Search This Blog

Thursday, 7 January, 2010

ఆమె రూపం స్వరూపం....ఆమె జ్ఞాపకం అపురూపం..ఆమె స్నేహం అనంతం....


బస్సు చర్చిగేటు స్టాప్ ని సమీపిస్తుంది....నా మనసులో ఒకటే అలజడి, ఆమె నాకోసం స్టాప్ లో వెయిట్ చేస్తూ ఉంటుందా లేక వెళ్ళిపోయి ఉంటుందా అని..దాదాపు వెళ్ళిపోయే ఉంటుంది అని నా మనసు చెబుతుంది...బస్సు చర్చిగేటు స్టాప్ లో ఆగింది...వెంటనే కిటికీలో నుంచి చూసాను..ఆమె అక్కడే ఉంది...తన కళ్ళతోనే 'ఏంటి అలానే చూస్తున్నావ్...కిందకి దిగు..' అని చెప్పింది...నేను తేరుకొని బాగ్ తీసుకొని కదిలేలోపల డ్రైవర్ బస్సు ని కదిలించాడు...'హలో స్టాప్...' అని గట్టిగా అరిచాను...నా అరుపు రణగొణధ్వనుల మధ్య కలిసిపోయింది...కండక్టర్ పట్టించుకొనే స్థితిలోలేడు...నేను నిస్సహాయంగా వెనక్కి తిరిగి కిటికీ లోంచి ఆమె వైపు చూసాను, అప్పుడు ఆమె నా వైపు చూసిన చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను...ఆశ్చర్యం..కోపం..బాధ అన్నీ కలగలిసిన ఆమె చూపు నా గుండెల్లో పదునైన బాకులా గుచ్చుకుంది...క్షణక్షణానికీ దూరం అవుతున్న ఆమె రూపాన్ని చూసి కొంచెం తెగించి ఎలాగయినా బస్సు ఆపి ఆమెని ఎందుకు చేరుకోలేకపోయానా అనిపించింది..మరుసటి రోజు ఆమెని కలిసేదాకా నా మనసు మనసులో లేదు...కూర్చున్నా..పడుకున్నా ఆమె చూసిన చూపే నాకు గుర్తుకువచ్చేది.....

ఆమె పేరు స్వరూప...పేరుకు తగ్గట్టుగా చక్కగా ఉండే తనలో నాకు నచ్చేది ఆమె చిరునవ్వు...ఆ చిరునవ్వు చూసినప్పుడల్లా పగలే వెన్నెల కాసినంత హాయిగా అనిపిస్తుంది...ఆమె అలిగినప్పుడు పెట్టె బుంగమూతిని చూస్తూ జీవితాంతం గడిపెయ్యొచ్చేమో అనిపించేది...స్వరూప నాకు కాలేజీలో జూనియర్...మా పరిచయం కూడా మామూలు పరిచయంలా జరగలేదు...మా కాలేజీలో ఇంటర్నెట్ కోసం ప్రత్యేకించి కొన్ని కంప్యూటర్స్ ఉండేవి...అప్పట్లో మేము అందరం సరదాగా ఆ ఇంటర్నెట్ సిస్టమ్స్ లో చాటింగ్ చేసేవాళ్ళం...ఒకరోజు అలా నేను సిస్టంలో చాట్ చేద్దామని యాహూ మెసెంజర్ క్లిక్ చెయ్యగానే ఎవరిదో ఐడీతో ఓపెన్ అవ్వడంతో, "వీళ్ళకు చాటింగ్ చెయ్యడం తెలుసు గాని డిస్కనెక్ట్ చెయ్యడానికి మాత్రం మహా బద్ధకం" అనుకుంటూ ఆ ఐడీ డిస్కనెక్ట్ చేసి నా ఐడీ టైపు చేయ్యబోయేటప్పుడు చూసా ఆ ఐడీ ఎవరిదో ...స్వరూప అని ఉంది ఐడీ...ఎవరో అమ్మాయి ఐడీ కదా వెంటనే నోట్ చేసుకొని నా మెసెంజర్ లో ఆడ్ చేసుకున్నా...ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయాను...

ఒక నెల రోజుల తరువాత అనుకుంటా నేను రాజమండ్రిలోని ఒక కేఫ్ లో ఆన్-లైన్ లో ఉన్నపుడు, స్వరూపా అనే అమ్మాయి నా మెసెంజర్ లో ఆన్-లైన్ వచ్చింది...అప్పుడు నాకు ఆ అమ్మాయే అని గుర్తులేదు..'ఎవరీ స్వరూప' అనుకున్నాను...'ఆ ఎవరోలే....ఎంతో మందిని ఆడ్ చేస్తాం, అందరూ ఎలా గుర్తుంటారు...కనుక్కుంటే సరి..' అనుకోని..."హాయ్ .." అని మెసేజ్ ఇచ్చాను..
"హాయ్...నేను మీకు తెలుసా..." అని ఆమె మెసేజ్...
"ఆ..తెలుసు...అప్పుడెప్పుడో చాట్ చేసాం...." అన్నాను...
"అవునా...ఎపుడబ్బా..నాకు గుర్తులేదు.." అంది...
"నాకు కూడా సరిగా గుర్తులేదు...మరో సారి పరిచయం చేసుకుంటే సరి..." అన్నాను...
"ఏమో నాకు కొత్త వాళ్ళతో ఇలా చాట్ చెయ్యడం ఇష్టం ఉండదు.." అంది..
"కొన్ని రోజులు చాట్ చేస్తే పాత వాడిని అయిపోతానులెండి...పరిచయం చేసుకున్నంత మాత్రాన కొంపలు ఏమీ మునగవ్ కదా..' అన్నాను
"అబ్బో...చా...సరే మీ గురుంచి చెప్పండి,,,"
"మాది హైదరాబాద్....జే.ఎన్.టీ.యు లో ఇంజనీరింగ్  చేస్తున్నాను...మరి మీరు.." అని నా గురుంచి అబద్దం చెప్పాను...
"నేను రాజమండ్రిలో గోదావరి కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నాను..." అంది ఆ అమ్మాయి...
నాకు ఒక్కసారిగా షాక్ తగిలింది...ఎందుకంటే నేను కూడా అదే కాలేజీలో చదువుతున్నాను కాబట్టి....కొంచెం సీరియస్ గా ఆలోచించగా అర్థం అయ్యింది..ఆ రోజు ఇంటర్నెట్ సిస్టంలో నుంచి ఆడ్ చేసిన అమ్మాయే ఈ స్వరూప అని...
ఇక చిన్నగా విషయాలన్నీ రాబట్టాను...కొన్ని చెప్పింది, కొన్ని చెప్పలేదు...కంప్యూటర్స్ నాలుగవ సంవత్సరం అని చెప్పే సరికి కొంచెం నీరుగారను...మన సీనియరా అనుకున్నాను..ఆ తర్వాత కొద్ది సేపు చాట్ చేసి రూంకి వచ్చాను...సీనియర్ కదా అని కొంచెం లైట్ తీసుకున్నా..

