
రోజులు గడుస్తున్న కొద్దీ నేను నా హాస్టల్ లైఫ్ కి అలవాటు పడ్డాను...కొత్త కొత్త స్నేహితులు తోడవటంతో ఇంటి మీద బెంగ కాస్త తగ్గింది , కానీ హోం సిక్ సెలవులకి వెళ్లి తిరిగి వస్తున్నపుడు మాత్రం చాలా బాధ కలిగింది...తర్వాత మళ్లీ మాములుగా చదువులో పడ్డాను..మాకు ప్రతి శుక్రవారం ఔటింగ్ ఉంటుంది...వారం అంతా ఊపిరి సలపని స్టడీ హౌర్స్, క్లాస్సేస్ తో విసిగి వేసారిన మా హృదయాలు ఆ ఒక్కరోజులో రెక్కలు విప్పిన పక్షులు అవుతాయి... పరిస్థితి ఎలా తయారయిందంటే ఆదివారం అంటే ఇంతకముందు మనకు సెలవు దినం అనే విషయం మరచిపోయాం అక్కడ..ఎపుడు శుక్రవారం వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం...ఓ సారి సెలవులకు ఇంటికి వెళ్ళినప్పుడు మా చెల్లి స్కూల్ కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే 'ఏంటి స్కూల్ లేదా?' అని అడిగాను 'ఈ రోజు సండే మర్చిపోయావా?' అంది.."సండే అయితే ఏంటి....ఏదో పెద్ద శుక్రవారం అన్నట్లు బిల్డ్ అప్ ఇచ్చావ్ గా' అన్నాను..మా చెల్లి నా వైపు అదోలా చూసింది 'వీడికి పిచేక్కిండా ఏమిటి' అనే అర్థం వచ్చేలా..... ఆ తర్వాత నాకు అర్థం అయింది నా తప్పిదం...అలా నా జీవితం విచిత్రమైన కోణం లో పయనిస్తుంది...
మాది ఒక చిన్న ప్రపంచం లా ఉండేది...ప్రొద్దున్నే లేవడం...స్టడీ అవర్స్ లో కూర్చోవడం..క్లాస్సేస్ అటెండ్ అవడం... ప్రతి వీకెండ్ (వీకెండ్ అంటే మా బాష లో శుక్రవారం) ఎగ్జాం ఉండేది..అది ఏదో రాశాం అనిపించుకొని కొత్త సినిమా టిక్కెట్లు అందుతాయో లేదో అన్నఆందోళనతో చక చకా రెడీ అయ్యి నాజ్ సెంటర్ కి వెళ్ళే వాళ్ళం... కొత్త సినిమా టికెట్లు అందకపోతే నిరాశ చెందకుండా స్పోర్టివ్ గా తీసుకొని పక్కన ధియేటర్ లో పాత సినిమా కి వెళ్ళే వాళ్ళం...
