Search This Blog

Tuesday, 27 April, 2010

షార్ట్ కట్ టు గోపాలపురం - 1


అర్థరాత్రి పదకొండు యాభై అవుతుంది టైం..

నర్సీపట్నం లక్ష్మి టాకీస్ లో శ్రీలక్ష్మిగణపతి పిక్చర్స్ వారి "సముద్రంలో రాక్షసనౌక" చిత్రం రెండో ఆట వదలడానికి పది నిముషాలు ఉంది...

థియేటర్ పక్కన బడ్డి షాప్ బాపిరాజు కొట్టు కట్టేసి, ముత్యాలు టీ కొట్టు దెగ్గరకొచ్చి "ముత్తేలు మాంచి స్టాంగ్ టీ కొట్టవోయ్....." అన్నాడు లుంగీ ఎగ్గట్టి దమ్ము కొడుతూ.. 

"ఏట్రా బాపిగా...ఎట్టా ఉండాది యాపారం..." రెండో ఆట నుంచి అప్పుడే బైటకి వచ్చిన గోపాలపురం సర్పంచ్ బైరినాయుడు పలకరించాడు...
"ఏటండీ ఆట ఇంకా ఉండగా వచ్చేశారేటి...." అంటూ ముత్యాలు వైపు తిరిగి "ముత్తేలు... నాయుడు గారికి పెసల్ టీ చెప్పు..." అంటూ అరిచాడు..."నెల రోజులుగా ఈడి బాకీనే మూలుగుతుంది ఇక్కడ, పైగా మాకు మళ్ళీ ఆడర్లు ఒకటి..." సణిగాడు ముత్యాలు

"సినిమాలో అంత విశేషం ఏటీ లేదురా....మొన్న సూసిన "రాక్షస బల్లుల సవాల్" తో పోలిత్తే ఇదెక్కడెహే..అదో కళాఖండం కదూ...అన్నట్టు ఒరే 'పిల్లి కళ్ళ సుందరి' సినిమా ఎల్లుండి రిలీజ్ మన లచ్చిమిలో...ఆలివుడ్డులో ఊపేసిందంటా ఆ సినిమా..రెండో ఆటకి నాకు టికెట్ తియ్యిరా మర్సిపోకుండా...జనాలు ఎగబడతారు ఆ సినిమాకి, నాకేమో గోపాలపురం నుంచి ఒచ్చేసరికి లేట్ అయిపోతాది..." అన్నాడు టీ తాగుతూ...మన నాయుడు గారికి హాలివుడ్ తెలుగు డబ్బింగ్ సినిమాలు అంటే ప్రాణం కదామరి....
టీ తాగేసి మోటర్ సైకిల్ స్టార్ట్ చేయ్యబోతుంటే కనిపించారు ఆ ముగ్గురు అబ్బాయిలు బైరినాయుడు గారికి...

ఆళ్ళ వైపు అలాగే చూస్తూ.."ఒరేయ్ ఇట్రండిరా....." గట్టిగా కేకేసాడు ఆ పిల్లల్ని ఉద్దేశించి...
థియేటర్ నుండి గబగబా బయటకి వెళ్ళిపోతున్న ఆ ముగ్గురు అబ్బాయిలు ఆ కేకకి వెనక్కి తిరిగి చూసారు...బైరినాయుడు గారు తన దెగ్గరికి రమ్మని చెయ్యూపుతున్నాడు..వాళ్ళు టక్కున మళ్ళీ అటువైపుకు తిరిగారు..
"ఒరేయ్ ఈడిక్కడ ఉన్నాడెంట్రా బాబూ..." కర్చీఫ్ ముఖానికి కప్పుకొని ఆళ్లిద్దరి వెనుకాల దాక్కున్నాడు రవి..
"ఒరేయ్ మనం అయిపోయాంరా...ఈడు మనల్ని చూసేసాడు...రేపు మన ఇళ్ళల్లో చెప్పేస్తాడురా మనం సెకండ్ షోకి టౌన్ కి వచ్చామని.." భయపెట్టాడు సురేష్ మిగతా ఇద్దరినీ...

