Search This Blog

Friday 16 October, 2009

జీవితం గురుంచి నేర్పిన ఐ.టీ ప్రాజెక్ట్ (ఆఖరి భాగం)

"ఎవరండీ లోపల....హలో..."
స్పందన లేదు...
"హలో...ఓ సారి బయటకి వస్తారా !!..." మళ్లీ పిలిచాను గుమ్మం ముందు నిలుచొని...నా వెనుక మా సమూహం ఉన్నారు...అదే సునీల్, కృష్ణా ,శ్రీను, రమణ ..
ఓ రెండు నిముషాల తర్వాత ఓ వృద్ధురాలు వచ్చింది..ఆమె చేతిలో కర్ర ఆమె నడక అనుగుణంగా ఊగుతుంది ...కళ్ళ పైన అరచేయి పెట్టుకొని చూస్తూ ..
"ఎవరబ్బాయి మీరు.....కుంటి ఎంకడి మనవడివా నువ్వు??..." నా వైపు కర్ర చూపిస్తూ అంది...
అబ్బే కాదండి..కంగారుగా చెప్పాను...ఎక్కడ కర్రతో ఒకటి వేస్తుందేమో అని...
"అచ్చు గుద్ది నట్టు అట్టానే ఉన్నావ్ అబ్బాయ్....ఎం గావలి మీకు.." అడిగింది మా అందరి వైపూ చూస్తూ...
"మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఏమేమి పనులు చేయగలరో మేము తెలుసుకోవాలి...కాస్తా ఆ వివరాలు చెప్పగలరా.." అడిగాను ..
"కొంపదీసి మీరంతా సర్కారోల్లా...మా ఇసయాలు మీకెందుకు అబ్బాయి..."
"అది కాదండి...ఈ విషయాలు మీరు మాకు చెపితే...మీకు చేతి నిండా పని వచ్చే మార్గం ఉంటుంది.." సునీల్ అందుకున్న్నాడు ..
"ఎట్టెట్టా...అట్టాగా.." అని ఆశ్చర్యపోతూ..."ఒరేయ్ ఎంకయ్యా బేగి రా రా...ఈ పిల్లలేదో పని ఇత్తారంట.." అరచింది ఆమె లోపలి చూస్తూ...

ఆ రోజు ఉదయమే సునీల్ ఇంట్లో దిగిన మేము...లేట్ చెయ్యకుండా టిపినీలు కాపీలు కానిచ్చాక ఊరిమీద పడ్డాం...అదే చెప్పాకదా...గ్రామీణుల స్కిల్స్ సమాచారం మొత్తం రాబట్టాలి అని...ఆ పని మీద పడ్డాం అయిదుగురం కలసి....ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో...అదే ఏ ఇంటి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాలేదు మాకు..."ఇంటి నంబర్లు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయో అక్కడ నుంచి మొదలెడదామా? అలా అయితే కూర్పు సులభంగా ఉంటుంది.." అన్నాడు శీనుగాడు.. " కూర్పు గోల దేవుడెరుగు...ఈ ఎండలో ఆ మొదటి నెంబర్ ఇల్లు ఎక్కడో కనుక్కోనేసరికి కారిపోద్ద్ది మనకి...అంచేత అదిగదిగో ఆ కనపడే పాకలోకి వెళ్దాం.." అంటూ అందరిని ఆ పాకలోకి లాక్కేల్లాను..అదే ఈ బామ్మ గారి పాక...మా ప్రాజెక్ట్ బోణి బేరం....

ఆ రోజు ఇంటికి మధ్యాహ్నం కల్లా వచ్చేసాం ఇండియా-పాక్ మ్యాచ్ కోసం...ఆ రోజు ఇండియా 350 పైగా పరుగులు చెయ్యడమే కాకుండా  మ్యాచ్ నేగ్గేసరికి మాలో ఉత్సాహం పరవళ్ళు తొక్కి మరుసటి రోజు ఎపుడెపుడు అవుతుందా సర్వేకి ఎపుడెపుడు వెళ్దామా అని తెగ వెయిట్ చేశాం...ఆ రోజు మేము పూర్తి చేసిన ఇల్లు కేవలం పది....మా టార్గెట్ అయిదు గ్రామాలు...కనీసం రోజుకి వంద ఇల్లు అయినా కవర్ చెయ్యాలని నిర్ణయించుకున్నాం...ప్రొద్దున్న ఏడింటికే మళ్ళీ ఊరిమీద పడ్డాం...

