Search This Blog

Friday 3 July, 2009

నిను వీడని నీడను నేనే......



రాజమండ్రి..
సాయిరాం బాలుర వసతి గృహం..
నేను Btech 3వ సంవత్సరం చదువుతున్నాను ...
2003 జనవరి...
డేట్ గుర్తులేదు...అర్థరాత్రి దాదాపు ఒంటిగంటన్నర..
కిటికీ గాలికి టపటపా కొట్టుకుంటుంది...


కెవ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్ .... గట్టిగా క్రింద ఫ్లోర్ నుంచి పెద్ద కేక....అంతలోనే నిశ్శబ్దం...



అపుడే నిద్రలోకి జరుకొన్న నేను ఉలిక్కిపడి లేచాను...పక్కన చూస్తే శీనుగాడు దున్నపోతులా నిద్రపోతున్నాడు...కొంపదీసి ఎమన్నా పీడ కల కన్నానా??... అసలే అంతకు ముందే తేజ టీవీ లో అంతస్తులు సినిమా వస్తే "నిను వీడని" పాట కోసం పాట వచ్చేదాకా సినిమా చూసి ఆఫ్ చేసి పడుకున్నాను... అయినా నేను గుమ్మడిని కాదు , కేక పెట్టింది సావిత్రి కాదు...కలయో వైష్ణవ మాయో తెలియని స్థితిలో మళ్ళినిద్రకు ఉపక్రమించాను...మళ్లి అంతలోనే పెద్ద కేక...కాదు కేకలు...ఎవరో గట్టి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తున్నారు కింద ఫ్లోర్ లో ...

ఇక నిద్ర పట్టలేదు నాకు... కిందకి వెళ్లి విషయం ఏమిటో తెలుసుకోవాలి అనిపించింది..రూం డోర్ ఓపెన్ చేస్తే అంతా చిట్ట చీకటి...నాకు చీకటి అంటే భయం.. ఇపుడు ఈ చీకట్లో తారట్లాడుకుంటూ క్రిందకి వెళ్ళి విషయం తెలుసుకొని పొడిచేది ఏమిటంట..నా అంతరాత్మ నా భయాలను ఈ విధంగా కవర్ చేస్తుంటుంది...శీనుగాడిని లేపాను..వాడు లేచీ లేవనట్లు..కళ్ళు తెరిచీ తెరవనట్లు ఉండి "జావా రికార్డు సోమవారమే కదరా సబ్మిట్ చేసేది...నేను ఇంకా 5 ప్రోగ్రామ్స్ కి కోడ్ రాయాలి.." అని మళ్లీ పడుకున్నాడు.. "నీ రికార్డు గొల తగలెయ్యా...నిద్రలో కూడానా!! " అనుకోని మెల్లిగా నేనే అడుగులో అడుగు వేసుకుంటూ క్రిందకి బైల్దేరాను...మార్గమధ్యం లో కృష్ణా గాడు కనిపించాడు...హమ్మయ్య అనుకున్నా...వాడి ఫేస్ సీరియస్ గా ఉంది,భ్రుకుటి ముడి పడి ఉంది...వాడు ఏదన్నా విషయం తెలుసుకుంటే వాడి ముఖం లో తప్పనిసరిగా కనిపించే మార్పులవి.."ఏంట్రా విషయం?..ఏంటి ఆ కేకలు ఈ టైం లో.." అన్నాను..

వాడు సీరియస్ గా నాతో రా అని నన్ను వాడి రూం లోకి లాక్కుపోయాడు.. అసలు మేటర్ ఏంటో అని నాకేమో టెన్షన్ స్టార్ట్ అయింది.. "క్రింద ఫ్లోర్ లో చైతన్య తెలుసు కదా నీకు? " అన్నాడు రూం లోకి వెళ్ళగానే.."అవును ..అయితే.." అన్నాను ఇంకేం చెప్పబోతున్నాడో అనే టెన్షన్ లో.. "వాడికి...వాడికి.." అంటూ నా వైపే సీరియస్ గా చూస్తున్నాడు.."ఒరేయ్ చంపకురా...చెప్పురా.." అన్నాను దీనంగా.. "వాడికి దెయ్యం పట్టిందట..దెయ్యం వాడి గొంతు నులిమి చంపబోయిందట...దెబ్బకి వాడు గట్టి గాట్టిగా అరిచేసరికి దెయ్యం వాడిని వదిలి పారిపోయిందట...క్రింద అదే గోలగా ఉంది..వాడేమో భయంతో వణుకుతున్నాడు...ఒళ్ళంతా వేడిగా ఉంది...రా నువ్వూ చూద్దువుగాని " అంటూ నన్నుక్రిందకి లాక్కువెళ్ళాడు...క్రింద ఫ్లోర్ లో వాడి రూం చుట్టూతా స్టూడెంట్స్..లోపలి వెళ్లి చూస్తే తలకి ఒక రుమాలు చుట్టుకొని బెదురు చూపులు చూస్తూ ముడుచుకొని కూర్చున్నాడు వాడు...

