Search This Blog

Friday, 16 October 2009

జీవితం గురుంచి నేర్పిన ఐ.టీ ప్రాజెక్ట్ (ఆఖరి భాగం)

"ఎవరండీ లోపల....హలో..."
స్పందన లేదు...
"హలో...ఓ సారి బయటకి వస్తారా !!..." మళ్లీ పిలిచాను గుమ్మం ముందు నిలుచొని...నా వెనుక మా సమూహం ఉన్నారు...అదే సునీల్, కృష్ణా ,శ్రీను, రమణ ..
ఓ రెండు నిముషాల తర్వాత ఓ వృద్ధురాలు వచ్చింది..ఆమె చేతిలో కర్ర ఆమె నడక అనుగుణంగా ఊగుతుంది ...కళ్ళ పైన అరచేయి పెట్టుకొని చూస్తూ ..
"ఎవరబ్బాయి మీరు.....కుంటి ఎంకడి మనవడివా నువ్వు??..." నా వైపు కర్ర చూపిస్తూ అంది...
అబ్బే కాదండి..కంగారుగా చెప్పాను...ఎక్కడ కర్రతో ఒకటి వేస్తుందేమో అని...
"అచ్చు గుద్ది నట్టు అట్టానే ఉన్నావ్ అబ్బాయ్....ఎం గావలి మీకు.." అడిగింది మా అందరి వైపూ చూస్తూ...
"మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఏమేమి పనులు చేయగలరో మేము తెలుసుకోవాలి...కాస్తా ఆ వివరాలు చెప్పగలరా.." అడిగాను ..
"కొంపదీసి మీరంతా సర్కారోల్లా...మా ఇసయాలు మీకెందుకు అబ్బాయి..."
"అది కాదండి...ఈ విషయాలు మీరు మాకు చెపితే...మీకు చేతి నిండా పని వచ్చే మార్గం ఉంటుంది.." సునీల్ అందుకున్న్నాడు ..
"ఎట్టెట్టా...అట్టాగా.." అని ఆశ్చర్యపోతూ..."ఒరేయ్ ఎంకయ్యా బేగి రా రా...ఈ పిల్లలేదో పని ఇత్తారంట.." అరచింది ఆమె లోపలి చూస్తూ...

ఆ రోజు ఉదయమే సునీల్ ఇంట్లో దిగిన మేము...లేట్ చెయ్యకుండా టిపినీలు కాపీలు కానిచ్చాక ఊరిమీద పడ్డాం...అదే చెప్పాకదా...గ్రామీణుల స్కిల్స్ సమాచారం మొత్తం రాబట్టాలి అని...ఆ పని మీద పడ్డాం అయిదుగురం కలసి....ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో...అదే ఏ ఇంటి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాలేదు మాకు..."ఇంటి నంబర్లు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయో అక్కడ నుంచి మొదలెడదామా? అలా అయితే కూర్పు సులభంగా ఉంటుంది.." అన్నాడు శీనుగాడు.. " కూర్పు గోల దేవుడెరుగు...ఈ ఎండలో ఆ మొదటి నెంబర్ ఇల్లు ఎక్కడో కనుక్కోనేసరికి కారిపోద్ద్ది మనకి...అంచేత అదిగదిగో ఆ కనపడే పాకలోకి వెళ్దాం.." అంటూ అందరిని ఆ పాకలోకి లాక్కేల్లాను..అదే ఈ బామ్మ గారి పాక...మా ప్రాజెక్ట్ బోణి బేరం....

ఆ రోజు ఇంటికి మధ్యాహ్నం కల్లా వచ్చేసాం ఇండియా-పాక్ మ్యాచ్ కోసం...ఆ రోజు ఇండియా 350 పైగా పరుగులు చెయ్యడమే కాకుండా  మ్యాచ్ నేగ్గేసరికి మాలో ఉత్సాహం పరవళ్ళు తొక్కి మరుసటి రోజు ఎపుడెపుడు అవుతుందా సర్వేకి ఎపుడెపుడు వెళ్దామా అని తెగ వెయిట్ చేశాం...ఆ రోజు మేము పూర్తి చేసిన ఇల్లు కేవలం పది....మా టార్గెట్ అయిదు గ్రామాలు...కనీసం రోజుకి వంద ఇల్లు అయినా కవర్ చెయ్యాలని నిర్ణయించుకున్నాం...ప్రొద్దున్న ఏడింటికే మళ్ళీ ఊరిమీద పడ్డాం...

