Search This Blog

Monday, 31 May, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 7


దివ్య చెప్పిన విషయం కార్తీక్ కి చాలా షాకింగ్ గా.. నమ్మలేనట్లుగా అనిపించింది ...
"అతను ఎక్కడ కనిపించాడు నీకు?" అడిగాడు కార్తీక్
"గీతం కాంపస్ మెయిన్ గేటు దెగ్గర... నేను లోపలికి ఎంటర్ అవ్వబోతుండగా దివ్యా అంటూ గట్టిగా పిలిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు నా దెగ్గరికి..." అంది దివ్య..
"అలాగా!!...ఇంకేమన్నా చెప్పాడా నీతో.." అడిగాడు..
"ఇంకానా...ఆ ..మర్చిపోయాను చెప్పడం...సంహితని కలిశాడట..మాట్లాడాడట..ఎందుకో సంహిత నేనెవరో ఎరుగనట్లు ప్రవర్తించింది..'నాపైన ఉన్న ప్రేమంతా కరిగిపోయిందా, చివరిదాకా నాతోనే ఉంటాను అని చేసిన ప్రమాణం మరచిపోయావా' అని సంహితని అడిగాను కానీ ఆమె ఎవరో పిచ్చివాడిని చూసినట్లు చూసి వెళ్ళిపోయింది అని చెప్పాడు నాతో.." అంది దివ్య
"నిజమా... ఓ గాడ్ " అలాగే తలపట్టుకొని కూర్చున్నాడు కార్తీక్.. 'ఎవరో ఆమెకి గతాన్ని గుర్తుచేసే ప్రయత్నం చేసారు' అని డాక్టర్ అభిరాం చెప్పిన  మాటలు గుర్తుకు వచ్చాయి కార్తీక్ కి..
"అదే...నాకూ అర్థం కావడం లేదు... సుదీర్ అన్నయ్య లాగానే చెప్తున్నాడు అన్నీను..." అంది దివ్య అతని ప్రక్కనే కూర్చుంటూ ..
"సరే...మనం అతన్ని కలవాలి..." అన్నాడు అప్పుడే నిర్ణయించుకున్నవాడిలా..
"అతను ప్రతి రోజూ కాలేజీకి వచ్చి నన్ను లోపలి వెళ్ళనివ్వండి, నేను ఈ కాలేజీ స్టుడెంటునే..సంహితని పిలవండి అని అడుగుతాడట, సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు...సో రేపు నువ్వు నాతో పాటు కాలేజీకి వస్తే అతన్ని మనం కలవొచ్చు.." అంది దివ్య
"సరే...రేపు నేను నీతో పాటు వస్తాను..." అన్నాడు కార్తీక్ .

                                           ***  
                                                      
"డాడీ...." అంది సంహిత రూంలోకి అప్పుడే వచ్చిన ఆమె తండ్రిని చూసి ..
"చెప్పమ్మా...ఇప్పుడెలా ఉంది...ఆర్ యు ఆల్ రైట్ " అడిగాడు ఆమెని..
"ఫైన్ డాడీ...నాకోసం చంటి ఏమైనా కాల్ చేసాడా? " అడిగింది
బిత్తరపోయాడు ఆమె తండ్రి...."చంటి..ఎవరమ్మా??" అడిగాడు తడబడుతూ ...
"చంటి !!...అవును చంటి ఎవరు ??...అతని పేరు కార్తీక్ కదా...నేనేంటి చంటి అన్నాను...మొన్న హాస్పిటల్లో కూడా అంతే పిలిచాను అతన్ని..." అంది తండ్రి వైపు ఆశ్చర్యంగా చూస్తూ...
"నీ చిన్నప్పటి చంటి గుర్తొచ్చి ఉంటాడు లేమ్మా..అందుకే అలా పిలిచి ఉంటావ్..." అన్నాడు..
"ఏమో...ఎనీవే, ఆ కార్తీక్ ఏమన్నా కాల్ చేసాడా..?" అడిగింది
"లేదు...ఎందుకమ్మా? " అతనిలో ఏదో భయం మళ్ళీ తన కూతురు తనకి కాకుండా పోతుందేమో అని..
"ఏం లేదు...." సుధీర్ ఆఖరి చూపు కూడా ఆమె దక్కించుకోలేక పోయినందుకు బాధగా ఉంది ఆమెకు..
"సరే...రెస్ట్ తీసుకో..." అంటూ వెళ్ళిపోయాడు
"నాన్నా..." పిలిచింది... గుమ్మం దెగ్గరికి వెళ్ళిన అతను తిరిగి చూశాడు ..
"మీకో విషయం చెప్పాలి...నేనొకతన్ని ప్రేమించాను..."
ఆశ్చర్యంగా చూసాడు ఆమె వైపు....
"అతనికీ నాకూ పెద్ద పరిచయం లేదు..కానీ అతన్ని చూడకపోతే ఉండలేకపోయేదాన్ని.. పిచ్చేక్కినట్లు ఉండేది..ఎందుకో నాకే తెలీదు.. ఈ విషయం ఇంతవరకు సుధకి కూడా చెప్పలేదు నాన్న...మీకే చెప్తున్నాను... ఎందుకంటే నాకు మనసారా ఏడవాలనుంది నాన్నా మీ భుజాన్ని ఆనుకొని... అతను నాకిక లేడు నాన్నా...ఆక్సిడెంట్ లో చనిపోయాడు...అది నేను చూశాను.. " ఆమె కళ్ళలో కన్నీరు ...
ఆ విషయం విన్న ఆతనికి చెమటలు పట్టాయి ఒక్కసారిగా...
"ఎవరతను ?" అడిగాడు ఏదో ఒక ట్రాన్స్ లో ఉన్నవాడిలా ...
"సుధీర్...." చెప్పిందామె ..
అతని కాళ్ళ క్రింద భూమి కంపించింది... నిశ్చేష్టుడై తన కూతురి వైపే చూస్తున్నాడు... ఏమవుతుంది తన కూతురికి .. సుధీర్ గురుంచి ఎలా తెలిసింది .. ఆతనికి కార్తీక్ మీద అనుమానం కలిగింది..

                                            *** 
                                         
కార్తీక్ తో కలిసి కాంపస్ కి వచ్చింది దివ్య... అతని కోసం చుట్టూ చూస్తుండగా బస్సు స్టాప్ లో కూర్చొని ఒకతను కనిపించాడు దివ్యకి...
"అదిగో బస్సు స్టాప్ లో ఉన్నాడే...అతనే .." అంది దివ్య..
అతనివైపు పరీక్షగా చూసి ." పదా ..." అంటూ వెళ్ళాడు దివ్యతో కలిసి అతని దెగ్గరికి
కాళ్ళు ముడుచుకొని కూర్చొని మోకాళ్ళలో తల దాచుకున్నాడు అతను ...
"హలో...." పిలిచాడు కార్తీక్..
తలెత్తి చూసిన తన కళ్ళలో ఒక్కసారిగా ఆశ్చర్యం...వెనువెంటనే ఆకాశమంత ఆనందం...
"కా...ర్తీ...క్..." అన్నాడు లేచి నిలబడుతూ నమ్మలేనట్లుగా..
షాక్ తిన్నాడు కార్తీక్ ఒక్కసారిగా...'ఇతను నన్నెలా గుర్తుపట్టాడు...ఇతను ఎవరో కూడా నాకు తెలీదే...కానీ ఇతని కళ్ళలో నన్ను చూడగానే ఆ మెరుపేంటి??..ఎవరితను..' ఎన్నో ఆలోచనలు కార్తీక్ లో సుడులు తిరుగుతుండగా మెల్లిగా అన్నాడు ..." ఎవరు నువ్వు ?" అని ..
సంతోషంగా కార్తీక్ దెగ్గరికి రాబోతున్నవాడల్లా ఒక్కసారిగా ఆగిపోయాడు...అతని కళ్ళలో తీవ్రమైన బాధ.. ద్రవించిన ఆ బాధ కళ్ళ వెంబడి నీరై కారుతుండగా చలించిపోయాడు కార్తీక్ ...

"నేను నీ బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ ని కార్తీక్...ఎందుకు నన్నిలా దూరం చేస్తున్నారు అందరూ..నేనెవరో తెలియనట్లు ఎందుకు ఉండిపోతున్నారు...ఏం కార్తీక్ నేను అప్పుడే నీకు అంత కాని వాడిని అయిపోయానా..ఈ స్నేహితుడితో ఋణం తీరిపోయిందా..." అంటున్న ఆ వ్యక్తి ఇంకేవరో కాబట్టి తన గుండె ఇంకా ఆగిపోలేదు...అదే నిజంగా సుధీర్ నోటివెంట ఆ మాట వచ్చుంటే ఆ క్షణమే ప్రాణాలు విడిచేవాడు కార్తీక్..  

"నువ్వు మా అన్నయ్యవి కాదు...ఎవరు నువ్వు?" నిలదీసింది దివ్య..
హతాశుడయ్యాడు అతను ఆ మాటకి... అతన్ని చూస్తే కార్తీక్ కి ఏదో తెలియని బాధ..అతను అబద్దం చెపుతున్నట్లుగా అనిపించడం లేదు కార్తీక్ కి...కానీ అతను చెప్పేది నిజం అయ్యే అవకాశమే లేదు...అందుకే స్థిరంగా "సుధీర్ చనిపోయి ఆరునెలలు అయింది...ఆక్సిడెంట్ లో చనిపోయాడు...నువ్వు సుధీర్ ఎలా అవుతావు...మా సుధీర్ ఎలా ఉంటాడో మాకు తెలీదా??.. నువ్వెవరు?..మా గురుంచి మొత్తం తెలిసినట్లు ఎలా మాట్లాడగలుగుతున్నావు...సంహితకి ఏం చెప్పావ్ ??" అంటూ ప్రశ్నలు సందించాడు కార్తీక్ ...

అది విని కోయ్యబారిపోయాడు అతను... "నేను చనిపోవడం ఏంటి...అంటే మీ ముందు ఉన్నది నేను కాదా... ఇంతకన్నా ఇక్కడే నా గొంతు నులిమి చంపెయ్యి కార్తీక్ .." ఆవేశంగా అన్నాడతను...
దివ్య వైపు చూసాడు కార్తీక్...ఆమె తన హ్యాండ్ బ్యాగ్ లోంచి ఒక ఫోటో తీసి కార్తీక్ కి ఇచ్చింది...

"ఇదిగో చూడు...బాగా చూడు...ఇతను సుధీర్.. సంహితని ప్రాణంగా ప్రేమించిన సుధీర్...మా ఇద్దరికీ ప్రాణ స్నేహితుడైన సుధీర్.." అంటూ సుధీర్ ఫోటో అతనికి చూపించాడు...
సుధీర్  ఫోటో చూడగానే... ఒక్కసారిగా అతనిలో ప్రకంపనలు.. ఫోటో క్రింద పడేసి అలాగే తల పట్టుకున్నాడు..అతని తల తిరిగిపోతుంది... వళ్ళంతా వణుకు పుట్టింది... వెయ్యి ఏనుగులు ఒకేసారి అరుస్తున్నట్లు భరించలేని శబ్దం అతని చెవుల్లో... ఇనుప రాడ్లతో అతని తల మీద బలంగా మోదుతున్నట్లు అనిపిస్తుంది అతనికి..అలాగే తల పట్టుకొని క్రింద పడిపోయాడు ....

                                               ***

"డాక్టర్ ఇక భార్గవ్ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాదంటారా ?" అడిగింది ఆ తల్లి ...
"అది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి...కానీ కష్టమే.." అన్నాడు డాక్టర్ 
"మీరు చెప్పమన్నట్లుగానే నేను తనని భార్గవ్ అని కాకుండా సుధీర్ అనే పిలుస్తున్నాను..సంహిత నీకోసం ఎదురు చూస్తుంది అని అతన్ని మాయలోనే ఉంచుతున్నాను...కానీ, వాడు చిన్నపిల్లాడు కాదు, సంహిత తనకు కనిపించకపోయేసరికి నా దెగ్గరికి వచ్చి అమ్మా నన్నెందుకు మాయ చేస్తున్నావ్ అని నన్ను అడుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను డాక్టర్...." అంది ఆ తల్లి ఆవేదనగా.. 

"నేను అర్థం చేసుకోగలను... కానీ హీ లాస్ట్ హిస్ ఐడింటిటి యాస్ భార్గవ్.. సుధీర్ ఐడింటిటి మాత్రమె అతని మెంటల్ ఫాకల్టీస్ లో రిజిస్టర్ అయి ఉంది... నేను రిగ్రేషన్ థెరపీ, సైకో-అనలిటిక్ థెరపీ ద్వారా తిరిగి అతని ఐడింటిటి తీసుకురావచ్చు అనుకున్నాను..కానీ ఆ థెరపీలు ఏవీ ఫలించలేదు.. ఇప్పుడు అతని కాన్షియస్ ని డామినేట్ చేస్తున్న సుధీర్ ఐడెంటిటీ ఈ థెరపీలను చాలా సమర్ధంగా అడ్డుకుంటుంది.. ఇలాంటి సైకలాజికల్ థెరపీలు విజయవంతం కావాలంటే పేషంట్ కూడా అందుకు సానుకూలంగా స్పందించాలి.. సైకలాజికల్ థియరీ ప్రకారం ఒక మనిషికి కాన్షియస్, సబ్-కాన్షియస్, సూపర్-కాన్షియస్ మెంటల్ స్టేట్స్ ఉంటాయి.. ఈ మూడు మానసిక స్థితులని డైరెక్ట్ చేసేది సూపర్-కాన్షియస్.. భార్గవ్ సూపర్-కాన్షియస్ మొత్తం సుధీర్ ఐడింటిటితో నిండిపోయింది.. అది కూడా చాలా స్థిరంగా.. ఆ స్థితిని నేను ఈ థెరపీల ద్వారా కూడా మార్చలేకపోయినందు వల్లనే, మిమ్మల్ని తన ప్రస్తుత ఐడింటిటినే గుర్తించమని చెప్పాను..అందుకే అతన్ని సుధీర్ అనే పిలవమని చెప్పాను... అతను సంహిత గురుంచి మిమ్మల్ని పదే పదే అడుగుతుంటే ఆమె మీకు తెలిసినట్లే ప్రవర్తించమని చెప్పాను.. ప్రస్తుతం నేను చేయ్యగలిగింది కూడా ఏమీ లేదు ..."అన్నాడు డాక్టర్ 

ఆమె భారంగా నిట్టూర్చింది....
"కానీ తను కాని తను ఎన్నాళ్ళిలా ... ఏదో ఒక రోజు సంహిత అనే అమ్మాయి తన సొంతం కాదని తెలిస్తే ఏమైపోతాడు నా కొడుకు..." అందామె వాపోతూ 
"మీరొక విషయం మరచిపోతున్నారు...అసలు ఈ రోజు మీ భార్గవ్ బ్రతికి ఉండటమే గొప్ప... అందరం ఆశలు వదిలేసుకున్నాం అతని మీద... ఆరునెలల క్రితం ఆ రోజున జరిగిన విషయం మీరు మరచిపోలేదు కదా ..." అడిగాడు డాక్టర్ 

"ఎంత మాట డాక్టర్...ఎలా మరచిపోగలను...అందుకే, భార్గవ్ అయితే ఏంటి సుధీర్ అయితే ఏంటి నా కొడుకు నా కళ్ళ ముందు ఉన్నాడు నాకదే చాలు అని సంతోషపడుతున్నా డాక్టర్ .." అందామె కళ్ళలో నీలు ఒత్తుకుంటూ ...

