Search This Blog

Tuesday 17 November, 2009

నా వీకెండ్.....తొక్కలో మెమొరీస్


స్వాతి చినుకుకోసం ఎదురుచూసే చకోర పక్షిలా....నెలసరి పెన్షన్ కోసం ఎదురుచూసే రిటైర్డ్ ప్రభుత్వోద్యోగిలా...టిప్పు కోసం ఎదురుచూసే తాజ్ రెస్టారెంట్ వెయిటర్ లా....నేను కూడా వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని సోమవారం నుండి శుక్రవారం వరకు ఎదురుచూస్తూ ఉంటాను ...వీకెండ్ వస్తుందన్న సంతోషంతో శుక్రవారం, వీకెండ్ అయిపోయిందన్న బాధతో సోమవారం పెద్దగా పని చెయ్యం...మా మేనేజర్ కూడా ఆ రెండు రోజులు పెద్దగా పట్టించుకోడు...వాళ్ళ ఆవిడ షాపింగ్ కోసం శనివారం ఎంత ప్లాస్టిక్ మనీ తగలేయ్యాలో అని చింతపడుతూ శుక్రవారం....షేర్ మార్కెట్ గ్రాఫ్ ఎన్ని వంకరలు తిరుగుతుందో తెలియక గోళ్ళుగిల్లుకుంటూ సోమవారం..మమ్మల్ని పెద్దగా పట్టించుకోడు...మిగిలిన మూడు రోజుల్లో కనీసం ఒక్కరోజైనా వాడు సెలవు పెట్టాలని దేవుడిని ప్రార్దిస్తాము...ఇక వాడు కార్యాలయానికి దయచేసిన రోజుల్లో వాడు మాకు అవుట్-ఆఫ్-లాజిక్ ప్రశ్నలు వెయ్యడం..."డెలివరబుల్స్...టేక్ ఛాలెంజ్...వర్క్ టుగెదర్...క్వాలిటీ." లాంటి పదజాలంతో మా మైండ్ ని శరవణభవన్ లో సాంబార్ రైస్ లా తినెయ్యడం...ఏ పని చేసినా క్లయింట్ అసంతృప్తికి మీరే కారణం అంటూ తన అసంతృప్తిని మొత్తం మా మీద వెళ్లగక్కడం...ఇక వాళ్ళ ఆవిడ శనివారం శరవణ స్టోర్స్ షాపింగ్ లో కనీసం పాతికవేల కాంచీవరం చీర కొనిపెట్టడానికి క్రెడిట్ కార్డ్ మర్చిపోయాను అని వంక చెప్పిన ఈ అష్ట దరిద్రుడుకి రెండు రోజులు అన్నం పెట్టకుండా కేవలం తిట్లు పెట్టి మాడబెట్టినందుకు...సోమవారం కాకపోయినా మంగళవారమైనా మా మీద ఆవిడపై ఉన్న కోపాన్ని ట్రాన్సఫర్ చేసి "యు గైస్ ఆర్ హోప్ లెస్..." అని తిట్టినప్పుడు మాలో నిద్రపోతున్న చత్రపతి కళ్ళెర్రజేస్తాడు...చమేలి కా తేల్ మీసానికి రాసే చేన్నకేశవరెడ్డి తోడగోడతాడు...పీక కోసే ఇంద్రసేనారెడ్డి గాండ్రిస్తాడు...కాని... ఏం చేసినా మీ వార్షిక అప్రైసల్ నా చేతిలో ఉంది అన్న వాడి లుక్ చూసి వీళ్ళందరికీ బిస్కెట్ ఇచ్చి బాబ్బోబెడతాం.....


