Search This Blog

Wednesday, 22 July 2009

ఆఖరి మజిలీ...



నేను ఆఫీసుకి ఎప్పుడు సెలవు పెట్టాలన్నా నాకు దొరికే ఒకే ఒక్క వంక 'ఫ్రెండ్ పెళ్లి'.. ఎక్కువసార్లు అదే వంక పెట్టి అడిగేసరికి మా మేనేజర్ స్పందన వ్యతిరేకంగా తయారయింది...రెండు నెలల క్రిందట మా ఫ్రెండ్ ఫోన్ చేసి "ఒరేయ్ నా పెళ్లి...నువ్వు తప్పకుండా రావాలి..కార్డు నీకు మెయిల్ చేశాను...రాలేదంటే నా మీద ఒట్టే" అని తెగ ఇబ్బంది పెట్టేసాడు...సరేలే వెళ్దాం సరదాగా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసినట్లు ఉంటుంది అనుకోని లీవ్ అడగడానికి వెళ్ళాను మేనేజర్ దెగ్గరికి...'ఫ్రెండ్ పెళ్లి' అంటే ఈ సారి ఖచ్చితంగా లీవ్ ఇవ్వడు... "నీకు లీవ్ దొరకడానికి మీ ఫ్రెండ్స్ తెగ పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారే..."అని వ్యంగ్య అస్త్రం వదలడూ!!...ఏమని అడగాలి...
వీడికి బుర్ర ఉందొ లేదో ఈ సారి పరీక్షిద్దాం అనుకోని "హాయ్ సర్, వాట్స్ అప్....వెల్, మా ఫ్రెండ్ వుడ్ బీ కి పెళ్లి సర్...వెళ్ళకపోతే బాగోదు...జస్ట్ రెండు రోజులు లీవ్ కావలి.."
"ఈ మధ్యే కదా ఫ్రెండ్ పెళ్లి అని వెళ్ళావ్.." వాడి భ్రుకుటి ముడి పడింది :)
"ఇపుడు ఫ్రెండ్ పెళ్లి కాదు సర్, ఫ్రెండ్ వుడ్ బీ ది...ప్లీజ్ సర్...అన్నట్లు మీరు మొన్న కోడింగ్ లో చేసిన మార్పులకి మన క్లయింట్ నుండి గొప్ప అప్రిసియెషన్ వచ్చింది.."
అంతే నాకు లీవ్ దొరికింది....
ఫ్రెండ్ పెళ్లి...ఫ్రెండ్ వుడ్ బీ పెళ్లి..రెండు ఒకటే అని వీడికి ఎప్పుడు తెలుస్తుందో అనుకోని నేను నా కొలీగ్ తెగ నవ్వుకున్నాం....


"టింగ్..టింగ్...టింగ్..దయచేసి వినండి ట్రైన్ నెంబర్ 2603 చెన్నై express మరికొద్దిసేపట్లో నాలుగవ నెంబర్ ప్లాట్ఫారం నుండి బయలుదేరుటకి సిద్ధంగా ఉంది (అలా అని తమిళం లో చెప్తుంది)"...కాలు తెగిన కోడిలా తెగ వాయిస్తున్న ఆ  అనౌన్సిమేంట్ చిన్నదాన్ని తెగ తిట్టుకుంటూ పరిగెత్తుకుంటూ టెన్షన్ టెన్షన్ గా సెంట్రల్ కి వచ్చాను...అప్పటికే బండి కదులుతుంది నెమ్మదిగా...మొత్తానికి ఎక్కేసాను..


నా సీట్ లో ఓ ముసలాయన కూర్చున్నాడు "ఈ సీట్ నాదండి.." చెప్పాను.."ఓ అలాగా బాబు..."అని పాపం ఆయన లేచి నా ఎదురు సీట్ లో కూర్చున్నాడు..నాకు సైడ్ లోయర్ బెర్త్ అంతే చాలా ఇష్టం...ఎవరితో లింక్ ఉండదు...ఎంత సేపయినా కిటికీలోంచి అలా బైటకి చూస్తూ మ్యూజిక్ వింటూ ప్రయాణించడం నాకిష్టం ...నాకు కావల్సినపుడు పడుకుంటా, వేరేవాళ్ళు పడుకోవాలంటే నేను లేవల్సిన పనిలేదు...అదన్నమాట...సో ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ మాత్రం ఎవరికీ త్యాగం చెయ్యను...ఓ సారి ఒకామె అడిగింది, బాబు పై బెర్త్ తీసుకుంటావా, నేను పైకి ఎక్కలేను అని..నకివ్వబుద్ధి కాలేదు...కానీ పాపం ఆమె మాత్రం పైకి ఎలా ఎక్కుతుంది..పెద్దామె ..అనుకోని...రాజారాం మోహన్ రాయ్ లా ఫీల్ అయ్యి ఆమెకి బెర్త్ త్యాగం చేసి నేను పైకి ఎక్కాను....కొద్దిసేపయ్యాక అపోసిట్ లోయర్ బెర్త్ లో ఒక అమ్మాయి 'ఆంటీ మీరు ఈ లోయర్ బెర్త్ తీసుకొని..నాకు ఆ సైడ్ లోయర్ ఇస్తారా?' అని అడిగింది...నాకు ఒక్కసారిగా సౌండ్ లేదు..ఈవిడగారు నేను త్యాగం చేసిన బెర్త్ ని మళ్లీ త్యాగం చేసారు..నాకు ఒక్కసారిగా మంటెక్కింది...నేను అప్పర్ బెర్త్ లో ముడుచుకుంటే, నా బెర్త్ లో ఉన్న అమ్మాయి విండో లోకి చూస్తూ ..కూల్ డ్రింక్ సిప్ చేస్తూ, ఇంకో చేత్తో చిప్స్ తింటూ, ఐపాడ్ లో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంది...నాకు చిర్రెత్తింది..'ఓయ్ అమ్మాయి నా బెర్త్ నాకు ఇచ్చేయ్..'అని అడగాలనిపించింది...కానీ అడగలేదు...అప్పటినుంచి ఎవరు బెర్త్ అడిగా 'సారీ' అనేదే నా సమాధానం..


