Search This Blog

Tuesday, 28 July, 2009

ర్యాగింగ్...మ..గ..రి..స లు

"ఒరేయ్...కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవర్రా?" అడిగాడు సీనియర్ నాగరాజు జూనియర్స్ ఫ్లోర్ కి వస్తూనే....
అందరం కొయ్య బొమ్మల్లా నిల్చున్నాం....
"ఏంటి భే...బొట్టు పెట్టి పిలవాలా?..కొత్తగా జాయిన్ అయినవాళ్ళు అందరూ క్రింది ఫ్లోర్ కి రండి...." అరిచాడు....
నేను అంతకముందు రోజే జాయిన్ అయ్యాను...టీ షర్టు జీన్స్ ప్యాంటుతో దిగాను హాస్టల్లో...ఒక్కొక్కడి చూపులు వింతగా ఉన్నాయ్ నా మీద...నాకేమీ అర్థం కాలేదు...
"ఏయ్...ఇక్కడ ఇలా ఉండకూడదు..." అని చెప్పిన జనార్ధన్ వైపు వింతగా చూసాను ఎందుకన్నట్లు...
"ఇలా ఉంటే...సీనియర్ల చేతులో నీ పని అయిపోయినట్లే..టీ షర్టు జీన్స్ వెయ్యకూడదు...హ్యాండ్ కఫ్ఫ్స్ పెట్టకూడదు ...ఇన్ షర్టు చెయ్యకూడదు...వాళ్ళు కనపడగానే సర్ అని సెల్యూట్ చెయ్యాలి..ఇక ర్యాగింగ్ ఎలాగూ తప్పదనుకో...ఇవన్ని పాటిస్తే కొంచెం బెటర్.." అంటూ నాకు ఒక ఉచిత ఉపదేశం సెలవిచ్చాడు...
ఇవన్నీ విన్నాక కొంచెం టెన్షన్ మొదలైంది.....
డిన్నర్ చేస్తున్నపుడు మధ్యలో సీనియర్ వస్తే, అలాగే లేచి వెళ్లి చెయ్యి కడుక్కొని సెల్యూట్ చెయ్యాలట...ఛీ నా జీవితంలో మువ్వన్నెల జెండాకి తప్ప ఇంకెవరికీ సెల్యూట్ చేసింది లేదు...వీడికి చెయ్యాలా...'తప్పదు నాయనా చెయ్యాలి లేకుంటే అడ్డంగా బుక్ అవుతావ్'..అంటూ నా మనసు నాకు ఎప్పటిలాగే ఉపదేశం చేసింది...

"ఏంటి భే ఎవ్వడూ కదలడా?...ఒక్క నిముషంలో రాకపోతే ఇక ఉంటది రా వాళ్ళకీ..." అంటున్న వాడిని చూసి అదేదో సినిమాలో విలన్ గుర్తొచ్చాడు నాకు...
నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాం...పెళ్ళయాక అత్తారింటికి వెళ్ళే అమ్మయిలలాగా...నేను,సురేష్ గాడు,విజయ్ కిరణ్, విశ్వనాథ్...అందరం వెళ్ళాం...