ఎప్పటిలాగే ఎదురుచూసే వీకెండ్ శుక్రవారం రూపంలో దేగ్గరిలోనే ఉన్నాను అంటూ పలకరించింది నన్ను..."నీకోసమే నే జీవించునది..."అంటూ నా హృదయం వీకెండ్ కోసమై ఊగిసలాడింది...సో ఈ వీకెండ్ ఏం చెయ్యాలి అని ఆలోచన సాగించాను ఎలాగూ శుక్రవారం పని చేసి సచ్చేది ఏమీ లేదుగా...ఏం మూవీస్ ఉన్నాయ్ అనుకుంటూ సత్యం, ఐనాక్స్, కేసినో లాంటి థియేటర్ సమాచారం కోసం నిరంతర సమాచార స్రవంతి - ఇంటర్నెట్ ని ఆశ్రయించి నా బాల్యమిత్రుడు గూగుల్ ని అడగగా..పెద్దగా ఇంటరెస్టింగ్ సినిమాలు ఏమి లేవని తెలిసి నిట్టూర్చాను...సరే పర్లేదులే ఫ్రెండ్స్ తో సరదాగా అలా బైటికి వెళ్ల వచ్చు..షాపింగ్ చెయ్యవచ్చు అంటూ వేరే లోకంలో ఉండగా "హే ఆర్.కే కెన్ యు ప్రిపేర్ థిస్ రిపోర్ట్ .." అంటూ నాలోకంలోకి అనధకారిక ఎంట్రీ ఇచ్చాడు మా మేనేజర్..'మరి నువ్వేం జేస్తావ్ నానా...షేర్ మార్కెట్ చూస్తావా..అసలు నీ ఏబ్రాసి మొహానికి ఒక్కపనయినా చేసి సచ్చావా, ప్రతిదానికీ మా మీద పడి చావడం తప్ప...నీ సత్తరు పేస్ లో నా తాడు' అంటూ నా ఆలోచనా స్రవంతి సాగుతుండగా "ఓకే గుడ్...ఐ నో యు విల్ డూ ఇట్ " అనుకుంటూ వెళ్ళాడు 'నేనెప్పుడు చెప్పానురా చేస్తానని...చార్మినార్ ముందు చార్మినార్ సిగెరేట్ పెట్టెలు ఏరుకునే మొహమూ నువ్వూను..' అంటూ పటపటా పళ్ళుకోరికినా మరు నిముషం తప్పక మనసొప్పక ఆ పని మొదలెట్టా...శుక్రవారం పని చెయ్యమంటే రాముడి గుడిలో ముమయిత్ ఖాన్ సాంగ్ పెట్టినంత అపచారంగా భావిస్తాను నేను...మొత్తానికి శుక్రవారం కార్యాలయ పనిగంటలు ముగిసేసరికి  వీకెండ్ జ్యోతులు వెలిగాయి నా గుండెలో.."ఎన్నాళ్ళో వేచిన ఉదయం...." అని పాట అందుకున్న నా హృదయానిది ఏమీ తప్పు లేదు...అయిదు రోజులు అయినా ఎన్నాళ్ళో అని అనిపిస్తుంది పాపం దానికి....


మా ఫ్లాట్ కి వెళ్లి చూసేసరికి ఎవరూ లేరు...ఏమయ్యారు ఈ దరిద్రులు అందరూ అనుకొని దూరవాణి పరికరం ద్వారా సదరు మిత్రులందరికి రింగు కొట్టగా వారందరు తమ తమ స్వస్థలాలకు వెళ్లితిరని తెలిసి మిక్కిలి ధుక్కం కలిగినది...వీకెండ్ ఒక్కడినే ఉండాలా అన్న ఊహ కొంచెం కలవరపరచినా ..సరేలే మనకేమన్నా భయమా తొక్క అనుకోని నాకు నేను ధైర్యం చెప్పుకొన్నాను...


గిండీలో మా ఫ్లాట్...
ఆ రోజు రాత్రి 11 గంటలు...
బైట జోరున వర్షం...
టొమాటో సూప్ సిప్ చేస్తూ టీవీలో "చూపులు కలసిన శుభవేళ.." సినిమా చూస్తున్నాను...
ఆ వర్షంలో కిటికీ ప్రక్కన కూర్చొని ఆ చల్లటి వాతావరణానికి వెచ్చటి సూప్ తాగుతూ జంధ్యాల సినిమా చూస్తూ హాయిగా నవ్వుకుంటూ ఉంటే...ఆహా ఏమి హాయీ "ఎంత హాయి ఈ రేయి...ఎంత మధురమీ హాయీ.." అంటూ మనసులో ఓ పాటేసుకున్నా..