"ఖచ్చితంగా కామిని దెయ్యమే.. తీరని కోరికలతో పెళ్లి కాని అబ్బాయిలని పట్టేది అదే.." అన్నాడు వెంకన్న(హాస్టల్ పనివాడు)... "కామిని అయితే గొంతు నులిమి చంపదు ఎంకన్నా...అది కొరివి దెయ్యం అయి ఉంటుంది.." అని ఓసారి గడ్డం గీక్కొని "ఏరా అబ్బాయి ... ఆ దెయ్యాన్ని సరిగ్గా చూసావా??...తల పైన మంటలు కనిపించాయా.."అడిగాడు తిరుపతయ్య (మా వంటవాడు).."లేదు తిరుపతి...అది ఖచితంగా తెల్ల చీర కట్టుకొని ఉండి ఉంటుంది..ఎరా అబ్బాయ్??" వాడి మొహం లోకి చూసాడు వెంకన్న...అసలే బెదిరిపోతున్న వాడు ఇంకాస్త వణకడం స్టార్ట్ చేసాడు... "అది తెల్ల చీర కట్టుకోలేదు... తలపైన మంటలూ లేవు....అది కేవలం ఒక తెల్లని ఆకారం...కేవలం ఆకారం...ఆకారం" అంటూ హిప్నోటిస్ట్ రేంజ్ లో వినిపించిన మాటల వైపు మా చూపులు కదిలాయి...చూస్తె జగన్...మా హాస్టల్ పక్క అపార్టుమెంటులో ఉంటాడు..."ఎటయ్యా జగన్, ఏటి నువ్వనేది?" తగులుకున్నాడు తిరుపతయ్య.. " అవునండి..నిజం..నేను రొజూ ఆఫీసు ఫైళ్ళు చూసి పడుకోనేసరికి ఒంటిగంట దాటుద్ది...ఆ టైం లో అలా బాల్కనీ లోకి వచ్చి కాసేపు చల్ల గాలి పీల్చి పడుకోనేవాడిని...వారం రోజులనుంచి చూస్తున్నా, నేను ఆ టైం లో బాల్కనీ లోకి వచ్చి చూసేసరికి మీ హాస్టల్ టెర్రస్ పైన ఏదో తెల్లని ఆకారం కనిపించేది నాకు..మొదటి రోజు చూసి ఏదో అనుకున్నా, కానీ ప్రతి రొజూ కనిపిస్తుండేసరికి నాకు అనుమానం వచ్చింది..ఈ రొజూ ఈ సంఘటన తో అదే దెయ్యం అని అర్థం అయిపొయింది.." జగన్ చెప్తుంటే అందరం కొయ్యబొమ్మల్లా అయిపోయాం.. చైతన్య గజగజా వణుకుతున్నాడు..వాడికి దెయ్యం పట్టింది అన్న భయం కంటే వీళ్ళ మాటలకు బెదురుతో చచ్చేలా ఉన్నాడు...

