Search This Blog

Sunday, 18 July, 2010

కిట్టిగాడు loves ఎదురింటి అమ్మాయి - 3


కిట్టిగాడు సుస్మీకి, ప్రొద్దుటినుంచి బట్టీపట్టి రాసుకున్న పేపర్ జేబులోనుండి బైటకి తియ్యకుండా..ఆ జావా కాన్సెప్టులు మొత్తం గడగడా అప్పజెప్పి సోఫాలో కూలబడ్డాడు ...

"క్రిష్ణ గారు...మీరు చెప్పింది నాకు అస్సలు అర్థం కాలేదు...చాలా డౌట్స్ ఉన్నాయి.." అంది సుస్మిత తెగ బాధపడిపోతూ...
'రాజు గాడు ప్రొద్దున చెప్పిన కాన్సెప్టులని ఇప్పటిదాకా బట్టీపట్టి దీనికి అప్పజెప్పడమే పెద్ద విషయం... పైగా మళ్ళీ దాంట్లో డౌట్లా??..అసలు నాకు అర్థమవుతే కదా దీనికి డౌట్స్ క్లియర్ చెయ్యడానికి...మరేం పర్లేదు,అన్నీటికీ ఆ భగవంతుడే ఉన్నాడు..' అనుకోని...."అసలు నీకు ఏం అర్థంకాలేదు?" అన్నాడు
"ఏమీ అర్థం కాలేదు... ఆవాహం చేసుకోవడం ఏంటీ?...అవతారాలు ఏంటీ??..మా సర్ ఇలా చెప్పినట్లు గుర్తులేదే..!!" అంది..
"అంటే...సుస్మీ...మేము ప్రతీదాన్ని చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తాము కాబట్టి...నీకు అలా సులభంగా చెప్పాను..."
"సులభంగా చెప్తే అర్థం కావలి కదా.." అంది కళ్ళింతవి చేస్తూ...
కిట్టిగాడి చిర్రెత్తింది..... కంట్రోల్ కంట్రోల్ అనుకుంటూ...
"సరే...ఇప్పుడు నీకెలా చెప్పాలంటావ్??.."

"ఒక కాన్సెప్టు తీసుకొని...దాని డెఫినిషన్ చెప్పండి..రియల్-టైం ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వండి..ఒక ప్రాక్టికల్ ప్రోగ్రాం రాసి చూపించండి..అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది..."
కిట్టిగాడికి పాయసం తాగుతుంటే పచ్చిమిర్చి నమిలినట్లు అనిపించింది...మంటగా చూసాడు సుస్మీ వైపు... 'ఇప్పుడెం చెయ్యాల్రా బాబూ.. అంత సీన్ ఉంటే గీతంలో పది కాలాల పాటు స్టూడెంట్ నెం.1 గా వెలిగిపోదును..' అనుకుంటూ..'రాజు గాడికి మళ్ళీ ఫోన్ చేస్తే..ఎస్..ఇప్పుడదే బెటర్..' అనుకొని "సుస్మీ...అలాగే చెప్తాను...దాహంగా ఉంది...కొంచెం కాఫీ ఇస్తావా..?" అన్నాడు..
"కాఫీనా .. లేకపోతే వాటారా?" అంది అయోమయంగా 
"ఏం...మీ ఇంట్లో కాఫీ పొడి లేదా.."
వాడి వైపు ఓ దిక్కుమాలిన చూపు విసిరి "ఉంది..పారబోయలేదు...మీరు దాహంగా ఉంది అన్నారు కదా అని..వాటారా అని అడిగా.."
కిట్టిగాడికి రిటైర్ అయిన అంకుల్స్ అన్నా...సెటైర్ వేసే అమ్మయిలన్నా చిరాకు..
"నాకు దాహం వేస్తే...కాఫీ తాగుతా.." అన్నాడు సీరియస్సుగా..
'వీడెక్కడి తిక్కల బొంత' అనే లుక్కోటి ఇచ్చి కిచెన్ లోకి వెళ్ళింది సుస్మీ...
"తొందరేం లేదు..నిదానంగానే పెట్టు కాఫీ.." అంటూ వాళ్ళింటి బాల్కనీ లోకి వెళ్లి సెల్ తీసి రాజు గాడి నెంబర్ కొట్టాడు..