అలా ఆ హాయి అనుభవిస్తుండగా నా సెల్ మోగింది...వెంటనే కరెంటు పోయింది...అదే టైంలో కంగారులో నా చెయ్యి తగిలి సూప్ ఒలికి మంచం మీద పడింది..ఆ సెల్ లో "ఏ1 ఏబ్రాసి" కాలింగ్ అని ఉంది...ఆంటే మా మేనేజర్..ఒకొక రోజు ఒకొక వెరైటీ తిట్టుతో వాడి నెంబర్ నా సెల్లో సేవ్ చేసుకుంటా...ఈ పరిణామాలన్నీ ఒకేసారి జరగడం అందునా మేనేజర్ ఆ టైం లో కాల్ చెయ్యడం వల్ల అప్పటిదాకా హాయిగా అనిపించినా రేయి సడన్ గా చండాలంగా అనిపించింది...ఈ సప్పర నాకొడుకు ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నాడు...నా మైండ్ వర్క్ శంకించింది...ఈడు ఇప్పుడు ఆఫీసుకొచ్చి నన్ను ఎమన్నావర్క్ చేయ్యమంటాడా??...ఎత్తొద్దు.. నా మైండ్ హితబోధ చేసింది..నేను ఎత్తి "హలో" అన్నాను...
ఆడు "ఆఫీసు లా ఒరు చిన్న వేల ఇరుకు...విల్ యు గో నౌ...ఇది రొంబ ముఖ్యమాన వర్క్..ఒరు గంట దా..ఉంగళ్ వీటు వెరీ నియర్ టు ఆఫీస్ నా.." అన్నాడు తమిళ్ ఇంగ్లీష్ కలిపి అసలే చిర్రెత్తి ఉన్న నాకు ఇంకా చిర్రెత్తిస్తూ...
"నా ఇప్పు వర ముడియాదు..ఉంగళ్ కి టైం గీం ఇల్లియే...ఫుల్ రైనింగ్ అవుట్ సైడ్...ఐ డోంట్ హావ్ కార్ లైక్ యు...వై డోంట్ యు గో..." అన్నాను వాడేమన్నా అనుకోనీ అని...
"ఐయామ్ ప్రాజెక్ట్ మేనేజర్...యు నీడ్ టు డూ వాట్ ఐ సే..." అన్నాడు...
"నీ ఎబ్బా...నీ ఏబ్రాసి మొహాన్ని ఎలకలు కొట్టా...అర్థరాత్రులు ఫోన్ చేసి పని ఉంది రా...నేను మేనేజర్ ని.. ఆంటే ఎవడొస్తాడు బే...సారీ సర్...ఐ హావ్ 204 ఫీవర్...ఐ కాంట్ గో టు ఆఫీసు నౌ" అని వాడికి తిట్టినట్టు అర్థంకాకుండా తెలుగులో తిట్టి ఇంగ్లీష్ లో వినయంగా రాలేనని చెప్పి ఫోన్ పెట్టేసాను..

