Search This Blog

Monday, 26 October 2009

A క్యూట్ లవ్ స్టొరీ with బట్టర్ స్కాచ్ topping....

"ఒసేయ్...నా మాథ్స్ నోట్స్ ఇవ్వవే పందిదాన...రెండు రోజులనుంచి ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తున్నావానే దున్న..!!" ..మాటలు మాస్ గా అనిపించినా అవి పలికించిన గొంతు కాకినాడ కాజా కన్నా తియ్యగా అనిపించడంతో వెనక్కి తిరిగి చూసాను...

సీతాకోకచిలుకకి అన్ని రంగులు అలమిన దేవుడు...మయూరానికి అందాల పించాలు అతికించిన ఆ పైవాడు..నల్లటి కోయిలకి తియ్యటి గాత్రాన్ని వరమిచ్చిన ఆ సర్వాంతర్యామి...ఈ అమ్మాయిని తయారుచేయడానికి వీటన్నిటికన్నా ఎక్కువ శ్రద్ధ చూపించాడేమో అనిపించింది ఆ అమ్మాయిని చూడగానే...ఆమె వేసుకున్నతెలుపు చూడిదార్ మీద పువ్వుల ఎంబ్రాయిడరి సింపుల్ గా ఉంది..కాదు...ఆమె వేసుకోడం వల్ల సింపుల్ గా ఉన్నడ్రెస్ కి విలువ పెరిగిందేమో...అందుకేనేమో అంత విలువ చెయ్యని దుస్తుల్నికూడా సినిస్టార్స్ తో వేయించి వాటికి వేలకి వేలు ధర నిర్ణయిస్తారు..నా ఆలోచనలు ఇలా ట్రేడ్ సీక్రెట్స్ వైపు మళ్ళుతుండగా ఆమె తన ఫ్రెండ్స్ తో పాటు నన్నుదాటుకొని వెళ్ళిపోయింది నుదుటిపై పడ్డ కురులని సవరించుకొంటూ...అదోలాంటి మత్తుగోలిపే అరోమా నన్ను తాకి వెళ్ళిపోయింది...ఆమెతో పాటే సాగుతూ పదిమందికి సువాసన పంచుతున్నఆ పెర్ఫుమ్ జీవితం ధన్యం...అది ఏ కంపెనీదో...
"హై-టెక్..."
"ఏంటి..." చిరాగ్గా చూసాను.. ఎప్పుడొచ్చాడో తెలీదు కాని నా ముందు నిల్చున్నాడు శీనుగాడు పుస్తకం చూపిస్తూ..
"అదేరా...నిన్నజావా కోసం హై-టెక్ సిరీస్ బుక్ అడిగావ్ కదా...సత్య దెగ్గర తీసుకొచ్చా..." అన్నాడు
ఓహొ అన్నట్లు తలూపాను..."ఇక్కడేం చేస్తున్నావ్...పదా గుడ్డోడి క్లాసు ఇప్పుడు..." అంటూ లాక్కెళ్ళాడు..

గుడ్డోడు అంటే మా ప్రిన్సిపాల్...వాడు గుడ్డోడు కాదు గానీ...నా వైపు చూస్తే నా పక్కన వాడి వైపు చూస్తున్నట్లు అర్థం..మొదట్లో ఈ విషయం తెలియనప్పుడు ఓ సారి నా వైపు చూస్తూ "గెట్ అవుట్ అఫ్ మై క్లాస్.." అన్నాడు ..ఎందుకన్నాడో అర్థం కాకపోయినా పైకి లేచాను వెళ్దామని, అసలే క్లాస్ తెగ బోర్ గా ఉంది.."నువ్వు కాదు..." అంటూ నా కుడి వైపు ఉన్నవాడి వైపు చూస్తూ..."యు గెట్ అవుట్ ..." అంటూ నా వైపు చూసాడు...లేచింది నేనయితే నా పక్కన వాడిని నువ్వు కాదు అంటాడెంటి...మళ్లీ లేచి వెళ్లబోయాను..."ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు కాదు.." నా పక్కన వాడిని ఉరిమి చూసాడు..వాడు దెబ్బకి వణికిపోయాడు.."యు గెట్ అవుట్ ఇడియట్..."అంటూ మళ్లీ నా వైపు చూసాడు...నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది..నేను అలాగే నిల్చున్నాను.."హౌ డేర్ యు...నా మాటే వినవా.." అంటూ ముందుకి వచ్చి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ నా ఎడమ ప్రక్కన ఉన్నవాడి ముందు బెంచ్ మీద దబా దబా కొట్టాడు...నేను అతని కళ్ళలోకి తీవ్రంగా చూసా, అప్పుడు అర్థం అయింది వాడికి అదో టైపు మెల్ల కన్ను అని..అసలు గెట్ అవుట్ అన్నది నా ఎడమ ప్రక్కన వాడిని...కాని హడలు కొట్టింది మాత్రం నన్ను నా కుడి ప్రక్కన వాడిని....

"ఏటి ఎంకన్న రోజురోజుకి సాంబార్ కాస్తా గోదావరి వాటర్ అవుతున్నాయి...దీనికన్నా రసమే బెటర్ ఏమో...అంతేకదరా?" అన్నాడు సీనుగాడు నా వైపు చూస్తూ సాంబార్ గెలుకుతూ...ఆడికి హాస్టల్ లో సాంబార్..కాలేజీ లో జావా తప్ప ఇంకేం పట్టవ్..
"ఈ రోజు కాలేజీలో ఒక అమ్మాయిని చూసారా...షీ ఈజ్ ఆసం..." అన్నాను ఏమంటాడో అని..

