Search This Blog

Saturday 31 October 2009

పిచ్చికాక్ లవ్ స్టొరీ...నాగదేవిలో నువ్వునాకునచ్చావ్...లారీ అన్నయ్యకి యాభై..

"..........అప్పుడు మా అత్త చూసింది...వెంటనే నేను చేతులు వెనక్కి పెట్టుకున్నాను.. నా చేతుల్లో ఉన్న బ్లేడ్ ముక్క, రక్తంతో రాస్తున్న లవ్ లెటర్ కనిపించకుండా ఉండాలని." అని ఆపేసాడు లక్ష్మణ్ గాడు.

నేను హిచ్కాక్ సినిమా కన్నా వీడు చెప్పే పిచ్చికాక్ కథ ఆసక్తిగా వింటూ ఆకాశం వైపు చూస్తూ నక్షత్రాలు లెక్కపెడుతున్నాను...మేము అప్పుడు కాలేజీ హాస్టల్ లో ఉండేవాళ్ళం..ప్రతిరోజు రాత్రి కొంతమంది కాలేజీ బిల్డింగ్ పైన పరుపులు వేసుకొని పడుకుంటే...మరి కొంతమంది కంప్యూటర్ ల్యాబ్ లో ఎ/సి ఆన్ చేసుకొని పరుపులు పరుచుకొని పడుకుంటారు...నేను కూడా రోజు హాయిగా కంప్యూటర్ ల్యాబ్ లోనే పడుకొనే వాడిని...కానీ వీడు స్టొరీ మొదటి రోజు ల్యాబ్ లోనే మొదలెట్టి...మరుసటి రోజు నుంచి ల్యాబ్ లో అయితే స్టొరీ కి మూవ్మెంట్ కుదరడం లేదని, కాలేజీ బిల్డింగ్ పైన అయితే చుక్కల్ని...చంద్రుడిని చూస్తూ...ఫీల్ అవుతూ చెప్పగలను అని...సెకండ్ ఎపిసోడ్ నుంచి కాలేజీ బిల్డింగ్ పైనే చెప్పడం మొదలెట్టాడు...నేనేమన్నా తక్కువ తిన్నానా, కోనసీమ దోమలకి నా రక్తాన్ని రుచి చూపిస్తూ మరీ వీడి స్టొరీ వినసాగాను....

"ఆ తర్వాతా..." అడిగాను అదొక ట్రాన్స్ లో మునిగిన వాడిలా...
"ఇక రేపు చెపుతాలే...నిద్రొస్తుంది పడుకో.." అంటూ ఆవలించి అవతలి పక్కకి తిరిగి పడుకున్నాడు...
నాకు వెంటనే సమరసింహారెడ్డి సినిమాలో జయప్రకాష్ రెడ్డికి వచ్చినంత కోపం వచ్చింది...వీడి తొక్కలో లవ్ స్టొరీని టీవీ సీరియల్ ఎపిసోడ్స్ లా రోజుకి కొంత చెప్పి ఎక్కడ ఆపాలో...ఎక్కడ సెన్సార్ కట్ చెయ్యాలో..ఎక్కడ వాణిజ్య విశ్రాంతి తీసుకోవాలో..అన్నిటిలో టీవీ వాడిని మించిపోయి నా ప్రాణాలు తోడేస్తున్నాడు...మనకా ఫుల్ గా వింటే కాని నిద్ర పట్టదు...కాని తప్పదుగా అనుకుంటూ నిద్ర దేవతని ఆహ్వానించా...ఎంతసేపటికీ రానంటాదే !!..."ఏటే నీ గోలా...నిద్రపోవాలి తొందరగా రా.." కోపంగా చూసా నిద్ర దేవత   వైపు...
"నేను ఎందుకు రావాలి...నేను రాను పో...రోజూ ఎంతో ఇష్టంగా నీ దెగ్గరకు వస్తే, అవతలికి పోమ్మంటావ్ గా.." బుంగ మూతి పెట్టింది నా నిద్ర దేవత...
"నా బుజ్జి కదూ...నా కన్నా కదూ...రామ్మా...అప్పుడేదో ఈ పిచికాక్ గాడు తొక్కలో లవ్ స్టొరీ చెప్తుంటే నిన్ను రావద్దన్నాను....ఇదుగో ఇప్పుడు చెంపలేసుకోనా..." బ్రతిమాలుకున్నాను రెండు చంపల్ని పట్టుకొని...
"పో..." అంటూ బుంగ మూతి చిన్నది అప్పుడే దిగిరాను అంటుంది..'నీకేంటే కోనసీమ అమ్మాయిలకన్నాఅలక ఎక్కువలా ఉంది' అనుకోని "ఇప్పుడు నువ్వచ్చేశావనుకో...ఈ సండే ఫుల్ గా నిద్రకోసమే కేటాయిస్తా...సరేనా...రా బంగారం..రేపు మళ్ళీ ఆ గుడ్డోడి క్లాసులో నిద్రపోతే నా పక్కవాడిని చూస్తూ నన్ను తిడతాడు.." అని ముద్దుగా పిలిచేసరికి పాపం అలకపాన్పు దిగి వచ్చేసింది నా నిద్ర దేవత...