             ******** ఆరు నెలల క్రితం ఒక రోజు ********

"నొ హోప్.....ఇతను బ్రతకడం కష్టం...ఒక ఇరవై గంటలు అబ్జర్వేషన్ లో ఉంచుతాం..తరువాత మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు...యాం శారీ" అని చెప్పాడు డాక్టర్ ఆమెకు ...గుండెలు అవిసేలా ఏడుస్తుంది ఆమె .. 'లేక లేక పుట్టిన కొడుకుని అప్పుడే తీసుకెళ్ళిపోతున్నావా...ఏడుకొండలవాడా...ఆడు పుట్టగానే నీ కొండకి వచ్చాను కదయ్యా...కనికరం లేదా నా మీదా.. కొడుకు పోయిన కడుపుకోత ఎలా ఉంటుందో నీకేం తెలుసు ఒక తల్లి మనసుకి తప్ప..' ఆమెలో దుక్కం కట్టలు తెంచుకుంటుంది...
దేవుడికి తప్ప ఎవరికి తెలుసు ... ఆ ఎడుకొండలవాడికి అన్నీ తెలుసు.... అందుకేనేమో .....
"డాక్టర్ ......డాక్టర్ ...ఆక్సిడెంట్ కేస్ ...." అరుస్తూ వచ్చింది నర్స్ 
"ఈజ్ హీ డెడ్ ...ఆర్.. అలైవ్?.." అడిగాడు డాక్టర్ 
"బ్రెయిన్ డెడ్ ...బట్ ప్రాక్టికల్లీ మెనీ బాడిలీ ఫంక్షన్స్ స్టిల్ వర్కింగ్..." అంది నర్స్ ...
"వాట్....రియల్లీ ...కమాన్ ఫాస్ట్...లెట్స్ గో చెక్ దట్ బాడీ ..." అంటూ నర్స్ తో పాటు పరుగుతీసాడు డాక్టర్ ....


[To be continued in the eighth part................. Kishen Reddy]

Friday, 28 May, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 6


"ఎన్ని సార్లు చెప్పాలి నీకు ఇటు వైపు రావద్దని ....మళ్లీ వచ్చావంటే ఈ సారి నోటితో చెప్పను..." గదిమాడు ఆ సెక్యురిటీ గార్డ్...
"నేను కూడా ఇదే కాలేజీ అంటే ఎందుకు మీరు నమ్మడం లేదు...నన్ను లోపలి వెళ్ళనివ్వండి ప్లీజ్...సంహిత నాకోసం చూస్తుంటుంది.." చెప్పాడు ఆ అబ్బాయి
"నువ్వీ కాలేజీ అని చెప్పడానికి నీ దెగ్గర ఐ.డీ కార్డ్ లేదు...పేరు అడిగితే సుధీర్ అంటావ్..కావాలంటే సంహితని అడగండి అంటావ్...ఎన్నో సంవత్సరం అంటే తెల్ల మొహం వేస్తావ్ .. ఏం నీకు ఆటలుగా ఉందా .." అడిగాడు కోపంగా.
"ప్లీజ్..అలా అనకండి...ఒక్కసారి సంహిత ఎక్కడుందో కనుక్కొని పిలుస్తారా..తనే మీకు అన్నీ చెప్తుంది..." అన్నాడు 
"ఆ పని కూడా ఎప్పుడో చేశా..సంహిత అనే పేరున్న అమ్మాయి ఎవరూ ఈ కాలేజీలో లేరని తెల్సింది...సుదీర్లు అయితే ఇద్దరు ఉన్నారు..ఒకడు రెండో సంవత్సరం చదువుతున్నాడు, వాడిని నేను చూసాను కాబట్టి, నువ్వు వాడు అయ్యే అవకాశం లేదు..ఇక పోతే ఇంకొకడు ఆర్నెల్ల క్రింద ఆక్సిడెంట్ లో పోయాడట...ఆడిని నేను చూడలేదు..." అన్నాడు ఆ గార్డ్.... ఏదో ఆలోచిస్తున్నట్లు అక్కడే నిలబడ్డాడు ఆ అబ్బాయి....
"ఏంటి ఆలోచిస్తున్నావ్?...కొంపదీసి ఆ చచ్చిన సుధీర్ నేనే అంటావా?? ...నువ్వు అన్నా అంటావ్..వెళ్లిక్కడినుంచి.." అన్నాడు ఆ గార్డ్ చిరాగ్గా మొహం పెట్టి.

నిరుత్సాహంగా వెనక్కి మళ్ళాడు తనని తను సుధీర్ అని చెప్పుకుంటున్న ఆ యువకుడు...అతనికి బాగా నమ్మకం అతను ఈ కాలేజీ స్టూడెంట్ అని...'నన్ను ఎందుకు ఎవరూ నమ్మడంలేదు..అసలు సంహిత ఎక్కడికి వెళ్ళింది..ఎందుకు ఆ రోజు నన్ను చూసినా చూడనట్లు వెళ్ళిపోయింది...నేను వెళ్లి తనతో ఎంత మాట్లాడినా, ఎన్ని విషయాలు చెప్పినా ఎందుకు నన్నొక పరాయి  వ్యక్తిలా చూసింది...ఆ తరువాత ఎప్పుడూ నాకు ఎందుకు కనిపించలేదు ....కార్తీక్ ఏమయ్యాడు, దివ్య ఏమయింది...అందరూ నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు.. నన్ను ఎందుకు ఒంటరి వాడిని చేసారు ...ఏమిటి నాకీ శిక్ష...చివరిదాకా నాతో ఉంటాను అని ప్రామిస్ చేసిన సంహిత ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది...ఎన్నో ప్రశ్నలు వేధిస్తుండగా అలసటగా ఆ బస్సు స్టాప్ లో కూర్చున్నాడు...ఒకప్పుడు అదే బస్సు స్టాప్ లో సంహితకి తన ప్రేమని వ్యక్తం చేసాడు...ఆ విషయం గుర్తుకురాగానే అప్రయత్నంగా అతని కళ్ళలో నీళ్ళు...

ఆ క్షణమే...అప్పుడే...అతని కంట పడిందామె...ఒక్కసారిగా అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..ఆమె గేటు తీసుకొని లోపలి వెళ్ళబోతుంది..సెక్యురిటీ గార్డ్ ఆమెకి విష్ చేసాడు...ఆ యువకుడు ఆమె వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు "దివ్యా..." అని అరుస్తూ...ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగిచూసింది...

****************************************************************

"గుడ్ మార్నింగ్ డాక్టర్.." విష్ చేసింది సుధ.. ఆమె ప్రక్కనే కార్తీక్ ఉన్నాడు
"వెరీ  గుడ్ మార్నింగ్...చెప్పండి " అన్నాడు డాక్టర్ అభిరాం 
"మేమిద్దరం మీరు ఆరు నెలల క్రితం ట్రీట్ చేసిన సంహిత అనే అమ్మాయికి స్నేహితులం..." చెప్పింది సుధ 
అతను ఒక్క నిముషం ఆలోచించి .."సంహిత...యా సైకోజెనిక్ అమ్నీషియా పేషంట్...గుర్తుంది..చెప్పండి, ఎలా ఉంది తను.." అడిగాడు అభిరాం 
"ఫైన్ సార్...కానీ..."
"కానీ...గో ఆన్..చెప్పండి .." అన్నాడు 
"తన ప్రవర్తనలో ఈ మధ్య చాలా మార్పులు వచ్చాయి డాక్టర్.." అంది సుధ కంగారుగా 
"ఈజ్ ఇట్....ఎలాంటి మార్పులు.. " అడిగాడు అభిరాం...అతని కళ్ళు చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి ఆమె ఏం చెబుతుందా అని..
"ఈ మధ్య ఓ సారి తన కలలో సుధీర్ అనే అబ్బాయి వచ్చాడు అని చెప్పింది...అతని కోసం వాళ్ళ నాన్నని ఎదిరించి ఇంట్లో నుంచి వచ్చేసాను అని చెప్పింది...కానీ అది నిజంగా తన జీవితంలో ఇది వరకు జరిగిన విషయమే...అంటే జరిగిన విషయాలు ఇలా కలలో రావడం ?? " ఆగిపోయింది సుధ 
"దీనికి భయపడాల్సిన పనేం లేదు...ఆమె ప్రియుడికి సంబంధిన విషయాలన్నీ ఆమెలో రిప్రెస్ అయ్యాయి..చేతన స్థితిలో అణగదొక్కబడి ఉన్న ఆ జ్ఞాపకాలు, అచేతన స్థితిలో తమ ఉనికిని చాటుతాయి ఒకోసారి...సంహితకి అతని ప్రియుడితో ఉన్నది చాలా అసాధారణమైన ఎమోషనల్ బాండ్...అసాధారణం అని ఎందుకన్నానంటే, కేవలం ప్రియుడు చావు చూసి అమ్నేషియా స్థితికి వెళ్ళడం నేను ఇంత వరకు వినలేదు...చూడలేదు...షాక్ లోకి వెళ్ళిన ఆమె అతను ఇక లేడన్న నిజాన్ని గట్టిగా అణిచివేసింది..అణగతొక్కింది..అదే క్రమంలో అతనికి సంబంధిన అన్ని విషయాలూ...వ్యక్తులూ...పరిసరాలూ... రిప్రెస్ చెయ్యబడ్డాయి...ఇట్ లెడ్ టు అమ్నేషియా...సైకోజెనిక్ అమ్నేషియా మీద ఇంకా పరిశోధన జరుగుతూనే ఉంది.. ఇదే దీనికి కారణం ఇది అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి...అలాగే, అణిచివేయబడ్డ జ్ఞాపకాలు ఎప్పుడు బైటకి వస్తాయో కూడా చెప్పలేము...పూర్తిగా అన్నీ బైటకి రావచ్చు...ఏవో కొన్ని విషయాలు మాత్రం లీలగా జరిగినట్లు తెలియవచ్చు..అసలు శాశ్వతంగా రాకపోనూ వచ్చు..ఏదీ ఖచ్చితంగా చెప్పలేము...అది పేషంట్ ప్రస్తుత మానసిక పరిస్థితి మరియు బైట వ్యక్తుల ఈమె పై చూపించే ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది ..." చెప్పాడు డాక్టర్ అభిరాం 

"డాక్టర్ ఇంకొక విషయం ఏమిటంటే, ఆమె సుధీర్ చనిపోయిన స్పాట్ ని చూసి మళ్లీ దాదాపు నిజంగా చనిపోయినప్పుడు ఎలా రియాక్ట్ అయిందో  అలాగే రియాక్ట్ అయింది..అంతే కాదు "సుధీర్..." అని గట్టిగా అరిచి పడిపోయింది...నేను అప్పుడు ఆమె ప్రక్కనే ఉన్నాను.." చెప్పాడు కార్తీక్ 
"నిజమా ..." ఆశ్చర్యంగా చూశాడు  డాక్టర్ 
"అంతే కాదు డాక్టర్...అతను మా కాలేజీ టాపర్ అని చెప్తుంది నాతో...మన కాలేజీ టాపర్ సుధీర్ చనిపోయాడు తెలుసా అని అడిగింది...అతనితో ఏదో పరిచయం ఉన్నట్లే మాట్లాడింది.." చెప్పింది సుధ
"తనకి ఎవరన్నాజరిగిన విషయాలు గుర్తు చేసే ప్రయత్నం చేసారా ?" అడిగాడు డాక్టర్ అభిరాం
"లేదు..." చెప్పాడు కార్తీక్
"అంత ఖచ్చితంగా మీరెలా చెప్పగలరు ?" అడిగాడు
"ఎందుకంటే...తన విషయాలు మొత్తం నాకు, దివ్యకి మాత్రమె తెలుసు...ఇంకో వ్యక్తి ఆమెకి విషయాలు అన్నీ గుర్తుచేసే పరిస్థితి లేదనే అనుకుంటున్నా..." అన్నాడు కార్తీక్
"లేదు...తనకి ఎవరో..చాలా విషయాలు గుర్తుచేసారు...తద్వారా రిప్రెస్ అయిన జ్ఞాపకాలు బైటకి రావడానికి ఓ మార్గం చూపించినట్లు అయింది...ఆమె మనస్సులో చిన్న సంఘర్షణ మొదలైంది...అచేతనంలో అణగదోక్కబడిన జ్ఞాపకాలు  చేతన స్థితిలోనికి రావడానికి పడుతున్న సంఘర్షణ.. ఇవి హాలుసినేషన్స్ కి దారి తీస్తాయి...నాకు తెలిసీ ఆమెలో సుధీర్ అనే వ్యక్తి తనతో పాటే ఉన్నట్లు కొన్ని హాలుసినేషన్స్ మొదలై ఉండవచ్చు ...ఆ భ్రమలోనే, అతనంటే ఆమెకి ఎందుకు ఇష్టాన్ని పెంచుకుంటుందో తెలియకుండానే ఇష్టాన్ని పెంచుకొని ఉండవచ్చు....ఆ ఇష్టం పరిధులు దాటక ముందే, సుధీర్ చనిపోయిన స్పాట్ చూసిన సంహిత... తనతో పాటే ఉన్నట్లు భ్రమపడుతున్నసుధీర్, అప్పుడే..ఆ క్షణమే చనిపోయినట్లు భ్రమించింది ..అప్పటికే పెంచుకున్నఇష్టంతో ఆమె అలా రియాక్ట్ అయింది....కానీ ఆమె భ్రమలో సుధీర్ పై పెంచుకున్న ఇష్టం ఇంకా పరిధులు దాటలేదు కనుకే ఆమె వెంటనే షాక్ లోంచి బైటకి వచ్చింది..అతను చనిపోయాడని అనుకుంటుంది ...అతనితో కొన్ని రోజులు  హాలుసినేషన్స్ తో గడిపింది కాబట్టి అతను మీ కాలేజీ టాపర్ అని..చనిపోయాడు అని చెప్పి ఉండొచ్చు.." చెప్పాడు డాక్టర్ 
ఇదంతా విన్న సుధ కార్తీక్ లు నిశ్చేష్టులయ్యారు...
"ఇప్పుడు ఏం చెయ్యాలి డాక్టర్...." అడిగారు ఇద్దరు ఒకేసారి ..
కొద్దిసేపు ఆలోచించిన డాక్టర్ " ఒక పని చెయ్యండి ....." అన్నాడు 

 ************************************************

ఎన్నో ఆలోచనలు మనసులో సుళ్ళు తిరుగుతుండగా సోఫాలో కూలబడ్డాడు కార్తీక్ ..
"ఏమయిందండి...అలా ఉన్నారు " అడిగింది దివ్య ...
"సంహిత గురుంచే నా ఆలోచనంతా...తనేమైపోతుందో అని బాధగా ఉంది..." అన్నాడు కార్తీక్ ఆవేదనగా 
"డాక్టర్ ఏమన్నారు ?" అడిగింది దివ్య
మొత్తం చెప్పాడు కార్తీక్....
అదంతా విని, అప్పుడే ఏదో గుర్తుకువచ్చినదానిలా "ఏవండీ...ఈ రోజు ఒక అతను నన్ను దివ్యా...దివ్యా అని వెంట పడ్డాడు " అంది 

"అవునా !!..ఎవరు అతను...నీకు తెలుసా?" అడిగాడు 
"అసలు అతన్ని నేను ఇంతకముందెప్పుడూ చూడలేదు...ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే నన్ను చూసి ..దివ్యా నన్ను గుర్తుపట్టలేదా?...ఎందుకు అలా చూస్తున్నావ్?...నేను సుధీర్ ని...నీ అన్నయ్యని...సంహిత ఎక్కడుంది...కార్తీక్ ఏమయిపోయాడు..అసలు నన్నేదుకు మీరంతా విడిచి వెళ్లారు... అని అతను అడుగుతుంటే నాకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు...అంతా బ్లాంక్ గా అనిపించింది..అన్నయ్య చనిపోయాడు, కానీ ఇతను ఎవరు??...తనే నా అన్నయ్య అంటాడు..మన గురుంచి అంతా తెలిసినట్లే మాట్లాడుతున్నాడు...కార్తీక్ నిన్ను పెళ్లి చేసుకున్నాడా? లేదా? ...నువ్వు సంతోషంగా ఉన్నావా ? అని అతను అడుగుతుంటే నాకు నోట మాట రాలేదు ..." అని దివ్య చెప్తుంటే కార్తీక్ కి తనేం వింటున్నాడో అసలు అర్థం కావడం లేదు..... అది అర్థం అయ్యేలోపే కోయ్యబారిపోయాడు...  స్థాణువై అక్కడే నిలబడిపోయాడు... "ఏంటి నువ్వు మాట్లాడేది ???" అప్రయత్నంగా వస్తున్నాయి అతని నోటి నుండి ఆ మాటలు .....