"నేను కూలి పని పోతాను బాబు...మా అయన చెక్క పని సేత్తాడు..." ఆమె చెప్తుంటే నోట్ చేసుకుంటున్నాం..." రెండు నెలల నుంచి పని లేదు బాబు...చేలో కూలి పని ఏడాది పొడుగునా ఉండదు కదు బాబు..ఈయనకి చెక్కపని కూడా ఎపుడో ఒకసారే..లేనప్పుడు గంజి నీళ్ళు తాగడం కొత్తేం కాదు కానీ, పిల్లని బడికి కూడా పంపలేకపోతున్నాం బాబు..." ఆవిడ కళ్ళలో ఏదో బాధ తోణకిసలాడింది...ఆ ప్రక్కనే నిల్చున్న చిన్న పాపని చూసాను..పలక మీద ఏవో రాస్తుంది..."గవర్నమెంట్ బడులు ఉన్నాయిగా..." అడిగాను నేను ఆ పాపని చూస్తూ...."ఎందుకు బాబు అయ్యి ఉన్నా ఒకటే..లేకపోయినా ఒకటే..ఒక్క పంతులు కూడా రాడు బడికి..." 

ఆ తర్వాత ఒక పది ఇళ్ళు పూర్తి చేసేసరికి మాకు సోష వచ్చింది...అసలే ఎండా కాలం...భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు...తర్వత ఇంకో ఇంటికి వెళ్ళాం..అప్పటికే మేము ఇలా ఇళ్ళకు తిరుగుతున్నాం అనే వార్త ఆమెకి చేరిందనుకుంట రండి బాబు కూర్చోండి అంది మేము వెళ్ళగానే.."కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా " అన్నాడు రమణ గాడు...నీ ఆత్రం తగలెయ్యా అనుకున్నా మనసులో...ఆమె అందరికి గ్లాసుల్లో మజ్జిగ తెచ్చి ఇచ్చింది...అవి పుచ్చుకున్నాక ప్రాణం కాస్త లేచి వచ్చింది...మంచినీళ్ళు అడిగినా మజ్జిగ ఇవ్వడం కేవలం ఒక పల్లెటూరులోనే చూస్తామేమో కదా..."మీ ఇంట్లో ఎంత మంది.." అడిగాను నేను..."నేను ఒక్కదాన్నే బాబు...నాతో పాటు ఆ చంటిది.." అక్కడ ఒక మూడేళ్ళ పాప ఆడుకుంటూ కనిపించింది...
"ఏమి చేస్తారు మీరు?"
"కూలి పని బాబు..."
"కూలి పని లేనప్పుడు వేరే ఏమైనా పని చేస్తారా..."
"మిషన్ కుట్టడం వచ్చు బాబు....అపుడెప్పుడో పైకం అవసరం అయ్యి ఆ ఉన్న మిషన్ అమ్మేసాము...నాకు ఇంకే పనీ చేతకాదు బాబు.."
"అలాగే...మజ్జిగ ఇచ్చినందుకు థాంక్స్ అండి......ఆ పాప మీ పాపా?" అడిగాను.. ఆ మాట అడగ్గానే ఆమె ముఖం లో బాధ కొట్టొచ్చినట్లు కనిపించింది..." ఆ చంటిదాన్ని చూస్తే నాకు ఏడుపు ఒక్కటే తక్కువ బాబు...ఆ పిల్ల నా చెల్లెలి కూతురు..ఆ పిల్ల తల్లిని దాని మొగుడు వదిలేసి, ఆడు దేశాలు బట్టి పోయాడు...ఆ తల్లి ఈ చంటిదాని గురుంచి కూడా ఆలోచించకుండా బాయిలో దూకి సచ్చింది...పాపం ఈ చంటిదానికి తల్లి చచ్చిన విషయం తెలీదు...రోజూ అమ్మ అమ్మా అని ఏడుస్తూనే ఉంటుంది..ఏదో మాయ చేసి నిద్రపుచ్చితే పడుకుంటుంది పాపం బంగారుతల్లి...చెప్తే తెలిసే వయసా బాబు దానిది...." ఆమె కళ్ళలో నీళ్ళు....ఒక్కసారి ఆ బంగారుతల్లి వైపు చూసాను...ఏమి తెలియనట్లు నవ్వుతూ మా వైపు చూస్తూ ఆడుకుంటుంది....