"నేను కూలి పని పోతాను బాబు...మా అయన చెక్క పని సేత్తాడు..." ఆమె చెప్తుంటే నోట్ చేసుకుంటున్నాం..." రెండు నెలల నుంచి పని లేదు బాబు...చేలో కూలి పని ఏడాది పొడుగునా ఉండదు కదు బాబు..ఈయనకి చెక్కపని కూడా ఎపుడో ఒకసారే..లేనప్పుడు గంజి నీళ్ళు తాగడం కొత్తేం కాదు కానీ, పిల్లని బడికి కూడా పంపలేకపోతున్నాం బాబు..." ఆవిడ కళ్ళలో ఏదో బాధ తోణకిసలాడింది...ఆ ప్రక్కనే నిల్చున్న చిన్న పాపని చూసాను..పలక మీద ఏవో రాస్తుంది..."గవర్నమెంట్ బడులు ఉన్నాయిగా..." అడిగాను నేను ఆ పాపని చూస్తూ...."ఎందుకు బాబు అయ్యి ఉన్నా ఒకటే..లేకపోయినా ఒకటే..ఒక్క పంతులు కూడా రాడు బడికి..." 

ఆ తర్వాత ఒక పది ఇళ్ళు పూర్తి చేసేసరికి మాకు సోష వచ్చింది...అసలే ఎండా కాలం...భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు...తర్వత ఇంకో ఇంటికి వెళ్ళాం..అప్పటికే మేము ఇలా ఇళ్ళకు తిరుగుతున్నాం అనే వార్త ఆమెకి చేరిందనుకుంట రండి బాబు కూర్చోండి అంది మేము వెళ్ళగానే.."కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా " అన్నాడు రమణ గాడు...నీ ఆత్రం తగలెయ్యా అనుకున్నా మనసులో...ఆమె అందరికి గ్లాసుల్లో మజ్జిగ తెచ్చి ఇచ్చింది...అవి పుచ్చుకున్నాక ప్రాణం కాస్త లేచి వచ్చింది...మంచినీళ్ళు అడిగినా మజ్జిగ ఇవ్వడం కేవలం ఒక పల్లెటూరులోనే చూస్తామేమో కదా..."మీ ఇంట్లో ఎంత మంది.." అడిగాను నేను..."నేను ఒక్కదాన్నే బాబు...నాతో పాటు ఆ చంటిది.." అక్కడ ఒక మూడేళ్ళ పాప ఆడుకుంటూ కనిపించింది...
"ఏమి చేస్తారు మీరు?"
"కూలి పని బాబు..."
"కూలి పని లేనప్పుడు వేరే ఏమైనా పని చేస్తారా..."
"మిషన్ కుట్టడం వచ్చు బాబు....అపుడెప్పుడో పైకం అవసరం అయ్యి ఆ ఉన్న మిషన్ అమ్మేసాము...నాకు ఇంకే పనీ చేతకాదు బాబు.."
"అలాగే...మజ్జిగ ఇచ్చినందుకు థాంక్స్ అండి......ఆ పాప మీ పాపా?" అడిగాను.. ఆ మాట అడగ్గానే ఆమె ముఖం లో బాధ కొట్టొచ్చినట్లు కనిపించింది..." ఆ చంటిదాన్ని చూస్తే నాకు ఏడుపు ఒక్కటే తక్కువ బాబు...ఆ పిల్ల నా చెల్లెలి కూతురు..ఆ పిల్ల తల్లిని దాని మొగుడు వదిలేసి, ఆడు దేశాలు బట్టి పోయాడు...ఆ తల్లి ఈ చంటిదాని గురుంచి కూడా ఆలోచించకుండా బాయిలో దూకి సచ్చింది...పాపం ఈ చంటిదానికి తల్లి చచ్చిన విషయం తెలీదు...రోజూ అమ్మ అమ్మా అని ఏడుస్తూనే ఉంటుంది..ఏదో మాయ చేసి నిద్రపుచ్చితే పడుకుంటుంది పాపం బంగారుతల్లి...చెప్తే తెలిసే వయసా బాబు దానిది...." ఆమె కళ్ళలో నీళ్ళు....ఒక్కసారి ఆ బంగారుతల్లి వైపు చూసాను...ఏమి తెలియనట్లు నవ్వుతూ మా వైపు చూస్తూ ఆడుకుంటుంది....