ఒక రోజు నా ఫ్రెండ్ రమేష్ వాళ్ళ అన్నయ్యని కలవడానికి వెళ్తే నేను కూడా తనతో వెళ్లాను...అతను ఫోర్త్ ఇయర్ కంప్యూటర్స్...క్లాసులోకి రాగానే స్వరూప విషయం గుర్తొచ్చి "సర్ మీ క్లాసులో స్వరూప అనే అమ్మాయి ఎవరు?" అని అడిగాను...తను నాకేసి చిత్రంగా చూసి "మా క్లాసులో స్వరూప అనే అమ్మాయే లేదు.." అన్నాడు...నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాకు అయింది...సో కాలేజీ కరెక్ట్ చెప్పింది కాని, ఇయర్ తప్పు చెప్పింది..."స్వరూప ఎవర్రా?" అంటూ అడిగాడు రమేష్.."ఎవరు లేరులే...తర్వాత చెప్తా" అని దాటవేసాను...

తర్వాత మరికొన్ని రోజుల తర్వాత స్వరూప మళ్ళీ ఆన్-లైన్ వచ్చింది...అవీ ఇవీ మాట్లాడుతూ 'నువ్వు నిజంగా ఫోర్త్ ఇయర్ యే నా?' అని అడిగాను...'తమరికేందుకు అంత ధర్మ సందేహం' అందామె...'అయితే ఫోర్త్ ఇయర్ లో మీ సెమ్ లో ఉన్న సబ్జక్ట్స్ పేర్లు చెప్పు" అన్నాను..."హలో బాబూ...నువ్వు నమ్మితే నమ్ము...లేకపోతే లేదు,నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు...అలా అయితే నువ్వు జే.ఎన్.టీ.యు లో చదువుతున్నావు అని నమ్మకమేంటి.." అంటూ ఎదురుదాడికి దిగేసరికి ఇంక ఆ టాపిక్ అలానే వదిలేసా...ఆ తర్వాత మరి కొన్ని సార్లు అప్పుడప్పుడు చాట్ చేసేవాళ్ళం కానీ నేను ఆమె ఏ ఇయర్ అనే టాపిక్ తీసుకురాలేదు...అలా అని నేను కూడా అదే కాలేజీ అనే విషయం కూడా ఆమెకి చెప్పలేదు...ఇలా ఉండాగానే సెమ్ పరీక్షలు రావడం...వన్-డే బాటింగ్ తో మేము బిజీ అవ్వడం జరిగిపోయాయి...పరీక్షలు అయిపోయిన రోజు నేను ఆన్-లైన్ వచ్చాను..ఒక్క సెకండ్ ఇయర్ వాళ్ళకి తప్ప అందరికీ పరీక్షలు అయిపోయాయి..వాళ్ళకి ఏదో పేపర్ లీక్ అవ్వడం వల్ల ఒక వారం తర్వాత పెట్టాడు ఆ ఎగ్జాం...స్వరూప కూడా ఆన్-లైన్ లో ఉండటంతో "ఎగ్జామ్స్ బాగా రాసావా?.." అని అడిగాను.."యా పర్లేదు..మా కర్మకోద్దీ ఇంకో ఎగ్జాం ఏడ్చింది కదా...ఆడెవడో పేపర్ లీక్ చేసింది షూట్ చెయ్యాలి వాడ్ని..." అంది...అనడమే కాదు నాకు అడ్డంగా దొరికిపోయింది..."సో నువ్వు సెకండ్ ఇయర్..." అన్నాను...తను కాసేపు ఏమీ రిప్లయ్ ఇవ్వలేదు..తర్వాత "అయాం సారీ...మీకు తప్పు చెప్పాను..నేను సెకండ్ ఇయర్ ఈ.సి.ఈ" అంది..."పర్లేదులే...ఇప్పుడు నిజం చెప్పావు గా" అన్నాను...కాని మనసులో 'వామ్మో ఇది ఇయరే కాదు బ్రాంచ్ కూడా తప్పు చెప్పింది....ఇక డైరెక్ట్ గా ఇవ్వాలి మా స్వరూప కి ఒక జెర్క్' అనుకున్నాను....