మరుసటి రొజూ ప్రొద్దున్నే చైతన్య గాడు తట్టా బుట్టా సర్దుకొని హాస్టల్ నుండి జంప్...మేము సాయంత్రం కాలేజీ నుండి హాస్టల్ కి రాగానే, జగన్ గాడు ఆల్రెడీ హాస్టల్ లో ఉన్నాడు.. "ఎం జగన్ అన్నా..ఈ రొజూ ఆఫీసు కి వెళ్ళలేదా?? " అడిగాను అతన్ని చూడగానే.. "లేదు...మీ అందరితో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి ఈరోజు.." అన్నాడు.. అందరం డిన్నర్ చేసాక, అందరిని ఓ రూం లో సమావేశ పరచాడు జగన్..
" చైతన్య వాళ్ళ రూం లోకి ఈ పుర్రె ఎలా వచ్చింది? " అడిగాడు జగన్ తన చేతులోని పుర్రెని చూపిస్తూ
"అది మా సైన్స్ ఫెయిర్ కోసం తెచ్చాం..." అన్నాడు రాజేష్ (చైతన్య రూం మేట్)
"ఎక్కడనుంచి?"
"తెలీదు...చైతన్య గాడే తెచ్చాడు"..
"ఈ పుర్రె చూసారా...దీనికి సరిగ్గా మాడు పైన తాటికాయంత రంధ్రం ఉంది.." అంటూ పుర్రెని చూపించాడు జగన్..
"అయితే..." అడిగాను నేను ఆత్రం ఆపుకోలేక...
"చెప్తాను..అంతా క్లియర్ చేస్తాను.."అని నుదిటి మీద చెయ్యి వేసుకున్నాడు, చంద్రముఖి లో రజినీకాంత్ లెవెల్లో..(అప్పటికి చంద్రముఖి రిలీజ్ కాలేదు లెండి...సో వాడి పోజ్ ఒరిజినలే!!)..
"మీకో విషయం తెలుసా...ఈ హాస్టల్ అయిదు సంవత్సరాల క్రితం ఒక హాస్పిటల్...సరిగ్గా అయిదు సంవత్సరాల క్రితం ఇక్కడ ఓ పేషెంట్ కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు... అతను మూడవ అంతస్తు నుంచి దూకాడు...అతని తలకి బలమయిన గాయాలు అయ్యాయి..ఈ పుర్రె అతనిదే అని నాకొక ధృడమైన అభిప్రాయం.." అంటూ మా వైపు చూసాడు.. అప్పటికే అందరి ముఖాలలో ఓ రకమైన బెదురు కళ తాండవిస్తుంది.. "అసలు ఈ రోజు నేను ఆఫీసు కి ఎందుకు వెళ్ళలేదు అనుకున్నారు!! మీ పని మీదే...అవును.. ఇంతకముందు ఇక్కడ ఉన్న హాస్పిటల్ ఇపుడు దానవాయిపేటలో పెట్టారు...ఈ రొజూ అక్కడికే వెళ్ళాను..అక్కడ నాకు తెల్సిన ఫ్రెండ్ ఉన్నాడు లెండి...వాడి హెల్ప్ తో, ఓల్డ్ రికార్డ్స్ లో ఇక్కడ చనిపోయిన వాళ్ళ రికార్డ్స్ చూసాను...అబ్నొర్మల్ గా చనిపోయింది వీడొక్కడే...నా దృష్టిలో అసహజ చావు వల్ల ఇలాంటి స్పిరిట్స్ వస్తాయి..సో అందుకోసం ఆ కోణం లో దర్యాప్తు జరిపాను.." అని ఓ క్షణం ఆగి నీళ్ళు తాగాడు...వాడిలో ఓ డిటెక్టివ్ నారద కనిపించాడు నాకు అప్పుడు.. "సో ఇప్పుడు అసలయిన పాయింట్...ఆ చనిపోయిన వాడి పేరు క్రిస్తోఫెర్, అంటే అతను క్రైస్తవుడు..వాడి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వాడి స్కల్కి పెద్ద బండ రాయి గుద్దుకోడంతో రంధ్రం ఏర్పడింది అని ఉంది....ఇప్పుడు ఇంకొక పాయింట్, క్రైస్తవులని రాజమండ్రి లో దాదాపు అందరూ చర్చి గేటు వెనుకాల స్మశాన వాటిక లోనే పూడ్చి పెడతారు...కనుక వీడిని కూడా అక్కడే పూడ్చి ఉంటారనుకున్నా...నేను మీరు రాకముందు చైతన్యకి ఫోన్ చేసి రూం లో పుర్రె విషయం అడిగితే, అది వాడే తెచినట్లు, అదీ చర్చి గేటు స్మసనంలోనే కాపరికి ఓ పది రూపాయలిచ్చి తెచినట్లు చెప్పాడు...సో ఈ పుర్రె కచ్చితంగా క్రిస్తోఫెర్ గాడిదే...చైతన్య ఈ పుర్రె తెచ్చి వారం అయింది...నాకు ఈ దెయ్యం కూడా వారం నుంచే కనిపిస్తుంది..." అని చెప్పడం ఆపాడు....ఈ విషయంలో ఈ జగన్ గాడికి ఇంత ఇంట్రెస్ట్ ఏమిటో నాకు అర్థం కాలేదు, కనీ వాడు చేప్తున్న తీరు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది... " అయితే ఎం చేద్దాం ఇప్పుడు..."కృష్ణా గాడు అడిగాడు సీరియస్ గా, వాడి భ్రుకుటి మళ్లీ ముడిపడింది.." చెప్తాను...దీనికి ఒక పరిష్కారం, ఆ స్పిరిట్ కి ఏమి కావాలో తెల్సుకోవాలి...దాని మనసు కనుగొనాలి.." అన్నాడు.."స్పిరిట్ కి మళ్లీ మనసు ఏంటిరా నీ బొందా.."అనుకున్నా నేను .. "అందుకు మనం ఓ గేమ్ ఆడాలి.....అదే స్పిరిట్ గేమ్...ఈ రోజు సరిగ్గా ఒంటి గంటకు మొదలు పెడదాం స్పిరిట్ గేమ్...ఆ దెయ్యం రొజూ ఆ టైం లోనే మన టెర్రస్ పైకి వస్తుంది, సో మనం ఆ టైం లో గేమ్ మొదలు పెడితే మంచిది...సో గెట్ రెడీ .." అని సమావేశం ముగించాడు..."

