Search This Blog

Tuesday 28 July, 2009

ర్యాగింగ్...మ..గ..రి..స లు

"ఒరేయ్...కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవర్రా?" అడిగాడు సీనియర్ నాగరాజు జూనియర్స్ ఫ్లోర్ కి వస్తూనే....
అందరం కొయ్య బొమ్మల్లా నిల్చున్నాం....
"ఏంటి భే...బొట్టు పెట్టి పిలవాలా?..కొత్తగా జాయిన్ అయినవాళ్ళు అందరూ క్రింది ఫ్లోర్ కి రండి...." అరిచాడు....
నేను అంతకముందు రోజే జాయిన్ అయ్యాను...టీ షర్టు జీన్స్ ప్యాంటుతో దిగాను హాస్టల్లో...ఒక్కొక్కడి చూపులు వింతగా ఉన్నాయ్ నా మీద...నాకేమీ అర్థం కాలేదు...
"ఏయ్...ఇక్కడ ఇలా ఉండకూడదు..." అని చెప్పిన జనార్ధన్ వైపు వింతగా చూసాను ఎందుకన్నట్లు...
"ఇలా ఉంటే...సీనియర్ల చేతులో నీ పని అయిపోయినట్లే..టీ షర్టు జీన్స్ వెయ్యకూడదు...హ్యాండ్ కఫ్ఫ్స్ పెట్టకూడదు ...ఇన్ షర్టు చెయ్యకూడదు...వాళ్ళు కనపడగానే సర్ అని సెల్యూట్ చెయ్యాలి..ఇక ర్యాగింగ్ ఎలాగూ తప్పదనుకో...ఇవన్ని పాటిస్తే కొంచెం బెటర్.." అంటూ నాకు ఒక ఉచిత ఉపదేశం సెలవిచ్చాడు...
ఇవన్నీ విన్నాక కొంచెం టెన్షన్ మొదలైంది.....
డిన్నర్ చేస్తున్నపుడు మధ్యలో సీనియర్ వస్తే, అలాగే లేచి వెళ్లి చెయ్యి కడుక్కొని సెల్యూట్ చెయ్యాలట...ఛీ నా జీవితంలో మువ్వన్నెల జెండాకి తప్ప ఇంకెవరికీ సెల్యూట్ చేసింది లేదు...వీడికి చెయ్యాలా...'తప్పదు నాయనా చెయ్యాలి లేకుంటే అడ్డంగా బుక్ అవుతావ్'..అంటూ నా మనసు నాకు ఎప్పటిలాగే ఉపదేశం చేసింది...

"ఏంటి భే ఎవ్వడూ కదలడా?...ఒక్క నిముషంలో రాకపోతే ఇక ఉంటది రా వాళ్ళకీ..." అంటున్న వాడిని చూసి అదేదో సినిమాలో విలన్ గుర్తొచ్చాడు నాకు...
నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాం...పెళ్ళయాక అత్తారింటికి వెళ్ళే అమ్మయిలలాగా...నేను,సురేష్ గాడు,విజయ్ కిరణ్, విశ్వనాథ్...అందరం వెళ్ళాం...

"ఒరేయ్ నువ్విట్రారా...." కళ్ళు ఎర్రగా భయపెట్టేలా ఉండి...బాన పోట్టేసుకొని..నాలుక మడతపెట్టి కొట్టేలా చూసాడు నా వైపు ఒక సీనియర్ మేము వాళ్ళ ఫ్లోర్ కి వెళ్ళగానే....
కొంచెం భయపడుతూనే వెళ్ళాను వాడి దెగ్గరికి...నా కాలర్ పట్టుకొని లాగి "రే...నిన్నే ఎందుకు పిల్చానో తెల్సా?" అన్నాడు క్రూరంగా...
"తెలీదు ..." అన్నాను కొంచెం వణుకుతూ...
"ఏంటి భే..." వాడు ఉగ్రరూపం దాల్చాడు.."సీనియర్ ని ఎలా పిలవాలో తెలీదా?" వాడి కింది పెదవిని పళ్ళతో కొరికాడు...
"తెలీదు సర్..."
అంతే వాడిక లేచాడు...
"అంటే సర్...ఎలా పిలవాలో తెలుసు...ఇందాక మీరు ఎందుకు పిల్చానో తెల్సా అన్నారుగా...దాని జవాబుగా...తెలీదు సర్ అన్నాను..." వాడు వైలెంట్ గా తయారవడం చూసి వాడిని శాంతపరచడానికి ప్రయత్నించా...
"నీకు ఖచ్చితంగా క్లాసు తీసుకోవాల్సిందే రా...హ్యాండ్ కఫ్ఫ్స్ పెట్టకూడదు అని ఎవడూ చెప్పలేదా" అడిగాడు వాడు వాడి ఉగ్రరూప ఉధృతి కొంచెం తగ్గించి..
అపుడు అర్థమైంది నాకు...నేను హ్యాండ్ కఫ్ఫ్స్ పెట్టుకొని ఉన్నాను అని...వెంటనే తీసేసాను...'అది...పొరపాటు అయింది సర్.." అన్నాను
ఈ లోపు విజయ్ కిరణ్ ని ఎవడో పిల్చి ఓ పావలా ఇచ్చి రూమ్ మొత్తం కొలిచి ఎన్ని పావలాలు అయిందో లెక్క చెప్పమన్నాడు...వాడు ఆ పనిలో పడ్డాడు...
"నీ ఎస్.డి చెప్పరా...." అన్నాడు ఇంకోడు నన్ను చూసి...
"ఎస్.డి అంటే ఏంటి సర్.."అన్నాను అర్థంకాక...
"చా..నిజమా..ఒరేయ్ ఈడికి ఎస్.డి అంటే తెలిదంటరా..వెళ్లి చెప్పు.." అన్నాడు సురేష్ గాడితో..
"ఎస్.డి అంటే సెల్ఫ్ డీటెయిల్స్..." అన్నాడు వాడు.."అబ్బా చా...నువ్వింకా ఘనుడివి రా..." అన్నాడు సురేష్ గాడిని చూసి...
"సొంత డబ్బా..." విశ్వనాథ్ గాడు అందుకున్నాడు వెంటనే మధ్యలో...
"అబ్బో అయ్యగారికి చాలా తెల్సే...ఇట్రామ్మా..." అంటూ పిల్చాడు ఇంకో సీనియర్ వాడ్ని...
"ముఘల్ పరిపాలన కాలం నుంచి.....నిన్నటి దాక...ప్రపంచం లో జరిగిన ప్రతి విషయం ఒక బుక్ కొని అందులో మొత్తం రాసి రేపు నాకు చూపించు..." అన్నాడు ఆ సీనియర్ విశ్వనాథ్ గాడిని చూసి...అనవసరంగా ఇరుక్కుపోయాను అని వాడికి అర్థం అయింది.."అలాగే సర్ ..." అన్నాడు అయోమయంగా చూస్తూ..
"నువ్వేంటి భే...అట్లా చూస్తున్నావ్...ఎస్.డి చెప్పు.." అడిగాడు బాన పొట్టోడు...
అది ఎలా చెప్పాల్రా దేవుడా అనుకోని కాసేపు సీరియస్ గా ఆలోచించా...ఇలా మొదలెట్టా...
"నా పేరు రామకృష్ణా రెడ్డి...నేను పుట్టింది మాచెర్ల... ఇంటర్ గుంటూరు లో చదివాను...ఫలానా రాంక్ వచ్చింది...ఆ రాంక్ వల్ల ఇక్కడ జాయిన్ అయ్యాను.." అన్నాను క్లుప్తంగా...
"ఆహా...బలుపా రా నీకు...ఎస్.డి చెప్పమంటే...ఎదవ సోదంతా చెప్తావ్...అరేయ్ నువ్ చెప్పరా బక్కోడా..." సురేష్ గాడిని పాయింట్ చేస్తూ అడిగాడు బానపొట్ట..
నాలాగా రెండు ముక్కల్లో చెప్తే బుక్ అవుతా అనుకున్నాడో ఏమో...ఇక స్టార్ట్ చేసాడు వాడి వంశ చరిత్ర తో సహా..."మా పూర్వికులు- అంటే మా ముత్తాత మదన మోహన రావుగారు అప్పటి బ్రిటిష్ పరిపాలనా కాలం లో....." అలా సాగింది వాడి సొంత డబ్బా...బానపొట్టకి చిర్రెతుకోచ్చింది.. "అరేయ్ బక్కోడా నీకు ఈవెనింగ్ పార్క్ లో ఉంది అసలైన పండగ .." ఆ మాట విన్నాక సురేష్ గాడు ఎలా ఫీల్ అయ్యాడో తెలీదుగాని నాకు టెన్షన్ స్టార్ట్ అయింది, ఎందుకంటే పార్క్ లో ర్యాగింగ్ మరీ దారుణం...పార్క్ లో కనిపించిన అమ్మాయి దెగ్గరికి వెళ్లి "ఐ లవ్ యు" చెప్పమంటారు ..ఇంకా దిగజారి చౌకబారు డీటైల్స్ అడిగి తెలుసుకురమ్మంటారు...అప్పుడు వాళ్ళు చెప్పు చూపించడం కామన్...ఆ ప్రహసనం చూసి ఈ సీనియర్ సైకోగాళ్ళు పైశాచికానందం పొందుతారు...ఇంకా పార్క్ చుట్టూ కుప్పి గంతులు వేయించడం...ఐస్ క్రీం బండి దెగ్గరికి వెళ్లి చాకోబార్ కొట్టేసి పరిగెత్తుకు రమ్మనడం..ఇలా ఆ పిశాచాలకి ఆ టైం లో ఏ ఎదవ ఆలోచన వస్తే అది ఆ రోజు బలి పసువులైన జూనియర్ల మీద ప్రయోగిస్తారనమాట...