"హలో..కిట్టిగా...సుస్మీని కాన్సెప్టులతో ఫ్లాట్ చేసి...దాని హార్ట్ లో ఫ్లాట్ కొన్నావా లేదా.." అన్నాడు రాజుగాడు..
"రాజుగా...మనకి టైం చాలా తక్కువుంది..పొద్దున్న చెప్పిన కాన్సెప్టులకి...డెఫినిషన్, రియల్-టైం ఎగ్జాంపుల్, ప్రోగ్రాం..ఇవన్ని నాకొక అయిదు నిముషాల్లో కనుక్కొని చెప్పగలవా??"
రాజుగాడికి  వాడేం వింటున్నాడో అర్థం కాగానే...మైల్డ్ నుంచి స్ట్రాంగ్ దాకా వేరీ అవుతూ కొట్టిన షాక్ నుంచి వెంటనే తేరుకొని "ఓరి కిట్టిగా...నీకు సుస్మీని చూసి చూసి మతి గానీ భ్రమించిందా?.. లేక నేనేమన్నా జావాలో జాతీయ గీతం రాశాననుకున్నావా?..పొద్దున్న నువ్వు చెప్పినవి, ఆడినీ ఈడినీ కనుక్కొనేసరికే రెండు గంటలు అయ్యింది ...ఇప్పుడు నువ్వు చెప్పినవి కనుక్కొని...వాటిని నేను అర్థం చేసుకొని..తమరికి అర్థమయ్యేలా చెప్పాలంటే మినిమం ఒక రోజు పడుతుంది...అసలు ఈ పాటి హోంవర్క్ మన చదువు కోసం మనం చేసుకోనుంటే, గోల్డ్ మెడల్ వచ్చేదేమో"..
"ఒక రోజంటే కష్టం భే...నేను ఇప్పుడు ఆ పిల్ల ఇంట్లోనే ఉన్నా...నువ్వు నాకు చెప్పింది, మక్కీకి మక్కీ చెప్పాను దానికి...ఒక్క ముక్క కూడా అర్థం కాలేదంట...పైగా, రియల్-టైం ఎగ్జాంపుల్ కావలంట.."
"రియల్-టైం ఎగ్జాంపుల్ అంటే ...!!"
"ఏమో ఎవడికి తెలుసు...అది కూడా తెలుసుకొని చెప్పు ..."
"దాన్ని తెలుసుకోడానికి ఇంకొకడిని అడగాలా..రియల్ టైం ..అంటే నిజంగా పనిచేసే టైం ..అంటే, బొమ్మ కాకుండా నిజంగా పనిచేసే వాచ్...అలా నిజంగా పనిచేసే వాచ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈ కాన్సెప్టులు చెప్పమంటుందేమో..."
"వార్నీ...నువ్వు ఎంతైనా మన గ్యాంగులోనే తెలివైనోడివిరా...అయినా వాచ్ ఎందుకురా..ఏకంగా విష్ణుమూర్తినే ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం కదా ..."
"ఎవరి ఇష్టాలు వాళ్లవి...ఆ పిల్లకి వాచ్ అంటే ఇష్టమేమో ..."
"సర్లేగాని ఇప్పుడెలారా..ఓ రోజంటే కష్టం..."
"కిట్టిగా..ఎద్దులా పెరిగావ్...ఆమాత్రం పిల్ల దెగ్గర మేనేజ్ చెయ్యలేవా..." అనేసరికి కిట్టిగాడికి వాడిమీద వాడికే అసహ్యమేసి ఫోన్ పెట్టేసి, దీర్ఘాలోచనలో పడ్డాడు ...

"ఏంటి ఇక్కడ ఉన్నారు ..." అంటూ కాఫీ కప్పుతో వచ్చింది సుస్మిత ...
"ఏం లేదు...వ్యూ బాగుంటే చూస్తున్నా ..." అన్నాడు కాఫీ కప్పు అందుకుంటూ ...
అటువైపు ఎదురుగా ఒక ఆంటీ బట్టలు ఆరేస్తుంది మాగ్జిమం ఎక్సుపోజు చేస్తూ ....
అంతే కిట్టిగాడి వైపు దరిద్రంగా ఓ లుక్కిచ్చింది సుస్మీ ...
కిట్టిగాడికి విషయం అర్థమయ్యి ..."ఛీ ..ఛీ..వ్యూ అంటే అది కాదు ...ఐ మీన్ అస్తమిస్తున్న సూర్యుడు...ఆ ఆకాశం...ఆ నీలి మబ్బులు...ఆ కొబ్బరి చెట్లు..." అంటూ చెయ్యి చాపి చూపిస్తున్నాడు ..."ఎవడ్రా నువ్వు నాకేసి చెయ్యి చూపిస్తున్నావ్ ..."అంటూ వచ్చిన అరుపు ఎటువైపు నుంచి వచ్చిందో అర్థమయ్యేసరికి సెకండులో వందో వంతు టైం కల్లా హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుకున్నాడు..లైట్ గా చెమటలు పట్టాయి కిట్టిగాడికి... సుస్మీ వాళ్ళమ్మ టీవీ చూస్తూ ఇంకా ఏడుస్తూనే ఉంది.. లేడీస్ ఇలా సీరియళ్ళు చూస్తూ ఏడుపు ప్రాక్టీసు చేస్తారేమో అనిపించింది కిట్టిగాడికి ...మెల్లిగా నవ్వుకుంటూ వచ్చింది సుస్మిత కిట్టిగాడి కంగారు చూసి..