కొంచెం భారంగానే నడిచాను అక్కడినుంచి...ఈ లోపు ఎప్పుడు దూరారో కానీ , రమణ గాడు శీనుగాడు ఇంకో ఇంట్లోకి వెళ్లి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు...కొంచెం దెగ్గరికి వెళ్లి చూసేసరికి అక్కడ సమాచార సేకరణ కాకుండా రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ లాంటిది జరుగుతున్నట్లు అనిపించి చూసేసరికి...అక్కడి సంభాషణ ఇలా సాగుతుంది ..
"అది కాదు అబ్బాయ్...మా అమ్మాయిని చేసుకుంటే నాకున్న ఆరెకరాలు రాసిచేత్తాను...ఏటంటావ్ .." వేలితో మీసాలు దువ్వుకుంటూ అడిగాడు ఆయన...
"ఏమోనండి మా ఇంట్లో అడగాలి..." నసిగాడు రమణగాడు...
"అడిగేత్తే పోలా...ఫోన్ లో కాకుండా డైరేట్ గా అడిగితేనే మర్యాద...ఒసేయ్ అబ్బాయి ఊరు నర్సీపట్నం...బైల్దేర్దామా ఓ గంటలో బస్సు ఉంది తణుకు నుంచి..." అన్నాడు తన భార్య వైపు చూస్తూ...
నాకు దిమ్మ తిరిగి దాదాపు మైండ్ బ్లాక్ అయింది....ఏం జరుగుతుంది ఇక్కడ...సమాచార సేకరణా లేక సంబంధ ధృవీకరణ??...
" అబ్బే ఇప్పుడు వద్దండి...నేను ఊరేల్లాక మా ఇంట్లో అడుగుతాను..." కొంచెం టెన్షన్ గా చెప్పాడు రమణ...
"ఆ సర్లే అబ్బాయ్ ...మర్చిపోకు...సర్లే ఇంతకీ పాక్టరి ఎప్పుడు వత్తాది అంటావ్..." అడిగాడు అతను ...
ఈ సరి షాక్ సర్ ర్ ర్ ర్ న వచ్చి ఎక్కడ తగిలిందో తెలియలేదు..."ఫ్యాక్టరీ ఎంట్రా బాబు..." నసిగాను నీరసంగా...
"ఆ వచ్చేస్తుంది...ఒక ఆరు నెలలలో..." అన్నాడు రమణ గాడు తాపీగా...
ఇంకా అక్కడెన్ని షాక్ లు వినాలో అని రమణని లాక్కొని బైటకి వచ్చాం...."ఒరేయ్ ఏం జరిగిందో చెప్పరా బాబు...ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ఏంది...ఆ ఫ్యాక్టరీ ఏంది..." అడిగాం అందరం...
"ఏం లేదురా....ఏమేం పనులు వచ్చు అని అడుగుతుంటే, ఇక్కడేమన్నా ఫ్యాక్టరీ పెట్టబోతున్నారా? అని అడిగాడు ఆయన...ఎఫెక్టివ్ గా ఉంటుందని అవునని చెప్పాను...ఇక అక్కడి నుంచి ప్రశ్నలు వేసి చంపాడు...ఏం చేస్తున్నావ్...ఎక్కడుంటావ్...చివరికి కాస్ట్ కలిసేసరికి వాళ్ళ అమ్మాయిని చేసుకోమని ఓ గొడవ....అలా..అలా స్టార్ట్ అయింది.." అక్కడి కంఫ్యూజన్ డ్రామా వృత్తాంతం వివరించాడు రమణ..." అఘోరించావ్ లే...అలా లేనిపోనివి చెప్పి వాళ్ళకు ఆశలు కల్పించడం తప్పు...మనం వచ్చిన పని చేసుకొని వెళ్దాం ...ఎగస్ట్రాలు వద్దు.." అన్నాను...

ఆ రోజు కనీసం ఒక ఎనభై ఇళ్ళ సమాచార సేకరణ పూర్తి చేశాం...దాదాపు సగం మంది వాళ్ళ బాధలు మాతో చెప్పుకున్నారు...మేమేదో వాళ్ళకు పని కల్పిస్తామని ఆశపడుతున్నారు వాళ్ళు..మేము చేసే ఈ ప్రాజెక్ట్ వాళ్ళకు ఎంత వరకు ఉపయోగ పడుతుందో అప్పటివరకు నిజంగా తెలీదు...కానీ ఆ క్షణం దేవుడిని గట్టిగా కోరుకున్నా ఈ ప్రాజెక్ట్ ద్వారా కొంతమంది కైనా పని దొరికి పట్టెడు అన్నం పెట్టేలా చూడాలని...ఒక్క గ్రామంలోనే సగం మంది ఇంత దయనీయ పరిస్థితిలో ఉంటే సర్కారు ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు...ఎవరో అన్నట్లుగా ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు పేదవాడు ఇంకా పేదరికం అనుభవిస్తున్నాడు అనే మాట అక్షరాలా నిజమేమో...ఒక్క క్షణం ప్రొద్దున చూసిన చంటిపిల్ల ముఖం నా కాళ్ళ ముందు కదలాడింది...పాపం రేపు ఆ పిల్ల పెద్దది అయ్యాక తన తల్లి గురుంచి తెలిసి ఎలా తల్లడిల్లిపోతుందో...ఇంత చిన్న వయసులోనే అంత భారం పెట్టిన దేవుడికి జాలి లేదా??..దేవుడే ఇలా పక్షపాతం చూపిస్తుంటే ఇక మనవ మాత్రులం మనమెంత...ఇలా ఎన్నెన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి...ఆ ఆలోచనలలో నుంచి నాకు కర్తవ్యం బోధపడింది...జీవితం గురుంచి ఒక చిన్న పాఠం తెలిసింది..అప్పటి వరకు జీవితంలో ఏది చెయ్యాలో దిశానిర్దేసం లేని నాకు ఆ రోజు ఒక గమ్యం కనిపించింది...అదే సివిల్ సర్వీసెస్ రాయాలని..