"ఒరేయ్ నువ్విట్రారా...." కళ్ళు ఎర్రగా భయపెట్టేలా ఉండి...బాన పోట్టేసుకొని..నాలుక మడతపెట్టి కొట్టేలా చూసాడు నా వైపు ఒక సీనియర్ మేము వాళ్ళ ఫ్లోర్ కి వెళ్ళగానే....
కొంచెం భయపడుతూనే వెళ్ళాను వాడి దెగ్గరికి...నా కాలర్ పట్టుకొని లాగి "రే...నిన్నే ఎందుకు పిల్చానో తెల్సా?" అన్నాడు క్రూరంగా...
"తెలీదు ..." అన్నాను కొంచెం వణుకుతూ...
"ఏంటి భే..." వాడు ఉగ్రరూపం దాల్చాడు.."సీనియర్ ని ఎలా పిలవాలో తెలీదా?" వాడి కింది పెదవిని పళ్ళతో కొరికాడు...
"తెలీదు సర్..."
అంతే వాడిక లేచాడు...
"అంటే సర్...ఎలా పిలవాలో తెలుసు...ఇందాక మీరు ఎందుకు పిల్చానో తెల్సా అన్నారుగా...దాని జవాబుగా...తెలీదు సర్ అన్నాను..." వాడు వైలెంట్ గా తయారవడం చూసి వాడిని శాంతపరచడానికి ప్రయత్నించా...
"నీకు ఖచ్చితంగా క్లాసు తీసుకోవాల్సిందే రా...హ్యాండ్ కఫ్ఫ్స్ పెట్టకూడదు అని ఎవడూ చెప్పలేదా" అడిగాడు వాడు వాడి ఉగ్రరూప ఉధృతి కొంచెం తగ్గించి..
అపుడు అర్థమైంది నాకు...నేను హ్యాండ్ కఫ్ఫ్స్ పెట్టుకొని ఉన్నాను అని...వెంటనే తీసేసాను...'అది...పొరపాటు అయింది సర్.." అన్నాను
ఈ లోపు విజయ్ కిరణ్ ని ఎవడో పిల్చి ఓ పావలా ఇచ్చి రూమ్ మొత్తం కొలిచి ఎన్ని పావలాలు అయిందో లెక్క చెప్పమన్నాడు...వాడు ఆ పనిలో పడ్డాడు...
"నీ ఎస్.డి చెప్పరా...." అన్నాడు ఇంకోడు నన్ను చూసి...
"ఎస్.డి అంటే ఏంటి సర్.."అన్నాను అర్థంకాక...
"చా..నిజమా..ఒరేయ్ ఈడికి ఎస్.డి అంటే తెలిదంటరా..వెళ్లి చెప్పు.." అన్నాడు సురేష్ గాడితో..
"ఎస్.డి అంటే సెల్ఫ్ డీటెయిల్స్..." అన్నాడు వాడు.."అబ్బా చా...నువ్వింకా ఘనుడివి రా..." అన్నాడు సురేష్ గాడిని చూసి...
"సొంత డబ్బా..." విశ్వనాథ్ గాడు అందుకున్నాడు వెంటనే మధ్యలో...
"అబ్బో అయ్యగారికి చాలా తెల్సే...ఇట్రామ్మా..." అంటూ పిల్చాడు ఇంకో సీనియర్ వాడ్ని...
"ముఘల్ పరిపాలన కాలం నుంచి.....నిన్నటి దాక...ప్రపంచం లో జరిగిన ప్రతి విషయం ఒక బుక్ కొని అందులో మొత్తం రాసి రేపు నాకు చూపించు..." అన్నాడు ఆ సీనియర్ విశ్వనాథ్ గాడిని చూసి...అనవసరంగా ఇరుక్కుపోయాను అని వాడికి అర్థం అయింది.."అలాగే సర్ ..." అన్నాడు అయోమయంగా చూస్తూ..
"నువ్వేంటి భే...అట్లా చూస్తున్నావ్...ఎస్.డి చెప్పు.." అడిగాడు బాన పొట్టోడు...
అది ఎలా చెప్పాల్రా దేవుడా అనుకోని కాసేపు సీరియస్ గా ఆలోచించా...ఇలా మొదలెట్టా...
"నా పేరు రామకృష్ణా రెడ్డి...నేను పుట్టింది మాచెర్ల... ఇంటర్ గుంటూరు లో చదివాను...ఫలానా రాంక్ వచ్చింది...ఆ రాంక్ వల్ల ఇక్కడ జాయిన్ అయ్యాను.." అన్నాను క్లుప్తంగా...
"ఆహా...బలుపా రా నీకు...ఎస్.డి చెప్పమంటే...ఎదవ సోదంతా చెప్తావ్...అరేయ్ నువ్ చెప్పరా బక్కోడా..." సురేష్ గాడిని పాయింట్ చేస్తూ అడిగాడు బానపొట్ట..
నాలాగా రెండు ముక్కల్లో చెప్తే బుక్ అవుతా అనుకున్నాడో ఏమో...ఇక స్టార్ట్ చేసాడు వాడి వంశ చరిత్ర తో సహా..."మా పూర్వికులు- అంటే మా ముత్తాత మదన మోహన రావుగారు అప్పటి బ్రిటిష్ పరిపాలనా కాలం లో....." అలా సాగింది వాడి సొంత డబ్బా...బానపొట్టకి చిర్రెతుకోచ్చింది.. "అరేయ్ బక్కోడా నీకు ఈవెనింగ్ పార్క్ లో ఉంది అసలైన పండగ .." ఆ మాట విన్నాక సురేష్ గాడు ఎలా ఫీల్ అయ్యాడో తెలీదుగాని నాకు టెన్షన్ స్టార్ట్ అయింది, ఎందుకంటే పార్క్ లో ర్యాగింగ్ మరీ దారుణం...పార్క్ లో కనిపించిన అమ్మాయి దెగ్గరికి వెళ్లి "ఐ లవ్ యు" చెప్పమంటారు ..ఇంకా దిగజారి చౌకబారు డీటైల్స్ అడిగి తెలుసుకురమ్మంటారు...అప్పుడు వాళ్ళు చెప్పు చూపించడం కామన్...ఆ ప్రహసనం చూసి ఈ సీనియర్ సైకోగాళ్ళు పైశాచికానందం పొందుతారు...ఇంకా పార్క్ చుట్టూ కుప్పి గంతులు వేయించడం...ఐస్ క్రీం బండి దెగ్గరికి వెళ్లి చాకోబార్ కొట్టేసి పరిగెత్తుకు రమ్మనడం..ఇలా ఆ పిశాచాలకి ఆ టైం లో ఏ ఎదవ ఆలోచన వస్తే అది ఆ రోజు బలి పసువులైన జూనియర్ల మీద ప్రయోగిస్తారనమాట...