ఆ రొజూ రాత్రి...
సమయం ఒంటిగంట అయిదు నిముషాలు..
ప్లేస్ : చైతు గాడి రూం (ఎఫెక్ట్ కోసం అంట..)
సభ్యులు: జగన్ తో పాటు కుతూహలం ఉన్న ప్రతివాడు..నేను కూడా..అంటే రూం లో ఒక్కడినే పడుకోవాలంటే భయం వేసి వచ్చా అనమాట..
అందరం రౌండ్ గా కూర్చున్నాం...మధ్యలో జగన్ స్పిరిట్ గేమ్ షీట్ తో కూర్చున్నాడు..అతని ముందు క్రిస్తోఫెర్ పుర్రె..ఆ పుర్రె మీద ఒక కాండిల్ ..పుర్రెకి ఇరువైపులా రెండు కాండిల్స్ వెలిగించాడు...ఎవడో ఏదో గోణుగుతుంటే "ఇష్..నిశ్శబ్దంగా ఉండాలి అందరు..ఈ స్పిరిట్ గేంలో మనం ఇపుడు క్రిస్తోఫెర్ స్పిరిట్ ని ఆహ్వానించాలి... వాడి మనసు తెలుసుకోవాలి...ఏం చేస్తే వాడు ఈ హాస్టల్ ని వదిలిపోతాడో తెలుసుకోవాలి..నేను ఇపుడు క్రిస్తోఫెర్ ని ఆహ్వానిస్తాను...గాఢమైన ధ్యానంలో కి వెళ్లి వాడి స్పిరిట్ ని ఆహ్వానిస్తాను..అపుడు మీరు నాలో కొన్ని మార్పులని గమనిస్తారు..వాడి స్పిరిట్ నాలో వచ్చాక అపుడు నేను నేను కాదు...నేను క్రిస్తోఫెర్ ని..అపుడు మీరు ధైర్యంగా నన్ను ఎందుకు వచ్చావ్? నికేమి కావాలి అని అడగాలి...మీ ప్రశ్నలకు అనుగుణంగా రూపాయి బిళ్ళ మీద ఉండే నా వేలు కదిలి మీకు ఈ అక్షరాల ద్వార సమాధానం చెప్తుంది.." అంటూ గేమ్ కి రూల్స్ మరియు రెగులేషన్స్ చెప్పాడు..