"కృష్ణ గారు...దాహం తీరిందా...ఐ మీన్ కాఫీ సరిపోయిందా...ఇంకో కప్పు కావాలా ..?" అంది, వాడు జీవితాంతం గోడకేసి తల బాదుకున్నా అర్థంకాని లుక్కోటి విసిరేస్తూ ...
'జావా అయినా ఈజీగా అర్థం చేసుకోవచ్చేమో కాని, దీని లుక్కుల్లో పరమార్థం అర్థం కావట్లేదురా బాబూ...' అనుకుంటూ "చాలు ...." అన్నాడు...
"కృష్ణ గారు...." అంటూ ఏదో అనబోతుండగా ...
"కాల్ మీ కిట్టూ ..." అన్నాడు
"అలాగే ...కిట్టూ గారు ..."
"కిట్టూ గారు కాదు ....కిట్టు "
"కిట్టూ ...." అని లైట్ గా సిగ్గుపడి ..."బాబోయ్... అలా పిలవడం కష్టమేనండీ బాబు ..." అంది బుగ్గలు ఎరుపెక్కగా ...
కిట్టిగాడికి ఆ పిల్ల సిగ్గు పడటం చూసి తెగ సిగ్గేసేసింది...
"అలవాటవుతుందిలే...." అన్నాడు ...
"నేను నా సిస్టంలో జావా లోడ్ చేశాను... కొన్ని ప్రోగ్రామ్స్ కి మీరు ఇప్పుడు నాకు లాజిక్ చెప్పాల్సిందే...అలాగే ఆ కాన్సెప్టులకి ఇప్పుడు రియల్-టైం ఎగ్జాంపుల్స్ చెప్పరా ప్లీజ్..." అంది..
కిట్టిగాడికి సుస్మిత ఆ క్షణం ఎందుకో తెగ ముద్దోచ్చేసింది...
"నీకు ఏ వాచ్ ఇష్టం...దాని మీదే ఎగ్జాంపుల్స్ చెప్తాను ..." అన్నాడు..
"వాచ్ మీద ఎగ్జాంపుల్స్ ఏంటి ?? ...."
"అదే రియల్ టైం అన్నావు కదా... అంటే వాచ్ అని నాకు తెలీదు అనుకున్నావా ఏంటి ..??" అన్నాడు కళ్లెగరేస్తూ..
"హా హా హా....మీరు భలే జోకులు వేస్తారే ..." అంది నవ్వుతూ ...
'అమ్మనీ...కొంపదీసి రియల్ టైం అంటే వాచ్ కాదా?...ఈ పిల్ల నవ్వేస్తుందేంటి?...ఓరి రాజుగా సచ్చావురా నా చేతిలో...కొద్దిగుంటే అడ్డంగా దొరికిపోయేవాడిని దీనికి...' అనుకొని...ఓ క్షణం సీరియస్ గా చూస్తున్నట్లు నటించి...వెంటనే గోళీ సోడా కొట్టినట్లు ఫక్కున నవ్వేస్తూ ..."హా హా ..కదా...మా గ్యాంగ్ కూడా అదే అంటుంటారు..నే వేసే జోకులకి వాళ్ళంతా కింద పడీ పడీ నవ్వి నవ్వి కడుపు ఉబ్బిపోయి, ఒక రొండు రోజులు ఏమీ తినేవాళ్ళు కాదు పాపం ..." అన్నాడు ...
"ఐ లైక్ హ్యూమర్ సెన్స్ ఇన్ గైస్ ..." అంది డెబ్బై శాతం అందమైన నవ్వులో ముప్పై శాతం సిగ్గు కలుపుతూ ...
'కిట్టిగా...పిల్ల నిన్ను లైక్ చెయ్యడం మొదలెట్టింది...కమాన్ ...ఇక తగ్గకూడదు ...ఏదోటి చేసెయ్..' అంటూ మనసనే జూనియర్ కిట్టిగాడు యంకరేజ్ చేశాడు ...
"దెన్...యు లైక్ మీ....?" అన్నాడు గోళ్ళు కొరుక్కుంటూ ...
"యా...వై నాట్...మీలో కూడా మంచి హ్యూమర్ సెన్స్ ఉంది ..."
"కూడా నా ??...అంటే ?"
"యా కిరణ్ కూడా అంతే ....చాలా హ్యూమరస్...the best guy i have ever come across is kiran... మై క్లాస్ మేట్...చాలా సపోర్టివ్...తనంటే నాకు చాలా ఇష్టం ..." అంది ...
కిట్టిగాడిలో వెయ్యి వోల్కెనోలు..లక్ష భూకంపాలు ఆల్రడీ అలజడి మొదలెట్టేసాయి ....
"అంటే కిరణ్ ...??" అన్నాడు ఏదో టాన్స్ లో ఉన్నట్లుగా ...
ఆ పిల్ల వెంటనే సిగ్గు పడింది...మనోడికి చిరాకేసింది...వెంటనే ఆడి జీవితం మీద ఆడికే విరక్తి పుట్టింది...దేవుడి మీద ఎక్కడలేని కోపం వచ్చింది..ఎందుకో రాజు గాడికి కాల్ చేసి ప్రపంచంలో ఉన్న అష్ట దరిద్రపు తిట్లన్నీకలిపి వాడిని తిట్టాలనిపించింది...మొదటి సారీ లైఫ్ లో జన్యూన్ గా కంట్లోంచి ఒక డ్రాప్ రాలడానికి సిద్ధంగా ఉంది కిట్టి గాడికి ....