ఆ టైం లో తొలిప్రేమ సినిమా రిలీజ్ అయింది...మేము వెళ్ళాము కాని మాకు టిక్కెట్లు అందలేదు ...మా ఫ్రెండ్స్ కొంతమంది చూసి వచ్చి ఆ సినిమా గురుంచి చెప్తుంటే ఎపుడెపుడు అ సినిమా చూద్దామా అని తెగ అనిపించేది.. మా స్వామి రెడ్డి సినిమా చూసి వచ్చి "ఆహా!! కీర్తి రెడ్డి ఏముంది అనుకున్నావ్... తన కోసం ఇంకో రెండు సార్లు చూడొచ్చు సినిమా" అని నాకు లేని పోనీ ఆశలు పెట్టాడు. .ఇక ఆ సినిమా చూసే దాకా నాకు నిద్ర పట్టలేదు..ఏది అయితే అది అయిందనుకొని ఓ రోజు సాయంత్రం స్టడీ హౌర్ ఎగ్గొట్టి సినిమా కి వెళ్ళాం..అప్పటికీ టికెట్లు అందలేదు..నాకు పవన్ కళ్యాన్ మీద కోపం వచ్చింది..ఎందుకో నాకే తెలీదు..చివరికి బ్లాకు లో ఒక్కో టికెట్ కి వంద పెట్టి కొన్నాం..నా దైర్యనికి నాకే ఆశ్చర్యం వేసింది..ఇంకో వైపు, స్టడీ హౌర్ ఎగ్గొట్టి సినిమాకి వచ్చి బ్లాకు లో టికెట్ కొని మరీ సినిమా చూస్తున్నాను అని గిల్టీ ఫీలింగ్ కలిగింది..సినిమా లో కీర్తి రెడ్డి కనిపించే సరికి అన్ని ఫీలింగ్స్ ఫట్ అని ఎగిరిపోయి సినిమా లో లీనం అయ్యాను...సినిమా అయ్యాక కాలేజీ కి తిరిగి వస్తుంటే భయం మొదలైంది..స్టడీ హౌర్ ఎగ్గోట్టామని డైరెక్టర్ ఎమన్నా అంటాడేమో!...కొడతాఢేమో!!... "S2 సెక్షన్ లో స్టడీ హౌర్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళినందుకు ముగ్గురుని దేవి ప్రసాద్ బూట్ కాలుతో తన్నాడు తెల్సా.." పొట్టి రాజేష్ గాడు చెప్పిన విషయం గుర్తోచి చెమటలు పట్టాయి...ఒక్కసారిగా కీర్తి రెడ్డి మీద కోపం వచ్చింది..తను అంత అందంగా కనిపించి ఉండకుండా ఉంటే..ఈ స్వామి గాడు నాకు ఆశపెట్టి ఉండేవాడే కాదు..నేను ఇంత వీరోచిత చర్య చేసేవాడినే కాదు..ఎందుకంటే మనకు బేసిక్ గా అంత సీన్ లేదు కాబట్టి..
ఎలాగోలా గుట్టు చప్పుడు కాకుండా కాలేజీ కి వచ్చేసి ఎవరు చూడకుండా సైలెంట్ గా స్టడీ అవర్స్ లో కూర్చున్నాం..ఇంతలొ మా సెక్షన్ వార్డెన్ పిల్చాడు మమ్మల్ని "సినిమా బాగుందా?" అన్నాడు..మేము స్టన్ అయ్యి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళం చూసుకున్నాం.."మీరు సినిమాకి వెళ్లారు అని నాకు తెల్సు, ఇదే విషయం డైరెక్టర్ కి తెలిస్తే మే తాట తీసేవాడు తెల్సా...పోయే ముందు ఓ మాట నాకు చెప్పాల్సింది..నేను ఎలాగో అటెండెన్స్ మేనేజ్ చేశాను లే...వెళ్ళండి" అన్నాడు..వార్డెన్ అప్పుడు నాకు ఆపత్బాన్ధవుడులా కనిపించాడు ఆ సమయంలో..
ప్రొద్దున లేచిన దెగ్గర నుంచి రాత్రి పడుకొనే దాక కాలేజీ, హాస్టల్ తప్ప ఇంకేమి తెలియవు మాకు...అసలు అమ్మాయిలే కనిపించే వాళ్ళు కాదు...ఎపుడన్నా ఒక అమ్మాయి కనిపిస్తే ఏదో గ్రహాంతర వాసిని చూసిన ఫీలింగ్ మాలో... ఆ అమ్మాయి ఎలా అయినా ఉండనీ "బాబోయ్ నాకు ఇంత సీన్ ఉందా?" అని ఆ అమ్మాయికే డౌట్ వచ్చేలా ఉంటాయి మా చూపులు...అమ్మాయిల కాంపస్ మా కాంపస్ కి కొద్ది దూరంలోనే ఉండేది....మా అక్క కూడా అదే కాలేజీ లో చదువుతూ ఉండటం వల్ల అపుడపుడు తనని కలవడానికి నేను పర్మిషన్ లెటర్ తీసుకొని అమ్మాయిల కాంపస్ కి వెళ్ళేవాడిని...అక్కడ అంత మంది అమ్మయిలు కనిపించేసరికి కొంచెం సిగ్గనిపించేది...విచిత్రం ఏమిటంటే ఒక అమ్మాయి కనిపిస్తే మేము అందరం కల్సి ఎలా చూసేవాళ్ళమో, అలాగే ఓ అబ్బాయి కనిపించేసరికి వీళ్ళు అంతకన్నా దారుణంగా చూస్తున్నారు...బహుశా నేను కూడా వాళ్ళకి ఓ గ్రహాంతర వాసి లా కనిపించి ఉండవచ్చు...