"ఒరేయ్ నువ్ పాట పాడురా?"  అడిగాడు ఇంకోడు...
పాట ఎలాగూ పడమంటారని తెలుసు కాబట్టి నాకు బాగా నచ్చిన...సారీ వచ్చిన సాంగ్ "నువ్వే కావలి" టైటిల్ సాంగ్ ఎత్తుకున్నాను...వాళ్ళకి జీవితం మీద తీపి గుర్తొచ్చి వెంటనే ఆపుచేయించారు నా పాట...
"నీకు ఇష్టమైన హీరోయిన్..." ప్రశ్న ఎటువైపు నుంచో వచ్చిందో కూడా తెలీకుండా.."సౌందర్య..." అనేశా..
"ఎందుకో సరైన కారణం చెప్పకపోతే....నీకు కూడా ఈవెనింగ్ పార్క్ ప్రోగ్రాం ఉంటుంది రోయ్.." బానపొట్ట గాడు వేలు చూపించాడు...వీడికి పార్క్ తప్ప ఇంకో ధ్యాస లేనట్లుందే...ఏదో ఒక రోజు అందరం కల్సి ఈ బానాపొట్ట గాడిని పార్క్ లో ముసుగేసి కుమ్మేయ్యాలి...నాకు నేను సంకల్పించుకున్నాను...ఇప్పుడు సౌందర్య నచ్చిందనడానికి ఏమి కారణం చెప్పాల్రా దేవుడా అనుకుని .."సర్...సౌందర్య అందరిలా ఎక్సుపోసింగ్ చెయ్యకుండా...మంచి పెర్ఫార్మన్స్ రోల్స్ చేసి మంచి పేరు సంపాదించుకుంది..చూడడానికి చక్కగా పదహారు అణాల తెలుగింటి ఆడపడుచులా..ముద్దబంతి పువ్వులా నవ్వుతూ.." అంటూ ఇంకా ఏదో అనబోతుండగా..
"ఐతే నాకేంటి భే..." అన్నాడు ఒకడు అప్పుడే ఎంట్రీ ఇస్తూ...బిత్తరపోయి చూశా వాడి వైపు...
"ఒరేయ్ నువ్వుండరా....ఆడేదో సౌందర్య గురుంచి చెప్తున్నాడు..." అన్నాడు బానపొట్ట వచ్చిన గొట్టం గాడి బుజం మీద చేయ్యేస్తూ..."అబ్బా సౌందర్యా...అయితే నడుము గురుంచి చెప్పరా..." ముప్పై రెండు పళ్ళు ఇకిలించాడు గొట్టం గాడు...
"సర్...నేను అలాంటివి చూడను...మాట్లాడాను..." నేలవైపు చూస్తూ చెప్పా..
"అబ్బా...ఛా...మరేం చూస్తావ్ రా.." వెకిలిగా నవ్వరంతా...
నాకు మండింది....రక్తం సల సల మరిగింది...
'భీమక్ష్వాపతీ... '....కళ్ళు ఎర్రగా నిప్పులు కక్కుతున్నాయి.. జబ్బల నరాలు పైకి తేలాయి..'కుంభీనిగర కుంభస్తగురు కుంభీవలయ పతి ఛత్రపతి..జ్యంజ్యాపవన గర్భాపహార వింధ్యార్దిసుమ ధృతి ఛత్రపతి..' బ్యాక్ గ్రౌండ్లో ఛత్రపతి మ్యూజిక్ వేసుకున్నాను ...పిడికిళ్ళు బిగిసాయి...పళ్ళు పట పటా కొరికా...'బాబూ..మనకంత బొమ్మ లేదు...ఒక్కసారి ఆ బాన పొట్ట గాడిని చూడు'...మళ్లీ గీతోపదేశం చేసింది నా మనసు...చూసా వాడి వైపు...ప్రపంచంలో అష్టదరిద్ర చండాలం అంతా వాడి మొహంలోనే ఉంది..." ఏంది భే ఆ చూపు...ఇట్రారా...వచ్చి చెప్పినట్టు చెయ్యి..." పిల్చాడు...వెళ్లాను...మోకాళ్ళ మీద నిల్చొని రెండు చేతులు వెనక్కి పెట్టి పాదాలని తాకించి అలానే ఉండు నేను చెప్పే దాక అన్నాడు...'ఓరినీ...బనపోట్టేసుకొని శరీరం ఒక్క ఇంచి కూడా వంచలేని వెధవ...నువ్ నాకు చెప్తావా..' అనుకోని కసిగా తిట్టుకున్నా...కానీ తప్పదుగా...ఆ ఆసనం లాంటి ప్రహసనం ట్రై చేశా చాలా కష్టపడి...కానీ అలా ఉండటం ఒక్క నిముషం కూడా నా వల్ల కాలేదు...తళుక్కున ఓ ఐడియా మెరిసింది...అంతే అలాగే వెనక్కి పడిపోయి కళ్ళు తెలేశాను..బానపొట్ట గాడు కదిపాడు నన్ను...తల అటూ ఇటూ ఊగిస్తూ ఏదో వింత జబ్బు ఉన్నట్లు ప్రవర్తించా...వాడికి భయంవేసింది...నీళ్ళు తెచ్చి నా ముఖం మీద కొట్టాడు..లేచాను ఏదో మైకం లో ఉన్నవాడిలా..."సరే...నువ్వు వెళ్ళు ఇంక..." అన్నాడు బానపొట్ట...నా సమయస్ఫూర్తి కి నాకే ముచ్చటేసి అక్కడనుంచి జారుకున్నా...అలా మొదటి రోజు ర్యాగింగ్ ముగిసింది...

ఆ తర్వాత ప్రతిరోజూ ఏదొక విధంగా ర్యాగింగ్ జరుగుతూనే ఉంది...కానీ మొదట్లో ఉన్న భయం పోయింది...ఆదివారం రోజుని మొత్తం ర్యాగింగ్ కి కేటాయించే వాళ్ళు సీనియర్లు హాస్టల్లో...నేను మాత్రం ఆదివారం వాళ్ళకు దొరక్కుండా కాకినాడలో ఉండే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే వాడిని...

"ఫ్రెషర్స్ పార్టీ ఎప్పుడు ఇస్తారు సర్" అని వాళ్ళని అడిగితే..."అప్పుడేనా...ఇంకా రాగింగే సరిగ్గా చెయ్యలేదు...అపుడే మీకు ఫ్రెషర్స్ పార్టీ కావాలా?...ఓ నాలుగు నెలల తర్వాతా ఆలోచిద్దాంలే " అన్న మా సీనియర్లు ఆ తర్వాత కేవలం రెండు రోజుల్లోనే "రేపే మీకు ఫ్రెషర్స్ పార్టీ ఇస్తున్నాం.." అని మాతో అన్నారంటే దానికి గల కారణం తెలిసిన మాకు వాళ్ళు అలా చెప్పడం అతిశయోక్తిగా అనిపించలేదు మరి...