"ఎక్కడిదాక బాబూ ప్రయాణం.." అడిగాడు నా ముందు కూర్చున్న పెద్దాయన..
"హైదరాబాద్..." క్లుప్తంగా చెప్పాను నా ధోరణి లో..
అప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించాను ఆయనని...యాభై పైబడిన వయసు, దాదాపు మొత్తం నెరిసిన జుట్టు..ఎంతో జీవితాన్ని చూశాను అని చెప్పినట్లుండే విశాలమైన నుదురు...ఎన్నో ఆటుపోట్లకు ఎదురు నిలిచిన దర్పాన్ని ప్రతిబింబించే ముఖం...
"మీరు?" అన్నాను కాసేపాగి..
"గుంటూరు దెగ్గర చిన్న పల్లెటూరు బాబు...గుంటూరులో దిగి అక్కడనుంచి బస్సులో వెళ్ళాలి..." చెప్పాడాయన..
"ఓహో..."
"ఎం చేస్తున్నావ్ బాబూ మద్రాస్ లో.."
"ఉద్యోగం..."
"మంచిది బాబు ...చక్కగా ఉన్నావ్..చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నావ్...మంచి భవిష్యత్తు ఉంది నీకు..మంచి మార్గాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకు నాయినా.." చెప్పాడు ..చివరిలో చిన్నపాటి ఉద్వేగం చూసా ఆయనలో..ఆయన కనుసన్నల్లో కన్నీరు నా కంటి చూపు తప్పించుకోలేదు..
"ఏమయిందండి..?" ఏదో తెల్సుకోవాలనే ఆరాటం నాలో..
"నీ లాంటి కుర్రాళ్ళని చూస్తే మా అబ్బాయే గుర్తొచ్చి ఇలా కన్నీళ్ళు పెట్టిస్తాడు..." పైపంచె తో చిన్నగా తన కళ్ళని వత్తుకున్నాడు...
"ఏమయింది తనకి?"
"చనిపోయి ఏడాది...." చెప్పాడు ఆయన

"అయ్యో...ఎలా జరిగింది"
"ఆత్మహత్య చేసుకున్నాడు....పదిమందికి పాఠాలు చెప్పే పంతులుని అయ్యుండి, నా కొడుకు మనసేంటో తెలుసుకోలేకపోయాను..పది మందిలో వాడు గొప్పగా ఉండాలని కలలు కన్నాను..స్థోమతని లెక్కచెయ్యకుండా చదివించాను..కలెక్టర్ గా వాడిని చూడాలని కలలు కన్నాను..నా కలలను నిజం చెయ్యడానికి వాడి జీవితంలో ఎన్నింటినో కాలదన్నాడు..ఓ రోజు పట్నం నుంచి మా అబ్బాయి రాసిన ఉత్తరం రావడం చూసి చాలా సంతోష పడ్డాను...తను ఐ.ఏ.ఎస్ పాస్ అయ్యాడనీ...ట్రైనింగ్ కి వెళ్తున్నాను అని రాసాడు ...ఇక అంతే సంతోషం పట్టలేకపోయాను...ఊరంతా దండోరా వేసుకొని, నా కొడుకు గొప్పతనం ఆ రోజు చెప్పుకొని మురిసిపోయాను..'నా కొడుకు కలెక్టర్ అవ్వబోతున్నాడు రాజయ్య...మన జిల్లాకే వస్తే మన కష్టాలన్నీ తీరుస్తాడు..ఆడు గొప్పోడు అవుతాడు అని నీకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని కదా ' మా స్కూల్ లో పనిచేసే రాజయ్యతో చెప్పి సంబరపడ్డాను...నేను స్కూల్ లో పనిచేసేప్పటి నుంచి రాజయ్య నాకో గొప్ప స్నేహితుడు..రాజయ్యకి నా కొడుకంటే చాలా ఇష్టం...వాడిని ఎప్పుడూ ఎత్తుకొని తిరిగేవాడు...'మా చిన్న దొరగారండి' అనేవాడు ఎప్పుడూ వాడిని చూసి...