సెలవులు అయ్యాక కాలేజీకి వచ్చిన రోజు వెంటనే సెకండ్ ఇయర్ స్వరూప ఎవరో తెలుసుకొనే ప్రయత్నం చేసాను..రమేష్ గాడిని అడగ్గా "ఓ సెకండ్ ఇయర్ ఈ.సి.ఈ స్వరూప నా...నాకు తెలుసు రా...అంటే పరిచయం లేదనుకో...మాధురి అనే అమ్మాయితో ఉంటుంది ఎప్పుడూ...మాధురి తెలుసుగా నీకు??" అన్నాడు..."మాధురి ఎవరు??" అన్నాను..."ఓరి నీ ఎంకమ్మా...మాధురి తెలీదా??" అని వాడంటే...ఆ మాట నాకు 'సోనియా గాంధి తెలీదా?' అన్నట్లు వినిపించింది..."ఒరేయ్ మాధురి మన కాలేజీకే బ్యూటీ క్వీన్...తను సెకండ్ ఇయర్ అయినా ఫైనల్ ఇయర్ అమ్మాయిలు తన ముందు బలాదూర్...అందుకే ఫైనల్ ఇయర్ అమ్మాయిలకి మాధురి అంటే జెలసీ.." అన్నాడు కాసేపు మాధురీని గుర్తుతెచ్చుకుంటూ..."సర్లే గాని...నాకు ఈ రోజు ఈవెనింగ్ కాలేజీ అయ్యాక స్వరూపని చూపించాలి" అన్నాను...

కాలేజీ అయ్యాక బస్సు స్టాప్ కి చేరుకున్నాం నేను రమేష్..."అదిగో తనే స్వరూప...మాధురి పక్కన ఉంది కదా.." అంటూ చూపించాడు...అక్కడ అయిదుగురు అమ్మాయిల గుంపు ఉంది..."ఒరేయ్ ఆ గుంపులో నాకు మాధురి ఎవరోకూడా తెలీదు...నువ్వేమో మాధురి పక్కన స్వరూప అంటావ్..డ్రెస్ కలర్ చెప్పరా.." అన్నాను...పలానా  డ్రెస్ అని చెప్పి చూపించాడు..ఆమెని చూడగానే ఆమె నవ్వు నన్ను ఆకర్షించింది..అలాగే కాసేపు చూసాను..ఇంతలో బస్సు రావడంతో ఆమె ఎక్కింది...మేము కూడా ఎక్కాం...నేను తననే గమనిస్తూ కూర్చున్నాను...ఆమె ఎక్కడ దిగితే అక్కడ దిగాలని నిర్ణయించుకున్నా...ఆమె చర్చిగేటు స్టాప్ లో దిగింది...నేను కూడా అక్కడే దిగాను..ఆమె వెనుకే నడుచుకుంటూ వెళ్ళాను...ఛా జీవితంలో ఒక అమ్మాయిని ఇలా ఫాలో అవ్వాల్సిన రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు...కాసేపు ఆమె వెంటే నడిచాక, కొంచెం దెగ్గరగా వచ్చి "హలో...మీరు స్వరూప కదా.." అని అడిగాను...ఆమె నా వైపు చూస్తూ "అవును.... మీరు..." అని నా వైపు చూసింది.."చెప్తాను...ఒక్క నిముషం.." అంటూ అటుగా వెళ్తున్న ఆటో ఆపి.."నా పేరు రామకృష్ణ...అదే జే.ఎన్.టీ.యు లో చదివే రామకృష్ణ...మీతో చాట్ చేసే రామకృష్ణ...సారీ చాట్ లో అబద్దం చెప్పాను..మనిద్దరం ఒకే కాలేజీ..ప్లీజ్ రేపు అన్నీ చెప్తాను...డోంట్ హేట్ మీ.." అని వెంటనే ఆటో ఎక్కేసి "ప్రకాష్ నగర్.." అన్నాను...ఆటో కదిలింది...నేను మెల్లిగా ఆటోలోంచి వెనక్కి తిరిగి ఆమెని చూసాను...ఆమెలో నాకు అప్పుడే మహిషాసురిని వధించిన దుర్గా దేవి...ఎర్రగా నిప్పులు కక్కుతున్న కాళీ మాత...కర్తవ్యంలో విజయశాంతి...అమ్మోరులో రమ్యకృష్ణ...అందరూ జాయింట్ గా కనిపించారు...దెబ్బకి దడుసుకొని ఆటోలో ప్రాణభయంతో కూర్చున్నా....

 తర్వాత రోజు కాలేజీకి వెళ్ళలేదు...ఆ మరుసటి రోజు వెళ్లాను కానీ స్వరూపని కలవలేదు...కొంచెం కోపం తగ్గాక మాట్లాడుదాంలే అనుకున్నాను...ఓ రెండు రోజుల తర్వాత నేను బస్సు స్టాప్ లో ఉండగా "హాయ్ సర్..." అని వచ్చి పలకరించింది స్వరూప..."అయాం సారీ.." అన్నాను..."పర్లేదులెండి....మీకోసం రోజూ చూస్తున్నా...అసలు కనిపించలేదేమి...నేనేమో మీరు నన్నుఆ రోజు చూసి నేను నచ్చక ఆటో తెప్పించుకొని మరీ ఎక్కి పారిపోయారేమో అనుకున్నా.." అంది నవ్వుతూ..."చ చ అదేం కాదు...నేను అబద్దం చెప్పాను కదా...సో నీకు కోపం తగ్గాక కలుద్దాంలే అని నీకు కనిపించలేదు.." అన్నాను..."ఓకే....హౌ అబౌట్ ఎ కాఫీ.." అంది...మా కాలేజీ బస్సు స్టాప్ పక్కనే కాంటీన్ ఉంటుంది..అక్కడి కాఫీ మాత్రం "అమృతం ఎలా ఉంటుందో తెలీదు కాని...దాని రుచికి మా కాంటీన్ కాఫీ ఇంచు మించు సరిసాటి" అనిపిస్తుంది...ఇద్దరం కాంటీన్ లో కూర్చొని కాఫీ ఆర్డర్ చేసాం...నమ్మలేకపోయాను, మా కాలేజీ కాంటీన్ లో నేను ఒక అమ్మాయితో కాఫీనా...!!!

ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం...ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే, మేము ఒక ఒప్పందం చేసుకున్నాం "ఇక నుంచి రొజూ కాలేజీ బస్సు స్టాప్ లో కలుసుకోవాలని...కలిసే బస్సులో వెళ్ళాలని...ఒక వేళ కుదరక ఒకళ్ళు ముందు వెళ్ళిపోతే, చర్చి గేటు స్టాప్ దెగ్గర దిగేసి ఇంకొకరి కోసం వెయిట్ చెయ్యాలి అని.." 

ఆ రొజూ నాకు ల్యాబ్ లో చాలా లేట్ అయింది..బస్సు స్టాప్ కి వచ్చి బస్సు ఎక్కే సరికి సాయంత్రం ఏడు అవుతుంది...అది రాజానగరం నుంచి రాజముండ్రి వచ్చి చర్చిగేటు స్టాప్ దెగ్గరికి వచ్చేసరికి ఏడున్నర దాటింది..ఆ టైం దాకా స్వరూప నాకోసం బస్సుస్టాప్ లో వెయిట్ చేస్తుంది అన్న ఆలోచన రాలేదు నాకు...అమ్మాయి కదా అంతసేపు ఎలా వెయిట్ చేస్తుంది అనుకున్నాను..పైగా ఏడు లోపు ఇంటికివెళ్ళకపోతే ఆమె పిన్ని చాలా కంగారు పడుతుంది అని నాకు చాలా సార్లు చెప్పింది..అందుకనే ఆమె అప్పటి దాకా వెయిట్ చేయ్యదులే అనుకున్న నాకు ఆమె ఇంకా అక్కడ వెయిట్ చెయ్యడం చూసి ఆశ్చర్యపోయాను...చలించిపోయాను...ఎంతగా అంటే చెప్పలేనంతగా...'ఏంటి ఈ టైం దాకా పిచ్చా తనకు' అనుకున్నాను...తను మాత్రం కళ్ళతోనే 'ఏంటి అలా చూస్తున్నావ్...దిగి రా' అన్నప్పుడు కూడా తెరుకోలేకపోయాను...ఈ లోపు బస్సు కదలడం...నాకోసం అంతసేపు బస్సు స్టాప్ లో ఒక్కర్తే వెయిట్ చేసిన తనను నేను దిగకుండా నిరాసపరిచేసరికి నాకు పిచ్చెక్కింది..ఆమె అప్పుడు నన్ను చూసిన చూపులో ఉన్న బాధ..కోపం...నను నిలువునా దాహించివేసాయి...ఛా ఏంటి నేను ఇలా చేసాను...తన స్నేహానికి అసలు నేను అర్హుడినా అనిపించింది...ఆరోజంతా తన చూపే గుర్తుకొచ్చింది..మరుసటి రొజు తనని కలిసేదాకా నా మనసు మనసులోలేదు.....

మరుసటి రొజు కలిసాను...తను చాలా మాములుగా నవ్వుతూ మాట్లాడింది..నా కళ్ళవెంబడి  నీళ్ళు వచ్చాయి "నువ్ అంత సేపు నాకోసం వెయిట్ చేస్తే, నేను చూడు ఏం చేసానో...నా అంత వేస్ట్ ఫెలో ఇంకొకడు ఉంటాడా?" అన్నాను..."హే..అలా ఎందుకు అనుకుంటావ్...చెప్పాలంటే నువ్వు నిన్న దిగకపోవడం వల్ల నాకు మంచే జరిగింది, నేను వెనక్కి ఇంటికివెళ్ళే దారిలో మా చుట్టాలు ఎదురయ్యారు..సో అప్పుడు నీతో కలిసే వస్తే ప్రాబ్లం అయ్యేది కదా...సో ఏది జరిగినా మన మంచి కోసమే అనుకోడం చాలా బెటర్ సర్..." అంది నవ్వుతూ....తను నేను ఫీల్ కాకూడదని అలా చెప్పింది అని అర్థం అయ్యింది...తన గొప్ప సంస్కారానికి సలాం చెయ్యాలి అనిపించింది...అంత గొప్ప స్నేహానికి జోహారులు అర్పించాలని అనిపించింది..మాది స్వచ్చమయిన స్నేహం...మొదట్లో నా ఆలోచనలు వేరే విధంగా పరిగెట్టినా, ఆమె ఆత్మీయతా..స్నేహం నన్ను వివశుడిని చేసింది...అమ్మాయంటే అలా ఉండాలేమో అనిపించింది..మా స్నేహంలో ఎన్నో తీపి గుర్తులు..మధురమైన సంఘటనలు...అవేప్పుడు నా గుండెలో పదిలంగా ఉంటాయి...