ఆ రోజు శనివారం..అర్ధరాత్రి ...ఆ రోజు జరిగిన సీన్ లో నేను లేను..ఎందుకంటే నేను కాకినాడ వెళ్ళాను...నేను వచ్చాక మా ఫ్రెండ్స్ చెప్పారు జరిగిందంతా...దాదాపు అర్థరాత్రి పన్నెండు దాటింది...మా ఫ్లోర్ మెయిన్ డోర్ ని దబా డాబా బాదుతున్నారు ఎవరో..లేచి తలుపు తీస్తే సీనియర్లు అంతా కట్టకట్టుకొని వచ్చారు...వాళ్ళు బాగా తాగి ఉన్నారని అర్థం చేసుకోడానికి మా వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు..తలుపు తీసిన వాడిని ఈడ్చి చెంప మీద కొట్టారు...వాడు దెబ్బకి కింద పడి బిత్తరపోయి చూసాడు వాళ్ళని...అంతే..ఆ రాత్రి వాళ్ళు మృగాల్లా తయారయ్యారు...ఎవడు దొరికితే వాడిని పట్టుకొని కొట్టడం...తన్నడం...అసలు వాళ్ళు ఇంతాలా రేచ్చిపోడానికి ఓ కారణం ఉంది...
మా కాలేజీ లో వినీలా అనే అమ్మాయి ఉంది..ఆ అమ్మాయికి మా సేనియర్లలో ఒకడు సిన్సియర్గా లైన్ వేస్తున్నాడు...ఇక ఆ అమ్మాయి గర్ల్స్ హాస్టల్ లో ఉంటుంది...మా హాస్టల్స్ రాజమండ్రి టౌన్ లో ఉంటే...కాలేజీ హైవే మీద రాజానగరం దగ్గరిలో ఉంటుంది...మేమందరం హాస్టల్ నుంచి కాలేజీకి కాలేజీ బస్సులోనే వెళ్ళడం ..మళ్లీ తిరిగిరావడం...అమ్మాయిలకు, అబ్బాయిలకు బస్సులు సెపరేట్ అనమాట...కాలేజీ అయిపోయాక మాకు కాలేజీలోనే స్టడీ హౌర్స్ ఉండేవి...చూశారా నా జీవితం...ఇంటర్మీడియట్ లో ఎలాగూ తప్పలేదు స్టడీ హౌర్స్ కనీసం ఇంజనీరింగ్ లో ఆయినా స్వేచ్చా వాయువులు పీల్చుకోవచ్చనుకుంటే..ఇక్కడకూడా స్టడీ హౌర్స్ తగలెట్టారు...బుద్ధి ఉన్నోడు ఎవడైనా పెడతాడా ఇంజనీరింగ్ కాలేజీ లో స్టడీ హౌర్స్...ఏం చేస్తాం, మా  కాలేజీ వాడికి చాలా జూనియర్ కాలేజీలు ఉన్నాయి...వాటి ప్రభావమే అనుకుంటా మా కొంప ముంచాయి...(అఫ్కోర్స్...సెకండ్ ఇయర్ నుంచి స్టడీ హౌర్స్ తీసేసారనుకోండి...అది వేరే విషయం)...

ఇక అసలు విషయానికి వస్తే...ఓ రోజు రాత్రి స్టడీ హౌర్స్ అయ్యాక డిన్నర్ చేసాక (మాకు డిన్నర్ కాలేజీ లో నే ) అందరం బస్సు ఎక్కాము...ఆ రోజు అమ్మాయిల బస్సు పాడయిపోయిందట...సో మా బస్సు లోనే వాళ్ళని ఎక్కించారు...బస్సు మొదటి సగంలో వాళ్ళు..చివరి సగం మేము...ఆ రోజు సీనియర్లు పెద్దగా లేరు..వాళ్ళు స్టడీ హౌర్స్ ఎగ్గొట్టి ఎటో వెళ్లారు...ఇక ఆ రాత్రి మా ఇష్టా రాజ్యం అయిపొయింది..తెగ గోలచేసాం..అసలే అమ్మాయిలు ముందు ఉన్నారు...ఎక్కడి లేని ఉత్సాహం వచ్చింది మా జూనియర్ల అందరికి...దొరక్క దొరికిన ఛాన్స్ ని వినియోగించుకుంటూ తెగ కామెంట్స్ అమ్మాయిల మీద..ఆ రోజు వినీలా పసుపు కలర్ చుడిదార్ వేసుకుంది...అబ్బోఆ అమ్మాయి వేసుకున్న చుడిదార్ కలర్ కూడా అంత బాగా గుర్తున్చుకున్నావా ? అనేయ్యకండి...ఎందుకంటే ..కలరే  అక్కడ కొంపముంచింది...ఆ అమ్మాయి పసుపు కలర్ చుడిదార్ కాబట్టి మా వాళ్ళు "తెలుగు దేశం ...తెలుగు దేశం ...కుమారి తెలుగు దేశం...జై చంద్రబాబూ...జై జై వినీలా..." అని ఒకటే గోలా...ఆ అమ్మాయి ఎడ్చిందంటా...మాకా విషయం తేలేదు...ఇక తరువాతి రోజు ఆ విషయం సీనియర్లుకి తెలియడం...అదీ 'వినీలా ఎడ్చిందంటా..' అనే విషయం తెలిసి దానికి లైన్ వేసేవాడు పూనకం వచ్చిన వాడిలా ఊగడం...ఒక ప్లాన్ వేసి మమ్మల్ని ఆ రోజు నైట్ కొట్టడం...ఇవన్ని జరిగిపోయాయి....
కానీ ఆ రోజు రాత్రి మా వాళ్ళు ఊరుకోలేదు...సీనియర్లు అయినంత మాత్రాన తంతారా...అని రేచిపోయి అందరూ కల్సి ఫ్లోర్ లోంచి బైటకి పరిగెత్తి రోడ్ మీదకి వెళ్లి "ఇప్పుడు రండి రా చూసుకుందాం...ఫ్లోర్ లో తలుపులేసి కొట్టడం కాదు రా...ఇప్పుడు రండి.." అని తోడకోట్టారంటా మా గ్రూప్ లో ఉన్న రెబల్ గ్యాంగ్...అంతే కాదు, వాళ్ళలో ఒకడు చైర్మన్ కి దూరపు బంధువట..వాడెళ్ళి అప్పటికప్పుడు చైర్మన్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు...ఈ విష్యం తెల్సుకున్న సీనియర్లకి చెమటలు పట్టాయి..'అమ్మాయి కోసం అనోసరంగా ఇరుక్కున్నాం 'అని అర్థమైంది వాళ్ళకి...కొద్దిసేపయ్యాక చైర్మన్ వచ్చాడు...సీనియర్ల ఫ్లోర్ కి వెళ్ళాడు...అందరికి తాగింది మొత్తం దిగిందనుకుంటా..ఒక్కోడు వణుకుతా నిల్చున్నాడు..ఆ సీన్ నేను మిస్ అయినందుకు చాలా బాధపడ్డాను...ముఖ్యంగా ఆ టైంలో ఆ బనపొట్ట గాడిని చూడాలనిపించింది...చైర్మన్ సత్యనారాయణ రాజు అందరి పేర్లు ఒక పేపర్ మీద రాసుకొని.."రేపు కాలేజీ లో అందరు ఉండాలి....ఎవడన్నా మిస్ అయ్యాడో చచ్చాడే.." అని చెప్పి వెళ్ళిపోయాడు....

ఇక మరుసటి రోజు...రాజు గారు వీళ్ళందరిని పిల్చి ..కాలేజీ మధ్యలోకి రప్పించి ఒక్కోడిని కొట్టాడు కదా... ఆహా అది బహు కన్నులపండువగా తోచింది నాకు...యస్...ఐ ఎంజాయిడ్ ఇట్...లేకపోతె ర్యాగింగ్ కి ఉన్న హద్దులు దాటితే పర్యవసానం అలానే ఉంటుంది మరి...ఆ తర్వాత రోజు మాకు ఫ్రెషర్స్ డే...ఆ తర్వాత నుంచి మాకు హద్దులు లేవు...రెక్కలు వచ్చిన పక్షుల్లా విహరించాం రాజమహేంద్రి నగరమంతా...ఓ వారం పాటు రోజుకో సినిమా చూసాం...పట్టా పగ్గాలు లేవు మాకు అప్పుడు...క్రమ క్రమాంగా సేనియర్లు వాళ్ళ ఈగో వదిలి మాతో కలిసారు...