"ఏటి కాదులే రండెహే...ఏదోకటి మేనేజ్ చేద్దాంలే..." అంటూ గిరిగాడు బైరినాయుడు దెగ్గరకు  వెళ్తుండగా మిగతా ఇద్దరూ అనుసరించారు...
దెగ్గరికి వస్తున్న వాళ్ళని పరిశీలనగా చూస్తూ "ఓరోరి నువ్వట్రా!!....పడమటి వీధి రాములోరి గుడి పూజారి శాస్త్రి కొడుకువి కదా.." అన్నాడు సురేష్ గాడిని చూసి...'ఓరి ఈడెబ్బ...పోయి పోయి నన్నే గుర్తుపట్టాడు ఏంట్రా దేవుడా...' అనుకోని గిరిగాడి వైపు చూసాడు సురేష్...బైరినాయుడు గారు కూడా గిరి గాడి వైపు చూసి "వార్నీ ఈడు తెలీకపోవడం ఏంటి...శంకరం పంతులు కొడుకువి గదూ..." అన్నాడు...అవునన్నట్లుగా తలూపాడు గిరి...

"ఆరి భడవల్లారా !!....సెకండ్ షో సినిమాలు కావాల్సి వచ్చినాయిరా మీకు...ఈ ఏడు పదో తరగతే కదా మీరు...వారం రోజుల్లో పరీక్షలు ఎట్టుకొని..ఎదవ ఏశాలు ఎత్తారా??...అసలే నేను సర్పంచ్ గా ఉన్నపటి నుంచి పదో తరగతి మార్కుల్లో ఇసాఖ జిల్లాలోనే మన ఊరు టాపు రా...అట్టాంటిది ఈసారి పరువుబోయ్యేట్టు ఉందే..." 

'నువ్వు సర్పంచ్ అయితే ఏదో పెద్ద డి.ఈ.వో లెవెల్లో మాట్లాడుతావేంట్రా...'పళ్ళు పటపటా కొరికాడు గిరిగాడు.."అది కాదు సర్పంచ్ గారు, పొద్దుటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం..కాస్త రిలాక్స్ కోసం ఇలా..." అంటూ నాయుడు గారి వైపు చూసాడు....
"ఏటి రిలాక్స్ కోసమా...రెండో ఆట..అది కూడా 'సముద్రంలో రాక్షస నౌక' ..బాగా రిలాక్స్ అయ్యారా నాన్నా!!... ఇట్టా గాదు మీ పని..." అని ఓ క్షణం ఆగి...."అవునొరే ముగ్గురు ఉండాలి...ఇద్దరే ఉన్నరేట్రా??" అని అడిగాడు...వీడేంటి ఇలా అంటున్నాడు అని వెనక్కి తిరిగేసరికి రవిగాడు లేదు...గిరి సురేష్ ముఖముఖాలు చూసుకున్నారు...
"ఇందాక మీతోకూడా ఇంకొకడు ఉన్నాడు కదా..." రెట్టించాడు నాయుడు....
"ఆ....అది...ఆడు వెళ్లిపోయుంటాడు సర్పంచ్ గారు..." అన్నాడు గిరి 'ఈడెక్కడికి పోయాడ్రా..' అని మనసులో అనుకుంటూ  ..

"ఆడు మనూరోడిలాగే ఉన్నాడే...ఎక్కడికి పోతాడు..??" అడిగాడు అనుమానంగా..
"మీరు ఆడిని సరిగ్గా చూడలేదు...ఆడిది నర్సిపట్నమే..మనూరు కాదు" అన్నాడు సురేష్.
"సరేలే...అన్నట్టు ఒరే..మీతో కూడా ఇంకోడు ఉంటాడు తెల్లగా పొడుగ్గా...ఆడి పేరేట్రా??"...
"మీరు రవి గురుంచి అడుగుతున్నారా?? " అన్నాడు గిరి
"ఆ ఆడే...ఒళ్ళు జాగర్తగా ఉంచుకోమను ఆడిని...నా కూతురికి పిచ్చి పిచ్చి ఉత్తరాలు రాత్తున్నాడట..చెమడాలు ఇరిసేత్తానని సెప్పు కొడుక్కి...సర్పంచ్ నాయుడు అంటే ఆటలుగా ఉందేటి ఆడికి..." తెలివిగా తప్పించుకొని బాపిరాజు బడ్డి కొట్టు వెనుకాల దాక్కున్న రవి గాడికి ఈ మాటలు వినగానే చెమటలు శ్రీశైలం ఫ్లడ్ గేట్లు ఓపెన్ చేసినట్లు పారుతున్నాయి...వాడికి అర్జెంటు గా నెంబర్ వన్ తన్నుకొని వచ్చేలా ఉంది...