"ఆసమా....అదేం పేరురా...!!" ఎదవ మొహం ఏస్కోని చూసాడు నావైపు...
"నీ మొహం...ఆసం అంటే, అది ...కత్తిలా ఉందని అర్థం..." చెప్పాను మా లాంగ్వేజ్ లో ..
"అవునా...." అని తింటున్న వాడల్లా ముఖం అదోలా పెట్టి.."ఛీ..ఇది పెరుగా..ఇంత పుల్లగా ఉంది..నిన్నటిది ఫ్రిజ్ లో పెట్టి ఈ రోజు వేసుంటారు...నీకెలా ఉంది.." అన్నాడు ఏదో అంతర్జాతీయ సమాఖ్యలో పేదరిక నిర్మూలనా చర్చలో ఎదుటి సభ్యుడి సలహా కోసం ఎదురుచూస్తున్నవాడిలా ముఖం పెట్టి...క్రూరంగా చూసాను వాడి వైపు...నా మనోవేదన అర్థంచేసుకున్నవాడిలా.."అయితే..ఆ అమ్మాయి ఎవరంటావ్.." అన్నాడు చివరికి...
"ఏమో తెలీదురా...చూడగానే చాలా నచ్చింది..."
"అవునా...సరేలే..కృష్ణాగాడిని రమణాగాడిని కూడా తీసుకొని వెళ్లి రేపు ఆ అమ్మాయి తో మాట్లాడతాం.."
"ఏమని?.." కంగారుగా అడిగాను...
"ఏముంది నువ్వంటే మా వాడికి ఇష్టం అని ఆ అమ్మాయికి చెప్తాం.." అన్నాడు ప్లేట్ అంచులు నాకి చేయి కడుక్కోడానికి లేస్తూ...
"ఇంకానయం...పెళ్లి చూపులకు వెళ్దాం అని చెప్పావుకాదు.." అన్నాను వ్యంగ్యంగా..
"మరేం చెయ్యమంటావ్ రా..." అన్నాడు కోస్చేన్ మార్క్ మొహం పెట్టి...
"ఏమీ చెయ్యొద్దురా..తొందరగా చెయ్యి కడుక్కో...మళ్లీ నువ్వు రూంకి వెళ్లి జావా మీద రీసెర్చ్ చెయ్యాలిగా.." అన్నాను....అవునన్నట్లు తలూపాడు...నాకు అక్కడున్న అంబూజా సిమెంట్ గోడకేసి తల బద్దలు కొట్టుకుందామా అనిపించింది...

ఓ మూడు రోజుల వరకు ఆ అమ్మాయి మళ్లీ నాకు కనిపించలేదు...నేను తనని చూసిన ప్రదేశంలో చాలాసార్లు వెయిట్ చేశా కానీ కనిపించలేదు...ఓ రోజు కాంటీన్ లో కూర్చొని కోక్ తాగుతుంటే "హలో సర్...కెన్ ఐ సిట్.." అని వినిపించిన మాటలవైపు తలెత్తి చూసాను ఆశ్చర్యంగా...నమ్మలేకపోయాను..ఇది కల ఏమో అనుకున్నా...కాదు నిజమే...నిజంగానే ఆ అమ్మాయి నా ఎదురుగా నిల్చుని ఉంది...అలాగే చూస్తూ ఉండిపోయాను.."జొల్లు కార్చడం ఆపి...ఆ అమ్మాయిని కుర్చోమను.." నాలో రోమేయో నిద్రలేచి సలహా ఇచ్చాడు.."ష్యూర్...కూర్చోండి..." అన్నాను ఇంకా ఇదంతా నిజంగా జరుగుతుందా అన్న విషయం ఖచ్చితంగా తేలక..."సర్ నేను మీ జూనియర్ ని...అండి అనకండి.." అంది కూర్చుంటూ...ఆ అమ్మాయి మాటలకి మంత్రముగ్దుడిలా అలాగే చూస్తుండిపోయాను...ఈ అమ్మాయి నా ఎదురుగా ఇలా...ఇలాగే కాలం ఆగిపోతే బాగుండేమో అనిపించింది..నేను ఏమీ మాట్లాడకపోయేసరికి...సారీ..మాటలు రాకపోయేసరికి మళ్లీ ఆ అమ్మాయే "సర్...అక్కడ దూరంగా కనిపించే ఇద్దరు సీనియర్ సర్ లు నన్ను రాగ్ చేస్తున్నారు...వాళ్ళు నాకు మిమ్మల్ని చూపించి మీ డీటైల్స్ అడిగి తెల్సుకొని రమ్మన్నారు...ఈ పువ్వు కూడా మీకు ఇవ్వమన్నారు.." అంటూ తన చేతిలో ఉన్న ఎర్ర గులాబి చూపించింది...ఎవరబ్బా ఆ సీనియర్లు అని చూస్తే రమణ గాడు..శీను గాడు ఉన్నారు...షాక్ కొట్టినట్లు అయింది నాకు...వీళ్ళకు ఈ అమ్మాయే అని ఎలా తెల్సు??..ఎదోకటిలే..ఐ ఓవ్ ఏ పార్టీ టు యు గైస్..అనుకున్నా..ఇదే మంచి టైం ఏదోక సొల్లు కొట్టి ఈ అమ్మాయి ముందు ఇంప్రషన్ కొట్టెయ్యాలి అని నాలో రోమియో తెగ సంబరపడుతున్నాడు...

"నీ పేరేంటి..." అడిగాను...
"సుస్మిత సర్..."...అబ్బో ఎంత సక్కటి పేరో..రోమియో గాడు పండగ చేసుకుంటున్నాడు...
"ఎస్.డి చెప్పాలా సర్.." అంది తనే మళ్ళీ...ఆ స్వీట్ వాయిస్ కి నాకు జలుబు చేస్తుందేమో అనిపించింది...
"అక్కర్లేదు సుస్మితా...నాకు ఈ ర్యాగింగ్ అంటే పడదు...జూనియర్స్ తో స్నేహంగా ఉండాలేకాని ర్యాగింగ్ అదీ..ఇదీ అని వాళ్ళని ఎడిపించకూడదు...నా వరకు అయితే ఎక్కడన్నా ర్యాగింగ్ జరుగుతున్నట్లు కనిపిస్తే వెంటనే వెళ్లి ఆపుతాను...ముఖ్యంగా అమ్మాయిలను ఎవరన్నా ర్యాగింగ్ చేస్తే నేను ఊరుకోను...పాపం ఎక్కడెక్కడినుంచో చదువుకోడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ పేరుతో హింసించడం పాపం కాదా?..." నా మాటలకు సుస్మితా నావైపు అభిమానపూర్వకంగా చూసింది..మాకు రెండు టేబుళ్ళ పక్కన కూర్చున్నవాడు మాత్రం క్రూరంగా చూసాడు...రెండు రోజులముందే వాడిని నేను క్రిష్ణాగాడు కల్సి ర్యాగింగ్ చేసాం...
"మీలా అందరూ ఆలోచిస్తే నిజంగా కాలేజెస్ విల్ బె ది బెస్ట్ ప్లేసెస్..." అంది నవ్వుతూ...ఆ అమ్మాయి ఇంకాసేపు అలాగే నవ్వితే నేనేమైపోతానో నాకే అర్థంకావడంలేదు...
"ఇందులో నా గొప్పతనం ఏముంది సుస్మి..." అని ఒక్కసారి ఆగాను ఆమె వైపే చూస్తూ నేనేమన్నానో గుర్తొచ్చి..
"మీరు నన్నుసుస్మి అని పిలవచ్చు సర్...నో ప్రాబ్లం...అఫ్కోర్స్ అలా నన్నునా పేరెంట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరూ పిలవరు...." అంది...
"సారీ సుస్మితా, నేను అలా పిల్చి ఉండకూదదేమో..." అన్నాను నోచ్చుకున్నవాడిలా...
"భలేవారే సర్...పాజిటివ్ గా ఆలోచించండి సర్...ఏమో మనిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వోచ్చేమో కదా...ఏం ఈ జూనియర్ తో స్నేహం చెయ్యరా...." అంది అందంగా నవ్వుతూ అక్కడున్నరోజా పువ్వు నా చేతికి ఇస్తూ...
ఒక్కసారిగా నాలోని రోమియో నానుంచి క్రిందకి దూకి "ఎగిరే మబ్బులలోనా...పగలే వెన్నెల వాన..గుండెల్లో సాగే రాగాలేవో..." అంటూ ఆమె ముందు వాలిపోయాడు...నాకేమో తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ లా ఎక్కడన్నాచెట్టుతొర్ర కనిపిస్తే "ఒన్ మినిట్ ప్లీజ్" అని చెప్పి ఆ తొర్రలో డాన్స్ వెయ్యాలనిపించింది..
"అంత భాగ్యం నాకుందంటావా..?" అన్నాను ఆమె కళ్ళలోకి చూస్తూ...
"ప్లెజర్ ఈజ్ అల్ మైన్ సర్..." అని నవ్వుతూ చూస్తూ.."మన స్నేహం సాక్షిగా ఇద్దరం ఒకే బట్టర్ స్కాచ్ ఐస్ క్రీంలో రెండు స్పూన్స్ వేసి తిందాం.." అని ఒక బట్టర్ స్కాచ్ ఆర్డర్ చేసింది...