గురువారం వస్తుందంటే చాలు మాకు చాలా ఆనందంగా ఉండేది...శుక్రవారం కోసం ఎలా ఎదురు చూసేవాళ్ళమో, అలాగే గురువారం కోసం కూడా ఎదురు చూసేవాళ్ళం...కారణం ల్యాబ్..అబ్బో ల్యాబ్ అంటే వీళ్ళకి ఇంత ఇష్టమా అనుకొనేరు కొంపదీసి, అదేం కాదులెండి....అమ్మాయిల కాంపస్ లో ల్యాబ్ లేదు..కనుక వాళ్ళు ప్రతి గురువారం మా కాంపస్ కి వచ్చి ల్యాబ్ చేసేవాళ్ళు...మేము బుద్ధిగా ఆరుబాయిట స్టడీ హౌర్ కి కూర్చుని ఉంటే, ఘల్లు ఘల్లు మని శబ్దం చేసుకుంటూ..మా వైపు ఓరకంట చూస్తూ..అలా అలా ల్యాబ్ లోకి వెళ్ళేవాళ్ళు...మా స్టడీ హౌర్ ఇలా ఇలా చట్టు బండలయ్యేది...అంతే ఒక్కొక్కడు వాటర్ అనో..బాత్రూం అనో పర్మిషన్ తీసుకొని ల్యాబ్ చుట్టూ ప్రదక్షిణాలు చేసేవాళ్ళు...వాళ్లేమో మమ్మల్ని చూసి తెగ నవ్వుకొనే వాళ్ళు..ల్యాబ్ రూం కి చిన్న చిన్న రంద్రాలు ఉంటే, వాటిల్లో కళ్ళు పెట్టి మరీ చూసేవాళ్ళు...అక్కడేదో ఇక ప్రపంచం లో అమ్మాయిలు రేపటి నుంచి కనిపించరు అనే లెవెల్ లో...నేను ఎప్పుడూ అలా ల్యాబ్ చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యలేదనుకోండి...అంటే నేనేదో సూపర్ అని కాదు...వాళ్ళల్లో మా అక్క కూడా ఉంటుంది, సో పొరపాటున తను నన్ను చుస్తే మన 'రాముడు మంచి బాలుడు' ఇమేజ్ కి డామేజ్ వస్తుంది అనే భయం అంతే!!...
ఈ అమ్మాయిల రాకతో జరిగే ప్రదక్షిణాల ప్రక్రియలో నాతో పాటు స్టడీ హౌర్ లో బుద్ధిగా చదువుకునే సతీష్ కాస్తా అమర ప్రేమికుడు లెవెల్లో మారుతాడు అనోకోలేదు... వాడు అమ్మాయిలు అంటే ఆమడ దూరం అనే టైపు...ప్రదక్షిణాలు చేసేవాళ్ళని తెగ తిడతాడు "ఛీ వీళ్ళకి కొంచెం కూడా బుద్ధి లేదు....తలిదండ్రులు కష్టపడి ఇన్ని డబ్బులు పోసి చదివిస్తుంటే...ఇక్కడ వీళ్ళ వేషాలు ఇవి" అనేవాడు నాతో..నేను నిజమే అన్నట్లు తలూపే వాడిని...