"సర్...ఆ రోజు మీరు నన్ను అనోసరంగా చెంప దెబ్బ కొట్టారు...మీ మీద ఇంకా కోపం తగ్గలేదు నాకు" అన్నాడు విజయ్...
"సరే రా...నిన్నే కాదు..ఆ రోజు చెంప దెబ్బ కొట్టించుకున్నోలందరికి ఈ రోజు సెకండ్ షో సినిమా టికెట్లు మేమే పెట్టుకుంటాం ...ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ కూడా ..." హామీ ఇచ్చేసాడు బానపొట్ట...



Wednesday 22 July, 2009

ఆఖరి మజిలీ...



నేను ఆఫీసుకి ఎప్పుడు సెలవు పెట్టాలన్నా నాకు దొరికే ఒకే ఒక్క వంక 'ఫ్రెండ్ పెళ్లి'.. ఎక్కువసార్లు అదే వంక పెట్టి అడిగేసరికి మా మేనేజర్ స్పందన వ్యతిరేకంగా తయారయింది...రెండు నెలల క్రిందట మా ఫ్రెండ్ ఫోన్ చేసి "ఒరేయ్ నా పెళ్లి...నువ్వు తప్పకుండా రావాలి..కార్డు నీకు మెయిల్ చేశాను...రాలేదంటే నా మీద ఒట్టే" అని తెగ ఇబ్బంది పెట్టేసాడు...సరేలే వెళ్దాం సరదాగా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసినట్లు ఉంటుంది అనుకోని లీవ్ అడగడానికి వెళ్ళాను మేనేజర్ దెగ్గరికి...'ఫ్రెండ్ పెళ్లి' అంటే ఈ సారి ఖచ్చితంగా లీవ్ ఇవ్వడు... "నీకు లీవ్ దొరకడానికి మీ ఫ్రెండ్స్ తెగ పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారే..."అని వ్యంగ్య అస్త్రం వదలడూ!!...ఏమని అడగాలి...
వీడికి బుర్ర ఉందొ లేదో ఈ సారి పరీక్షిద్దాం అనుకోని "హాయ్ సర్, వాట్స్ అప్....వెల్, మా ఫ్రెండ్ వుడ్ బీ కి పెళ్లి సర్...వెళ్ళకపోతే బాగోదు...జస్ట్ రెండు రోజులు లీవ్ కావలి.."
"ఈ మధ్యే కదా ఫ్రెండ్ పెళ్లి అని వెళ్ళావ్.." వాడి భ్రుకుటి ముడి పడింది :)
"ఇపుడు ఫ్రెండ్ పెళ్లి కాదు సర్, ఫ్రెండ్ వుడ్ బీ ది...ప్లీజ్ సర్...అన్నట్లు మీరు మొన్న కోడింగ్ లో చేసిన మార్పులకి మన క్లయింట్ నుండి గొప్ప అప్రిసియెషన్ వచ్చింది.."
అంతే నాకు లీవ్ దొరికింది....
ఫ్రెండ్ పెళ్లి...ఫ్రెండ్ వుడ్ బీ పెళ్లి..రెండు ఒకటే అని వీడికి ఎప్పుడు తెలుస్తుందో అనుకోని నేను నా కొలీగ్ తెగ నవ్వుకున్నాం....


"టింగ్..టింగ్...టింగ్..దయచేసి వినండి ట్రైన్ నెంబర్ 2603 చెన్నై express మరికొద్దిసేపట్లో నాలుగవ నెంబర్ ప్లాట్ఫారం నుండి బయలుదేరుటకి సిద్ధంగా ఉంది (అలా అని తమిళం లో చెప్తుంది)"...కాలు తెగిన కోడిలా తెగ వాయిస్తున్న ఆ  అనౌన్సిమేంట్ చిన్నదాన్ని తెగ తిట్టుకుంటూ పరిగెత్తుకుంటూ టెన్షన్ టెన్షన్ గా సెంట్రల్ కి వచ్చాను...అప్పటికే బండి కదులుతుంది నెమ్మదిగా...మొత్తానికి ఎక్కేసాను..


నా సీట్ లో ఓ ముసలాయన కూర్చున్నాడు "ఈ సీట్ నాదండి.." చెప్పాను.."ఓ అలాగా బాబు..."అని పాపం ఆయన లేచి నా ఎదురు సీట్ లో కూర్చున్నాడు..నాకు సైడ్ లోయర్ బెర్త్ అంతే చాలా ఇష్టం...ఎవరితో లింక్ ఉండదు...ఎంత సేపయినా కిటికీలోంచి అలా బైటకి చూస్తూ మ్యూజిక్ వింటూ ప్రయాణించడం నాకిష్టం ...నాకు కావల్సినపుడు పడుకుంటా, వేరేవాళ్ళు పడుకోవాలంటే నేను లేవల్సిన పనిలేదు...అదన్నమాట...సో ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ మాత్రం ఎవరికీ త్యాగం చెయ్యను...ఓ సారి ఒకామె అడిగింది, బాబు పై బెర్త్ తీసుకుంటావా, నేను పైకి ఎక్కలేను అని..నకివ్వబుద్ధి కాలేదు...కానీ పాపం ఆమె మాత్రం పైకి ఎలా ఎక్కుతుంది..పెద్దామె ..అనుకోని...రాజారాం మోహన్ రాయ్ లా ఫీల్ అయ్యి ఆమెకి బెర్త్ త్యాగం చేసి నేను పైకి ఎక్కాను....కొద్దిసేపయ్యాక అపోసిట్ లోయర్ బెర్త్ లో ఒక అమ్మాయి 'ఆంటీ మీరు ఈ లోయర్ బెర్త్ తీసుకొని..నాకు ఆ సైడ్ లోయర్ ఇస్తారా?' అని అడిగింది...నాకు ఒక్కసారిగా సౌండ్ లేదు..ఈవిడగారు నేను త్యాగం చేసిన బెర్త్ ని మళ్లీ త్యాగం చేసారు..నాకు ఒక్కసారిగా మంటెక్కింది...నేను అప్పర్ బెర్త్ లో ముడుచుకుంటే, నా బెర్త్ లో ఉన్న అమ్మాయి విండో లోకి చూస్తూ ..కూల్ డ్రింక్ సిప్ చేస్తూ, ఇంకో చేత్తో చిప్స్ తింటూ, ఐపాడ్ లో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంది...నాకు చిర్రెత్తింది..'ఓయ్ అమ్మాయి నా బెర్త్ నాకు ఇచ్చేయ్..'అని అడగాలనిపించింది...కానీ అడగలేదు...అప్పటినుంచి ఎవరు బెర్త్ అడిగా 'సారీ' అనేదే నా సమాధానం..


"ఎక్కడిదాక బాబూ ప్రయాణం.." అడిగాడు నా ముందు కూర్చున్న పెద్దాయన..
"హైదరాబాద్..." క్లుప్తంగా చెప్పాను నా ధోరణి లో..
అప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించాను ఆయనని...యాభై పైబడిన వయసు, దాదాపు మొత్తం నెరిసిన జుట్టు..ఎంతో జీవితాన్ని చూశాను అని చెప్పినట్లుండే విశాలమైన నుదురు...ఎన్నో ఆటుపోట్లకు ఎదురు నిలిచిన దర్పాన్ని ప్రతిబింబించే ముఖం...
"మీరు?" అన్నాను కాసేపాగి..
"గుంటూరు దెగ్గర చిన్న పల్లెటూరు బాబు...గుంటూరులో దిగి అక్కడనుంచి బస్సులో వెళ్ళాలి..." చెప్పాడాయన..
"ఓహో..."
"ఎం చేస్తున్నావ్ బాబూ మద్రాస్ లో.."
"ఉద్యోగం..."
"మంచిది బాబు ...చక్కగా ఉన్నావ్..చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నావ్...మంచి భవిష్యత్తు ఉంది నీకు..మంచి మార్గాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకు నాయినా.." చెప్పాడు ..చివరిలో చిన్నపాటి ఉద్వేగం చూసా ఆయనలో..ఆయన కనుసన్నల్లో కన్నీరు నా కంటి చూపు తప్పించుకోలేదు..
"ఏమయిందండి..?" ఏదో తెల్సుకోవాలనే ఆరాటం నాలో..
"నీ లాంటి కుర్రాళ్ళని చూస్తే మా అబ్బాయే గుర్తొచ్చి ఇలా కన్నీళ్ళు పెట్టిస్తాడు..." పైపంచె తో చిన్నగా తన కళ్ళని వత్తుకున్నాడు...
"ఏమయింది తనకి?"
"చనిపోయి ఏడాది...." చెప్పాడు ఆయన

