Search This Blog

Tuesday 7 July, 2009

ఊహలు నిజమైన వేళ....


ఊహలు నిజమైన వేళ....ఆ వేళ కలిగే సంతోషం దేనితో పోల్చినా సరితూగదేమో....ఏదైనాకానీ, ఆ సంబరం అంబరాన్నితాకి తీరుతుంది...మనసుకి రెక్కలు వచ్చి గాలిలో హాయిగా విహారయాత్రలు చేస్తుంది....చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కొత్తగా ఆవిష్కరించిన రంగుల లోకంలా అబ్బురపరుస్తుంది...పరిమళాలు వెదజల్లే కుసుమ వసంతమేమోనని అనిపిస్తుంది. ఈ ప్రపంచాన్నే జయించిన మెరుపు మీ నయనాలంకారం అవుతుంది..చిరు దరహాస మందారాల మధురిమలు మీ మోమున విరబూస్తాయి....కాదంటారా??

చిన్నప్పుడు ఎన్నేన్నోకలలు కనేవాడిని, వాటిల్లో ముఖ్యమైన కల క్లాసు లో మొదటి రాంక్ సాధించాలని...నేను ఆరవ తరగతికి వచ్చేసరికి ఆ కల కాస్తా బలీయమైన కోరికగా మారింది... ఆరవ తరగతి వార్షిక పరీక్షల్లో ఎలాగైనా మొదటి రాంక్ సాధించాలి అని వినాయకుడు గుడికి వెళ్లి దండంపెట్టుకున్నా.. మా ఇంటి దెగ్గరే ఉండేది వినాయకుడి గుడి..రోజూ స్కూల్ నుంచి వచ్చాక స్నానం చేసి గుడికి వెళ్ళేవాడిని...ఇలా నేను రోజూ రావడం పూజారి గమనించి "బాబూ..రోజూ చూస్తున్నాను నిన్ను గుడిలో...అంతలా ఏం కోరుకున్నావ్ నాయనా?" అంటూ దీర్ఘం తీసాడు.."స్కూల్ లో ఫస్ట్ రాంక్ రావాలని.." ఒక్క ముక్కలో చెప్పి దేవునితో నా మొక్కుల పనిలో ఉండగా, ఆయనే మళ్లీ "మంచిది ..కానీ రోజూ ఇలా గుడికి వచ్చి ఇంతింత సేపు వంగి వంగి దండాలు పెట్టక్కర్లేదు నాయనా...ఓ సారి దర్శించి ఆయన దీవెనలు స్వీకరించి తరువాత సమయమంతా నీ లక్ష్య సాధనకై వినియోగించాలి నాయనా..కృషితో ఫలితం నాస్తి దుర్భిక్షం..అర్థమైందా?" అన్నాడు నా తల నిమిరి...నిజంగా గుడి, దండాలు తప్ప ఏం అర్థం కాలేదు..కానీ నా మీద ఏదో సెటైర్ వేశాడు అని అర్థమైంది..ఏం మాట్లాడకుండా ఇంటికి వచ్చేసా....మరుసటి రోజు స్కూల్ నుంచి వచ్చాక గుడికి వెళ్లలేదు...అంటే ఆ గుడికి వెళ్లలేదు, కొంచెం దూరం అయినా పర్లేదు అని శివాలయం కి వెళ్ళా...."స్వామీ మీ అబ్బాయిని కొంచెం నా మీద దయ చూసేలా చూడు స్వామి... ఆ గుడిలో పూజారి కొంచెం ఎక్కువ చేస్తున్నాడు స్వామి అందుకే ఇక్కడికి వచ్చా, మీ అబ్బాయిని ఏమనుకోవద్దని చెప్పు స్వామి"..దండాలు పెట్టుకోవడం అయ్యాక ఇంటికి దయచేసా...మధ్య వార్షిక పరీక్షల్లో నాకు ఆరవ రాంక్ వచ్చింది...దేవుడి మీద కోపంతో ఒక నెల గుడికి వెళ్లలేదు...నిదానంగా వార్షిక పరీక్షలు కూడా దెగ్గర అవడంతో టెన్షన్ స్టార్ట్ అయింది...తప్పదు ఎలాగైనా మొదటి రాంక్ తెచ్చుకోవాలి..తెగ చదివెయ్యడం స్టార్ట్ చేశా..ఏడింటి దాక లేవని నేను నాలుగుకే లేచి చదివా, మళ్లీ అయిదు కల్లా పడుకొనే వాడిని అది వేరే విషయం...