ఆ తర్వత ఒక పది రోజుల్లో మా పని పూర్తి చేసి తిరిగి రాజముండ్రి చేరుకున్నాం...అలా స్వయంగా గ్రామాల్లో తిరిగి వాళ్ళతో కలిసి మాట్లాడటం...వారి జీవన ప్రమాణాలు తెలుసుకోవడం...వారు పడే బాధలు స్వయంగా చూడటం...వొంట్లో సత్తువ ఉండి కూడా పని దొరకని దౌర్భాగ్యం...తద్వారా సంక్రమించే దారద్ర్యం...ఇవన్ని నా కర్తవ్యాన్ని బలపరిచాయి...నా నిర్ణయానికి మద్దతునిచ్చాయి ...నా జీవితానికి ఒక గమ్యాన్ని ఏర్పడేలా చేసాయి...

Thursday, 10 September 2009

జీవితం గురుంచి నేర్పిన ఐ.టీ ప్రాజెక్ట్ (మొదటి భాగం)

అవి మేము బీ-టెక్ ఐ.టీ ఆఖరి సంవత్సరంలో ప్రాజెక్ట్ ఏ ప్లాట్ ఫాం మీద చేద్దాం అని తీవ్రంగా చర్చించుకుంటున్న రోజులు....అప్పటిదాకా రైల్వే ప్లాట్ ఫాం తప్ప సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫాం అంటే ఏంటో తెలీదు... కొంత మంది సహా విద్యార్ధులు చెప్పిన విషయాలు కొంత నాకు నేనుగా ఊహించుకున్న విషయాలు కలిపి సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫాం అనగా - ఒక సాఫ్ట్ వేర్ భాష కాని డేటాబేస్ కాని దేని ద్వారా అయితే మనం సాఫ్ట్ వేర్ తయారుచేస్తామో దానినే ప్లాట్ ఫాం అంటారు అని తెలుసుకున్నాను. ఈ విష్యం తెలుసుకునేసరికి నా ఆఖరి సంవత్సరం మొదలయింది...

"ఒరేయ్ మనం జావా మీద ప్రాజెక్ట్ చేద్దాం...రేపు మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన రెస్యుమేలో జావా ప్రాజెక్ట్ ఉంటే మనం త్రూ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ.." అన్నాడు సునీల్ గాడు అన్నం లో సాంబార్ పోసుకుంటూ...
"కాదు...మనం డాట్ నెట్ లో చేద్దాం...అదే ఇప్పుడు మార్కెట్ లో హాట్ ప్లాట్ ఫాం..." అన్నాడు కృష్ణా గాడు చేతికి అంటిన పెరుగుని అమృతంలా నాక్కుంటూ...
"ఇవేమీ కాదు...మనం ముల్టీమీడియాలో చేద్దాం...గ్రాపిక్స్ కూడా పెట్టి మంచి ప్రాజెక్ట్ చేద్దాం .." రెండు కళ్ళు సపోటా పళ్ళంత చేసి చెప్పాడు శీను గాడు...
"అసలు మనకి ఇవేమీ రావు కదరా..." ధర్మ సందేహం వెలిబుచ్చాను నేను పళ్ళెం అంచులు కూడా జుర్రెసుకుంటూ...
"నీ మొహం...అందరూ అన్నీ వచ్చే చేస్తున్నారా??...వంద వెధవపనులకి శతకోటి మార్గాలు..." గీతోపదేశం మొదలెట్టాడు కృష్ణుడు.... 