*****************************************************
"అమ్మా....." గట్టిగా అరిచాడు అతను ఇంటికి వస్తూనే 
"సుధీర్ ....ఏమయింది " ఆందోళనగా అడిగిందామె 
"ఎన్ని రోజులు నన్నిలా మాయ చేస్తావ్...సంహిత నాకోసం కాలేజీ లో వెయిట్ చేస్తుంది అని చెప్పావ్...కానీ ...అంతా అబద్దం...సంహిత గురుంచి ఇలా ఎన్నోసార్లు నువ్వు అబద్దం చెప్పినా ,అది అబద్దం అని నా మనసు చెప్తున్నా... ఏదో మూలాన ఉన్న చిన్న ఆశ అది నిజమే అయ్యుంటుంది అని చెప్పేది ....ఎందుకమ్మా ఇలా??...సంహిత నన్ను వదిలి వెళ్ళిపోయింది కదా..తనిక నాకు ఎప్పటికీ దక్కదు కదా... నిజం చెప్పు..." అతని ఆవేదన...బాధ ...అతని కన్నీళ్ళు చూసి తట్టుకోలేక ఏడ్చింది ఆమె కూడా...

తన కొడుకుని తానెందుకు మాయ చేస్తుంది...తనకెందుకు దేవుడు ఈ పరీక్ష పెట్టాడు... తనకి మాత్రం తన కొడుకంటే ప్రేమ లేదా??..'దేవుడా ఎలా చెప్తే నా కొడుకుకి అర్థం అవుతుంది...అసలు తను ఎందుకు ఇలా అయ్యాడో...అసలు తనెవరో..ఈ విషయాలు అన్ని తెలుసుకొని తట్టుకోగలడా నా కొడుకు'

[To be continued in the seventh part ...........have a great day - Kishen Reddy]


Tuesday, 25 May, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 5


ఇంట్లో నుంచి వచ్చేసిన సంహిత దివ్య ఉన్న హాస్టల్ లో జాయిన్ అయింది...కొద్దిరోజుల్లోనే మేమందరం ఉద్యోగాల్లో చేరాము..కొత్త జీవితం చాలా ఆనందంగా..సరదాగా..ఉత్సాహంగా గడిచిపోతుంది..సంహిత సుదీర్లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు...సింపుల్ గా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడంతో, మరుసటి రోజు రిజిష్టర్ ఆఫీసుకి వెళ్లాలని డిసైడ్ అయ్యాం...మనమొకటి తలిస్తే విధి ఇంకొకటి తలుస్తుంది..

"మామయ్య వాళ్ళు సిరిపురంలో ఉంటారు..నేను వెళ్లి వాళ్ళని తీసుకొని డైరెక్ట్ గా రిజిష్టర్ ఆఫీస్ కి వస్తాను, నువ్వెళ్ళి సంహీని దివ్యని తీసుకొని వచ్చేసెయ్"  అంటూ నన్నువాళ్ళ హాస్టల్ కి పంపించాడు సుధీర్...
నేను సరేనని, దివ్య వాళ్ళ హాస్టల్ కి వెళ్లి వాళ్ళిద్దరిని తీసుకొని రిజిష్టర్ ఆఫీస్ కి వచ్చేసాను...సుధీర్ కోసం చూస్తూ నిలబడ్డాం ముగ్గురం...
తన సెల్ కి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్...వాళ్ళ మామయ్య నంబర్ నా దెగ్గర లేదు...
 ఎంతసేపు చూసినా తను రాకపోవడంతో "నేను సిరిపురం దాకా వెళ్ళొస్తా...మీరు ఇక్కడే ఉండండి.." అని వెళ్లబోతుంటే, సంహిత కూడా నాతో వస్తానని చెప్పడంతో ఇద్దరం వెళ్ళాం...

సిరిపురం సిగ్నల్స్ దెగ్గరికి చేరుకున్నాం...పెద్ద ట్రాఫిక్ లా ఉంది...వరుసగా వాహనాలు ఆగిపోయి ఉన్నాయి...
"ఆక్సిడెంట్ అంట...పాపం ప్రాణంపోయే ఉంటుంది ..." ప్రక్కన ఎవరో మాట్లాడుకోవడం మాకు వినిపించింది...
"ఏమయింది..." అడిగాను ఆ మాట్లాడిన వ్యక్తిని
"ఎవరో స్టూడెంట్ పాపం...లారీ గుద్దేసింది...లారీ ఓడిదె తప్పు మొత్తం..." చెప్పాడతను...నాకు గుండె వేగం పెరిగింది...ఏవేవో ఆలోచనలు క్షణాల్లో నా చుట్టుముట్టాయి....వళ్ళంతా చెమటలు...
బైక్ వెనుక చూస్తె సంహిత లేదు...ముందుకు చూస్తే అందరినీ దాటుకుంటూ నడుచుకుంటూ సిగ్నల్స్ దెగ్గరికి వెళ్తుంది ఏదో ఒక ట్రాన్స్ లో ఉన్నదానిలా ...నాకు టెన్షన్ మొదలైంది..

నేను బండి అక్కడే పడేసి ఆమె వెనుకాలే పరిగెత్తాను...జనం చుట్టూ మూగి ఉన్నారు..వాళ్ళని దాటుకుంటూ వెళ్లాను సిగ్నల్స్ దెగ్గరికి...సంహిత అక్కడే నిల్చుని ఉంది..ఆమె వదనంలో ఏ భావమూ నాకు కనిపించట్లేదు...నేను ఆమె ప్రక్కకి వెళ్లి చెయ్యి పట్టుకున్నాను...నా వైపు చూసింది చాలా బ్లాంక్ గా...మళ్లీ అటువైపు చూసింది...బాడీ మీద తెల్లని ముసుగు కప్పి ఉంచారు..చుట్టూ రక్తం...

ఇంతలో అంబులెన్స్ రావడంతో, ఆ బాడీ అందులో ఎక్కించడానికి పైకి లేపారు, అప్పుడు..ఆ క్షణం ..అతని ముఖాన్ని కప్పి ఉన్న ఆ ముసుగు తొలగింది...అతని రూపం ఆమె కంట పడింది...ఆమె గుండె ఒక్క క్షణం ఆగింది..ఆమె కాళ్ళ క్రింద భూమి కంపించింది...షాక్ తిన్నదానిలా అలానే చూస్తుంది..నాకు చేతులూ కాళ్ళు ఆడటం లేదు....అసలు ఏం చెయ్యాలో అర్థంకాలేదు నాకు ఒక్క క్షణంలో అంతా సూన్యం... నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని ముందే తెలిస్తే ఇప్పటిదాకా బ్రతికి ఉండే వాడిని కాదేమో..

బాడీని అంబులెన్స్ లో తీసువెళ్తున్నారు..తన ప్రాణం..తన జీవితం..తన సర్వస్వం ఇక ఆమెకి లేదన్న నిజం ఆమె గుండెని తాకడంతో ఒక్కసారిగా...గుండెలు అవిసేలా..ప్రాణం పోయేలా.."సుధీర్..." అంటూ అరిచి అక్కడే కుప్పకూలిపోయింది...

నేను వెంటనే హాస్పిటల్ లో చేర్పించాను సంహితని...ఆమెకి స్పృహ రాలేదు..డాక్టర్లు ఏవేవో టెస్టులు చేస్తున్నారు సంహితకి...సుధీర్ చనిపోయాడన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను..ఇదంతా కల అయితే ఎంత బాగుండు..సుధీర్....ఆ పిచ్చి దాన్ని వదిలేసి నువ్వు హాయిగా వెళ్లిపోయావా...ఇక దాని జీవితం ఏం కాను..నీమీదే దాని ఆశలన్నీ...సర్వస్వం నీకోసం వదిలి వచ్చేసింది ఇక నువ్వు లేకుండా అది బ్రతకగాలదా..దేవుడా ఎందుకు ఇంత శిక్ష విధించావ్ మా జీవితాల్లో..ఏమిటీ గాలిలేని తుఫాను...వెక్కి వెక్కి ఏడ్చాను..నేను సంహిత దెగ్గరే  ఉండటంతో సుధీర్ ఆఖరి చూపుకు కూడా నోచుకోలేదు...

మరుసటి రోజు హెడ్ డాక్టర్ వచ్చి "పేషెంట్ తల్లిదండ్రులతో మాట్లాడాలి నేను.." అని చెప్పగా సంహిత వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాను...ఎంతైనా కన్నా తండ్రి..ఏదో కోపంలో పోమ్మన్నాడే కానీ మమకారం తెంచుకోలేదు ఆమెపై...అందుకే వచ్చాడు...డాక్టర్ సంహిత వాళ్ళ నాన్నని తన రూంకి తీసుకెళ్ళాడు

"ఆక్సిడెంట్ స్పాట్ లో చనిపోయిన వ్యక్తిని చూసి ఇంత డీప్ షాక్ లోకి వెళ్లిందంటే.....అతను??" ప్రశ్నార్ధకంగా చూసాడు సంహిత తండ్రి వైపు...
"అతను...సంహిత ప్రేమించిన వాడు.."
"మామూలుగా ప్రేమించిన వారు చనిపోయినప్పుడు షాక్ లోకి వెళ్ళడం సహజమే కానీ...ఆక్సిడెంట్ జరిగి రెండు రోజులు కావస్తున్నా ఆమె ఇంకా షాక్ లోనే ఉంది...ఇది సహజమైన పరిస్థితి కాదు..మేము అన్ని రకాల పరీక్షలు చేసి ఆమె మానసిక పరిస్థితిని అంచనావేయగలిగాము..." అంటూ డాక్టర్ చెప్తుండగా కొంచెం ఆందోళనగా చూస్తున్నాడు ఆ తండ్రి ..
"ఆమె మానసకి పరిస్థితి "సైకోజెనిక్ అమ్నీషియా". మామూలుగా తలకి పెద్ద గాయం అవ్వడం ద్వారా అమ్నీషియా అనే మానసిక పరిస్తితి సంభవిస్తుంది, కానీ కొన్ని సైకలాజికల్ కారణాలు, ఉదాహరణకి రేప్, డోమాస్టిక్ వయలెన్స్ , లైంగిక దాడుల వల్ల కూడా అమ్నీషియా వస్తుంది, అలా వచ్చేదే సైకోజెనిక్ అమ్నీషియా. కానీ ప్రియుడి మరణం చూసి డీప్ షాక్ లోకి వెళ్ళిన సంహితకి సైకోజెనిక్ అమ్నీషియా రావడం నాకు ఆశ్చర్యంగా అనిపించినా..నిజం. అతను చనిపోయిన నిజాన్ని ఆమె ఒప్పుకోలేకపోవడమే ఇంకా షాక్ లో ఉండటానికి కారణం..ఆమెలో ఉన్న "మెంటల్ ఫాకల్టీస్" ఈ నిజాన్ని ఆమె మెదడుకి చేరవెయ్యడంలో విఫలం అయ్యాయి, తద్వారా సృష్టించబడ్డ అన్-స్టేబుల్ మెంటల్ కండిషన్ ఈ అమ్నీషియాకి కారణం అయిఉండొచ్చు అని నా విశ్వాసం..." చెప్పడా డాక్టర్ అతని వైపు చూస్తూ..

"అంటే డాక్టర్ ఇప్పుడు సంహిత మమ్మల్ని గుర్తుపట్టలేదా??.." అడిగాడు 
"గుర్తుపడుతుంది...ఇది మామూలుగా వచ్చే అమ్నీషియా అంత ప్రమాదకరమైనది కాదు. సైకోజెనిక్ అమ్నీషియా చాలా వరకు సిట్యువేషన్ స్పెసిఫిక్, అంటే ఆ మానసిక పరిస్థితికి కారణమైన ఇన్సిడెంట్ కి సంబంధించిన వ్యక్తులు, సంఘటనలు ఆమె మనోఫలకం నుండి చెరిపివేయబడతాయి...ఇప్పుడు సంహిత విషయంలో చనిపోయిన తన ప్రియుడికి సంబంధిన వ్యక్తులను, సంఘటనలను పూర్తిగా మర్చిపోతుంది...ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు ఉండదు..నిజానికి చెప్పాలంటే ఇదొక వరం..ఆమె మళ్లీ క్రొత్త జీవితం ప్రారంభిస్తుంది..కానీ..." ఒక్క క్షణం ఆగాడు డాక్టర్...

"చెప్పండి డాక్టర్..." అడిగాడు సంహిత తండ్రి ఆత్రుతగా 
"ఆమె ప్రియుడికి సంబంధిన వ్యక్తులని ఈమె ఎప్పటికీ కలవకూడదు...ఎందుకంటే, వాళ్ళని చూడటం వల్ల కానీ లేక వాళ్ళు ఈమెకు అతని జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చే ప్రయత్నం చేసినా కానీ ఆమెకు అంతా గుర్తుకువచ్చే ప్రమాదం ఉంది...అతని జ్ఞాపకాలు ఆమె నుంచి పూర్తిగా తుడుచుపెట్టుకొని పోలేదు...అవి రిప్రెస్ అయ్యాయి.. కనుక, ఆమె ప్రియుడు జ్ఞాపకాలు కానీ, అతనికి సంబంధిన వ్యక్తులు కానీ ఈ భూమి మీద ఉన్నట్లు ఈమెకి తెలియకూడదు...ఇది మినహా, ఈమె నడవడికలో కానీ ప్రవర్తనలో కానీ ఎటువంటి తేడా ఉండదు.." చెప్పాడు డాక్టర్.
తన కూతురి పరిస్థితి ముందు కొంచెం బాధ కలిగించినా, ఆమె మళ్లీ ఇకనుంచి తన కూతురిగా తన దెగ్గరే ఉంటుంది అన్న ఆలోచన అతనికి కొంచెం సంతోషం కలిగించింది...

"కార్తీక్...నువ్వు నాకొక సాయం చెయ్యగలవా?" అడిగాడు సంహిత తండ్రి 
"చెప్పండి అంకుల్.." అన్నాను 
"నువ్విక సంహితతో మాట్లాడకూడదు...తనని కలవకూడదు..నాకీ సాయం చెయ్యగలవా?"అంటూ అడిగాడు...అతని మాటలు శాసిస్తున్నట్లుగా లేవు..అర్తిస్తున్నట్లు ఉన్నాయి...
"మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారో నాకు అర్థం కావడంలేదు...ఈ సమయంలో నాతోడు తనకి చాలా అవసరం.." అన్నాను 
"ఇప్పుడు నువ్వు తనకి కనిపించకుండా ఉంటేనే...తను మామూలు మనిషిలా ఉండగలదు..."
అర్తంకానట్లు చూసాను అతని వైపు...
డాక్టర్ చెప్పిన విషయం మొత్తం నాకు చెప్పాడు...తన మానసిక పరిస్థితికి బాధపడాలో లేక ఆమె జీవితంలో అనుకోకుండా బ్రద్దలైన అగ్నిపర్వతం ఆమెను నిలువునా దాహించివేయకుండా కొత్త జీవితం ప్రసాదించినందుకు ఆనందపడాలో నాకు అర్థం కాలేదు...మొత్తానికి ఆమె ఇప్పుడు మామూలు సంహిత....సంహిత మైనస్ సుధీర్, చంటి, దివ్యా, గీతం కాంపస్....

