Search This Blog

Tuesday, 27 April, 2010

షార్ట్ కట్ టు గోపాలపురం - 1


అర్థరాత్రి పదకొండు యాభై అవుతుంది టైం..

నర్సీపట్నం లక్ష్మి టాకీస్ లో శ్రీలక్ష్మిగణపతి పిక్చర్స్ వారి "సముద్రంలో రాక్షసనౌక" చిత్రం రెండో ఆట వదలడానికి పది నిముషాలు ఉంది...

థియేటర్ పక్కన బడ్డి షాప్ బాపిరాజు కొట్టు కట్టేసి, ముత్యాలు టీ కొట్టు దెగ్గరకొచ్చి "ముత్తేలు మాంచి స్టాంగ్ టీ కొట్టవోయ్....." అన్నాడు లుంగీ ఎగ్గట్టి దమ్ము కొడుతూ.. 

"ఏట్రా బాపిగా...ఎట్టా ఉండాది యాపారం..." రెండో ఆట నుంచి అప్పుడే బైటకి వచ్చిన గోపాలపురం సర్పంచ్ బైరినాయుడు పలకరించాడు...
"ఏటండీ ఆట ఇంకా ఉండగా వచ్చేశారేటి...." అంటూ ముత్యాలు వైపు తిరిగి "ముత్తేలు... నాయుడు గారికి పెసల్ టీ చెప్పు..." అంటూ అరిచాడు..."నెల రోజులుగా ఈడి బాకీనే మూలుగుతుంది ఇక్కడ, పైగా మాకు మళ్ళీ ఆడర్లు ఒకటి..." సణిగాడు ముత్యాలు

"సినిమాలో అంత విశేషం ఏటీ లేదురా....మొన్న సూసిన "రాక్షస బల్లుల సవాల్" తో పోలిత్తే ఇదెక్కడెహే..అదో కళాఖండం కదూ...అన్నట్టు ఒరే 'పిల్లి కళ్ళ సుందరి' సినిమా ఎల్లుండి రిలీజ్ మన లచ్చిమిలో...ఆలివుడ్డులో ఊపేసిందంటా ఆ సినిమా..రెండో ఆటకి నాకు టికెట్ తియ్యిరా మర్సిపోకుండా...జనాలు ఎగబడతారు ఆ సినిమాకి, నాకేమో గోపాలపురం నుంచి ఒచ్చేసరికి లేట్ అయిపోతాది..." అన్నాడు టీ తాగుతూ...మన నాయుడు గారికి హాలివుడ్ తెలుగు డబ్బింగ్ సినిమాలు అంటే ప్రాణం కదామరి....
టీ తాగేసి మోటర్ సైకిల్ స్టార్ట్ చేయ్యబోతుంటే కనిపించారు ఆ ముగ్గురు అబ్బాయిలు బైరినాయుడు గారికి...

ఆళ్ళ వైపు అలాగే చూస్తూ.."ఒరేయ్ ఇట్రండిరా....." గట్టిగా కేకేసాడు ఆ పిల్లల్ని ఉద్దేశించి...
థియేటర్ నుండి గబగబా బయటకి వెళ్ళిపోతున్న ఆ ముగ్గురు అబ్బాయిలు ఆ కేకకి వెనక్కి తిరిగి చూసారు...బైరినాయుడు గారు తన దెగ్గరికి రమ్మని చెయ్యూపుతున్నాడు..వాళ్ళు టక్కున మళ్ళీ అటువైపుకు తిరిగారు..
"ఒరేయ్ ఈడిక్కడ ఉన్నాడెంట్రా బాబూ..." కర్చీఫ్ ముఖానికి కప్పుకొని ఆళ్లిద్దరి వెనుకాల దాక్కున్నాడు రవి..
"ఒరేయ్ మనం అయిపోయాంరా...ఈడు మనల్ని చూసేసాడు...రేపు మన ఇళ్ళల్లో చెప్పేస్తాడురా మనం సెకండ్ షోకి టౌన్ కి వచ్చామని.." భయపెట్టాడు సురేష్ మిగతా ఇద్దరినీ...

"ఏటి కాదులే రండెహే...ఏదోకటి మేనేజ్ చేద్దాంలే..." అంటూ గిరిగాడు బైరినాయుడు దెగ్గరకు  వెళ్తుండగా మిగతా ఇద్దరూ అనుసరించారు...
దెగ్గరికి వస్తున్న వాళ్ళని పరిశీలనగా చూస్తూ "ఓరోరి నువ్వట్రా!!....పడమటి వీధి రాములోరి గుడి పూజారి శాస్త్రి కొడుకువి కదా.." అన్నాడు సురేష్ గాడిని చూసి...'ఓరి ఈడెబ్బ...పోయి పోయి నన్నే గుర్తుపట్టాడు ఏంట్రా దేవుడా...' అనుకోని గిరిగాడి వైపు చూసాడు సురేష్...బైరినాయుడు గారు కూడా గిరి గాడి వైపు చూసి "వార్నీ ఈడు తెలీకపోవడం ఏంటి...శంకరం పంతులు కొడుకువి గదూ..." అన్నాడు...అవునన్నట్లుగా తలూపాడు గిరి...

"ఆరి భడవల్లారా !!....సెకండ్ షో సినిమాలు కావాల్సి వచ్చినాయిరా మీకు...ఈ ఏడు పదో తరగతే కదా మీరు...వారం రోజుల్లో పరీక్షలు ఎట్టుకొని..ఎదవ ఏశాలు ఎత్తారా??...అసలే నేను సర్పంచ్ గా ఉన్నపటి నుంచి పదో తరగతి మార్కుల్లో ఇసాఖ జిల్లాలోనే మన ఊరు టాపు రా...అట్టాంటిది ఈసారి పరువుబోయ్యేట్టు ఉందే..." 

'నువ్వు సర్పంచ్ అయితే ఏదో పెద్ద డి.ఈ.వో లెవెల్లో మాట్లాడుతావేంట్రా...'పళ్ళు పటపటా కొరికాడు గిరిగాడు.."అది కాదు సర్పంచ్ గారు, పొద్దుటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం..కాస్త రిలాక్స్ కోసం ఇలా..." అంటూ నాయుడు గారి వైపు చూసాడు....
"ఏటి రిలాక్స్ కోసమా...రెండో ఆట..అది కూడా 'సముద్రంలో రాక్షస నౌక' ..బాగా రిలాక్స్ అయ్యారా నాన్నా!!... ఇట్టా గాదు మీ పని..." అని ఓ క్షణం ఆగి...."అవునొరే ముగ్గురు ఉండాలి...ఇద్దరే ఉన్నరేట్రా??" అని అడిగాడు...వీడేంటి ఇలా అంటున్నాడు అని వెనక్కి తిరిగేసరికి రవిగాడు లేదు...గిరి సురేష్ ముఖముఖాలు చూసుకున్నారు...
"ఇందాక మీతోకూడా ఇంకొకడు ఉన్నాడు కదా..." రెట్టించాడు నాయుడు....
"ఆ....అది...ఆడు వెళ్లిపోయుంటాడు సర్పంచ్ గారు..." అన్నాడు గిరి 'ఈడెక్కడికి పోయాడ్రా..' అని మనసులో అనుకుంటూ  ..