తర్వాత కాలేజీలో మాకు ఏది నచ్చితే ఆ ప్రాజెక్ట్ చెయ్యడానికీ వీల్లేదని, బైర్రాజు ఫౌండేషన్( సత్యం) వాళ్ళతో మా కాలేజీ వాళ్ళు టై-అప్ అయ్యి వాళ్ళు ఎన్నిక చేసిన ప్రాజెక్ట్లులలో ఏదోకటి మేము ఎన్నుకోవాలని తెల్సింది. "విలేజ్ స్కిల్ ప్రొఫైలింగ్" అనే ప్రాజెక్ట్ ఎన్నుకున్నాం మేము ఓ అయిదుగురు బాచ్ గా కలిసి. ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఏమిటంటే...మేము అంతా కలిసి కొన్ని గ్రామాలు తిరిగి, ఇంటింటికీ వెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు...వాళ్ళకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి - ఉదాహరణకి కొంత మంది వడ్రంగి పని చేస్తారు, కొంత మంది కల్లుగీత కార్మికులు, కొంత మంది వ్యవసాయం, కొంత మంది చెక్క పని చేస్తారు...ఇలా వాళ్ళ వాళ్ళ స్కిల్స్ ని మేము నోట్ చెయ్యాలి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికీ వెళ్లి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మాకు కొన్ని గ్రామాలు అప్పజెప్పారు. బైర్రాజు ఫౌండేషన్ వాళ్ళు కొన్ని గ్రామాలు దత్తతు తీసుకున్నారు. ఈ గ్రామాలలో జీవన ప్రమాణాలు మెరుగు పరచి, అందరికి కనీస సౌకర్యాలు కల్పించడం, అందరికి పని దొరికేలా చూడడం ఈ ఫౌండేషన్ వారి సదుద్దేశం.
 
మాకు అందరికి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఎంతో కొంత సోషల్ వర్క్ చెయ్యబోతున్నాం అని తెగ ఫీల్ అయిపోయాం. దీనికి ఐ.టీ ప్రాజెక్ట్ కి సంబంధం ఏమిటా అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నా, ఈ విధంగా సేకరించిన స్కిల్స్ సమాచారం మొత్తం మేము ఒక డేటాబేసులో పొందుపరచాలి. ఇలా పొందుపరచిన సమాచారం మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చేలా ఫ్రంట్-ఎండ్ తాయారు చేస్తాం - అంటే మనకు కనిపించే స్క్రీన్ అనమాట, ఒక వెబ్ సైట్ లాగ. ఈ వెబ్ సైట్ కి వెళ్లి ఆ గ్రామానికి సంబంధిన స్కిల్స్ సమాచారం మొత్తం రాబట్టవచ్చు. ఇది రియల్ టైంలో ఏ విధంగా ఉపయోగ పడుతుంది అంటే - ఉదాహరణకు ఒక ఇంటికి చెక్కపని చెయ్యాలనుకోండి, మాములుగా అయితే ఒక మధ్యవర్తి ద్వారా చెక్కపని వాడిని కుదుర్చుకోవడం జరిగుతుంది. కాని ఇక్కడ ఎవరికైనా ఏ పని తెల్సిన వాడు కావాలన్న ఈ వెబ్ సైట్ ద్వారా పొంది, ఆ మనిషిని పిలిపించవచ్చు. ఈ పల్లెటూరులలో ఈ వెబ్ సైట్ చూసి మనిషిని కాంటాక్ట్ చేసే అంత సీన్ ఉండదు అనుకుంటున్నారు కదా. నిజమే, అందుకే ప్రతి గ్రామం సెంటర్ లో బైర్రాజు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసారు. మీరు వీళ్ళకి ఒక్క కాల్ చేసి మీకు ఫలానా పని వాడు కావలి అని కబురంపితే చాలు , వీళ్ళే ఆ వెబ్ సైట్ ద్వారా సమాచారం పొంది పని వాళ్ళకు కబురంపి మీ ఇంటికి పంపుతారు. ఈ సర్వీసు పూర్తి ఉచితంగా చేస్తారు అనమాట. ఈ విధంగా గ్రామస్తులకి పని కల్పించినట్లు అవుతుందీ, మధ్యవర్తుల కమీషన్ లాంటివి ఉండవు, పూర్తి పని జీతం పనివాడికే చెందుతుంది. బాగుంది కదా కాన్సెప్ట్. అవును, అందుకే మాకు కూడా బాగా నచ్చింది...
మాకు అప్పగించిన గ్రామాలు తణుకు చుట్టుప్రక్కల గ్రామాలు - రేలంగి తదితర గ్రామాలు. సునీల్ గాడిది రేలంగి. ఈ ప్రాజెక్ట్ కోసం సమాచారం సేకరించడానికి ఒక పది రోజులు అయినా పడుతుంది, అప్పటిదాకా ఉండటానికి బైర్రాజు వాళ్ళు గెస్ట్-హౌస్ ఇస్తామన్నారు. కాని సునీల్ గాడు, పట్టుబట్టి వాళ్ళింట్లోనే ఉండాలని తీర్మానించాడు. నాకు అసలే కొత్త వాళ్ళ ఇంట్లో సిగ్గెక్కువ, వద్దులేరా అన్నా వినలేదు వాడు. ఒకానొక రోజు సుముహూర్తం చూసికొని అందరం కల్సి రేలంగి బైల్దేరం తణుకు గుండా. నాకు కొంచెం లోపల ఏదో ఫీలింగ్, పాపం ఆంటీ మమ్మల్ని అయిదు రోజులు మేపాలి అంటే సామాన్యం కాదు కదా. కానీ అక్కడికి వెళ్ళాక తెల్సింది ఆంటీ అంకుల్ మమ్మల్ని కూడా వాళ్ళ అబ్బాయి లాగానే చూసారు. నాకు వాళ్ళు చాలా బాగా నచ్చారు. అసలు నాకు ఈ ప్రాజెక్ట్ జీవితం గురుంచి ఎన్నో నేర్పింది, ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, పల్లెటూరి ప్రజల జీవన శైలి, వారి మధ్య అనుబంధాలు, ఎన్నెన్నో చెప్పుకోలేని బాధలు....ఇలా చాలా తెల్సుకున్నాను...ఇది నా అకాడెమిక్ ప్రాజెక్ట్ అనే కన్నా, నా జీవితానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ అని అనడం కరెక్ట్. అక్కడ గ్రామాలలో జరిగిన విశేషాలు అన్ని త్వరలోనే మీతో పంచుకుంటాను, అంతవరకు సెలవు మరి.