****************************************************************

కార్తీక్ చెప్తుండగా నమ్మలేనట్లుగా చూస్తుంది సుధ...
"తను ఇంజనీరింగ్ పూర్తి చేసినా ఆ విషయం ఆమెకి తెలీదు...ఎందుకంటే, ఆమె ఇంజనీరింగ్ మొత్తం మేమే ఉంటాం...ఆ జ్ఞాపకాలన్నీ పూర్తిగా ఆమె మనోఫలకం నుండి చెరిగిపోవడంతో, ఆమె తండ్రి ఆమెని మళ్లీ డిగ్రీలో చేర్పించాడు...తను నీకు అక్కడ క్లాస్ మేట్ అయింది...ఆ తర్వాత నేను కానీ దివ్య కానీ ఎప్పుడూ ఆమె కంట పడలేదు...ఓ రోజు యాదృచ్చికంగా తను నాకు బస్సులో కనిపించింది...చాలా కాలం తరువాత తనని చూసేసరికి నా ఆనందం మాటల్లో చెప్పలేనిది..తరువాత చాలా సార్లు ఆమె అదే స్టాప్ లో బస్సు ఎక్కడం గమనించిన నేను ఆమెకి తెలియకుండా నేను కూడా అదే బస్సు ఎక్కేవాడిని...సంహీని దూరం నుంచే చూసి చాలా సంతోషించే వాడిని...చంటీ అని ఎంతో ముద్దుగా పిలిచే నా సంహిత నాకు లేదు అని తెలిసిన ప్రతిసారి నా కళ్ళు చెమ్మగిల్లుతాయి...కానీ మొన్న సంహిత ప్రవర్తన నాకు మళ్లీ భయాన్ని కలిగించింది...సుధీర్ చనిపోయిన అదే సిరిపురం సిగ్నల్స్ దెగ్గర తను....ఆ విధంగా..." తడబడుతున్నాయి కార్తీక్ మాటలు...
"అంటే ఆ సిగ్నల్స్ ని చూసిన ఆమెకి సుధీర్ చనిపోయిన ఇన్సిడెంట్ గుర్తొచ్చిందంటావా...." అడిగింది సుధ 
"అవును...సుధీర్ చనిపోయినప్పుడు సంహిత ముఖంలో సర్వస్వం కోల్పోయిన బాధ కనిపించింది ..అదే ముఖం ఆమెలో మళ్లీ చూసాను మొన్న..అదే బాధ...అదే ఆక్రోశం...అదే గుండెకోత..'సుధీర్' అని గట్టిగా అరచి పడిపోయింది...ఆమె హృదయాంతరాలల్లో సుధీర్ ఇంకా ఉన్నాడు...మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల మళ్లీ ఆమెకి మొత్తం గుర్తుకోస్తుందేమో అని భయపడ్డాను...అలా జరగలేదు...కానీ.." ఆగిపోయాడు అతను...
"కానీ..." రెట్టించిందామె

"తను నన్ను చంటీ అని పిలిచింది..." అన్నాడు కార్తీక్...అతని కళ్ళు చెమ్మగిల్లాయి..
"అవునా...ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది...ఓ రోజు తనకి ఒక కల వచ్చినట్లు చెప్పింది సంహిత...ఆ కలలో తను ఒక అబ్బాయి కోసం తన తండ్రినే కాదనుకొని ఇంట్లో నుంచి బయటకి వచ్చేసాను అని చెప్పింది...అతని పేరు ఏమిటని నేను అడిగాను...ఆమె వెంటనే సుధీర్ అంది" అని సుధ చెప్తుండగా నిశ్చేష్టుడై ఆమెనే చూస్తూ ఉన్నాడు కార్తీక్

"అంతే కాదు...ఈ రోజు ఉదయం నేను తనని చూడటానికి వెళ్ళినప్పుడు మన కాలేజీ టాపర్ సుధీర్ చనిపోయాడట కదా అని అడిగింది...నాకేం అర్థం కాలేదు...అసలు మాకు తెలిసీ సుధీర్ అనే అతను ఎవరూ మాకు పరిచయం లేదు...తను అలా ఎందుకు అడిగిందో అర్థం కాలేదు.." అంది సుధ...
"నీకో విషయం చెప్పలేదు ఇందాక...మొదటి రెండు సెమ్స్ లో సంహితే కాలేజీ టాపర్, కనీ థర్డ్ సెంలో మాత్రం సుధీర్ టాప్ చేసాడు... సుధీర్ ని సంహిత ఇష్టపడటానికి అదికూడా ఓ కారణం..తనని బీట్ చేసి టాప్ వచ్చినవాడి మీద కోపం పెంచుకొని, మరింత కసిగా చదువుతుందనుకున్నాను ...కానీ రిజల్స్ అనౌన్స్ చేసినప్పుడు, అతను డయాస్ పైకి వస్తుంటే సంహిత కళ్ళలోకి చూసాను..ఎంత కోపంగా చూస్తుందా అని...కానీ ఆమె కళ్ళు ఆనందంతో వర్షిస్తున్నాయి...ఆ కన్నీరు వెనుక ఆమె కళ్ళలో అతని పై ఉన్న ఆరాధనతో మెరిసిన మెరుపు అతని మీద ఆమె పెంచుకున్న ప్రేమను చూపించింది.." అన్నాడు కార్తీక్ గుర్తుతెచ్చుకుంటూ...

"కానీ మీరు ఎవరూ ఆమెకి సుదీర్ చనిపోయిన తరువాత కనపడలేదు...కానీ సుధీర్ విషయాలు ఆమెకి గుర్తుకు వచ్చాయి...అదెలా??..

"అదే అర్థం కావడం లేదు..." అన్నాడు కార్తీక్ 
"సుధీర్ చనిపోయినప్పుడు సంహితని ట్రీట్ చేసిన డాక్టర్ పేరు?" అడిగింది సుధ
"డాక్టర్ అభిరాం..."
"రేపు మనిద్దరం ఆయన్ని కలుస్తున్నాం...అప్పాయింటుమెంట్ తీసుకో..." 

*******************************************************

"సుధీర్....సుధీర్....లే నాన్నా బారెడు పోద్దేకింది...ఇంకా పడుకున్నావేంటి..కాలేజీ ఉంది మర్చిపోయావా?...అసలే గీతం కాలేజీ టాపర్ వి ఇలా పడుకుంటే ఎలా... " అది ఆమె అతని దుప్పటి లాగుతూ 
"ఒక ఫైవ్ మినిట్స్ అమ్మా ప్లీజ్..." 
"సరే త్వరగాలే....ఇందాకే సంహిత కాల్ చేసింది...నీకోసం కాలేజీలో వెయిట్ చేస్తా అని చెప్పింది .." అందామె అతన్నే గమనిస్తూ...
"నిజమా...." ఉలిక్కి పడి లేచాడు.."మరి ఇప్పటిదాకా చెప్పవేంటమ్మా..." అంటూ పరుగున బాత్రూంలోకి దూరాడు సుధీర్ రెడీ అవ్వడానికి....


[ You have to wait till next part to know what is going on....till then, see u...bye...take good care of yourself - Kishen Reddy ]

Sunday, 23 May, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 4 [100% Love... 0% Twists]

సంహిత బస్సు స్టాపులో కాలేజీకి వెళ్ళడానికి బస్సు కోసం ఎదురు చూస్తుండగా వచ్చాడు సుధీర్ బైక్ మీద..
"కాలేజీ కా...." అడిగాడు బైక్ ఆమె ముందు ఆపి..
"కాదు కైలాసానికి...తీసుకెళ్తావా.."
"రండి..." అంటూ బైక్ స్టార్ట్ చేశాడు..
"ఆఁ...@#%$$#@ " సుర సురా చూస్తూ " నే రాను..." అంటూ పోజ్ కొట్టబోయింది..
"అలాగే...సి యు లేటర్.." అంటూ వెళ్ళిపోయాడు...
'హుఫ్....ఏంటో ఈ వ్యక్తి...కొంచెం కూడా సెన్సిటివిటీ లేని మనిషి...ఒక అమ్మాయి కోసం రమ్మని ఇంకోక్కసారి అడగలేడా' అనుకుని బస్సులో కాలేజీకి చేరింది...

"ఏంటి ఒక్కదానివే కూర్చున్నావ్ ...కార్తీక్ రాలేదా కాలేజీకి?.." అంటూ వచ్చాడు సుధీర్ సంహిత కాంటీన్ లో ఉండగా..
"లేదు..ఏదో పనుందట..."
"లవర్ తో సినిమా ప్రోగ్రాం వేసుకున్నాడేమో..." అన్నాడు చిన్నగా నవ్వుతూ..
'కఠిన హృదయమయినా...కామెడి ఉంది అబ్బాయిలో..' అనుకుంది ప్రొద్దుటి ఇన్సిడెంట్ గుర్తొచ్చి
"మా చంటికి అలాంటివేమీ లేవులే...నీలా కాదు.." అంది మూతి బిగిస్తూ..
"నాకు లవర్ ఉంటే కదా నేను ప్రోగ్రాం వేసుకోడానికి...ఆ రోజు నువ్వేదో అనుకోమన్నావ్...అనుకోనా??" అన్నాడు
"ఏంటి అనుకునేది ఆవకాయ దబ్బ...ఆశలేం పెట్టుకోకు.."
ఏదో సైలెంట్ అనుకుంటే ఎక్స్ ట్రాలు బాగానే చేస్తున్నాడే అనుకుంది...
చిన్నాగా  నవ్వాడు ఆ మాటకి....ఎందుకో ఆ అరనవ్వు బాణంలా నేరుగా సర్ ర్ ర్ మని వచ్చి ఆమె హృదయంలో ఇరుక్కు పోయింది...తియ్యని బాధ ఆమెలో...

"నీకు నిజంగా లవర్ లేదా?..ఎవరినీ ప్రేమించలేదా?" అడిగిందామె
"లేదు..."
"ఏం ?"
"నీలాంటి అందమైన అమ్మాయి దొరక్క..."
"ఛా...."
"హ్మం...విషయం ఏమిటంటే...చిన్నప్పుడే అమ్మానాన్నా పోయారు ...అప్పటినుంచి మామయ్యే చదివించాడు నన్ను.. వాళ్ళ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలని ఆయన ఆశ...సో ఎవరినీ ప్రేమించాలనే ఆలోచన నాకు రాలేదు.." చెప్పాడతను
"ఓహ్...." బాధగా అనిపించింది ఆమెకు....నిజానికి ఆమెకి తెలియకుండానే సుధీర్ అంటే ఇష్టం పెంచుకుంది సంహిత...అమ్మాయిలంటే గౌరవం, ఎవ్వరికీ భయపడని అతని గుండె ధైర్యం, తలవంచని వ్యక్తిత్వం ఆమెకి చాలా నచ్చాయి...

"ఒకవేళ నిన్ను తన ప్రాణంగా ప్రేమించే అమ్మాయి నీకు ఎదురయితే ??" అడిగింది ఆశగా ..
"నాలో ఏముందని నన్ను అంత ప్రాణంగా ప్రేమించే అమ్మాయి దొరకడానికి...అమ్మాయిలు పడి చచ్చే మాగ్నెటిజం నా దెగ్గర లేదు..పైగా మై ఆటిట్యూడ్ ఈజ్ ఎ బిగ్ టర్న్ ఆఫ్ టు గాళ్స్...." అన్నాడు నిర్లిప్తంగా..
"అమ్మాయిలకు కావలసింది మాగ్నెటిజం కాదు, మంచి మనసు...నీకోసం నేను ఉన్నాను అనే చెప్పే ధైర్యం..నీకోసం నా ప్రాణం అడ్దేస్తాను అని ఇచ్చే హామీ..." చెప్పింది చిన్నపాటి ఉద్వేగంతో...
"చెప్పడానికి బాగానే ఉంటాయి...తన దాకా వస్తేనే తెలుస్తుంది..అంతెందుకు, నువ్వే ఉన్నావ్..మీ నాన్న తెచ్చే అమెరికా ఎన్నారైని చేసుకుంటావ్ కానీ, నాలాంటి వాడిని కనీసం కలలో అయినా భర్తగా ఊహించగాలవా?" అతని ప్రశ్నకు ఆమెలో మౌనం...ఏమి చెప్పాలో తెలియని ఆవేదన..ఎన్నో చెప్పాలని పెదవులు ఉబలాటపడుతున్నా, మనసు ఆంక్షలు విధిస్తుంది ... వణుకుతున్న పెదాలతో అతని కళ్ళలోకి సూటిగా చూస్తుంది...భాష పలకలేక నిస్సహాయంగా ఉన్న పెదవులకి, మేమున్నామంటూ కళ్ళు పలికించే భావాన్ని అతను అర్థం చేసుకుంటాడేమో అన్న విఫలయత్నం ఆమెది...
"నాకు తెలుసు...అది నీ కల్లో కూడా జరగదు...మనసు, హృదయం లాంటివి గొప్ప కావ్యాలకే బాగా పనికొస్తాయి...." అని లేచి వెళ్ళిపోతున్నాడు అతను...ఆమె హృదయంలో వెయ్యి అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి..నా మనసు ఈ క్షణం అతనికి తెలియాలి..లేకపోతే అతను అన్న మాటలే నిజం చేసిన దాన్ని అవుతాను..చెప్పాలి, తన మీద నాకు ఎంత ప్రేమ ఉందొ చెప్పాలి...ఆ మాట చెప్పి ఈ క్షణం నేను చనిపోయినా పర్వాలేదు..ఆమెలో అంతకంతకు పెరుగుతున్న సంఘర్షణ...

"నువ్వంటే నాకిష్టం...జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటావా..ఒక స్నేహితుడిగా...ఒక ప్రేమికుడిగా..." ఆ మాటలు అతని చెవిని తాకాయో లేదో ...చివాలున ఆమె వైపు తిరిగి చూసాడు...నిశ్చేష్టుడయ్యాడు...
ఆమె కళ్ళనిండా కన్నీరు... ఆ కళ్ళు పలికించే ప్రేమని కన్నీటిపొర అడ్డుకోలేకపోయింది, ఆ ప్రేమ అతన్ని నిలువునా చలింపజేసింది..ఆమె వైపే చూస్తూ నడుచుకుంటూ ఆమె దెగ్గరికి వచ్చాడు..
మాటలు తడబడుతుండగా అడిగాడు "నువ్వు....నన్ను...ఆటపట్టించడం లేదు కదా..."..
సమాధానంగా ఆమె అతని గుండెలో ఒదిగిపోయింది..
అతను  అంత అదృష్టవంతుడు కాదు...అది అతనికీ తెలుసు...అందుకే "నేను నీ ప్రేమకి అనర్హుడిని..." అంటూ అతను ఆమె నుంచి విడిపోయి దూరంగా వెళ్ళిపోయాడు...అమెలాగే నిస్సహాయంగా చూస్తూ నిల్చుంది..