కొంచెం భారంగానే నడిచాను అక్కడినుంచి...ఈ లోపు ఎప్పుడు దూరారో కానీ , రమణ గాడు శీనుగాడు ఇంకో ఇంట్లోకి వెళ్లి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు...కొంచెం దెగ్గరికి వెళ్లి చూసేసరికి అక్కడ సమాచార సేకరణ కాకుండా రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ లాంటిది జరుగుతున్నట్లు అనిపించి చూసేసరికి...అక్కడి సంభాషణ ఇలా సాగుతుంది ..
"అది కాదు అబ్బాయ్...మా అమ్మాయిని చేసుకుంటే నాకున్న ఆరెకరాలు రాసిచేత్తాను...ఏటంటావ్ .." వేలితో మీసాలు దువ్వుకుంటూ అడిగాడు ఆయన...
"ఏమోనండి మా ఇంట్లో అడగాలి..." నసిగాడు రమణగాడు...
"అడిగేత్తే పోలా...ఫోన్ లో కాకుండా డైరేట్ గా అడిగితేనే మర్యాద...ఒసేయ్ అబ్బాయి ఊరు నర్సీపట్నం...బైల్దేర్దామా ఓ గంటలో బస్సు ఉంది తణుకు నుంచి..." అన్నాడు తన భార్య వైపు చూస్తూ...
నాకు దిమ్మ తిరిగి దాదాపు మైండ్ బ్లాక్ అయింది....ఏం జరుగుతుంది ఇక్కడ...సమాచార సేకరణా లేక సంబంధ ధృవీకరణ??...
" అబ్బే ఇప్పుడు వద్దండి...నేను ఊరేల్లాక మా ఇంట్లో అడుగుతాను..." కొంచెం టెన్షన్ గా చెప్పాడు రమణ...
"ఆ సర్లే అబ్బాయ్ ...మర్చిపోకు...సర్లే ఇంతకీ పాక్టరి ఎప్పుడు వత్తాది అంటావ్..." అడిగాడు అతను ...
ఈ సరి షాక్ సర్ ర్ ర్ ర్ న వచ్చి ఎక్కడ తగిలిందో తెలియలేదు..."ఫ్యాక్టరీ ఎంట్రా బాబు..." నసిగాను నీరసంగా...
"ఆ వచ్చేస్తుంది...ఒక ఆరు నెలలలో..." అన్నాడు రమణ గాడు తాపీగా...
ఇంకా అక్కడెన్ని షాక్ లు వినాలో అని రమణని లాక్కొని బైటకి వచ్చాం...."ఒరేయ్ ఏం జరిగిందో చెప్పరా బాబు...ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ఏంది...ఆ ఫ్యాక్టరీ ఏంది..." అడిగాం అందరం...
"ఏం లేదురా....ఏమేం పనులు వచ్చు అని అడుగుతుంటే, ఇక్కడేమన్నా ఫ్యాక్టరీ పెట్టబోతున్నారా? అని అడిగాడు ఆయన...ఎఫెక్టివ్ గా ఉంటుందని అవునని చెప్పాను...ఇక అక్కడి నుంచి ప్రశ్నలు వేసి చంపాడు...ఏం చేస్తున్నావ్...ఎక్కడుంటావ్...చివరికి కాస్ట్ కలిసేసరికి వాళ్ళ అమ్మాయిని చేసుకోమని ఓ గొడవ....అలా..అలా స్టార్ట్ అయింది.." అక్కడి కంఫ్యూజన్ డ్రామా వృత్తాంతం వివరించాడు రమణ..." అఘోరించావ్ లే...అలా లేనిపోనివి చెప్పి వాళ్ళకు ఆశలు కల్పించడం తప్పు...మనం వచ్చిన పని చేసుకొని వెళ్దాం ...ఎగస్ట్రాలు వద్దు.." అన్నాను...

