Search This Blog

Wednesday 22 July, 2009

ఆఖరి మజిలీ...



నేను ఆఫీసుకి ఎప్పుడు సెలవు పెట్టాలన్నా నాకు దొరికే ఒకే ఒక్క వంక 'ఫ్రెండ్ పెళ్లి'.. ఎక్కువసార్లు అదే వంక పెట్టి అడిగేసరికి మా మేనేజర్ స్పందన వ్యతిరేకంగా తయారయింది...రెండు నెలల క్రిందట మా ఫ్రెండ్ ఫోన్ చేసి "ఒరేయ్ నా పెళ్లి...నువ్వు తప్పకుండా రావాలి..కార్డు నీకు మెయిల్ చేశాను...రాలేదంటే నా మీద ఒట్టే" అని తెగ ఇబ్బంది పెట్టేసాడు...సరేలే వెళ్దాం సరదాగా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసినట్లు ఉంటుంది అనుకోని లీవ్ అడగడానికి వెళ్ళాను మేనేజర్ దెగ్గరికి...'ఫ్రెండ్ పెళ్లి' అంటే ఈ సారి ఖచ్చితంగా లీవ్ ఇవ్వడు... "నీకు లీవ్ దొరకడానికి మీ ఫ్రెండ్స్ తెగ పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారే..."అని వ్యంగ్య అస్త్రం వదలడూ!!...ఏమని అడగాలి...
వీడికి బుర్ర ఉందొ లేదో ఈ సారి పరీక్షిద్దాం అనుకోని "హాయ్ సర్, వాట్స్ అప్....వెల్, మా ఫ్రెండ్ వుడ్ బీ కి పెళ్లి సర్...వెళ్ళకపోతే బాగోదు...జస్ట్ రెండు రోజులు లీవ్ కావలి.."
"ఈ మధ్యే కదా ఫ్రెండ్ పెళ్లి అని వెళ్ళావ్.." వాడి భ్రుకుటి ముడి పడింది :)
"ఇపుడు ఫ్రెండ్ పెళ్లి కాదు సర్, ఫ్రెండ్ వుడ్ బీ ది...ప్లీజ్ సర్...అన్నట్లు మీరు మొన్న కోడింగ్ లో చేసిన మార్పులకి మన క్లయింట్ నుండి గొప్ప అప్రిసియెషన్ వచ్చింది.."
అంతే నాకు లీవ్ దొరికింది....
ఫ్రెండ్ పెళ్లి...ఫ్రెండ్ వుడ్ బీ పెళ్లి..రెండు ఒకటే అని వీడికి ఎప్పుడు తెలుస్తుందో అనుకోని నేను నా కొలీగ్ తెగ నవ్వుకున్నాం....


"టింగ్..టింగ్...టింగ్..దయచేసి వినండి ట్రైన్ నెంబర్ 2603 చెన్నై express మరికొద్దిసేపట్లో నాలుగవ నెంబర్ ప్లాట్ఫారం నుండి బయలుదేరుటకి సిద్ధంగా ఉంది (అలా అని తమిళం లో చెప్తుంది)"...కాలు తెగిన కోడిలా తెగ వాయిస్తున్న ఆ  అనౌన్సిమేంట్ చిన్నదాన్ని తెగ తిట్టుకుంటూ పరిగెత్తుకుంటూ టెన్షన్ టెన్షన్ గా సెంట్రల్ కి వచ్చాను...అప్పటికే బండి కదులుతుంది నెమ్మదిగా...మొత్తానికి ఎక్కేసాను..


