Search This Blog

Friday, 21 May 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 3


"సంహిత, నేను ఒకే రోజు గీతం కాలేజీలో జాయిన్ అయ్యాము...అదే రోజు ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం..." కార్తీక్ చెప్తున్నాడు, సుధ అలాగే అతని వైపు చూస్తూ వింటుంది...

***********************************************************

"కాలేజీలో చేరాలి అంటేనే భయం వేసింది నాకు...రాగింగ్, గొడవలు..ఇలా ఏవేవో నన్ను చాలా భయపెట్టాయి...మొదటి రోజే నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది.." అని చెప్తున్న సంహిత వైపు అలానే చూస్తున్నాను...
"చిన్నపటినుండి ఎప్పుడూ సెకండ్ అనే మాట నాకు తెలీదు...అన్నిటిలో నేనే ఫస్ట్...ఇక్కడ కూడా కష్టపడి కాలేజీ ఫస్ట్ తెచ్చుకోవాలి..." అంటూ పట్టుదలగా చెప్తున్న సంహీని చూసి ముచ్చటేసింది...
"యు విల్...అల్ ద బెస్ట్..." అంటూ విష్ చేసాను..
"థాంక్స్...నిన్ను నేను చంటి అని పిలవోచ్చా?.." అని అడిగింది సంహిత...
"నీ ఇష్టం...కానీ చంటీ అనే ఎందుకు?" అడిగాను
"ఆ పేరు అంటే నాకు చాలా ఇష్టం...చిన్నప్పుడు నేను మొదటిసారిగా స్కూల్ లో చేరినప్పుడు, నాకు మొదటి రోజే పరిచాయం అయ్యాడు చంటి...నాకు చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడు ..మేమిద్దరం రోజూ బాగా ఆడుకునేవాళ్ళం...అతను నాతో ఆడుకోడానికి రాకపోతే ఇక ఆ రోజంతా నేను అన్నం తినే దాన్ని కాదు..అలాంటిది సడన్ గా చంటిని స్కూల్ మన్పించేసారు...తర్వాత తెలిసింది చంటికి అంత చిన్నతనంలోనే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని..అతను ఎక్కువ కాలం బ్రతకడని..తనని చూడటానికి ఓ రోజు వెళ్ళినప్పుడు 'సమ్మి నేను నీతో అడుకోలేను ఇంకెప్పుడూ...నాకు వొంట్లో బాగోలేదు..నువ్వు ఏడవకు, నీకు ఇంకో చంటి దొరుకుతాడు..' అన్న చంటిని పట్టుకొని బాగా ఏడ్చేసాను...చంటి కొన్ని రోజులకి చనిపోయాడు...ఆ తర్వాత ఇన్నేళ్ళకి నాకు మొదటి రోజే ఫ్రెండ్ అయిన నిన్ను చూసి చంటి గుర్తొచ్చాడు...అందుకే నిన్ను చంటి అని పిలుస్తా.." అని చెప్పిన సంహిత వైపు చూసాను...'నేను నీకు అంత గొప్ప స్నేహితుడిని అవ్వగాలనా..?' అంటూ నా మనసు ఆమెకు వేసిన ప్రశ్నకి బదులుగా ఆమె రువ్విన చిరునవ్వు నాకు సమాధానం తెలిపింది...

ఓ రోజు సన్నగా చినుకులు మొదలవ్వగా, మేమిద్దరం కాలేజీ బస్సు స్టాప్ షెల్టర్ కింద ఉన్నాం...ఇద్దరు సీనియర్లు ఒక జూనియర్ ని రాగింగ్ మొదలెట్టారు అక్కడ...
"రేయ్...సెల్యూట్ చెయ్యి భే..." 
"...."
"ఏందిరా చెవుటోడివా??..."
"...."
"నీ పేరేంట్రా??"
"....."
"బట్టలు ఊడదీసి పరిగేత్తిస్తా కాంపస్ మొత్తం...నాకు గురుంచి తెలీదేమో...ఏం జూస్కోనిరా ఈ పొగరు...చెయ్ సెల్యూట్..."
"....."
సీనియర్ గాడికి తిక్కరేగి..'నీ యబ్బా..' అంటూ కాలర్ పట్టుకున్నాడు..
తలెత్తి సీనియర్ వైపు చూసాడు అతను...అప్పుడు చుశాను అతని కళ్ళ వైపు...ఒక్కసారిగా మండుతున్న అగ్నిగోళంలా మారాయి..'ఏంట్రా ఆ చూపు...' సీనియర్ మాటలు పూర్తి కాలేదు, ఎప్పుడు ముడిచాడో ఆ పిడికిలి, ఆ నరాల శబ్దం వినిపించి అటుచూసే లోపే అతగాడి పిడికిలి సీనియర్ పొత్తికడుపులో పిడిబాకులా దిగింది...
కిందబడి దొర్లుతున్న సీనియర్ ని చూస్తూ..." సుధీర్....సుధీర్ నా పేరు.." అంటూ వెళ్ళిపోయాడు ఆ జూనియర్....