రెండేళ్ళు గడిచాయి...అపుడప్పుడు వాడి దెగ్గర నుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి...కానీ మూడు నెలల నుంచి వాడి దెగ్గర నుండి ఒక్క ఉత్తరం కూడా రాలేదు...అక్కడి ఫోన్ నంబరు కూడా తెలీదు....ఓ రోజు రాజయ్య వచ్చాడు ఇంటికి..'మాష్టారు మనం అర్జెంటుగా మద్రాస్ వెళ్ళాలి..బట్టలు సర్దుకోండి' అన్నాడు...ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాజయ్య ముఖంలో ఏదో బాధ "ఏమయింది రాజయ్య...ఎందుకలా ఉన్నావ్..ఉన్నపళంగా మద్రాస్ దేనికి.."అన్నాను.. నన్ను మాట్లాడనివ్వలేదు రాజయ్య...ఆదరాబాదరా ప్రయాణం కట్టించాడు...నా మనసేదో కీడు శంకించింది...భగవంతుడా నా కొడుక్కి ఏమీ కాలేదు కదా...అయినా వాడి ట్రైనింగ్ ఢిల్లీలో అని చెప్పాడు కదా...రాజయ్య మద్రాస్ తీసుకేల్తున్నాడంటే వేరే కారణం ఏదో అయ్యుంటుంది..కానీ ఎంతడిగినా కారణం చెప్పడేంటి..పైగా ఎంతో ముభావంగా ఉన్నాడు..ఎన్నో ప్రశ్నలు మదిని వేదిస్తుండగా మద్రాస్ బైలుదేరాను...


ఆయన చెప్పడం ఆపేశాడు...ఆయన కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘల్లా ఉన్నాయి...ఆయనకీ ఇదంతా గుర్తుచేసి బాధిస్తున్నానేమో అనిపించింది..రైల్ ఎక్కడో ఆగింది...సన్నగా వర్షం మొదలయింది..అతను కిటికీ లోనుంచి అలాగే బైటకి చూస్తున్నాడు..నేను కూడా మౌనంగానే ఉన్నాను...


"రాజయ్య నన్ను నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు.." ఎటో చూస్తున్ననాకు అతని మాటలు వినిపించాయి...గొంతులో ఏదో అడ్డుపడ్డట్లు ఉన్నాయి అతని మాటలు...గుండెలో బాధ మాటలు పెగాలనివ్వకుండా గొంతులో అడ్డుపడుతుంది ఆయనకి..
"అప్పటిదాకా మనసులోనే క్షోభ అనుభవించిన నాకు ఇక ఓపిక నశించింది...కాలర్ పట్టుకొని అడిగాను రాజయ్యిని 'నా కొడుక్కి ఏమయింది' అని..ఒక్కసారిగా అతను ఉగ్గపట్టుకున్న బాధంతా కన్నీళ్ళ రూపం దాల్చి, వంట్లో సత్తువంతా నశించి కూలబడి గుండెలు అవిసేలా ఏడ్చాడు..ఏదో అర్ధమయింది నాకు...అది నిజం కాకూడదు అని మనసులో వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నాను...వొళ్ళంతా వోణుకు ప్రారంభమయ్యింది..అక్కడి నుంచి వెనుకకు అడుగులు వేసుకుంటూ వెళ్లాను..వెనుక నుంచి రాజయ్య నా చెయ్యి పట్టుకొని అటువైపుగా తీసుకెళ్ళాడు....మార్చురీ గది దెగ్గరకు...."


నాకు తెలీకుండా నా కళ్ళలో నీరు...ఎంత బాధని అనుభవించి ఉంటాడు ఈయన...కన్న కొడుకుని అన్ని ఏళ్ళ తరువాత అక్కడ విగత జీవిలా అలా చుస్తే..గుండె పగలదా..అల్లారు ముద్దుగా పెంచుకొని, ఎన్నో ఆశలు పెట్టుకొని చదివించుకున్న కొడుకుని కాటికి పంపాలంటే ఆయన కొన ఊపిరి ఆగిపోదా...


నెల్లూరు స్టేషన్ దాటింది బండి...వర్షం తగ్గు ముఖం పట్టింది..పచ్చటి పంట పొలాల మధ్య దూసుకుపోతుంది ధూమశకటం...అప్పుడే వెలసిన వానతో కమ్మటి మట్టి వాసన ముక్కు పుటలకి అందుతూ పరవశానికి లోను చేస్తుంది వాతావరణం...కాని దాన్ని అస్వాదించలేకపోయా....ఈ ప్రకృతిలో అందాలని ఆస్వాదించాలంటే మన మనఃస్థితి ముఖ్యం..ఆ స్థితి వేరేలా ఉంటే, బయట ఎంత అందమున్నాఅదంతా అడవి కాచిన వెన్నెలే కదా...కాదంటారా?..