Sunday, 9 August 2009

నీ స్నేహం...

మేలుకొంటే నా కళ్ళముందు నిలిచేదే నీ రూపం
కళ్ళు మూసుకుంటే నా ఊహలందు నీవే అపురూపం
నిజం చెప్పమంటే నేనే లేను నాలో అయ్యాను నీ పరం
గుండె చప్పుడింటే నీ పేరు తప్ప తెలియదేమో వేరే తాళం

గుర్తు చేసుకుంటే నీతో గడిపిన క్షణాల జ్ఞాపకాలే నా లోకం
కథే రాయమంటే నీ నయన భావాల కన్నా దొరకునా గొప్ప కావ్యం
జీవితం పంచుకుంటే అందాల పూదోటగా మలచును నీ సాంగత్యం

ఆశ కాదనుకుంటే కడదాకా నాతో ప్రయాణించాలి నీ స్నేహం


Sunday, 2 August 2009

యమహా నగరి...చెన్నై పురి..



నా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలనంతరం నేను మొదటి సారిగా మద్రాస్ వెళ్లాను...అక్కడ అప్పుడు మా అన్నయ్య వదిన ఉండేవాళ్ళు...అక్కడ ఉన్నది కొన్ని రోజులే అయినా చాలా నచ్చింది నాకు మద్రాస్..ఆ బీచ్, అక్కడే ఉన్న అష్టలక్ష్మి కోవెల..బీచ్ పక్కనే సాగుతూ అందంగా ఉండే రోడ్..మరో వైపు ఆకాశంలో దూసుకుపోతున్నట్లుండే భవంతులు..ఇంటర్ కనెక్టేడ్ ఫ్లయ్-ఓవర్ లు..సబ్-వే లు..అబ్బో తెగ నచ్చేసింది ఆ యమహా నగరి...అప్పుడే అనుకున్న ఉద్యోగం చేస్తే మద్రాస్ లోనే చెయ్యాలి అని...నాకు తెలీదు అప్పుడు తథాస్తు దేవతలు నా మనవి ఆలకించారని....


2007 ఫిబ్రవరి ...సమయం రాత్రి 7 30..చెన్నై లో ఓ బహుళ జాతి సంస్థ..
ఇంటర్వ్యూ అయ్యాక టెన్షన్ గా కూర్చొని ఉన్న నాకు.."మిస్టర్ రామకృష్ణ, యు గాట్ సెలెక్టెడ్...యు హావ్ టు రిపోర్ట్ హియర్ ఆన్ ఫిబ్రవరి 26th.." అన్న మాటలు అమృత ధారల్లా నా చెవిన పడ్డాయి..ఆ విషయం చెప్పిన హెచ్.ఆర్ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూశాను...ఆమె నాకు పంజాబీ డ్రెస్ లో ఉన్న పరమేశ్వరిలా కనిపించింది..