"అయ్యో...ఎలా జరిగింది"
"ఆత్మహత్య చేసుకున్నాడు....పదిమందికి పాఠాలు చెప్పే పంతులుని అయ్యుండి, నా కొడుకు మనసేంటో తెలుసుకోలేకపోయాను..పది మందిలో వాడు గొప్పగా ఉండాలని కలలు కన్నాను..స్థోమతని లెక్కచెయ్యకుండా చదివించాను..కలెక్టర్ గా వాడిని చూడాలని కలలు కన్నాను..నా కలలను నిజం చెయ్యడానికి వాడి జీవితంలో ఎన్నింటినో కాలదన్నాడు..ఓ రోజు పట్నం నుంచి మా అబ్బాయి రాసిన ఉత్తరం రావడం చూసి చాలా సంతోష పడ్డాను...తను ఐ.ఏ.ఎస్ పాస్ అయ్యాడనీ...ట్రైనింగ్ కి వెళ్తున్నాను అని రాసాడు ...ఇక అంతే సంతోషం పట్టలేకపోయాను...ఊరంతా దండోరా వేసుకొని, నా కొడుకు గొప్పతనం ఆ రోజు చెప్పుకొని మురిసిపోయాను..'నా కొడుకు కలెక్టర్ అవ్వబోతున్నాడు రాజయ్య...మన జిల్లాకే వస్తే మన కష్టాలన్నీ తీరుస్తాడు..ఆడు గొప్పోడు అవుతాడు అని నీకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని కదా ' మా స్కూల్ లో పనిచేసే రాజయ్యతో చెప్పి సంబరపడ్డాను...నేను స్కూల్ లో పనిచేసేప్పటి నుంచి రాజయ్య నాకో గొప్ప స్నేహితుడు..రాజయ్యకి నా కొడుకంటే చాలా ఇష్టం...వాడిని ఎప్పుడూ ఎత్తుకొని తిరిగేవాడు...'మా చిన్న దొరగారండి' అనేవాడు ఎప్పుడూ వాడిని చూసి...


రెండేళ్ళు గడిచాయి...అపుడప్పుడు వాడి దెగ్గర నుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి...కానీ మూడు నెలల నుంచి వాడి దెగ్గర నుండి ఒక్క ఉత్తరం కూడా రాలేదు...అక్కడి ఫోన్ నంబరు కూడా తెలీదు....ఓ రోజు రాజయ్య వచ్చాడు ఇంటికి..'మాష్టారు మనం అర్జెంటుగా మద్రాస్ వెళ్ళాలి..బట్టలు సర్దుకోండి' అన్నాడు...ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాజయ్య ముఖంలో ఏదో బాధ "ఏమయింది రాజయ్య...ఎందుకలా ఉన్నావ్..ఉన్నపళంగా మద్రాస్ దేనికి.."అన్నాను.. నన్ను మాట్లాడనివ్వలేదు రాజయ్య...ఆదరాబాదరా ప్రయాణం కట్టించాడు...నా మనసేదో కీడు శంకించింది...భగవంతుడా నా కొడుక్కి ఏమీ కాలేదు కదా...అయినా వాడి ట్రైనింగ్ ఢిల్లీలో అని చెప్పాడు కదా...రాజయ్య మద్రాస్ తీసుకేల్తున్నాడంటే వేరే కారణం ఏదో అయ్యుంటుంది..కానీ ఎంతడిగినా కారణం చెప్పడేంటి..పైగా ఎంతో ముభావంగా ఉన్నాడు..ఎన్నో ప్రశ్నలు మదిని వేదిస్తుండగా మద్రాస్ బైలుదేరాను...


ఆయన చెప్పడం ఆపేశాడు...ఆయన కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘల్లా ఉన్నాయి...ఆయనకీ ఇదంతా గుర్తుచేసి బాధిస్తున్నానేమో అనిపించింది..రైల్ ఎక్కడో ఆగింది...సన్నగా వర్షం మొదలయింది..అతను కిటికీ లోనుంచి అలాగే బైటకి చూస్తున్నాడు..నేను కూడా మౌనంగానే ఉన్నాను...


"రాజయ్య నన్ను నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు.." ఎటో చూస్తున్ననాకు అతని మాటలు వినిపించాయి...గొంతులో ఏదో అడ్డుపడ్డట్లు ఉన్నాయి అతని మాటలు...గుండెలో బాధ మాటలు పెగాలనివ్వకుండా గొంతులో అడ్డుపడుతుంది ఆయనకి..
"అప్పటిదాకా మనసులోనే క్షోభ అనుభవించిన నాకు ఇక ఓపిక నశించింది...కాలర్ పట్టుకొని అడిగాను రాజయ్యిని 'నా కొడుక్కి ఏమయింది' అని..ఒక్కసారిగా అతను ఉగ్గపట్టుకున్న బాధంతా కన్నీళ్ళ రూపం దాల్చి, వంట్లో సత్తువంతా నశించి కూలబడి గుండెలు అవిసేలా ఏడ్చాడు..ఏదో అర్ధమయింది నాకు...అది నిజం కాకూడదు అని మనసులో వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నాను...వొళ్ళంతా వోణుకు ప్రారంభమయ్యింది..అక్కడి నుంచి వెనుకకు అడుగులు వేసుకుంటూ వెళ్లాను..వెనుక నుంచి రాజయ్య నా చెయ్యి పట్టుకొని అటువైపుగా తీసుకెళ్ళాడు....మార్చురీ గది దెగ్గరకు...."


నాకు తెలీకుండా నా కళ్ళలో నీరు...ఎంత బాధని అనుభవించి ఉంటాడు ఈయన...కన్న కొడుకుని అన్ని ఏళ్ళ తరువాత అక్కడ విగత జీవిలా అలా చుస్తే..గుండె పగలదా..అల్లారు ముద్దుగా పెంచుకొని, ఎన్నో ఆశలు పెట్టుకొని చదివించుకున్న కొడుకుని కాటికి పంపాలంటే ఆయన కొన ఊపిరి ఆగిపోదా...


నెల్లూరు స్టేషన్ దాటింది బండి...వర్షం తగ్గు ముఖం పట్టింది..పచ్చటి పంట పొలాల మధ్య దూసుకుపోతుంది ధూమశకటం...అప్పుడే వెలసిన వానతో కమ్మటి మట్టి వాసన ముక్కు పుటలకి అందుతూ పరవశానికి లోను చేస్తుంది వాతావరణం...కాని దాన్ని అస్వాదించలేకపోయా....ఈ ప్రకృతిలో అందాలని ఆస్వాదించాలంటే మన మనఃస్థితి ముఖ్యం..ఆ స్థితి వేరేలా ఉంటే, బయట ఎంత అందమున్నాఅదంతా అడవి కాచిన వెన్నెలే కదా...కాదంటారా?..

ఆయన తన బాగ్ లోనుంచి ఓ ఫోటో చూపించాడు నాకు..ఓ చిన్న పిల్లాడి ఫోటో..ఏడాది ఉంటాయేమో ఆ పిల్లాడికి "మీ  అబ్బాయి చిన్నప్పటిదా?"  అడిగాను ఆ ఫోటో చూస్తూ..
"ఎలా ఉన్నాడు?" అడిగాడు ఆయన..
"చాలా అందంగా ఉన్నాడు.." చెప్పాను...
"నా కొడుకు కాదు...నా మనవడు.." చెప్పాడాయన...
"మీకు ఎంత మంది సంతానం..." అడిగాను...వాళ్ళ అబ్బాయికి పెళ్లి కాలేదు కదా అని సందేహం కలిగి...
"నీ సందేహం అర్ధమయింది...వీడు నా కొడుకు కొడుకే..." అన్నాడు ఆయన...ఆశ్చర్యపోయాను కళ్ళు ఇంతవి చేసుకుంటూ...
ఆయనే మళ్లీ కొనసాగిస్తూ "నా కొడుకుని ఆ రోజు అలా చూసిన నా బాధ వర్ణనాతీతం...ఆ రోజు అక్కడికి ఇంకో అమ్మాయి వచ్చింది ఓ పసి పిల్లాడిని ఎత్తుకొని...రాజయ్య చెప్పాడు ఆమె నా కోడలు అని...నాకేమీ అర్థం కాలేదు...నా కొడుకు పోయిన వియోగంలో పిచ్చి ఎక్కిన వాడిలా ఉన్నాను...దేవుడు నన్ను ఇంతలా పరీక్షించాలా అనిపించింది ..రాజయ్య చెప్పాడు ఈ కబురు ఆ అమ్మాయే ఉత్తరం రాసి స్కూల్ కి పోస్ట్ చేసిందట...ఆ అమ్మాయి వైపు చూసాను...ఏడ్చి ఏడ్చి ముఖం కంది పోయి ఉంది..కళ్ళు జాలిగా నా వైపే చూస్తున్నాయి...ఆమె చేతిలో పసి పిల్లాడు...వాడు నా మనవడు అని తెలియడానికి ఎక్కువసేపు పట్టలేదు...కానీ అంతా అయోమయంగా ఉంది..నా కాళ్ళ క్రింద భూమి కంపిస్తుంది..ఆ తర్వాత ఆ అమ్మాయి చెప్పింది..నా కొడుకు ఐ.ఏ.ఎస్ పాస్ అవ్వలేదు, ట్రైనింగ్ కీ వెళ్లలేదు...వాడు మద్రాస్ లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు..అనుకోని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవలసి వచ్చిందట...