ఆయన తన బాగ్ లోనుంచి ఓ ఫోటో చూపించాడు నాకు..ఓ చిన్న పిల్లాడి ఫోటో..ఏడాది ఉంటాయేమో ఆ పిల్లాడికి "మీ  అబ్బాయి చిన్నప్పటిదా?"  అడిగాను ఆ ఫోటో చూస్తూ..
"ఎలా ఉన్నాడు?" అడిగాడు ఆయన..
"చాలా అందంగా ఉన్నాడు.." చెప్పాను...
"నా కొడుకు కాదు...నా మనవడు.." చెప్పాడాయన...
"మీకు ఎంత మంది సంతానం..." అడిగాను...వాళ్ళ అబ్బాయికి పెళ్లి కాలేదు కదా అని సందేహం కలిగి...
"నీ సందేహం అర్ధమయింది...వీడు నా కొడుకు కొడుకే..." అన్నాడు ఆయన...ఆశ్చర్యపోయాను కళ్ళు ఇంతవి చేసుకుంటూ...
ఆయనే మళ్లీ కొనసాగిస్తూ "నా కొడుకుని ఆ రోజు అలా చూసిన నా బాధ వర్ణనాతీతం...ఆ రోజు అక్కడికి ఇంకో అమ్మాయి వచ్చింది ఓ పసి పిల్లాడిని ఎత్తుకొని...రాజయ్య చెప్పాడు ఆమె నా కోడలు అని...నాకేమీ అర్థం కాలేదు...నా కొడుకు పోయిన వియోగంలో పిచ్చి ఎక్కిన వాడిలా ఉన్నాను...దేవుడు నన్ను ఇంతలా పరీక్షించాలా అనిపించింది ..రాజయ్య చెప్పాడు ఈ కబురు ఆ అమ్మాయే ఉత్తరం రాసి స్కూల్ కి పోస్ట్ చేసిందట...ఆ అమ్మాయి వైపు చూసాను...ఏడ్చి ఏడ్చి ముఖం కంది పోయి ఉంది..కళ్ళు జాలిగా నా వైపే చూస్తున్నాయి...ఆమె చేతిలో పసి పిల్లాడు...వాడు నా మనవడు అని తెలియడానికి ఎక్కువసేపు పట్టలేదు...కానీ అంతా అయోమయంగా ఉంది..నా కాళ్ళ క్రింద భూమి కంపిస్తుంది..ఆ తర్వాత ఆ అమ్మాయి చెప్పింది..నా కొడుకు ఐ.ఏ.ఎస్ పాస్ అవ్వలేదు, ట్రైనింగ్ కీ వెళ్లలేదు...వాడు మద్రాస్ లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు..అనుకోని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవలసి వచ్చిందట...

"మామయ్య గారు దీనిలో నా తప్పు చాలా ఉంది...ఆయన మీ గురుంచి ఎప్పుడూ చెప్తూనే ఉండేవారు...మీకు జరిగినది అంతా చెపితే మీరు తప్పక మమ్మల్ని క్షమిస్తారు అంటుండేవారు...మీరు ఆయనని కలెక్టర్ గా చూడాలని కలలు కనేవారని చెప్పి, ఆ కోరిక తను తీర్చలేకపోయాడని చాలా బాధపడేవారు..ఓ సారి ఆయన బాధ చూడలేక ఆయనకి తెలీకుండా ఉత్తరం రాశాను మిమ్మల్ని సంతోషపెట్టాలని..అలానే రాస్తూనే ఉన్నా..ఓ రోజు ఆయనకి తెల్సి నా మీద చాలా కోప్పడ్డారు..ఇక మా నాన్నకి నా ముఖం ఎలా చూపించాలి అని బాధపడ్డారు...నేను అంత ఆలోచించలేదు...అప్పటినుంచి నేను ఉత్తరాలు రాయలేదు...ఓ రోజు ఆయన ఇంటికి వచ్చి చాలా ముభావంగా ఉండటం చూసాను..'నేను లేకపోతె నువ్వు దైర్యంగా బ్రతకగలవా?' అని నన్నడిగితే ఒక్కసారిగా ఏడ్చాను.. 'ఎందుకు అలా అంటారని అడగ్గా ..'ఇక మా నాన్నకి జన్మలో నా ముఖం చూపించలేను...మా ఊరి రమేష్ నాకు ఈ రోజు కనిపించాడు..వాడు దుబాయ్ వెళ్ళడానికి మద్రాస్ వచ్చాడు..'నువ్ కలెక్టర్ వి అంటగా?..మీ నాన్న ఊరంతా దండోరా వేస్తున్నాడు ..' అని చెప్పేసరికి నాకు కన్నీళ్ళు ఆగలేదు...ఇక ఆయనకి నేను ముఖం చూపలేను...నాకు బ్రతకాలని లేదు' అన్నారు..'మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్న నా గురుంచి ఆలోచించరా?' అన్నాను...ఆయను నన్ను తన గుండెలకి హత్తుకున్నారు...మరుసటి రోజు మృత్యువు వడిలో ఉన్నారు..." ఆ అమ్మాయి కన్నీళ్ళపర్యంతం అయింది...నేను నా మనవడిని ఆ అమ్మాయి దగ్గర నుంచి  తీసుకొని నా గుండెలకి హత్తుకున్నాను..