"రేయ్...నువ్వునాకునచ్చావ్ సినిమాకి టికెట్లు దొరికాయంట నాగాదేవిలో మాటినీకి...." అని రాసి స్లిప్ పాస్ చేసాడు శీనుగాడు నాకు గుడ్డోడి క్లాసు లో..
"అవునా...ఏం చేద్దాం.." రిప్లయ్ స్లిప్ నా నుంచి..
"ఆ!!...బ్లాకు లో అమ్మి బిరియాని తిందాం...!!" ఇన్కమింగ్ స్లిప్ సారాంశం..
"నీ బొంద...రాజముండ్రిలో బిరియాని చెత్తగా ఉంటుందెహే..." సీరియస్ స్లిప్ నా నుంచి..
"ఛా...అయితే రమణగాడు, పాపం ప్రాణాలకు తెగించి గుడ్డోడి క్లాసు ఎగ్గొట్టి నాగదేవి దెగ్గర నాగుపాములతో కలబడి సంపాదించిన టికెట్లు బ్లాకు లో అమ్మి బిరియాని తినేద్దామనే...నీ ఎంకమ్మ లంచ్ టైంకి మనం కాలేజీ నుంచి బైటపడాలి...2 30కి షో.." స్లిప్ చాలా వేడిగా ఉండటంతో ఆలస్యం చెయ్యకుండా రిప్లయ్ ఇచ్చాను "అలాగే...అయితే యాక్షన్ ప్లాన్ రెడీ చెయ్..."  అంటూ....మా కాలేజీలో సాయంత్రం దాకా బైటకి పంపేవారు కాదు, ప్రిన్సిపాల్ పర్మిషన్ లెటర్ ఉంటే తప్ప....సినిమాకి పర్మిషన్ రాసిచ్చే నికృష్టపు ప్రిన్సిపాల్ కాదు పాపం మా గుడ్డోడు (ప్రిన్సిపాల్ గుడ్డితనం మీకు దీనికి ముందు పోస్ట్ లో చెప్పాను)..కాని బయటకి వెళ్లడానికి మాకు యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయిగా...

"....సో అక్కడనుంచి తుప్పలన్నీ దాటుకొని వెళ్తే వరుసగా కొబ్బరి చెట్లు...అక్కడి నుంచి ఒక అర కిలోమీటరు పాము పుట్టల్ని మన పుట్టిళ్ళులా తలచుకుంటూ దైర్యంగా వెళ్తే కనుచూపుమేరల్లో ఎన్.హెచ్-7 కనిపిస్తుంది...హైవే మీదకి రాగానే చక్రద్వారబంధం స్టాప్ కనిపిస్తుంది...అక్కడ నిల్చొని రాజముండ్రి బస్సు ఎక్కి వెళ్ళడమే...ఇదీ మన యాక్షన్ ప్లాన్..." అన్నాడు శీనుగాడు ఓ పేపర్ మీద మ్యాప్ గీసి కౌబాయ్ సినిమాలో నిధికి మాప్ దొరికిన విలన్ లా సంబరపడుతూ....ప్లాన్ ప్రకారం వెళ్లి హైవే చేరుకొని తుని-రాజముండ్రి బస్సు ఎక్కి కంబాలచెరువు దెగ్గర దిగి నాగదేవికి ఆటో కట్టించుకొని వెళ్ళాం...