"బాసూ ఫ్రెండ్షిప్ లో ఎవ్వరూ ఇలా ఒకే ఐస్ క్రీంలో రెండు స్పూన్స్ వేసి తినరు, బడ్జట్ వీక్ అయితే తప్ప...సో ఖచ్చితంగా తను నిన్ను ఫ్రెండ్ కంటే ఎక్కువగా అక్సేప్ట్ చేసింది..." అంటూ నా రోమియో నాకు ప్రేమోపదేసం చేశాడు..
"నిజమా...ఆయినా అమ్మాయిలు మొదటి చూపులోనే ఫ్లాట్ అయ్యే అంత సీన్ మనకు లేదు కదరా..." అన్నాను సందేహిస్తూ...
"ఏమో గురూ...ఈ అమ్మాయికి నీలో ఏం నచ్చిందో..." రోమియో గాడు కన్విన్స్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు..  
"అంతే అంటావా..." అన్నాను చివరగా..
"హలో సర్...ఐస్ క్రీం లేట్ చేస్తే కరిగిపోద్ది...మరి కానిద్ధామా..." అంది ఆమె స్పూన్ ఐస్ క్రీంలో ముంచుతూ...
"బట్టర్ స్కాచ్ ఇంత టేస్టీగా ఎప్పుడు అనిపించలేదు..." అన్నాను...ఆమె మధురంగా నవ్వింది...అప్పుడే..ఆక్షణమే తెలిసింది ఇక నాకు రాత్రి నిద్దుర ఉండదని...

ఆ రోజు నుంచి ప్రతి రోజు బస్సు స్టాప్ లో తన కోసం వెయిట్ చెయ్యడం..కల్సి కాలేజీకి వెళ్ళడం...కల్సి లంచ్ చెయ్యడం...ఈవెనింగ్ కల్సి స్నాక్స్ తినడం...ప్రతి గురువారం బట్టర్ స్కాచ్ తినడం విత్ టు స్పూన్స్  (గురువారం మేము కలసిన రోజు...)..మా రేలషన్ కి బట్టర్ స్కాట్చ్ అందించిన తియ్యదనం అంతా...ఇంతా కాదు...ఆ అమ్మాయి ఒక్కరోజు రాకపోతే నాకు ఏదోలా ఉండేది...ఓ రోజు రమణగాడు క్రిష్ణగాడు సినిమా ప్రోగ్రాం వేసారు వీక్ డేలో..నేను కాలేజీ వెళ్తాను అన్నా వినకుండా నన్ను ఎగోట్టేలా చేసి సినిమాకి తీసుకెళ్ళారు...మరుసటి రోజు సుస్మి నాకు బస్సు స్టాప్ లో ఎంత సేపు ఎదురుచూసిన రాలేదు...లంచ్ కి కలవలేదు...ఆ రోజు గురువారం..తనతో కల్సి బట్టర్ స్కాచ్ తినాలని కాంటీన్ లో ఎంత సేపు వెయిట్ చేసినా రాలేదు...చివరికి లేచి తిరిగి వెల్లిపోబోతుంటే అప్పుడు కనుపించిది సుస్మీ...తన కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయ్..

"సుస్మి...ఏమైందిరా...ప్రొద్దుటి నుంచి నీకోసం ఎంత వెతికానో తెల్సా..." అన్నాను...
"నీకు నేను ఒకదాన్ని ఉన్నాను అని గుర్తుందా..." అంటూ నావైపు చూసింది...తన కళ్ళలో నుంచి జాలువారిన నీటి బొట్టు..ఎర్రగా కందిన ఆమె బుగ్గపై నిల్చిన్న ముత్యంలా ఉంది...
"సుస్మీ..." అంటూ ఆమె దెగ్గరికి వచ్చాను...
"పో...నాతో అసలు మాట్లాడకు...నిన్న నీకోసం నేను పిచ్చిదానిలా కాలేజీ మొత్తం వెతికా...చివరికి మీ ఫ్రెండ్ సునీల్ ని అడిగితే ఫ్రెండ్స్ తో కల్సి సినిమాకి వెళ్ళావని చెప్పారు...నాకంటే నీకు మీ ఫ్రెండ్స్ తో సినిమా ఎక్కువ కదా...నీకు ఇష్టమని నేనే సొంతగా ఇంట్లో ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసి నిన్న నీకోసం తీసుకొచ్చాను తెల్సా..అందుకు నేను నిజంగా పిచ్చిదాన్నే.." అంది ధారాపాతంగా జారుతున్న కన్నీళ్లను తుడిచే వృధా ప్రయత్నం చేస్తూ...
"సారీ రా..." అన్నాను నా కళ్ళ వెంబడి కూడా కన్నీరు కారుతుందనే విషయం తెలియక...
"నువ్వెందుకు ఏడుస్తావ్...సరేలే ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు....పదా బట్టర్ స్కాచ్ తిందాం..." అంటూ కాంటీన్ లోపలికి తీసుకెళ్ళింది...
బట్టర్ స్కాచ్ తింటున్నవాడినల్లా ఆమె వైపు చూస్తూ.."సుస్మీ...మనం ఇంజనీరింగ్ అయ్యాక...మంచి జాబు తెచ్చుకొని అప్పుడు ఇద్దరం పెళ్లి చేసుకుందామా..." అని అడిగేసాను...అంత దైర్యం ఎక్కడనుంచి వచ్చిందో నాకు తెలీదు...బహుశా నా కోసం తపన పడిన ఓ అమ్మాయి కన్నీరు చూసాక వచ్చిందేమో..."నువ్వులేకపోతే ఒక్కరోజే ఉండలేకపోయినదాన్ని...నువ్వులేకుండా లైఫ్ అంతా ఎలా ఉండగలను రా..." (సర్ పోయి 'రా' ఎప్పుడో వచ్చేసింది)...