బైట వర్షం...లోపక  కరెంటు పోయి విరక్తి ఆవహిస్తుండగా ఎవరో తలుపుతట్టిన శబ్దం వినిపించి వెళ్లి తలుపు తీసాను...ఒక్కసారిగా ఆ వ్యక్తిని చూసి దడుసుకున్నాను...వాడు మా అపార్ట్మెంట్ వాచ్మాన్...పగలే దాడుసుకునేలా ఉంటాడు, ఇక రాత్రి కొరివి దేయ్యనికి ప్రోటోటైపులా ఉంటాడు ఎదవ...పాపం తెలుగోడే చిన్న మానుఫాక్చర్ డిఫెక్ట్ ఐటెం అనమాట....
"నీకేం పోయేకాలం పోలయ్య, అర్థరాత్రి అదీ కరెంటు లేనప్పుడు తలుపుకొట్టి మరీ దడిపిస్తావా
? .." అన్నాను గుండెవేగం తగ్గుతుండగా...
"ఈ పక్క సందులో ట్రాన్స్ ఫొర్మెర్ పేలిందట బాబు...రేపు ప్రోద్దుటికిగాని కరెంటు రాదంట..ఈ ఇసయం మీకు చెప్పిపోదాం అని వచ్చాను..." అంటూ ఒక్కసారిగా నాలో పొలికేక పెట్టించాడు పోలయ్య....
"చంపేసావ్ గదా పోలయ్య...బైట వర్షం...లోపల చీకటి....ఇక ఈ రాత్రి జాగారమే..." అన్నాను నిట్టూర్చుతూ...
"అయితే నాతో రండి బాబు...ఒక ఫుల్ తెచ్చా సాయంత్రమే...కంపెనీ ఇద్దురు గాని...ఏదన్న కష్ట సుఖాలు మాట్టడుకుందాం...." అన్నాడు కళ్ళలోంచి అరసెంటిమీటర్ అవతలికి వచ్చిన మిడిగుడ్డులని కప్పి ఉన్న సోడాబుడ్డి కళ్ళజోడు తప్పిస్తూ నన్నింకా భయపెడుతూ....
"ష్..ష్...మెల్లిగా..మతీ గితీ గాని పోయిందేటి పోలయ్య...ఎవరన్నా విన్నారంటే నీలాగా నేనుకూడా పచ్చి తాగుబోతుని అనుకుంటారు...అసలే పెళ్లి కావలసిన వాడిని..నాకు బాడ్ నేమ్ తెప్పిదామనే !!..ఈ ప్రపంచం లో మిగిలి ఉన్న అతికొద్ది నాన్-ఆల్కహాలిక్స్ లో నేను ఒకడిని...మన పక్క అపార్ట్మెంట్ వాచ్మెన్ జోగినాథంతో చెప్పుకో నీ కష్ట సుఖాలు..." అని తలుపేసి సెల్ ఫోన్ లో గుండమ్మ కథ పాటలు వింటూ కిటికీలోంచి వర్షపు జల్లు చూస్తూ కాలం గడపడం మొదలెట్టా...
సడన్ గా పాట ఆగింది...సెల్లు మోగింది...ఎత్తే అంతలోనే అది మిస్సేడ్ కాల్ అయి కూర్చుంది..."కనులు మూసినా నీవాయే...నే కనులు తెరచినా నీవాయే.." అంటూ నా సెల్లు మళ్ళీ గుండమ్మ పాట అందుకుంది...
ఈ టైంలో మిస్సుడ్ కాల్ ఎవరబ్బా అనుకోని నెంబర్ చూడగా అది కొత్త నెంబర్...నేను మళ్ళీ చేస్తే అవతలి నుండి ఎవరూ లిఫ్ట్ చెయ్యడం లేదు...