"మామయ్య గారు దీనిలో నా తప్పు చాలా ఉంది...ఆయన మీ గురుంచి ఎప్పుడూ చెప్తూనే ఉండేవారు...మీకు జరిగినది అంతా చెపితే మీరు తప్పక మమ్మల్ని క్షమిస్తారు అంటుండేవారు...మీరు ఆయనని కలెక్టర్ గా చూడాలని కలలు కనేవారని చెప్పి, ఆ కోరిక తను తీర్చలేకపోయాడని చాలా బాధపడేవారు..ఓ సారి ఆయన బాధ చూడలేక ఆయనకి తెలీకుండా ఉత్తరం రాశాను మిమ్మల్ని సంతోషపెట్టాలని..అలానే రాస్తూనే ఉన్నా..ఓ రోజు ఆయనకి తెల్సి నా మీద చాలా కోప్పడ్డారు..ఇక మా నాన్నకి నా ముఖం ఎలా చూపించాలి అని బాధపడ్డారు...నేను అంత ఆలోచించలేదు...అప్పటినుంచి నేను ఉత్తరాలు రాయలేదు...ఓ రోజు ఆయన ఇంటికి వచ్చి చాలా ముభావంగా ఉండటం చూసాను..'నేను లేకపోతె నువ్వు దైర్యంగా బ్రతకగలవా?' అని నన్నడిగితే ఒక్కసారిగా ఏడ్చాను.. 'ఎందుకు అలా అంటారని అడగ్గా ..'ఇక మా నాన్నకి జన్మలో నా ముఖం చూపించలేను...మా ఊరి రమేష్ నాకు ఈ రోజు కనిపించాడు..వాడు దుబాయ్ వెళ్ళడానికి మద్రాస్ వచ్చాడు..'నువ్ కలెక్టర్ వి అంటగా?..మీ నాన్న ఊరంతా దండోరా వేస్తున్నాడు ..' అని చెప్పేసరికి నాకు కన్నీళ్ళు ఆగలేదు...ఇక ఆయనకి నేను ముఖం చూపలేను...నాకు బ్రతకాలని లేదు' అన్నారు..'మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్న నా గురుంచి ఆలోచించరా?' అన్నాను...ఆయను నన్ను తన గుండెలకి హత్తుకున్నారు...మరుసటి రోజు మృత్యువు వడిలో ఉన్నారు..." ఆ అమ్మాయి కన్నీళ్ళపర్యంతం అయింది...నేను నా మనవడిని ఆ అమ్మాయి దగ్గర నుంచి  తీసుకొని నా గుండెలకి హత్తుకున్నాను..

అదంతా విన్న నాకు దేవుడు ఒకళ్లకే ఇన్ని కష్టాలు ఎందుకు పెడతాడు..కొందరికి ఎందుకు అన్ని సుఖాలే ఇస్తాడు అనిపించింది..."ఇపుడు మీ మనవడు, కోడలు మీతో పాటే ఉంటున్నారా?" అని అడిగాను .."నా మనవడు మా ఇంట్లోనే ఉన్నాడు...వాడి నాయనమ్మతో ఆడుకుంటున్నాడు...నా కోడలికి జబ్బు చేస్తే మద్రాస్ లో హాస్పిటల్ లో జాయిన్ చేసాం...ఇపుడు అక్కడి నుంచే వస్తున్నా...మళ్ళీ రేపు తిరుగుప్రయాణం ఉంది మద్రాస్ కి.." చెప్పాడు ఆయన
"అయ్యో ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారు...మళ్లీ రేపే ఎందుకు వెళ్ళాలి..." అడిగాను..
"నా భార్యని...నా మనవడిని తీసుకువస్తున్నా తిరుగుప్రయాణంలో... డాక్టర్ గారు ఇక రెండు మూడు రోజులకంటే కష్టం అన్నారు...చివరి సారిగా వాడి తల్లిని వాడికి చూపించే భాద్యత నాది..." ఆయనలో ఏ స్పందన నాకు కనపడటం లేదు...చాలా మాములుగా చెప్పారు..బహుశా జీవితం అతన్ని అన్నీటికి సమాయత్తం చేసిందేమో...దేన్ని అయినా ఎదుర్కొనే మనో నిబ్బరాన్ని ప్రసాదించిందేమో...
"నా కోడలికి బ్రెయిన్ ట్యూమర్..."
నేనేమీ మాట్లాడలేకపోయాను ఇక....ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఓ మనిషి జీవించగాలడా?..అసలు భరించగాలడా ??...నేనయితే...తలచుకోగానే నా వెన్నులో వణుకు....
ఇక మేమేమీ మాట్లాడుకోలేదు...ఇంకా ఏమి వినాల్సి వస్తుందో అని నేనేమి అడగలేదు...అతను చెప్తున్న వాటిని జీర్ణించుకోడానికి నాకే కష్టంగా ఉంది...

ఎప్పుడు నిద్రలో జారుకున్నానో తెలీదు ...అలా కూర్చొనే నిద్రపోయాను...లేచేసరికి అంతా చీకటి...ఆయన లేడు నా ముందు సీట్ లో ...టైం చూసా ఒంటిగంట దాటింది...అవును గుంటూరు దాటి అరగంట అయ్యింది...అతను దిగి పోయాడు...నా మనస్సంతా భారంగా...భాధగా తయారయింది...



Wednesday 15 July, 2009

నీ జతలో...


గడిపాను ఇంతకాలం నీ జతలో....తీరేదెలా ఆ లోటు
నీవు లేవనీ.. ఇక రావనీ తెలిశాక .....

తడిచాను నీ చిరునవ్వుల జడిలో...మరచేదెలా ఆ సవ్వడి
మూగాబోయావనీ...మరలి రాలేవనీ తెలిశాక...

కరిగావు ఓ కలగా నా కన్నుల వాకిట్లో...మేలుకొనేదెలా ఈ ఉదయం
కల చెదిరిందనీ... తెలవారిందనీ తెలిశాక...

అనురాగాలు కురిపించావు గారాల పలుకులతో... వినలేనేమో ఆ రాగం
శ్రుతి తప్పిందని... పోలమారిందనీ తెలిశాక...

ఊహలుగా జీవించావు నా ఆశల పల్లకిలో...కదిలేదెలా ఇక ముందుకు
నడక ఆగిందని... దారి తప్పిందనీ తెలిశాక...

అధ్భుతాలు చూపించావు నీ ఆదర్శాల బాటలో... కనలేనేమో ఇక ముందు
చూపు మందగించిందనీ..మసకబారిందనీ తెలిశాక...

నడి రాతిరిలో మేలుకుంటే కమ్మని నీ తలపులతో...దరిచేరదు నిద్దుర
నీ పిలుపు వినపడే దూరంలో నేను లేనని తెలిశాక..

నాకోసం మళ్లీ పుడతావా మరుజన్మలో...ఎదురుచూసే నా చూపులు
ఆలా ఆకశం వైపు... వింటున్నావా ప్రియతమా నా మనవి.



Friday 10 July, 2009

ఓయ్...ఓయ్....అంటూ క్యాజువల్ గా పిలిచెరో...