ఆ రోజుతో లైన్ క్లియర్ అయిన మాకు ఇక పట్టా పగ్గాలు లేవు...తన ప్రేమ నాకు రోజుకో కొత్త లోకం చూపించేది...తను ప్రతిరోజూ నాకు కొత్తగానే కనిపించేది...అప్పటినుంచి కాలేజీ మానేస్తే ఇద్దరం కలిసే మనేసేవాళ్ళం..ఎలా గడిచిపోయాయో ఏళ్ళు.. ఇంజనీరింగ్ అయిపొయింది...విడిపోయే రోజు ఇద్దరం చాలా బాధపడ్డం...కానీ త్వరలోనే కలుద్దాం అని నిర్ణయించుకున్నాం...తనకు విప్రోలో నాకు ఇన్ఫోసిస్ లో జాబు వచ్చింది...ఇద్దరం హైదరాబాద్ పోస్టింగ్....మా ప్రేమ విష్యం పెద్దలకు చెప్పగా వాళ్ళు వెంటనే అంగీకరించడం మా సూపర్ లక్....మే 24న మా పెళ్లి జరిగింది..

"హనీమూన్ కి సింగపూర్ అని నేను ...కాదు పారిస్ అని సుస్మీ..ఇద్దరికీ ఈ విష్యం లో ఒకటే గోల....ఏంచెయ్యాలి..."
నా మొహాన ఒక్కసారిగా చెంబెడు నీళ్ళు పడ్డాయి...."ఏం చెయ్యాలా??...వెళ్లి స్నానం చేసి కాలేజీ కి రెడీ అవ్వాలి..." అన్న మాటలు పలికిన వ్యక్తి వైపు వింతగా చూసాను...ఎదురుగా ఏబ్రాసి మొహం వేసుకొని శీనుగాడు....మైండ్ బ్లాక్ అయింది ఒక్క నిముషం...వాడి వైపే చూస్తున్నాను...
"నువ్విక్కడ ఏం చేస్తున్నావ్...మా ఆవిడ ఎక్కడ...సుస్మీ..."అంటూ అరిచాను...అది హాస్టల్ అని స్పృహ ఇంకా రాలేదు..
""మీ ఆవిడ ఇప్పుడే పుట్టింటికి వెళ్ళింది, ఇక తమరు లేస్తే కాలేజీకి వెళ్దాం.. .నీ ఎంకమ్మ నైట్ అంతా తొక్కలో కలవరింతలతో సంపావ్ గదరా....సుస్మి ఎవర్రా బాబూ....రాత్రి డిన్నర్ చేస్తుంటే ఒక అమ్మాయిని చూసాను అని చెప్పావ్..ఆ అమ్మాయి పేరు సుస్మీనా...ఒక్కరోజుకే అన్ని కలవరింతలా...." అన్నాడు నోరు సున్నాలా చుట్టి...ఒక పది పదిహేను నిమిషాలు పట్టింది ఈ లోకం లోకి రావడానికి...అదంతా కల అని తెలిశాక చాలా బాధేసింది...కాలేజీకి వెళ్ళబుద్ధి కాలేదు...కలలో నేను కాలేజీ మానేస్తే సుస్మీ ఏడ్చింది...ఇప్పుడు మానేసి మరుసటి రోజు వెళ్తే నా వైపు కూడా చూడదు...ఎందుకు చూస్తుంది..అసలు ఆ అమ్మాయి పేరు ఏంటో ??...నేను కలలో తగిలించిన పేరు సుస్మీ...ఒక్క రాత్రి కలలో ఒక క్యూట్ లవ్ స్టొరీ విత్ బట్టర్ స్కాచ్ టాపింగ్....సూపర్...

లంచ్ టైంలో ఆ అమ్మాయి కనిపించింది..వాళ్ల ఫ్రెండ్స్ తో లంచ్ చేస్తుంది...సుస్మీ నువ్వు నాతో కదరా లంచ్ చేస్తావ్ రోజూ...ఇప్పుడేంటి ఇలా...నా మనసుదొక గోల...రోమియో గాడు లేచి "బాసూ అబ్దుల్ కలాంగారు చెప్పినట్లు...కల నిజం చెయ్యలేవా..??" అన్నాడు..."కష్టం రా....విధి విచిత్రమైనది...కలలు అంత కన్నా చిత్రమైనవి...లేకపోతె కలలో అంత కెమిస్త్రీ ఉండి కూడా ఆ అమ్మాయి నేను ఎవరో తెలియనట్లు వెళ్లిపోతుంటే పట్టించుకోకుండా ఉండాలి...ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో తెలియనట్లు ఎలా ఉండాలి రా....నేను ఎమి మాట్లాడుతున్నానో రోమియో గాడికి అర్థంకాక పారిపోయాడు...

కాంటీన్ లో కూర్చొని కోక్ తాగుతున్నాను.."హలో సర్..." అంటూ ఆమె గొంతే మళ్లీ...నమ్మలేకపోయా..ఏంటి కల ఇలలో పునరావృతం అవుతుందా ఏమిటి...ఆమె వైపే చూస్తున్నాను సంభ్రమంగా..."ఇఫ్ యు డోంట్ మైండ్...ఆ టేబుల్ మీద కుర్చుంటారా...మేము నలుగురం ఫ్రెండ్స్ వచ్చాం..వేరే టేబుల్స్ ఏవీ ఖాళీ లేవు..అందరూ బాయ్స్ ఉన్నారు...మీరు ఒక్కరే కాబట్టి ఆ పక్క టేబుల్ మీద కుర్చుంటారా? " అంటూ అడిగింది
నేను వెంటనే లేచి పక్క టేబుల్ మీద కూర్చున్నాను...వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నారు...నలుగురు కల్సి రెండు బట్టర్ స్కాచ్ ఆర్డర్ చేసి షేర్ చేసుకొని తింటున్నారు...ఒక్కసారిగా ఆ బట్టర్ స్కాచ్ చూసేసరికి నా హార్ట్ బ్రేక్ అయింది...ఇక అక్కడ ఉండాలనిపించలేదు...వెళ్ళిపోవడానికి లేచి...ఏదో గుర్తోచ్చినవడిలా ఆ అమ్మాయి దెగ్గరికి వెళ్లి..."మీ పేరేంటి? " అని అడిగాను...