"ఆడు మనూరోడిలాగే ఉన్నాడే...ఎక్కడికి పోతాడు..??" అడిగాడు అనుమానంగా..
"మీరు ఆడిని సరిగ్గా చూడలేదు...ఆడిది నర్సిపట్నమే..మనూరు కాదు" అన్నాడు సురేష్.
"సరేలే...అన్నట్టు ఒరే..మీతో కూడా ఇంకోడు ఉంటాడు తెల్లగా పొడుగ్గా...ఆడి పేరేట్రా??"...
"మీరు రవి గురుంచి అడుగుతున్నారా?? " అన్నాడు గిరి
"ఆ ఆడే...ఒళ్ళు జాగర్తగా ఉంచుకోమను ఆడిని...నా కూతురికి పిచ్చి పిచ్చి ఉత్తరాలు రాత్తున్నాడట..చెమడాలు ఇరిసేత్తానని సెప్పు కొడుక్కి...సర్పంచ్ నాయుడు అంటే ఆటలుగా ఉందేటి ఆడికి..." తెలివిగా తప్పించుకొని బాపిరాజు బడ్డి కొట్టు వెనుకాల దాక్కున్న రవి గాడికి ఈ మాటలు వినగానే చెమటలు శ్రీశైలం ఫ్లడ్ గేట్లు ఓపెన్ చేసినట్లు పారుతున్నాయి...వాడికి అర్జెంటు గా నెంబర్ వన్ తన్నుకొని వచ్చేలా ఉంది...

"ఇందాక మీలో మూడోవాడు ఆడిలా కనిపించే మిమ్మల్ని పిలిచాను...సరేలే రేపు ప్రొద్దున్నే వచ్చి మీ పని ఆడి పని చెప్తా...." అంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళబోతూ "బక్క పీనుగులేగా వచ్చి కూసొండి...ఊళ్ళో దింపుతా.." అన్నాడు నాయుడు
ఈనాకోడుకులు ఎక్కడ కమిట్ అవుతారో అని బడ్డీ కొట్టు ఎనకాల ఉన్న రవి గాడికి టెన్షన్ మొదలైంది...

"పర్లేదు సర్పంచ్ గారు...మేము సైకిల్ తెచ్చుకున్నాం..దాంట్లోనే వెళ్తాం.." అని చెప్పాడు గిరి గాడు..నాయుడు గారు ఓ లుక్ ఏసి వెళ్ళిపోయాడు...

హమ్మయ్యా అనుకుంటూ బడ్డీ కొట్టు వెనుకాల నుంచి బయటకి వచ్చాడు రవి గాడు..
"ఇంత పిరికోడివి ఆడి కూతురికి ఎట్టా లైన్ ఏస్తున్నావురా!...అదేంట్రా వొళ్ళంతా తడిసిపోయింది...ఇదంతా భయమే.!!!.." పగలబడి నవ్వుతున్నాడు గిరిగాడు...
"ఆపరా బాబూ...నీవల్లే ఇదంతా...వద్దురా అన్నా వినకుండా సెకండ్ షోకి లాక్కొని వచ్చావ్...ఇప్పుడు చూడు వాడికి బుక్ అయ్యాం..." అన్నాడు రవి గాడు భయపడుతూ...

"ఆడేం చేస్తాడురా...సర్పంచ్ అని కొంచెం పోస్ కొడుతుంటాడు కానీ, వాళ్ళ ఆవిడ అంటే...ఇది వాడికి.." చిటికెన వేలు ఊపి చూపించాడు గిరి గాడు...
"సరేలే పదండి...ఊరికి వెళ్ళాలి..అసలే అర్థరాత్రి అవుతుంది..." అన్నాడు సురేష్...
గిరి గాడు సైకిల్ తీశాడు..నిర్మానుష్యమైన వీధుల వెంబడి నడుచుకుంటూ మెయిన్ రోడ్ చేరుకున్నారు...

"అయినా రవిగా భలే పిల్లకి లైన్ వేశావురా...జాంపండులా ఉంటాదెహే పిల్ల..నీకు అవసరం అంటావా అది..నకిచ్చేయ్యి రా.." అంటూ చూసాడు రావిగాడి వైపు...ఆడు సురసురా చూస్తున్నాడు వీడి వైపు...
"సరే సరే..నీదేలే ఆ పిల్ల..ఊరికే అంటున్నా...నాకో పెద్ద డౌట్ రా..నాయుడు గాడి పెళ్ళాం ఇంచుమించు రోడ్ రోలరు షేప్...తార్ రోడ్ కలర్ ఉంటది కదా ఆ జాంపండు దానికి పుట్టిందేనా అని..." అన్నాడు..విచిత్రంగా చూసాడు రవిగాడు..
"సారీ రా...నీకు కాబోయే మామగారి శీలాన్ని శంకిస్తున్నా అని ఫీల్ అవ్వకు...ఇదేదో పెద్ద మేటర్ అని నా డౌట్..అదేదో కనిపెడితే సర్పంచ్ గాడిని ఓ ఆట అడించోచ్చు.." అన్నాడు

గోపాలపురానికి దారి తీసే అడ్డరోడ్ కి చేరుకున్నారు..
"ఒరేయ్ ఈ తొక్కలో సైకిల్ లో ఇప్పుడు త్రిపుల్స్ వెళ్ళడం కష్టం రా...వచ్చేప్పుడు ఏదో సినిమాకి వస్తున్నాం అనే ఊపులో వచ్చేశాం...అసలే తొమ్మిది కిలోమీటర్లు.." అన్నాడు సురేష్
నిజమే అన్నట్లుగా తలూపారు ఇద్దరు...

"ఏం చేద్దాం ఇప్పుడు మరి..ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోయి ఉంటుంది ఎప్పుడో.." అన్నాడు రవి..
కాసేపు బుర్ర గోక్కున్న గిరిగాడు "ఒక సూపర్ ఐడియారా..వెంకటేశ్వర లాడ్జి వెనుక సందులో నుంచి వెళ్తే ఒక మట్టి బాట వస్తుంది...అది అనుసరించి వెళ్తే మూడు కిలోమీటర్లలో మన ఊరి పడమటి వీధి చేరుకోవచ్చు..మన గొపలపూరనికి అదే మంచి షార్ట్ కట్.." చెప్పాడు గిరిగాడు..

"అమ్మో ఆ రూటా!...వద్దురా..అసలే అర్థరాత్రి...అందునా చిమ్మచీకటి...పైగా కొంత దూరం పోయాక స్మశానం ఉంటుందట...నాకసలే ఆ సమాధులు చూస్తే చచ్చే భయంరా బాబూ...కష్టమో నష్టమో ఇటే వెళ్దాంరా.." అన్నాడు సురేష్ గాడు..
"ఓవర్ యాక్షన్ చెయ్యకు....మేము ఇద్దరం ఉన్నాం...నీకెందుకు భయం..మన దెగ్గర టార్చ్ లైట్ కూడా ఉంది...లైట్ చూస్తె దెయ్యాలు రావంట..ఏదో సినిమాలో చూశా" చిన్నగా నవ్వాడు గిరి..
చేసేదిలేక వాళ్ళని అనుసరించాడు సురేష్...

వెంకటేశ్వర లాడ్జ్ వెనుక రూట్ కి చేరుకొని నడుస్తున్నారు..అంతా నిశ్శబ్దం..అన్ని ఇళ్ళు తలుపులు వేసి ఉన్నాయ్..మనుషులు కాదు కదా కనీసం కుక్కలు కూడా లేవు...వాళ్ళ గుండె సవ్వడి వాళ్ళకే వినిపిస్తుంది..అందులో మరీ స్పీడ్ మ్యూజిక్ మన సురేష్ గాడిది... 

అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళిద్దరి మధ్యలో చెరొక చెయ్యి పట్టుకొని నడుస్తున్నాడు సురేష్ గాడు...
మట్టి బాట చేరుకొని నెమ్మదిగా వెళ్తున్నారు...అంతా చిమ్మ చీకటి..గిరిగాడు టార్చ్ పట్టుకొని నడుస్తున్నాడు...బాట చిందర వందరగా ఉంది...