ఓ రోజు అమ్మాయిల ల్యాబ్ టైం లో వీడు వాటర్ తాగడానికి వెళ్ళాడు...నిజంగానే దాహం వేసి వెళ్ళాడు లెండి, నన్ను కూడా రమ్మన్నాడు..నేను రాను నువ్వెళ్ళు అని చెప్పాను..వాటర్ కి వెళ్ళిన వాడు చాలా సేపటిదాకా రాలేదు..దాదాపు ఒక గంట తర్వాత వచ్చాడు.."ఏరా ఇంత లేట్" అడిగాను.."ఎం లేదు " చాల క్లుప్తంగా చెప్పాడు...భోజనం కూడా సరిగ్గా చెయ్యలేదు...ఆ రోజంతా అన్యమస్కంగానే ఉన్నాడు..ఎపుడూ లోడ లోడ వాగేవాడు, మౌన ముని అయిపోయేసరికి నాకేదో అనుమానం స్టార్ట్ అయింది..ఆ రోజు రాత్రి స్టడీ హౌర్ అవ్వగానే రూంకి వెళ్ళాక అడిగాను..ఏమీ చెప్పలేదు..అంతే ఇక గట్టిగా నిలదీసాను..చెప్పకపోతే నా మీద ఒట్టు అనేసాను..వీడికి ఇలాంటి సెంటిమెంట్లు ఉన్నాయిలెండి..అంతే ఏడ్చేశాడు... నాకు ఎందుకో భయం వేసింది...మనసు ఎందుకో కీడు తలపిస్తుంది..ఏమయ్యుంటుంది..."ఏరా ఏమయింది రా...చెప్పురా..చెప్పుకుంటే కొంతైనా నీ మనసు తేలిక అవుతుంది" చాలా మృదువుగా చెప్పాను..వాడు నా వైపు దీనంగా ముఖం పెట్టి "ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది రా...ఆ అమ్మాయిని నేను పెళ్ళిచేసుకుంటాను లేకపోతే చచ్చిపోతాను.."అన్నాడు...క్షణ కాలం నేను ఏమి వింటున్నానో నాకు అర్థంకాలేదు..అర్థం అయ్యేలోపే ఏదో షాక్ తగిలిన వాడిలాగా వాడి వైపే చూసా...వాడు నేనేదో చెప్తాను అన్నట్లు నా వైపే చూస్తున్నాడు..నిన్నటి దాకా అమ్మాయిల వెంట ప్రదక్షిణాలు చేసిన వాళ్ళను చూసి తిట్ల దండకం అందుకొనే వీడు ఇపుడు రివర్స్ గేర్ వేసేసరికి ఏమి మాట్లాడాలో నాకు అర్థం కాలేదు..మళ్ళీ వాడే అందుకున్నాడు "నీళ్ళ కోసం వెళ్ళిన నేను తిరిగివస్తుంటే ఏదో యదలాపంగా ల్యాబ్ వైపు చూసాను..కరెక్ట్గా ఆ అమ్మాయి కనిపించింది..ఒక్క క్షణం అలా ఆగిపోయాను..ఆ అమ్మాయి కూడా నా వైపు చూసింది..అంతే ఆ ఒక్క చూపు నన్ను నిలువునా చంపేసింది..ఆమె నాకోసమే పుట్టింది అన్న విషయం ఆమె చూపులోనే అర్థం అయింది.." కొంచెం తికమకగా వాడి వైపు చూసాను.."నేను ఆ అమ్మాయిని కచ్చితం గా పెళ్లి చేసుకుంటా...నా జీవిత లక్ష్యం ఇపుడు ఆ అమ్మాయి.." .. వాడి మాటలు వింటున్న నేను 'సినిమాలు పెద్దగా చూడని వీడికి ఇన్నిడైలాగులు ఎలా వచ్చాయబ్బా' అని ఆలోచిస్తుంటే.. "ఏరా నాకు హెల్ప్ చేస్తావా ?" అన్నాడు..నాకు టెన్షన్ స్టార్ట్..మనకు అంత సీన్ లేదు బేసిక్ గా..."చూడు రా ..ఇది చదువుకునే ఏజ్..నువ్వే చెప్తుంటావు కదా..ఇలాంటివన్నీ చెయ్యకుండా బాగా చుదువుకోవాలని...నువ్వు బాగా చదువుకో తర్వాత ఆలోచిద్దాం.." చాలా సేపు ఆలోచించి ఈ మాట చెప్పగలిగాను వాడితో...వాడు ఏమీ మాట్లాడకుండా వెళ్లి పడుకున్నాడు....