కాలేజీ  నుంచి ఇంటికి ఆలస్యంగా బయలుదేరిన సంహితకి బస్సు స్టాప్ లో సుధీర్ కనిపించాడు...ఒక్కడే..తనకోసమే చూస్తున్నట్లున్నాడు..ఆమె నిదానంగా వెళ్లి అతని ప్రక్కన నిల్చుంది..కాసేపు ఇద్దరి మధ్యా మౌనం..
"ఇంకా ఇంటికి వెళ్ళలేదే..." అడిగిందామె ఆ నిశ్శబ్దాన్ని చేదిస్తూ 
"నీకోసమే...."
అతని వైపు చూసిందామె....
"ఆ మాట జీవితాంతం అనగలవా....నాకోసం..." ఆమెకి అతను కావాలి...ఆమె అతన్ని వదులుకోలేదు...అన్ని రోజులు అతని పైన కొద్దికొద్దిగా పెంచుకున్న ఇష్టం ఈ రోజు ఒక అగ్నిపర్వతంలా బద్దలయి లావా లా బైటకి వచ్చింది ఆమె ప్రేమంతా...
"బుజ్జి బంగారం..." ఎంతో ప్రేమగా అతను పిలిచిన మాట విని ఆశ్చర్యంగా అతని వైపే చూస్తుంది..."ఇలా నిన్ను పిలవాలని ఎప్పటినుంచో అనిపించేది..నువ్వు నన్ను ఆటపట్టించిన ప్రతి సారీ, నిన్ను దెగ్గరకు తీసుకోవాలని అనిపించేది..ఆ మరుక్షణమే నా పిచ్చి ఊహకు నాలో నేనే నవ్వుకునే వాడిని...నువ్వంటే.." అతని మాటలు మధ్యలోనే ఆగోపోయాయి...ఆమె వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంది...ఆమె కన్నీళ్ళతో అతని గుండె తడిచింది.

"కానీ ఇది జరుగుతుందా?..మీ నాన్న పెద్ద బిజినెస్ మాగ్నెట్..నాకేమో ఎవరూ లేరు...మా మామయ్యను నేను ఒప్పించగలనేమో కాని మీ నాన్నని ఒప్పించగలనా...మన ప్రేమ గెలుస్తుందా? " అతనిలో భయం మొదటిసారిగా చూసింది సంహిత...
"ఇంత పిరికిగా ఎలా మాట్లాడుతున్నావ్...వద్దు, ఒక పిరివాడిలా మారి నన్ను ప్రేమించొద్దు...దైర్యంగా నా చేయి అందుకునే తెగింపు నీలో ఉంటేనే ప్రేమించు...పదిమంది నిన్నుకొట్టినా తలవంచని నీ మొండితనం, వెయ్యి మంది ముందు ఒక అమ్మాయి పరువు కాపాడిన నీ తెగింపు...మన ప్రేమకి పనికిరావా??" చివాలున కొరడాతో కొట్టినట్లు అనిపించింది అతనికి...

ఏదో సంకల్పించుకున్న వాడిలా బండి స్టార్ట్ చేసి, "ఎక్కు" అన్నాడు ..
ఆమె అతనివైపే చూస్తూ ఎక్కి కూర్చుంది...బండిని వంద కె/హెచ్ లో బీచ్ రోడ్ పై దూకించాడు....అలా వెళ్తూ రుషికొండ దాటి వెళ్లి..ఒక చిన్న గుడి దెగ్గర ఆపాడు..అక్కడ ఉన్న అమ్మవారి రాతి విగ్రహంకి ఉన్న బొట్టుని వేలితో తీసి సంహిత నుదిటి మీద పెట్టి "ఈ జన్మలో నే కాదు...మరో జన్మంటూ ఉన్నా నువ్వే నా భార్యవి.."..అంతే ఉద్వేగంతో అతన్ని అల్లుకుపోయింది సంహిత...

మరుసటి రోజు విషయం తెల్సుకున్న నేను(కార్తీక్..ఇదంతా కార్తీక్ సుధకి చెప్తున్నాడు..ఇక్కడ నేరేటర్ కార్తీక్ ) చాలా సంతోషించాను...నేను ఎపుడో అనుకున్నాను సంహితకి సుధీర్ మంచి జోడి అని..అతను నిస్వార్ధమైన వ్యక్తి..ప్రేమిస్తే ప్రాణాలు ఇస్తాడు..

ఆరోజు నుంచి కాంపస్ లో ఎక్కడ చూసినా మేమే...( ఆఫ్ కోర్స్ ప్రేమికులకి కావాల్సిన ప్రైవసీ ఇస్తున్నాను అనుకోండి )..మా ముగ్గురి స్నేహం మరింత బలపడింది...ఆ తరువాత సుధీర్ చాలా మారాడు..అందరితో బాగా కలిసిపోతున్నాడు..కానీ మొండితనం, కోపం మాత్రం అస్సలు తగ్గలేదు..రోజూ సంహితే సొంతంగా లంచ్ ప్రేపర్ చేసి సుధీర్ కోసం బాక్స్ తెచ్చేది..పాపం అంతకముందు వంట రాదంట..ఏదో మాటల్లో సుధీర్ ఓ సారి నీ చేతి వంట తినాలని ఉంది అన్నాడట...పాపం చాలా కష్టపడి నేర్చుకోవడమే కాదు..రోజూ బాక్స్ లో తీసుకొచ్చి తనే తినిపించేది...ఈ తినిపించే సన్నివేశంలో నేను పని ఉందంటూ అలా బైటకి వెళ్లి వచ్చేవాడిని...

ఓ రోజు సుధీర్ కోసం కాలేజీలో ఎంత వెతికినా కనిపించలేదు...ఎవ్వరిని అడిగినా తెలీదు అన్నారు...దివ్య కూడా లేదు..మూడు రోజులు అయింది, అయినా వాళ్ళిద్దరూ కనిపించలేదు...సంహిత ఒకటే ఏడుపు...అన్నం తినడం మానేసింది..నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు..."చంటీ తనకి ఏదన్నా అయితే నేను తట్టుకోలేను రా..." అంది ఏడుస్తూ...నాకు దాన్ని చూసి చాలా జాలేసింది...

మరుసటి రోజు కాలేజీలో ఇద్దరూ కనిపించారు...సంహిత సుధీర్ ని చూస్తూనే వెళ్లి "ఎక్కడికెళ్ళావ్ ఇన్ని రోజులు...నువ్ లేకుండా నేను ఉండగలనా.." అంటూ ఏడ్చింది...
"బుజ్జి...దివ్య వాళ్ళ నాన్న చనిపోయార్రా .." చెప్పాడు బాధగా
ప్రక్కనే దివ్య కూర్చొని ఉంది...ఆమెకు అంతా సూన్యంగా ఉంది పరిస్థితి...
వెంటనే  సంహిత వెళ్లి దివ్యని ఓదార్చింది...
"ఇప్పుడు దివ్యకి ఎవరూ లేరు..వాళ్ళమ్మ చిన్నప్పుడే పోయింది ...రాబందుల్లా పీక్కుతినే బందువులు కొంతమంది ఉన్నారు, కానీ నేను దివ్యని ఎవ్వరికీ అప్పజెప్పను...తను నాతోనే ఉంటుంది..తన భారం నాదే...నేనే పెళ్లి చేస్తాను..." ఉద్వేగంగా చెప్పాడు సుధీర్...సుధీర్ ని పట్టుకొని "అన్నయ్యా..." అంటూ ఏడుస్తుంది ఆ పిల్ల..
నిర్ణయం తీసుకున్నవాడిలా "దివ్యకి ఇష్టం అయితే తనని నేను పెళ్లి చేసుకుంటాను..." అన్నాను 
ముగ్గురూ చివ్వల్న తలెత్తి చూసారు నా వైపు...సుధీర్ నా దెగ్గరికి వచ్చి.."కార్తీక్...." అన్నాడు ...
"నేను ఆలోచించే చెప్తున్నా...తనంటే నాకిష్టమే..." అన్నాను...
ఉబుకుతున్న కన్నీరు కంటి నుండి జారుతుండగా నన్ను గట్టిగా తన భుజానికి హత్తుకున్నాడు సుధీర్...

ఆ  తరువాత దివ్య నాకు చాలా దెగ్గరైంది...ఎంతగా అంటే సంహీని చూసి తను కూడా నాకు లంచ్ బాక్స్ తీసుకురావడం మొదలెట్టింది...కానీ తినిపించాలంటేనే కొంచెం సిగ్గు అడ్డొస్తుంది పాపం దివ్యకి..ఎంతైనా పల్లెటూరి పిల్ల కదా..."సంహిత అంటే ఇంట్లో ఉంటుంది కాబట్టి ప్రిపేర్ చేసుకొని వస్తుంది, నువ్వు హాస్టల్ లో ఉంటున్నావ్...వద్దులే...వండుకొని తీసుకోస్తేనే ప్రేమ ఉన్నట్లా.." అన్నాను...తనకు ఏం అర్థం అయిందో మరి, కొంచెం కళ్ళలో నీళ్ళు వచ్చాయి..."తీసుకురానులే..." అంటూ వెళ్ళిపోయింది...అమ్మాయిలను అర్థం చేసుకోడం చాలా కష్టమే...

ఫైనల్ ఇయర్ కి వచ్చాం...దివ్యని మా ఇంట్లో పరిచయం చేశా.. అందరికీ నచ్చింది..కొంచెం విశాల భావాలు ఉన్న ఫామిలీ కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేకుండా మా పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ దొరికింది...ఎటొచ్చి సంహితకే ప్రాబ్లం...వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మాగ్నెట్..సంహిత విషయం ఇంట్లో చెప్పేయాలని నిర్ణయించుకుంది..ఓ రోజు సుధీర్ ని లంచ్ కి పిలిచి వాళ్ళ నాన్నకి పరిచయం చేసింది..కానీ సుధీర్ పట్ల వాళ్ళ నాన్న తీరు ఆమెకి ఏమాత్రం నచ్చలేదు...సుధీర్ అంటే ఏదో చిన్న చూపు చూసినట్లు మాట్లాడటం ఆమెకు మింగుడు పడలేదు...

చివరికి సుధీర్ ని తను ప్రేమిస్తున్నట్లు చెప్పింది..సరేమిరా అన్నాడు వాళ్ళ నాన్న...ఈ విషయం సంహిత మాకు చెప్పింది..."డబ్బున్న అహంకారం అతనిది...కూతురి పెళ్లి కూడా బిజినెస్ అనుకుంటున్న అతను నా తండ్రి" అంటూ మా దెగ్గర పెదవి విరిచింది...
"నే వెళ్లి మాట్లాడుతాను..." అన్నాడు సుధీర్...
"వద్దు...అది కరెక్ట్ గా ఉండదు....నే మాట్లాడుతాను" అని చెప్పి తరువాతి రోజు వాళ్ళింటికి వెళ్లాను...

"అంకుల్...వాళ్ళిద్దరూ ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు...వాళ్ళని దీవించండి.." అన్నాను 
"ఈ కాలం  ప్రేమల  గురుంచి నాకు చెప్పొద్దు...అన్యాయంగా అందమైన భవిష్యత్తుని పాడుచేసుకోవద్దని తన మంచి కోరే స్నేహితుడిగా నువ్వే చెప్పు .." అన్నాడు 
"ఈ కాలం ప్రేమల గురుంచి మీకేం తెలుసో నాకు తెలీదు..కానీ సంహిత సుధీర్ ల ప్రేమ గురుంచి నాకు తెలుసు..అందుకే మిమ్మల్ని వాళ్ళ ప్రేమని అంగీకరించమని చెప్దామని వచ్చాను....లేకపోతే మీరు ఏం కోల్పోతారో మీకు ఇప్పుడు తెలీదు..." అని చెప్పి వచ్చేసాను...

ఇంజనీరింగ్ పూర్తయింది...కాంపస్ సెలెక్షన్స్ లో మా నలుగురికీ జాబ్స్ వచ్చాయి..సంహిత ఈ లోపు వాళ్ళ నాన్నని ఎన్ని సార్లు అడిగినా లాభం లేకపోయింది...ఇక ఆమెలో సహనం నశించింది..ఆమెకు తెలుసు తండ్రి ఒప్పుకోడు అని, అందుకే ఆమె ఇల్లు వదిలి రావడానికే నిర్ణయించుకుంది..., చివరి ప్రయత్నం చేద్దమనుకొని ఇంటికి వెళ్ళింది...

"నాన్న...నేను తనని పెళ్లి చేసుకొని జీవించడంలో నాకు ఎంతో సంతోషం ఉంది...మీ కూతురి సంతోషం మీకు ముఖ్యం కాదా ?" అడిగిందామె ఆవేదనగా 
"నీకు నీ ప్రేమ ఒక్కటే కనిపిస్తుంది...నువ్వే ఎవడో అనామకుడిని చేసుకుంటే నా పరువేం కాను...నా బిజినెస్ పార్టనర్ కొడుకుని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను...అదే నీకు కూడా మంచి లైఫ్ ఇస్తుంది..." అన్నాడు
"సుధీర్ ని తప్ప నేను ఎవరినీ పెళ్ళిచేసుకోను...." తెగేసి చెప్పించి ఆమె..
"నా మాట గౌరవించని వాళ్లకు ఈ ఇంట్లో స్థానం లేదు..అది కూతురైనా సరే.." స్థిరంగా చెప్పసాగాడు ఆ తండ్రి "కూతురిగా నా గౌరవం నిలబెట్టాలి అనుకుంటే నేను చెప్పిన వాడినే పెళ్ళిచేసుకో..."
"నల్ల కోట్లు వేసుకునే వాళ్ళముందు మీ పరువు కాపాడటానికి, జీవితాంతం నా మనసుకి నేను నల్ల ముసుగు వేసుకొని జీవించలేను నాన్నా.." అంతే స్థిరంగా చెప్పింది ఆమె కూడా..
"అదే నీ నిర్ణయమయితే..." అని వాకిలికేసి వేలు చూపించాడు ఆమెకి..
అంతే ఆమె విసురుగా లోపలి వెళ్లి ఒక సూట్ కేసుతో బైటకి వచ్చి అతని వైపు ఓసారి చూసింది.
"వెళ్ళదల్చుకున్నవాళ్ళు ఆగడం దేనికి..." చేతులు వెనక్కి కట్టుకొని పక్కకి చూస్తూ అడిగాడు
"ఇదే చివరిసారి మీ కూతురు మిమ్మల్ని చూడటం అని తెలియజేయడానికి.." అని గుమ్మం దాటి వెళ్లిపోయిందామె


     [To be continued in the fifth part........Next part would be probably on Thursday... Best Regards - Kishen Reddy ]

Friday, 21 May, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 3


"సంహిత, నేను ఒకే రోజు గీతం కాలేజీలో జాయిన్ అయ్యాము...అదే రోజు ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం..." కార్తీక్ చెప్తున్నాడు, సుధ అలాగే అతని వైపు చూస్తూ వింటుంది...