నా సీట్ లో ఓ ముసలాయన కూర్చున్నాడు "ఈ సీట్ నాదండి.." చెప్పాను.."ఓ అలాగా బాబు..."అని పాపం ఆయన లేచి నా ఎదురు సీట్ లో కూర్చున్నాడు..నాకు సైడ్ లోయర్ బెర్త్ అంతే చాలా ఇష్టం...ఎవరితో లింక్ ఉండదు...ఎంత సేపయినా కిటికీలోంచి అలా బైటకి చూస్తూ మ్యూజిక్ వింటూ ప్రయాణించడం నాకిష్టం ...నాకు కావల్సినపుడు పడుకుంటా, వేరేవాళ్ళు పడుకోవాలంటే నేను లేవల్సిన పనిలేదు...అదన్నమాట...సో ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ మాత్రం ఎవరికీ త్యాగం చెయ్యను...ఓ సారి ఒకామె అడిగింది, బాబు పై బెర్త్ తీసుకుంటావా, నేను పైకి ఎక్కలేను అని..నకివ్వబుద్ధి కాలేదు...కానీ పాపం ఆమె మాత్రం పైకి ఎలా ఎక్కుతుంది..పెద్దామె ..అనుకోని...రాజారాం మోహన్ రాయ్ లా ఫీల్ అయ్యి ఆమెకి బెర్త్ త్యాగం చేసి నేను పైకి ఎక్కాను....కొద్దిసేపయ్యాక అపోసిట్ లోయర్ బెర్త్ లో ఒక అమ్మాయి 'ఆంటీ మీరు ఈ లోయర్ బెర్త్ తీసుకొని..నాకు ఆ సైడ్ లోయర్ ఇస్తారా?' అని అడిగింది...నాకు ఒక్కసారిగా సౌండ్ లేదు..ఈవిడగారు నేను త్యాగం చేసిన బెర్త్ ని మళ్లీ త్యాగం చేసారు..నాకు ఒక్కసారిగా మంటెక్కింది...నేను అప్పర్ బెర్త్ లో ముడుచుకుంటే, నా బెర్త్ లో ఉన్న అమ్మాయి విండో లోకి చూస్తూ ..కూల్ డ్రింక్ సిప్ చేస్తూ, ఇంకో చేత్తో చిప్స్ తింటూ, ఐపాడ్ లో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంది...నాకు చిర్రెత్తింది..'ఓయ్ అమ్మాయి నా బెర్త్ నాకు ఇచ్చేయ్..'అని అడగాలనిపించింది...కానీ అడగలేదు...అప్పటినుంచి ఎవరు బెర్త్ అడిగా 'సారీ' అనేదే నా సమాధానం..


"ఎక్కడిదాక బాబూ ప్రయాణం.." అడిగాడు నా ముందు కూర్చున్న పెద్దాయన..
"హైదరాబాద్..." క్లుప్తంగా చెప్పాను నా ధోరణి లో..
అప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించాను ఆయనని...యాభై పైబడిన వయసు, దాదాపు మొత్తం నెరిసిన జుట్టు..ఎంతో జీవితాన్ని చూశాను అని చెప్పినట్లుండే విశాలమైన నుదురు...ఎన్నో ఆటుపోట్లకు ఎదురు నిలిచిన దర్పాన్ని ప్రతిబింబించే ముఖం...
"మీరు?" అన్నాను కాసేపాగి..
"గుంటూరు దెగ్గర చిన్న పల్లెటూరు బాబు...గుంటూరులో దిగి అక్కడనుంచి బస్సులో వెళ్ళాలి..." చెప్పాడాయన..
"ఓహో..."
"ఎం చేస్తున్నావ్ బాబూ మద్రాస్ లో.."
"ఉద్యోగం..."
"మంచిది బాబు ...చక్కగా ఉన్నావ్..చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నావ్...మంచి భవిష్యత్తు ఉంది నీకు..మంచి మార్గాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకు నాయినా.." చెప్పాడు ..చివరిలో చిన్నపాటి ఉద్వేగం చూసా ఆయనలో..ఆయన కనుసన్నల్లో కన్నీరు నా కంటి చూపు తప్పించుకోలేదు..
"ఏమయిందండి..?" ఏదో తెల్సుకోవాలనే ఆరాటం నాలో..
"నీ లాంటి కుర్రాళ్ళని చూస్తే మా అబ్బాయే గుర్తొచ్చి ఇలా కన్నీళ్ళు పెట్టిస్తాడు..." పైపంచె తో చిన్నగా తన కళ్ళని వత్తుకున్నాడు...
"ఏమయింది తనకి?"
"చనిపోయి ఏడాది...." చెప్పాడు ఆయన