అదంతా విన్న నాకు దేవుడు ఒకళ్లకే ఇన్ని కష్టాలు ఎందుకు పెడతాడు..కొందరికి ఎందుకు అన్ని సుఖాలే ఇస్తాడు అనిపించింది..."ఇపుడు మీ మనవడు, కోడలు మీతో పాటే ఉంటున్నారా?" అని అడిగాను .."నా మనవడు మా ఇంట్లోనే ఉన్నాడు...వాడి నాయనమ్మతో ఆడుకుంటున్నాడు...నా కోడలికి జబ్బు చేస్తే మద్రాస్ లో హాస్పిటల్ లో జాయిన్ చేసాం...ఇపుడు అక్కడి నుంచే వస్తున్నా...మళ్ళీ రేపు తిరుగుప్రయాణం ఉంది మద్రాస్ కి.." చెప్పాడు ఆయన
"అయ్యో ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారు...మళ్లీ రేపే ఎందుకు వెళ్ళాలి..." అడిగాను..
"నా భార్యని...నా మనవడిని తీసుకువస్తున్నా తిరుగుప్రయాణంలో... డాక్టర్ గారు ఇక రెండు మూడు రోజులకంటే కష్టం అన్నారు...చివరి సారిగా వాడి తల్లిని వాడికి చూపించే భాద్యత నాది..." ఆయనలో ఏ స్పందన నాకు కనపడటం లేదు...చాలా మాములుగా చెప్పారు..బహుశా జీవితం అతన్ని అన్నీటికి సమాయత్తం చేసిందేమో...దేన్ని అయినా ఎదుర్కొనే మనో నిబ్బరాన్ని ప్రసాదించిందేమో...
"నా కోడలికి బ్రెయిన్ ట్యూమర్..."
నేనేమీ మాట్లాడలేకపోయాను ఇక....ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఓ మనిషి జీవించగాలడా?..అసలు భరించగాలడా ??...నేనయితే...తలచుకోగానే నా వెన్నులో వణుకు....
ఇక మేమేమీ మాట్లాడుకోలేదు...ఇంకా ఏమి వినాల్సి వస్తుందో అని నేనేమి అడగలేదు...అతను చెప్తున్న వాటిని జీర్ణించుకోడానికి నాకే కష్టంగా ఉంది...

ఎప్పుడు నిద్రలో జారుకున్నానో తెలీదు ...అలా కూర్చొనే నిద్రపోయాను...లేచేసరికి అంతా చీకటి...ఆయన లేడు నా ముందు సీట్ లో ...టైం చూసా ఒంటిగంట దాటింది...అవును గుంటూరు దాటి అరగంట అయ్యింది...అతను దిగి పోయాడు...నా మనస్సంతా భారంగా...భాధగా తయారయింది...



Wednesday, 15 July 2009

నీ జతలో...


గడిపాను ఇంతకాలం నీ జతలో....తీరేదెలా ఆ లోటు
నీవు లేవనీ.. ఇక రావనీ తెలిశాక .....

తడిచాను నీ చిరునవ్వుల జడిలో...మరచేదెలా ఆ సవ్వడి
మూగాబోయావనీ...మరలి రాలేవనీ తెలిశాక...

కరిగావు ఓ కలగా నా కన్నుల వాకిట్లో...మేలుకొనేదెలా ఈ ఉదయం
కల చెదిరిందనీ... తెలవారిందనీ తెలిశాక...

అనురాగాలు కురిపించావు గారాల పలుకులతో... వినలేనేమో ఆ రాగం
శ్రుతి తప్పిందని... పోలమారిందనీ తెలిశాక...

ఊహలుగా జీవించావు నా ఆశల పల్లకిలో...కదిలేదెలా ఇక ముందుకు
నడక ఆగిందని... దారి తప్పిందనీ తెలిశాక...

అధ్భుతాలు చూపించావు నీ ఆదర్శాల బాటలో... కనలేనేమో ఇక ముందు
చూపు మందగించిందనీ..మసకబారిందనీ తెలిశాక...

నడి రాతిరిలో మేలుకుంటే కమ్మని నీ తలపులతో...దరిచేరదు నిద్దుర
నీ పిలుపు వినపడే దూరంలో నేను లేనని తెలిశాక..

నాకోసం మళ్లీ పుడతావా మరుజన్మలో...ఎదురుచూసే నా చూపులు
ఆలా ఆకశం వైపు... వింటున్నావా ప్రియతమా నా మనవి.



Friday, 10 July 2009

ఓయ్...ఓయ్....అంటూ క్యాజువల్ గా పిలిచెరో...


ఈ రోజు కొన్ని ఘనకార్యాలు చేశాను నేను....మొదటిది ఈ రోజు ఆఫీసుకి సెలవు పెట్టడం.
"
వాట్ ఆర్.కే (నన్ను అలానే పిలుస్తారు ఆఫీసు లో), వై డూ యు వాంట్ లీవ్.... ప్రతిసారి లీవ్ అడుగుతావేంటి.." మండిపడ్డాడు మా మేనేజర్ నేను లీవ్ అడిగిన వెంటనే...అమ్మతోడు రెండు నెలల నుంచి ఒక్క లీవ్ కూడా తీసుకోలేదు...వాడంతే, అలాగే అంటాడు.. ఆరునెలల తరవాత లీవ్ అడిగినా, నిన్నే తీసుకున్నావ్ కదా అన్నట్లు మాట్లాడుతాడు...
"
అది కాదండీ...ఫ్రెండ్ పెళ్లి ఉంది..వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు.."
"
ఆహా...సరే ఇలా కూర్చో...ప్రాజెక్ట్ లో నీ పెర్ఫార్మన్స్ గురుంచి... పెండింగ్ టాస్క్ గురుంచి మాట్లాడదాం.." అంతే ఓ అరగంట చావగొట్టాడు...ఒక్క లీవ్ అడిగిన పాపానికి ఇలా వేయించుకు తింటావా..ఒరేయ్ దొరక్కపోవురా నాకు..కసికసిగా తిట్టుకున్నా.."వాట్ డిడ్ యు సే.."అన్నాడు అనుమానంగా....నీ పిండాకూడు...నీ శార్ధం...బొంగు బోషానం..."అబ్బే ఏం లేదు ...ప్రాజెక్ట్ మీద మీకెంత శ్రద్ధ." అనుకుంటున్నా అంతే... "పొగడ్తలు కాదు పని కావాలి నాకు...సరే వెళ్ళు..." ..మొత్తానికి లీవ్ ఇచ్చాడు...