ఇదంతా చూసిన సంహిత "ఛ..ఇలాంటి వాళ్ళు గొడవలు పెట్టుకోడానికే కాలేజీకి వస్తారేమో...సగం ఇలాంటి వాళ్ళ వల్లే కాలేజీ చేరాలంటేనే నాలాంటి వాళ్ళు భయపడుతున్నారు.." అంది..నేను మాత్రం అలా నడిచి వెళ్తున్న సుధీర్ అనబడే జూనియర్ వైపే చూస్తున్నా...

ఆ తర్వాత చాలా రోజులు సుధీర్ ని గమనించాను..ఏదో వచ్చి తన పని చూసుకొని వెళ్లి పోయేవాడు, పెద్దగా ఎవరితోనూ కలిసేవాడు కాదు..నేను, సంహిత అనుకున్నట్లు అతను గొడవలకి పోయే రకం ఏమీ కాదు.కానీ తనని అనోసరంగా కదిలిస్తే, ఇక అదొక పెద్ద గొడవ అవుతుంది అని మాత్రం అర్థం అయింది...సుధీర్ ఆ రోజు సీనియర్ ని కొట్టిన ఇన్సిడెంట్ పెద్ద దుమారమే లేపింది..సీనియర్స్ ఒక బాచ్ కలిసి సుధీర్ని బాగా కొట్టారు..కాంపస్ ముందు మోకాళ్ళ మీద నిల్చుని సీనియర్స్ కి సారి చెప్పమన్నారు వాళ్ళు సుధీర్ని...ఊహూ అలా చెప్తే వాడు సుధీర్ ఎందుకు అవుతాడు.."నా ప్రాణం పోయినా అది జరగదు అన్నాడు.." చివరికి ఈ విషయం ప్రిన్సిపాల్ కి తెలిసి ఎలాగో రాజీ కుదిర్చాడు...

సుధీర్ చాలా మొండొడు...అస్సలు దేనికీ భయపడడు...సంహితకి మాత్రం అతనంటే కోపం..అతనికి అంత మొండితనం పనికిరాదు అంటుండేది...

ఓ రోజు కాలేజీ అయిపోయాక, బస్సు స్టాప్ కి వచ్చాను ఒక్కడినే ఆ రోజు సంహిత కాలేజీకి రాలేదు..సుధీర్ ఒక్కడే ఉన్నాడు బస్సు స్టాప్ లో..
"హాయ్ సుధీర్..." మాట కలిపాను అతన్ని చూస్తూనే...
"హాయ్.." చాలా ముక్తసరిగా చెప్పాడు 
"నా పేరు కార్తీక్...కంప్యూటర్స్..." అన్నాను చేయి కలుపుతూ 
"ఓహ్..."
అతను పెద్దగా మాట్లాడడు అని తెలిసీ నేనే సంభాషణ కొనసాగించాను 
"ఎవరికోసం అయినా ఎదురు చూస్తున్నావా?" అంటూ అడిగాను 
"ఆ..అవును..." మళ్లీ మౌనం..
ఇంతలో ఒక అమ్మాయి వచ్చింది..."సారి అన్నయ్య కొంచెం లేట్ అయింది...అయినా నువ్వెళ్ళిపోవాల్సింది కదా..." అందామె వస్తూనే...
"నిన్ను ఒంటరిగా వదిలా??..అదెప్పుడైనా జరుగుతుందా!!" అన్నాడతను పక్కనే పార్క్ చేసిన ఉన్న బైక్ స్టార్ట్ చేస్తూ...
వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు...ఆ అమ్మాయి పేరు దివ్య...తరువాత నాకు తెలిసిందేమిటంటే...వాళ్లేమీ రక్తం పంచుకుపుట్టిన అన్నాచెల్లెళ్ళు కాదు..దివ్య తండ్రి ఆ అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు, వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చారు అని తెలుసుకొని, సుధీర్ ఫార్మాలిటీస్ పూర్తిచేయడంలో సహాయం చేసాడు వాళ్లకి..దివ్యని వైజాగ్ లో దెగ్గరుండి హాస్టల్ లో చేర్పించాడు..'బొత్తిగా లోకం తెలీని పిల్ల, అప్పుడప్పుడు కొంచెం కనిపెట్టుకొని ఉండు బాబు..' అని ఆమె తండ్రి చెప్పినపుడు 'అలాగే..' అని ఇచ్చిన మాట కోసం రోజూ దివ్యని కాలేజీలో దింపడం, మళ్లీ తిరిగి హాస్టల్ లో దింపడం అతని దినచర్యలో భాగం...