"ఒరేయ్ నువ్ పాట పాడురా?"  అడిగాడు ఇంకోడు...
పాట ఎలాగూ పడమంటారని తెలుసు కాబట్టి నాకు బాగా నచ్చిన...సారీ వచ్చిన సాంగ్ "నువ్వే కావలి" టైటిల్ సాంగ్ ఎత్తుకున్నాను...వాళ్ళకి జీవితం మీద తీపి గుర్తొచ్చి వెంటనే ఆపుచేయించారు నా పాట...
"నీకు ఇష్టమైన హీరోయిన్..." ప్రశ్న ఎటువైపు నుంచో వచ్చిందో కూడా తెలీకుండా.."సౌందర్య..." అనేశా..
"ఎందుకో సరైన కారణం చెప్పకపోతే....నీకు కూడా ఈవెనింగ్ పార్క్ ప్రోగ్రాం ఉంటుంది రోయ్.." బానపొట్ట గాడు వేలు చూపించాడు...వీడికి పార్క్ తప్ప ఇంకో ధ్యాస లేనట్లుందే...ఏదో ఒక రోజు అందరం కల్సి ఈ బానాపొట్ట గాడిని పార్క్ లో ముసుగేసి కుమ్మేయ్యాలి...నాకు నేను సంకల్పించుకున్నాను...ఇప్పుడు సౌందర్య నచ్చిందనడానికి ఏమి కారణం చెప్పాల్రా దేవుడా అనుకుని .."సర్...సౌందర్య అందరిలా ఎక్సుపోసింగ్ చెయ్యకుండా...మంచి పెర్ఫార్మన్స్ రోల్స్ చేసి మంచి పేరు సంపాదించుకుంది..చూడడానికి చక్కగా పదహారు అణాల తెలుగింటి ఆడపడుచులా..ముద్దబంతి పువ్వులా నవ్వుతూ.." అంటూ ఇంకా ఏదో అనబోతుండగా..
"ఐతే నాకేంటి భే..." అన్నాడు ఒకడు అప్పుడే ఎంట్రీ ఇస్తూ...బిత్తరపోయి చూశా వాడి వైపు...
"ఒరేయ్ నువ్వుండరా....ఆడేదో సౌందర్య గురుంచి చెప్తున్నాడు..." అన్నాడు బానపొట్ట వచ్చిన గొట్టం గాడి బుజం మీద చేయ్యేస్తూ..."అబ్బా సౌందర్యా...అయితే నడుము గురుంచి చెప్పరా..." ముప్పై రెండు పళ్ళు ఇకిలించాడు గొట్టం గాడు...
"సర్...నేను అలాంటివి చూడను...మాట్లాడాను..." నేలవైపు చూస్తూ చెప్పా..
"అబ్బా...ఛా...మరేం చూస్తావ్ రా.." వెకిలిగా నవ్వరంతా...
నాకు మండింది....రక్తం సల సల మరిగింది...
'భీమక్ష్వాపతీ... '....కళ్ళు ఎర్రగా నిప్పులు కక్కుతున్నాయి.. జబ్బల నరాలు పైకి తేలాయి..'కుంభీనిగర కుంభస్తగురు కుంభీవలయ పతి ఛత్రపతి..జ్యంజ్యాపవన గర్భాపహార వింధ్యార్దిసుమ ధృతి ఛత్రపతి..' బ్యాక్ గ్రౌండ్లో ఛత్రపతి మ్యూజిక్ వేసుకున్నాను ...పిడికిళ్ళు బిగిసాయి...పళ్ళు పట పటా కొరికా...'బాబూ..మనకంత బొమ్మ లేదు...ఒక్కసారి ఆ బాన పొట్ట గాడిని చూడు'...మళ్లీ గీతోపదేశం చేసింది నా మనసు...చూసా వాడి వైపు...ప్రపంచంలో అష్టదరిద్ర చండాలం అంతా వాడి మొహంలోనే ఉంది..." ఏంది భే ఆ చూపు...ఇట్రారా...వచ్చి చెప్పినట్టు చెయ్యి..." పిల్చాడు...వెళ్లాను...మోకాళ్ళ మీద నిల్చొని రెండు చేతులు వెనక్కి పెట్టి పాదాలని తాకించి అలానే ఉండు నేను చెప్పే దాక అన్నాడు...'ఓరినీ...బనపోట్టేసుకొని శరీరం ఒక్క ఇంచి కూడా వంచలేని వెధవ...నువ్ నాకు చెప్తావా..' అనుకోని కసిగా తిట్టుకున్నా...కానీ తప్పదుగా...ఆ ఆసనం లాంటి ప్రహసనం ట్రై చేశా చాలా కష్టపడి...కానీ అలా ఉండటం ఒక్క నిముషం కూడా నా వల్ల కాలేదు...తళుక్కున ఓ ఐడియా మెరిసింది...అంతే అలాగే వెనక్కి పడిపోయి కళ్ళు తెలేశాను..బానపొట్ట గాడు కదిపాడు నన్ను...తల అటూ ఇటూ ఊగిస్తూ ఏదో వింత జబ్బు ఉన్నట్లు ప్రవర్తించా...వాడికి భయంవేసింది...నీళ్ళు తెచ్చి నా ముఖం మీద కొట్టాడు..లేచాను ఏదో మైకం లో ఉన్నవాడిలా..."సరే...నువ్వు వెళ్ళు ఇంక..." అన్నాడు బానపొట్ట...నా సమయస్ఫూర్తి కి నాకే ముచ్చటేసి అక్కడనుంచి జారుకున్నా...అలా మొదటి రోజు ర్యాగింగ్ ముగిసింది...