ఆ రూల్స్ విన్న కొందరు చల్లగా అక్కడినుంచి జారుకొన్నారు...నాకు కూడా వెళ్లిపోవాలి అనిపించింది..అదే విషయం కృష్ణా గాడి చెవిలో కొరికాను.."ఉండేహే..అంట భయమేటి..."అన్నాడు...ఇంతలో జగన్ గాడు "నేను ఇపుడు ధ్యానం లోకి వెళ్తున్నా...క్రిస్తోఫెర్ ని ఆహ్వానిస్తున్నా ..."అంటూ కళ్ళు మూసుకున్నాడు....అంతా నిశ్శబ్దం..టైం 1 30 అయింది..నిముషాలు భారంగా గడుస్తున్నాయి...అందరూ వాడి ముఖాన్ని జాగ్రతగా పరిశీలిస్తున్నారు...ఏ చిన్న తేడా కనిపించినా కృష్ణా గాడు వెంటనే "నువ్వు క్రిస్తోఫేరా ?" అని మెల్లగా అడుగుతున్నాడు...కానీ రూపాయి మీదున్న వేలు నుంచి రెస్పాన్స్ లేదు..ఒక పది నిముషాల తర్వాత వాడి ముఖ కవళికలు మారుతున్నాయి..వాడు చిన్నగా ఊగుతున్నాడు..వెంటనే కృష్ణా గాడు "నువ్వు క్రిస్తోఫేరా ?" అని అడిగాడు మళ్లీ...అందరం జగన్ గాడి వేలు వైపు చూస్తున్నాం...ఆశ్చర్యం ఆ వేలు కదలడం ప్రారంభించింది..అవును అనే అక్షరం దెగ్గర ఆగింది ..."క్రిస్తోఫెర్ వచ్చాడు రా..అందరు కామ్ గా ఉండండి..."గుసగుసగా చెప్పాడు కృష్ణా..మేమందరం జగన్ గాడిని జూ లో జంతువులా..మ్యుజియంలో బొమ్మలా...తెగ పరిశీలిస్తున్నాం..క్షణక్షణానికి వాడు వాడి ముఖం మార్చేస్తూ..అటూ ఇటూ ఊగుతూ..పెదాలు కదుపుతున్నాడు...

"నువ్వూ మా హాస్టల్కి ఎందుకు వచ్చావ్" మరో ప్రశ్న అడిగాడు కృష్ణా గాడు..వేలి కదలికల్ని బట్టి "నాలోని భాగం కోసం వచ్చాను " అని వచ్చింది జవాబు...
కృష్ణా గాడు పుర్రె వైపు చూపించి "భాగం.." అన్నాడు..
నేను తలూపాను..
"నీకేం కావాలి?" కృష్ణా గాడి నుంచి దూసుకు వచ్చింది ఇంకో ప్రశ్న..మళ్లీ కదలికలను బట్టి "నాకు ఈ స్థలం కావాలి...మీరు అందరు ఇక్కడి నుండి వెళ్ళిపొండి" అనేది సమాధానం...
మేము ఒకరి ముఖాలు ఒకళ్ళం చూసుకున్నాం...ఆ తర్వాత ఏం అడగాలో కృష్ణా గాడికి అర్థం కాలేదు.. ఏదో ఒక ప్రోగ్రాం లో చూసా , స్పిరిట్ గేమ్ తో భవిషత్తు కూడా తెల్సుకోవచ్చని..అదే విషయం కృష్ణా గాడికి చెప్పా..వాడు వెంటనే "నేను చివరికి అన్ని ఎగ్జామ్స్ పాస్ అవుతానా?" అని అడిగాడు..సమాధానం కాదు అని వచ్చేసరికి వాడు నల్ల మొహం వేసాడు..
"నాకు అందమైన అమ్మాయితో పెళ్లవుతుందా.." అడిగాడు అప్పటిదాకా కళ్ళు తెరిచి నిద్రపోతున్న కేశవ్..సమాధానం అవును అని రావడం తో "అయితే సౌమ్య తో నాకు లైన్ క్లియర్ అయినట్లే..రేపే దానికి ప్రోపోస్ చేస్తా..దానికంటే అందమైన అమ్మాయి లేదు రా" అన్నాడు సంబరంగా..
ఇక అంతే..ప్రతి ఒక్కళ్ళు ఒక్కో ప్రశ్న అడగటం మొదలెట్టారు.."నేను అమెరికా వెళ్తానా?".."నాకు పెళ్ళయితే కట్నం కనీసం యాభై లక్షలు ఇస్తారా?" ..ఇలా ఏవేవో..ఇంతలో జగన్ గాడి ముఖకవళికలు మళ్లీ మారుతున్నాయి...వాడు మరీ ఎక్కువగా తల ఊపేస్తున్నాడు..సడన్ గా కళ్ళు తెర్చాడు.."ఏమయింది.." అన్నాడు..'క్రిస్తోఫెర్ వచాడు జగన్ అన్నా...నేను ప్రశ్నలు అడిగాను.." అన్నాడు కృష్ణా..వాడు అడిగినవి ..వీడు చెప్పినవి అన్ని చెప్పాడు కృష్ణా..."సో అర్థమైందా మీరు ఈ హాస్టల్ లో ఉండటం అంత మంచిది కాదు..వేరే హాస్టల్ జాయిన్
అవ్వండి..వాడు ఈ ప్లేస్ వదలడు.." అన్నాడు జగన్ గాడు...