"ఇందాక మీలో మూడోవాడు ఆడిలా కనిపించే మిమ్మల్ని పిలిచాను...సరేలే రేపు ప్రొద్దున్నే వచ్చి మీ పని ఆడి పని చెప్తా...." అంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళబోతూ "బక్క పీనుగులేగా వచ్చి కూసొండి...ఊళ్ళో దింపుతా.." అన్నాడు నాయుడు
ఈనాకోడుకులు ఎక్కడ కమిట్ అవుతారో అని బడ్డీ కొట్టు ఎనకాల ఉన్న రవి గాడికి టెన్షన్ మొదలైంది...

"పర్లేదు సర్పంచ్ గారు...మేము సైకిల్ తెచ్చుకున్నాం..దాంట్లోనే వెళ్తాం.." అని చెప్పాడు గిరి గాడు..నాయుడు గారు ఓ లుక్ ఏసి వెళ్ళిపోయాడు...

హమ్మయ్యా అనుకుంటూ బడ్డీ కొట్టు వెనుకాల నుంచి బయటకి వచ్చాడు రవి గాడు..
"ఇంత పిరికోడివి ఆడి కూతురికి ఎట్టా లైన్ ఏస్తున్నావురా!...అదేంట్రా వొళ్ళంతా తడిసిపోయింది...ఇదంతా భయమే.!!!.." పగలబడి నవ్వుతున్నాడు గిరిగాడు...
"ఆపరా బాబూ...నీవల్లే ఇదంతా...వద్దురా అన్నా వినకుండా సెకండ్ షోకి లాక్కొని వచ్చావ్...ఇప్పుడు చూడు వాడికి బుక్ అయ్యాం..." అన్నాడు రవి గాడు భయపడుతూ...

"ఆడేం చేస్తాడురా...సర్పంచ్ అని కొంచెం పోస్ కొడుతుంటాడు కానీ, వాళ్ళ ఆవిడ అంటే...ఇది వాడికి.." చిటికెన వేలు ఊపి చూపించాడు గిరి గాడు...
"సరేలే పదండి...ఊరికి వెళ్ళాలి..అసలే అర్థరాత్రి అవుతుంది..." అన్నాడు సురేష్...
గిరి గాడు సైకిల్ తీశాడు..నిర్మానుష్యమైన వీధుల వెంబడి నడుచుకుంటూ మెయిన్ రోడ్ చేరుకున్నారు...

"అయినా రవిగా భలే పిల్లకి లైన్ వేశావురా...జాంపండులా ఉంటాదెహే పిల్ల..నీకు అవసరం అంటావా అది..నకిచ్చేయ్యి రా.." అంటూ చూసాడు రావిగాడి వైపు...ఆడు సురసురా చూస్తున్నాడు వీడి వైపు...
"సరే సరే..నీదేలే ఆ పిల్ల..ఊరికే అంటున్నా...నాకో పెద్ద డౌట్ రా..నాయుడు గాడి పెళ్ళాం ఇంచుమించు రోడ్ రోలరు షేప్...తార్ రోడ్ కలర్ ఉంటది కదా ఆ జాంపండు దానికి పుట్టిందేనా అని..." అన్నాడు..విచిత్రంగా చూసాడు రవిగాడు..
"సారీ రా...నీకు కాబోయే మామగారి శీలాన్ని శంకిస్తున్నా అని ఫీల్ అవ్వకు...ఇదేదో పెద్ద మేటర్ అని నా డౌట్..అదేదో కనిపెడితే సర్పంచ్ గాడిని ఓ ఆట అడించోచ్చు.." అన్నాడు

గోపాలపురానికి దారి తీసే అడ్డరోడ్ కి చేరుకున్నారు..
"ఒరేయ్ ఈ తొక్కలో సైకిల్ లో ఇప్పుడు త్రిపుల్స్ వెళ్ళడం కష్టం రా...వచ్చేప్పుడు ఏదో సినిమాకి వస్తున్నాం అనే ఊపులో వచ్చేశాం...అసలే తొమ్మిది కిలోమీటర్లు.." అన్నాడు సురేష్
నిజమే అన్నట్లుగా తలూపారు ఇద్దరు...