ఆ తర్వాత ప్రతిరోజూ ఏదొక విధంగా ర్యాగింగ్ జరుగుతూనే ఉంది...కానీ మొదట్లో ఉన్న భయం పోయింది...ఆదివారం రోజుని మొత్తం ర్యాగింగ్ కి కేటాయించే వాళ్ళు సీనియర్లు హాస్టల్లో...నేను మాత్రం ఆదివారం వాళ్ళకు దొరక్కుండా కాకినాడలో ఉండే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే వాడిని...

"ఫ్రెషర్స్ పార్టీ ఎప్పుడు ఇస్తారు సర్" అని వాళ్ళని అడిగితే..."అప్పుడేనా...ఇంకా రాగింగే సరిగ్గా చెయ్యలేదు...అపుడే మీకు ఫ్రెషర్స్ పార్టీ కావాలా?...ఓ నాలుగు నెలల తర్వాతా ఆలోచిద్దాంలే " అన్న మా సీనియర్లు ఆ తర్వాత కేవలం రెండు రోజుల్లోనే "రేపే మీకు ఫ్రెషర్స్ పార్టీ ఇస్తున్నాం.." అని మాతో అన్నారంటే దానికి గల కారణం తెలిసిన మాకు వాళ్ళు అలా చెప్పడం అతిశయోక్తిగా అనిపించలేదు మరి...