"సుస్మిత.." అని చెప్పి బట్టర్ స్కాచ్ తినడంలో నిమగ్నం అయ్యింది ఆ అమ్మాయి....

Friday, 16 October 2009

జీవితం గురుంచి నేర్పిన ఐ.టీ ప్రాజెక్ట్ (ఆఖరి భాగం)

"ఎవరండీ లోపల....హలో..."
స్పందన లేదు...
"హలో...ఓ సారి బయటకి వస్తారా !!..." మళ్లీ పిలిచాను గుమ్మం ముందు నిలుచొని...నా వెనుక మా సమూహం ఉన్నారు...అదే సునీల్, కృష్ణా ,శ్రీను, రమణ ..
ఓ రెండు నిముషాల తర్వాత ఓ వృద్ధురాలు వచ్చింది..ఆమె చేతిలో కర్ర ఆమె నడక అనుగుణంగా ఊగుతుంది ...కళ్ళ పైన అరచేయి పెట్టుకొని చూస్తూ ..
"ఎవరబ్బాయి మీరు.....కుంటి ఎంకడి మనవడివా నువ్వు??..." నా వైపు కర్ర చూపిస్తూ అంది...
అబ్బే కాదండి..కంగారుగా చెప్పాను...ఎక్కడ కర్రతో ఒకటి వేస్తుందేమో అని...
"అచ్చు గుద్ది నట్టు అట్టానే ఉన్నావ్ అబ్బాయ్....ఎం గావలి మీకు.." అడిగింది మా అందరి వైపూ చూస్తూ...
"మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఏమేమి పనులు చేయగలరో మేము తెలుసుకోవాలి...కాస్తా ఆ వివరాలు చెప్పగలరా.." అడిగాను ..
"కొంపదీసి మీరంతా సర్కారోల్లా...మా ఇసయాలు మీకెందుకు అబ్బాయి..."
"అది కాదండి...ఈ విషయాలు మీరు మాకు చెపితే...మీకు చేతి నిండా పని వచ్చే మార్గం ఉంటుంది.." సునీల్ అందుకున్న్నాడు ..
"ఎట్టెట్టా...అట్టాగా.." అని ఆశ్చర్యపోతూ..."ఒరేయ్ ఎంకయ్యా బేగి రా రా...ఈ పిల్లలేదో పని ఇత్తారంట.." అరచింది ఆమె లోపలి చూస్తూ...

ఆ రోజు ఉదయమే సునీల్ ఇంట్లో దిగిన మేము...లేట్ చెయ్యకుండా టిపినీలు కాపీలు కానిచ్చాక ఊరిమీద పడ్డాం...అదే చెప్పాకదా...గ్రామీణుల స్కిల్స్ సమాచారం మొత్తం రాబట్టాలి అని...ఆ పని మీద పడ్డాం అయిదుగురం కలసి....ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో...అదే ఏ ఇంటి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాలేదు మాకు..."ఇంటి నంబర్లు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయో అక్కడ నుంచి మొదలెడదామా? అలా అయితే కూర్పు సులభంగా ఉంటుంది.." అన్నాడు శీనుగాడు.. " కూర్పు గోల దేవుడెరుగు...ఈ ఎండలో ఆ మొదటి నెంబర్ ఇల్లు ఎక్కడో కనుక్కోనేసరికి కారిపోద్ద్ది మనకి...అంచేత అదిగదిగో ఆ కనపడే పాకలోకి వెళ్దాం.." అంటూ అందరిని ఆ పాకలోకి లాక్కేల్లాను..అదే ఈ బామ్మ గారి పాక...మా ప్రాజెక్ట్ బోణి బేరం....

ఆ రోజు ఇంటికి మధ్యాహ్నం కల్లా వచ్చేసాం ఇండియా-పాక్ మ్యాచ్ కోసం...ఆ రోజు ఇండియా 350 పైగా పరుగులు చెయ్యడమే కాకుండా  మ్యాచ్ నేగ్గేసరికి మాలో ఉత్సాహం పరవళ్ళు తొక్కి మరుసటి రోజు ఎపుడెపుడు అవుతుందా సర్వేకి ఎపుడెపుడు వెళ్దామా అని తెగ వెయిట్ చేశాం...ఆ రోజు మేము పూర్తి చేసిన ఇల్లు కేవలం పది....మా టార్గెట్ అయిదు గ్రామాలు...కనీసం రోజుకి వంద ఇల్లు అయినా కవర్ చెయ్యాలని నిర్ణయించుకున్నాం...ప్రొద్దున్న ఏడింటికే మళ్ళీ ఊరిమీద పడ్డాం...

"నేను కూలి పని పోతాను బాబు...మా అయన చెక్క పని సేత్తాడు..." ఆమె చెప్తుంటే నోట్ చేసుకుంటున్నాం..." రెండు నెలల నుంచి పని లేదు బాబు...చేలో కూలి పని ఏడాది పొడుగునా ఉండదు కదు బాబు..ఈయనకి చెక్కపని కూడా ఎపుడో ఒకసారే..లేనప్పుడు గంజి నీళ్ళు తాగడం కొత్తేం కాదు కానీ, పిల్లని బడికి కూడా పంపలేకపోతున్నాం బాబు..." ఆవిడ కళ్ళలో ఏదో బాధ తోణకిసలాడింది...ఆ ప్రక్కనే నిల్చున్న చిన్న పాపని చూసాను..పలక మీద ఏవో రాస్తుంది..."గవర్నమెంట్ బడులు ఉన్నాయిగా..." అడిగాను నేను ఆ పాపని చూస్తూ...."ఎందుకు బాబు అయ్యి ఉన్నా ఒకటే..లేకపోయినా ఒకటే..ఒక్క పంతులు కూడా రాడు బడికి..." 