మేము థియేటర్ దెగ్గరికి వెళ్ళగానే గేటు ముందు సిమెంట్ రాయి మీద ఏబ్రాసి మొహం ఏస్కోని కూర్చున్నాడు రమణగాడు...ఆడి పక్కనే అడుగు దూరంలో కూర్చొని బ్లాకు అమ్ముకొనే వాడు...ఇంకొక అడుగు దూరంలో ముష్టోడు..మరో అడుగు దూరంలో పాములు పట్టేవాడు ఉన్నారు...
"ఒరేయ్...ఇక్కడున్నావేంట్రా తాబేళ్లు పట్టే ఫేసు నువ్వూను...పదా 2 40 దాటింది టైం.." అన్నాను నేను ఆవేశంగా ఎక్కడ హీరోయిన్ ఎంటర్ అయిపోయిందేమో సినిమాలో అనుకుంటూ...హీరో ఎంట్రన్స్ అయినా మిస్ అవుతానేమోగాని హీరోయిన్ ఎంట్రన్స్ మిస్ అయితే మళ్ళీ చూడాల్సిందే ఆ సినిమా...
"ఏటి దాటేది...టికెట్లు లెవ్..." సావు కబురు సల్లగా సెప్పాడు మారాజు...  
పక్కనున్న ముష్టోడు పళ్లికిలించాడు...బ్లాకువాడు ఇదే టైం అనుకోని "ముప్పై అయిదు -- అరవై, ముప్పై అయిదు -- అరవై....ఎన్ని గావలి..?" ఆడిలో ఆడు గొణుగుకున్నట్లు అడిగాడు అక్కడేదో ఆడు మాకు డైమొండ్స్ స్మగ్గ్లింగ్ చేస్తున్నవాడిలా...
"నీ ఎంకమ్మా...టికెట్లు లేకుండా ఉన్నాయి రమ్మని కబురెందుకు పంపావ్ రా...మేము యాక్షన్ ప్లాన్ వేసి మరీ వస్తే..." అడిగాడు శీనుగాడు బ్లాకువాడి గోల పట్టించుకోకుండా...
"పర్సు దొబ్బింది రా..." చాలా కూల్ గా చెప్పాడు వాడు....కానీ టెన్షన్ స్టార్ట్ అయింది మాకు...వాడి పర్సులో పది రూపయలకన్నా వాడి సొమ్ము ఎక్కువగా కనిపించదు...కాని వాడి పర్సు లో రెండు వందలు నావి...మూడు వందలు శీను గాడివి..ప్రొద్దున్నే రాజముండ్రి వెళ్తున్నానురా అని ఈ ఏబ్రాసి మొహం గాడు చెప్తే...పేస్టు నుండి...పాండ్స్ పౌడర్ దాకా లిస్టు చెప్పి డబ్బులిచ్చి పంపించాం...కుదిరితే మాటినీకి టికెట్లు కూడా తీసి కాకిచేత కబురుచేసినా వస్తాం అని ఎదవ కబుర్లు చెప్పి పంపించాం వాడిని...

"ఒరేయ్ అందులో మా డబ్బులు రా..." అన్నాన్నేను ఇంకేమనాలో తెలీకా...
"ఏం చెయ్యమంటావ్ రా...కావాలని పోగొట్టానా?..ఎవడో ఎత్తేశాడు.." అన్నాడు తేలికగా..
"సర్లేరా ఏం చేస్తాం..." అనుకోని...అసలు మమ్మల్ని రమ్మనడంలో మర్మమేమిటో అర్థంకాక అదే విషయం అడిగాం వాడిని...
"మళ్లీ కాలేజీకి రావడానికి డబ్బులు ఎలా రా నాకు...నాకు ఇంకేం ఐడియా రాలేదు...అందుకే మిమ్మల్ని పిలిపించా మీతో మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళోచ్చుగా..." అంటున్న ఆడి ఐన్ స్టీన్ బుర్రకి వంగి సలాం చెయ్యాలి అనిపించింది...
"నీ సత్తర ఫేస్ లో నా తాడు..." అంటున్న శీనుగాడి వైపు వెరైటీగా చూసా ఇదెక్కడి తిట్టురా నయనా అనుకుంటూ "కాసేపాగితే లోకల్ నాకోడులు అదే డే-స్కాలర్లు వచ్చి సస్తారుగా...ఆళ్ళని అడిగి ఓ పది రూపాయలు తీసుకొని ఎనక్కి రాలేవా?...దీనికోసం మమ్మల్ని అక్కడనుంచి పిలిపించి నీకు ఎస్కార్ట్ ఇవ్వమంటావా...పైగా సినిమా టికెట్ ఎర చూపిస్తావా ..??" కాటకాల రుద్రయ్యలో కృష్ణంరాజులా చూసాడు శీనుగాడు రమణగాడి వైపు... 