ఆ రోజు శనివారం..అర్ధరాత్రి ...ఆ రోజు జరిగిన సీన్ లో నేను లేను..ఎందుకంటే నేను కాకినాడ వెళ్ళాను...నేను వచ్చాక మా ఫ్రెండ్స్ చెప్పారు జరిగిందంతా...దాదాపు అర్థరాత్రి పన్నెండు దాటింది...మా ఫ్లోర్ మెయిన్ డోర్ ని దబా డాబా బాదుతున్నారు ఎవరో..లేచి తలుపు తీస్తే సీనియర్లు అంతా కట్టకట్టుకొని వచ్చారు...వాళ్ళు బాగా తాగి ఉన్నారని అర్థం చేసుకోడానికి మా వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు..తలుపు తీసిన వాడిని ఈడ్చి చెంప మీద కొట్టారు...వాడు దెబ్బకి కింద పడి బిత్తరపోయి చూసాడు వాళ్ళని...అంతే..ఆ రాత్రి వాళ్ళు మృగాల్లా తయారయ్యారు...ఎవడు దొరికితే వాడిని పట్టుకొని కొట్టడం...తన్నడం...అసలు వాళ్ళు ఇంతాలా రేచ్చిపోడానికి ఓ కారణం ఉంది...
మా కాలేజీ లో వినీలా అనే అమ్మాయి ఉంది..ఆ అమ్మాయికి మా సేనియర్లలో ఒకడు సిన్సియర్గా లైన్ వేస్తున్నాడు...ఇక ఆ అమ్మాయి గర్ల్స్ హాస్టల్ లో ఉంటుంది...మా హాస్టల్స్ రాజమండ్రి టౌన్ లో ఉంటే...కాలేజీ హైవే మీద రాజానగరం దగ్గరిలో ఉంటుంది...మేమందరం హాస్టల్ నుంచి కాలేజీకి కాలేజీ బస్సులోనే వెళ్ళడం ..మళ్లీ తిరిగిరావడం...అమ్మాయిలకు, అబ్బాయిలకు బస్సులు సెపరేట్ అనమాట...కాలేజీ అయిపోయాక మాకు కాలేజీలోనే స్టడీ హౌర్స్ ఉండేవి...చూశారా నా జీవితం...ఇంటర్మీడియట్ లో ఎలాగూ తప్పలేదు స్టడీ హౌర్స్ కనీసం ఇంజనీరింగ్ లో ఆయినా స్వేచ్చా వాయువులు పీల్చుకోవచ్చనుకుంటే..ఇక్కడకూడా స్టడీ హౌర్స్ తగలెట్టారు...బుద్ధి ఉన్నోడు ఎవడైనా పెడతాడా ఇంజనీరింగ్ కాలేజీ లో స్టడీ హౌర్స్...ఏం చేస్తాం, మా  కాలేజీ వాడికి చాలా జూనియర్ కాలేజీలు ఉన్నాయి...వాటి ప్రభావమే అనుకుంటా మా కొంప ముంచాయి...(అఫ్కోర్స్...సెకండ్ ఇయర్ నుంచి స్టడీ హౌర్స్ తీసేసారనుకోండి...అది వేరే విషయం)...