రోజు కొన్ని ఘనకార్యాలు చేశాను నేను....మొదటిది రోజు ఆఫీసుకి సెలవు పెట్టడం.
"
వాట్ ఆర్.కే (నన్ను అలానే పిలుస్తారు ఆఫీసు లో), వై డూ యు వాంట్ లీవ్.... ప్రతిసారి లీవ్ అడుగుతావేంటి.." మండిపడ్డాడు మా మేనేజర్ నేను లీవ్ అడిగిన వెంటనే...అమ్మతోడు రెండు నెలల నుంచి ఒక్క లీవ్ కూడా తీసుకోలేదు...వాడంతే, అలాగే అంటాడు.. ఆరునెలల తరవాత లీవ్ అడిగినా, నిన్నే తీసుకున్నావ్ కదా అన్నట్లు మాట్లాడుతాడు...
"
అది కాదండీ...ఫ్రెండ్ పెళ్లి ఉంది..వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు.."
"
ఆహా...సరే ఇలా కూర్చో...ప్రాజెక్ట్ లో నీ పెర్ఫార్మన్స్ గురుంచి... పెండింగ్ టాస్క్ గురుంచి మాట్లాడదాం.." అంతే అరగంట చావగొట్టాడు...ఒక్క లీవ్ అడిగిన పాపానికి ఇలా వేయించుకు తింటావా..ఒరేయ్ దొరక్కపోవురా నాకు..కసికసిగా తిట్టుకున్నా.."వాట్ డిడ్ యు సే.."అన్నాడు అనుమానంగా....నీ పిండాకూడు...నీ శార్ధం...బొంగు బోషానం..."అబ్బే ఏం లేదు ...ప్రాజెక్ట్ మీద మీకెంత శ్రద్ధ." అనుకుంటున్నా అంతే... "పొగడ్తలు కాదు పని కావాలి నాకు...సరే వెళ్ళు..." ..మొత్తానికి లీవ్ ఇచ్చాడు...

అసలు లీవ్ ఎందుకు పెట్టానో నాకే తెలీదు...ఏంటో అపుడపుడు అలా లీవ్ పెట్టాలనిపిస్తుంది అంతే...మరుసటి రోజు పదకొండుకి లేచా...ప్రతిరోజు తొమ్మిది కల్లా "కౌసల్యా సుప్రజా రామా..పూర్వ సంధ్యా.." అనుకుంటూ నా సెల్ ఫోన్ అలారం కొట్టగానే సెల్ ఫోన్ లోఅలారం పెట్టినవాడిని..అసలు అలారం అనే కాన్సెప్ట్ ని కనుక్కున్న వాడిని సంస్కృతం లో తిట్టుకుంటూ...దాన్ని స్నూజ్ చేస్తూ తొమ్మిదీ ఇరవై కి లేచే వాడిని... రోజు అలారం గోల లేకుండా హాయిగా నిద్రించా...నిద్రలో ఉన్నసుఖాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను నేను... బహుశా ప్రొద్దున తొమ్మిది ఇంటికి అలారం పెట్టుకునే గొప్ప డిస్సిప్లిన్ కలిగిన అబ్బాయిని నేనే అనుకుంటా...పన్నెండుకి బ్రష్ చేశా... అబ్బో ఇలాంటి మంచి అలవాట్లు చాల ఉన్నాయిలెండి... తర్వాత లాప్ టాప్ ఓపెన్ చేసి...మెయిల్స్ ...చాటింగ్ (ఒక్క అమ్మాయికూడా ఆన్ లైన్ లో లేదు రోజు ... :( ...) ఇంక బోర్ కొట్టి మ్యూజిక్ ఆన్ చేశా

"
నూట డెబ్భై ఆరు బీచ్ హౌస్ లో ప్రేమ దేవతా....
ఎల్లో చుడిదార్ వైట్ చున్నితో దోచే నా ఎదా
ఓయ్..ఓయ్...అంటూ క్యాజువల్ గా పిలిచెరో
ఓయ్...ఓయ్..ట్వంటీ సార్లు కల్లో కలిసేరో...
ఓయ్...ఓయ్...యంటి గుండె నిండా నిలిచెరో...
లవ్ అట్ ఫస్ట్ సైట్...." అంటూ సాగిందా పాట.....



అంతే అలా తెలిపోయాను పాటలో...తెగ నచ్చేసింది ఓయ్ పాట..ఎప్పుడూ అంత శ్రద్దగా వినలేదు పాటని...ఒక పాట నచ్చితే ఇక సినిమా చూడాల్సిందే... అంతే టైం చూసాను...ఒకటి అయింది...నెట్ ఓపెన్ చూసి థియేటర్ లో ఓయ్ సినిమా ఆడుతుందో చూశా...కేసినో థియేటర్లో చెన్నై లో తెలుగు సినిమాలు కంటిన్యువస్ గా ఆడేది రెండు థియేటర్లలో మాత్రమే...ఒకటి జయప్రద..ఇంకోటి కేసినో... మద్య జయప్రద గారు టాక్స్ కట్టలేదని ఆవిడగారి థియేటర్ ని మూసేసారు..ఇక మాకు మిగిలింది కేసినో మాత్రమే...అదొక తొక్కలో థియేటర్..దానికంటే మా గుంటూరు లో నాజ్ థియేటర్ సూపర్ ఉంటుంది....ఏం చేస్తాం తప్పదు మరి...కేసినోలో మటినీ షో మూడున్నరకి...వెళ్ళడానికే గంట పడుతుంది, టికెట్లు అందుతాయో లేదో అనుకోని గబగబా స్నానం చేసి..రెడీ అయ్యి బైల్దేరాను...అప్పుడు గుర్తొచ్చింది ప్రొద్దుటి నుంచి ఏమీ తినలేదని.. విషయం గుర్తురాగానే వెంటనే ఆకలి వేసింది...ఏం చేస్తాం జీవితం...సర్లే టికెట్లు తీసుకున్నాక టైం ఉంటుందిగా తినోచ్చులే అనుకొన్నాను..థియేటర్ కి వచ్చి టికెట్ తీసుకున్నాను...


టైం మూడు అయింది, అరగంటలో తినేసి రావచ్చులే అనుకోని బైటకి వచ్చి ఒక రెస్టారెంట్లో కూర్చున్నాను..సీట్ నెంబర్ ఎంత ఇచ్చాడో చూసుకుందాం అని పర్సు తీసి అందులో ఉన్నటికెట్ తీసా...దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది...కారణం టికెట్ ఉంది కానీ డబ్బులు లేవు...అయిదు వందలు కదా నేను వాడికి ఇచ్చింది టికెట్ కోసం...అంతే పైనుంచి కిందదాకా ఒక షాక్ తగిలింది...సో వాడు నాకు తిరిగి చిల్లర ఇవ్వలేదు...టికెట్ యాభై రూపాయలు...నాలుగు వందల యాభై బొక్కేనా??, నా మైండ్ వేసిన ప్రశ్నని నేను ఇంకా జీర్ణించుకోలేదు..."సర్ ఆర్డర్ సర్.." బెరేర్ వచ్చాడు.."...మీ రెస్టారంట్లో కార్డు తీసుకుంటారా?" అడిగాను నేను..."సారీ సర్...ఓన్లీ కాష్.." అన్నాడు వాడు.."ఓహ్!! అలాగా... విల్ బీ బ్యాక్." అని చెప్పి అక్కడ నుంచి బైటకి వచ్చా..."ఒరేయ్ మెంటల్...కౌంటర్ వాడిని వెళ్లి అడుగు ఇలా చేంజ్ ఇవ్వలేదు అని.." మొట్టికాయి వేసింది నా మనసు...వెంటనే కౌంటర్ దెగ్గరికి పరిగెట్టాను..ఇవ్వడని తొంభై తొమ్మిది శాతం తెలుసు...కానీ ఒక్క శాతం మిస్ అవ్వకూడదు అని...నేను అడగ్గానే వాడు ముఖం అదోలా పెట్టాడు ' ఊరు మనది?' అనే లెవెల్లో...ఇక నేను అక్కడ నుంచి వచ్చేశా...పది నిముషాల్లో షో మొదులవుతుంది...ఒక వైపు ఆకలి...దేగ్గర్లో ఏదన్న ఏటిఎం ఉందేమో అని చూశా...ఏమీ కనిపించలేదు...సర్లే సినిమాలో పడితే ఆకలి గుర్తుండదులే అని కేవ్ కేవ్ మని కేకలు వేస్తున్న ఆకలి పెగులకి సర్దిచేప్పా...