ఆ తర్వాత ఒక పది ఇళ్ళు పూర్తి చేసేసరికి మాకు సోష వచ్చింది...అసలే ఎండా కాలం...భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు...తర్వత ఇంకో ఇంటికి వెళ్ళాం..అప్పటికే మేము ఇలా ఇళ్ళకు తిరుగుతున్నాం అనే వార్త ఆమెకి చేరిందనుకుంట రండి బాబు కూర్చోండి అంది మేము వెళ్ళగానే.."కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా " అన్నాడు రమణ గాడు...నీ ఆత్రం తగలెయ్యా అనుకున్నా మనసులో...ఆమె అందరికి గ్లాసుల్లో మజ్జిగ తెచ్చి ఇచ్చింది...అవి పుచ్చుకున్నాక ప్రాణం కాస్త లేచి వచ్చింది...మంచినీళ్ళు అడిగినా మజ్జిగ ఇవ్వడం కేవలం ఒక పల్లెటూరులోనే చూస్తామేమో కదా..."మీ ఇంట్లో ఎంత మంది.." అడిగాను నేను..."నేను ఒక్కదాన్నే బాబు...నాతో పాటు ఆ చంటిది.." అక్కడ ఒక మూడేళ్ళ పాప ఆడుకుంటూ కనిపించింది...
"ఏమి చేస్తారు మీరు?"
"కూలి పని బాబు..."
"కూలి పని లేనప్పుడు వేరే ఏమైనా పని చేస్తారా..."
"మిషన్ కుట్టడం వచ్చు బాబు....అపుడెప్పుడో పైకం అవసరం అయ్యి ఆ ఉన్న మిషన్ అమ్మేసాము...నాకు ఇంకే పనీ చేతకాదు బాబు.."
"అలాగే...మజ్జిగ ఇచ్చినందుకు థాంక్స్ అండి......ఆ పాప మీ పాపా?" అడిగాను.. ఆ మాట అడగ్గానే ఆమె ముఖం లో బాధ కొట్టొచ్చినట్లు కనిపించింది..." ఆ చంటిదాన్ని చూస్తే నాకు ఏడుపు ఒక్కటే తక్కువ బాబు...ఆ పిల్ల నా చెల్లెలి కూతురు..ఆ పిల్ల తల్లిని దాని మొగుడు వదిలేసి, ఆడు దేశాలు బట్టి పోయాడు...ఆ తల్లి ఈ చంటిదాని గురుంచి కూడా ఆలోచించకుండా బాయిలో దూకి సచ్చింది...పాపం ఈ చంటిదానికి తల్లి చచ్చిన విషయం తెలీదు...రోజూ అమ్మ అమ్మా అని ఏడుస్తూనే ఉంటుంది..ఏదో మాయ చేసి నిద్రపుచ్చితే పడుకుంటుంది పాపం బంగారుతల్లి...చెప్తే తెలిసే వయసా బాబు దానిది...." ఆమె కళ్ళలో నీళ్ళు....ఒక్కసారి ఆ బంగారుతల్లి వైపు చూసాను...ఏమి తెలియనట్లు నవ్వుతూ మా వైపు చూస్తూ ఆడుకుంటుంది....

కొంచెం భారంగానే నడిచాను అక్కడినుంచి...ఈ లోపు ఎప్పుడు దూరారో కానీ , రమణ గాడు శీనుగాడు ఇంకో ఇంట్లోకి వెళ్లి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు...కొంచెం దెగ్గరికి వెళ్లి చూసేసరికి అక్కడ సమాచార సేకరణ కాకుండా రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ లాంటిది జరుగుతున్నట్లు అనిపించి చూసేసరికి...అక్కడి సంభాషణ ఇలా సాగుతుంది ..
"అది కాదు అబ్బాయ్...మా అమ్మాయిని చేసుకుంటే నాకున్న ఆరెకరాలు రాసిచేత్తాను...ఏటంటావ్ .." వేలితో మీసాలు దువ్వుకుంటూ అడిగాడు ఆయన...
"ఏమోనండి మా ఇంట్లో అడగాలి..." నసిగాడు రమణగాడు...
"అడిగేత్తే పోలా...ఫోన్ లో కాకుండా డైరేట్ గా అడిగితేనే మర్యాద...ఒసేయ్ అబ్బాయి ఊరు నర్సీపట్నం...బైల్దేర్దామా ఓ గంటలో బస్సు ఉంది తణుకు నుంచి..." అన్నాడు తన భార్య వైపు చూస్తూ...
నాకు దిమ్మ తిరిగి దాదాపు మైండ్ బ్లాక్ అయింది....ఏం జరుగుతుంది ఇక్కడ...సమాచార సేకరణా లేక సంబంధ ధృవీకరణ??...
" అబ్బే ఇప్పుడు వద్దండి...నేను ఊరేల్లాక మా ఇంట్లో అడుగుతాను..." కొంచెం టెన్షన్ గా చెప్పాడు రమణ...
"ఆ సర్లే అబ్బాయ్ ...మర్చిపోకు...సర్లే ఇంతకీ పాక్టరి ఎప్పుడు వత్తాది అంటావ్..." అడిగాడు అతను ...
ఈ సరి షాక్ సర్ ర్ ర్ ర్ న వచ్చి ఎక్కడ తగిలిందో తెలియలేదు..."ఫ్యాక్టరీ ఎంట్రా బాబు..." నసిగాను నీరసంగా...
"ఆ వచ్చేస్తుంది...ఒక ఆరు నెలలలో..." అన్నాడు రమణ గాడు తాపీగా...
ఇంకా అక్కడెన్ని షాక్ లు వినాలో అని రమణని లాక్కొని బైటకి వచ్చాం...."ఒరేయ్ ఏం జరిగిందో చెప్పరా బాబు...ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ఏంది...ఆ ఫ్యాక్టరీ ఏంది..." అడిగాం అందరం...
"ఏం లేదురా....ఏమేం పనులు వచ్చు అని అడుగుతుంటే, ఇక్కడేమన్నా ఫ్యాక్టరీ పెట్టబోతున్నారా? అని అడిగాడు ఆయన...ఎఫెక్టివ్ గా ఉంటుందని అవునని చెప్పాను...ఇక అక్కడి నుంచి ప్రశ్నలు వేసి చంపాడు...ఏం చేస్తున్నావ్...ఎక్కడుంటావ్...చివరికి కాస్ట్ కలిసేసరికి వాళ్ళ అమ్మాయిని చేసుకోమని ఓ గొడవ....అలా..అలా స్టార్ట్ అయింది.." అక్కడి కంఫ్యూజన్ డ్రామా వృత్తాంతం వివరించాడు రమణ..." అఘోరించావ్ లే...అలా లేనిపోనివి చెప్పి వాళ్ళకు ఆశలు కల్పించడం తప్పు...మనం వచ్చిన పని చేసుకొని వెళ్దాం ...ఎగస్ట్రాలు వద్దు.." అన్నాను...