అసలు లీవ్ ఎందుకు పెట్టానో నాకే తెలీదు...ఏంటో అపుడపుడు అలా లీవ్ పెట్టాలనిపిస్తుంది అంతే...మరుసటి రోజు పదకొండుకి లేచా...ప్రతిరోజు తొమ్మిది కల్లా "కౌసల్యా సుప్రజా రామా..పూర్వ సంధ్యా.." అనుకుంటూ నా సెల్ ఫోన్ అలారం కొట్టగానే సెల్ ఫోన్ లోఅలారం పెట్టినవాడిని..అసలు అలారం అనే కాన్సెప్ట్ ని కనుక్కున్న వాడిని సంస్కృతం లో తిట్టుకుంటూ...దాన్ని స్నూజ్ చేస్తూ తొమ్మిదీ ఇరవై కి లేచే వాడిని...ఈ రోజు అలారం గోల లేకుండా హాయిగా నిద్రించా...నిద్రలో ఉన్నసుఖాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను నేను... బహుశా ప్రొద్దున తొమ్మిది ఇంటికి అలారం పెట్టుకునే గొప్ప డిస్సిప్లిన్ కలిగిన అబ్బాయిని నేనే అనుకుంటా...పన్నెండుకి బ్రష్ చేశా... అబ్బో ఇలాంటి మంచి అలవాట్లు చాల ఉన్నాయిలెండి...ఆ తర్వాత లాప్ టాప్ ఓపెన్ చేసి...మెయిల్స్ ...చాటింగ్ (ఒక్క అమ్మాయికూడా ఆన్ లైన్ లో లేదు ఈ రోజు ... :( ...) ఇంక బోర్ కొట్టి మ్యూజిక్ ఆన్ చేశా

"
నూట డెబ్భై ఆరు బీచ్ హౌస్ లో ప్రేమ దేవతా....
ఎల్లో చుడిదార్ వైట్ చున్నితో దోచే నా ఎదా
ఓయ్..ఓయ్...అంటూ క్యాజువల్ గా పిలిచెరో
ఓయ్...ఓయ్..ట్వంటీ సార్లు కల్లో కలిసేరో...
ఓయ్...ఓయ్...యంటి గుండె నిండా నిలిచెరో...
లవ్ అట్ ఫస్ట్ సైట్...." అంటూ సాగిందా పాట.....



అంతే అలా తెలిపోయాను ఆ పాటలో...తెగ నచ్చేసింది ఆ ఓయ్ పాట..ఎప్పుడూ అంత శ్రద్దగా వినలేదు ఆ పాటని...ఒక పాట నచ్చితే ఇక ఆ సినిమా చూడాల్సిందే... అంతే టైం చూసాను...ఒకటి అయింది...నెట్ ఓపెన్ చూసి ఏ థియేటర్ లో ఓయ్ సినిమా ఆడుతుందో చూశా...కేసినో థియేటర్లో చెన్నై లో తెలుగు సినిమాలు కంటిన్యువస్ గా ఆడేది రెండు థియేటర్లలో మాత్రమే...ఒకటి జయప్రద..ఇంకోటి కేసినో...ఈ మద్య జయప్రద గారు టాక్స్ కట్టలేదని ఆవిడగారి థియేటర్ ని మూసేసారు..ఇక మాకు మిగిలింది కేసినో మాత్రమే...అదొక తొక్కలో థియేటర్..దానికంటే మా గుంటూరు లో నాజ్ థియేటర్ సూపర్ ఉంటుంది....ఏం చేస్తాం తప్పదు మరి...కేసినోలో మటినీ షో మూడున్నరకి...వెళ్ళడానికే గంట పడుతుంది, టికెట్లు అందుతాయో లేదో అనుకోని గబగబా స్నానం చేసి..రెడీ అయ్యి బైల్దేరాను...అప్పుడు గుర్తొచ్చింది ప్రొద్దుటి నుంచి ఏమీ తినలేదని..ఆ విషయం గుర్తురాగానే వెంటనే ఆకలి వేసింది...ఏం చేస్తాం జీవితం...సర్లే టికెట్లు తీసుకున్నాక టైం ఉంటుందిగా తినోచ్చులే అనుకొన్నాను..థియేటర్ కి వచ్చి టికెట్ తీసుకున్నాను...