బీ-టెక్ అయిపోయాక తనని విడిచి వెళ్ళేప్పుడు చాలా బాధేసింది...కానీ టచ్ లో నే ఉన్నాం..నేను కొన్ని నెలల తర్వాత సర్టిఫికెట్లు కోసం కాలేజీకి వచ్చినప్పుడు తనని కలిసాను...చాలా సంతోషం కలిగింది...ఆ రొజు మళ్ళీ ఇద్దరం కల్సి కాంటీన్ లో కాఫీ తాగాం..ఒకే బస్సు లో తిరిగి వస్తూ, చర్చి గేటు దెగ్గర దిగి నడుచుకుంటూ వెళ్లాం...అవన్నీ గొప్ప జ్ఞాపకాలు...Wonderful memories...

ఈ రొజు స్వరూప నాకు పంపిన తన పెళ్లి ఫోటోలు చూస్తూ ఉంటే, నాకు మళ్ళీ మా కాలేజీ రోజులు గుర్తొచ్చి మీతో ఇలా పంచుకుంటున్నాను....ఆ మర్చిపోయాను ఆమె గోదావరి అమ్మాయి...వాళ్ళది కాకినాడ...అందుకే నాకు గోదావరి అమ్మాయిలంటే అంత గౌరవం..ఆప్యాయత etc అనమాట


[ I Wish this new year brings you all the success that you deserve - Kishen Reddy]

Monday, 4 January, 2010

తెలుసుకొనవె యువతీ...అలా నడుచుకొనవె యువతీ..!!


తెలుసుకొనవె యువతీ...అలా నడుచుకొనవె యువతీ..!!
సాధింపులు బెదిరింపులు ముదితలకిక కూడవని...
హృదయమిచ్చి పుచ్చుకొనే...చదువేదో నేర్పాలని..
తెలుసుకొనవె యువతీ..అలా నడుచుకొనవె యువతీ..!!

మూతిబిగింపులు అలకలు పాతబడిన విద్యలని...
మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని..
తెలుసుకొనవె యువతీ..అలా నడుచుకొనవె యువతీ..!!

******************************************************

"ఏంటి బాసు...మార్నింగ్ నుంచి చూస్తున్నా చాలా డల్ గా ఉన్నావ్...కొత్త సంసారివి అంతగా ఏం మునిగిపోయిందోయ్ ??" అడిగాను అప్పికట్ల అనంతరావుని ఆఫీసు లంచ్ టైములో...
"ఏమిలేదులే...." పరధ్యానంగానే చెప్పాడు అప్పికట్ల..
"ఎహే చెప్పు...నేనేదైనా సలహా ఇవ్వగలనేమో కదా..." అడిగాను తెలుసుకోవాలనే ఉత్సాహంతో...
"ఏముంది కృష్ణ...నిన్న మా ఆవిడ పుట్టిన రోజు...ఆ విషయం నాకు గుర్తులేదు...నేను తనకు విష్ చెయ్యలేదని, తన మీద నాకు ప్రేమలేదని,  అప్పుడే తను
నాకు పాతపడిపోయింది అని, ఆఫీసులో ఇంకెవరో అమ్మాయి పరిచయం అయ్యి ఉంటుంది అంటూ ...ఏవేవో అంటుందయ్యా..ఎం చెప్పమంటావ్ నా మనసేమీ బాగోలేదు..." చెప్పాడు అప్పికట్ల అపరిమితమైన బాధతో..
"అయ్యో..అలా సొంత భార్య పుట్టిన రోజు మర్చిపోతే ఎలాగండీ బాబూ...పాపం మీరు విష్ చేస్తారని ఎన్ని ఆశలు పెట్టుకుందో.." అన్నాను సొంత భార్య అనే పద ప్రయోగం ఎంత వరకు సముచితం అని ఆలోచిస్తూ...
"నాకు అంతకముందు రోజు కూడా గుర్తుంది...ఏం గిఫ్ట్ కొనాలా అని కూడా ఆలోచించాను..కాని సరిగ్గా ఆ రోజు ఆఫీసులో డెలివరీ టైం(సాఫ్ట్ వేర్ డెలివరీ), బాస్ గాడు పైనుంచి ఒత్తిడి..ఆఫీసులోనే చాలా లేట్ అయ్యింది..ఇంటికివేళ్లే సరికే అర్థరాత్రి దాటింది..ఫుల్ హెడ్ ఏక్..రాగానే మంచం మీద వాలిపోయాను...అసలా విషయమే మర్చిపోయాను.." వృత్తాంతం చెప్పాడు అనంతరావు..
"ఓహ్ అవునా...సరేలే ఆమె ఏదో కోపంలో అనుంటుంది..ఆడువారికి ఈ అలకలు మామూలేకదా..." అన్నాను అనంతరావు మూడ్ మార్చుదామని...ఇంతలోపల....

