వాడి మానను మరో బట్టతలోడికే తెలుస్తుంది... బాధపడకు.. ఏది శాశ్వతం గనుక" అని నన్ను ఓదార్చుతున్నట్లు పీడకల వచ్చింది... అందుకే వెంటనే తడిమి చూసుకున్నాననమాట...

ఆ రోజు ప్రొద్దున్నే గట్టిగా సంకల్పించుకున్నా 'నా జుట్టు రాలడాన్ని అరికట్టి, నా కేశాలను అందంగా ఆరోగ్యంగా ఉంచుకొని ... కేకలు అరుపులు పుట్టించి భూకంపం సృష్టించాలి' అని. వెంటనే ఒక ప్రణాళిక సిద్ధం చెయ్యాలి అనుకున్నాను.అసలు జుట్టు ఎందుకు రాలుతుంది అనే విషయం మీద సరైన అవగాహనకి రావలనుకున్నాను. ఆఫీసుకి వెళ్ళగానే గూగుల్ ఓపెన్ చేసి "జుట్టు రాలుటకు కారణాలు?" అని అడిగాను ... పాపం గూగుల్ కష్టపడి ఎన్నెన్నో వెబ్ పేజీలు వెతికి కొంత సమాచారం నా ముందుంచింది... అవన్నీ చదివి, జుట్టు రాలుటకు ముఖ్యమైన కారణాలు నోట్ చేసుకున్నాను ఇలా:


1. తీసుకునే ఆహరంలో పోషక విలువలు లేకపోవడం వల్ల.
2. విపరీతమైన కాలుష్యం వల్ల.
3.  జెన్యు పరమయిన కారణాల వల్ల.
4. హార్మోనుల సమతుల్యం లోపించడం వల్ల.
5. ధూమపానం, మద్యం సేవించండం వల్ల.


ఆ పై లిస్టులో నాకు ఏవేవి వర్తిస్తాయి అనేవి బేరీజు వేసుకున్నాను.
నేను తీసుకునే ఆహరం గురుంచి ఓ  సారి ఆలోచించడం మొదలెట్టాను. బ్రేక్ ఫాస్టుకి ఈ అరవ వాళ్ళ ఇడ్లీ సాంబారో లేక దోసో ఏదోకటి తీసుకుంటాను... ఇక మధ్యాహ్నం ఆంధ్ర మెస్సులో ఫుల్ మీల్స్... డిన్నర్ కి చపతీనో దోసో ఏదోకటి లాగించేయ్యడం ... అసలు ఈ నా తిండిలో ఏమైనా సరైన పోషక విలువలు ఉన్నాయా? అని ప్రశ్నించుకున్నాను .. నా తిండిలో కార్బోస్ తప్పితే సరైన పోషకాలు లభించడం లేదని అర్థమయ్యింది ... కనుక ఫుడ్ రొటీన్ మార్చాలి ... జుట్టి రాలకుండా ఉండాలంటే ఏమేమి తినాలి అంటూ మళ్ళీ గూగుల్ నే అడిగా .. అప్పుడది తినే ఆహరంలో ప్రోటీన్స్ బాగా ఉండేలా చూసుకోవాలి అని చెప్పింది.. అలాగే విటమిన్ ఏ, బీ కాంప్లెక్స్, సీ కూడా ఉండేలా చూడాలి అంది. ఇవన్నీ పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం మొదలగు వాటిలో లభిస్తాయి అని తెలుసుకొని ఇక ఆహరంలో అవి ఎక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి అనుకున్నాను. అనుకున్నదే తడవుగా స్పెన్సర్స్ కి వెళ్లి రకరకాల పండ్లు, కూరగాయలు, సెరిల్స్, సోయా మిల్క్ పౌడర్, వీట్ బ్రెడ్ లాంటివి కొనుక్కొని బిల్లు తడిపేసుకొని వచ్చాను...తర్వాత నా రోజూ వారి దినచర్య (తిండి) ఈ విధంగా మలిచాను:


బ్రేక్ ఫాస్ట్: ఒక ఉడకబెట్టిన కోడి గ్రుడ్డు + 4 వీట్ బ్రెడ్ ముక్కలు + సోయా మిల్క్ + ఒక యాపిల్ + ఒక దానిమ్మ.
లంచ్: రెండు రోటి + ఏదన్నా పచ్చి వెజిటబుల్
డిన్నర్: పేర్ ఫ్రూట్ (దీన్ని తెలుగులో ఏమంటారో?) + సెరిల్స్


ఇదన్న మాట.. ఇలా నా రోజువారి తిండికే సగటున రెండు వందలు దాటిపోయేది... ఈ పై తిండి ప్రణాళిక ఎన్ని రోజులు అమలు చేశాను అన్నది మీరు అడగకూడదు అన్నమాట :)


ఇక ఆ లిస్టులో కాలుష్యం, జెన్యు పరమైన కారణాలు నాకు పెద్ద వర్తించవు... హార్మోనుల సమతుల్యం గురుంచి నో కామెంట్స్... ధూమపానం నో వే...


నా ఫ్రెండ్స్ ని కొంత మందిని అడిగితే కొన్ని సూచనలు చేసారు... మింటాప్ వాడమన్నారు.. అది వాడాను... ఒక వారంలోనే భయంకరమయిన సైడ్ ఎఫెక్ట్స్ తో నన్ను భయపెట్టింది...అంతే దెబ్బకి మానేసాను... ఆ తర్వాత న్యుజన్ హెర్బల్ ఆయిల్ వాడను ఒక నెల.. ఆ తర్వాత టీవీలలో దాని మీద రకరకాల చర్చల జరగడం మూలాన, ఉన్న జుట్టు కూడా ఊడితే కష్టం అని తలచి దాన్ని మానేసాను... ప్రస్తుతం పేరాషూట్ థెరపీ వాడుతున్నాను... ఇది ఓ మాదిరిగా పర్లేదు ... ఈ మధ్య నా స్నేహితుడు ఒకడు నేను ఎప్పుడూ వినని వైద్యం చెప్పాడు.. అదేమిటంటే, రోజూ ప్రొద్దున్నే స్కాల్ప్ మీద చిన్న ఉల్లిపాయాలని నలిపి ఆ రసంతో మర్దన చెయ్యాలట .. అలా చేసి ఒక అరగంట ఉంచి స్నానం చెయ్యాలంట... ఇది ఎంత వరకు నిజమో నాకు తెలిదు.. గూగుల్ లో వెతికితే, అలా చెయ్యొచ్చు అని చెప్పింది.. కానీ ఇంకా నేను దీన్ని అమలు పరచలేదు ...


కనుక మై డియర్ బ్లాగ్మిత్రులారా... మీ అమూల్యమైన సలహాలను సూచనలను నాకు తెలిజేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను... నాలాగా ఈ జుట్టు రాలడం అనేది చాలా మంది ఎదురుకున్నదే కాబట్టి మీ సలహాలు సూచనలు నాకు ఏంతో ఉపయోగ పడతాయి...