"
సెలెబ్రేషన్.. అది చేసుకోడానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కో రీజన్...అందరు జరుపునే కామన్ సెలేబ్రషన్ న్యూ ఇయర్..న్యూ ఇయర్ సెలేబ్రషన్ అంటే నాకు చాలా ఇష్టం...ఎందుకంటే రోజు నా బర్త్ డే కాబట్టి...కానీ లాస్ట్ ఇయర్ నుంచి జరుపుకోడం మానేసాను..." అంటూ హీరో సిద్దార్థ్ అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళడంతో ఓయ్ సినిమా మొదలవుతుంది....ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించింది...అంటే యాభై రూపాయలకి సినీవినోదం బాగానే ఉండేది...కానీ అయిదువందలు బొక్కేట్టుకున్నాంగా అంచానాలు పెరిగాయి..కాని ఓయ్ సినిమా కోసం అయిదువందలు ఎవడు పెట్టి ఉండడెమో...నేను తప్ప...అంటే పెట్టేలా దేవుడు శాసించాడు... కిషెన్ పాటించాడు... కౌంటర్ వాడు పండగ చేసుకున్నాడు..

ఇంటర్వెల్లో నా ఆకలి పేగులు మళ్ళి నిద్ర లేచి గోల చెయ్యడం స్టార్ట్ చేసాయి... థియేటర్ లో క్రెడిట్ కార్డు ఎవడు తీసుకుంటాడు నా బొంద..అయినా అడిగాను...వాడు విచిత్రం గా చూశాడు....సినిమా కి వెళ్తే ఇంటర్వెల్ లో మినిమం ఒక చేతిలో ఒక కూల్ డ్రింక్, ఇంకో చేతిలో చిప్స్ లేక పఫ్ ప్యాకెట్ లేనిదే సెకండ్ హాఫ్ చూసినట్లు ఉండదే...చా తొక్కలో జీవితం...నాకు ఎప్పడు ఫ్రస్ట్రేషన్ వచ్చినా నా నోటితో నా జీవితం బలవుతుంది...చదివారుగా నా ఇంటర్మీడియట్ సంగతులు...ఇప్పుడు సెకండ్ హాఫ్ అసలు ఎలా చూడలబ్బా...చిరాకు వేసింది...చా అయినా అంత మతిమరుపు ఏంటో నాకు... జన్మలోనో కౌంటర్ జీవికి మతిమరుపు జీవి బాకీ అనుకుంటా...అందరు కూల్ డ్రింకులు, పుఫ్ లు, పాప్ కార్న్ లు తెగ కొనుక్కొని వెళ్తున్నారు...అవన్నీ చూసే నా ఆకలి పేగులు బ్రేక్ డాన్స్ చెయ్యడం మొదలుపెట్టాయి...పాపం ప్రొద్దుటి నుంచి వాటి సంగతి చూడలేదు మరి..అవి ఎలా తట్టుకుంటాయి..జాలి వేసింది నాకు వాటి మీద ...చురుగ్గా పనిచెయ్యడం మొదలు పెట్టింది నా బుర్ర సడన్ గా.... తళుక్కున మైండ్ లో ఒక మెరుపు మెరిసింది...


వెంటనే పర్సు తీసాను...అందులో ఒక చిన్న జిప్ హోల్దర్ ఉంటుంది..అది తెరిచాను...కళ్ళు జిల్ జిల్ జిగేల్ మన్నాయి...అవును అందులో యాభై రూపాయలు ఉన్నాయి మరి...నిన్న రాత్రి డిన్నర్ బిల్ పే చేసాక వాడిచ్చిన యాభై చేంజ్ ఎందుకో వెరైటిగా జిప్ హోల్దేర్ లో పెట్టాను...ఇప్పుడు అర్థం అయింది అపుడు అలా ఎందుకు పెట్టానో...కొన్ని కొన్ని సార్లు మనం కొన్ని పనులు వెరైటి గా చేస్తుంటాం...ఎందుకో మనక్కూడా తెలీదు...బహుసా అవి ఇలాంటి అత్యవసర స్థితిలో ఉపయోగపడ్డానికేమో....నా రీజనింగ్ మరియు అనలిటికల్ అబిలిటీకి నాకే ముచ్చటేసింది...అపుడు నాకు కనిపించిన యాభై రూపాయలే నాకు అయిదువందల కంటే ఎక్కువ అనిపించాయి...అప్పుడు నాకు ఇంకో విషయం అర్థమైంది...డబ్బుకి విలువ ఒక అంకె పక్కన ఎన్ని సున్నాలు తోడైతే అంత పెరిగినట్లు కాదని... డబ్బు ఒక మనిషికి ఎంత గొప్ప అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడితే దానికి అంత విలువ అని...అయ్యబాబోయ్, ఇలాంటి టైం లో బిచ్చ గాడికి బిర్యాని పొట్లం దొరికినట్లు నాకు యాభై దొరికేసరికి నా అనలిటికల్ పవర్ కి వెయ్యి మెగావాట్లు అందాయిగా...ఎన్నెని విషయాలు తెల్సిపోతున్నాయో...అమ్మో సెకండ్ హాఫ్ టైం అయింది అనుకోని వెండర్ దెగ్గరికి వెళ్లి ఒక ఫాంటా పెట్ బాటిల్...రెండు ఎగ్ పఫ్ లు కొనుక్కొని లోపలి వెళ్ళా...


అపుడే సినిమా స్టార్ట్ అయింది, పాపం హీరోయిన్కి కాన్సర్ ఉందని తెల్సి హీరో ఫేస్ జీరో వాల్ట్ బల్బు అయింది...ఇక అక్కడి నుంచి హీరోయిన్ కోరికలు తీర్చడానికి నానా కష్టాలు పడతాడు మన హీరో...అమ్మో ఇన్ని వెరైటీ కోరికలు ఉన్న అమ్మాయిని నేను ఖచ్చితంగా లవ్ చెయ్యను...ఎందుకంటే నాకు మహా బద్ధకం, నా చిన్ని చిన్ని కోరికలే ఇంకా నేను తీర్చుకోలేదు, ఇంకా దాని కోరికలు ఎక్కడ తీర్చను...రివర్స్ గా నా కోరికలు తీర్చే అమ్మాయి దొరికితే బాగుండేమో..."దేవుడా... మంచి దేవుడా...నువ్ నాకు యాభై రూపాయలు దొరికేలా చేసావ్..తద్వారా కూల్ డ్రింక్ ఇచ్చావ్...రెండు పుఫ్ లు కూడా ఇచ్చావ్ అలాగే ఇంకో చేత్తో మంచి గర్ల్ ఫ్రెండ్ ని ఇవ్వు...నాకు ఏది కావాలంటే అది కొనిపెట్టేలా...నా ఫోన్ బిల్లులు అన్ని తన బిల్లులుగా తలచి అన్ని క్లియర్ చేసేలా...తన క్రెడిట్ కార్డ్ నా బర్త్ డే కి గిఫ్ట్ గా ఇచ్చేలా(బిల్ మాత్రం తన అడ్రస్ కే వచ్చేలా).... విధంగా నాకు గర్ల్ ఫ్రెండ్ ని ఇస్తావని కోరుకుంటాను....నువ్ ఇస్తావ్...నాకు తెలుసు...ఎందుకంటే యు ఆర్ బెసికల్లీ వెరీ గుడ్ గాడ్.." అని వెంకి లెవెల్ లో దేవుడికి చిన్న ప్రార్ధన చేసుకున్నా...సినిమా చివర్లో కొంచెం బాధేసింది...పాపం షామిలి చనిపోతుంది...చనిపోయేప్పుడు హీరో మీద తనకి ఎంత ప్రేమ ఉందొ చూపిస్తుంది..చివర్లో లవ్ యు అంటుంది...అపుడు నేను కూడా కొంచెం ఫీల్ అయ్యాను...అక్కడ కొంచెం సెంటిమెంట్ నచ్చింది...మొత్తానికి మూవీ అయిపొయింది బైటకి వచ్చేశా...



"
ఓయ్ ...ఓయ్...నిన్నే..."

ఏంటబ్బా హీరోయిన్ వాయిస్లా ఉంది అని వెనక్కి తిరిగి చూశా...

ఎవరూ లేరు...అంత నీ భ్రమా...బ్రాందీ...విస్కీ...అంతే..అని చెప్పింది నా మనసు...

"
ఓయ్ ఓయ్ ..అంటూ క్యాజువల్ గా పిలిచేరో...

ఓయ్ ఓయ్ ..కల్లో ట్వంటీ సార్లు కలిసేరో...."
...