"........సారీ డియర్......నో...నో.....అలా అని కాదు బంగారం....అయ్యో కాదు రా...హలో...హలో...హలో..." అలా సడన్ గా కట్ అయిన ఫోన్ వైపు దీనంగా చూసి..మరు నిముషం అగ్గిపిడుగులో రామారావులా దాని వైపు ఎర్రగా చూసి నేలకేసి కొట్టబోయేటైంకి " ఓయ్ కిరణ్ ఆగు..." అంటూనేనూ అనంత్ ఇద్దరం ఒకేసారి అరిచాం....
"తెలంగాణా రాలేదన్న కోపాన్ని ఆర్టీసి బస్సుల మీద చూపించినట్లు, నీ కోపాన్ని సెల్ మీద చూపిస్తే ఎలా బాబూ కిరణ్..." అడిగాను నేను అతని చేతులో ఉన్న సెల్ ని మెల్లిగా తీసుకుంటూ..
"ఏమైంది కిరణ్?.." అడిగాడు అనంత్...
"ఛా జీవితం మీద విరక్తి వేస్తుంది అనంత్....ఆ హిమాలయాలకు వెళ్లి సన్యాసం తీసుకోడం బెటర్ ఏమో?? " అన్నాడు వేదాంతిలా...
"ఏంటి లవ్ ప్రాబ్లెమా??" అడిగాను నేను ఆసక్తిగా...ఇలాంటి విషయాలలో అవతలి వాడి బాధకంటే, మనకి ఉండే అత్యుత్సాహం ఎక్కువ...
"కాదు...లవరే ప్రాబ్లం..."
"అసలు మేటర్ ఏంటి..." అడిగాను
"ఇది ఒకరోజు మేటర్ కాదులే...దాదాపు రెండు మూడు రోజులకి ఓ సారి ఉండేదే...కలుద్దాం అని చెప్పి ఆ రోజు ఏదైనా పనివల్ల కుదరక కలవకపోతే ఒక వారం మాట్లాడదు...ప్రతి గంటకీ ఓ సారి కాల్ చేసి కనీసం హలో అయినా చెప్పాలి, లేదా ఎస్సెమ్మెస్ అయినా ఇవ్వాలి అలా చెయ్యకపోతే ఒక రెండు రోజులు మాట్లాడదు ప్లస్ తిట్లు....పోనీ వర్క్ లో మర్చిపోయి కాల్ చెయ్యలేదు నువ్వే ఒక మిస్ కాల్ ఇచ్చి గుర్తుచెయ్యొచ్చుగా అంటే అలా కాదు నాకు నేనుగా గుర్తుపెట్టుకొని చెయ్యాలంటుంది...తనని కలిసిన రోజు తను మొదట చేసే పనేంటో తెలుసా, నా మొబైల్ లాక్కొని అందులో మెసేజెస్ చూస్తుంది..కాంటాక్ట్స్ లో ఎంత మంది అమ్మాయిలు ఉన్నారో చూస్తుంది...అసలు ఒక్క అమ్మాయి మెసేజ్ కూడా లేకపోతే, ఏంటి వచ్చేప్పుడు డిలీట్ చేసి వచ్చావా అంటుంది....కొద్దిసేపు అయ్యాక తనే మళ్ళీ అలా అన్నందుకు సారీ చెప్తుంది...ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే నాకు కోపం వచ్చినప్పుడు కూడా చివరికి నేనే సారీ చెప్పి తనని బ్రతిమిలాడలి..నాకు కూడా అలగాలని ఉంటుంది..ఒక వారం మాట్లాడకుండా ఉండాలని ఉంటుంది...కాని అలా చెయ్యలేని పరిస్థితి..చేస్తే ఏమవుతుందో నాకు తెలుసు కాబట్టి...ఇక నైట్ ఆఫీసు నుంచి వచ్చిన దగ్గరనుంచి కనీసం ఒంటిగంట దాకా తనతోనే ఫోనులో మాట్లాడాలి,కనీసం రూంమేట్స్ తో కాసేపు సరదాగా స్పెండ్ చెయ్యడానికి లేదు..వాళ్ళేమో ఏంటి బాబు మీ ప్రియురాలుతో తప్ప మాతో మాట్లాడవా అంటూ సెటైర్ లు వేసి చంపుతారు....తానంటే నాకు చాలా చాలా ఇష్టం కానీ నా పర్సనల్ స్పేస్ నాకు ఉండాలిగా...." అంటూ ఆపేసిన కిరణ్ వైపు ఇద్దరం అలానే చూస్తున్నాం...
ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అప్పటిదాకా అనుకున్న నాకు వెన్ను నుంచి వణుకు మొదలైంది....అటువంటి ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని తీర్మానించుకున్నాను....అనంత్ మాత్రం తన బాధలు కిరణ్ తో చెప్పుకోవచ్చు అని కొంచెం ఊరట పడ్డట్టున్నాడు...ఒక భార్య పీడితుడి వ్యధ మరొక ప్రియురాలి పీడితుడు అర్థంచేసుకుంటాడు అనే నమ్మకం కాబోలు.....