చేసేదేంలేక అంకుల్ మెస్ లో ఆత్మారాముడిని సంతోషపెట్టి...కాసేపు కంబాల చెరువు పార్క్ లో తిరిగి అయిదింటికి అలా గోదారి గట్టు దెగ్గరికి వెళ్ళాం...నెమ్మదిగా ప్రవహిస్తున్నగోదారిపై అస్తమిస్తున్న సూరీడి రేఖాకంతి వర్ణించడానికి అందనంత అందంగా ఉంది..
"రేయ్...మీ దెగ్గర డబ్బులున్నాయా..?" అడిగాడు రమణగాడు...
సీనుగాడికి సిర్రెత్తింది....
"ఎందుకురా?" అడిగాను నేను నెమ్మదిగా శీనుగాడ్ని శాంతింపచేస్తూ...
"ఏట్లేదురా...ఎలాగు ఊళ్లోకి వచ్చాం కదా...నువ్వునాకునచ్చావ్ చూసేసి ఎల్లిపోదాం రా.." అన్నాడు రమణా..
"డబ్బులు దొబ్బెట్టుకుంది కాక...ఇప్పుడు సినిమానా..." అన్నాడు శీనుగాడు
"నిజమేలే...ఇప్పుడెందుకులేరా అసలే డబ్బులు పోయాయిగా.." అన్నాను నేను కానీ లోపల ఈ నాకొడుకులు రెడీ అంటే నాకు రెడీ అనాలనే ఉంది..

సమయం: 6 30 pm
స్థలం: నాగాదేవి థియేటర్
ఒక్కొక్క టికెట్ బ్లాకులో అరవై పెట్టి కొన్నాం...
సినిమా అనే వీక్ పాయింట్ మమ్మల్ని మళ్ళీ లొంగదీసుకొని నాగదేవి థియేటర్ దాకా లక్కోచ్చింది..ఆ వీక్ నెస్ కి ఆజ్యం పోస్తూ రమణ..అటూ ఇటూ తేల్చకుండా నేను..శీనుగాడ్నిమా రూట్ కి తీసుకొచ్చాం..
"ఆడెబ్బ...మధ్యాహ్నం నుంచి రెండు గంటలు నేనూ ఆ బ్లాకోడు పక్కపక్కనే కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకున్నాం...ఆ విశ్వాసం కూడా లేకుండా టికెట్టుకి అరవైలో రూపాయ కూడా తగ్గనన్నాడే ఎదవ..." అన్నాడు రమణగాడు అక్కడేదో తన సొంత బావ తనతో ఎంతో స్నేహంగా ఉండి కూడా చెల్లెలి కట్నం దెగ్గర రూపాయ కూడా తగ్గనన్నాడు అని ఫీల్ అయిన బావమరిది లెక్క...

సినిమా అయ్యేసరికి తొమ్మిదిన్నర...మళ్లీ ఆత్మారాముడి కోసం అంకుల్ మెస్ కి వెళ్ళాం...డెడ్ సీపు కదా మరి అక్కడ...అసలే మేమందరం బడ్జెట్ పద్మనాభాలం...ఒక్క సినిమా ఇసయంలో తప్ప..అదీ మేటర్... 

తినేసి మళ్ళీ కంబాల చెరువు బస్సు స్టాండ్ కి వచ్చాం...టైం పది దాటింది...ఎంత సేపు చూసినా ఒక్క బస్సు కూడా రావడంలేదు...
"ఏటబ్బాయ్...ఎటేపెళ్లాలి...సూత్తాంటే ఇంజనీరింగ్ కుర్రాళ్ళలా ఉన్నారే..." అడిగాడు అతను...భుజం మీద కండువ..బుర్ర మీసాలు..నాకు అదేదో సినిమాలో గళ్ళ చొక్కా..బుగ్గ మీద పులిపిరి..నోట్లో పాన్ వేసుకొని ఉండే విలన్ గుర్తొచ్చాడు...
"అవునండి...రాజానగరం వెళ్ళాలి...ఎంతసేపైనా ఒక్క బస్సు కూడా రావడం లేదు..." అన్నాడు రమణ...
నేను మద్యలో ఇష్ కొడుతున్నాను రమణగాడికి ఆడితో మనకెందుకు అన్నట్లు...
"ఎక్సుప్రెస్ బస్సు లు ఉన్నాయ్ గాని ..అయ్యి మీ కాలేజీ దెగ్గర ఆపరు...ఆర్డినరీ పన్నెండింటికి ఏలేశ్వరం బండి ఉంది అబ్బాయ్..." చెప్పాడు నోట్లో పాన్ పక్కన ఉమ్మేస్తూ...
"అమ్మో పన్నెడింటిదాకానా..." ముగ్గురం ఒకేసారి అన్నాం...
"ఓ పనిసేయ్యండి అబ్బాయ్....తుని పొయ్యే లారి మా ఓళ్ళదే కాసేపట్లో ఇటొత్తాది...అది ఆపి మిమ్మల్ని ఎక్కించి కాలేజీ దెగ్గర దింపమంటాలే...తలా ఓ అయిదు సేతులో ఎట్టండి ఆడికి..." అతనలా చెప్తుంటే నాకేదో డౌట్ మీద డౌట్...అసలే ఆల్మోస్ట్ అర్థరాత్రి...అందునా ఆల్మోస్ట్ అందమయిన ఒంటరి మొగపిల్లలం...పెళ్లి కాని వాళ్ళం...పైగా వయసులో ఉన్నవాళ్ళం...ఏదైనా అఘాయిత్యం జరిగితే...ఆలోచించడానికే భయమేసింది...ఒంటరి మొగపిల్లలు అర్థరాత్రి నడిచే రోజులా ఇవి నా మీద నాకే డౌట్...