"అయ్యో...ఎలా జరిగింది"
"ఆత్మహత్య చేసుకున్నాడు....పదిమందికి పాఠాలు చెప్పే పంతులుని అయ్యుండి, నా కొడుకు మనసేంటో తెలుసుకోలేకపోయాను..పది మందిలో వాడు గొప్పగా ఉండాలని కలలు కన్నాను..స్థోమతని లెక్కచెయ్యకుండా చదివించాను..కలెక్టర్ గా వాడిని చూడాలని కలలు కన్నాను..నా కలలను నిజం చెయ్యడానికి వాడి జీవితంలో ఎన్నింటినో కాలదన్నాడు..ఓ రోజు పట్నం నుంచి మా అబ్బాయి రాసిన ఉత్తరం రావడం చూసి చాలా సంతోష పడ్డాను...తను ఐ.ఏ.ఎస్ పాస్ అయ్యాడనీ...ట్రైనింగ్ కి వెళ్తున్నాను అని రాసాడు ...ఇక అంతే సంతోషం పట్టలేకపోయాను...ఊరంతా దండోరా వేసుకొని, నా కొడుకు గొప్పతనం ఆ రోజు చెప్పుకొని మురిసిపోయాను..'నా కొడుకు కలెక్టర్ అవ్వబోతున్నాడు రాజయ్య...మన జిల్లాకే వస్తే మన కష్టాలన్నీ తీరుస్తాడు..ఆడు గొప్పోడు అవుతాడు అని నీకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని కదా ' మా స్కూల్ లో పనిచేసే రాజయ్యతో చెప్పి సంబరపడ్డాను...నేను స్కూల్ లో పనిచేసేప్పటి నుంచి రాజయ్య నాకో గొప్ప స్నేహితుడు..రాజయ్యకి నా కొడుకంటే చాలా ఇష్టం...వాడిని ఎప్పుడూ ఎత్తుకొని తిరిగేవాడు...'మా చిన్న దొరగారండి' అనేవాడు ఎప్పుడూ వాడిని చూసి...


రెండేళ్ళు గడిచాయి...అపుడప్పుడు వాడి దెగ్గర నుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి...కానీ మూడు నెలల నుంచి వాడి దెగ్గర నుండి ఒక్క ఉత్తరం కూడా రాలేదు...అక్కడి ఫోన్ నంబరు కూడా తెలీదు....ఓ రోజు రాజయ్య వచ్చాడు ఇంటికి..'మాష్టారు మనం అర్జెంటుగా మద్రాస్ వెళ్ళాలి..బట్టలు సర్దుకోండి' అన్నాడు...ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాజయ్య ముఖంలో ఏదో బాధ "ఏమయింది రాజయ్య...ఎందుకలా ఉన్నావ్..ఉన్నపళంగా మద్రాస్ దేనికి.."అన్నాను.. నన్ను మాట్లాడనివ్వలేదు రాజయ్య...ఆదరాబాదరా ప్రయాణం కట్టించాడు...నా మనసేదో కీడు శంకించింది...భగవంతుడా నా కొడుక్కి ఏమీ కాలేదు కదా...అయినా వాడి ట్రైనింగ్ ఢిల్లీలో అని చెప్పాడు కదా...రాజయ్య మద్రాస్ తీసుకేల్తున్నాడంటే వేరే కారణం ఏదో అయ్యుంటుంది..కానీ ఎంతడిగినా కారణం చెప్పడేంటి..పైగా ఎంతో ముభావంగా ఉన్నాడు..ఎన్నో ప్రశ్నలు మదిని వేదిస్తుండగా మద్రాస్ బైలుదేరాను...