సురేష్ గాడు గుండెని చేతులో పెట్టుకొని నడుస్తున్నాడు వణుకుతూ..రవి గాడి పోసిషన్ కూడా దాదాపు అదే...
ఒక ఇరవై నిముషాలు నడిచేసరికి ఎక్కడున్నారో వాళ్ళకి అర్థం కాలేదు...కనుచూపు మేరల్లో అంతా చిమ్మ చీకటి...దూరంగా నక్కల అరుపులు...వణికిపోతున్నాడు సురేష్ గాడు...


కొంచెం సేపు అయ్యాక "అనోసరంగా ఇటు వైపు వచ్చామేమో...నాకు దారి అర్థం కావడం లేదు.." అన్నాడు గిరి గాడు...
గుండెల్లో పిడుగు పడింది రవిగాడికి...సురేష్ గాడికి అయితే ప్యాంటు తడిసిపోయింది...వాడికి వణుకుతో జ్వరం వచ్చేలా ఉంది..ఇందాక సర్పంచ్ గాడితో కనీసం తను వెళ్ళిపోయినా ఈ పాటికి హాయిగా ఇంట్లో నిద్రపోయేవాడినే కదా అనుకున్నాడు...సురేష్ కి  ఏడుపు తన్నుకుంటూ వచ్చింది...

అలాగే నడుస్తూ వెళ్తున్నారు..
"ఒరేయ్ గిరిగా తిరిగి వెనక్కి వెళ్ళిపొదాంరా...కావాలంటే నర్సీపట్నంలోనే ఈ నైట్ ఏ ప్లాట్ ఫాం మీదో పడుకొని తెల్లవారు జామునే వెళ్ళిపొదాంరా...పాపం సురేష్ గాడు చూడు..ఇక్కడే చచ్చేలా ఉన్నాడురా.." అన్నాడు రవి గాడు...


"ఒరేయ్ ఈ ఆలోచన నాకు మీకన్నా ముందే వచ్చింది..అసలు ఎటు వెళ్తున్నామో తెలియట్లా...వచ్చిన దారి మీకు ఎవరికన్నా గుర్తుందా??" అడిగాడు గిరి గాడు...
అంతా వణుకులోనూ గిరి గాడిని మర్డర్ చేసి జైలుకి వెళ్ళాలి అన్నంత కోపం వచ్చింది సురేష్ గాడికి...
కొంచెం దూరం వెళ్ళగానే...ఓ పెద్ద భయంకర ఆకారం...డైనోసార్ అంత ఎత్తు...ముగ్గురూ ముఖముఖాలు చూసుకున్నారు..గిరిగాడు టార్చ్ లైట్ అటువైపు ఫోకస్ చేసాడు...పరిశీలించి చూడగా అదొక మర్రి చెట్టు అని అర్థమయ్యి ఊపిరి పీల్చుకున్నారు...
ఇంతలోనే.....
పెద్ద కేక...
వాళ్ళ గుండెలు ఆగినంత పని అయ్యింది..
వెనక్కి తిరిగి చూసారు..అంతే కోయ్యబోమ్మల్లా నిల్చుండిపోయారు ముగ్గురూ.......

[తరువాయి భాగం త్వరలోనే పోస్ట్ చేస్తాను....] [ఇది పూర్తి కల్పిత కథ...జస్ట్ ఎంజాయ్ ది షార్ట్ కట్.. :) ]

 

Sunday, 25 April, 2010

ప్రేమంటే....ఏమిటంటే.....???????


"నాకు బ్రతకాలని లేదు...." హారతి ఏడుస్తుంది ఫోన్ లో...."ప్రశాంత్ లేకుండా నేను ఉండలేను....మా ఇంట్లో నా పరిస్థితి నరకం కన్నా ఘోరంగా ఉంది..."
ఆమెకు ఏమి చెప్పి ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు...
"ఏమి కాదులే...బాధపడకు...everything will be fine.." అని మాత్రం చెప్పగలిగాను....

హారతి అతన్ని ప్రేమిస్తున్న సంగతి వాళ్ళ నాన్నకి తెలిసిపోయింది...వాళ్ళ నాన్న సి.బి.ఐ లో పనిచేస్తున్నాడు...అతనికి వాళ్ళ ప్రేమ విషయం తెలుసుకోవడం అంత కష్టమైన పని కాదు...


అతనికి తన కూతురి మీద ఉన్నది వల్లమాలిన ప్రేమా?? ..లేక తన కూతురు తను చూసిన వాడినే పెళ్లి చేసుకోవాలని అనుకొనే పెద్దరికంతో కూడా అహమా??...లేక తానింకా పసిపిల్లే తన గురుంచే తను చూసుకోలేదు, అలాంటిది తనకు కాబోయే వాడిని తనెలా ఎన్నుకోగలదు అనుకొనే పిచ్చితనమా??..ఏమిటి అతని మనసులో ఉన్నది...??
తన కూతురు ఎవరినో ప్రేమిస్తుందని తెలియగానే, ఆవేశంతో ఊగిపోయే తండ్రులు నూటికి..?? ..ఎంత మంది...??..నూరు ఉండొచ్చేమో...కాదంటారా?...అది వాళ్ళ తప్పు కాదు...తన కూతురు తప్పటడుగులు వేస్తుందేమో అన్న ఆందోళన కావచ్చు కదా??...తన కూతురి ప్రేమ నిజమే అయితే, అది ఆలస్యంగా అయినా అర్థం చేసుకోగలుగుతారు కొంత మంది...మరి కొంత మంది...పట్టిన పట్టు విడువరు...ఇదిగో మా హారతి వాళ్ళ నాన్న లాగా....కాని అతను ఆలోచించేది నిజమే అని నాకు అప్పుడు అనిపించలేదు...కారణాలు బోలెడు.....


"హరీష్ ని ఎంత ప్రేమించానో తెలుసా నీకు...తన ఆలోచనలు ఒక్క క్షణం కూడా నను వీడిపోయేవి కాదు..నా చిన్ని ప్రపంచంలో అతనే నిండిపోయాడు..తన సంతోషం కోసం ఏదైనా చేసేయ్యాలన్నంత ప్రేమ నాలో నిండిపోయింది తన కొరకు...తనతో గడిపిన ప్రతి క్షణం నాకొక వరం..తన పరిచయం నాకు క్రొత్త లోకం చూపించింది..ఆ లోకంలో సంతోషం తప్పఇంకేమీ లేదు..కాని...జీవితంలో చీకటి అంటే ఏమిటో నాకు ఆ తర్వాతనే తెలిసొచ్చింది...." ఆమె గొంతులో ఏదో అడ్డు పడ్డట్టు ఉంది ఆమె స్వరం..... 

"హారతి......" అంటూ ఏదో చెప్పబోయాను...మళ్ళీ ఆమె...
"పక్క షాప్ కి వెళ్ళినా నాకు మెసేజ్ ఇచ్చేవాడు...అలాంటిది...రెండు వారాలు తన దెగ్గర నుంచి కాల్స్ కాని మెసేజెస్ కాని లేవు...పిచ్చెక్కింది నాకు...ఏమి చెయ్యాలో అర్థం కాలేదు..ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు..వాళ్ళ ఇంటి ల్యాండ్ లైన్ కి కాల్ చేస్తే వాళ్ళ చెల్లి చెప్పింది తను నాగపూర్ వెళ్ళాడు అని...ఎందుకో తెలియలేదు..ఉండబట్టలేక ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని తన కాలేజీకి వెళ్లాను....తను అక్కడే ఉన్నాడు...." ఆమె చెప్పడం ఆపేసింది...కాసేపు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం...అది భరించడానికే కష్టంగా ఉంది...