ఆ రోజు కనీసం ఒక ఎనభై ఇళ్ళ సమాచార సేకరణ పూర్తి చేశాం...దాదాపు సగం మంది వాళ్ళ బాధలు మాతో చెప్పుకున్నారు...మేమేదో వాళ్ళకు పని కల్పిస్తామని ఆశపడుతున్నారు వాళ్ళు..మేము చేసే ఈ ప్రాజెక్ట్ వాళ్ళకు ఎంత వరకు ఉపయోగ పడుతుందో అప్పటివరకు నిజంగా తెలీదు...కానీ ఆ క్షణం దేవుడిని గట్టిగా కోరుకున్నా ఈ ప్రాజెక్ట్ ద్వారా కొంతమంది కైనా పని దొరికి పట్టెడు అన్నం పెట్టేలా చూడాలని...ఒక్క గ్రామంలోనే సగం మంది ఇంత దయనీయ పరిస్థితిలో ఉంటే సర్కారు ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు...ఎవరో అన్నట్లుగా ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు పేదవాడు ఇంకా పేదరికం అనుభవిస్తున్నాడు అనే మాట అక్షరాలా నిజమేమో...ఒక్క క్షణం ప్రొద్దున చూసిన చంటిపిల్ల ముఖం నా కాళ్ళ ముందు కదలాడింది...పాపం రేపు ఆ పిల్ల పెద్దది అయ్యాక తన తల్లి గురుంచి తెలిసి ఎలా తల్లడిల్లిపోతుందో...ఇంత చిన్న వయసులోనే అంత భారం పెట్టిన దేవుడికి జాలి లేదా??..దేవుడే ఇలా పక్షపాతం చూపిస్తుంటే ఇక మనవ మాత్రులం మనమెంత...ఇలా ఎన్నెన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి...ఆ ఆలోచనలలో నుంచి నాకు కర్తవ్యం బోధపడింది...జీవితం గురుంచి ఒక చిన్న పాఠం తెలిసింది..అప్పటి వరకు జీవితంలో ఏది చెయ్యాలో దిశానిర్దేసం లేని నాకు ఆ రోజు ఒక గమ్యం కనిపించింది...అదే సివిల్ సర్వీసెస్ రాయాలని..

ఆ తర్వత ఒక పది రోజుల్లో మా పని పూర్తి చేసి తిరిగి రాజముండ్రి చేరుకున్నాం...అలా స్వయంగా గ్రామాల్లో తిరిగి వాళ్ళతో కలిసి మాట్లాడటం...వారి జీవన ప్రమాణాలు తెలుసుకోవడం...వారు పడే బాధలు స్వయంగా చూడటం...వొంట్లో సత్తువ ఉండి కూడా పని దొరకని దౌర్భాగ్యం...తద్వారా సంక్రమించే దారద్ర్యం...ఇవన్ని నా కర్తవ్యాన్ని బలపరిచాయి...నా నిర్ణయానికి మద్దతునిచ్చాయి ...నా జీవితానికి ఒక గమ్యాన్ని ఏర్పడేలా చేసాయి...

Thursday, 10 September 2009

జీవితం గురుంచి నేర్పిన ఐ.టీ ప్రాజెక్ట్ (మొదటి భాగం)

అవి మేము బీ-టెక్ ఐ.టీ ఆఖరి సంవత్సరంలో ప్రాజెక్ట్ ఏ ప్లాట్ ఫాం మీద చేద్దాం అని తీవ్రంగా చర్చించుకుంటున్న రోజులు....అప్పటిదాకా రైల్వే ప్లాట్ ఫాం తప్ప సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫాం అంటే ఏంటో తెలీదు... కొంత మంది సహా విద్యార్ధులు చెప్పిన విషయాలు కొంత నాకు నేనుగా ఊహించుకున్న విషయాలు కలిపి సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫాం అనగా - ఒక సాఫ్ట్ వేర్ భాష కాని డేటాబేస్ కాని దేని ద్వారా అయితే మనం సాఫ్ట్ వేర్ తయారుచేస్తామో దానినే ప్లాట్ ఫాం అంటారు అని తెలుసుకున్నాను. ఈ విష్యం తెలుసుకునేసరికి నా ఆఖరి సంవత్సరం మొదలయింది...

"ఒరేయ్ మనం జావా మీద ప్రాజెక్ట్ చేద్దాం...రేపు మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన రెస్యుమేలో జావా ప్రాజెక్ట్ ఉంటే మనం త్రూ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ.." అన్నాడు సునీల్ గాడు అన్నం లో సాంబార్ పోసుకుంటూ...
"కాదు...మనం డాట్ నెట్ లో చేద్దాం...అదే ఇప్పుడు మార్కెట్ లో హాట్ ప్లాట్ ఫాం..." అన్నాడు కృష్ణా గాడు చేతికి అంటిన పెరుగుని అమృతంలా నాక్కుంటూ...
"ఇవేమీ కాదు...మనం ముల్టీమీడియాలో చేద్దాం...గ్రాపిక్స్ కూడా పెట్టి మంచి ప్రాజెక్ట్ చేద్దాం .." రెండు కళ్ళు సపోటా పళ్ళంత చేసి చెప్పాడు శీను గాడు...
"అసలు మనకి ఇవేమీ రావు కదరా..." ధర్మ సందేహం వెలిబుచ్చాను నేను పళ్ళెం అంచులు కూడా జుర్రెసుకుంటూ...
"నీ మొహం...అందరూ అన్నీ వచ్చే చేస్తున్నారా??...వంద వెధవపనులకి శతకోటి మార్గాలు..." గీతోపదేశం మొదలెట్టాడు కృష్ణుడు.... 