టీవీ లో "మెట్టెల సవ్వడీ..ఓ ఓ ..మెట్టెల సవ్వడీ...మెడలో మాంగల్యం..." అంటూ సాంగు...దానితో పాటే సుస్మీ వాళ్ళమ్మ ఏడుస్తూ ముక్కు చీదుకుంటున్న శబ్దం మంద్రంగా వినిపిస్తుంది కిట్టిగాడికి .....
[Meet you all soon next week.................................. Ramakrishna Reddy kotla]

Sunday, 4 July, 2010

కిట్టిగాడు loves ఎదురింటి అమ్మాయి - 2


ఆ రాత్రి కిట్టిగాడికి రకరకాల రుబ్బుడు స్పందనలు (మిక్సుడ్ ఫీలింగ్స్) కలిగాయి.. సుస్మిత దృష్టిలో వాళ్ళమ్మ దృష్టిలో పడ్డందుకు మనోడికి కొంచెం హ్యాపీగానే ఉన్నా, రేపు ఎక్కడ సుస్మిత వాళ్ళింటికి వచ్చి 'ఆంటీ పురుగులు పట్టాయి అని మీ అబ్బాయి ఉప్మా రవ్వ పారబోశాడేంటి!!.. అది ఉప్మా రవ్వ కాదు పంచదార అని నా డౌట్' అని అమ్మతో అంటే...ఇక అంతే.. వీపు రాకెట్ మోతే.. కానీ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి సుస్మిత మాత్రం గొప్ప అందగత్తె, ఆ కళ్ళు ఉన్నాయి చూసారూ.. అబ్బబ్బబ్బ... వేరే ఏ అమ్మాయి అయినా కుళ్ళుకు చావాల్సిందే, ఆ పళ్ళు ఉన్నాయి చూసారూ...అర్రేర్రే... నాగమల్లి పువ్వు సైతం వెక్కి వెక్కి ఏడవాల్సిందే.. దేవుడా సుస్మితని ఎలాగైనా నాకు రిజర్వ్ చెయ్యి, ఆ అమ్మాయిని తయారుచెయ్యడానికి బ్రహ్మ తదితరులు వెచ్చించిన ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం వడ్డీతో సహా నీ హుండీలో సమర్పించుకుంటా .. ప్లీజ్...అంటూ రకరకాల స్పందనలతో ఆ రాత్రి గడిపాడు కిట్టిగాడు...