చేసేదేమిలేకా ఆ సాహసోపేత ప్రయాణానికి సిద్ధపడ్దాం...నేను ససేమిరా అన్నాను మొదట..కావాలంటే ఎవడన్నా ఫ్రెండ్ రూం లో ఈ నైట్ కి ఉండి రేపు మార్నింగ్ వెళ్దాం అన్నాను...ఎదవలు ఇనిపించుకోలేదు..నేను ఒప్పుకోకతప్పలేదు...
లారీ రావడం...మేము ఎక్కడం...అది బైల్దేరడం జరిగిపోయాయి...లారీ ఆర్ట్స్ కాలేజీ దాటి...హౌసింగ్ బోర్డు దాటి...లాలా చెరువు దాటి...అలా నిర్మానుష్యమైన ఎన్.హెచ్-7 మీద పరుగెడుతుంది...


కేబిన్ లో డ్రైవర్ పక్కన నేను, నా పక్కన రమణ,శీనుగాడు...డ్రైవర్ గాడి దెగ్గర మందు వాసన...ఎక్కడన్నా ఆక్సిడెంట్ చేస్తాడేమో అని నాకు టెన్షన్ పట్టుకొంది...ఎందుకొచ్చిన గోలరా బ్రతికుంటే దేవి-చౌక్ లో దుప్పట్లు అమ్ముకొని బ్రతకొచ్చు, ఇప్పుడు ఈ డ్రైవర్ గాడు మందు మత్తులో ఒక్కసారి తూలాడంటే కాసేపట్లో అందరం యమలోకం ఎంట్రన్స్ పాస్ లు తీసుకోవాల్సి వస్తుంది...ఒక్కసారిగా రమణగాడి మీద కోపం వచ్చింది..యాభై డిగ్రీల సెల్సియస్ తీవ్రతతో వాడివైపు చూసా...ఆ చీకేసిన టెంక మొహంగాడు నోరు తెరుచుకొని నిద్రపోతున్నాడు...ఆల్రెడీ అప్పుడే ఒక నాలుగు అయిదు ఈగలు ఆడి నోట్లో కాపురం పెట్టాయి....ఛీ నా బతుకు నన్ను నేను తిట్టుకున్నాను...శీనుగాడు ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు, బహుశా రేపు జావా ల్యాబ్ లో చేయ్యోబోయే ప్రోగ్రాం లాజిక్ అనుకుంటా...ఈ చెత్తనాకొడుకులకి కొంచెం కూడా టెన్షన్ లేదే...ఇలా నా ఆలోచనలు సాగుతుండగా ఎదురుగా ఓ లారీ విసురుగా మా లారీకి ఎదురుగా వచ్చింది...అంతే..స్మాష్ అనుకున్నా...
"ఒరేయ్ డ్రైవర్ గా...ఇంతవరకు ఒక్కసారికూడా పెళ్లి కాలేదురా...కనీసం అమ్మాయిని దెగ్గరగా కూడా సూడలేదురా...ఇంత బతుకుబతికి ఈ లారీలో ఇటునుంచి ఇటే పైకి పంపుతావ్ రా...అట్ లీస్ట్ బీర్ టేస్ట్ ఎట్లుంటదో కూడా సూడలేదు రా ...ఆ గుడ్దోడిని ముసుగేసి కుమ్మేద్దామనే ప్లాన్ అయినా అమలు చెయ్యలేదు రా..." ఆ ఒక్క సెకండ్ లోనే నా ఆలోచనా స్రవంతి అలా  సాగింది...నా జీవితం మీద ఉన్న తీపి గుర్తొచ్చింది...నా బకెట్-లిస్టు మొత్తం అర్థం అయ్యింది...కాని రెండు లారీ డ్రైవర్స్ సడన్ బ్రేక్ వేసి...రెడీ గా ఉన్న యమలోకం పాస్ లు రద్దు చేసారు...ఆ సడన్ బ్రేక్ తో రమణ గాడు తూలి డ్రైవర్ కాళ్ళ దెగ్గర పడ్డాడు...ఆయుష్మాన్ భావ అని డ్రైవర్ అన్నయ్య రమణ గాడిని దీవించాడు స్టీరింగ్ తో...ఒక్క కట్ కొట్టే సరికి మళ్లీ సీట్ లో వచ్చి పడ్డాడు రమణ....మళ్ళీ బండి కదిలింది...మళ్ళీ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని కూర్చున్నాను నేను...ఈ సరి నాతో పాటు రమణ, శీను కూడా...రమణగాడు తన నోట్లో కాపురమున్న ఈగల్ని ఖాళి చేయించడంతో అవి మా చెవుల చుట్టూ తిరగడం మొదలెట్టాయి.... శీనుగాడి ఏకాగ్రత మొత్తం జావా మీద నుంచి తార రోడ్ మీద నిలిచింది...డ్రైవర్ అన్నయ్య  కాలేజీకి తీసుకొచ్చి ఆపాడు బండి..వెంటనే దిగేసి 'హమ్మయ్యా ఇక మన ప్రాణాలకి ప్రమాదం లేదు' అన్న చిన్న హామీ ఇచ్చుకున్నాం మాకు మేము...నేను యాభై నోటు డ్రైవర్ అన్నయ్య చేతిలో పెట్టాను..'హీ డిసెర్వ్ మోర్ దెన్ దిస్.' అనుకున్నా....టైం చూస్తె పదకొండు అయింది అంతే...కానీ ఈ ప్రయణం ఎన్నో గంటలు చేసిన ఫీలింగ్ కలిగింది...