పరీక్షలు ఓ పది రోజులు ఉన్నాయనగా, మా క్లాసు లో వైష్ణవి అనే అమ్మాయి స్కూల్ అయిపోయాకా ఎవరూ చూడకుండా ఆఫీసు రూంలోకి వెళ్లి క్వస్చెన్ పేపర్స్ దొంగలించడం నా కంట పడింది..అంతే బెదిరించా..ఆ అమ్మాయి ఏడ్చింది.."అమ్మనీ..నా కంటే ప్రతి సారీ ఓ రాంక్ ముందు తెచ్చుకుంటున్నావ్ ఎలాగబ్బా అనుకున్నా...ఇలాగా మహాతల్లి.." అన్నాను ..అంతే ఆ అమ్మాయి ఏడవడం ఆపేసి "నువ్వు ఎవరికైనా చెప్పావంటే...ఈ రోజు రాత్రి మా నాన్న పొలానికి కొట్టే నోవాక్రోన్ నా నోట్లో కొట్టుకుంటా..అంతే కాదు నీ పేరు రాస్తా ఓ కాగితంలో నువ్వే కారణం అని" సీరియస్ గా చెప్పింది..అమ్మాయిల అమ్ములపొదిలో ఆయుధాలు.. కుదిరితే ఏడుపు కుదరకపోతే బెదిరింపు...ఒక్కోటిగా ఉపయోగించింది..నాకు భయం వేసింది.. ఇదేదో శాంతియుతంగా తేల్చుకోవాల్సిన విషయం అనుకోని ఓ క్షణం అలోచించి "సరే ఎవరికీ చెప్పనులే గాని.. కొస్చెన్ పేపర్స్ తీసుకొని త్వరగా వచ్చేయి...నేను కూడా కొస్చెన్స్ కాపీ చేసుకుంటా" అన్నాను.."ఛా...మరెందుకు అంత బిల్డ్-అప్ ఇచ్చావ్.."అంది వంకర మూతి ఇంకాస్త వంకరగా తిప్పుతూ.."సర్లే అవన్నీ ఎందుకు ...తొందరగా తీసుకొచ్చేయ్ అన్నీ" అన్నాను కంగారుగా.."అన్నీ కాదు..సోషల్, సైన్సు, హిందీ మాత్రమే.." అంది.."అదేంటి మిగతావి.." అన్నాను .."మిగతావి నేను బాగా స్కోరు చెయ్యగలను.." అంది కావాల్సిన పేపర్స్ జాగ్రతగా మడుచుకుంటూ.."ఒసినీ...చేసేదే చెత్త పని..అందులో కూడా నిజాయితీ నా " అనుకోని "నాకు మాథ్స్ కష్టం...అదొక్కటి తీసుకురా" అన్నాను..."పోయి తెచ్చుకో.." అంది బైటకి వస్తూ...మనకి అంత సీన్ ఎక్కడుంది...దొరికినవే చాల్లే అనుకోని నేను కూడా వచ్చేసాను...కొస్చెన్స్ కాపీ చేసుకొని ఇంట్లో రోజూ వాటిని తెగ రుబ్బడం ప్రారంభించాను...