***********************************************************

"కాలేజీలో చేరాలి అంటేనే భయం వేసింది నాకు...రాగింగ్, గొడవలు..ఇలా ఏవేవో నన్ను చాలా భయపెట్టాయి...మొదటి రోజే నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది.." అని చెప్తున్న సంహిత వైపు అలానే చూస్తున్నాను...
"చిన్నపటినుండి ఎప్పుడూ సెకండ్ అనే మాట నాకు తెలీదు...అన్నిటిలో నేనే ఫస్ట్...ఇక్కడ కూడా కష్టపడి కాలేజీ ఫస్ట్ తెచ్చుకోవాలి..." అంటూ పట్టుదలగా చెప్తున్న సంహీని చూసి ముచ్చటేసింది...
"యు విల్...అల్ ద బెస్ట్..." అంటూ విష్ చేసాను..
"థాంక్స్...నిన్ను నేను చంటి అని పిలవోచ్చా?.." అని అడిగింది సంహిత...
"నీ ఇష్టం...కానీ చంటీ అనే ఎందుకు?" అడిగాను
"ఆ పేరు అంటే నాకు చాలా ఇష్టం...చిన్నప్పుడు నేను మొదటిసారిగా స్కూల్ లో చేరినప్పుడు, నాకు మొదటి రోజే పరిచాయం అయ్యాడు చంటి...నాకు చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడు ..మేమిద్దరం రోజూ బాగా ఆడుకునేవాళ్ళం...అతను నాతో ఆడుకోడానికి రాకపోతే ఇక ఆ రోజంతా నేను అన్నం తినే దాన్ని కాదు..అలాంటిది సడన్ గా చంటిని స్కూల్ మన్పించేసారు...తర్వాత తెలిసింది చంటికి అంత చిన్నతనంలోనే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని..అతను ఎక్కువ కాలం బ్రతకడని..తనని చూడటానికి ఓ రోజు వెళ్ళినప్పుడు 'సమ్మి నేను నీతో అడుకోలేను ఇంకెప్పుడూ...నాకు వొంట్లో బాగోలేదు..నువ్వు ఏడవకు, నీకు ఇంకో చంటి దొరుకుతాడు..' అన్న చంటిని పట్టుకొని బాగా ఏడ్చేసాను...చంటి కొన్ని రోజులకి చనిపోయాడు...ఆ తర్వాత ఇన్నేళ్ళకి నాకు మొదటి రోజే ఫ్రెండ్ అయిన నిన్ను చూసి చంటి గుర్తొచ్చాడు...అందుకే నిన్ను చంటి అని పిలుస్తా.." అని చెప్పిన సంహిత వైపు చూసాను...'నేను నీకు అంత గొప్ప స్నేహితుడిని అవ్వగాలనా..?' అంటూ నా మనసు ఆమెకు వేసిన ప్రశ్నకి బదులుగా ఆమె రువ్విన చిరునవ్వు నాకు సమాధానం తెలిపింది...

ఓ రోజు సన్నగా చినుకులు మొదలవ్వగా, మేమిద్దరం కాలేజీ బస్సు స్టాప్ షెల్టర్ కింద ఉన్నాం...ఇద్దరు సీనియర్లు ఒక జూనియర్ ని రాగింగ్ మొదలెట్టారు అక్కడ...
"రేయ్...సెల్యూట్ చెయ్యి భే..." 
"...."
"ఏందిరా చెవుటోడివా??..."
"...."
"నీ పేరేంట్రా??"
"....."
"బట్టలు ఊడదీసి పరిగేత్తిస్తా కాంపస్ మొత్తం...నాకు గురుంచి తెలీదేమో...ఏం జూస్కోనిరా ఈ పొగరు...చెయ్ సెల్యూట్..."
"....."
సీనియర్ గాడికి తిక్కరేగి..'నీ యబ్బా..' అంటూ కాలర్ పట్టుకున్నాడు..
తలెత్తి సీనియర్ వైపు చూసాడు అతను...అప్పుడు చుశాను అతని కళ్ళ వైపు...ఒక్కసారిగా మండుతున్న అగ్నిగోళంలా మారాయి..'ఏంట్రా ఆ చూపు...' సీనియర్ మాటలు పూర్తి కాలేదు, ఎప్పుడు ముడిచాడో ఆ పిడికిలి, ఆ నరాల శబ్దం వినిపించి అటుచూసే లోపే అతగాడి పిడికిలి సీనియర్ పొత్తికడుపులో పిడిబాకులా దిగింది...
కిందబడి దొర్లుతున్న సీనియర్ ని చూస్తూ..." సుధీర్....సుధీర్ నా పేరు.." అంటూ వెళ్ళిపోయాడు ఆ జూనియర్....

ఇదంతా చూసిన సంహిత "ఛ..ఇలాంటి వాళ్ళు గొడవలు పెట్టుకోడానికే కాలేజీకి వస్తారేమో...సగం ఇలాంటి వాళ్ళ వల్లే కాలేజీ చేరాలంటేనే నాలాంటి వాళ్ళు భయపడుతున్నారు.." అంది..నేను మాత్రం అలా నడిచి వెళ్తున్న సుధీర్ అనబడే జూనియర్ వైపే చూస్తున్నా...

ఆ తర్వాత చాలా రోజులు సుధీర్ ని గమనించాను..ఏదో వచ్చి తన పని చూసుకొని వెళ్లి పోయేవాడు, పెద్దగా ఎవరితోనూ కలిసేవాడు కాదు..నేను, సంహిత అనుకున్నట్లు అతను గొడవలకి పోయే రకం ఏమీ కాదు.కానీ తనని అనోసరంగా కదిలిస్తే, ఇక అదొక పెద్ద గొడవ అవుతుంది అని మాత్రం అర్థం అయింది...సుధీర్ ఆ రోజు సీనియర్ ని కొట్టిన ఇన్సిడెంట్ పెద్ద దుమారమే లేపింది..సీనియర్స్ ఒక బాచ్ కలిసి సుధీర్ని బాగా కొట్టారు..కాంపస్ ముందు మోకాళ్ళ మీద నిల్చుని సీనియర్స్ కి సారి చెప్పమన్నారు వాళ్ళు సుధీర్ని...ఊహూ అలా చెప్తే వాడు సుధీర్ ఎందుకు అవుతాడు.."నా ప్రాణం పోయినా అది జరగదు అన్నాడు.." చివరికి ఈ విషయం ప్రిన్సిపాల్ కి తెలిసి ఎలాగో రాజీ కుదిర్చాడు...

సుధీర్ చాలా మొండొడు...అస్సలు దేనికీ భయపడడు...సంహితకి మాత్రం అతనంటే కోపం..అతనికి అంత మొండితనం పనికిరాదు అంటుండేది...

ఓ రోజు కాలేజీ అయిపోయాక, బస్సు స్టాప్ కి వచ్చాను ఒక్కడినే ఆ రోజు సంహిత కాలేజీకి రాలేదు..సుధీర్ ఒక్కడే ఉన్నాడు బస్సు స్టాప్ లో..
"హాయ్ సుధీర్..." మాట కలిపాను అతన్ని చూస్తూనే...
"హాయ్.." చాలా ముక్తసరిగా చెప్పాడు 
"నా పేరు కార్తీక్...కంప్యూటర్స్..." అన్నాను చేయి కలుపుతూ 
"ఓహ్..."
అతను పెద్దగా మాట్లాడడు అని తెలిసీ నేనే సంభాషణ కొనసాగించాను 
"ఎవరికోసం అయినా ఎదురు చూస్తున్నావా?" అంటూ అడిగాను 
"ఆ..అవును..." మళ్లీ మౌనం..
ఇంతలో ఒక అమ్మాయి వచ్చింది..."సారి అన్నయ్య కొంచెం లేట్ అయింది...అయినా నువ్వెళ్ళిపోవాల్సింది కదా..." అందామె వస్తూనే...
"నిన్ను ఒంటరిగా వదిలా??..అదెప్పుడైనా జరుగుతుందా!!" అన్నాడతను పక్కనే పార్క్ చేసిన ఉన్న బైక్ స్టార్ట్ చేస్తూ...
వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు...ఆ అమ్మాయి పేరు దివ్య...తరువాత నాకు తెలిసిందేమిటంటే...వాళ్లేమీ రక్తం పంచుకుపుట్టిన అన్నాచెల్లెళ్ళు కాదు..దివ్య తండ్రి ఆ అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు, వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చారు అని తెలుసుకొని, సుధీర్ ఫార్మాలిటీస్ పూర్తిచేయడంలో సహాయం చేసాడు వాళ్లకి..దివ్యని వైజాగ్ లో దెగ్గరుండి హాస్టల్ లో చేర్పించాడు..'బొత్తిగా లోకం తెలీని పిల్ల, అప్పుడప్పుడు కొంచెం కనిపెట్టుకొని ఉండు బాబు..' అని ఆమె తండ్రి చెప్పినపుడు 'అలాగే..' అని ఇచ్చిన మాట కోసం రోజూ దివ్యని కాలేజీలో దింపడం, మళ్లీ తిరిగి హాస్టల్ లో దింపడం అతని దినచర్యలో భాగం...

ఓ రోజు దివ్య క్లాసులో ఎవడో "అయాం అవైలబుల్ టునైట్" అని ఒక పేపర్ మీది రాసి దివ్య జడకి తగిలించాడు ఆమెకి తెలియకుండా...అది చూసి కాంపస్ లో వాళ్ళందరూ ఒకటే నవ్వు...అది చదివిన ప్రతి పోకిరి వెధవ ఆమె దెగ్గరికొచ్చి "నేను కూడా అవైలబుల్...నేను రావచ్చా" అంటూ ఒక వెకిలి నవ్వు వదులుతుంటే అర్థంకాక ఆ తరువాత ఎవరో ఒక అమ్మాయి ఆ పేపర్ తీసి ఆమెకి చూపిస్తే ఒక్క క్షణం ఖంగుతిని వెంటనే సిగ్గుతో చచ్చిపోవాలని అనిపించింది దివ్యకి. ఈ విషయం తెలిసిన సుధీర్, అలా రాసినవాడెవడో కనుక్కొని కోపంతో రగిలిపోతూ దివ్య క్లాసుకి వెళ్లాడు..క్లాసు మధ్యలో ఉందనే విషయం కూడా అతనికి కనిపించలేదు..అతనికి కనిపించింది ఒక్కటే దివ్యని ఎడిపించినవాడు, వాడి కాలర్...విసురుగా వెళ్లి వాడి కాలర్ పట్టుకొని బెంచ్ పైనుంచి లాగి ఈడ్చుకుంటూ వాడిని తీసుకెళ్తుంటే క్లాసులో అందరూ కోయ్యబోమ్మల్లా చూస్తుండిపోయారు....వాడిని అలాగే కాలర్ పట్టుకొని ఈడ్చుకుంటూ కాంపస్ మధ్యకి తీసుకొచ్చి..."నువ్వు రేపు మళ్లీ కాలేజీకి రావాలంటే నేను చెప్పమన్నది చెప్పు..కాలేజీ మొత్తం వినాలి నువ్వు చెప్పేది " అన్నాడు వాడి వైపు చూస్తూ..వాడు వణుకుతూ ఉన్నాడు..."చెప్తావా...లేక .." అతను పిడికిళ్ళు ముడవడం చూసి...గట్టిగా సుధీర్ చెప్పమన్నట్లు చెప్పాడు...కాలేజీ మొత్తం వినేలా..ఇలా .."రమేష్ అనబడే నేను...మొగాడిని కాదు...అటూ ఇటూ కాని జాతికి చెందిన వాడిని...అందుకే మా.డా గాడిలా దివ్యని ఎడిపించాను...నన్ను రేపటినుంచి అందరూ అలానే పిలవోచ్చు.." అన్నాడు..అదే మాట పది సార్లు గట్టిగా కాంపస్ అంటా వినేలా చెప్పించాడు సుధీర్....ఆ తరువాతి రోజు నుంచి రమేష్ అనబడే ఆ అటూ ఇటూ కాని జాతికి చెందిన వాడు కాలేజీకి రావడం మానేసాడు...ఆ తరువాత దివ్యని ఏడిపించడం మాట అటుంచితే, కనీసం మాట్లాడటానికి కూడా భయపడేవారు...

అదిగో...సరిగ్గా ఆ ఇన్సిడెంట్ తో సంహిత దెగ్గర నూటికి ఒక యాభై మార్కులు కొట్టేసాడు మన సుధీర్...
"కుర్రాడు మంచోడే చంటి...కాకపోతే కాస్త వెర్రి...కాస్త తింగరి తనం...బోలెడంత మొండితనం...అంత కన్నా ఎక్కువ పొగరుబోతుతనం ఉన్నాయి..." అంటూ సుధీర్ పై తన అనాలిసిస్ చెప్పింది సంహిత ఓ రోజు సడన్ గా నాతో...
"ఓహో...మొత్తానికి అతనిమీద ఒక ఒపినియన్ కి వచ్చావనమాట..." అన్నాను నవ్వుతూ 
"ఆ..ఏదో..పర్లేదు...కానీ ఒక అమ్మాయి పరువుని అందరిముందు ఎలా కాపాడేడో చూసావు కదా...కొంచెం వైలెంట్ గా అనిపించినా, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి దెగ్గరనుంచి అంత కన్నా హామీ ఏం కావాలి...నీ కోసం నా ప్రాణం అడ్డేస్తా అనే హామీ.." అంది కొంచెం ఎమోషనల్ గా...
"హ్మం ...నిజమే" అన్నాను...ఇంతలో ఎప్పుడు వచ్చాడో తెలీదు, మా మాటలు విన్నవాడిలా మా ప్రక్కనుంచి చిన్న స్మైల్ తో వెళ్తూ కనిపించాడు సుధీర్...
"నవ్వడం కూడా వచ్చే అబ్బాయికి..." అంది మెల్లిగా నవ్వుతూ సంహిత...
"పోగిడావు కదా అబ్బాయిని మరి.." అన్నాను ఆమెతో కలిసి నవ్వుతూ 

ఆ తరువాత దివ్యకి సంహిత మంచి ఫ్రెండ్ అయింది...తద్వారా సుధీర్ కూడా మాతో మాట్లాడుతూ ఉండేవాడు..కానీ ఎంత వరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడేవాడు.."ఓ ముక్క ఎక్కువ మాట్లడిదే..తమరిని అమ్మాయిలు లవ్ లో పడేస్తారని భయమా??" సంహిత డైరెక్ట్ గానే అడిగేసింది ఓ సారి...ఓ నవ్వు నవ్వి అక్కడనుంచి పరార్ మనోడు...

ఓ రోజు అందరం కలిసి కూర్చొని మాట్లాడుతుండగా సంహిత సడన్ గా అడిగింది సుధీర్ ని " ఆ రోజు దివ్య స్థానంలో నేను ఉంటె...నువ్వు అలా రియాక్ట్ అయ్యేవాడివా??" అని...
"అయ్యుండేవాడిని కాదు..." చెప్పాడతను
"ఏం ?...ఎందుకని?.." కొంచెం రోషం సంహిత గొంతులో 
"అప్పుడు నువ్వెవరో నాకు తెలీదుగా..." అన్నాడతను స్థిరంగా 
"ఓహో తెలిస్తేనే కాపాడుతావా...సరే ఫర్ ఎక్సాంపుల్ నేను నీ లవర్ అని అనుకో...మరి అప్పుడు.." అందామె...ఏదో తెలుసుకోవాలనే తపన ఆమెలో...
"అప్పుడు....అప్పుడు...." అతనేమి చెప్తాడో అనే ఎదురుచూపు తాలూకు మెరుపు చూశాడతను ఆమె కళ్ళలో ...
"ఏమో...నువ్ నా లవర్ అయితే గాని చెప్పలేను." అన్నాడతను.
"అబ్బో...ఏదో ఎక్సాంపుల్ కి అడిగాను బాబూ..అంత దూరం వెళ్ళకు..." అంది సంహిత
"నేను వెళ్ళానా??.." అంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు..
"అంటే ఏంటి...నేను వెళ్ళాననా??...ఏంటి చంటి అతని భావం...అసలు ఆ పొగరు ఏంటి మనిషికి...అలా మధ్యలో వెళ్లిపోతాడేంటి??.." అంటున్న సంహిత రోషం వెనుక ఏమి దాగుందో తెలుసుకోవాలనిపించింది నాకు...