ఇక అసలు విషయానికి వస్తే...ఓ రోజు రాత్రి స్టడీ హౌర్స్ అయ్యాక డిన్నర్ చేసాక (మాకు డిన్నర్ కాలేజీ లో నే ) అందరం బస్సు ఎక్కాము...ఆ రోజు అమ్మాయిల బస్సు పాడయిపోయిందట...సో మా బస్సు లోనే వాళ్ళని ఎక్కించారు...బస్సు మొదటి సగంలో వాళ్ళు..చివరి సగం మేము...ఆ రోజు సీనియర్లు పెద్దగా లేరు..వాళ్ళు స్టడీ హౌర్స్ ఎగ్గొట్టి ఎటో వెళ్లారు...ఇక ఆ రాత్రి మా ఇష్టా రాజ్యం అయిపొయింది..తెగ గోలచేసాం..అసలే అమ్మాయిలు ముందు ఉన్నారు...ఎక్కడి లేని ఉత్సాహం వచ్చింది మా జూనియర్ల అందరికి...దొరక్క దొరికిన ఛాన్స్ ని వినియోగించుకుంటూ తెగ కామెంట్స్ అమ్మాయిల మీద..ఆ రోజు వినీలా పసుపు కలర్ చుడిదార్ వేసుకుంది...అబ్బోఆ అమ్మాయి వేసుకున్న చుడిదార్ కలర్ కూడా అంత బాగా గుర్తున్చుకున్నావా ? అనేయ్యకండి...ఎందుకంటే ..కలరే  అక్కడ కొంపముంచింది...ఆ అమ్మాయి పసుపు కలర్ చుడిదార్ కాబట్టి మా వాళ్ళు "తెలుగు దేశం ...తెలుగు దేశం ...కుమారి తెలుగు దేశం...జై చంద్రబాబూ...జై జై వినీలా..." అని ఒకటే గోలా...ఆ అమ్మాయి ఎడ్చిందంటా...మాకా విషయం తేలేదు...ఇక తరువాతి రోజు ఆ విషయం సీనియర్లుకి తెలియడం...అదీ 'వినీలా ఎడ్చిందంటా..' అనే విషయం తెలిసి దానికి లైన్ వేసేవాడు పూనకం వచ్చిన వాడిలా ఊగడం...ఒక ప్లాన్ వేసి మమ్మల్ని ఆ రోజు నైట్ కొట్టడం...ఇవన్ని జరిగిపోయాయి....
కానీ ఆ రోజు రాత్రి మా వాళ్ళు ఊరుకోలేదు...సీనియర్లు అయినంత మాత్రాన తంతారా...అని రేచిపోయి అందరూ కల్సి ఫ్లోర్ లోంచి బైటకి పరిగెత్తి రోడ్ మీదకి వెళ్లి "ఇప్పుడు రండి రా చూసుకుందాం...ఫ్లోర్ లో తలుపులేసి కొట్టడం కాదు రా...ఇప్పుడు రండి.." అని తోడకోట్టారంటా మా గ్రూప్ లో ఉన్న రెబల్ గ్యాంగ్...అంతే కాదు, వాళ్ళలో ఒకడు చైర్మన్ కి దూరపు బంధువట..వాడెళ్ళి అప్పటికప్పుడు చైర్మన్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు...ఈ విష్యం తెల్సుకున్న సీనియర్లకి చెమటలు పట్టాయి..'అమ్మాయి కోసం అనోసరంగా ఇరుక్కున్నాం 'అని అర్థమైంది వాళ్ళకి...కొద్దిసేపయ్యాక చైర్మన్ వచ్చాడు...సీనియర్ల ఫ్లోర్ కి వెళ్ళాడు...అందరికి తాగింది మొత్తం దిగిందనుకుంటా..ఒక్కోడు వణుకుతా నిల్చున్నాడు..ఆ సీన్ నేను మిస్ అయినందుకు చాలా బాధపడ్డాను...ముఖ్యంగా ఆ టైంలో ఆ బనపొట్ట గాడిని చూడాలనిపించింది...చైర్మన్ సత్యనారాయణ రాజు అందరి పేర్లు ఒక పేపర్ మీద రాసుకొని.."రేపు కాలేజీ లో అందరు ఉండాలి....ఎవడన్నా మిస్ అయ్యాడో చచ్చాడే.." అని చెప్పి వెళ్ళిపోయాడు....

ఇక మరుసటి రోజు...రాజు గారు వీళ్ళందరిని పిల్చి ..కాలేజీ మధ్యలోకి రప్పించి ఒక్కోడిని కొట్టాడు కదా... ఆహా అది బహు కన్నులపండువగా తోచింది నాకు...యస్...ఐ ఎంజాయిడ్ ఇట్...లేకపోతె ర్యాగింగ్ కి ఉన్న హద్దులు దాటితే పర్యవసానం అలానే ఉంటుంది మరి...ఆ తర్వాత రోజు మాకు ఫ్రెషర్స్ డే...ఆ తర్వాత నుంచి మాకు హద్దులు లేవు...రెక్కలు వచ్చిన పక్షుల్లా విహరించాం రాజమహేంద్రి నగరమంతా...ఓ వారం పాటు రోజుకో సినిమా చూసాం...పట్టా పగ్గాలు లేవు మాకు అప్పుడు...క్రమ క్రమాంగా సేనియర్లు వాళ్ళ ఈగో వదిలి మాతో కలిసారు...