వార్షిక పరీక్షలు బాగా వ్రాసాను...ఎందుకు రాయను? పేపర్స్ ముందే తెలిస్పోయాయిగా...ప్రొగ్రెస్స్ రిపోర్ట్ ఇచ్చే రోజు ఇంతకముందు లాగా ఆత్రుత లేదు.. నాకు నాలుగవ రాంక్ వచ్చింది...ఎందుకో పెద్దగా బాధగా అనిపించలేదు...ఇంటికి వచ్చేప్పుడు చాలా సేపు ఆలోచించా...ఎందుకు నాకు చీమ కుట్టినట్లు అయినా లేదు అని...సమాధానం దొరకలేదు...కనీసం అనుకున్నది సాధించలేకపోయాను అన్న బాధ కూడా లేదేంటి??, ఇందుకేనా అంతగా మొదటి రాంక్ కోసం తపన పడింది, రోజూ గుళ్ళ చుట్టూ తిరిగింది....ఇందుకేనా ఎప్పుడూ చెయ్యనిది కొస్చెన్ పేపర్స్ ముందుగానే తెల్సుకొని మరీ పరీక్ష రాసింది...అంతే అక్కడ కొట్టింది నాకు దెబ్బ...అంతా ముందే తెల్సిపోయినందు వల్లనా నాకు రాంక్ మీద ఆసక్తి పోయింది??...నాలో అంతర్మధనం మొదలైంది... అపుడు గుర్తోచింది నాకు చిన్నప్పుడు జరిగిన ఓ సంగతి...ఓ సారి నేను మా ఫ్రెండ్ ఇద్దరం క్యారం బోర్డు ఆడుతున్నాం..ఇద్దరం పోటాపోటీగా ఆడినా, చివరికి నేనే గెలిచాను...అపుడు ఎంత ఆనందం వేసిందంటే ఎగిరి గంతేయ్యలనిపించింది...ఇంకోసారి ఇలా ఆడినపుడు నేను ఓడిపోయే స్థితిలో ఉన్నాను..ఓడిపోవడం ఇష్టం లేక తొండి ఆట ఆడాను...అయినా నేను గెలవలేదు...వాడే గెలిచాడు...నాకు కొంచెం కూడా బాధ కలగలేదు...అదే నాకు ఆశ్చర్యం కలిగించింది...మాములుగా అయితే ఓడిపోయినందుకు బాగా ఏడుపు వచ్చేది..అప్పుడు అలా జరగలేదు..నిజాయితీగా ఆడి ఓడిపోయుంటే ఆ దుఖం కలిగేదేమో....అదే ఇప్పుడు నాకు జరుగుతుంది అనిపించింది..నిజాయతీగా పరీక్షలు రాసుంటే, అనుకున్నది సాధించలేకపోయినందుకు కనీసం బాధ అయిందా మిగులుతుంది...ఆ బాధ మరోసారి విజయానికి కారణం అవ్వోచు...ఇప్పుడు ఆ బాధ కూడా లేదు...అసలు నేను అనుకున్నది సాధించగాలనా?...జవాబు దొరకలేదు నాకు..