ఆయన చెప్పడం ఆపేశాడు...ఆయన కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘల్లా ఉన్నాయి...ఆయనకీ ఇదంతా గుర్తుచేసి బాధిస్తున్నానేమో అనిపించింది..రైల్ ఎక్కడో ఆగింది...సన్నగా వర్షం మొదలయింది..అతను కిటికీ లోనుంచి అలాగే బైటకి చూస్తున్నాడు..నేను కూడా మౌనంగానే ఉన్నాను...


"రాజయ్య నన్ను నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు.." ఎటో చూస్తున్ననాకు అతని మాటలు వినిపించాయి...గొంతులో ఏదో అడ్డుపడ్డట్లు ఉన్నాయి అతని మాటలు...గుండెలో బాధ మాటలు పెగాలనివ్వకుండా గొంతులో అడ్డుపడుతుంది ఆయనకి..
"అప్పటిదాకా మనసులోనే క్షోభ అనుభవించిన నాకు ఇక ఓపిక నశించింది...కాలర్ పట్టుకొని అడిగాను రాజయ్యిని 'నా కొడుక్కి ఏమయింది' అని..ఒక్కసారిగా అతను ఉగ్గపట్టుకున్న బాధంతా కన్నీళ్ళ రూపం దాల్చి, వంట్లో సత్తువంతా నశించి కూలబడి గుండెలు అవిసేలా ఏడ్చాడు..ఏదో అర్ధమయింది నాకు...అది నిజం కాకూడదు అని మనసులో వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నాను...వొళ్ళంతా వోణుకు ప్రారంభమయ్యింది..అక్కడి నుంచి వెనుకకు అడుగులు వేసుకుంటూ వెళ్లాను..వెనుక నుంచి రాజయ్య నా చెయ్యి పట్టుకొని అటువైపుగా తీసుకెళ్ళాడు....మార్చురీ గది దెగ్గరకు...."


నాకు తెలీకుండా నా కళ్ళలో నీరు...ఎంత బాధని అనుభవించి ఉంటాడు ఈయన...కన్న కొడుకుని అన్ని ఏళ్ళ తరువాత అక్కడ విగత జీవిలా అలా చుస్తే..గుండె పగలదా..అల్లారు ముద్దుగా పెంచుకొని, ఎన్నో ఆశలు పెట్టుకొని చదివించుకున్న కొడుకుని కాటికి పంపాలంటే ఆయన కొన ఊపిరి ఆగిపోదా...


నెల్లూరు స్టేషన్ దాటింది బండి...వర్షం తగ్గు ముఖం పట్టింది..పచ్చటి పంట పొలాల మధ్య దూసుకుపోతుంది ధూమశకటం...అప్పుడే వెలసిన వానతో కమ్మటి మట్టి వాసన ముక్కు పుటలకి అందుతూ పరవశానికి లోను చేస్తుంది వాతావరణం...కాని దాన్ని అస్వాదించలేకపోయా....ఈ ప్రకృతిలో అందాలని ఆస్వాదించాలంటే మన మనఃస్థితి ముఖ్యం..ఆ స్థితి వేరేలా ఉంటే, బయట ఎంత అందమున్నాఅదంతా అడవి కాచిన వెన్నెలే కదా...కాదంటారా?..