ఆ రోజు కనీసం ఒక ఎనభై ఇళ్ళ సమాచార సేకరణ పూర్తి చేశాం...దాదాపు సగం మంది వాళ్ళ బాధలు మాతో చెప్పుకున్నారు...మేమేదో వాళ్ళకు పని కల్పిస్తామని ఆశపడుతున్నారు వాళ్ళు..మేము చేసే ఈ ప్రాజెక్ట్ వాళ్ళకు ఎంత వరకు ఉపయోగ పడుతుందో అప్పటివరకు నిజంగా తెలీదు...కానీ ఆ క్షణం దేవుడిని గట్టిగా కోరుకున్నా ఈ ప్రాజెక్ట్ ద్వారా కొంతమంది కైనా పని దొరికి పట్టెడు అన్నం పెట్టేలా చూడాలని...ఒక్క గ్రామంలోనే సగం మంది ఇంత దయనీయ పరిస్థితిలో ఉంటే సర్కారు ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు...ఎవరో అన్నట్లుగా ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు పేదవాడు ఇంకా పేదరికం అనుభవిస్తున్నాడు అనే మాట అక్షరాలా నిజమేమో...ఒక్క క్షణం ప్రొద్దున చూసిన చంటిపిల్ల ముఖం నా కాళ్ళ ముందు కదలాడింది...పాపం రేపు ఆ పిల్ల పెద్దది అయ్యాక తన తల్లి గురుంచి తెలిసి ఎలా తల్లడిల్లిపోతుందో...ఇంత చిన్న వయసులోనే అంత భారం పెట్టిన దేవుడికి జాలి లేదా??..దేవుడే ఇలా పక్షపాతం చూపిస్తుంటే ఇక మనవ మాత్రులం మనమెంత...ఇలా ఎన్నెన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి...ఆ ఆలోచనలలో నుంచి నాకు కర్తవ్యం బోధపడింది...జీవితం గురుంచి ఒక చిన్న పాఠం తెలిసింది..అప్పటి వరకు జీవితంలో ఏది చెయ్యాలో దిశానిర్దేసం లేని నాకు ఆ రోజు ఒక గమ్యం కనిపించింది...అదే సివిల్ సర్వీసెస్ రాయాలని..

ఆ తర్వత ఒక పది రోజుల్లో మా పని పూర్తి చేసి తిరిగి రాజముండ్రి చేరుకున్నాం...అలా స్వయంగా గ్రామాల్లో తిరిగి వాళ్ళతో కలిసి మాట్లాడటం...వారి జీవన ప్రమాణాలు తెలుసుకోవడం...వారు పడే బాధలు స్వయంగా చూడటం...వొంట్లో సత్తువ ఉండి కూడా పని దొరకని దౌర్భాగ్యం...తద్వారా సంక్రమించే దారద్ర్యం...ఇవన్ని నా కర్తవ్యాన్ని బలపరిచాయి...నా నిర్ణయానికి మద్దతునిచ్చాయి ...నా జీవితానికి ఒక గమ్యాన్ని ఏర్పడేలా చేసాయి...

10 comments:

Anonymous said...

All the best

Anonymous said...

idi ippati charithra kaadu ...eppudu vunnade, panichesi choopistham meeku bangaru bavishyattu vuntundi ani cheppe vallaku otu veyaru, kaani mandu,cheeralu ...ichevallaku vesthe ilane thagaladuthundi ...

నేస్తం said...

nenu morning raasina comment edi?????

Ram Krish Reddy Kotla said...

meeru morning rasina comment kaki ettukupoyindata...malli rayandi :)

Ram Krish Reddy Kotla said...

Anonymous, Thanks for your comments ..

Anonymous said...

మనసు బరువెక్కించారు. బతుకుతెరువుకి ఉపయోగపడే మిషన్‌ను అమ్ముకోవలసిన దౌర్భాగ్యం ఏదో చేయాలన్న తపన పుట్టిస్తుంది.

ananya reddy said...

hi...tat was nice..but sorry i cudnt read the entire page due 2 lack of time...but if u r doin sumthin for a noble cause,,,u knw, tat ll always help u...

Ram Krish Reddy Kotla said...

Ananya thanks for your comment and also am impressed as ur ready to lend a helping hand if it is a noble cause. I will surely take your help when i execute my thoughts into reality...Your blog is very good and i liked it...keep writing...

Ram Krish Reddy Kotla said...

Anonymous, thanks for ur comment..felt so happy for that...

mahipal said...

hai,
nenu ippude me blog chusanu nestam dwara...
Chala baga rasthunaru.meru tappakunda me lakshaym cherukuntaru.