"పర్లేదు..ఇంప్రూవ్ అయ్యావు రా.." అన్నాడు నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం పెడుతూ..మమూలుగా అయితే ఆ మాట నాకు కొండంత ఆత్మ విశ్వాసం కలిగించేది...మరోసారి నాన్న దెగ్గర శభాష్ అనిపించుకోనేందుకు అయినా బాగా కష్టపదేవాడినేమో..ఇప్పుడు నాన్నమాట నా మీద ఏ ప్రభావం చూపలేదు...కాదు, ఆ మాటకి ఉన్న విలువని పొందే అర్హత కోల్పోయాను...స్కూల్ నుండి ఇంటికి వస్తుంటే దారిలో వినాయకుడి గుడి పూజారి కనబడి "ఏం నాయన బొత్తిగా గుడి వైపు రావడమే మనేసావ్...శ్రద్దగా చదువుకుంటున్నావ్ అనమాట...విజయోస్తు...ఆరింటికి గుడికి రా దేవునికి నైవేద్యం పెడుతున్న...సరేనా నాయనా" అన్నాడు...నేను తలాడించి ఇంటికి వెళ్ళిపోయాను...ఎందుకో నా అంతరాత్మకి నేను దోషిలా కనిపిస్తున్నాను..గుడికి వెళ్ళాలని బైల్దేరి సగం దూరం వెళ్ళాక వెళ్ళాలనిపించలేదు..అమ్మ ఓ సారి అంది "మనం చేసే ప్రతి పని మంచిదో కాదో మన అంతరాత్మ మనకి చెప్తుంది...అదే దేవుడు...మనం ఎవరికీ భయపడకూడదు మన అంతరాత్మకు తప్ప...అంటే ఆ దేవుడికి తప్ప "..ఆ మాటలు గుర్తోచాక ఒక్క అడుగు కూడా వెయ్యలేకపోయాను...తప్పు చేశాను..అంతరాత్మని ఎదురుకోలేను...అందుకే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను...ఓ రోజు అమ్మ పేపర్ చూపించి నాకు అక్కడున్న ఓ కాలమ్ చదవమంది..అది ఆ ఏడు పదవి తరగతి టాపర్ గా నిలిచిన అబ్బాయి ఇంటర్వ్యూ...చదివాను..సరిగ్గా వసతులు లేను పాఠశాలలో చదివి , వ్యవసాయ నేపధ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆ అబ్బాయి ఆ ఏడు టాపర్ గా నిలిచాడు...ఆ అబ్బాయి చెప్పిన ఒక మాట నన్నుచాలా ఆలోచింపచేసింది "మా అమ్మ నాన్నలు నాకోసం ఎంతో కష్టపడుతున్నారు..వాళ్ళ కష్టంతో పోల్చుకుంటే నా కష్టం ఏ పాటిది..ఆమాత్రం కష్టపడకపోతే వారి కష్టానికి విలువ ఏముంది...రేపు వాళ్ళని సుఖపెట్టాలనేదే నా ఆశ..." నాలో చాల ప్రభావం చూపింది అతని మాట...ముందుగా తప్పు చేసాను అన్న భావం నుండి బయటపడాలి...ఏం చెయ్యాలి...అమ్మకు చెప్పి, ఇంకెప్పుడూ ఇలా చేయ్యనమ్మా అని ఒట్టు వెయ్యాలా?..అప్పుడు అమ్మ బాధపడితే నేను చూడలేను....మరేం చెయ్యాలి..అవును...ఆయనే ఇప్పుడు నాకు దిక్కు...ఆ వినాయకుడే...అనుకుందే తడవుగా వెళ్ళాను గుడికి...దేవునితో అన్ని చెప్పుకుంటే ఆయన అర్థం చేసుకుంటాడు అనుకోని వెళ్ళాను..."ఏం నాయనా, నిన్న రాలేదు.."అడిగాడు పూజారి నేను వెళ్ళగానే.."ఏం లేదు...పని ఉంటే.." అని చెప్పి దేవునికి నమస్కరించాను..ఈ ఒక్కసారికి క్షమించమని వేడుకున్నాను...బాగా చదివి మంచి రాంక్ తెచుకున్నాక మళ్ళి వస్తాను అని చెప్పి ఇంటికి వచ్చేసా...