 [ To be continued in the 4th part...I will publish the 4th part on Sunday probably :-) ]

Saturday, 15 May, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 2


సంహిత కళ్ళు తెరిచే సరికి హాస్పిటల్ లో ఉంది. 
సుధీర్ చనిపోయాడన్న విషయం ఆమెకి గుర్తురాగానే దుఃఖం పొంగుకు వచ్చింది..తను ఇక లేడు అన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది..అతను ఎవరో ఏమిటో, అసలు అతని గురుంచి ఏమీ తెలియదు..పరిచయం కూడా చాలా తక్కువ, కానీ సర్వస్వం కోల్పోయినట్లు అనిపిస్తుంది ఆమెకు..అతనితో మాట్లాడింది కొన్ని మాటలే కావచ్చు, కానీ ఆమె హృదయం అతని హృదయంతో అనుక్షణం సంభాషిస్తూనే ఉంది..ఊసులాడుతూనే ఉంది...

నర్స్ లోపలి వస్తూనే "మీ నాన్న గారు, అమ్మ గారు హాస్పిటల్ కి బైల్దేరారు..కొద్దిసేపట్లో వచ్చేస్తారు..ఈ రోజు సాయంత్రం మిమ్మల్నిడిశ్చార్జ్ చేస్తారు .." అంది..
"నన్ను హాస్పిటల్ లో ఎవరు చేర్చారు..." అంది సంహిత
"ఎవరో ఒక అబ్బాయి చేర్చాడు...అతను పేరు కార్తీక్ అంట.." అంది నర్స్ సంహితకి టాబ్లెట్ ఇస్తూ..
"అలాగా..." అంది 
"మీరు రెస్ట్ తీసుకోండి..." అంటూ నర్స్ వెళ్ళిపోతుండగా..."నేను ఆ అబ్బాయితో ఒక సారి మాట్లాడాలి...పిలుస్తారా?" అంది సంహిత...
"అలాగే..." అంటూ వెళ్ళిపోయిన నర్స్ కార్తీక్ ని సంహిత దెగ్గరకు తీసుకువచ్చి తను వెళ్ళిపోయింది...

పాతికేళ్ళు ఉంటాయి అతనికి..ఆరడుగుల ఎత్తు,కోల మొహం..లేత గడ్డం,నూనూగు మీసాలు..ఫుల్ హాండ్స్ చొక్కాని చేతులు సగం మడిచి, చక్కగా ఇన్షర్ట్ చేసుకోని ఉన్నాడు...
"థాంక్స్..." అంది సంహిత అతన్ని చూస్తూనే..
"పర్లేదు...మీతో పాటే బస్సులో ఉన్నాను నేను...మిమ్మల్ని చాలా సార్లు నేను ఎక్కిన బస్సులోనే చూశాను ..నేను దిగిన స్టాప్ లోనే మీరూ దిగారు...మీరు ఎప్పుడూ దిగే స్టాప్ అది కాదు...మిమ్మల్నే కొద్ది దూరం అనుసరించాను...కానీ ఆ క్షణం మీరు..." అంటూ అతను ఇంకా ఏదో చెప్పబోతుండగా
"మీరు నాకొక చిన్న మాట ఇవ్వగలరా?" అందామె అతన్ని సూటిగా చూస్తూ 
"చెప్పండి" అన్నాడు అతను స్థిరంగా 
"ఆ స్పాట్ లో ఏం జరిగిందో మా అమ్మానాన్నలకు తెలియకూడదు...ఏదో స్కూటర్ తగిలి నేను క్రింద పడిపోతే, మీరు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారని చెప్పండి..ప్లీజ్.." అందామె బ్రతిమాలుతూ..
"నేను అర్థం చేసుకోగలను..." అన్నాడతను చిన్నగా తలాడిస్తూ..
"థాంక్స్...మీరు మరోలా అనుకోకపోతే ఇంకో సాయం చేస్తారా?.." అందామె
"చెప్పండి..."
"అక్కడ ఆక్సిడెంట్ లో చనిపోయిన అతన్ని ఏ హాస్పిటల్ మార్చురీలో ఉంచారో కొంచెం తెలుసుకొని చెప్తారా...నాకు అతని కడసారి చూపు దక్కాలి..." అందామె రాబోతున్న కన్నీటిని తుడుచుకుంటూ
"మీరు ఏం చెప్తున్నారో...." అంటూ అతను ఏదో చెప్తుండగా, సంహిత అమ్మానాన్నా వచ్చారు అక్కడికి...
"ఏమైంది తల్లీ..." అంటూ రాగానే కన్నీళ్ళు పెట్టుకుంది సంహిత తల్లి...
ఆమె కార్తీక్ వైపు చూసి చేతులు జోడించింది...
కార్తీక్ ఆమె చేతిని పట్టుకొని వద్దంటూ బైటకి వెళ్తూ...ఇక వస్తాను అన్నట్లుగా సంహిత వైపు చూసాడు..అతన్ని చూస్తుంటే ఎంతో దెగ్గరి ఆత్మీయుడిలా..ఓ గొప్ప స్నేహితుడిలా ...ఎప్పటి నుంచో తెలిసిన వాడిలా కనిపిస్తున్నాడు సంహితకి..
అతను వెళ్ళిపోతుండగా.."చంటి ...." అందామె..
చివాల్న వెనక్కి తిరిగి చూసాడు కార్తీక్...అతని కళ్ళలో నీళ్ళు..
ఇది కనిపెట్టిన సంహిత తండ్రి కార్తీక్ ని తీసుకోని రూం బయటి వెళ్లాడు..
"నా కూతురిని మళ్లీ నువ్వే కాపాడావు...నీ ఋణం ఎలా తీర్చుకోవాలి??" అన్నాడు ఆయన
"మీరు ఒక్కసారి చేసిన తప్పుకే పెద్ద శిక్ష అనుభవిస్తున్నారు...ఇంకా నా ఋణం గురుంచి ఎందుకులెండి.." అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు..తలదించుకున్న ఆ తండ్రి లోపలికి  వెళ్ళిపోయాడు

ఆ సాయంత్రం డిస్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక విషయం తెలిసి సంహితని చూడటానికి సుధ వచ్చింది
"ఎలా జరిగిందే..." అంది సుధ రాగానే కంగారుగా..
"స్కూటర్ గుద్దింది...తుళ్ళి క్రింద పడ్డాను..మరుక్షణమే సృహ కోల్పోయాను..కార్తీక్ అనే అబ్బాయి నన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసాడు.." అంది 
"ఆ తెలుసు...కార్తీక్ ఎవరో కాదు, తను నా కజిన్....తనే నాకీ విషయం చెప్పాడు..నువ్వు కూడా నేను చదివే కాలేజీలోనే చదువుతున్నావ్ అని తెలుసుకున్నడేమో, సంహిత అనే అమ్మాయి నీకు తెలుసా అని అడిగాడు నన్ను...తెలియకపోవడం ఏమిటి తను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసరికి మనోడికి షాక్..." అంటూ చిన్నగా నవ్వింది
"ఓ రియల్లీ...నేను కార్తీక్ తో ఓ సారి మాట్లాడాలి..." అంది సంహిత..
"అలాగే..తనని నీకు కాల్ చెయ్యమని చెప్తాలే.." అంది సుధ 
"ప్లీజ్ త్వరగా చెయ్యమని చెప్పు..." అంది సంహిత, ఆమెలో ఏదో తేడా కనిపిస్తుంది సుధకి..ఆమెలో ఏవో అంతర్లీనంగా ప్రకంపనలు..ఏదో బాధ కొట్టొచ్చినట్లు తెలుస్తుంది సుధకి...

"అలాగే...నువ్వు రెస్ట్ తీసుకో...నేను రేపు ప్రొద్దున్నే వస్తాను.." అంటూ లేచి వెళ్లబోతుండగా
"మన కాలేజ్ టాపర్ సుధీర్....తను...తను.." అంటున్న సంహిత వైపు తిరిగి వింతగా చూస్తుంది సుధ..
"తను....చనిపోయాడట కదా.." అంది సంహిత...ఆమె కనుసన్నల నుంచి ఉబుకుతున్న నీరు సుధ దృష్టి నుంచి తప్పించోకోలేదు...నమ్మలేనట్లుగా చూస్తుంది సంహిత వైపు...
"ఏం మాట్లాడుతున్నావ్...సుధీర్ ఎవరు??" అంది సుధ కంగారుగా...సంహితకి ఏమవుతుంది అన్న ఆందోళన కలుగుతుంది సుధకి..
"అదేంటే మాత్స్ గ్రూప్ టాపర్ సుధీర్..." అంది సంహిత
"సరే సరే...నువ్వు రెస్ట్ తీసుకో...నేను రేపు వస్తాను..." అంటూ వెళ్ళిపోయింది సుధ

"కార్తీక్ సంహిత నీతో మాట్లాడాలట....తనకు ఓ సారి ఫోన్ చెయ్యి .." చెప్పింది సుధ కార్తీక్ తో సంహిత నెంబర్ ఇచ్చి..
"తను ఏం అడుగుతుందో నాకు తెలుసు...కానీ నేను నిస్సహాయుడిని..." అన్నాడు కార్తీక్ 
"ఏం అడుగుతుంది తను ??"
"సుధా...నీకొక నిజం చెప్పాలి..."
"ఏంటది..." కొంచెం కంగారుగా అడిగింది
"సంహితను స్కూటర్ గుద్దడం అబద్దం...అలా అని తను చెప్పమంటే నేను చెప్పాను..."
"అవునా....మరి ఏం జరిగింది..."సుధకి అంతా అయోమయంగా ఉంది 
"తను నేను ఒకే బస్సులో వెళ్తున్నాం...నేను రోజు దిగే సిరిపురం సిగ్నల్ దెగ్గరే తనూ దిగింది..దిగడమే కంగారుగా దిగింది..నన్ను దాటుకుంటూ ముందుకు వెళ్ళింది...సిగ్నల్ దెగ్గరికి వెళ్లి అలాగే నిల్చుంది కాసేపు..నేను ఆమెనే అనుసరించాను...ఆమె వైపు చూసాను...వణుకుతూ ఉంది..కళ్ళ వెంబడి నీళ్ళు...ఇంతలోనే సుధీర్ అని గట్టిగా అరిచింది ఏడుస్తూ..ఆ అరుపుకు నాకే భయం వేసింది..ఆ క్షణం ఆమె కళ్ళలోకి చూస్తే...సర్వస్వం కోల్పోయిన బాధ, ఆక్రోశం ఆమెలో...అక్కడ వెళ్ళే వాళ్ళు ఆగి మరీ ఆమె వైపే చూస్తున్నారు...ఇంతలే ఉన్నట్లుండి అక్కడే కుప్పకూలిపోయింది..నేను వెంటనే ఆమెని హాస్పిటల్ కి తీసుకువచ్చాను..." అంటూ చెప్తున్న కార్తీక్ వైపు నిశ్చేష్టురాలై చూస్తుంది సుధ...సంహిత అలా ఎందుకు ప్రవర్తిస్తుంది..నో వే...ఏదో ఉంది ఇందులో...కానీ ఏమీ అర్థం కావడం లేదు సుధకి..."కాలేజీ టాపర్ సుధీర్ అని ఎందుకు చెప్పింది...టాపర్ పేరు కిరణ్ కదా.." అంతా అయోమయగా తోచింది సుధకి.

"సంహిత నన్ను ఒక సాయం అడిగింది...అక్కడ ఆక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి బాడీ ఏ మర్చారీలో ఉందొ తెలుసుకొని చెప్పమంది...తను కడసారి చూడలట.." చెప్పాడు కార్తీక్ 
"అక్సిడెంటా?? ..అక్కడ ఆక్సిడెంట్ జరిగిందా?" అడిగింది సుధ విస్తుపోతూ
"లేదు...." 
"మరి...అలా ఎందుకు అడిగింది.." తలపట్టుకు కూర్చుంది సుధ 
"తెలియదు....ఒకటి కారణం అయి ఉండొచ్చు..." అని చెప్పాడు ఆలోచిస్తూ 
"ఏమిటది...." ఆమె గొంతు తడబడుతుండగా అడిగింది కార్తీక్ ని..
"చెప్తాను...నిజానికి సంహిత నాకు నాలుగేళ్ళుగా తెలుసు...తెలుసు అని చెప్పడం చాలా చిన్న పదం...తనకి ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ప్రాణ స్నేహితులు.. ఒకరు నేనైతే, ఇంకొకరు.......సుధీర్...."అంటూ  కార్తీక్ చెప్పిన విషయం విన్న సుధకి నోట మాట రాలేదు..ఆమె వళ్ళంతా చెమటలు పట్టాయి...ఆమె వింటున్న విషయం ఆమెని నిస్చేష్టురాలిని చేస్తుండగా చేష్టలుడిగి స్థాణువై అక్కడే నిలబడిపోయింది..అతను చెప్తున్న ఒకొక్క విషయం ఆమెలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి....

                                       [To be continued in the third part........]

Thursday, 13 May, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 1


"సుధీర్ ని తప్ప నేను ఎవరినీ పెళ్ళిచేసుకోను...." తెగేసి చెప్పించి ఆమె..
"నా మాట గౌరవించని వాళ్లకు ఈ ఇంట్లో స్థానం లేదు..అది కూతురైనా సరే.." స్థిరంగా చెప్పసాగాడు ఆ తండ్రి "కూతురిగా నా గౌరవం నిలబెట్టాలి అనుకుంటే నేను చెప్పిన వాడినే పెళ్ళిచేసుకో..."
"నల్ల కోట్లు వేసుకునే వాళ్ళముందు మీ పరువు కాపాడటానికి, జీవితాంతం నా మనసుకి నేను నల్ల ముసుగు వేసుకొని జీవించలేను నాన్నా.." అంతే స్థిరంగా చెప్పింది ఆమె కూడా..
"అదే నీ నిర్ణయమయితే..." అని వాకిలికేసి వేలు చూపించాడు ఆమెకి..
అంతే ఆమె విసురుగా లోపలి వెళ్లి ఒక సూట్ కేసుతో బైటకి వచ్చి అతని వైపు ఓసారి చూసింది.
"వెళ్ళదల్చుకున్నవాళ్ళు ఆగడం దేనికి..." చేతులు వెనక్కి కట్టుకొని పక్కకి చూస్తూ అడిగాడు
"ఇదే చివరిసారి మీ కూతురు మిమ్మల్ని చూడటం అని తెలియజేయడానికి.." అని గుమ్మం దాటి వెళ్లిపోయిందామె

****************************************************

ఉలిక్కిపడి లేచిన సంహితకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు, మరుక్షణం అదంతా కల అని తెలిసి ఊపిరి పీల్చుకుంది..
"మార్నింగ్ బంగారం..." తన రూంకి అప్పుడే వచ్చిన ఆమె తండ్రి నవ్వుతూ పలకరించాడు...
సంహిత వింతగా చూస్తుంది తండ్రి వైపు..."అదే నీ నిర్ణయమయితే..." అని కలలో వాకిలికేసి వేలు చూపించిన తండ్రి ముఖమే ఆమెకి ఇంకా కనిపిస్తుంది...

వెంటనే తన తండ్రి దెగ్గరకు వచ్చి ఆయన చేతులని తన చేతుల్లోకి తీసుకొని "క్షమించు నాన్నా..." అని అక్కడినుంచి వెళ్ళిపోయింది...అతను ఏమీ అర్థం కానట్లు అలాగే నిల్చున్నాడు..