"...............అప్పుడు శిరీష నన్ను తనని ఒంటరిగా ఎవరూ చూడకుండా కలవమన్నది...నాకెందుకో అర్థం కాలేదు...కానీ తన కళ్ళలో నా మీద ఉన్న ప్రేమ చెప్పకనే చెపుతుంది నేనంటే తనకి ఎంత ఇష్టమో...తనని ఒంటరిగా కలిసా..ఆమె నా చేతులో ఒక లెటర్ పెట్టి వెళ్ళిపోయింది...ఆ లెటర్ చూసాక నా కళ్ళ వెంబడి నీరు ఆగలేదు." అని చెప్పి ఆపేసాడు లక్ష్మణ్ గాడు...
"తార్వతా.." అడిగాను..
"నిద్రొస్తుంది..." అన్నాడు...
నాకు చిర్రెత్తింది..వెంటనే అక్కడ ఉన్న ఇనుప రాడ్ తీసుకొని ఆడి తల బద్దలు కొట్టాలనే వైలేంట్ అయిడియాలు వచ్చాయి..."నీ సత్తర ఫేస్ లో నా తాడు....ఇంకెన్ని రోజులు చెప్తావ్ రా పిచ్చికాక్ నీ తొక్కలో లవ్ స్టొరీ...." అరిచేసా గట్టిగా శీనుగాడి కాపీరైట్ తిట్టుని వాడేస్తూ...ఆడి నిద్రాదేవత ఆడిని తెగ లవ్ చేస్తుందనుకుంటా, వెంటనే నిద్రపోయాడు....
నా నిద్రదేవత వైపు చూసా...'నేను నీకు అంత ఈజీగా లొంగను రా.." అన్నట్లు చూస్తుంది....
"ఎగస్ట్రాలు ఆపి రా..." అన్నాను సీరియస్ గా...
"పో వోయ్....అరిస్తే వస్తానా...కాసేపు బతిమిలాడుకో..." అంది...
"ఏందే బతిమిలాడేది నీ సత్తర ఫేస్ లో నా తాడు....రాకపోతే పో...సివరికి నీక్కూడా లోకువయ్యానే...కాలేజ్ లో మంచి అమ్మాయిని లైన్ లో పెట్టుకుంటా అప్పుడు నీ ఆటలు ఎలా సాగుతాయో చూస్తా..." అన్నాను...
"వద్దు బాసూ...నాకు అన్యాయం చెయ్యొద్దు....నువ్ లవ్ లో పడితే నన్ను అసలు దెగ్గరికి రానివ్వవు...అసలు నిద్రే వద్దంటావ్...వచ్చేస్తున్నా ఉండు...."