ఏడవ తరగతిలో మొదటి యూనిట్ పరీక్షల్లో నాకు మూడవ రాంక్ వచ్చింది...చాలా సంతోషం కలిగింది..మాథ్స్, సైన్సు లో మార్కులు తగ్గుతున్నాయి అని గమనించాను...ట్యూషన్ జాయిన్ అయ్యాను...కొంతలో కొంత బెటర్...క్వర్తెర్లీ లో మళ్ళి నాలగవ రాంక్...అర్థం కావడం లేదు ఎక్కడ నా తప్పు జరుగుతుందో...మొదటి రాంక్ వచ్చిన వాడి ఆన్సర్ షీట్ నా ఆన్సర్ షీట్ కంపేర్ చేసాను...వాడికి సోషల్ లో 96..నాకు 75...నేను అన్ని జవాబులు చక్కగానే రాసాను...సరిగ్గా చూడగా అర్థం అయింది...వాడి రాసిన జవాబులు అచ్చు గుద్దినట్లు సర్ నోట్స్ లో చెప్పినవే...నాకు బట్టి పట్టడం రాదు..నేను చాలా వరకు సొంతంగా రాశా...కానీ నా సమాధానాలు తప్పు కాదు అని నిర్ధారించుకున్నాక మనసు తేలిక పడింది...మిగతా సబ్జక్ట్స్ కూడా అలాగే....నేను వాడ్ని తప్పు పట్టడం లేదు, కానీ నా జవాబులు తప్పు కాదు, నా విశ్లేషణ వేరేగా ఉంటుంది అంతే...తర్వాతా నేనొక నిర్ణయానికి వచ్చాను...ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షలు కాబట్టి, జవాబులు దిద్దేవాళ్ళు ఎవరెవరో ఉంటారు...మన టీచర్లు ఉండరు...కనుక వారికి రాసే జవాబులోలో చక్కని విశ్లేషణ, విషయ సంగ్రాహణ శక్తీ కనిపించాలి...అంతే, గైడ్ చూసి, నోట్స్ చూసి బట్టిపడితే కుదరదు అనుకున్నా...కనుక ఇక్కడ ఎలాంటి రాంక్ వచ్చిన బాధ పడకుండా, పబ్లిక్ పరీక్షే లక్ష్యంగా చదవాలని అపుడే నిర్ణయించుకున్నా...అంతే అప్పటినుండి నా ప్రేపరషన్ వేరేగా ఉండేది...చివరి యూనిట్ పరీక్షలో నాకు మూడవ రాంక్ వచ్చింది...మాథ్స్, సైన్సు ఇంప్రూవ్ అయినందుకు సంతోషం వేసింది...పబ్లిక్ పరీక్షలు రానే వచ్చాయి...నేను సొంతంగా తాయారు చేసుకున్న నోట్స్ పైనే ఎక్కువగా ఆధారపడ్డాను..అన్ని పరీక్షలు చాలా చక్కగా రాసాను అన్న అనుభూతి కలిగింది...

"ఏం నాయనా...మొత్తానికి సాధించావ్...టౌన్ ఫస్ట్ వాచ్చావంటగా...నిన్న అమ్మ కనపడి చెప్పింది...నీ కృషికి తగ్గ ఫలితం వచ్చింది నాయనా...అమ్మ ఆ విషయం చెపుతుంటే ఆమె ముఖంలో సంతోషం చూసాక నాకు చాలా ఆనందంగా అనిపించింది " అన్నాడు పూజారి...ఆయను వైపు చూసి ఓ నవ్వు రువ్వి వినాయకుడిని చూడటానికి వెళ్లాను...అప్పటికి గుడికి వచ్చి నేను సరిగ్గా పది నెలలు అయింది....నిన్న ఈ సమయానికి నాకు ఆ వార్త తెలిసేసరికి నేను ఏం వింటున్నానో నాకు అర్థం కాలేదు..."నువ్వు టౌన్ ఫస్ట్ వచ్చావ్ ఏడవ తరగతి పరీక్షల్లో..." మా హెడ్ మాస్టర్ చెప్తుంటే ఓ క్షణం అంతా స్థంబించినట్లుగా అనిపించింది...మరుక్షణం నా కళ్ళలోంచి నీళ్ళు..."మన స్కూల్ పరువు నిలబెట్టావ్ " అని మాస్టర్ అంటుంటే ..అవును నువ్వు సాధించావు...అని నా మనసు నాకు చెప్తుంది...అంతే ఒక్క సారిగా ఎగ్గిరి గంతేసాను...నా ఆనందానికి పట్టా పగ్గాలు లేవు...ఊహలు నిజమైన వేళ కలిగే ఆనందం జీవితం లో మొదటి సారిగా ఆ రోజు చవి చూసాను...ఆ ఆనందం నా జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేను...అలాంటప్పుడు కలిగే ఆనందపు రుచి తెలిసాక ఇంక జీవితంలో వెనకడుగు వేసింది లేదు...దేని కోసం అయినా శాయశక్తులా ప్రయత్నించడం నేర్చుకున్నాను...ఆ తరువాత మరెన్నో సార్లు అటువంటి ఆనందం అనుభవించాను...పదివ తరగతిలో మళ్లీ టౌన్ ఫస్ట్ వచినప్పుడు...ఎంసెట్ లో మంచి రాంక్ వచ్చి ఇంజనీరింగ్ చేరినప్పుడు( రాంక్ ఎంతని అడగకండే..:) )...ఇంటర్వ్యూ లో నెగ్గి ఉద్యోగం సంపాదించినప్పుడు...కాని మొదటి సారి ఆ ఆనందం జీవితాంతం నా గుండెల్లో పదిలం....ఊహలు నిజమైన వేళ...ఆకాశం అందిన వేళ..


