Search This Blog

Tuesday 8 March, 2011

కావాలి మీ సలహా

ఈ మధ్య ఓ రోజు తెల్లవారు ఝామునే పదింటికి లేచి నా పిల్లో వైపు చూసుకొని "కెవ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్ ...." అని అరిచాను ... మాంచి ఘాడ నిద్రలో ఉన్న నా రూమ్మేట్ దెబ్బకి లేచి పిచ్చి చూపులు చూసి బుర్ర గోక్కొని మళ్ళీ పడుకున్నాడు... నేను మాత్రం అలానే విస్మయంతో పిల్లో వైపు చూసుకుంటూ "ఇలా పిల్లోకి ఇంస్టాలుమెంటు పద్దతిలో రోజుకి కొంత జుట్టు ముట్టజెపితే రేపు ఏ పిల్లయినా నా వైపు చూస్తుందా?" అనే భయంకరమైన ఆలోచన రాగానే విస్మయం కాస్తా బాధగా రూపాంతరంచెంది కన్నీళ్లుగా ధ్రవీభవించి ధారాపాతంగా కారి పిల్లో తడిచింది...

ఆ తరువాత తల దువ్వేప్పుడు దువ్వెనతో, స్నానం చేసేప్పుడు చేతితో, కంప్యూటర్ ముందు పనిచేసేప్పుడు కీ బోర్డ్ తో నా జుట్టు మైత్రి కొనసాగించి నాకు ముచ్చెమటలు పట్టించడం మొదలెట్టింది. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, భొంచేసేప్పుడు, చివరికి నిద్రపోయేప్పుడు కూడా నా ఆలోచనలు నా జుట్టు మీద కేంద్రీకృతం అయ్యేవి. ఒక రోజు అర్థరాత్రి ఉలిక్కిపడి లేచి "కెవ్వ్ వ్వ్ వ్వ్ ..." అని మళ్ళీ అరిచాను... నా మిత్రుడు మళ్ళీ లేచి పిచ్చి చూపులు చూడటం మొదలెట్టాడు "నువ్వెక్కడ దొరికావురా సేతురాజా...ఆ చూపెంట్రా దెయ్యాలని దడిపించే వాడిలా" అనేసరికి పాపం బాబ్బున్నాడు.. నేను మెల్లిగా వణికే చేతులతో "దేవుడా దేవుడా .." అనుకుంటూ నా తలని తడుముకున్నాను... హమ్మయ్యా నా జుట్టు అలాగే ఉంది ... బట్టతల రాలేదు ... జరిగిన విషయం ఏమిటంటే, అప్పుడే నాకొక భయంకరమైన కల వచ్చింది నాకు బట్ట తల వచ్చినట్లు.. నా సీట్ పక్కన ఉండే బట్టతల కొలీగ్ నాతో "ఒక బట్టతల వాడి మానను మరో బట్టతలోడికే తెలుస్తుంది... బాధపడకు.. ఏది శాశ్వతం గనుక" అని నన్ను ఓదార్చుతున్నట్లు పీడకల వచ్చింది... అందుకే వెంటనే తడిమి చూసుకున్నాననమాట...

ఆ రోజు ప్రొద్దున్నే గట్టిగా సంకల్పించుకున్నా 'నా జుట్టు రాలడాన్ని అరికట్టి, నా కేశాలను అందంగా ఆరోగ్యంగా ఉంచుకొని ... కేకలు అరుపులు పుట్టించి భూకంపం సృష్టించాలి' అని. వెంటనే ఒక ప్రణాళిక సిద్ధం చెయ్యాలి అనుకున్నాను.అసలు జుట్టు ఎందుకు రాలుతుంది అనే విషయం మీద సరైన అవగాహనకి రావలనుకున్నాను. ఆఫీసుకి వెళ్ళగానే గూగుల్ ఓపెన్ చేసి "జుట్టు రాలుటకు కారణాలు?" అని అడిగాను ... పాపం గూగుల్ కష్టపడి ఎన్నెన్నో వెబ్ పేజీలు వెతికి కొంత సమాచారం నా ముందుంచింది... అవన్నీ చదివి, జుట్టు రాలుటకు ముఖ్యమైన కారణాలు నోట్ చేసుకున్నాను ఇలా:


1. తీసుకునే ఆహరంలో పోషక విలువలు లేకపోవడం వల్ల.
2. విపరీతమైన కాలుష్యం వల్ల.
3.  జెన్యు పరమయిన కారణాల వల్ల.
4. హార్మోనుల సమతుల్యం లోపించడం వల్ల.
5. ధూమపానం, మద్యం సేవించండం వల్ల.