"అతని దెగ్గరికి వెళ్లి నేను చచ్చిపోయాను అనుకున్నావా అని అడిగాను కోపంగా...అతనేమో ఏంటి కాలేజీకి వచ్చి ఈ గోల ఇంటికి వెళ్ళు సాయంత్రం నేను ఫోన్ చేస్తాను అని చెప్పాడు...నాకెందుకో వెళ్ళ బుద్ది కాలేదు...చెప్పు ఏమైపోయావ్ ఇన్ని రోజులు...నువ్ ఒక్కరోజు నాతో మాట్లాడకపోతేనే నేను మనిషిని కాను అని తెలుసు కదా..ఇన్ని రోజులు నాతొ మాట్లాడకుండా ఎందుకు ఇలా చంపుతున్నావ్ నన్ను...ఏమైందో చెప్పురా...ప్లీజ్..అని బ్రతిమాలుకున్నాను...అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు...నేను కొయ్య బొమ్మలా అలానే నిల్చున్నాను...


అంతా తలకిందులు అవుతున్నట్లు..ఏదో బలంగా నన్ను కిందకి తోక్కేస్తున్నట్లు అనిపించిది...అక్కడే ఉన్నాను చాలాసేపు తను వస్తాడేమో అని...కాని తను రాలేదు...ఇంటికి వచ్చాను...కానీ ఏదో చిన్న ఆశ తను నాకు ఫోన్ చేస్తాడని...రెండు రోజుల తరువాత తన ఫోన్

'ఎలా ఉన్నావ్ హనీ' అన్నాడు.. .ఆ మాట వినగానే ఎక్కడలేని సంతోషం నాలో రెక్కలుకట్టుకు వాలింది..తన మాట నా గుండెని తాకి పెదవుల్లో చిరునవ్వై పూసింది..'నీకోసం పిచ్చిదానిలా ఎదురు చూస్తున్నాను రా...అన్నం తిని మూడు రోజులు అయింది కన్నా...నువ్వు తినిపిస్తేనే తింటాను లేకపోతే తినను...' గోముగా అన్నాను...'పిచ్చా నీకు...అలా తినకుండా ఉన్నావంటే నా మీద ఒట్టే చెప్తున్నా...నా బంగారం కదూ..వెళ్లి తిను ముందు..ఇప్పటికిప్పుడు నేను తినిపించలేను కదా.' అనేవాడు మాములుగా....కాని అతను అప్పుడన్న మాటకి నా గుండె పగిలిపోయింది...ఏడవడానికి కన్నీళ్ళు కూడా లేవు నా ఎండమావి ఎదలో..'ఇంకెప్పుడు నాకోసం ఎక్కడికీ రాకు...నేను నీతో మాట్లాడే ఆఖరి మాటలు ఇవే...నేను నీతో బ్రేక్ అప్ చేసుకుంటున్నా..అల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్..'అన్నాడు..అంత షాక్ లోనూ అడగగాలిగాను 'ఎందుకు' అని...'ఐ హావ్ గాట్ ఎ బెటర్ గర్ల్ ఫ్రెండ్' అన్నాడు...ఫోన్ పెట్టేసాడు.

ఒక్కసారిగా జీవితంలో చీకటి అంటే ఏమిటో తెలిసింది...అంత మాట అన్నాకూడా తన మీద నాకు ఎందుకో కోపం రావడం లేదు....నన్ను నేనే శిక్షించుకున్నాను..ప్రపంచంతో సంబంధాలు తెంపుకున్నట్లు నన్ను నేనే ఒక రూంలో బందించుకున్నాను..చావు కోసం ఎదురు చూస్తున్న దానిలా బ్రతికాను...మా నాన్న నన్ను ఎంతో ఓదార్చాడు...'నేను మీ అమ్మ చచ్చిపోయాం అనుకున్నావా తల్లి' అన్నాడు..నేను ఏడ్చేసాను  " అంది....
"మరి ప్రశాంత్..???" అడిగాను నేను....


***********************
'ఈ రోజు ప్రశాంత్ ఇంకా కాల్ చెయ్యలేదు రా..' అంటూనో లేక 'నేను ఎన్నిసార్లు కాల్ చేసినా ప్రశాంత్ కట్ చేస్తున్నాడు ఎందుకోరా..' అంటూనో బాధగా మెసేజెస్ ఇస్తుంటుంది హారతి..మళ్ళీ మరుక్షణమే 'ప్రశాంత్ కాల్ చేసాడురా..యాం సో హ్యాపీ' అని మెసేజ్ ఇస్తుంది...'ప్రశాంత్ ఊరికే తిడుతుంటాడురా..కానీ వాడంటే చాలా ఇష్టం ఏంటో...నేను ఈ రోజు బ్రతికి ఉన్నాను అంటే అది ప్రశాంత్ వల్లే' అంటుంది...'ప్రశాంత్ కి కాల్ వెయిట్ వస్తే నచ్చదురా...నిన్న నీతో ఫోనులో మాట్లాడుతున్నపుడు తన కాల్ వెయిట్ వచ్చింది..నైట్ తిట్టాడు ఎవరితో మాట్లాడుతున్నావ్ అని...నేను నీ గురించి చెప్పాను..నన్ను బాగా తిట్టాడు...ఇంకెప్పుడు నీతో టచ్ లో ఉండొద్దు అన్నాడురా...' అంది...'నీ మీద తనకు నమ్మకం లేదా ఆమాత్రం..'అన్నాను...'అలా అని కాదు వాడికి ఇలా నేను అబ్బాయిలతో మాట్లాడటం నచ్చదురా..ఏమనుకోకు రేపటి నుంచి నీకు కాల్ చెయ్యను...కానీ మెసేజెస్ ఇస్తుంటాను' అంది...నేను నీ ఇష్టం అని చిన్నగా నవ్వాను

హరీష్ తో బ్రేక్ అప్ అయ్యాక డిప్రషన్ లోకి వెళ్ళిన హరతికి ఏదో రాంగ్ కాల్ తో పరిచయం అయ్యాడు ఢిల్లీలో ఉండే ప్రశాంత్..మెల్లిగా తనతో మాట్లాడటం మొదలుపెట్టింది హారతి...తన కథ మొత్తం అతనికి చెప్పాక అతని వద్ద ఆమెకి కావలసిన ఓదార్పు లభించింది..రోజు అతనితో మాట్లాడటంతో ఆమెకి ఎంతో తేలికగా అనిపించేది...మెల్లి మెల్లిగా మామూలుగా అయింది హారతి..ప్రశాంత్ కాల్ కోసమే ఎదురు చూస్తూ అతను కాల్ చేసినప్పుడల్లా బోలెడు ముచ్చట్లు చెప్పేది అతనికి...ఒకానొకరోజు ఆమెకి ప్రోపోస్ చేసాడు ప్రశాంత్...ఎండమావిలో అమృతంలా దొరికిన అతని స్నేహాన్ని వదులుకోలేక అతనికి తన సమ్మతిని తెలియచేసింది....


ఒకసారి ప్రేమ విఫలం అయ్యి జీవచ్చవంలా బ్రతికిన తన కూతురు ఇప్పుడిప్పుడే మాములు మనిషి అవ్వడం అతనికి సంతోషం కలిగించింది...అలాంటి ప్రేమ జోలికి మరొకసారి తన కూతురిని వెళ్ళనివ్వకూడదు అని ధృడంగా నిశ్చయించుకున్నాడు ఆ తండ్రి...ఎందుకంటే ఆమెని ఆ విధంగా చూసిన ఆ తండ్రి గుండె ఆమె కంటే పది రెట్లు ఎక్కువ క్షోభ పడింది అనే విషయం వేరే చెప్పాలా ??