ఆ తర్వాత రెండు మూడు రోజుల దాక నాకు రాత్రి కొంచెం భయం భయంగానే ఉండేది..రాత్రి బాత్రూం కి వెళ్ళాలన్నాభయం వేసి..రాత్రుల్లో ఆ పనిని రెండు మూడు రోజులు వాయిదా వేసాను..జగన్ మాట ప్రకారం కొంత మంది హాస్టల్ మానేసి వెళ్లిపోయారు....జగ్గిరెడ్డి (మా హాస్టల్ ఓనరు) కి అనుమానం వచ్చింది..ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు అనే విషయం అర్థం కాలేదు జగ్గి రెడ్డి కి..ఓ రొజూ పిలిచి మాట్లాడాడు మాతో...అపుడు జరిగింది అంతా చెప్పాము..జగ్గిరెడ్డి కి పట్టరాని కోపం వచ్చింది జగన్ గాడి మీద "వాడు పెద్ద వెధవ..ఆ విషయం తెలుసా మీకు...వాడిని భరించలేక వాడి పెళ్ళాం వాడిని ఎపుడో వదిలేసింది..వాడికి నాకు ఓ సారి గొడవ అయింది..అపుడు నా మీద కక్షతో నీ హాస్టల్ ఎలా సాగుతుందో నేను చూస్తాను అని పెద్ద పుడింగిలా ఛాలెంజ్ చేసాడు..అసలు ఈ దెయ్యం గొడవ అంతా వాడే కలిపించి ఉంటాడు...అలా చెప్పి మిమ్మల్ని ఖాళి చేయించాలని వాడి ఐడియా..లేకపోతె ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఎపుడు లేనిది ఈ రొజూ దెయ్యం ఏంటమ్మా.." అంటూ చెప్పుకోచాడు జగ్గి రెడ్డి.."అంటే ఇపుడు మరి పుర్రె.. ."అంటూ చెప్పబోతున్న కృష్ణా గాడికి చేయి చూపించి ఇంక ఆపు అని సైగ చేశా....


రాజమండ్రి..
సాయి రామ్ బాలుర వసతి గృహం.
ఫిబ్రవరి, 2003..
అర్థరాత్రి.....

కేవ్వ్వ్...వ్వ్...వ్వ్..వ్వ్...వ్వ్...పెద్ద కేక గాట్టిగా వినిపించేసరికి ఉలిక్కిపడి లేచాను...
మళ్లీ అంతా నిశ్శబ్దం....
మళ్లీ కేక వినిపిస్తుందో ఏమో అని అలాగే మేలుకొని చూసాను కాసేపు...ఎంతసేపైనా ఇంకో కేక వినిపించలేదు...అపుడు అర్థమైంది, అంతకముందు చూసిన "ది రింగ్" చిత్ర మహిమ ఈ పీడ కల అని...అన్ని ఆలోచనలు పక్కన పెట్టి హాయిగా పడుకున్నాను...





22 comments:

నేస్తం said...

కిషన్ ఇదేమన్నా న్యాయం గా ఉందా మీకు ప్రొద్దున ప్రొద్దున్నే ఇలా భయపేడతారా మా ఆయన అసలే భయటకు వెళ్ళారు :(

Ram Krish Reddy Kotla said...

నేస్తం.. అర్థరాత్రి అయి ఉంటె అనొచ్చు మీరు ఈ మాట... ప్రొద్దున ప్రొద్దున్నే భయం ఏమిటండీ.. :) చదివే మీరే భయపడితే, అక్కడ ఆ ప్రహసనంలో పాలుపంచుకున్న నా పరిస్థితి అర్థం చేసుకోండి.. :)

సిరిసిరిమువ్వ said...

ఏదో హారర్ సినిమా చూస్తున్నట్టు ఉందండి బాబూ!
బాగా వ్రాస్తున్నారు.

Ram Krish Reddy Kotla said...

సిరిసిరిమువ్వ గారు... థాంక్స్ అండి..ఏదో మీ అభిమానం :)

జ్యోతి said...

ఇంకానయం .. ఈ టపా రాత్రి సమయంలో టపాయించలేదు.:)

సినిమా సీన్ లా భలే రాసారు.. మీరే ఓ హారర్ కధ రాయకూడదు..