తర్వాత కాలేజీలో మాకు ఏది నచ్చితే ఆ ప్రాజెక్ట్ చెయ్యడానికీ వీల్లేదని, బైర్రాజు ఫౌండేషన్( సత్యం) వాళ్ళతో మా కాలేజీ వాళ్ళు టై-అప్ అయ్యి వాళ్ళు ఎన్నిక చేసిన ప్రాజెక్ట్లులలో ఏదోకటి మేము ఎన్నుకోవాలని తెల్సింది. "విలేజ్ స్కిల్ ప్రొఫైలింగ్" అనే ప్రాజెక్ట్ ఎన్నుకున్నాం మేము ఓ అయిదుగురు బాచ్ గా కలిసి. ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఏమిటంటే...మేము అంతా కలిసి కొన్ని గ్రామాలు తిరిగి, ఇంటింటికీ వెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు...వాళ్ళకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి - ఉదాహరణకి కొంత మంది వడ్రంగి పని చేస్తారు, కొంత మంది కల్లుగీత కార్మికులు, కొంత మంది వ్యవసాయం, కొంత మంది చెక్క పని చేస్తారు...ఇలా వాళ్ళ వాళ్ళ స్కిల్స్ ని మేము నోట్ చెయ్యాలి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికీ వెళ్లి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మాకు కొన్ని గ్రామాలు అప్పజెప్పారు. బైర్రాజు ఫౌండేషన్ వాళ్ళు కొన్ని గ్రామాలు దత్తతు తీసుకున్నారు. ఈ గ్రామాలలో జీవన ప్రమాణాలు మెరుగు పరచి, అందరికి కనీస సౌకర్యాలు కల్పించడం, అందరికి పని దొరికేలా చూడడం ఈ ఫౌండేషన్ వారి సదుద్దేశం.
 
మాకు అందరికి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఎంతో కొంత సోషల్ వర్క్ చెయ్యబోతున్నాం అని తెగ ఫీల్ అయిపోయాం. దీనికి ఐ.టీ ప్రాజెక్ట్ కి సంబంధం ఏమిటా అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నా, ఈ విధంగా సేకరించిన స్కిల్స్ సమాచారం మొత్తం మేము ఒక డేటాబేసులో పొందుపరచాలి. ఇలా పొందుపరచిన సమాచారం మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చేలా ఫ్రంట్-ఎండ్ తాయారు చేస్తాం - అంటే మనకు కనిపించే స్క్రీన్ అనమాట, ఒక వెబ్ సైట్ లాగ. ఈ వెబ్ సైట్ కి వెళ్లి ఆ గ్రామానికి సంబంధిన స్కిల్స్ సమాచారం మొత్తం రాబట్టవచ్చు. ఇది రియల్ టైంలో ఏ విధంగా ఉపయోగ పడుతుంది అంటే - ఉదాహరణకు ఒక ఇంటికి చెక్కపని చెయ్యాలనుకోండి, మాములుగా అయితే ఒక మధ్యవర్తి ద్వారా చెక్కపని వాడిని కుదుర్చుకోవడం జరిగుతుంది. కాని ఇక్కడ ఎవరికైనా ఏ పని తెల్సిన వాడు కావాలన్న ఈ వెబ్ సైట్ ద్వారా పొంది, ఆ మనిషిని పిలిపించవచ్చు. ఈ పల్లెటూరులలో ఈ వెబ్ సైట్ చూసి మనిషిని కాంటాక్ట్ చేసే అంత సీన్ ఉండదు అనుకుంటున్నారు కదా. నిజమే, అందుకే ప్రతి గ్రామం సెంటర్ లో బైర్రాజు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసారు. మీరు వీళ్ళకి ఒక్క కాల్ చేసి మీకు ఫలానా పని వాడు కావలి అని కబురంపితే చాలు , వీళ్ళే ఆ వెబ్ సైట్ ద్వారా సమాచారం పొంది పని వాళ్ళకు కబురంపి మీ ఇంటికి పంపుతారు. ఈ సర్వీసు పూర్తి ఉచితంగా చేస్తారు అనమాట. ఈ విధంగా గ్రామస్తులకి పని కల్పించినట్లు అవుతుందీ, మధ్యవర్తుల కమీషన్ లాంటివి ఉండవు, పూర్తి పని జీతం పనివాడికే చెందుతుంది. బాగుంది కదా కాన్సెప్ట్. అవును, అందుకే మాకు కూడా బాగా నచ్చింది...
మాకు అప్పగించిన గ్రామాలు తణుకు చుట్టుప్రక్కల గ్రామాలు - రేలంగి తదితర గ్రామాలు. సునీల్ గాడిది రేలంగి. ఈ ప్రాజెక్ట్ కోసం సమాచారం సేకరించడానికి ఒక పది రోజులు అయినా పడుతుంది, అప్పటిదాకా ఉండటానికి బైర్రాజు వాళ్ళు గెస్ట్-హౌస్ ఇస్తామన్నారు. కాని సునీల్ గాడు, పట్టుబట్టి వాళ్ళింట్లోనే ఉండాలని తీర్మానించాడు. నాకు అసలే కొత్త వాళ్ళ ఇంట్లో సిగ్గెక్కువ, వద్దులేరా అన్నా వినలేదు వాడు. ఒకానొక రోజు సుముహూర్తం చూసికొని అందరం కల్సి రేలంగి బైల్దేరం తణుకు గుండా. నాకు కొంచెం లోపల ఏదో ఫీలింగ్, పాపం ఆంటీ మమ్మల్ని అయిదు రోజులు మేపాలి అంటే సామాన్యం కాదు కదా. కానీ అక్కడికి వెళ్ళాక తెల్సింది ఆంటీ అంకుల్ మమ్మల్ని కూడా వాళ్ళ అబ్బాయి లాగానే చూసారు. నాకు వాళ్ళు చాలా బాగా నచ్చారు. అసలు నాకు ఈ ప్రాజెక్ట్ జీవితం గురుంచి ఎన్నో నేర్పింది, ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, పల్లెటూరి ప్రజల జీవన శైలి, వారి మధ్య అనుబంధాలు, ఎన్నెన్నో చెప్పుకోలేని బాధలు....ఇలా చాలా తెల్సుకున్నాను...ఇది నా అకాడెమిక్ ప్రాజెక్ట్ అనే కన్నా, నా జీవితానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ అని అనడం కరెక్ట్. అక్కడ గ్రామాలలో జరిగిన విశేషాలు అన్ని త్వరలోనే మీతో పంచుకుంటాను, అంతవరకు సెలవు మరి.

Sunday, 9 August 2009

నీ స్నేహం...

మేలుకొంటే నా కళ్ళముందు నిలిచేదే నీ రూపం
కళ్ళు మూసుకుంటే నా ఊహలందు నీవే అపురూపం
నిజం చెప్పమంటే నేనే లేను నాలో అయ్యాను నీ పరం
గుండె చప్పుడింటే నీ పేరు తప్ప తెలియదేమో వేరే తాళం

గుర్తు చేసుకుంటే నీతో గడిపిన క్షణాల జ్ఞాపకాలే నా లోకం
కథే రాయమంటే నీ నయన భావాల కన్నా దొరకునా గొప్ప కావ్యం
జీవితం పంచుకుంటే అందాల పూదోటగా మలచును నీ సాంగత్యం

ఆశ కాదనుకుంటే కడదాకా నాతో ప్రయాణించాలి నీ స్నేహం