తదనుగుణంగానే ఆమె ప్రతి కదలిక ఎంతో శ్రద్దగా గమనించాడు ఆయన...అప్పటికే సమయం మించిపోయింది అని అతనికి తెలిసిపోయింది..తన కూతురు ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తుంది అని తెలుసుకున్నాడు..తన కూతురు జీవితం ఎమైపోతుందా అనే భయం అతన్ని వెంటాడింది,..అతని పేరు ప్రశాంత్ అని..ఢిల్లీలో ఉంటాడు అని..ఇంతవరకు వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు అని తెలిసి తన కూతురు ఒకడిని ఇంత గుడ్డిగా ఎలా నమ్ముతుంది అని కంగారుపడ్డాడు.

అతని నెంబర్ కి కూతురికి తెలియకుండా కాల్ చేసి 'నా కూతురిని వదిలెయ్యి...ఇప్పటికే చచ్చిబ్రతికింది..వాడెవడో ప్రేమించాను అని చెప్పి వెంట తిప్పుకొని వదిలేసాడు..మళ్లీ అదే జరిగితే నా కూతురు గుండె కంటే ముందు నా గుండె ఆగిపోతుంది...నా కూతురి జీవితంలో నుంచి వెళ్ళిపో దయచేసి..' అని అతన్ని వేడుకున్నాడు..'మేము ప్రేమించుకుంటున్నాం...మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'అంటూ అతను ఫోన్ పెట్టేసాడు..అదే విషయం హరతికి చెప్తూ 'మీ నాన్న ఇలా నాకు కాల్ చేసాడు..what kind of father do u have??..i wont tolerate these things anymore.."అన్నాడు..."ప్రశాంత్ అయాం సారీ రా..నాకు ఈ విషయం తెలీదు...అయన ఒక పాగల్ లా బిహేవ్ చేస్తాడు అనుకోలేదు..I will make sure these things will not repeat again, trust me darling"  అందామె...

"నాన్నా ప్రశాంత్ కి మీరు కాల్ చేసారా ?"
"అవును..."
"అలా చెయ్యడానికి మీకు ఏం హక్కు ఉంది..??"
"ఏ హక్కుతో నా కూతురిని ఇన్నాళ్ళూ పెంచానో..చదివించానో..అదే హక్కుతో..."
"నేను ఈ రోజు ఇలా బ్రతికి ఉన్నాను అంటే అది ప్రశాంత్ వల్లనే...ఇలా నేను ఉండాలి అని మీరు అనుకొంటే, ఇంకెప్పుడు తనకి కాల్ చేసి విసిగించకండి.."
"ఇంటర్ లో 96% వచ్చింది నీకు...కాలేజీ టాపర్ వి...కానీ ఇప్పుడు డిగ్రీ కూడా మానేసి ఇంట్లో కూర్చున్నావ్..ఫ్యూచర్ గురుంచి ఆలోచించావా??"
"ప్రశాంతే నా ఫ్యూచర్...."
"అడ్డదిడ్డంగా మాట్లాడితే కాళ్ళు విరగొట్టి ఇంట్లో కుర్చోబెడతా..."
"ఆ పని చెయ్యండి...అప్పుడే కదా మీకు మనశ్శాంతి...ఛీ ఈ ఇంట్లో నా బ్రతుకు హీనంగా తయారయ్యింది...ప్రశాంత్ కి జాబ్ వచ్చాక మీరు ఉండమన్నా నేను ఉండను ఈ ఇంట్లో..."

ఆ మాట ఆ తండ్రిని నిలువెల్లా కుదిపేసింది...

ఆ తర్వాత కొన్ని రోజులు హారతి దెగ్గర నుంచి నాకు ఎటువంటి మెసేజ్ రాలేదు...
సడన్ గా ఒక రోజు కాల్ చేసింది...
"ఏమైపోయావ్ ఇన్ని రోజులు...." అడిగాను
"ఒకటి చెప్తాను...ఏమనుకోవు కదా" అంది
"ఏంటి...."
"నేను ఢిల్లీ వెళ్లాను....ఈ రోజే వచ్చాను..." అంది...
"ఢిల్లీనా..??." ఆశ్చర్యంగా అడిగాను,,,
"సడన్ గా తను కాల్ చేసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నాఈవెనింగ్, ఢిల్లీ కి వచ్చేసెయ్యి అన్నాడు...అంతే...వెళ్లాను " అంటూ చాలా తేలికగా చెప్పింది..
"ఏమైనా పిచ్చెక్కిందా..అలా ఎలా వెళ్ళావ్??..కొంచెం కూడా ఆలోచించలేదా??...ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు నువ్వు వెళ్ళడానికి.." అన్నాను
"అడిగితే కదా ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడంలాంటివి జరిగేది....చెప్పకుండా వెళ్లాను.." అంది
"చెప్పకుండా నాలుగు రోజులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావా...మీ పేరెంట్స్ గురుంచి ఒక్క సెకండ్ ఆలోచించలేదా?" అన్నాను ఇంత తెగింపు ఎక్కడనుంచి వచ్చిందా అనుకుంటూ..
"పేరెంట్స్ లా బిహేవ్ చెయ్యని వాళ్ళ గురుంచి ఎందుకు ఆలోచించడం...ప్రశాంత్ కోసం నేను ఏమైనా చేస్తాను..." అంది
"మీ నాన్న ఏమన్నాడు ??.."
"కొట్టాడు...అంత కన్నా ఏం తెలుసు ఆ మనిషికి..."
"ఇలా వెళ్లావు అని నలుగురికీ తెలిస్తే పాపం మీ నాన్న పరువపోతుంది కదా??...కొంచెం ఆలోచించాల్సింది హారతి." అన్నాను
"ఏమోలే...అయిపొయింది కదా...బట్ యాం సో హ్యాపీ తనని కలసినందుకు..స్వీట్ మొమెంట్స్ విత్ హిం..." అంది...

తను ఢిల్లీ నుంచి వచ్చిన కొన్ని రోజుల దెగ్గర నుండి ప్రశాంత్ లో చాలా మార్పు గమనించింది హారతి...
"వాడేంటో ఇంతకముందులా లేడురా...ఊరికే చిరాకు పడుతున్నాడు..కాల్ చేస్తే చాలా సార్లు కట్ చేస్తున్నాడు...నైట్ టైమ్స్ తన సెల్ కి కాల్ వెయిట్ వస్తుందిరా..." అంటూ ఏడ్చింది...

అలా రోజూ ఏదోకటి చెప్తూనే ఉంది కాని తను ఒక రోజు చెప్పిన మాట నన్ను నిలువునా కృంగదీసింది...తన మీద జాలి..తను ఏమైపోతుంది అన్న భయం కలిగాయి నాకు...