ఆ పై లిస్టులో నాకు ఏవేవి వర్తిస్తాయి అనేవి బేరీజు వేసుకున్నాను.
నేను తీసుకునే ఆహరం గురుంచి ఓ  సారి ఆలోచించడం మొదలెట్టాను. బ్రేక్ ఫాస్టుకి ఈ అరవ వాళ్ళ ఇడ్లీ సాంబారో లేక దోసో ఏదోకటి తీసుకుంటాను... ఇక మధ్యాహ్నం ఆంధ్ర మెస్సులో ఫుల్ మీల్స్... డిన్నర్ కి చపతీనో దోసో ఏదోకటి లాగించేయ్యడం ... అసలు ఈ నా తిండిలో ఏమైనా సరైన పోషక విలువలు ఉన్నాయా? అని ప్రశ్నించుకున్నాను .. నా తిండిలో కార్బోస్ తప్పితే సరైన పోషకాలు లభించడం లేదని అర్థమయ్యింది ... కనుక ఫుడ్ రొటీన్ మార్చాలి ... జుట్టి రాలకుండా ఉండాలంటే ఏమేమి తినాలి అంటూ మళ్ళీ గూగుల్ నే అడిగా .. అప్పుడది తినే ఆహరంలో ప్రోటీన్స్ బాగా ఉండేలా చూసుకోవాలి అని చెప్పింది.. అలాగే విటమిన్ ఏ, బీ కాంప్లెక్స్, సీ కూడా ఉండేలా చూడాలి అంది. ఇవన్నీ పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం మొదలగు వాటిలో లభిస్తాయి అని తెలుసుకొని ఇక ఆహరంలో అవి ఎక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి అనుకున్నాను. అనుకున్నదే తడవుగా స్పెన్సర్స్ కి వెళ్లి రకరకాల పండ్లు, కూరగాయలు, సెరిల్స్, సోయా మిల్క్ పౌడర్, వీట్ బ్రెడ్ లాంటివి కొనుక్కొని బిల్లు తడిపేసుకొని వచ్చాను...తర్వాత నా రోజూ వారి దినచర్య (తిండి) ఈ విధంగా మలిచాను:


బ్రేక్ ఫాస్ట్: ఒక ఉడకబెట్టిన కోడి గ్రుడ్డు + 4 వీట్ బ్రెడ్ ముక్కలు + సోయా మిల్క్ + ఒక యాపిల్ + ఒక దానిమ్మ.
లంచ్: రెండు రోటి + ఏదన్నా పచ్చి వెజిటబుల్
డిన్నర్: పేర్ ఫ్రూట్ (దీన్ని తెలుగులో ఏమంటారో?) + సెరిల్స్


ఇదన్న మాట.. ఇలా నా రోజువారి తిండికే సగటున రెండు వందలు దాటిపోయేది... ఈ పై తిండి ప్రణాళిక ఎన్ని రోజులు అమలు చేశాను అన్నది మీరు అడగకూడదు అన్నమాట :)


ఇక ఆ లిస్టులో కాలుష్యం, జెన్యు పరమైన కారణాలు నాకు పెద్ద వర్తించవు... హార్మోనుల సమతుల్యం గురుంచి నో కామెంట్స్... ధూమపానం నో వే...


నా ఫ్రెండ్స్ ని కొంత మందిని అడిగితే కొన్ని సూచనలు చేసారు... మింటాప్ వాడమన్నారు.. అది వాడాను... ఒక వారంలోనే భయంకరమయిన సైడ్ ఎఫెక్ట్స్ తో నన్ను భయపెట్టింది...అంతే దెబ్బకి మానేసాను... ఆ తర్వాత న్యుజన్ హెర్బల్ ఆయిల్ వాడను ఒక నెల.. ఆ తర్వాత టీవీలలో దాని మీద రకరకాల చర్చల జరగడం మూలాన, ఉన్న జుట్టు కూడా ఊడితే కష్టం అని తలచి దాన్ని మానేసాను... ప్రస్తుతం పేరాషూట్ థెరపీ వాడుతున్నాను... ఇది ఓ మాదిరిగా పర్లేదు ... ఈ మధ్య నా స్నేహితుడు ఒకడు నేను ఎప్పుడూ వినని వైద్యం చెప్పాడు.. అదేమిటంటే, రోజూ ప్రొద్దున్నే స్కాల్ప్ మీద చిన్న ఉల్లిపాయాలని నలిపి ఆ రసంతో మర్దన చెయ్యాలట .. అలా చేసి ఒక అరగంట ఉంచి స్నానం చెయ్యాలంట... ఇది ఎంత వరకు నిజమో నాకు తెలిదు.. గూగుల్ లో వెతికితే, అలా చెయ్యొచ్చు అని చెప్పింది.. కానీ ఇంకా నేను దీన్ని అమలు పరచలేదు ...


కనుక మై డియర్ బ్లాగ్మిత్రులారా... మీ అమూల్యమైన సలహాలను సూచనలను నాకు తెలిజేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను... నాలాగా ఈ జుట్టు రాలడం అనేది చాలా మంది ఎదురుకున్నదే కాబట్టి మీ సలహాలు సూచనలు నాకు ఏంతో ఉపయోగ పడతాయి...



11 comments:

ఇందు said...