26 comments:

మంచు పల్లకీ said...

భలే రాస్తున్నావ్ బాసు.. లాస్ట్ డైలాగ్ బావుంది. Good Going

sunita said...

హహహ!బాగుంది.

Anonymous said...

ha ha ha.....chaala bagundi....merila post cheyangane chadivesanu....mee slang inka bagundi111

నేస్తం said...

బాగా రాసావు కిషన్ ..ఉదయాన్నే భలే నవ్వించావ్ :)

మురళి said...

ఇవాళే మీ బ్లాగు చూశానండీ.. చాలా బాగా రాస్తున్నారు... బ్యాక్ గ్రౌండ్ కలర్, ఫాంట్ వీలయితే మార్చండి.. కళ్ళకి కొంచం ఇబ్బందిగా ఉంది... మీకు అభినందనలు..

Kishen Reddy said...

@ మంచుపల్లకి, చాలా థాంక్స్ అండి...
@ సునీత, ధన్యవాదాలు....
@ Anonymous, మీ పేరు తెలిపితే బాగుండేది...థాంక్స్ అండి...

Kishen Reddy said...

నేస్తం, థాంక్స్ అండి...సో ప్రొద్దున్నే మిమ్మల్ని నవ్వించాననమాట....నా పోస్ట్ ధాన్యం అయినట్లేగా మరి...

మురళి గారు, ధన్యవాదాలు....బ్యాక్ గ్రౌండ్ కలర్ , ఫాంట్ మార్చుతాను త్వరలోనే...మీలాగే చాలా మంది అడిగారు మార్చమని...

సుభద్ర said...

బాగు౦ది కిషన్..హస్యచతురత ,టైమి౦గ్ బాగు౦ది.
మీ స్టైల్(పోటో) లో యువ సినిమా రాజకీయనాయకుడు కనిపి౦చాడు.
ఏ౦టి బ్లాగ్ లూక్ మార్చారు..మురళిగారి మాటే నా మాట కళ్ళు నోప్పిపేడుతున్నాయి చదవటానికి..కాని బాగు౦ది అని చివరవరకు చదివాను.

Kishen Reddy said...

సుభద్ర గారు, థాంక్స్ అండి..ఖచ్చితంగా బ్లాగ్ లుక్ మళ్ళీ మార్చేస్తా మీరందరూ చదవగలిగేలా వీలుగా....యువలో రాజకీయ నాయకుడిలా ఉన్నానా?..హహ థాంక్స్ సుభద్ర గారు...ఇదొక మంచి కాంప్లిమెంట్ నాకు :)

శేఖర్ పెద్దగోపు said...

బాగుంది బాస్..ఇలా అర్ధరాత్రి పూట సినిమాలు చూసి పాములు తిరిగే పొలాల గట్ల వెంబడి నడుచుకుంటూ రూం కి వెళ్ళటం మాకూ అనుభవమే...

Kishen Reddy said...

శేఖర్ గారు థాంక్స్....ఇలాంటి అనుభవాలు చాలామంది స్టూడెంట్స్ కి అనుభవైకవేద్యమే అనుకుంటా :)

priya... said...

ha hha bagundi ramu...me ardharatri ontari magavala nadaka gurinchi...asale andamina pellikani pillala???abbo...chala baga narrate chesav nd adenti sushmitha ni vadili nidra devatha nu pattu kunna papam tanu kuda bale na??? hahaha...very nice post nd a tadu tittu baga nachindi artam kaka poina....carry on...

sivaranjani said...

asale Rajanagaram lo rendu collage lu kuda ooriki duram ga untayi. ayyayyo ontari maga pillalu cinema kosam entha risk chesaru ?

Kishen Reddy said...

Priya...apudu inka sushmita naku parichayam kaledhu...this happened when am in first btech.


Ranjani, nijame kada asale ontari magapillalam enta risk chesamo kada...maa daring n dashing attitude alantidi mari :)

నేస్తం said...

అవునా కిషన్ ఎన్ని బస్తాల ధాన్యం అయ్యింది..మా ఇంటికొక బస్తా పంపుతావా :P

Kishen Reddy said...