సైన్స్ పుస్తకంలో స్వాతి వీక్లీ పెట్టుకొని సిన్సియర్ గా సమరం కాలమ్ చదువుతున్న కిట్టిగాడికి హాల్లోంచి వాళ్ళమ్మ పిలుపు వినిపించింది "కిట్టూ సుస్మితా వచ్చిందిరా... లోపలేం చేస్తున్నావ్ బైటకిరా.." అని.. మనోడికి రాత్రి కలిగిన రుబ్బుడు ఫీలింగ్స్ మళ్ళీ కలిగాయి.. గుండెలో దడదడ.. సంతోషంతోనో, భయంతోనో తెలీదు.. హాల్లోకి వచ్చాడు.. అతన్ని చూసి చిన్నగా నవ్వింది సుస్మిత.. ఆహా ఏం నవ్వింది.. నా గుండెని బైటకి లాగి పరపరా రంపం తో కోసినట్లుంది .. ఆ నవ్వు వెనుక దాగిన మర్మమేమిటో అనుకుంటుండగా ..."ఒరేయ్ కిట్టిగా...ఆ అవతారమేమిట్రా.. సిగ్గులేకుండా!!..వెళ్లి ప్యాంటేసుకు చావు.." అంది వాళ్ళమ్మ.. అప్పుడు వాడివైపు వాడుచూసుకొని ఒక్కసారిగా సిగ్గుతో కూడిన అవమానభారంతో వాడి గదిలోకి వెళ్లి తలుపేసుకొని..."థూ...నా లైఫు...అది నా అవతారం చూసి నవ్విందా !!" అనుకుంటూ ప్యాంటు కోసం వెదుకుతుండగా... వాళ్ళ మాటలు వినిపించాయి.. "ఎమ్మా సుస్మిత...ఎలా చదువుతున్నావమ్మా?" అంది కిట్టూ వాళ్ళమ్మ.."కాలేజీ ఫస్ట్ మూడు మార్కులతో మిస్ అయిందాంటీ... అది కూడా జావా ల్యాబ్ లో తక్కువ మార్కులు రావడం వల్ల... అందుకే క్రిష్ణ గారి దెగ్గర కొన్ని జావా ప్రోగ్రామ్స్ లాజిక్ తెలుసుకుందామని వచ్చాను.." అంది సుస్మిత.. అంతే వాళ్ళమ్మ పగలబడి నవ్వడం మొదలెట్టింది... ప్యాంటు వేసుకోబోతున్న కిట్టుగాడి ఎడమ కన్ను టపటపా కొట్టుకోవడం మొదలెట్టింది ...మనసేదో కీడు శంకిస్తుంది... "వెనుకటికి ఏదో సామెత ఉందిలే... వాడికే దిక్కూ దివాణా లేదు, నీకేం చెప్తాడు.. ఏళ్ళు తరబడి ముక్కుతున్నా ఒడ్దున పడ్డ పాపాన పోలేదు.. ఆ జావానో ఏదో అన్నావుగా... అబ్బో ఆ సబ్జెక్టులో అయితే మావాడి ఘనత దశదిశలా పాకుతుందేమో... మొదటి సంవత్సరం అనుకుంటా మొదలెట్టాడు దాని మీద...." అంటూ ఆమె చెప్తుండగా, ఎప్పుడొచ్చాడో తెలీదు హాల్లోకి, నిప్పులు కక్కుతూ వాళ్ళమ్మ వైపు చూస్తూ.."అమ్మా...!!@@##...పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి వెళ్లి చూడు.." అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ....
"పొయ్యి మీద పాలేమిట్రా!!...పొయ్యి మీద ఏమీ లేవు...ఇదీ వీడి తెలివి.." అంటూ వాడి వైపు మళ్ళీ చూసి.."ఇంకా అదే దరిద్రపు అవతారంలో ఉన్నావేమిట్రా..ప్యాంటు వేసుకోకుండా ఏమి చేస్తున్నావ్..." అంది...
ఆ పిల్ల మళ్ళీ నవ్వింది.. "నవ్వింది మల్లెచెండు.. దొరికింది గర్ల్ ఫ్రెండు..." అంటూ పాటేసుకోవాలనుకున్నాడు వాడిలో ఉన్న మనసు అనే మరో కిట్టిగాడు, కానీ మనోడు "ఓరి ఎర్రి నాగన్నా, దాని నవ్వుకు కారణాలు బోలెడు.. నువ్వనుకునేది మాత్రం కాదు.. నువ్వు ఎక్సైట్ కాకు... నన్ను ఎక్సైట్ చెయ్యకు..థూ ఎదవ లైఫు.. " అంటూ ఈసారి ఖచ్చితంగా ప్యాంటు వేసుకోవాలని డిసైడ్ అయ్యి వెళ్ళాడు...

కిట్టిగాడు ముస్తాబయ్యి హాల్లోకి వచ్చాడు.. వాళ్ళమ్మ లేదు, వంటింట్లో ఏదో పనిలో మునిగిపోయింది..సుస్మిత సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంది.."అతడు" సినిమాలో మహేష్ బాబు త్రిషని అందంగాలేవు అనే సీన్ వస్తుంది.. మనోడు సైలెంటుగా ఆ పిల్ల దెగ్గరికి వెళ్లి "మహేష్ బాబు చెప్పింది కరెక్టే ఆ త్రిష ఏం అందంగా ఉంది చెప్పు... అసలు అందాన్ని డిఫైన్ చెయ్యాలంటే, అందానికే అందంలా అనిపించే అమ్మాయి కనిపించాలి.. ఉదాహరణకి నువ్వే ఉన్నావ్..అసలు ఎంత అందంగా ఉంటావనీ..." అంటూ సుస్మిత వైపే చూస్తూ చెప్పాడు ఐస్ చేస్తే కరిగిపోని పిల్లెక్కడుంది అనుకుంటూ..
"నిన్న మీకు నేను ఒక పేపర్ లో నాకు అర్థంకాని జావా ప్రోగ్రామ్స్ రాసిచ్చాను... వాటి లాజిక్ చెప్తారా.. ఒక వారంలో ఇంటర్నల్స్.." అంది...
కిట్టిగాడికి ఎక్కడలేని నీరసం ఆవరించేసింది.. జావా లాజిక్ సంగతి సరే, అసలు ఈ అమ్మాయిల మనసు తెలుసుకోవడానికి ఎవడన్నా లాజిక్ కనిపెట్టి, ప్రోగ్రాం రాస్తే బాగుండు అనుకున్నాడు..