************************ రెండేళ్ళ తరువాత ************

హరితి పెళ్లి మండపం వైభవంగా ఉంది...
వాళ్ళ నాన్న వచ్చే అతిథులను పలకరించడంలో బిజీగా ఉన్నాడు...తన ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేస్తున్న పెద్దరికం అతనిలో ఉట్టిపడుతుంది..అందుకేనేమో పెద్దలు తమ పిల్లల పెళ్ళిళ్ళు తమ చేతుల మీదనే జరిపించాలని ఆరాటపడుతుంటారు...అందరు పిల్లలు తమ పెద్దలకి ఆ గౌరవం అప్పజేపితే ఎంత బాగుంటుంది...అప్పుడిక ఈ 'ఆర్య సమాజ్' పెళ్ళిళ్ళు...రిజిస్టర్ పెళ్ళిళ్ళు ఉండవు...పెద్దలు తల ఎత్తుకొని పెళ్లి జరిపించే పెళ్లిళ్ళే ఉంటాయి..
హారతి ముస్తాబు అవుతుంది...రెండేళ్లలో ఎంత మార్పు...అన్ని రకాలుగా గొప్పగా పరిణతి చెందిన అమ్మాయిని ఆమెలో చూస్తున్నాను అప్పుడు నేను..
"హాయ్ కిషెన్...మొత్తానికి పెళ్ళికి వచ్చావ్...డుమ్మా కొడతావేమో నీ డ్రమ్ము పగలకొడదాం అనుకున్నా.." అంటూ గలగలా నవ్వుతున్న తను చూడ ముచ్చటగా ఉంది...
"మీ ఆయన ఎక్కడ?" అడిగాను
"అదిగో అక్కడ బ్లూ షర్టులో ఉన్నాడు కదా...తనే........ప్రశాంత్ " అంది
"మొత్తానికి పేరు మాత్రం మారలేదే....ప్రశాంత్ అగైన్...." అంటూ నవ్వాను
"ఒరేయ్ షట్ అప్...ఆ ప్రశాంత్ మాట ఎత్తకు....ఏం చేద్దాం ఈయన పేరు కూడా ప్రశాంత్ అయి కూర్చుంది...అందుకే పేరు మార్చుకుంటేనే ఫస్ట్ నైట్ అని చెప్పేసా.." అంది నవ్వుతూ.


***************************************************************

P.S : ఆ రోజు హారతి నా దెగ్గరికి వచ్చి "ప్రశాంత్ ఒక కండిషన్ పెట్టడురా..రెండేళ్ళు మేము మాట్లాడుకోకుండా ఉండాలంట..ఈ టైం లో కెరీర్ మీద ద్రుష్టి పెట్టాలంట..రెండేళ్ళ మన ప్రేమ తగ్గకుండా ఉంటేనే పెళ్లి చేసుకుందాం అన్నాడు రా " అంది..
హారతిని చూస్తె జాలి వేసింది..ఏదైనా ముఖం మీదే చెప్తుంది కాని చాలా అమాయకురాలు...వాడి దీన్ని వదిలించుకోవాలని చూస్తున్నాడని నాకు అర్థం అయింది...
"నువ్వేమన్నావ్ ?" అన్నాను
"నేనేమంటాను...వాడు ఏది ఆంటే నేను దానికి అభ్యంతరం చెప్పను...కాని రెండేళ్ళు నా వల్ల కాదురా.." అంటూ మళ్లీ ఏడుపు మొహం పెట్టింది...
ఈలోపు వాళ్ళ నాన్న ఊరుకుంటాడా దాన్ని బలవంతంగా ఆస్ట్రేలియా పంపాడు హయ్యర్ స్టడీస్ కి...
ఒక ఇయర్ దాకా నో కాంటాక్ట్ నాకు తనకి...
ఓ రోజు కాల్ చేసింది "నేను ఇండియా వస్తున్నా వచ్చే వారం...నిన్ను మీట్ అవుతాను.." అంది
"అది సరే...ప్రశాంత్ ఎమన్నా కాల్ చేసాడా నీకు మళ్ళీ " అడిగాను ఉండబట్టలేక
"లేదు...హి ఇస్ ఏ చీట్..పైగా నాకిప్పుడు వాడి మీద అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు...ఇక్కడి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా ...సరే వచ్చాక కలుస్తా " అంటూ పెట్టేసింది ...

అంతా బాగానే ఉంది కాని నాకు బేసిక్ కోస్చేన్ కి సమాధానం దొరకలేదు ...అదే..అసలు "ప్రేమంటే ఏంటి ??"..."ప్రేమంటే....ఏమిటంటే.....???????"

 

Thursday, 1 April, 2010

ఆపరేషన్ : ఆరు వేల కోట్లు via నడిమంత్రపు సిరి పాలసీ


"...కానీ... విషయం మన ముగ్గురి మధ్యనే ఉండాలి....." చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు శీనుగాడు ఫోన్ లో...
"అలాగేలే...ఎందుకు మరీ అంత చిన్నగా చెప్తున్నావ్...పక్కన ఎవరయినా ఉన్నారా ఏంటి..." అడిగాను నేను...
"లేరు...కాని గోడలకు కూడా చెవులు ఉండొచ్చు...ఇప్పుడు ఈ విషయం నాలుగో ప్రాణికే కాదు , దేనికీ తెలియకూడదు..." దాదాపు గుసగుసగా చెప్తున్నాడు
"ఒరేయ్ ప్రాణికి కాకుండా ఇంకా దేనికి తెలుస్తుంది రా..." వాడి స్టేటుమెంట్ పూర్తిగా అర్థంకాక అడిగాను...
"క్వశ్చన్స్ వెయ్యకు....టెన్షన్ లో ఉన్నా...చెప్పింది ఫాలో అవ్వు..."
"అచ్చా..అసలు విషయం ఏంటి...ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి??..."
"అది నేను ఇక్కడ చెప్పను, మన ఫోన్ ఎవరన్నా టాప్ చెయ్యొచ్చు.....సో లెట్స్ మీట్ ఎట్ గోల్కొండ షార్ప్ సిక్స్ పి.ఎం "..................

************* కొద్ది నిముషాల ముందు *****************

హైదరాబాద్ కి ఆ రోజు ఉదయమే వచ్చాను...ఇంటికి వచ్చీ రాగానే బెడ్ మీద వాలిపోయాను కుంబకర్ణుడిని గుర్తుతెచ్చుకుంటూ...
అసలే ట్రైన్ లో ఆర్.ఏ.సి కంఫాం కాక రాత్రంతా ఆ బెర్త్ మీద కూర్చొని వచ్చేసరికి తాతల ముత్తాతలు కనిపించారు...పైగా నా ఆర్.ఏ.సి భాగస్వామి మొదట్లో బెర్త్ మీద కూర్చొని తర్వాత అక్కడే ముడుచుకొని పడుకొని మెల్లి మెల్లిగా బెర్త్ లో ఎనభై శాతం ఆక్రమించుకున్నాడు....సొంత గడ్డని బ్రిటిష్ వాడు ఆక్రమించుకున్నప్పుడు సగటు భారతీయుడికి వచ్చినంత కోపం వచ్చింది నాకు అప్పుడు...
"హలో బాస్ ఆర్.ఏ.సి అంటే ఈ బెర్త్ లో సగం నాది కూడా....మీరు ఇలా పడుకుంటే నాకు కూర్చోడానికే కష్టంగా ఉంది..." అన్నాను అతన్ని తట్టి లేపుతూ...
"ఓహ్ సారీ బాస్...ఒక పని చేద్దాం...మీరు అటు తల పెట్టుకొని పడుకోండి, నేను ఇటు తల పెట్టుకొని పడుకుంటాను..." అన్నాడు ...'ఎడం కాలితో తంతే ఎగిరిపోతావ్ రోయ్ బక్కోడా...' అని అందాం అనుకోని "అలా నాకు చాలా అసౌకర్యంగా ఉంటుంది మాష్టారు...." అన్నాను.."సరేలెండి నాకు చాలా నిద్ర వస్తుంది నేను ఎలాగో సర్దుకొని  పడుకుంటాను.." అని చెప్పి అప్పటికి ముడుచుకొని పడుకొని మళ్లీ మెల్లి మెల్లిగా ఆక్రమించుకున్నాడు... ఇలాంటి భారతీయ బ్రిటిషర్స్ ఉన్నంత కాలం నాలాంటి కమల్ హసన్ టైపు భారతీయుడికి పోరాటం తప్పదు..నాకో భీభత్సమైన ఐడియా వచ్చి "మాష్టారు ఓ సారి లేవండి.." అన్నాను..."మళ్ళీ ఏమైంది మాష్టారు..." అన్నాడు వాడు ఆవలిస్తూ.."నాకు ఇలా కూర్చోడం ఇబ్బందిగా ఉంది..ఈ బెర్త్ ని సగానికి ఫోల్డ్ చేద్దాం...నా పార్ట్ లో నేను కుర్చుంటాను...మీ పార్ట్ లో మీరు పడుకోండి..దోర్లండి..ఏమైనా చెయ్యండి...నాకేం ప్రాబ్లం లేదు.." అన్నాను...అంతే దెబ్బకి బిక్క మొహం వేసాడు...లేకపోతే నాతొ పెట్టుకుంటాడా??...