ఇన్ని చెప్పిన గూగులయ్య నీకు 'ఆలివ్ ఆయిల్ ' గురించి చెప్పలేదా? ఆలివ్ ఆయిల్ రోజు వాడు కిషన్! అలాగే అలోవెరా మొక్క తెచ్చుకుని...దాని జ్యుస్ తలకి పట్టించి గంట ఆగి స్నానం చేయి [వీకెండ్స్ బెటర్]...ఇంకా...రోజు ఏదో ఒక సిట్రస్ ఫ్రుట్ తీస్కో!సోయా ప్రొడక్స్ట్ వాడటం కంటిన్యు చెయీ! అలాగే...జుట్టు గురించి ఎక్కువ ఆలొచించకు.నువ్వు ఎంత ఆలొచిస్తే...అంత జుట్టూ రాలిపోతుందట తెల్సా! కాబట్టి ముందు జుట్టు గురించి వర్రీ అవడం మానెయ్! Ok na :)

Vineela said...

కిషన్ గారు..ఈ ఐరన్ సుప్ప్లిమేంట్ ట్రై చెయ్యండి..http://www.vitacost.com/Naturally-Vitamins-Marlyn-Formula-50

btw..ur blog is very addictive i tell you ;)) ee roju oka 3 hours chadivesa mee patha post lu..

sunita said...

అసలు ఆ చెన్నై లొ వాడే నీరు హార్డ్ వాటర్ ఏమో చెక్ చెయ్యండి ముందు. హార్డ్ వాటర్ కు కూడా జుట్టు వేగంగా ఊడిపోతుంది.తలవరకూ అవసరమైతె మినరల్ వాటర్ తొ శుభ్రం చేసుకోండి.హార్మోన్స్ చూసుకోవాలిసిందే బాస్. ఇందూ సలహా పాటించండి. హబీబ్ హైర్ క్లినిక్ చెన్నై లొ ఉంటే ఓ కన్సల్టేషనుకు వెళ్ళి ఇంకోసారి పర్సు తడుపుకోండి.

గిరీష్ said...

subram ga prathi aadivaram thalaki kobbarinune rasukunte ye badha undadu :)

శివరంజని said...

హహహ గూగులమ్మ ఇచ్చిన రీజన్ 5 పై విషయం లో వీలయినంత శ్రద్ద తగ్గించండి ...( just joke ... no offense plzzz)


చెన్నై లో పొల్యుషన్ ఎక్కువ అంటారు కదా మీ జుట్టు ఊడిపోవడానికి కారణం అదే అయి ఉంటుంది ...cap వాడండి .... ఐరన్ సప్ప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల జుట్టు ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా ఊడిపోతుంది అంటారు మరి ...హెర్బల్ షాంపూస్ వాడండి

voleti said...

జుట్టు బాగా పెరుగుటకు కాస్త అమ్మోనియా తదుపరి సూపర్ ఫాస్పేటు బాగా వాడితే ఒక వారం రోజుల్లోనే శుభ్రంగా వరి పైరు లాగే పెరుగుతుంది.. కావాలంటే డిడి 8 లో వచ్చే పంటల కార్యక్రమం చూడండి...మీ మిత్రుడు మీరు అరిచే అరుపులకు రియాక్ట్ కాకుండా వుండాలంటే.. నిద్ర పోయేటప్పుడు.. కాస్త నిద్ర మాత్రలు ఇస్తే సరిపోతుంది.. బట్టతల సంఘం వాళ్ళని సంప్రదిస్తే, మీ పెళ్ళి సంగతి వాళ్ళు చూసుకుంటారు..

Sirisha said...

ayina blr velipotunnav annav ga krish inka leda?.. juttu gurinchi no idea...mundu neelane nenu aricha...ippudu alavatu ayipoyindi...so potey poni pora ani lite tisukunna.. :P

SHANKAR.S said...

రామకృష్ణా,
వచ్చిన జుట్టు రాలక తప్పదు
రాలిన జుట్టు తిరికి రాకా తప్పదు
అశాశ్వతమైన ఈ బొచ్చు కోసం
చింతించుట మానవులకు తగదు

(బ్లగవద్గీత 19 వ అధ్యాయం 128 వ పద్యం )

ఇది చదివిన తర్వాత కూడా జ్ఞానోదయం కలగకపోతే నేషనల్ జియోగ్రఫీలో సింహాల లైఫ్ స్టైల్ చూసి ఫాలో అయిపోండి. బట్టతల ఉన్న మగ సింహాన్ని (జూలు రాలి పోయిన) నేను ఇంత వరకూ చూడలేదు. :)

మిరియప్పొడి said...

మీరేంటండీ ఇంకా యంగ్ లాగనె ఉన్నారు గదా. అప్పుడే ఇంత వర్రీసా?

మనసు పలికే said...

హహ్హహ్హా కిషన్ గారూ...:))

వోలేటి గారి వ్యాఖ్య చదివి ఎలా నవ్వుకున్నానో నాకే తెలీదు..:))
>>జుట్టు బాగా పెరుగుటకు కాస్త అమ్మోనియా తదుపరి సూపర్ ఫాస్పేటు బాగా వాడితే ఒక వారం రోజుల్లోనే శుభ్రంగా వరి పైరు లాగే పెరుగుతుంది.
కెవ్వు కెవ్వు..:)) నేను మాత్రం ట్రై చెయ్యను..

Unknown said...

common quick get married.it is only the solution.