"అదెంత పని సుస్మీ... నే ఇట్టే చేసేయ్యగలను...మా మమ్మీ సరదాగా నా మీద అలా జోక్స్ వేస్తుంది.. నువ్వవేం పట్టించుకోకు.. అసలు మా కాలేజీలో కిట్టూ ఎక్కడా అని ఎవరన్నా అడిగితే, 'కిట్టూ ఎవరు?..ఓ మీరు మాట్లాడేది జావా కుర్రోడి గురించా!!' అంటారు.. అంతలా నేను జావాకి మారు పేరులా తయారయ్యాను మా కాలేజీలో..."
"ఓహొ.. ఏంటో నాకు ఈ జావా పెద్దగా అర్థం కావట్లేదండి.. దాని వల్ల మార్కులు పోతున్నాయి.. రేపు మాకు Inheritance, Polymorphism, Encapsulation.. వీటి మీద ప్రోగ్రామ్స్ రాయమన్నారు.. అసలు ఆ కాన్సెప్టులే నాకు పిచ్చెక్కిస్తున్నాయి... మీరు జావా కుర్రోడు కదా, మీరే నాకు చెప్పాలి..." అంది..
మనోడు ఓ రెండు నిముషాలు ఆ పిల్లనే చూసి... ఓ రెండు సార్లు అటు పక్కకి... ఇటు పక్కకి.. పైకి..కిందకి చూసి.. వెంటనే ఫక్కున పగలబడి నవ్వడం మొదలెట్టి... పొట్టమీద చెయ్యి వేసుకొని 'ఇక నవ్వడం నావల్ల కాదు' అన్నట్లు ఇంకో చెయ్యి ఊపుతూ.. "హ హ హ ... సుస్మీ సుస్మీ...హహ్...హం..హమ్మా... అవి పిల్ల కాన్సెప్టులు సుస్మీ... వాటితో రకరకాల ప్రయోగాలు చేసేవాడిని.. నీకెందుకు సాయంత్రం నేను నీకు వివరించి చెప్తా సరేనా.." అన్నాడు

"అలాగే... థాంక్స్ అండి.. ఆ పేపర్ లో ప్రోగ్రామ్స్ లాజిక్ కూడా చెప్పాలి మీరు.." అంటూ చిన్న నవ్వు రువ్వి వెళ్ళిపోయింది... ఆ పిల్లతో పాటే మనోడి మనసు కూడా అలా వెళ్లి అలా గుమ్మం దెగ్గర ఆగింది.. ఎందుకంటే ఆ పిల్ల కూడా అక్కడే ఆగింది.. సుస్మీ వెనక్కి తిరిగి మనోడి వైపు చూసింది..మనోడు "యస్ ...షీ లవ్స్ మీ... షీ లవ్స్ కిట్టిగాడు.." అనుకుంటూ గుండె మీద చెయ్యి వేసుకొని రుద్దుకుంటుండగా.. ఆ పిల్ల వాడి దెగ్గరికి వచ్చి "అయ్యో...ఆంటీకి అసలు విషయం చెప్పడమే మర్చిపోయా.." అంటూ వంటింట్లోకి వెళ్ళింది...

మనోడు అతడు సినిమాలో వస్తున్న సాంగ్ చూస్తూ మహేష్ ప్లేస్ లో వాడిని, త్రిష ప్లేస్ లో సుస్మీని ఊహించుకొని "నీతో చెప్పనా...నీక్కూడా తెలిసిన..నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా.." అని సాంగ్ లో తేలిపోతుండగా లీలగా వినిపిస్తున్నాయి ఆ మాటలు ..."మా వాడు ఉప్మారవ్వ పారబోయడమేమిటమ్మా.. పురుగులుపట్టడమేమిటి??... నాకేమీ అర్థం కావట్లా..." అంటూ...ఆ మాటలు విన్న కిట్టిగాడికి ఒక్కసారిగా మబ్బు విడిపోయింది.. ఒక అంగలో కిచెన్ లోకి దూకేశాడు.. "ఒరేయ్... నువ్వు డబ్బేడు ఉప్మారవ్వ పారబోశావు అంటుందేమిటి సుస్మితా.. పైగా అది పంచదారేమో అని డౌట్ కూడా వచ్చిందట.. కానీ నువ్వే ఉప్మా రవ్వ అని చెప్పావట..!!" అడిగింది వాళ్ళమ్మ .. 'ఎదురింటిది కొంపముంచేసిందిరా బాబూ..' అనుకుంటూ .."అమ్మా...నాన్నా...అది...కాఫీ...ఆ రోజు..టీ పొడి...అదే... ఉప్మా చేస్తా అన్నావు... ఇడ్లీ పిండి...పంచదారా.. పకోడీ పొట్లం...పాయసం ప్లేటు...హా అదే నమ్మా, మురుకులు పెట్టావే ఆ డబ్బా ..రుబ్బురోలు ...  అయస్కాంతం... ఆవకాయా.." అంటూ అస్పష్టంగా అప్పుడే కోమా నుంచి లేచిన వాడిలా ఏదో అంటుండగా.. కోయ్యబోమ్మల్లా ఆ పిల్లా..వాళ్ళమ్మ నిల్చొని చూస్తున్నారు వాడి వైపే..ముందుగా వాళ్ళమ్మ తేరుకొని "పిచ్చిగానీ పట్టిందా ఏంట్రా తింగరి వెధవా... లేక తమరు చదివే చదువుకి అప్పుడే ఉన్న మతి పోయిందా?.. సంబంధం లేకుండా ఆ మాటలేమిట్రా సచ్చు సన్నాసి.." అంది..