నేస్తం, ఏదో Google Transliterator నా వల్ల చేయించిన తప్పు వల్ల ధన్యం కాస్తా ధాన్యం అయి కూర్చోవడం వల్ల మీరు నన్ను ఇలా ఇంటికి ధాన్యం పంపమనడం ఎమన్నా భావ్యమా??... :(.... సరే ఎన్ని బస్తాలు కావాలో చెప్పండి నా ధన్య ధాన్యాన్ని పంపిస్తా :)

వెన్నెల said...

హ్హ... హ్హ.... హ్హ ...
సారి సార్ ఈ నాలుగు రోజులు ఊరిలో లేను కదా ! అందుకే మీ 'పిచ్చికాక్ లవ్ స్టొరీ...' చదవలేదు.
తిరిగొచ్చాక చదవడానికి,ఆ తరువాత నవ్వడానికి,ఇంత టైం పట్టింది.
అందుకే కమెంట్
అయ్యింది లేట్

'ఇంతకీ ఆ కమెంట్ ఏంటీ '? అనా మీ సూపుకు అర్దం చెప్పగా

" హ్హ... హ్హ.... హ్హ ... "

Kishen Reddy said...

వెన్నెల నా సూపుకు అర్థం చెప్పిన మీ కామెంట్ అదిరింది....ఇంతకీ నేను మీకు సార్ ఎలా అయ్యాను వెన్నెల.....ఊరిలో బాగా ఎంజాయ్ చేసావా మరి....గుడ్...

వెన్నెల said...

సార్ అనేది గౌరవ సూచకం బాబూ ...
ఇంక ఊరంటారా !
వెళ్ళింది మీరు చెప్పే ఆ గోదారి గట్టుకే (ధవళేశ్వరం).
ఎంజాయ్ ఎలా చేసానంటే ... ముందే చెప్పానుగా....
పున్నమి రోజు, అర్దరాత్రి, పండు వెన్నెల్లో గోదారిలో మునుగుతూ తేలుతూ ఉంటే .... ఎలాఉంటుందో........ మీకు నేను వేరే చెప్పాలంటారా !?

వెన్నెల said...

సార్ అనేది గౌరవ సూచకం బాబూ ...
ఇంక ఊరంటారా !
వెళ్ళింది మీరు చెప్పే ఆ గోదారి గట్టుకే (ధవళేశ్వరం).
ఎంజాయ్ ఎలా చేసానంటే .... ముందే చెప్పానుగా....పున్నమి రోజు, అర్దరాత్రి, పండు వెన్నెల్లో గోదారిలో మునుగుతూ తేలుతూ ఉంటే .... ఎలాఉంటుందో........ మీకు నేను వేరే చెప్పాలంటారా !?

Kishen Reddy said...

నాకు అంత గౌరవం వద్దులే వెన్నెలా...
ఏంటి పున్నమి రోజు, అర్థరాత్రి, పండు వెన్నెల్లో గోదావరిలో మునిగి తెలావా...సూపర్....నాకు ఇప్పుడే గోదారి గట్టుకి ఎల్లాలనిపిస్తుంది....మనిషికి రెక్కలు ఉంటె బాగుండు అని ఇలాంటి టైంలో నాకు అనిపిస్తుంటుంది...

Janardhan said...

దాదాపు ఒక వారం క్రితం చూశా ఈ బ్లాగ్ ని. అప్పటినుంచి ప్రతి పోస్ట్ ని ఐదారుసార్లు చదివాను. మన కాలేజీ డేస్ గుర్తుకొచ్చాయి. నన్ను చాలా బాగా ఆకట్టుకొంది. ముఖ్యంగా నువ్వు వాడిన పదప్రయోగాలు చాలా బాగున్నాయి. కొంపతీసి సినిమా రైటర్ అవతారం ఎత్తబోతున్నవా ?

"...ఆ స్వీట్ వాయిస్ కి నాకు జలుబు చేస్తుందేమో అనిపించింది..."
"బాసూ అబ్దుల్ కలాంగారు చెప్పినట్లు...కల నిజం చెయ్యలేవా..??"
సూపర్........................

Kishen Reddy said...

Janardhan, am really impressed seeing ur comment dude...Thanks a lot for the encouragement...
Well, i love script writing n donno abt my future relating to this activity as of now....
keep visiting my blog n keep commenting..

Janardhan said...

నువ్వు ఖచ్చితం గా అవుతావు...ఆ విషయం మేమంతా ఎప్పుడో చెప్పాం. కాని నువ్వు సాఫ్టువేర్ జాబు చేస్తుంటే రాయడం మనేసావేమో అని అనుకున్నాం.
all the best ....

కొత్త పాళీ said...

well done

Kishen Reddy said...

కొత్తపాళి గారు ధన్యవాదాలు :)