ఆయన తన బాగ్ లోనుంచి ఓ ఫోటో చూపించాడు నాకు..ఓ చిన్న పిల్లాడి ఫోటో..ఏడాది ఉంటాయేమో ఆ పిల్లాడికి "మీ  అబ్బాయి చిన్నప్పటిదా?"  అడిగాను ఆ ఫోటో చూస్తూ..
"ఎలా ఉన్నాడు?" అడిగాడు ఆయన..
"చాలా అందంగా ఉన్నాడు.." చెప్పాను...
"నా కొడుకు కాదు...నా మనవడు.." చెప్పాడాయన...
"మీకు ఎంత మంది సంతానం..." అడిగాను...వాళ్ళ అబ్బాయికి పెళ్లి కాలేదు కదా అని సందేహం కలిగి...
"నీ సందేహం అర్ధమయింది...వీడు నా కొడుకు కొడుకే..." అన్నాడు ఆయన...ఆశ్చర్యపోయాను కళ్ళు ఇంతవి చేసుకుంటూ...
ఆయనే మళ్లీ కొనసాగిస్తూ "నా కొడుకుని ఆ రోజు అలా చూసిన నా బాధ వర్ణనాతీతం...ఆ రోజు అక్కడికి ఇంకో అమ్మాయి వచ్చింది ఓ పసి పిల్లాడిని ఎత్తుకొని...రాజయ్య చెప్పాడు ఆమె నా కోడలు అని...నాకేమీ అర్థం కాలేదు...నా కొడుకు పోయిన వియోగంలో పిచ్చి ఎక్కిన వాడిలా ఉన్నాను...దేవుడు నన్ను ఇంతలా పరీక్షించాలా అనిపించింది ..రాజయ్య చెప్పాడు ఈ కబురు ఆ అమ్మాయే ఉత్తరం రాసి స్కూల్ కి పోస్ట్ చేసిందట...ఆ అమ్మాయి వైపు చూసాను...ఏడ్చి ఏడ్చి ముఖం కంది పోయి ఉంది..కళ్ళు జాలిగా నా వైపే చూస్తున్నాయి...ఆమె చేతిలో పసి పిల్లాడు...వాడు నా మనవడు అని తెలియడానికి ఎక్కువసేపు పట్టలేదు...కానీ అంతా అయోమయంగా ఉంది..నా కాళ్ళ క్రింద భూమి కంపిస్తుంది..ఆ తర్వాత ఆ అమ్మాయి చెప్పింది..నా కొడుకు ఐ.ఏ.ఎస్ పాస్ అవ్వలేదు, ట్రైనింగ్ కీ వెళ్లలేదు...వాడు మద్రాస్ లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు..అనుకోని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవలసి వచ్చిందట...

"మామయ్య గారు దీనిలో నా తప్పు చాలా ఉంది...ఆయన మీ గురుంచి ఎప్పుడూ చెప్తూనే ఉండేవారు...మీకు జరిగినది అంతా చెపితే మీరు తప్పక మమ్మల్ని క్షమిస్తారు అంటుండేవారు...మీరు ఆయనని కలెక్టర్ గా చూడాలని కలలు కనేవారని చెప్పి, ఆ కోరిక తను తీర్చలేకపోయాడని చాలా బాధపడేవారు..ఓ సారి ఆయన బాధ చూడలేక ఆయనకి తెలీకుండా ఉత్తరం రాశాను మిమ్మల్ని సంతోషపెట్టాలని..అలానే రాస్తూనే ఉన్నా..ఓ రోజు ఆయనకి తెల్సి నా మీద చాలా కోప్పడ్డారు..ఇక మా నాన్నకి నా ముఖం ఎలా చూపించాలి అని బాధపడ్డారు...నేను అంత ఆలోచించలేదు...అప్పటినుంచి నేను ఉత్తరాలు రాయలేదు...ఓ రోజు ఆయన ఇంటికి వచ్చి చాలా ముభావంగా ఉండటం చూసాను..'నేను లేకపోతె నువ్వు దైర్యంగా బ్రతకగలవా?' అని నన్నడిగితే ఒక్కసారిగా ఏడ్చాను.. 'ఎందుకు అలా అంటారని అడగ్గా ..'ఇక మా నాన్నకి జన్మలో నా ముఖం చూపించలేను...మా ఊరి రమేష్ నాకు ఈ రోజు కనిపించాడు..వాడు దుబాయ్ వెళ్ళడానికి మద్రాస్ వచ్చాడు..'నువ్ కలెక్టర్ వి అంటగా?..మీ నాన్న ఊరంతా దండోరా వేస్తున్నాడు ..' అని చెప్పేసరికి నాకు కన్నీళ్ళు ఆగలేదు...ఇక ఆయనకి నేను ముఖం చూపలేను...నాకు బ్రతకాలని లేదు' అన్నారు..'మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్న నా గురుంచి ఆలోచించరా?' అన్నాను...ఆయను నన్ను తన గుండెలకి హత్తుకున్నారు...మరుసటి రోజు మృత్యువు వడిలో ఉన్నారు..." ఆ అమ్మాయి కన్నీళ్ళపర్యంతం అయింది...నేను నా మనవడిని ఆ అమ్మాయి దగ్గర నుంచి  తీసుకొని నా గుండెలకి హత్తుకున్నాను..