"సర్...ఆ రోజు మీరు నన్ను అనోసరంగా చెంప దెబ్బ కొట్టారు...మీ మీద ఇంకా కోపం తగ్గలేదు నాకు" అన్నాడు విజయ్...
"సరే రా...నిన్నే కాదు..ఆ రోజు చెంప దెబ్బ కొట్టించుకున్నోలందరికి ఈ రోజు సెకండ్ షో సినిమా టికెట్లు మేమే పెట్టుకుంటాం ...ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ కూడా ..." హామీ ఇచ్చేసాడు బానపొట్ట...15 comments:

సుభద్ర said...

baagaa rasaru...keep blogging.
taruvata meeru senior ayyi untaaaru kada.

కిషన్ రెడ్డి said...

సుభద్ర గారు థాంక్స్ అండి....నేను తర్వాత సీనియర్ అయ్యనులెండి..అది వేరే విషయం...కాని ర్యాగింగ్ లాంటివి ఏమి చెయ్యలేదు...జస్ట్ వెరైటీ గా వాళ్ళని చెయ్యమనే వాడిని అంతే...

నేస్తం said...

నా కామెంట్ ఏది?మీ బ్లాగు ఎలా అన్నా నా మీద అలిగింది ,నా కమెంట్స్ తో సహా కనబడటం లేదు , లేక మీరే ప్రచురించలేదా :)

కిషన్ రెడ్డి said...

నేస్తం మీరు భలే వారే...మీరు కామెంట్ ఇవ్వడం నేను ప్రచురించక పోవడమూనా ...అసలు మీ కామెంట్ ఏమీ నాకు రాలేదు ఇది తప్ప...నిజం :)...మీరు ఇచ్చిన కామెంట్ ఏమిటో మరొకసారి ఇస్తే ధన్యుడిని...మీ కామెంట్స్ నిజంగా స్పెషల్ ఎప్పుడూ నాకు...

priya.. said...

bhalega undandi me raging vishalalu..senious ni kummatalu ivanni vinnam kani nijamga untai ani eppude telisindi.kani a place lo merunte inka maza undedi bt u missed dat chance.ok mari meru juniors ni rag cheyaleda?

kowmudhi said...

ramu..me juniors me nunchi chalane nerchukointaru kada...ina melanti telivi inkevariki untundi chepandi..hahhah.

బ్లాగాగ్ని said...

వినటానికి బావున్నాయి మీ ర్యాగింగ్ ముచ్చట్లు కానీ అవి అనుభవించేటప్పుడు ఎంత కష్టపడివుటారో అర్థం చేసుకోగలను. మీరూ నాలాగే సౌందర్య ఫ్యానన్నమాట. వేసుకోండి నాతరఫునించి ఒక పెద్ద 'ఓ' :)

కిషన్ రెడ్డి said...

Priya and Kowmudhi...me abhimaananiki thanks :)

కిషన్ రెడ్డి said...

బ్లాగాగ్ని గారు నిజమే...ఇప్పుడు అవి తలచుకుంటే ఫన్ని గానే ఉంటాయి గాని...అప్పుడు చాలా బాధలు పడ్డాం లెండి....సౌందర్యకి ఒక 'ఓ ' వేసుకోన్నానండి మీ తరపు నుంచి :) :)

baleandu said...

బాగుంది మీ రాగింగ్ . సై సినిమా చుసిన్నటు వున్నది. మీ రాగింగ్ స్టొరీ సినిమా లో పెడితే బాగా ఆడుతుంది.

baleandu said...

బాగుంది మీ రాగింగ్ ముచ్చట్లు. సై సినిమా చుసిన్నటు వున్నది. మీ రాగింగ్ స్టొరీ సినిమా లో పెడితే బాగా ఆడుతుంది.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

మీ ర్యాగింగ్ అనుభవాలు బాగున్నాయి. మీ శైలి బాగుంది. మీరు మదరాసు లోనా ఉండేది? నేను మదరాసు లోనే ఉంటున్నాను!

Kishen Reddy said...

baleandu and ganesh....happy to see ur comments...

sameera said...

sir nenu mee collegey...kani maaa timelo inta ragging ledu...Meeru ea batch??

Kishen Reddy said...

Sameera thanks for ur comment...nenu 2004 passed out...ma time lo konchem ragging ekkuvagane undi mari...