"ఏం చేద్దాం ఇప్పుడు మరి..ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోయి ఉంటుంది ఎప్పుడో.." అన్నాడు రవి..
కాసేపు బుర్ర గోక్కున్న గిరిగాడు "ఒక సూపర్ ఐడియారా..వెంకటేశ్వర లాడ్జి వెనుక సందులో నుంచి వెళ్తే ఒక మట్టి బాట వస్తుంది...అది అనుసరించి వెళ్తే మూడు కిలోమీటర్లలో మన ఊరి పడమటి వీధి చేరుకోవచ్చు..మన గొపలపూరనికి అదే మంచి షార్ట్ కట్.." చెప్పాడు గిరిగాడు..

"అమ్మో ఆ రూటా!...వద్దురా..అసలే అర్థరాత్రి...అందునా చిమ్మచీకటి...పైగా కొంత దూరం పోయాక స్మశానం ఉంటుందట...నాకసలే ఆ సమాధులు చూస్తే చచ్చే భయంరా బాబూ...కష్టమో నష్టమో ఇటే వెళ్దాంరా.." అన్నాడు సురేష్ గాడు..
"ఓవర్ యాక్షన్ చెయ్యకు....మేము ఇద్దరం ఉన్నాం...నీకెందుకు భయం..మన దెగ్గర టార్చ్ లైట్ కూడా ఉంది...లైట్ చూస్తె దెయ్యాలు రావంట..ఏదో సినిమాలో చూశా" చిన్నగా నవ్వాడు గిరి..
చేసేదిలేక వాళ్ళని అనుసరించాడు సురేష్...

వెంకటేశ్వర లాడ్జ్ వెనుక రూట్ కి చేరుకొని నడుస్తున్నారు..అంతా నిశ్శబ్దం..అన్ని ఇళ్ళు తలుపులు వేసి ఉన్నాయ్..మనుషులు కాదు కదా కనీసం కుక్కలు కూడా లేవు...వాళ్ళ గుండె సవ్వడి వాళ్ళకే వినిపిస్తుంది..అందులో మరీ స్పీడ్ మ్యూజిక్ మన సురేష్ గాడిది... 

అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళిద్దరి మధ్యలో చెరొక చెయ్యి పట్టుకొని నడుస్తున్నాడు సురేష్ గాడు...
మట్టి బాట చేరుకొని నెమ్మదిగా వెళ్తున్నారు...అంతా చిమ్మ చీకటి..గిరిగాడు టార్చ్ పట్టుకొని నడుస్తున్నాడు...బాట చిందర వందరగా ఉంది...

సురేష్ గాడు గుండెని చేతులో పెట్టుకొని నడుస్తున్నాడు వణుకుతూ..రవి గాడి పోసిషన్ కూడా దాదాపు అదే...
ఒక ఇరవై నిముషాలు నడిచేసరికి ఎక్కడున్నారో వాళ్ళకి అర్థం కాలేదు...కనుచూపు మేరల్లో అంతా చిమ్మ చీకటి...దూరంగా నక్కల అరుపులు...వణికిపోతున్నాడు సురేష్ గాడు...


కొంచెం సేపు అయ్యాక "అనోసరంగా ఇటు వైపు వచ్చామేమో...నాకు దారి అర్థం కావడం లేదు.." అన్నాడు గిరి గాడు...
గుండెల్లో పిడుగు పడింది రవిగాడికి...సురేష్ గాడికి అయితే ప్యాంటు తడిసిపోయింది...వాడికి వణుకుతో జ్వరం వచ్చేలా ఉంది..ఇందాక సర్పంచ్ గాడితో కనీసం తను వెళ్ళిపోయినా ఈ పాటికి హాయిగా ఇంట్లో నిద్రపోయేవాడినే కదా అనుకున్నాడు...సురేష్ కి  ఏడుపు తన్నుకుంటూ వచ్చింది...