అదంతా విన్న నాకు దేవుడు ఒకళ్లకే ఇన్ని కష్టాలు ఎందుకు పెడతాడు..కొందరికి ఎందుకు అన్ని సుఖాలే ఇస్తాడు అనిపించింది..."ఇపుడు మీ మనవడు, కోడలు మీతో పాటే ఉంటున్నారా?" అని అడిగాను .."నా మనవడు మా ఇంట్లోనే ఉన్నాడు...వాడి నాయనమ్మతో ఆడుకుంటున్నాడు...నా కోడలికి జబ్బు చేస్తే మద్రాస్ లో హాస్పిటల్ లో జాయిన్ చేసాం...ఇపుడు అక్కడి నుంచే వస్తున్నా...మళ్ళీ రేపు తిరుగుప్రయాణం ఉంది మద్రాస్ కి.." చెప్పాడు ఆయన
"అయ్యో ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారు...మళ్లీ రేపే ఎందుకు వెళ్ళాలి..." అడిగాను..
"నా భార్యని...నా మనవడిని తీసుకువస్తున్నా తిరుగుప్రయాణంలో... డాక్టర్ గారు ఇక రెండు మూడు రోజులకంటే కష్టం అన్నారు...చివరి సారిగా వాడి తల్లిని వాడికి చూపించే భాద్యత నాది..." ఆయనలో ఏ స్పందన నాకు కనపడటం లేదు...చాలా మాములుగా చెప్పారు..బహుశా జీవితం అతన్ని అన్నీటికి సమాయత్తం చేసిందేమో...దేన్ని అయినా ఎదుర్కొనే మనో నిబ్బరాన్ని ప్రసాదించిందేమో...
"నా కోడలికి బ్రెయిన్ ట్యూమర్..."
నేనేమీ మాట్లాడలేకపోయాను ఇక....ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఓ మనిషి జీవించగాలడా?..అసలు భరించగాలడా ??...నేనయితే...తలచుకోగానే నా వెన్నులో వణుకు....
ఇక మేమేమీ మాట్లాడుకోలేదు...ఇంకా ఏమి వినాల్సి వస్తుందో అని నేనేమి అడగలేదు...అతను చెప్తున్న వాటిని జీర్ణించుకోడానికి నాకే కష్టంగా ఉంది...

ఎప్పుడు నిద్రలో జారుకున్నానో తెలీదు ...అలా కూర్చొనే నిద్రపోయాను...లేచేసరికి అంతా చీకటి...ఆయన లేడు నా ముందు సీట్ లో ...టైం చూసా ఒంటిగంట దాటింది...అవును గుంటూరు దాటి అరగంట అయ్యింది...అతను దిగి పోయాడు...నా మనస్సంతా భారంగా...భాధగా తయారయింది...



17 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మనస్సంతా భారంగా ,బాధగా ఉంది...

Anonymous said...

మనస్సంతా భారంగా ,బాధగా ఉంది... same 2 same !

నేస్తం said...

ఆయన బాధ చాలా వేదనా భరితం ,కాని ఆ అమ్మాయిని తలుచుకుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది.ఆ అబ్బాయి ని చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తుంది..తండ్రికి తెలియకుండా పెళ్ళి చేసుకునే ధైర్యం చేసిన వాడు .తండ్రికి నిజం చెప్పడానికి జంకడం విధి విచిత్రం అంతే

Vinay Chakravarthi.Gogineni said...

mmmm baaga raasaaru...........
tappu oppulu kaadu, konni jeevitam lo ala jarigipotay ..........

mmmmmmm papam................manchivallake enduko ila jarugutay

Alapati Ramesh Babu said...

it is the life misarble. may god bless the oldman and child. old man complete his goal through his grand son.