శీను గాడి ఫోన్ తో మెలుకువ వచ్చింది..టైం మధ్యాహ్నం 2 అయింది..అమ్మో ఇంతో సేపు నిద్రపోయానా అనుకుంటూ "ఏంట్రా.." అన్నాను విసుగ్గా ఫోన్ లో...
"ఆరువేల కొట్లలో నీకు రెండు వేల కోట్లు ఇస్తాను....కావాలా వద్దా??" అన్నాడు..
నాకు ఒక్కసారిగా దిమ్మ తిరిగి...మైండ్ బ్లాకు అయ్యి...షట్ డౌన్ అయ్యి...రీస్టార్ట్ అయ్యి..మళ్ళీ షట్ డౌన్ అయ్యింది....కొయ్య బొమ్మలా అలాగే ఫోన్ పట్టుకొని ఉన్నాను..
'వీడికి మైండ్ దొబ్బిందా...లేక నాకు మైండ్ దొబ్బి ఏవేవో వినిపిస్తున్నాయా..లేకా ఇదంతా అబద్దమా నేను ఇంకా పడుకొని కలగంటున్నానా...అయినా నా కలలో ఇందాకే నేను ఉజ్జయిని రాజకుమారితో డ్యూయెట్ వేసుకొని..కళింగ రాజకుమారితో 'టెన్ డౌనింగ్ స్ట్రీట్' పబ్ డేట్ కి వస్తానని చెప్పి..ఆకాశ మర్గాన భాగ్యనగరం చేరుకోబోతున్నాను కదా...మధ్యలో వేరే కల సడన్ గా అనధికారిక ఎంట్రీ ఎలా ఇచ్చింది...ఇలా నా ఆలోచనలు తలా తోకా లేకుండా నడుస్తుండగా...శీను గాడికి చిర్రెత్తి "ఒరేయ్....ఏంట్రా మూగామునిలా ఏమి మట్లాడవ్?" అన్నాడు...
" ఏమి మాట్లాడమంటావురా ...నిద్ర పోతున్న వాడికి ఫోన్ చేసి రెండు వేల కోట్లు ఇస్తాను...కావాలా? అంటే....వాడి మానసిక పరిస్థితి ఏమవుతుంది అని ఆమాత్రం అర్థం చేసుకోకపోతే ఎలారా??" అన్నాను దీనంగా..
"హ హ....విషయం చెపుదామనే ఫోన్ చేసాను రా..."
"అయితే టెన్షన్ పెట్టకుండా అదేంటో త్వరగా చెప్పరా బాబు..." అన్నాను..
"చెప్తాను...కానీ... విషయం మన ముగ్గురి మధ్యనే ఉండాలి....." చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు శీనుగాడు ఫోన్ లో...