ఈ ఫోన్ చేసిన ఆడెవడో మా రమణ లాంటి ఏబ్రాసి అయ్యుంటాడు...ఎంటనే రమణగాడికి ఫోన్ చేద్దామని డిసైడ్ అయ్యి నెంబర్ నొక్కి చెవిదెగ్గర పెట్టుకోగా "నీ భారతం పడతా...నిను పట్టుకుపోతా...ఓ ఓ ఓ ...ఆ..ఆ ..ఆ .."అంటూ కాలర్ ట్యూన్ అందుకొంది "ఈ కాలర్ ట్యూన్ ఏంటి వీడి బొంద...పిఠాపురంలో బఠానీళ్ళు అమ్ముకొనే మోహము వీడూను..." అని నా మనసులో అనుకుంటుండగా..."ఎవరు.??" అని కరుకుగా ఓ లేడీ టైగర్ వాయిస్ వినిపించింది.."నేను రమణ ఫ్రెండ్ ని...తను ఉన్నాడా.." అన్నాను..."ముదనష్టపు సచ్చినాడా...నీకే వేరే పనేటి లేదటరా...అర్థరాత్రులు ఫోన్ జెయ్యడం కాకుండా ఆడెవడో కావాలని అడుగుతావా...అరకులో అరిటాకులు అమ్ముకొనే అంట్లవెధవా...ఇంట్లో అమ్మాయుందనేగా మీ సెకలన్నీ..తాట తీస్తా ఇంకోసారి ఫోన్ వస్తే.." ఆవిడా మాటలకు నా మైండ్ బ్లాక్ అయ్యి...షట్ డౌన్ అయ్యి...మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది...దెబ్బకి అష్టగ్రహ కూటమి నా తల చుట్టూ ఏర్పడింది.."ఏంటి మీ ఇంట్లో అమ్మాయుందా..???" అంత కన్ఫ్యూజన్ లోనూ అడగాల్సిన ముఖ్యమైన మేటర్ అడిగేసా..." ఒరేయ్...నీ పిండాకూడు పిట్టలకు..." అంటూ ఆమె సంస్కృత విభావరి సాగిస్తుండగా ఫోన్ పెట్టేసా...కోలుకోడానికి ఒక అయిదు నిముషాలు పట్టింది....


వీకెండ్ మొదట్లోనే ఇన్ని షాకులు ఎంటబ్బా...అసలు రమణగాడికి చేస్తే ఆవిడెవర్రా బాబూ నా చెవి తుప్పు మొత్తం వదలగోట్టింది...ఆమె వాయిస్ వింటే అదేదో హారర్ సినిమాలో ముసల్దాని లెక్క అనిపించింది...దాని మొగుడెవరో గాని దీని దెబ్బకి ఎప్పుడో టపా కట్టేసి ఉంటాడు...అసలు ఆడవారు ఎంత మృదు మధురమైన వాళ్ళు..అలాంటి వాళ్ళలో ఇలాంటి రాకాసులు కూడా ఉంటారంటే నమ్మక తప్పట్లేదు..."నాణానికి రెండో వైపు కూడా ఆలోచించు నాయనా.." అని నా మనసు నాకు ఉపదేసించగా...ఒకవేళ నిజంగా వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఉండి, ఇలా రాంగ్ కాల్స్ వస్తుంటే ఆమాత్రం కరుకుగా ఉండాలేమో కదా...నాలోని రెండో వైపు తన అభిప్రాయం చెప్పింది...నిజమేనేమో అనుకుని టైం చూసా ఒంటిగంట అయింది...