టైం మూడు అయింది, అరగంటలో తినేసి రావచ్చులే అనుకోని బైటకి వచ్చి ఒక రెస్టారెంట్లో కూర్చున్నాను..సీట్ నెంబర్ ఎంత ఇచ్చాడో చూసుకుందాం అని పర్సు తీసి అందులో ఉన్నటికెట్ తీసా...దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది...కారణం టికెట్ ఉంది కానీ డబ్బులు లేవు...అయిదు వందలు కదా నేను వాడికి ఇచ్చింది టికెట్ కోసం...అంతే పైనుంచి కిందదాకా ఒక షాక్ తగిలింది...సో వాడు నాకు తిరిగి చిల్లర ఇవ్వలేదు...టికెట్ యాభై రూపాయలు...నాలుగు వందల యాభై బొక్కేనా??, నా మైండ్ వేసిన ప్రశ్నని నేను ఇంకా జీర్ణించుకోలేదు..."సర్ ఆర్డర్ సర్.." బెరేర్ వచ్చాడు.."ఆ...మీ రెస్టారంట్లో కార్డు తీసుకుంటారా?" అడిగాను నేను..."సారీ సర్...ఓన్లీ కాష్.." అన్నాడు వాడు.."ఓహ్!! అలాగా...ఐ విల్ బీ బ్యాక్." అని చెప్పి అక్కడ నుంచి బైటకి వచ్చా..."ఒరేయ్ మెంటల్...కౌంటర్ వాడిని వెళ్లి అడుగు ఇలా చేంజ్ ఇవ్వలేదు అని.." మొట్టికాయి వేసింది నా మనసు...వెంటనే కౌంటర్ దెగ్గరికి పరిగెట్టాను..ఇవ్వడని తొంభై తొమ్మిది శాతం తెలుసు...కానీ ఆ ఒక్క శాతం మిస్ అవ్వకూడదు అని...నేను అడగ్గానే వాడు ముఖం అదోలా పెట్టాడు 'ఏ ఊరు మనది?' అనే లెవెల్లో...ఇక నేను అక్కడ నుంచి వచ్చేశా...పది నిముషాల్లో షో మొదులవుతుంది...ఒక వైపు ఆకలి...దేగ్గర్లో ఏదన్న ఏటిఎం ఉందేమో అని చూశా...ఏమీ కనిపించలేదు...సర్లే సినిమాలో పడితే ఆకలి గుర్తుండదులే అని కేవ్ కేవ్ మని కేకలు వేస్తున్న ఆకలి పెగులకి సర్దిచేప్పా...

"
సెలెబ్రేషన్.. అది చేసుకోడానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కో రీజన్...అందరు జరుపునే కామన్ సెలేబ్రషన్ న్యూ ఇయర్..న్యూ ఇయర్ సెలేబ్రషన్ అంటే నాకు చాలా ఇష్టం...ఎందుకంటే ఆ రోజు నా బర్త్ డే కాబట్టి...కానీ లాస్ట్ ఇయర్ నుంచి జరుపుకోడం మానేసాను..." అంటూ హీరో సిద్దార్థ్ అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళడంతో ఓయ్ సినిమా మొదలవుతుంది....ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించింది...అంటే యాభై రూపాయలకి ఆ సినీవినోదం బాగానే ఉండేది...కానీ అయిదువందలు బొక్కేట్టుకున్నాంగా అంచానాలు పెరిగాయి..కాని ఓయ్ సినిమా కోసం అయిదువందలు ఎవడు పెట్టి ఉండడెమో...నేను తప్ప...అంటే పెట్టేలా ఆ దేవుడు శాసించాడు... ఈ కిషెన్ పాటించాడు...ఆ కౌంటర్ వాడు పండగ చేసుకున్నాడు..

ఇంటర్వెల్లో నా ఆకలి పేగులు మళ్ళి నిద్ర లేచి గోల చెయ్యడం స్టార్ట్ చేసాయి... థియేటర్ లో క్రెడిట్ కార్డు ఎవడు తీసుకుంటాడు నా బొంద..అయినా అడిగాను...వాడు విచిత్రం గా చూశాడు....సినిమా కి వెళ్తే ఇంటర్వెల్ లో మినిమం ఒక చేతిలో ఒక కూల్ డ్రింక్, ఇంకో చేతిలో చిప్స్ లేక పఫ్ ప్యాకెట్ లేనిదే సెకండ్ హాఫ్ చూసినట్లు ఉండదే...చా తొక్కలో జీవితం...నాకు ఎప్పడు ఫ్రస్ట్రేషన్ వచ్చినా నా నోటితో నా జీవితం బలవుతుంది...చదివారుగా నా ఇంటర్మీడియట్ సంగతులు...ఇప్పుడు సెకండ్ హాఫ్ అసలు ఎలా చూడలబ్బా...చిరాకు వేసింది...చా అయినా అంత మతిమరుపు ఏంటో నాకు...ఏ జన్మలోనో ఆ కౌంటర్ జీవికి ఈ మతిమరుపు జీవి బాకీ అనుకుంటా...అందరు కూల్ డ్రింకులు, పుఫ్ లు, పాప్ కార్న్ లు తెగ కొనుక్కొని వెళ్తున్నారు...అవన్నీ చూసే నా ఆకలి పేగులు బ్రేక్ డాన్స్ చెయ్యడం మొదలుపెట్టాయి...పాపం ప్రొద్దుటి నుంచి వాటి సంగతి చూడలేదు మరి..అవి ఎలా తట్టుకుంటాయి..జాలి వేసింది నాకు వాటి మీద ...చురుగ్గా పనిచెయ్యడం మొదలు పెట్టింది నా బుర్ర సడన్ గా.... తళుక్కున మైండ్ లో ఒక మెరుపు మెరిసింది...