ఇక ఆ రోజు నుండి స్టార్ట్ వాడి పిచ్చి...స్టడీ హౌర్ లో చదవడు...మెస్ లో తినడు...రూం లో పడుకోడు...గురువారం వచ్చేసరికి వాడి ముఖం చూడాలి..వెయ్యి కాండిల్స్ సరిపోవు..అమ్మాయిలు రావడం ఆలస్యం..అందరికన్నా ముందు ప్రదక్షిణ చెయ్యడానికి రెడీ అవుతాడు...అపుడు వెళ్ళిన వాడు రెండు గంటల తర్వాత గానీ రాడు..వచ్చాక వాడు చాలా ఆనందంగా ఉండేవాడు.. వాడిని చూసి నాకు తెగ ఆశ్చర్యం వేసేది...ఆ తర్వాత వాడి పరిస్తితి ఇంకా దారుణంగా తయారయింది...ఇపుడు గురువారం దాకా వాడు ఆగటం లేదు..స్టడీ హౌర్ ఎగ్గొట్టి అమ్మాయిల హాస్టల్ పరిసరాలలో తిరగడం స్టార్ట్ చేసాడు..నేను చెప్తూనే ఉన్నాను వాడికి, కానీ వినలేదు...
ఓ రోజు ఆ అమ్మాయి కోసం లెటర్ రాసి నాకిచ్చి, నేను మా అక్కని చూడటానికి అమ్మాయిల హాస్టల్ కి వెళ్ళినప్పుడు మా అక్కకి ఈ లెటర్ ఇచ్చి ఆ అమ్మాయి కి ఇవ్వమనాలాట... ఇంకా నయ్యం అసలే ఇమేజ్ కాపాడుకోడానికి కనీసం అమ్మాయిలు వచినపుడు ఒక్కసారి కూడా ప్రదక్షిణ చెయ్యని వాడిని పట్టుకొని డైరెక్ట్ మా అక్కకే లెటర్ ఇచ్చి ఇంకో అమ్మాయికి ఇవ్వమనాలా..."ఒరేయ్ ఆ అమ్మాయి ఎవరో తెలీదు...పైగా అక్కకి ఇలాంటివంటే నచ్చదు.."అన్నాను.."దీప్తి..S2 .. నువ్వు ఈ పని చెయ్యకపోతే నేను చచ్చినంత ఒట్టు"..వీడి ఒట్టులతో చస్తున్నాను అనుకోని..ఆ లెటర్ తీసుకొన్నాను...కాని ఆ లెటర్ ఇవ్వలేదు...చెప్పాగా మనకి అంత సీన్ లేదు...
ఓ రోజు కాలేజీ స్టడీ హౌర్ జరుగుతున్నపుడు..డైరెక్టర్ల రూంలో ఎవరికో షంటింగ్ జరుగుతుంది..అరుపులు బైటకి వినిపిస్తున్నాయి..వార్డెన్ నా దెగ్గరికి వచ్చి "ఎవరిననుకున్నావ్ వాయించేది..మీ ఫ్రెండ్ సతీష్ నే..వీడు ఎవరో మన హాస్టల్ అమ్మాయి గుడికి వెళ్తుంటే ఫాలో అయ్యి నానా రభస చేసాడంట..లవ్ గివ్వు అని ఆ అమ్మాయి తో ఏదేదో వాగాడు అంట...వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించారు కూడా.."..నాకు చాలా బాధేసింది...10th క్లాసు లో 520 మార్కులు వచ్చాయి వాడికి..వాళ్ళ పేరెంట్స్ వాడి మీద ఎన్నో ఆశలతో ఇక్కడ చేర్పించారు..వాళ్ళకు అంత స్థోమత లేదు...అందుకే అమ్మాయిల చుట్టూ తిరిగేవాళ్ళను వాడు అలా తిడతాడు...వాడికి కష్టం విలువ తెలుసు కానీ ఏదో బలహీనత వాడిని లోబర్చుకోన్నది...వాళ్ళ అమ్మ నాన్నలకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతారో తలచుకోగానే నాకు ఏడుపు వచ్చినంత పని అయ్యింది...