అలాగే నడుస్తూ వెళ్తున్నారు..
"ఒరేయ్ గిరిగా తిరిగి వెనక్కి వెళ్ళిపొదాంరా...కావాలంటే నర్సీపట్నంలోనే ఈ నైట్ ఏ ప్లాట్ ఫాం మీదో పడుకొని తెల్లవారు జామునే వెళ్ళిపొదాంరా...పాపం సురేష్ గాడు చూడు..ఇక్కడే చచ్చేలా ఉన్నాడురా.." అన్నాడు రవి గాడు...


"ఒరేయ్ ఈ ఆలోచన నాకు మీకన్నా ముందే వచ్చింది..అసలు ఎటు వెళ్తున్నామో తెలియట్లా...వచ్చిన దారి మీకు ఎవరికన్నా గుర్తుందా??" అడిగాడు గిరి గాడు...
అంతా వణుకులోనూ గిరి గాడిని మర్డర్ చేసి జైలుకి వెళ్ళాలి అన్నంత కోపం వచ్చింది సురేష్ గాడికి...
కొంచెం దూరం వెళ్ళగానే...ఓ పెద్ద భయంకర ఆకారం...డైనోసార్ అంత ఎత్తు...ముగ్గురూ ముఖముఖాలు చూసుకున్నారు..గిరిగాడు టార్చ్ లైట్ అటువైపు ఫోకస్ చేసాడు...పరిశీలించి చూడగా అదొక మర్రి చెట్టు అని అర్థమయ్యి ఊపిరి పీల్చుకున్నారు...
ఇంతలోనే.....
పెద్ద కేక...
వాళ్ళ గుండెలు ఆగినంత పని అయ్యింది..
వెనక్కి తిరిగి చూసారు..అంతే కోయ్యబోమ్మల్లా నిల్చుండిపోయారు ముగ్గురూ.......

[తరువాయి భాగం త్వరలోనే పోస్ట్ చేస్తాను....] [ఇది పూర్తి కల్పిత కథ...జస్ట్ ఎంజాయ్ ది షార్ట్ కట్.. :) ]

 

15 comments:

Rishi said...

Super.Looking fwd for next one

phani said...

waiting for the next post..

Anonymous said...

"చెమటలు శ్రీశైలం ఫ్లడ్ గేట్లు ఓపెన్ చేసినట్లు పారుతున్నాయి...." కేక .ఇంత కి ఎవరు అరిచారు ?ఎందుకలా కొయ్య బొమ్మల్లా నిల్చి పోయారు ??మిగతా భాగం కూడా తొందరలో పోస్ట్ చేయండి సర్ .ఇలా సుస్పెన్సు పెట్టడటం అన్యాయం ....చాల బాగా రాసారు...keep రైటింగ్....అల్ ది బెస్ట్ మై డియర్.
By ,
Bangaram

నేస్తం said...

ఏమీ .. ఎంచక్కా యే ఫేమిలీ ఎంటర్ టైన్మెంట్ కధో రాయచ్చు గా.. ఇలా భయ పెట్టకపోతే..సరే కాని రెండొ పార్ట్ ఎప్పుడూ.. కాని యాస గోదావరి జిల్లా యాస కదా ..ఇంకొంచం మెరుగు పరుచుకోవాలి .. :) కాని నేను గోదావరి జిల్లా అమ్మాయిని అయినా నేను మాట్లాడే భాషలో నాకు తెలియకుండా నా యాస వస్తుంది కాని కధల్లో ఎంత ప్రయత్నించినా వ్రాయలేను.. అది వేరే విషయం అన్నమాట ..

బ్లాగాగ్ని said...

Good one Kishen garu. Waiting for the next part.

priya.... said...

hey ramu...nijam cheppu a SURESH gari character neede kadu...hehehe full njoy chesa...ne blog after a long tym...its very nice...a yasa baga nachindi...though nak matldataniki chala kastam ina...try cheyalani undi...nu bhale rasav a yasanu...anyways...waiting 4 ur nxt blog...andulo...suresh garini hilet chei inka comedy ga funny ga untundi...ninnu uuhinchukuntam andaram...hahahah....keepgoing...

Kishen Reddy said...

@ Rishi & Phani: Thank U, will post it soon.

@ బంగారం, ఎవరు అరిచారు ఎందుకలా నిలబడ్డాం అనేది మీకు త్వరలోనే తెలుస్తుంది...