17 comments:

నేస్తం said...

హ హ చిన్నప్పుడు నాకు క్లాస్లో ఎప్పుడూ 4th రేంక్ వచ్చేది మొదటి మూడు రేంకుల్లో ఎన్నడూ రాలేదు ...ఒక సారి ఇలాకాదని రాత్రీ పగళ్ళు ఖష్టపడి చదివేసా 16 th రేంక్ వచ్చింది మళ్ళీ ఎప్పుడూ అలాంటి పని చేయలేదు .ఇంతకు మీ ఎంసెట్ రేంక్ ఎంత అండీ :)

హరే కృష్ణ said...

congrats..baaga raasav
antaratma concept bavundi

Anonymous said...

Dear Kishan,

your writing style is amazing ! Truely inspirational story !

your fan/AC - me !

Ram Krish Reddy Kotla said...

నేస్తం..హ హ...నాకు మధ్య పరీక్షల సంగతి ఎలా ఉన్నా, ఆఖరి పరీక్షల్లో మాత్రం ఫస్ట్ రాంకే వచ్చేది... ఎంసెట్ రాంక్ అడగవద్దు అన్నాను కదండీ... అడగవద్దు అని స్పెసిఫై చేస్తే మాత్రం ఖచ్చితం గా అడగాలనిపిస్తుంది...నేను అంతేలెండి...

Ram Krish Reddy Kotla said...

హరేకృష్ణ గారు ..ధన్యవాదాలు

anonymous...మీ పేరు ఏమిటో కాని, మీ కామెంట్ చదివాకా హాయిగా అనిపించింది..

Padmarpita said...

ఇప్పుడే చూస్తున్నాను....చాలా బాగా రాసారు, ఎంతైనా ఏడవ తరగతి ఫస్ట్ ర్యాంక్ కదా!

Sowmya Mendu said...

your way of writing is very impressive... carry on...all the best..:)

Ram Krish Reddy Kotla said...

పద్మ గారు... :) థాంక్స్ అండి

Ram Krish Reddy Kotla said...

soumya..thanks a lotttt for ur comment...ninnane ne nayananjali posts mottam chadiva..tht was really very very impressive, u got that stuff in yourself...keep going..I will keep reading ur posts n send my feedback to you...nayanjali lo latest ga vesina post,anjali gurunchi..is it continuation of previous parts?? Poems are also excellent..keep up the good work...

సృజన said...

పద్మార్పితగారి బ్లాగ్ ద్వార మీ బ్లాగ్ చూసాను... చాలాబాగా వ్రాస్తున్నారు.

Ram Krish Reddy Kotla said...

సృజన గారు...థాంక్స్ అండి...ఇపుడే మీ బ్లాగ్ చూస్తున్నాను...చాలా బాగుంది..

ఆత్రేయ కొండూరు said...

చాలా బాగా రాశారండీ.. నేనూ చదువుల్లో ఎప్పుడూ ఫస్టు రాంకే.. ఎటునుంచి ? అని అడగ కండి. :-)

Ram Krish Reddy Kotla said...

హ హ ఆత్రేయ గారు...ధన్యవాదాలు...మీరు చెప్పినా చెప్పకున్నా ఎటునుండీ అని అడగనులెండి.... :)

..nagarjuna.. said...

మీ చిన్ననాటి మధుర స్మృతి బాగుంది.....సాఫీగా..కమ్మగా..

..nagarjuna.. said...

బావుంది మీ చిన్ననాటి మధురస్మృతి.....సాఫిగా...గొప్పగా..

Ram Krish Reddy Kotla said...

నాగార్జున గారు థాంక్స్ అండి

Anonymous said...

meeru enginneering exams lo kuda ilaga feel ayara :) ,