ఓ రోజు దివ్య క్లాసులో ఎవడో "అయాం అవైలబుల్ టునైట్" అని ఒక పేపర్ మీది రాసి దివ్య జడకి తగిలించాడు ఆమెకి తెలియకుండా...అది చూసి కాంపస్ లో వాళ్ళందరూ ఒకటే నవ్వు...అది చదివిన ప్రతి పోకిరి వెధవ ఆమె దెగ్గరికొచ్చి "నేను కూడా అవైలబుల్...నేను రావచ్చా" అంటూ ఒక వెకిలి నవ్వు వదులుతుంటే అర్థంకాక ఆ తరువాత ఎవరో ఒక అమ్మాయి ఆ పేపర్ తీసి ఆమెకి చూపిస్తే ఒక్క క్షణం ఖంగుతిని వెంటనే సిగ్గుతో చచ్చిపోవాలని అనిపించింది దివ్యకి. ఈ విషయం తెలిసిన సుధీర్, అలా రాసినవాడెవడో కనుక్కొని కోపంతో రగిలిపోతూ దివ్య క్లాసుకి వెళ్లాడు..క్లాసు మధ్యలో ఉందనే విషయం కూడా అతనికి కనిపించలేదు..అతనికి కనిపించింది ఒక్కటే దివ్యని ఎడిపించినవాడు, వాడి కాలర్...విసురుగా వెళ్లి వాడి కాలర్ పట్టుకొని బెంచ్ పైనుంచి లాగి ఈడ్చుకుంటూ వాడిని తీసుకెళ్తుంటే క్లాసులో అందరూ కోయ్యబోమ్మల్లా చూస్తుండిపోయారు....వాడిని అలాగే కాలర్ పట్టుకొని ఈడ్చుకుంటూ కాంపస్ మధ్యకి తీసుకొచ్చి..."నువ్వు రేపు మళ్లీ కాలేజీకి రావాలంటే నేను చెప్పమన్నది చెప్పు..కాలేజీ మొత్తం వినాలి నువ్వు చెప్పేది " అన్నాడు వాడి వైపు చూస్తూ..వాడు వణుకుతూ ఉన్నాడు..."చెప్తావా...లేక .." అతను పిడికిళ్ళు ముడవడం చూసి...గట్టిగా సుధీర్ చెప్పమన్నట్లు చెప్పాడు...కాలేజీ మొత్తం వినేలా..ఇలా .."రమేష్ అనబడే నేను...మొగాడిని కాదు...అటూ ఇటూ కాని జాతికి చెందిన వాడిని...అందుకే మా.డా గాడిలా దివ్యని ఎడిపించాను...నన్ను రేపటినుంచి అందరూ అలానే పిలవోచ్చు.." అన్నాడు..అదే మాట పది సార్లు గట్టిగా కాంపస్ అంటా వినేలా చెప్పించాడు సుధీర్....ఆ తరువాతి రోజు నుంచి రమేష్ అనబడే ఆ అటూ ఇటూ కాని జాతికి చెందిన వాడు కాలేజీకి రావడం మానేసాడు...ఆ తరువాత దివ్యని ఏడిపించడం మాట అటుంచితే, కనీసం మాట్లాడటానికి కూడా భయపడేవారు...