@ నేస్తం, ఎప్పుడూ ఫామిలీ ఎంటర్ టైనర్ లే నా...అప్పుడప్పుడు భయపడుతూ ఉండాలి...అప్పుడప్పుడూ భయపెట్టాలి..నిజమే గోదావరి యాస కొంచెం మేరుగుపరచుకోవాలి...ఈ సరి మీ టపా లో గోదారి యాస ప్రయత్నించి చూడండి ఎందుకు రాదో నేను చూస్తునాను

Kishen Reddy said...

@ బ్లాగాగ్ని: చాలా థాంక్స్ అంది...త్వరలోనే రాస్తాను

@ ప్రియా : థాంక్స్...సురేష్ కాదు, రవి వేసుకో నా కారక్టర్..అమ్మాయికి లైన్ వేస్తున్నాడు కదా...

priya.... said...

anduke kada...manak adi suit avvadani...suresh character pettindi...andulone tamariki smashanalante chala istam kada...anduke...a character ki tamaru apt ani nen fix ipoya...ravi sangati malli chudam le hehehe...k na..

శివరంజని said...

మల్లీశ్వరి సినిమా లో వెంకటేష్ ని సునీల్ కధ చెప్పమని అడిగితే ఇలా దెయ్యాల కధ చెప్పి భయపెడతాడు మీలా . మీ పొస్ట్ చదువుతుంటే గుర్తుకొచ్చింది . బాగా రాసారు నాకయితే ఈ టపా లో అక్కడక్కడ వంశీ శైలి కనిపించింది.

Kishen Reddy said...

రంజని నిజమే కొంచెం వంశి స్టైల్ కనపడి ఉండొచ్చు..తనకి నేను పెద్ద ఫ్యాన్ ని..ఏ.సి ని కదా మరి...ఇంకేంటి మరి సంగతులు,మన గోదావరి ఎలా ఉంది??..అడిగినట్లు చెప్పు..అలాగే రాజముండ్రి ని కుడా...ఉంటా మరి...తరువాయి టపాలో కలుద్దాం :)

శివరంజని said...

మీ GIET కాలేజ్ ఆ పక్కనున్న GSL మెడికల్ కాలేజ్, రైల్వేస్టేషన్ , రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ , రాజమండ్రి అన్ని శుబ్బరంగానే ఉన్నాయి సార్ . హన్నా! గోదావరిని కబ్జా చేసేద్దామనుకుంటున్నారా మీరు . రాజమండ్రి మాది కాకపొయినా గోదావరి మాత్రం నాదే .గోదావరి లో నీరు అంతగా లేదు పైగా గౌతమి ఘాట్ కి వచ్చిన వాళ్ళందరు చాట్ తిని చెత్త మాత్రం అందులోనే పాడేసి అస్తవ్యస్తం చేసేస్తున్నారు సార్

3g said...

బాగుందండి............. మీ పోస్ట్ చదువుతుంటే చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్ స్కూల్ ఎగ్గొట్టి "భూలోకవీరుడు 007" సినిమాకెళ్లిన విషయాలు గుర్తొచ్చాయండి.

waiting for the next part.........

Kishen Reddy said...

రంజని, అన్ని బాగున్నయన్నమాట...మంచిది..గోదావరిని నేను కబ్జా చెయ్యడం ఏమిటి??..గోదావరి నీది కాదు, అందరిది..గోదావరిని దర్శించిన ప్రతి ఒక్కరికి అదొక అనిర్వచనీయమైన అనుభూతిని కలగజేస్తుంది...అదే దాని గొప్పతనం...సరేలే ఇంకేంటి మరి...బాగా తిని, బాగా నిద్రపోతున్నావా..అసలే నిద్రే నీ ప్రాణం కదా!!...ఒక రెండు టపాలు రాసి వేదిలేసావెంటి నీ బ్లాగ్ ని...ఇంకా రాయి..నీ కొత్త టపా త్వరలో చూడాలని ఉంది...చాలా బాగా రాస్తావ్ నువ్వు...నిజ్జంగా నిజం..

Kishen Reddy said...

3g, చాలా సంతోషం..మీ పాత జ్ఞాపకాలు నా టపా ద్వారా త్రవ్వుకున్నందుకు...మీ బ్లాగ్ ఎప్పుడు మొదలేడుతున్నారు మరి