కిట్టిగాడు ఓ క్షణం అలాగే ఉండి "అదే నమ్మా..నిన్న నాన్నకి నువ్వు చేసిన ఉప్మాలో బొద్దింక వచ్చింది చూడు.. అలా ఇంకెప్పుడూ రాకూడదని నేను నిర్ణయించుకొని పారబోశానమ్మా... నువ్వు మర్చిపోయి ఉంటావు.." అని చెప్పి సుస్మీ వైపు తిరిగి "సుస్మీ ఈవెనింగ్ నేనే మీ ఇంటికి వచ్చి నీకు జావాలో లాజిక్కులు మాజిక్కులు చెప్తాను..సరేనా.." అన్నాడు 'ఇక వెళ్ళవే బాబూ..నిప్పెట్టేశావుగా..' అనుకుంటూ.. ఆ పిల్ల వాడిని అల్-ఖైదా తీవ్రవాదిని చూసినట్లో లేక ఎర్రగడ్డ పిచ్చోడిని చూసినట్లో చూసి "వస్తాను ఆంటీ..." అంటూ వెళ్ళిపోయింది..

కిట్టిగాడు వాళ్ళమ్మ వైపు చూశాడు.. ఆమె వాడి వైపు ఏదో అనుమానంగా చూస్తుంది.."ఏంటమ్మా...ఏమయింది.." అన్నాడు అసహనంగా...
"అవునొరే... ఆ మూడు కిలోల పంచదార, ఆ పిల్ల డౌటు పడ్డట్టు, నువ్వు గానీ పారబోయ్యలేదుగా.." అంది ..
"అమ్మా...నాకేమన్నా పిచ్చా డబ్బేడు పంచదార పారబోయడానికి..."
"ఏమో రా.. అసలే ఇందాకే ఏవేవో పిచ్చెక్కినట్లు మాట్లాడావ్...!!"
"అమ్మా...నేను పంచదార ఎందుకు పారబోస్తాను ... దానికి ఒక్క కారణం చెప్పు...నేనే పారబోశాను అని ఒప్పుకుంటా..."
"పిచ్చోళ్ళు చేసేపనులకి పెద్దగా కారణాలు ఏముంటాయి నాన్నా...రోడ్డు మీదకి వెళ్లి ఓ కిలో పంచదార అట్రా..వెళ్ళు ..." అంది ..

                                                    *****
"హలో..."
"ఒరేయ్ రాజుగా...నేను కిట్టిగాడిని..."
"ఒరేయ్ కిట్టిగా... వైజాగ్ ఎప్పుడొస్తున్నావ్.. ఏటి సంగతి..."..
"Inheritance... Polymorphism... Encapsulation..."..
 "ఏట్రా...పట్టపగలే..అదీ ఇంట్లోనే మొదలెట్టావా??"..
"మొదలెట్టడం ఏంట్రా??"..
"నువ్వు.. ఇప్పుడు... తాగే కదా మాట్లాడుతున్నావ్?"..
"తాగానా??..సరిపోయార్రా నాకు...చూడు పిచ్చి నా పుత్రా..పైన నేను చెప్పినవి జావా బాషలో ఏవో కాన్సెప్టులు, అంతేగాని తాగితే వచ్చే తిట్లు కాదు.. వాటి గురుంచి నాకు రెండు గంటల్లో పూర్తి నివేదిక కావలి..."
"అవి జావాలో ఉన్నాయా!!... మనం చదివినప్పుడు లేవే...!!"
"ఒరేయ్.. నీకు జావా ల్యాబ్ లో యాభైకి నలభై అయిదు వచ్చాయని నిన్ను అడిగితే నువ్వేంట్రా..!!"
"అదా... మన జావా సార్ కి ముందు రోజు ఫ్రెండ్షిప్ కొద్దీ స్మిర్న్-ఆఫ్ వోడ్కా ఒక ఫుల్ ఇచ్చానులే... పాపం ఆయన లెవెల్లో ఏదో అలా అభిమానంతో...అలా కానిచ్చేసారు.."
"వార్నీ...సరేలే... నీకు తెలియకపోతే, మన సూరిగాడిని అడుగు..వాడికీ తెలియకపోతే పొట్టి రాజేష్ గాడినో.. బాషా గాడినో.. కిషెన్ గాడినో ...లేకపోతే నీ బీటు నాగలక్ష్మినో అడుగు.."
"నాగలక్ష్మిని చస్తే అడగను... పెద్ద పోజురా దానికి.. మొన్న నా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఐదో సప్లిమెంటరీ పరీక్షలో స్లిప్పులు అందించవే అంటే..'మొహం చూసుకో అద్దంలో' అందిరా... అదేదో పెద్ద చందమామలాగా..చపాతీ మొహం వేస్కొని.."
"మీ గోల తర్వాత...నాకు రెండుగంటల్లో ఆ కాన్సెప్టుల మీద పూర్తి సమాచారం కావలి ..అది కూడా మన రేంజ్ లో...మన రేంజ్ అంటే తెలుసుగా.. మన అండర్ స్టాండింగ్ కెపాసిటీ..."