ఇప్పుడేం చెయ్యాలిరా దేవుడా...వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది...దూరంగా ఏదో వింత శబ్దం...సరిగ్గా ఆలకించగా శంఖం ఊదినట్లు ఒక సౌండ్...ఆ సౌండ్ నాకేవేవో ఆలోచనలు తెప్పించింది...ఒక ఆరు గంటలు రివైండ్ చేసుకోగా, జ్ఞప్తికి వచ్చిన విషయం వొణుకు పుట్టించింది...అసలే మనకు సెవాలని చూసినా..ఆ పరిసర ప్రాంతాలను తలచుకున్నా వెన్ను నుంచి వొణుకు స్టార్ట్ అవుద్ది...అవును, నేను ఆఫీసు నుండి ఇంటికి వచ్చేప్పుడు అక్కడ ఎవరో బాల్చి తన్నారు...ఈ చెన్నైలో సెవాన్ని గ్లాస్ పెట్టెలో మరీ పెట్టి ఆరుబయట ఉంచుతారు...ఆ సీన్ దూరం నుంచి చూడగానే వొణుకు స్టార్ట్ అయ్యి వేరే రూట్ లో రూంకి చేరుకున్నా...ఇప్పుడు ఫూనెరల్ కి తీసుకువెళ్తున్నారేమో..ఓ మై గాడ్..అసలే చీకటి...అందులోనూ ఆ శబ్దం నాకు చేరువవుతుంది...అంటే ఒక రెండు మూడు నిముషాల్లో మా వీధిలోకి వచ్చేస్తుంది...అయినా
ప్రొద్దున చూసుకోవచ్చుగా ఆ కార్యక్రామాలు...ఇలా అర్థరాత్రులు శంఖం ఊదుతూ మరీ బెదరగోట్టకపోతే....కిటికీ మూసేసి వచ్చి బెడ్ మీద పడుకున్నాను...కళ్ళెదురుగా ఆ సెవం సీన్...మళ్ళీ లేచి కూర్చున్నాను...బాత్రూంకి వెళ్ళాలన్నా భయం వేసింది..."ఎహే..ఇవన్నీ పిచ్చి భయాలు...ఇలాంటివి పెట్టుకోకూడదు..." అంటూ నాకు నేను ధైర్యం చెప్పుకున్నా ఒక్క నిముషం కూడా ఆ విషయం నా మైండ్ మీద పనిచెయ్యడం లేదు...ఇంతలో శంఖం నా పక్కనే ఊదినంత సౌండ్...అమ్మో వాళ్ళు మా అపార్ట్మెంట్ పక్కనుంచే వెళ్తున్నారు...గుండె స్పీడ్ 200 బీట్స్ పెర్ సెకండ్...వెంటనే ఎవరికన్నా కాల్ చెయ్యాలని సునీల్ గాడికి కాల్ చేశా "హలో...సునీల్...ఎమన్నా సంగతులు చెప్పరా .." అన్నాను ఆడు ఫోన్ ఎత్తగానే....
"ఈ టైంలో ఫోన్ చేసి సంగతులు చెప్పమంటావేంటిరా...అంతా ఓకే నా..." అన్నాడు నిద్ర మత్తులో..."ఎవరండీ..." అంటూ పక్కన వాళ్ళ ఆవిడ ఆవలించింది...
"సారీ రా...కొత్తగా పెళ్ళయిన వాళ్లకు ఈ టైంలో చెయ్యకూడదు...కానీ నా పొజిషన్ బాలేదు...ఎమన్నా చెప్పు..." అన్నాను శంఖం సౌండ్ ని అవాయిడ్ చేస్తూ....

"ఏమయిందేహే...ఈ టైంలో ఏం విషయాలు చెప్పమంటావ్..." అడిగాడు సునీల్ గాడు అయోమయంలో
"ఏదోకటి...ఆ.. మనం థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు నువ్వు మాధవిని లవ్ చేసావ్ కదా...ఆ ఫీలింగ్స్ గురుంచి చెప్పు..." అన్నాను...
"ఒరేయ్...పక్కన నా పెళ్ళాన్ని ఉంచుకొని, నేను ఇంజనీరింగ్ లో లవ్ చేసిన అమ్మాయి గురుంచి నా ఫీలింగ్స్ చెప్పాలా...కొంపలు కొల్లేరు చేసేలా ఉన్నావ్..." అన్నాడు వాడు షాక్ తిని...
"మరి లేకపోతే...మనం హాస్టల్ లో ఉన్నపుడు ఓ సారి సెకండ్ షో చూసి రూంకి వస్తున్నప్పుడు పోలీసు ఆపాడు కదా గుర్తుందా...అపుడు నాకు చాలా భయమేసిందిరా...నీ ఫీలింగ్స్ ఏంటి అప్పుడు .." అన్నాను గొప్ప టాపిక్ ఎంచుకున్నానని సంబరపడుతూ...
"ఒరేయ్ నీకు నా మీద పూర్వ కక్షలేమన్నా ఉంటే డైరెక్ట్ గా పొడిచి చంపురా...ఇలా అర్థరాత్రి ఒంటిగంటకి ఫోన్ చేసి అపుడెప్పుడో సెకండ్ షో అయ్యాక పోలీసు  పట్టుకున్నప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి అని అడిగితే నేనేమి చెప్పనురా నా శ్వార్ధం..పిండాకూడు..." అంటున్నవాడిని "ఇంకెంతసేపండి ఈ టైంలో మీ ఫోన్ లు..." అంటూ వాళ్ళ ఆవిడ అడగడంతో "ఒక్క సెకండ్ డార్లింగ్...." అని "ఆ చెప్పరా.." అన్నాడు నాతో..."ఏంటి చెప్పేది...సర్లే కానీ...క్యారీ ఆన్...రేపు మాట్లాడుకుందాంలే...అవును రమణగాడికి చేస్తే ఎవరో లేడీ ఎత్తింది ఏంటి? " అడిగాను విషయం గుర్తొచ్చి....
"ఆడు నెంబర్ మార్చబట్టి వచ్చే మార్చికి ఏడాది..." అన్నాడు...
"అదా సంగతి....సర్లే కంటిన్యూ..." అని ఫోన్ పెట్టేసా...
మొత్తానికి ఆ శంఖం గోల తప్పినందుకు కొంత ఉపసమనం కలిగింది...