ముగ్గురం కాంటీన్ లో లంచ్ కి వచ్చాం...."ఛా ఈ అరవ తిండి తినలేక సచ్చిపోతున్నా..." అంటూ విరక్తిగా ముఖం పెట్టాను సంబార్ రైస్ వైపు చూసి...
"పెళ్లి చేసుకో మీ ఆవిడ నీకోసం రోజూ ఒక వెరైటీ రుచిగా వండిపెడుతుంది...." అన్నాడు అనంత్...
నాకు చిర్రెతుకోచ్చింది...ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా?..అనే పాట కూడా గుర్తుకొచ్చింది..."ఆహా...ఇపుడు మీ ఆవిడ పెడుతున్న రుచికరమైన తిండి చూస్తున్నాం కదా...మాకెందుకులే ఆ భాగ్యం.." అన్నాను వెటకారంగా...దెబ్బకి ముఖం మాడ్చాడు అనంతరావు...వెంటనే జాలేసింది...పాపం అసలే బాధలో ఉన్నాడు అనోసరంగా అన్ననేమో అనిపించింది...మరి లేకపోతే ఒకవైపు అన్నీ తెలిసి నన్ను పెళ్లి చేసుకోమంటాడా??...
"ఏమయినా నువ్వు కొంతవరకు అదృష్టవంతుడివేనోయ్ కిరణ్..." అన్నాడు అనంతరావు సంబార్ రైస్ మహదానందంగా తింటూ...బహుశా వాళ్ళ ఆవిడ అంతకన్నా దారుణంగా చేస్తుందేమో వంట...
"ఏం అదృష్టం నా మొహం..." అన్నాడు కిరణ్ పదే పదే సెల్ వైపు చూస్తూ ఎప్పుడు తన ప్రియురాలు మిస్సేడ్ కాల్ కానీ మెసేజ్ కానీ ఇస్తుందా అనుకుంటూ...
"ఎందుకంటే నువ్వు ప్రేమించి కొంతవరకు మంచి పనే చేసావ్...నీకు పెళ్లికిముందే ఇవన్నీ అనుభవం అవుతున్నాయి కదా...సో రేపు పెళ్ళయాకా ఇలాంటివన్నీ లైట్ గా తీసుకొని పెద్దగా బాధపడవ్ నాలాగా...." అన్నాడు అనంత్..
నాకు వెంటనే 'దున్నపోతు మీద వాన కురిసిన చందాన' అన్న సామెత గుర్తొచ్చింది...
"ఏమో అనంత్...తను నన్ను అర్థం చేసుకోడం లేదో..లేక నేనే తనని అర్థం చేసుకోలేకపోతున్నానో నాకు అర్థంకావడం లేదు....కానీ ఒకటి మాత్రం నిజం తను లేకుండా ఉండలేను...తనతో మాట్లాడకపోతే నాకు పిచ్చి ఎక్కినట్లు ఉంటుంది.." అన్నాడు కిరణ్...
"ప్రేమలో అలాగే ఉంటుంది...రేపు పెళ్ళయాక అదనపు బాధ్యతలు ఉంటాయి, అపుడు తను అర్థం చేసుకొనేలా ఉండాలి కదా..." అన్నాను నేను
"నిజమే..చూద్దాం.. పెళ్ళయ్యాక బాధ్యతలు తెలుసుకున్నాక తన వైఖరి మార్చుకుంటుందేమో..." అన్నాడు కిరణ్...
"కావచ్చు...ఇప్పుడైతే ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారు కనుక మాగ్జిమం టైం నీ అటెన్షను కోరుకుంటుంది...పెళ్ళయాక ఇద్దరు కలిసే ఉంటారు కాబట్టి అంత ప్రాబ్లం ఉండదేమో..." అన్నాను నేను కొంచెం రిసెర్చ్ చేసిన వాడిలా ఫీల్ అయిపోతూ..
"అప్పుడు వేరే గోల మొదలవుతుందిలే...." అన్నాడు అనంత్ కర్డు రైస్ లో సంబార్ కలుపుకుంటూ...ఈ అనంత్ కి ఈ అరవ బుద్ధులు ఎప్పుడోచ్చాయో...
"ఎంటవి ??" అడిగాడు కిరణ్ కొంచెం ఆందోళనగా..
"ఇవీ అని చెప్పలేనివి...చెప్పుకోలేనివి చాలా ఉంటాయి...ఇదిగో నాలా పుట్టిన రోజు మర్చిపోవడమో...లేక ఎక్కడికన్నా తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళకపోవడమో...ఆమె తరుపు బంధువులు ఇంటికి వస్తే సరిగ్గా పలకరించలేదనో..చాలా చాలా ఉంటాయి బాబూ..." అన్నాడు తన అనుభవాలు మాకు పాఠాలుగా ఉపయోగపడుతున్నాయి అనే లెవెల్ ఫీలింగ్ కొడుతూ...
"అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టమేమో కదా...అందుకే అన్నారు 'A woman's heart is a deep ocean of secrets' అని..." అన్నాను టైటానిక్ డైలాగ్ వాడుకొని...
"కష్టమేమి కాదు కృష్ణ...కాకపోతే అమ్మాయిలకు ఎప్పుడూ వాళ్ళ గురుంచే మన ధ్యాస ఉండాలి అని కోరుకుంటారు...కానీ మనకి చాలావరకు అది కుదరదు...అలా అని వారి మీద ప్రేమ లేదనీ కాదు..మనం వేరే ఎన్నో రకాల విషయాల మీద దృష్టి పెట్టాల్సివస్తుంది...కానీ అమ్మాయిలు ఈ విష్యంలో గొడవ చేస్తారు...అంటే ఇలా మనకి ఎన్నో వేరే పనులు ఉంటాయి అని
వాళ్లకి తెలియక కాదు..తెలిసీ గొడవ పెట్టుకుంటారు...అలుగుతారు...అలా అయినా మన దృష్టిని ఆకర్షించాలనే ఒక తాపత్రయం అంతే...కానీ వాళ్ళు ఇలా చేసే గొడవ..అలగటం..మొదట్లో సరదాగా ఉన్నా...తర్వాత తలనొప్పిగా మారుతుంది...ఇలా గొడవ చేసి..అలిగి..మాట్లాడటం మానేసే బదులు...ఒక చిన్న చిరునవ్వి నవ్వి 'నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు మాత్రం తెలియదా' అని ఒక చూపు విసిరితే దాసోహం అవ్వని మొగవాడు ఉన్నాడా...ఆ విధంగా మొగవారిని గెలిచే ఆడువారు ఉంటె ఎంత అందంగా ఉంటాయి కాపురాలు...అలాంటి వాళ్ళూ ఉన్నారు, కానీ చాలా తక్కువ..." అంటూ తన థియరీ మొత్తం వివరించాడు అనంత్...అతను చెప్పింది నిజమే అనిపించింది...మరి ఇంత తెలిసీ ప్రొద్దున నుంచి ఏబ్రాసి మొహం వేసుకొని ఆఫీసులో ఎందుకు బాధపడుతూ కూర్చున్నాడో...అడగాలనిపించింది...కానీ అడగలేదు...కారణం అతనికి కూడా తెలిసి ఉండదు...After all he is a human being and couldn't control his emotions...