వెంటనే పర్సు తీసాను...అందులో ఒక చిన్న జిప్ హోల్దర్ ఉంటుంది..అది తెరిచాను...కళ్ళు జిల్ జిల్ జిగేల్ మన్నాయి...అవును అందులో యాభై రూపాయలు ఉన్నాయి మరి...నిన్న రాత్రి డిన్నర్ బిల్ పే చేసాక వాడిచ్చిన యాభై చేంజ్ ఎందుకో వెరైటిగా ఈ జిప్ హోల్దేర్ లో పెట్టాను...ఇప్పుడు అర్థం అయింది అపుడు అలా ఎందుకు పెట్టానో...కొన్ని కొన్ని సార్లు మనం కొన్ని పనులు వెరైటి గా చేస్తుంటాం...ఎందుకో మనక్కూడా తెలీదు...బహుసా అవి ఇలాంటి అత్యవసర స్థితిలో ఉపయోగపడ్డానికేమో....నా రీజనింగ్ మరియు అనలిటికల్ అబిలిటీకి నాకే ముచ్చటేసింది...అపుడు నాకు కనిపించిన యాభై రూపాయలే నాకు అయిదువందల కంటే ఎక్కువ అనిపించాయి...అప్పుడు నాకు ఇంకో విషయం అర్థమైంది...డబ్బుకి విలువ ఒక అంకె పక్కన ఎన్ని సున్నాలు తోడైతే అంత పెరిగినట్లు కాదని...ఆ డబ్బు ఒక మనిషికి ఎంత గొప్ప అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడితే దానికి అంత విలువ అని...అయ్యబాబోయ్, ఇలాంటి టైం లో బిచ్చ గాడికి బిర్యాని పొట్లం దొరికినట్లు నాకు యాభై దొరికేసరికి నా అనలిటికల్ పవర్ కి వెయ్యి మెగావాట్లు అందాయిగా...ఎన్నెని విషయాలు తెల్సిపోతున్నాయో...అమ్మో సెకండ్ హాఫ్ టైం అయింది అనుకోని వెండర్ దెగ్గరికి వెళ్లి ఒక ఫాంటా పెట్ బాటిల్...రెండు ఎగ్ పఫ్ లు కొనుక్కొని లోపలి వెళ్ళా...


అపుడే సినిమా స్టార్ట్ అయింది, పాపం హీరోయిన్కి కాన్సర్ ఉందని తెల్సి హీరో ఫేస్ జీరో వాల్ట్ బల్బు అయింది...ఇక అక్కడి నుంచి హీరోయిన్ కోరికలు తీర్చడానికి నానా కష్టాలు పడతాడు మన హీరో...అమ్మో ఇన్ని వెరైటీ కోరికలు ఉన్న అమ్మాయిని నేను ఖచ్చితంగా లవ్ చెయ్యను...ఎందుకంటే నాకు మహా బద్ధకం, నా చిన్ని చిన్ని కోరికలే ఇంకా నేను తీర్చుకోలేదు, ఇంకా దాని కోరికలు ఎక్కడ తీర్చను...రివర్స్ గా నా కోరికలు తీర్చే అమ్మాయి దొరికితే బాగుండేమో..."దేవుడా...ఒ మంచి దేవుడా...నువ్ నాకు యాభై రూపాయలు దొరికేలా చేసావ్..తద్వారా ఒ కూల్ డ్రింక్ ఇచ్చావ్...రెండు పుఫ్ లు కూడా ఇచ్చావ్ అలాగే ఇంకో చేత్తో ఓ మంచి గర్ల్ ఫ్రెండ్ ని ఇవ్వు...నాకు ఏది కావాలంటే అది కొనిపెట్టేలా...నా ఫోన్ బిల్లులు అన్ని తన బిల్లులుగా తలచి అన్ని క్లియర్ చేసేలా...తన క్రెడిట్ కార్డ్ నా బర్త్ డే కి గిఫ్ట్ గా ఇచ్చేలా(బిల్ మాత్రం తన అడ్రస్ కే వచ్చేలా)....ఆ విధంగా నాకు గర్ల్ ఫ్రెండ్ ని ఇస్తావని కోరుకుంటాను....నువ్ ఇస్తావ్...నాకు తెలుసు...ఎందుకంటే యు ఆర్ బెసికల్లీ వెరీ గుడ్ గాడ్.." అని వెంకి లెవెల్ లో దేవుడికి చిన్న ప్రార్ధన చేసుకున్నా...సినిమా చివర్లో కొంచెం బాధేసింది...పాపం షామిలి చనిపోతుంది...చనిపోయేప్పుడు హీరో మీద తనకి ఎంత ప్రేమ ఉందొ చూపిస్తుంది..చివర్లో ఐ లవ్ యు అంటుంది...అపుడు నేను కూడా కొంచెం ఫీల్ అయ్యాను...అక్కడ కొంచెం ఆ సెంటిమెంట్ నచ్చింది...మొత్తానికి మూవీ అయిపొయింది బైటకి వచ్చేశా...



"
ఓయ్ ...ఓయ్...నిన్నే..."

ఏంటబ్బా హీరోయిన్ వాయిస్లా ఉంది అని వెనక్కి తిరిగి చూశా...

ఎవరూ లేరు...అంత నీ భ్రమా...బ్రాందీ...విస్కీ...అంతే..అని చెప్పింది నా మనసు...

"
ఓయ్ ఓయ్ ..అంటూ క్యాజువల్ గా పిలిచేరో...

ఓయ్ ఓయ్ ..కల్లో ట్వంటీ సార్లు కలిసేరో...."
...