మళ్ళీ సెల్లు పాటలతో కాలక్షేపం చేస్తుండగా మళ్ళీ సెల్లు రింగడం...ఆగడం జరిగింది...నెంబర్ చూస్తే ఇందాక వచ్చిన నెంబర్...అయిపోయాడు ఈడు నా చేతుల్లో అనుకోని కాల్ చేశా అదే నెంబర్ కి...అవతల నుంచి" హలో..."
"ఎవడ్రా నువ్వు...ఎంగిలి ఆకులు ఏరుకునే ఏబ్రాసి ఎదవ.." అంటూ ఇంకా తిట్టబోతుండగా...
"రేయ్ రామకృష్ణ నేనురా...రమణని..." అన్నాడు...
"నువ్వా నాయనా...అయితే ఈ తిట్లు సరిపోవు...ఇంకా తిట్టాలి నిన్ను...నీవల్ల ఇప్పటిదాకా తినని తిట్లు తిన్నాను కదరా ఒక లేడీ హిట్లర్ వల్ల.." అన్నాను..
"సారి రా నెంబర్ మార్చాను...నా పాత నెంబర్ కి చేస్తే ఒకామె తిడుతుందట చాలా మంది చెప్పారు...సర్లే ఏంటి సంగతులు.." అంటూ ఒక అరగంట సోల్లెసాక నాకు నిద్ర మత్తుగా అనిపించి వాడికి బాయ్ చెప్పి పడుకున్నాను...



ప్రొద్దున లేచేసరికి పన్నెండు, అదేంటి పదింటికి అలారం పెట్టుకున్నా కదా...అబ్బో అంతలా పట్టేసిందా మనకి నిద్ర...కరెంటు ఎప్పుడో వచ్చినట్లుంది...కానీ బయట వర్షం కురుస్తూనే ఉంది....అలా అది రెండు రోజులు కురుస్తూనే ఉంది...అర్థరాత్రి కరెంటు పోతూనే ఉంది..నేను రమణకి కాల్ చేసి ఇంజనీరింగ్ ఊసులు చెప్పుకోడం జరుగుతూనే ఉంది...మొత్తానికి నా వీకెండ్ అలా జరిగిందనమాట.......



17 comments:

నరేష్ నందం (Naresh Nandam) said...

BAGUNDI BROTHER!

మంచు said...

కిషన్ ..ఈ మద్య TV 9 లొ విన్నా..నువ్వేనా అర్దరాత్రుళ్ళు అమ్మాయిలకు ఫొన్ చేసేది .. :-) ఫొన్ చేసెటప్పుడు కొన్ని కొడ్ లు ఫాలొ అవ్వాలి కదా.. బొమ్మరిల్లు చూడలేదా.. :-)

చకోర పక్షి వర్షం కొసం అనుకుంటా చూసేది..

Hilarious.. as usual..

Anonymous said...

:) హో హో హో హి హి హి బాగుంది. చెయ్యితిరిగిన వాళ్ళు కొంచం స్టఫ్ఫ్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఐనా టైం పాస్ కి స్టఫ్ఫ్ ఏమిటంటారా.

cbrao said...