"అసలు ఆ కల నాకెందుకు వచ్చిందో అస్సలు అర్థం కావడంలేదే..." స్నేహితురాలు సుధతో రాత్రి కల గురుంచి చెప్పింది సంహిత కాలేజీకి వస్తూనే....
"అర్థం అవ్వడానికి ఏముంది...తొందరలోనే ఎవడితోనో నువ్వు జుంపు జోగినాధం అనమాట...నాకు చెప్పకుండా గ్రంథం ఎమన్నా నడుపుతున్నావా.." అడిగింది ఆమె నవ్వుతూ..
"నీ మొహం...ఈ ప్రేమలు దోమలు అంటేనే నాకు టెన్షన్..దానికి తోడు నాన్నని ఎదిరించి ఇంట్లోనుంచి వెళ్ళిపోవడమా!!..." అంది సంహిత క్లాస్ రూం వైపు నడుస్తూ...
"అబ్బో...సరేలే...నీ కలలో వచ్చిన ఆ హీరో ఎవరో ?" అడిగింది సుధ..
"నాకేం తెలుసు...పేరు మాత్రం గుర్తుంది...సుధీర్.." 

కాలేజీ నుంచి బస్సు స్టాపుకి వస్తుంటే సంహిత పుస్తకాలు జారి క్రింద పడ్డాయి...ఆమె తీసుకోనేలోపు, అటు ప్రక్కగా వెళ్తున్న ఆ యువకుడు వడివడిగా వచ్చి ఆమె పుస్తకాలు తీసి చేతికీ అందించాడు..
"థాంక్స్.." అందామె అతని వైపు చూస్తూ...
అతనిలో ఏదో తెలియని ఆకర్షణ మొదటిచూపులోనే ...
పర్వాలేదు అన్నట్లుగా చూసి చిన్నగా నవ్వి వెళ్ళిపోయాడు అతను...
అతని చూపులోని చురుకుదనం...అతని అమాయక మోములో నుంచి జారిన ఆ అరనవ్వు ఆమెని ఒక్క క్షణం కట్టిపడేసాయి...కొద్దిగా గుండె వేగం పెరిగింది...అతను వెళ్తున్న వైపు అలానే చూస్తూ శిలాప్రతిమలా నిలబడిన ఆమె, అంతలోనే తేరుకొని క్షణక్రితం తన చర్యని తలచుకొని బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కగా తనలో తానే చిన్నగా నవ్వుకొని వెళ్ళిపోయింది...

"సంహీ....సంహీ..." అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది సుధ సంహిత లైబ్రరీలో ఉండటం చూసి...
"సైలెన్స్..." అంటూ బల్ల మీద సుత్తితో కొట్టాడు లైబ్రేరియన్ సుధ వైపు చూసి..
'వీడొకడు...వీడి చేతికి సుత్తి ఇచ్చిన వాడిని, బాలయ్య దెగ్గర గొడ్డలి అప్పు తీసుకొని మరీ నరికేయ్యాలి...' అనుకుంటూ సంహిత కూర్చున్న బెంచ్ దెగ్గరికి వచ్చింది...
"ఏంటే ఆ కంగారు..." అంది సుధని చూస్తూ..
"థర్డ్ సెం రిజల్ట్స్ వచ్చేసాయి...నేను ఒక సబ్జెక్టులో డింకీ కొట్టా....అది పెద్ద విషయం కాదు, గత రెండు సెమిస్టర్స్ నువ్వే కదా కాలేజీ ఫస్ట్, ఇపుడు నిన్ను ఒకడు దాటేసాడు..." అంది గుక్క తిప్పుకోకుండా...
"అవునా??..ఎవరు అతను.." అడిగింది కొంచెం దిగాలుగా...
"ఏమో..పేరు తెలీదు..మాత్స్ గ్రూప్ అనుకుంటా..రేపు అసెంబ్లీలో అనౌన్స్ చేస్తారట టాప్ రిజల్ట్స్..." 

అందరూ ఓపెన్ ఎయిర్ ధియేటర్ లో అసంబుల్ అవ్వగా, ప్రిన్సిపాల్ రిజల్ట్స్ చదివాడు...
"మీ బాచ్ లో ఈసారి మొదటిసారిగా ఒక అబ్బాయి కాలేజీ ఫస్ట్ వచ్చాడు...హి ఈజ్ ఫ్రం మాత్స్ గ్రూప్ " అని అతను అనౌన్స్ చెయ్యగానే మాత్స్ గ్రూప్ అబ్బాయిలు ఈలలు..కేకలు మొదలెట్టారు..సంహితకి ఇక అక్కడ ఉండాలని అనిపించలేదు...వెళ్ళిపోవడానికి లేచిన ఆమె "ప్లీజ్ గివ్ అ బిగ్ హాండ్ టూ మిస్టర్ సుధీర్..." అన్న మాటలు విని చప్పున వెనక్కి తిరిగింది...

డయాస్ మీదకి అతను వస్తుండగా అందరూ చప్పట్లు కొడుతున్నారు...
కొన్ని వందల కళ్ళు అతన్ని చూస్తున్నాయి...కానీ ఆమె రెండు కళ్ళు మాత్రం అతన్ని చూస్తూ వర్షిస్తున్నాయి ...అది ఆనందమో ... దుక్కమో ... ఆశ్చర్యమో...ఆవేదనో...ఆమెకే అర్థం కావడం లేదు.. అప్పటిదాకా పరిచయం లేని పరవశం ఏదో ఆమెని ఆవహించగా..ఆమె ఎద బరువెక్కింది, ఆ బరువు తాళలేనన్నట్లు అక్కడే..అలాగే కుర్చీలో కూలబడింది...ఆమె ఎదసవ్వడి ఆమెకి స్పష్టంగా వినిపిస్తుంది...ఏంటో అతని నుండి చూపు మరల్చుకుంటే ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది ఆమెకు...రెప్ప వేయకుండా అతన్నే చూస్తుంది..అతను విసిరే చిరునవ్వు ఆమెని నిలువెల్లా వివసురాలుని చేస్తుంది..'రెండు రోజుల క్రితం చుసిన ఇతని గురుంచి నేను ఎందుకు ఇలా అవుతున్నాను...ఏమయింది నాకు..' ఆమెకి ఏడుపు వస్తుంది..


మరుసటి రోజు కాలేజీ బస్సు స్టాప్ లో బస్సు కోసం చూస్తున్న ఆమెకి ఏ బస్సు వచ్చినా ఎక్కాలని అనిపించడంలేదు..'ఒక్కసారి అతను కనిపిస్తే బాగుండు..' అంటూ ఆమె గుండె పదే పదే కొట్టుకుంటుంది... కోరుకుంటుంది...ఆ విషయం ఒప్పుకోవడానికి ఆమె మనసు మాత్రం సందేహిస్తుంది...తనది అంత చంచల మనస్తత్వం కాదని ఆమెకి తెలుసు..కానీ ఇతని విషయంలో తను ఎందుకు ఇలా అవుతుంది...ఆతను ఎవరో కుడా తెలియదు, కానీ కనిపిస్తే ప్రాణం పోతునట్లు అనిపిస్తుంది...వెళ్లి అతని కాలర్ పట్టుకొని ఎవరు నువ్వు..నన్నేం చేస్తున్నావ్ అని గట్టిగా అడగాలని అనిపిస్తుంది ఆమెకు...

"హలో..." అంటూ ఓ మృదువైన కంఠం ఆమెని పలుకరించగా..ఎప్పుడొచ్చాడో పక్కకి తిరిగి చూడగా అతనే...
చూస్తేనే ప్రాణం పోయేలా ఉంది ఆమెకి, ఇక దెగ్గరికి వచ్చి ఇలా మాట్లాడితే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి...గుటకలు మింగుతూ అలానే చూస్తుంది అతని వైపు...స్వేద బిందువులు ఆమె చెక్కిళ్ళు తాకి ఎరుపు రంగులో మెరుస్తున్నాయి...గుండె వేగం కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ని మించిపోయింది...

"గత రెండు సెమ్స్ లో మీరే టాప్...కాని ఈసారి నేను పోటి వచ్చానని కోపం లేదు కదా..." చిన్నగా నవ్వాడు..
చివాల్న మొహం తిప్పుకుంది...ఆమె అతని చిరునవ్వు తట్టుకోలేదు...తట్టుకొని అతన్ని కళ్ళలోకి చూడలేదు...చుస్తే ఆమె వశం తప్పి ఏం చేస్తుందో అన్న భయం..ఎంత నిగ్రహించుకోవలాన్నా ఆమె వల్ల కాకపోవడం ఆమెకి ఏడుపు తెప్పిస్తుంది...

"ఎనీ ప్రాబ్లెం..." అడిగాడు అతను 
'ఎస్...యు ఆర్ మై ప్రాబ్లం...హూ ఆర్ యు?..హూ యాం ఐ టూ యు?..' ఆమె మనసులోనే ఆగిపోయింది ఆమె ఆవేశం...ఆక్రోశం..
మెల్లిగా అతని వైపు తిరిగి "కంగ్రాట్స్ .." అని చెప్పగలిగింది...
"థాంక్స్...నేను ఈ సెమిస్టరు నుంచే ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను..." అన్నాడు..
"ఓ అలాగా..." అని 'ఎందుకు జాయిన్ అయ్యవురా బాబూ....నీవల్ల ఇక నేను అసలు చదువుతానా??..' అనుకొని దీనంగా పెట్టింది ముఖం 
ఇంతలో బస్సు రావడంతో "వస్తున్నారా మీరు కూడా .." అని అడిగాడు తను బస్సు ఎక్కబోతూ...
"లేదు...ఈ బస్సు మా ఏరియా వెళ్ళదు.." అంది 
"ఓకే...బాయ్ సంహిత..." అని చెప్పి అతను ఎక్కాడు...బస్సు కదిలింది...
అతను అలా దూరం అవుతున్న కొద్ది ఆమెలో తెలియని అలజడి ...ఆమె వెళ్ళాల్సిన బస్సు కూడా అదే అయినా నిగ్రహించుకొని అతని ఆహ్వానాన్ని తిరస్కరించినందుకు ఆమె మనసు ఆమెని ఛీత్కరించింది...పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బస్సుని అందుకోవాలన్న ఆవేశం వచ్చింది ఆమెలో..అంతలోనే ఏమీ చెయ్యలేని నిస్సహాయత..కళ్ళ వెంబడి జారి చెక్కిళ్ళు తడుపుతూ తడుముతున్న కన్నీళ్ళను తుడిచే వృధా ప్రయత్నం చేస్తుందామె...

తన కలలో వచ్చిన అతని పేరు సుధీర్...కాలేజీలో కలిసిన అతని పేరు కూడా సుధీర్..కలలో సుధీర్ కోసం తండ్రినే ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది..ఆమెకి ఆ కల మళ్లీ గుర్తుకు రాగానే ఏదో తెలియని భయం...అది కలే అని సర్దిపెట్టుకున్నా ఆమె మామూలుగా ఉండలేకపోతుంది...కాలేజీ సుధీర్ పై తనకి ఉన్నదీ కచ్చితంగా ఆకర్షణే..కానీ ఆ ఆకర్షణ ఇంత బలీయంగా ఉంటుందా అనేదే ఆమె నమ్మలేకపోతుంది...అతను దూరంగా వెళ్తున్నప్పుడు ఆమె పడ్డ మానసిక వేదన, ప్రియుడు ప్రియురాలు నుంచి శాశ్వతంగా విడిపోయినప్పుడు కలిగే వేదన కన్నా పదింతలు ఎక్కువ..నిలువునా దాహించివేసే బాధ ఆమెకి అనుభవంలోకి వచ్చిన క్షణం అది...అప్పటిదాకా ఎంతో మంది అందమైన అబ్బాయిలు కనిపించినా ఏనాడూ కనీసం ఎవరి గురుంచీ ఒక్క క్షణం కూడా ఆలోచించని ఆమె, ఇతని కోసం ఎందుకు ఇంతగా ఇదై పోతుంది...అతను కనిపించినపుడే...తొలిచూపులోనే..తొలినవ్వులోనే ఆమెని అంతగా ఎందుకు దోచుకున్నాడు...

తన బెస్ట్ ఫ్రెండ్ సుధాకి చెప్పాలనుకుంది ఈ విషయం...కానీ చెప్పలేకపోయింది...చెప్పాక ఆమె దెగ్గర తను అల్లరిపాలు అవుతానేమో అన్న భయం..సుధీర్ విషయం తేలికగా తీసుకుందాం అని ఆమెని ఆమె ఎంత సముదాయించుకున్నా, అది కేవలం అతను కనిపించే వరకు మాత్రమే..అతను తనకు కనిపించకూడదు అని మనసులో దేవుడిని కోరుకుంటూనే, ఆమె కళ్ళు అతని కోసం నలువైపులా వెతుకుతూనే ఉంటాయి అలుపెరగని సంద్రపు అలలులా..  ఒక్కసారి అతను ఎప్పుడైతే కనిపించాడో ఇక తను తను కాదు..అతని దెగ్గరికి వెళ్లి కనీసం హలో అయినా చెప్పకపోతే తను చచ్చిపోతుందేమో అన్న భయం..

ఓ రోజు ఆమె కాలేజీకి బస్సులో వస్తుండగా..ఒక నాలుగు రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ జాం...ఎంతసేపయినా బస్సు కదలడం లేదు...కాలేజీ కి లేట్ గా వెళ్తే అతను కనిపించడేమో..ప్రతి విషయంలోనూ అతని ఆలోచనలే..తన మీద తనకే జాలి కలిగింది...తన బుజ్జి మనసు అతన్ని అంతగా ఎందుకు కోరుకుంటుందో తెలియక ఒక నిస్సహాయపు నవ్వు విరిసింది ఆమె పెదవుల పైన...

"ఆక్సిడెంట్ అంట...పాపం స్పాట్ డెడ్ అంట ఎవరో..." పక్క సీట్ వాళ్ళు మాట్లాడుకోవడం వినపడ్డాయి ఆమెకు...
ఆమె కిటికీ లోనుంచి చూసింది..ఆ కూడలి వద్ద జనాలు గుమ్ము గూడి ఉన్నారు...
ఆమె కొద్ది సేపు చూసి...క్రిందకి దిగి, ఆ కూడలి వైపు నడుచుకుంటూ వెళ్ళింది..
జనాలు గుంపుగా ఉండటం వల్ల ఆమెకి ఎవరో కనపడలేదు....
కొద్దిగా జనాలని నెట్టుకుంటూ ముందుకు వెళ్ళింది...మోటార్ సైకిల్ ఒక లారీకి గుద్దుకున్నట్లు తెలుస్తుంది...
రక్తపు మడుగులో పడివున్న ఆ వ్యక్తిపై ఒక తెల్లటి దుప్పటి కప్పారు...
ఇంతలో అంబులెన్స్ రావడంతో, ఆ బాడీ అందులో ఎక్కించడానికి పైకి లేపారు, అప్పుడు..ఆ క్షణం ..అతని ముఖాన్ని కప్పి ఉన్న ఆ ముసుగు తొలగింది...అతని రూపం ఆమె కంట పడింది...ఆమె గుండె ఒక్క క్షణం ఆగింది..ఆమె కాళ్ళ క్రింద భూమి కంపించింది.."సుధీర్...." అంటూ ఆమె నోటి నుండి ఒక వెర్రి కేక...గుండెలు అవిసేలా...ప్రాణం పోయేలా...దిక్కులు పిక్కటిల్లేలా...చావుకే భయం పుట్టేలా...అతను విగత జీవుడై అంబులెన్స్ లో వెళ్తూ దూరం అవుతుండగా....ఆమె అక్కడే కుప్పకూలిపోయింది....


           [................ To be continued in the next part]