******************************************

సమయం :సాయంత్రం  6 గం.లు
ప్రదేశం : గోల్కొండ

శీను గాడు మధ్యలో...నేను కుడిప్రక్కన తూర్పు దిక్కున తిరిగి...సునీల్ గాడు ఎడమప్రక్కన పడమటి దిక్కున తిరిగి నిల్చున్నాం...ఏదన్నా ముఖ్యమైన విషయం ముగ్గురు మాట్లాడుకొనేటప్పుడు ఈ విధమైన త్రికోణ ఆకృతి కలిగిన భంగిమలో ముగ్గురూ నిల్చొని చర్చించుకోవాలని ఈ విధమైన సెట్ అప్ చేసాడు శీను గాడు...
"నాకు త్వరలో ఆరు వేల కోట్లు రాబోతున్నాయి...అందులో మీరు ఇద్దరు నా ప్రాణ స్నేహితులు కాబట్టి మీ ఇద్దరికీ చెరో రెండు వేల కోట్లు ఇస్తాను...ఈ విషయం బైట ఎవరికీ పొక్క కూడదు.." అన్నాడు రహస్యంగా...
నాకు వెంటనే 'స్నేహమేరా జీవితం...స్నేహమేరా శాశ్వతం..' అనే పాట గుర్తొచ్చి..తర్వాత అసలు విషయం గుర్తొచ్చి "అసలు నీకు ఆరు వేల కోట్లు ఎలా వస్తున్నాయిరా??" అడిగాను..
"ఒరేయ్ అంత డబ్బు మనం ఏం చేసుకుంటామురా...ఎన్ని సినిమాలు తీసి ఫ్లాపులు అయినా పెద్దగా నష్టం అనిపించదు.." అన్నాడు సునీల్ గాడు పదవ ప్లాప్ కి రెడీ అవుతున్న పాపిష్టి ప్రొడ్యూసర్ లా..
"A B C  లేదు 1 2 3 లేదు పక్కింటి పంకజం కూతురు పార్వతి మెల్టన్ అన్నాడుట నీలాంటి వాడొకడు...ముందు ఆ ఏబ్రాసి గాడిని విషయం చెప్పనివ్వు.." అన్నాను
"చెప్తాను...నాకు ఆరు వేల కోట్లు రాబోతున్నట్లు అధికారికంగా తెలిసింది...ఇలాంటి అదృష్టం అంత ఈజీగా ఎవరికీ దక్కదు...ఏ కోట్ల మందిలో ఒక్కడికో దక్కుతుంది..ఆ ఒక్కడు మీ స్నేహితుడు అయినందుకు..మీ దుంపలు తెగ మీరు కూడా అదృష్టవంతులు అయ్యరురా నాలాగా...ఎప్పుడో చిన్నప్పుడు మా నాయనమ్మ నాకు చెప్పింది నా జాతకంలో నాకు నడిమంత్రపు సిరి కలిగే యోగం ఉందని..అది ఇన్నాళ్ళకు ఇలా కలుగుతుంది...అసలు అడ్డంగా సుడి మీద వట్రసుడి ఉంటేకాని ఇలాంటి అదృష్టం పట్టదురా..." అన్నాడు శీను గాడు 'నీ అదృష్టం తగలెయ్య..!!' అని వాడిని వాడు ముద్దుగా తిట్టుకుంటూ...
"ఒరేయ్ కొంచెం అర్థమయ్యేలా చెప్పురా..." అన్నాను
"నాకు ఆరు కోట్లు రాబోతున్నట్లు ఒక అధికారిక లిఖితపూర్వక సమాచారం తెలిసిందిరా....ఆఫ్రికా లో ఆడం జూమ అనే అతనికి ఉన్న ఆరు వేల కోట్ల ఆస్తి నాకు వచ్చేస్తుంది..." అన్నాడు...
"ఆఫ్రికాలో ఆడం జూమ ఆరు వేల కోట్లు నీకు ఇస్తున్నాడా?....ఆడు మీ ముత్తతా?? కొంపదీసి మీ ముత్తాతలు ఆఫ్రికాలో సెటిల్ అయ్యారా?...మా ముత్తాతలు ముప్పావలా ఆస్తి కూడా వెనకేయ్యలేదు, మొత్తం వీధి చివరి చింతామణికి దోచి పెట్టారు అని నువ్వు చెప్పినట్లు గుర్తు.." అన్నాడు సునీల్ గాడు
"నీ మొహం...మా ముత్తాతలకు అంత సీన్ లేదు...అసలు ఆ ఆడం జూమ ఎవడో కూడా నాకు తెలీదు ...కాని ఆడి ఆస్తి మొత్తం నాకు వస్తుంది...అదే నడిమంత్రపు సిరి అంటే...ఆడు ఆడి ఫ్యామిలీ తో సహా ఆక్సిడెంట్ లో చచ్చాడంట ..ఆడి ఆస్తి మొత్తం బ్యాంకు లో దాచుకున్నాడట..ఆ బ్యాంకు వాళ్ళు ఆ అనాధ ఆస్తిని ఒక గొప్ప అదృష్టవంతుడికి కట్టబెట్టాలని నిర్ణయించుకొని నాకు ఒక లేఖ రాసారు...వాళ్లు అలా నాకు అంత ఆస్తి కట్టబెట్టుకొవాలనుకోవడం నాకేమి ఆశ్చర్యం అనిపించలేదు...చెప్పాగా  సుడి మీది వట్రసుడి అండ్ నడిమంత్రపు సిరి పాలసీ అని..." అన్నాడు
మాకు ఏమి మాట్లాడాలో తెలియక కోయ్యబోమ్మల్లా నిల్చుంటే...ఆడే మళ్ళీ "అసలు ఆ ఆడం జూమ గాడు నాకు ఏదో జన్మలో బాకీ ఉన్నట్లు ఉన్నాడురా...ఈ జన్మలో తీర్చుకుంటున్నాడు పాపం...అయినా నేనొక పని చేద్దాం అనుకుంటున్నానురా...పాపం అంత కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తం నాకు కట్టబెట్టి పైలోకంకి వెళ్ళాడు కదా...అందుకే నా వాటాలోనుంచి ఒక పది కోట్లు ఏదైనా చారిటికి వాడి పేరు మీద డొనేట్ చెయ్యాలని నిర్ణయించుకున్నానురా..." అన్నాడు మా వైపు చూసి...
 'కైలాస శిఖరాన కొలువైన స్వామీ..నీ కంట పొంగేనా గంగమ్మ తల్లి..మనసున్న మంచోళ్ళే మారాజులు..మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు...రాజువయ్యా...మహరాజువయ్యా...'అంటూ మేము ఇద్దరం ఒకేసారి సాంగ్ వేసుకున్నాం..
"ఒరేయ్ ఆ లేఖ దాని వివరాలు మాకు చూపించురా.." అన్నాను నేను...
"అలాగే ఈ రోజు అర్దరాత్రి కి మా ఇంటి నుంచి నా లాపికి వై.ఫై ఆక్సెస్ దొరుకతుంది..ఆ టైం లో నేను నా లాపి నుంచి వై.ఫై ద్వారా నెట్ కనెక్ట్ చేసి ఆ లేఖ మీకు చూపిస్తా...నా లాపి నుండి నా నెట్ కనెక్షన్ ద్వారా చూపించొచ్చు...కానీ ఎవరయినా ట్రేస్ చేసే ప్రమాదం ఉంది...అందుకే ఈ లాజిక్...సో ఈ రోజు అర్థ రాత్రికి మా ఇంట్లో కలుద్దాం.." అన్నాడు..


***********************

సమయం : అర్థ రాత్రి 12 గం.లు
ప్రదేశం : కూకట్పల్లిలో శీను గాడి ఇల్లు

ఇంట్లో లైట్స్ అన్ని ఆపేసి..కాండిల్ వెలిగించి..లాపి ఓపెన్ చేసి..వై.ఫై కనెక్ట్ చేసి...మెయిల్ ఓపెన్ చేసాడు...అంతా చదివాం..ఒక పది సార్లు చదివాం ఇద్దరం...ఆంతా వాడి చెప్పినట్లే ఉంది...ఏంటో నమ్మశక్యం కాలేదు...
"ఇప్పుడు మనం ఎలా ప్రొసీడ్ అవుదాం..." అడిగాను నేను...
"ఇక్కడ ఇచ్చిన నంబర్స్ కి కాల్ చేసి...మన అకౌంట్ డీటైల్స్ ఇవ్వాలి..ఇంకా వాళ్ళు ఎమన్నా ఇన్ఫర్మేషన్ అడిగితే, అది ఇవ్వాలి...అంతే తర్వాత కొన్ని రోజులకి మన అకౌంట్ లో ఆరు వేల కోట్లు....ఆ నెంబర్ కి రేపు మధ్యాహ్నం 2 : 39 ని.ల కు కాల్ చెయ్యబోతున్నాను...అది పంతులుగారు పెట్టిన ముహూర్తం.." అన్నాడు శీనుగాడు

నాకు ఈ వ్యవహారం మొత్తం ఏదో తేడాగా అనిపించింది..అదే వాడికి చెప్పాను...వాడు నమ్మలేదు నా మాట...తర్వాతి రోజు నేను ఇంటికి వచ్చి అమెరికాలో ఉన్న మా అన్నయ్యకి విషయం చెప్పగా "అది మొత్తం పెద్ద ఫ్రాడ్...అలాంటి ఫ్రాడ్ లో చాలా మంది చిక్కుకొని చాలా నష్టపోయారు...శీనుకి వెంటనే చెప్పు ఈ విషయం..ఎవరికీ కాల్ చేసి ఏ డీటైల్స్ ఇవ్వవద్దని చెప్పు...కావాలంటే ఇలాంటి ఈ-మెయిల్ ఫ్రాడ్స్ గురుంచి గూగుల్ లో వెతుకు బొచ్చెడు దొరుకుతాయి" అని చెప్పాడు...

నేను వెంటనే శీను గాడికి విషయం చెప్పాను...వాడు నమ్మలేదు..."నా నడిమంత్రపు సిరి మీద నీకు కుళ్ళు... సుడి మీద వట్రసుడి ఉన్న వాడికి ఇలాంటివి జరుగుతుంటాయి...మీ అన్నయకి ఆ విషయం తెలీదు...ఒరేయ్ నీకు రెండు వేల కోట్లు కావాలా వద్దా??" అంటూ ఆర్గుమెంట్ కి దిగాడు వాడు...

 (పరి పరి విధాలా చెప్పిన పిమ్మట...గూగుల్ లో ఎన్నో సాక్ష్యాలు చూపించిన అనంతరం...మన వాడికి అది ఫ్రాడ్ అని కొద్ది కొద్దిగా అర్థం అయ్యింది) 
      
****************

"సో ఫ్రాడ్ అని తెలిసిందిగా...ఇప్పుడు ఏమంటావ్?" అడిగాను...
"ఏముంది...నా నడిమంత్రపు సిరికి ఇంకా టైం రాలేదు..." అన్నాడు
"మీ ఇంటి పక్కన ఉండే సిరి కాలేజీ కి వెళ్ళే టైం మాత్రం అయ్యింది..." అన్నాను
"ఒరేయ్...చెప్పవేంట్రా..." అన్నాడు బైక్ కీస్ తీసుకొని పరిగెత్తుతూ...