చెన్నైలో అప్పటికే నా ఇంజనీరింగ్ స్నేహితుడు ఉంటుండటంతో నేను వేరే రూం వెతుక్కోవలసిన అవసరం లేక పోయింది..మెల్లిగా చెన్నైలో రోజులు గడుస్తున్నాయి...రోజూ లేవడం..దెగ్గరిలోనే నుంగంబాక్కం రైల్వే స్టేషన్ ఉండటంతో అక్కడి దాకా నడిచి అక్కడ నుంచి గిండీ (నేను పని చేసే ప్రదేశపు నామధేయం) దాక వెళ్ళడం...అక్కడ నుంచి ఆఫీసు దాకా షేర్ ఆటోలో వెళ్ళడం...సాయంత్రం ఇంటికి రావడం...తినడం...ఇక భోజనానికి ఇబ్బంది లేకుండా చెన్నైలో ఎక్కడపడితే అక్కడ మన ఆంధ్ర మెస్ లు కుప్పలు కుప్పలుగా వెలిశాయి...


ఇకపోతే సినీ నటుడు శోభన్ బాబు ఉండేది మా ఎదురు వీధిలోనే...అపుడపుడు ఆయన వాళ్ళ ఇంటి లాన్ లో కనిపించేవారు...నవ్వి హలో అంటే , ఆయన తిరిగి హలో అనేవారు...ఆయన పరమపదించినపుడు చూడ్డానికి మేము కూడా వెళ్ళాము..ఓ గొప్ప సంస్కారం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయన సొంతం అని ఆయనను చూసిన వారికి ఎవరికైనా అనిపించకమానదు.


క్రమ క్రమంగా నాకు చెన్నై మీద విరక్తి మొదలైంది..దానికి కారణాలు బోలెడు..అసలు ఇంటర్ అయ్యాక వెళ్ళినప్పుడు నేను చూసి..అబ్బురపడి..ఆనందించి..అచ్చెరువొందిన మద్రాస్ ఇదేనా అనిపించింది..ఇక్కడ వేసవి కాలాన్ని భరించడం కష్టం..దాదాపు సంవత్సరంలో ఆరు నెలలు ఇక్కడ వేసవి గానే పరిగణించాలి..ఆ వేడిమికి మలమాలా మాడి మసైపోతమేమో అనిపించేది..ఇక్కడి వాళ్ళు అందరూ అంత గ్యారంటీ కలర్ లో ఉండటానికి ఇది కూడా ఓ కారణమేమో అనిపించింది...చెన్నైలో ఎక్కడ చూసినా శుభ్రత సూన్యం..ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయి ఉంటుంది..మెయిన్ రోడ్స్ లో తప్ప మిగతా ఏ గల్లీల్లో నడుస్తున్నా ముక్కుకు కర్చీఫ్ సాయం తప్పనిసరి..ఒక్కోసారి కొన్ని మెయిన్ రోడ్స్ లో కూడా తప్పదీ పరిస్థితి...ఆంధ్రా నుంచి చెన్నై ట్రైన్ లో వచ్చేవాళ్ళకు ఈ అనుభవాలు సుపరిచితమే..చెన్నై అవుట్ స్కర్ట్లు దేగ్గరనుంచి సెంట్రల్ దాక ముక్కు మూస్కోవాలి తప్పదు..చెప్పాలంటే చెన్నై ఒక పెద్ద సైజు మురికి వాడ...ఇక ఇక్కడి జనాలు చదువుకున్నా సరే పరిశుభ్రత అనేది చాలా కొద్ది మందిలో కనిపిస్తుంది...వైన్ షాపుల దెగ్గర అయితే జనాలు అక్కడక్కడే తాగి ఆ రోడ్ల మీద పడి హాయిగా నిద్రపోతుంటారు...ఇక్కడి జనాల్లో చాలా మందిలో సున్నితత్వం తక్కువ, నువ్వు ఎలా అన్నా మాట్లాడు వాళ్ళ సమాధానం ఒకేలా..చాలా కరుకుగా అనిపిస్తుంది..బహుశా లంకేయులు వీళ్ళ బంధువులు కాబోలు...