Ram Krish Reddy Kotla said...

విజయ మోహన్ గారు & anonymous గారు, అపుడు నాకెలా అనిపించిందో...చదివాక మీకు కూడా అల అనిపించేలా చేసినందుకు నేను సఫలం అయ్యానేమో ..

Ram Krish Reddy Kotla said...

నేస్తం..ఆ అబ్బాయి ఏ పరిస్థితుల్లో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవలసి వచ్చిందో తెలియదు నాకు కూడా...అయన ఆ విష్యం చెప్పలేదు..నేను కూడా అడగలేదు...కాని ఆ అబ్బాయి తన తండ్రిని చేరుకోలేకపోయినందుకు ఎంతో వేదన అనుభవించి అటువంటి నిర్ణయం తీసుకున్నాడేమో అనిపిస్తుంది.. ఏది ఏమైనా అంతా విధి విచిత్రమే ..

Ram Krish Reddy Kotla said...

Vinay and Ramesh...what u said is very true...

Gouthami said...

Hmm..anni kastalu okallake enduku ravali?? I feel sad for his grandson..ee roju nenu TV lo oka program chusanu about Major Padmapani..Major died in kargil war when his wife is about to deliver a baby girl. Aa papa ni interview chesthe chepthundhi "nenu maa daddy ni chala sarlu naa kalalo(dreams) lo chusanu I felt happy for that ani"..Chala badha vesindhi adi chusinappudu..And same feeling idi chadivinappudu

నేస్తం said...

నిజమే కిషన్ అతను ఏ పరిస్థితులలో అలా చేసాడో మనకు తెలియదు కదా

Ram Krish Reddy Kotla said...

Vennela, Yes its the tragedy of life...

నేస్తం..నిజమే...ఏది ఏమైనా జరిగినది చాలా బాధాకరం..ఒకళ్ళని బాధ్యులం చెయ్యలేము..

KalyanModugu said...

ramu ne blog chusi ma friends andaru neeku pedda fans ayyaru... already andaru ne blogs lo anni posts chadivaaru...

minimum roju ki 2 posts undaali ani cheppu me ramu ki... idhi valla comments

Ram Krish Reddy Kotla said...

Hi Kalyan, nice to hear that your friends liked my blog. haha rojuki rendu posts kadule gaani, weekly rendu tappakunda rayadaniki try chesta....

మధురవాణి said...

గుండె పట్టేసినట్టుగా అయిందండీ..!
ఇలాంటివి చూసినప్పుడే ఒక వైరాగ్య భావం వచ్చేస్తుంది జీవితం అంటే..
ఏంటో.. ఇదంతా.. అనిపిస్తుంది. :(
నేనే స్వయంగా ఎదుర్కొన్న సంఘటనేమో అనిపించేలా ఉంది మీ కథనం. అందుకు అభినందనలు.

Ram Krish Reddy Kotla said...

మధురవాణి గారు..ధన్యుడిని...మీ అభిమానానికి.
మీరు చెప్పింది నిజమే...ఈ జీవితం ఇన్ని కష్టాల మయమా అనిపిస్తుంది.. :(

sunita said...

మనసంతా చేదు తిన్నట్లు అనిపించింది.ఇలాంటివి చూసినప్పుడే మనమెంత అల్పులమో అనిపిస్తుంది. యాద్రుచ్చికంగా ఇవ్వాళే ఒక తండ్రి కొడుకు కోసమై సలహా అడుగుతూ ఒక లేఖ జవాబు ఇంకో లేఖ చదివి ఒకలాంటి సంతోషం అనిపించింది. మీ బ్లాగు ఇవ్వాళే చూసాను.

sivaprasad said...

ఇలాంటివి చూసినప్పుడే ఒక వైరాగ్య భావం వచ్చేస్తుంది జీవితం అంటే..