**రెండు గంటల తర్వాత **

"ఓరి కిట్టిగా..."
"చెప్పెహే..."
"పెన్ను..పేపర్..పక్కనేట్టుకో...నేను వివరించేస్తా..రాసేస్కో...డౌట్లు మాత్రం నన్నడక్కు.."
"సర్లే ఏడువ్.."
"Inheritance - అంటే...ఒక తరగతి, మరొక తరగతి నుంచి..తల్లీ పిల్ల పీచులతో సహా అన్నిటినీ ఆవాహం చేసుకోవడం..."
"ఒరేయ్...జావాలో..ఈ తరగతులు.. తల్లి పిల్లా పీచు ఏవిట్రా నీ బొంద...పైగా ఆవాహం చేసుకోవడం ఏవిట్రా ఏబ్రాసి ఎదవా.."
"ఒరేయ్ డౌట్లు అడగొద్దు అన్నానా.. జావాలో కూడా క్లాసెస్ ఉంటాయట..అవే తరగతులు..అలా ఒక తరగతికి చెందిన పేరెంట్-తల్లి, చైల్డ్-పిల్లని ఇంకో తరగతి ఆవాహం చేసుకుంటుంది.. అలా చేసుకున్నదాన్ని సబ్-తరగతి..చేసిన దాన్ని సూపర్-తరగతి అంటారట...ఇక నన్ను అడక్కు..."
"సర్లే..మిగతావి చెప్పు.."
"Polymorphism - అంటే ఒకే తరగతి అనేక అవతారాల్లో ఉంటుంది అనమాట.. సందర్భాన్ని బట్టి ఒక్కో అవతారం ఎత్తుద్ది.. మన విష్ణుమూర్తి లాగా .."
"Polymorphism అంటే విష్ణుమూర్తి అవతారాలా!!...వార్నీ.. ఈ మాత్రం తెలిసుంటే ఈ సబ్జక్టు మీద ఇన్ని దండయాత్రలు జరిగేవే కాదు.. "
"ఇకపోతే Encapsulation - ఇది పెద్ద జాదూరా..ఒక క్లాసు యొక్క తల్లి పిల్లా పీచూ వివరాలన్నీ దాచేస్తుందట.. మరి దానికేం పోయేకాలమో..!!"
"అవునా!!...ఏమోలే పాపం..దాని బాధలు దానివి...ఇక అంతేగా...ఓ.కే .. పర్లేదు వీజీనే...ఇక చూస్కో చించేస్తా.. దెబ్బకి సుస్మితా ఫ్లాట్ అయిపోవాల్సిందే..."
"కిట్టిగా...సుస్మితా ఎవర్రా...??"
"రాజుగా... కిట్టిగాడు లవ్ లో పడ్డాడెహే... ఆ పిల్లే ఈ జావా డౌట్లు అడిగింది .."
"కిట్టిగా.. అరిపించెయ్యి..అల్లాడించెయ్యి..కేకలుపెట్టించు..."
"ఒరేయ్...నేను ఆ పిల్లని రేపో..మర్డరో చెయ్యట్లేదురా...లవ్ చేస్తున్నా... "
"అదే లేవో... మన లాంగ్వేజ్ లో చెప్పా... అన్నట్లు ఒరే.. పైన చెప్పిన కాన్సెప్టులు ఒక్క జావాకే పరిమితం కాదట.. అదేదో ఊప్స్ అంట...దానికి సంబంధించిన అన్ని భాషలకు ఉంటాయట..."
"మధ్యలో ఈ ఊప్స్ ఏంట్రా...సర్లే..ఏదోటి... అడిగిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎవడ్రా నిన్ను ఇవ్వమన్నాడు... అసలే మన బ్రెయిన్ కెపాసిటీ తెలుసు కదా... దాన్ని కష్టపెట్టడం నాకు ఇష్టముండదు.. అయినా ఈ పిల్ల కోసం రిస్క్ చేస్తున్నా.. సర్లే ...రేపు మాట్లాడదాం...బాయ్..." అంటూ ఫోన్ పెట్టేసాడు కిట్టిగాడు..

                                                   ****
సమయం సాయంత్రం అయిదు గంటలు...
కిట్టిగాడు పేపర్ మీద రాసుకున్న ఆ కాన్సెప్టులని.. తరగతుల్ని...తల్లి పిల్లా పీచులని వదలకుండా భయంకరంగా బట్టీ పట్టి... పేపర్ మడిచి జేబులో పెట్టుకొని.. నీట్ గా రడీ అయ్యి, ఎదురింటికి బైల్దేరాడు....


[మళ్ళీ కలుద్దాం త్వరలో............................................రామకృష్ణారెడ్డి కోట్ల]