నాకు చెన్నై అంతే విరక్తి రావడానికి ఇంకో కారణం అమ్మాయిలు...కొంచెం అందంగా కనిపించే అమ్మాయిలను చూస్తె కళ్ళకు చలవ అని ఓ మహా జ్ఞాని చెప్పారు..రోజు అలా కాసేపు చూస్తె కళ్ళకు ఎంతో మంచిది, చత్వారం అంత త్వరగా రాదు, కళ్ళు వాటికి అవే మలినాల నుంచి పరిశుభ్రం అవుతాయి...ఇలా ఆ థియరీ చెప్తుంది. నాలాంటి చాలా మంది కుర్రోళ్ళు ఈ థియరీని ఫాలో అయ్యి కళ్ళ జబ్బులు రాకుండా చూసుకుంటారు..అదన్నమాట..కానీ దురదృష్టం ఏమిటంటే జల్లెడ వేసి జల్లినా, భూతద్దంలో నుంచి చూసినా చెన్నైలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు అందమైన అమ్మాయిలు...దాదాపు అందరూ బ్లాకు బ్యూటీలే...కనిపించిన కొంతమంది కూడా పర రాష్ట్రీయులు కావడం గమనార్హం..ఇలా నా కళ్ళకు చలవ లేకుండా పోయింది...ఇక్కడ ఇలానే కంటిన్యూ అయితే ఏదన్న కంటి జబ్బు రావడం ఖాయమని తోచింది..





ఇక చెన్నైలో వర్షం పడితే సరే సరి...అసలే చెత్త పేరుకుపోయి ఉన్న గల్లీలు బురదమయం, ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద గుంటలు..క్రిందటి ఏడాది నవంబర్ లో వచ్చిన తూఫాన్ కి చెన్నై అల్లకల్లోలం అయింది...మా ఆఫీసు లో అప్పెర్ బెసెమేంట్, లోయర్ బెసెమేంట్ ఫ్లోర్స్ నీళ్ళకి మునిగి పోయాయి..అన్ని రోడ్లల్లో మోకాలు లోతు నీళ్ళు..స్థంబించిన ట్రాఫిక్..అప్పుడు అధికారు ఏమి చర్యలు తీసుకున్నారో నాకైతే తెలీదు కాని..పేపర్ లో ఎన్నెన్నో చావు కబుర్లు..కరెంటు షాక్ కొట్టి కొందరు..ఇళ్ళకు ఇళ్ళు జలమయం అయి ఎంతో మంది బలయ్యారు...ఇటువంటి సమయంలో చురుకుగా వ్యవహరించలేని అధికారులు, మరెన్నో సందర్భాల్లో మాత్రం తెగ చురుకుగా ఉంటారు...అవేంటో మీకు నేను చెప్పాల్సిన పని లేదు... 


ఇక్కడి వాళ్ళకి బాషాభిమానం, రాష్ట్రాభిమానం చాలానే ఉంది...వీళ్ళకు వీళ్ళు ఓ జట్టుగా ఉంటారు..బహుళ జాతి సంస్థల్లో పని చేసే మన వాళ్ళకు వీళ్ళ ప్రవర్తన సుపరిచితమే..మన వాళ్ళతో పెద్దగా కలవారు..ఇక మీ మేనేజర్ తమిళుడు అయితే వార్షిక పెర్ఫార్మన్స్ రేటింగ్ మీరు ఎంత పొడిచినా ఐదుకి మూడు దాటదు..ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి సిద్దపడిన మా టీం లో కొందరు వాళ్ళకి వాళ్ళు ఓ మార్పు తీసుకురాగలిగారు..పెద్ద మార్పేమీ కాదు..వాళ్ళు ప్రాజెక్ట్ మారిపోయారు..కాదు మార్చబడ్డారు..అంతే..


నేను చెన్నై లో ఉండబట్టి రెండున్నర ఏళ్ళు దాటినా నాకు తమిళ్ సరిగ్గా రాదు..మొదట్లో చాలా కష్టపడినా తర్వాత బ్రతకడానికి ఉపయోగపడే కొన్ని పదాలు నేర్చుకోడం తప్పని సరి అయింది.. ఎంగే (ఎక్కడ ), అంగే (అక్కడ), ఎప్పు (ఎప్పుడు ), ఇప్పు (ఇప్పుడు ), యవల (ఎంత), అవళ (అంత ), ఎప్పడి( ఎలా ), ఇరుకు (ఉంది )....ఇలా ఏవేవో తంటాలు పడే వాడిని.. రెండున్నర ఏళ్ళు గడిచాయి ..నాకు ఇక చెన్నై మీద విరక్తి తీవ్ర స్థాయిలో తయారయింది...ప్రతి మనిషికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది...నాకు ఆ బ్రేకింగ్ పాయింట్ ఎప్పుడో  బ్రేక్ అయిపొయింది..ఎప్పుడెప్పుడు ఈ మురికి వాడ నుంచి బైటపడి స్వచ్చ మయిన గాలులు పీల్చుకుందామని ఉంది..

"యమహా నగరి ..చెన్నై పూరి...
నమహో మురికివాడా.. దోమల అడ్డా.."