Ram Krish Reddy Kotla said...

జ్యోతి గారు థాంక్స్ అండి మీ అభిమానానికి..మీకో విషయం చెప్పనా, నేను ఈ టపా అర్థరాత్రి కూర్చొని రాసా...కరెక్ట్ గా midnight 12 కి స్టార్ట్ చేశా తెలుసా :)...
హారర్ కథ తప్పకుండా రాస్తానండి... :)

Hrudaya..... said...

hi...meru 1st nunchi last daka chala chakkaga pondikaga vrasaru ante chakkaga maku artamayyayi...elane meru vrayalani..me yokka kotta blog kosam eduruchustu...selavu

Hrudaya... said...

hi...meru modatinunchi chivaridaka chala chakaga..voddikaga...pondikaga...chetrikarincharu.ante chakkaga maku artamayyayi elane meru vrayalani,me yokka nutana blog kosam eduruchustu....selavu.

Ram Krish Reddy Kotla said...

హృదయ...చాలా థాంక్స్ అండి..మీ అభిమానం తోడుగా ఉంటె ఇంకా చక్కగా ఎన్నో కొత్త పోస్టులతో మీ ముందుకు వస్తాను.. keep visiting...

Sunil Chakravarthy Binkam said...

orey orey... maree raathri chadavamanalaara .... nidrapattaka chaachaanu telusaa?

may be ivanni nenu join avvakamundi jariguntaayi kada?

Ram Krish Reddy Kotla said...

సున్నీ హ హ..అవును రా ఇవన్నీ నువ్వు ఇంకా మా హాస్టల్లొ జాయిన్ అవ్వకముందు జరిగినవి...సరే ఇపుడు హయిగా నిధ్రపొ మరీ.. నిను వీడని నీడని నేనే... :)

krishna kolachina said...

orrai kaavi sarvabhavuma ...wonderful ga raasav ra . ee kadha lo "krishna" paatra naade .orrai monna christopher kanipinchaadu ra , "Kishen edi , eppudu vastaadu ?? naaku okaadini bore kodtondi " ani cheppamannadu neeku :)

Ram Krish Reddy Kotla said...

Hey krishnaa...mukundaaa...murareee... bagunnava ra..deyyalane prasnalu adigina vadivi,neeku deyyam(christopher) kanipinchadam lo ascharyam emundi nayana...na gurinchi adigaada...ayite rammanu..naku kooda bore kodutundi..iddaram kalsi goleelu aata adukuntaam...ok na :)

Padmarpita said...

అబ్బో...మొత్తానికి ధైర్యవంతులే మీరు!!!

Ram Krish Reddy Kotla said...

చిన్నగా అంటారేంటి పద్మ గారు... అపుడపుడు దెయ్యలతో గోలీలు..పుర్రెలతో ఫుట్ బాల్ ఆడుకుంటూ ఉంటాను టైం పాస్ కి.... కానీ ఆ టైం లో ఉందండీ నా పరిస్థితి... అబ్బో వర్ణించడానికి అలవి కాదు లెండి ..

Srini said...

keeka ra... malli mana hostel days anni gurthuku vachhaiii... ee sangatana garigina roojulu bhale ga malli raasavu, nenu marichipayya... neelo o goppa writer unnadani telusu gani manchi script writer kuda unnadani ippude telisindi....

keep it up,
Srinu...

Ram Krish Reddy Kotla said...

Thanks sreenu....

Anonymous said...

Hey Rama krishna

i too studied in Vidwan 1998-2000.

My name is rajesh(day scholar in hostel)

I used to live in the opposite house of Vidwan.

Hope you rememeber me

Anyway nice blog...keep going..

Anonymous said...

ammmooooo baya vesthundhi katha chadavalante...andhu ke madhaylo ne apesaaaa....

Ram Krish Reddy Kotla said...

Rajesh, i do remember you...how are you doing?..give me ur mail id to me..

Unknown said...

hi..dis is deepika 4m banglore....naku telugu chadavadam rakapoina kasta padi artum chesukuni chadivenu......its like ram gopal verma movie.........horrible n nice ...

Ram Krish Reddy Kotla said...

Hai Deepu.. nice to see your comment..telugu chadavadam rakapoyina chala kashtapadi chadivinanduku, am really glad :-). mee abhimaanaaniki marokkasari pedda THANKS :-)