వాడు కాలేజీలో చేరినప్పుడు వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడాను నేను...మధ్యాహ్నం గంట బ్రేక్ టైం లో సతీష్ తో పాటు వాడి పేరెంట్స్ కనిపించారు నాకు.. వాడి ముఖం పాలి పోయి ఉంది.. సిగ్గుతో చితికిపోయాడు వాడు...వాడి సంస్కారం వాడిని చీత్కరించింది... అలాంటి స్థితిలో తల్లిదండ్రులను చూస్తాను అనుకోని ఉండదు వాడు.. "బాబు..వీడిని చేర్పించడానికి వచ్చినపుడు..నీతో మా వాడి గురుంచి చాల గొప్పగా చెప్పాను..మాకే సిగ్గుగా ఉంది...వీడికో చెల్లి ఉందన్న విషయం వీడికి గుర్తుంటే ఇంకో అమ్మాయిని అలా ఎడిపించేవాడా?..వెళ్ళిపోతున్నాం బాబు వీడిని తీసుకొని...నువ్వు బాగా చదువుకో నాయినా...ఇట్టాంటి పిచ్చి భ్రమలు పెట్టుకుంటే ఎవడైనా వీడిలాగే అవుతారు..ఉంటాం బాబు" వాళ్ళ అమ్మ చెప్తుంటే వాడి కళ్ళలోంచి నీళ్ళు చూసాక నాకు ఒక్క క్షణం ఇదంతా అబద్దం, సతీష్ మునుపటి సతీష్ లా స్టడీ హౌర్లో నా పక్కనే కూర్చొని ఉంటె బాగుండు అనిపించింది...వాళ్ళు వెళ్లిపోయారు...
ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు..ఏదో భారంగా అనిపించింది..ఏదో గుర్తువచిన వాడిలా ట్రంక్ పెట్టె తెరిచి వాడు ఆ అమ్మాయికి రాసిన లెటర్ తెరిచి చదివాను.." దీప్తి...ఇలా లెటర్ నీకు పంపాను అని నా గురుంచి తప్పుగా అనుకోవద్దు..నేను చాలా మంచి అబ్బాయిని, కావాలంటే మా స్కూల్ హెడ్ మాస్టర్ అని అడిగితె చెప్తాడు...మా పేరెంట్స్ కి నేను, మా చెల్లి..నేనంటే పంచ ప్రాణాలు వాళ్ళకి..నేను బాగా చదువుకోవాలని ఇక్కడ చేర్పించారు..కానీ నిన్ను చూసిన దెగ్గర నుంచి చదవలేకపోతున్న..నువ్వంటే నాకు ప్రాణం..ఓ సారి నువ్వంటే నాకిష్టం అని చెప్పు చాలు..ఇక చూడు ఎలా చదువుతానో...సరేనా.." ఇంకా ఏదో రాసాడు...చదవలేకపోయా..నా కళ్ళలోంచి బొట్లు బొట్లు గా కన్నీళ్ళు జారి ఆ లెటర్ తడిచిపోయింది....
ఇలా నన్ను నవ్వించీ..ఏడిపించిన జ్ఞాపకాలు ఎన్నో...మైమరపించీ మనసుని కదిలించిన ఘట్టాలు ఇంకెన్నో .. స్నేహ పరిమళాల గుభాళింపులో...జీవితానికి బాటలు వేసే ఆ వయసులో... ప్రతి సంఘటనా ఓ అద్భుతం..ప్రతి కదలికా ఓ జ్ఞాపకం... మీకో కొసమెరుపు అందించనా!!...సతీష్ ఇపుడు ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నాడు.... (సరేనండి...మరొక ఆసక్తి కలిగించే టపాతో మిమ్మల్ని కలుసుకుంటా...అప్పటివరకు....జై హో..)