వారాంతాన్ని ఇంత భయంకరంగా గడిపే బదులు, The Chennai Trekking Club లో సభ్యులుగా చేరవచ్చు. సందర్శించండి
http://groups.google.co.in/group/sachennaitrekkingclub

ప్రకృతిలో విహరించవచ్చు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. కొత్త హాబీలు నేర్వవచ్చు. ఇక్కడ అందరూ ఉత్సాహవంతులే.

Ram Krish Reddy Kotla said...

మంచుపల్లకి గారు ధన్యవాదాలు...తప్పుని సరిదిద్దాను..తప్పు తెలిపినందుకు చాలా థాంక్స్ అండి....అమ్మాయిలకు ఎక్కడ చేసానండీ బాబూ అదెవరో లేడీ హిట్లేర్ ఎత్తితే....అయినా మనకు బేసిక్ గా అంత సీన్ లేదు...అదీ సంగతి..

Ram Krish Reddy Kotla said...

నరేష్ గారు థాంక్స్ :)
రావు గారు మీరు చెప్పిన ట్రెక్కింగ్ క్లబ్ బాగుంది..ఖచ్చితంగా చేరుతాను...థాంక్స్ :)

మురళి said...

అక్కడక్కడా టైపాట్లు మినహా చాలా బాగుందండీ.. పొరుగు రాష్ట్రంలో సాటి తెలుగు వాడు కష్టం సుఖం వినడానికి రమ్మంటే వెళ్లనందుకు మంచి శాస్తే జరిగింది మీకు :):)

Anonymous said...

You may have to change your color combination, I wonder nobody suggested!!

nice post.
- Madhu

జ్యోతి said...

కిషన్ గారు,

అన్యధా భావించకండి. మీ బ్లాగు చదవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. టెంప్లేట్ మార్చగలరా??

నేస్తం said...

బాగా అయ్యింది.. లేకపోతే దేవుడిలాంటి ప్రాజెక్ట్ మేనేజర్ ని మోసం చేస్తారా ...:)

Ram Krish Reddy Kotla said...

@Murali, ha ha thanks andi :)


@ Madhu many viewers suggested to change the template, but i couldnt as i was busy in some other work...now for the time, i have reverted to basic template.

Ram Krish Reddy Kotla said...

జ్యోతి గారు...క్షమించాలి ఇప్పటిదాకా టెంప్లేట్ మార్చనందుకు...ప్రస్తుతానికి బేసిక్ టెంప్లేట్ పెట్టాను...మీకు ఇప్పుడు చదవడానికి పెద్దగా ఇబ్బంది ఉండదనుకుంటా...ఓ లుక్ వెయ్యండి మరి....

నేస్తం..దేవుడి లాంటి ప్రాజెక్ట్ మేనేజరా :O ....ఇంక నేనేం చెప్పలేను...హ హ..

divya vani said...

"ఏంటి మీ ఇంట్లో అమ్మాయుందా..???" అంత కన్ఫ్యూజన్ లోనూ అడగాల్సిన ముఖ్యమైన మేటర్ అడిగేసా...
మీరు సూపరండీ ఎవరైన అంత తిడితే దెబ్బకి దడుచుకొని ఫొనె పెట్టేస్తారు కాని మీలా హ హ

Ram Krish Reddy Kotla said...

హి హి...ఇలాంటి విషయాలలో నేను చాలా షార్ప్ ఉంటాను దివ్య...

మధురవాణి said...

అయ్యా బాబోయ్.. ఏం నవ్వించారండీ బాబూ! :-Dఅన్నట్టు.. మీ టెంప్లేట్ బాగుంది :-)

Ram Krish Reddy Kotla said...

Thanks a lot Madhuravani :-)

3g said...

అద్దిరిపోయింది పోస్ట్... మధుర వాణి గారికి మీకామెంట్ చూసి ఇలావచ్చాను. పాత పోస్ట్ కదా పై రెండు లైన్లు చదివి వెళదామనుకున్నాగాని చివరివరకు చదవకుండా ఉండలేకపోయాను.