"అనంత్...మన స్టేట్ లో ఏ ప్రాంతపు అమ్మాయి అయితే బెటర్ అంటావ్ పెళ్లి చేసుకోడానికి....ఐ మీన్, ఇందాక నువ్ చెప్పిన తక్కువ మంది ఏ ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటారని నీ అభిప్రాయం...నాకు తెలిసి గోదావరి ప్రాంతం అమ్మాయి అలా ఉంటుందేమో..." అన్నాను...
"గోదావరి...కృష్ణ...కావేరి...ఏ ప్రాంతం అయినా కావచ్చు...అలా ఎలా చెప్పగలం...అది ఆమె వైఖరి మీద ఆధార పడి ఉంటుంది.." అన్నాడు అనంత్...
"నిజమే..కానీ ఆ వైఖరి చుట్టూ ఉన్న ప్రజలు, ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది...ఆ విధంగా వైఖరికి ప్రాంతానికి సంబంధం ఉందని అనిపిస్తుంది..." అన్నాను
"కొంతవరకు ఉండొచ్చు...కానీ పూర్తిగా చెప్పలేము..." అన్నాడు అనంత్...నేను కూడా నిజమే అన్నట్లు తలూపాను...ఇంతలో షాక్...కిరణ్ కళ్ళ వెంబడి నీళ్ళు...
"ఏయ్ కిరణ్...ఏంటిది...ఏమైంది..."అడిగాం ఇద్దరం ఒకేసారి...
సెల్ ఫోన్ లో ఎస్సెమ్మెస్ చూపించాడు ...."Dont Call me from tomorrow...You've really changed a lot and dont love me anymore...i know.." అని ఉంది...పాపం కిరణ్ 
ని చూడగానే జాలేసింది...

***************************************

"నాతో మాట్లాడకు...రేపటి నుంచి కాల్ చెయ్యకు...ఛీ అందరు అబ్బాయిలు ఒకటే..." ఏడుస్తున్నట్లుంది ఆమె స్వరం...
"నేనేమి చేశాను బంగారం....నాకు కుదరలేదు...ఆఫీసులో బోలెడు పని.." అన్నాను నేను..
"నాకేం చెప్పకు...మొదట్లో రోజూ వద్దన్నా కాల్ చేసి దుంపతెంచేవాడివి..ప్రపంచంలో ఉన్న సుత్తి మొత్తం చెప్పేవాడివి...ఎప్పుడైతే నీకు లైన్ క్లియర్ అయిందో అప్పటినుంచి నేను అలుసైపోయాను నీకు..ఇదేక్కడికి పోతుందిలే అన్న ధైర్యం..రిజర్వేషన్ చేసుకున్నట్లు ఫీల్ అయిపోకు..." అంది ఆవేశంగా...
"చా చా ఏంటి ఆ మాటలు..." అన్నాను
"నా పుట్టిన రోజే మర్చిపోయావ్...ఇంకేమనాలి నిన్ను...అదొక్కటేనా ఆ రోజు ఐనాక్స్ కి టికెట్లు బుక్ చేశాను వెళ్దాం అన్నావ్...అసలు కనిపించావా వారం దాకా!!...నాకు టెడ్డీ బేర్ లంటే ఇష్టమని చాలా సార్లు చెప్పాను నీకు...ఒక్కసారి అయినా surprise గా టెడ్డీ బేర్ గిఫ్ట్ ఇచ్చావా??..ఏ రోజైనా లంచ్ కి బైటకి తీసుకెళ్ళావా??..ఇలా చెప్తే పెద్ద లిస్టే ఉంది...ఐ లవ్ యు అని చెప్పడం కాదు...ఎంత లవ్ ఉందో చూపించడం కూడా తెలియాలి..." అంది అదే ఆవేశం మైంటైన్ చేస్తూ..
"అంటే ఇవన్నీ చేస్తేనే లవ్ ఉన్నట్లా...అసలు .." అంటూ ఇంకా చెప్పబోతుండగా "Dont Call me from tomorrow...You've really changed a lot and dont love me anymore...i know.." అంటూ ఫోన్ కట్ చేసింది...ఎక్కడో విన్నట్లు ఉంది ఆమె చెప్పింది...విన్నట్లు కాదు చూసినట్లు...అవును...అక్షరాలా ఆమె చెప్పిన మాటలు...ఆ రోజూ కిరణ్ కి వచ్చిన ఎస్సెమ్మెస్ ఒక్కటే...నా కళ్ళ వెంబడి నీళ్ళు...ఎందుకు లవ్ చేసాను, ఇలా బాధపడటానికా...దేవుడా ఇదంతా కల అయితే ఎంత బాగుండు...
  
***************************************

ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను...నిజమే ఇదంతా కలే...నేను ఎవరినీ ప్రేమించలేదు...నిజం..ఎస్...గ్రేట్...ఒక్కసారిగా ఎగిరి గంతేయ్యాలనిపించింది....పక్క రూంలోని టీవీ లోంచి మిస్సమ్మలో పాట మంద్రంగా వినిపిస్తుంది...

తెలుసుకొనవె యువతీ...అలా నడుచుకొనవె యువతీ..!!
సాధింపులు బెదిరింపులు ముదితలకిక కూడవని...
హృదయమిచ్చి పుచ్చుకొనే...చదువేదో నేర్పాలని..
తెలుసుకొనవె యువతీ..అలా నడుచుకొనవె యువతీ..!!

మూతిబిగింపులు అలకలు పాతబడిన విద్యలని...
మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని..
తెలుసుకొనవె యువతీ..అలా నడుచుకొనవె యువతీ..!!

[This post is completely a fictional work, it doesn't refer to any personal experiences - Kishen Reddy]