అదిగో...సరిగ్గా ఆ ఇన్సిడెంట్ తో సంహిత దెగ్గర నూటికి ఒక యాభై మార్కులు కొట్టేసాడు మన సుధీర్...
"కుర్రాడు మంచోడే చంటి...కాకపోతే కాస్త వెర్రి...కాస్త తింగరి తనం...బోలెడంత మొండితనం...అంత కన్నా ఎక్కువ పొగరుబోతుతనం ఉన్నాయి..." అంటూ సుధీర్ పై తన అనాలిసిస్ చెప్పింది సంహిత ఓ రోజు సడన్ గా నాతో...
"ఓహో...మొత్తానికి అతనిమీద ఒక ఒపినియన్ కి వచ్చావనమాట..." అన్నాను నవ్వుతూ 
"ఆ..ఏదో..పర్లేదు...కానీ ఒక అమ్మాయి పరువుని అందరిముందు ఎలా కాపాడేడో చూసావు కదా...కొంచెం వైలెంట్ గా అనిపించినా, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి దెగ్గరనుంచి అంత కన్నా హామీ ఏం కావాలి...నీ కోసం నా ప్రాణం అడ్డేస్తా అనే హామీ.." అంది కొంచెం ఎమోషనల్ గా...
"హ్మం ...నిజమే" అన్నాను...ఇంతలో ఎప్పుడు వచ్చాడో తెలీదు, మా మాటలు విన్నవాడిలా మా ప్రక్కనుంచి చిన్న స్మైల్ తో వెళ్తూ కనిపించాడు సుధీర్...
"నవ్వడం కూడా వచ్చే అబ్బాయికి..." అంది మెల్లిగా నవ్వుతూ సంహిత...
"పోగిడావు కదా అబ్బాయిని మరి.." అన్నాను ఆమెతో కలిసి నవ్వుతూ 

ఆ తరువాత దివ్యకి సంహిత మంచి ఫ్రెండ్ అయింది...తద్వారా సుధీర్ కూడా మాతో మాట్లాడుతూ ఉండేవాడు..కానీ ఎంత వరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడేవాడు.."ఓ ముక్క ఎక్కువ మాట్లడిదే..తమరిని అమ్మాయిలు లవ్ లో పడేస్తారని భయమా??" సంహిత డైరెక్ట్ గానే అడిగేసింది ఓ సారి...ఓ నవ్వు నవ్వి అక్కడనుంచి పరార్ మనోడు...

ఓ రోజు అందరం కలిసి కూర్చొని మాట్లాడుతుండగా సంహిత సడన్ గా అడిగింది సుధీర్ ని " ఆ రోజు దివ్య స్థానంలో నేను ఉంటె...నువ్వు అలా రియాక్ట్ అయ్యేవాడివా??" అని...
"అయ్యుండేవాడిని కాదు..." చెప్పాడతను
"ఏం ?...ఎందుకని?.." కొంచెం రోషం సంహిత గొంతులో 
"అప్పుడు నువ్వెవరో నాకు తెలీదుగా..." అన్నాడతను స్థిరంగా 
"ఓహో తెలిస్తేనే కాపాడుతావా...సరే ఫర్ ఎక్సాంపుల్ నేను నీ లవర్ అని అనుకో...మరి అప్పుడు.." అందామె...ఏదో తెలుసుకోవాలనే తపన ఆమెలో...
"అప్పుడు....అప్పుడు...." అతనేమి చెప్తాడో అనే ఎదురుచూపు తాలూకు మెరుపు చూశాడతను ఆమె కళ్ళలో ...
"ఏమో...నువ్ నా లవర్ అయితే గాని చెప్పలేను." అన్నాడతను.
"అబ్బో...ఏదో ఎక్సాంపుల్ కి అడిగాను బాబూ..అంత దూరం వెళ్ళకు..." అంది సంహిత
"నేను వెళ్ళానా??.." అంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు..
"అంటే ఏంటి...నేను వెళ్ళాననా??...ఏంటి చంటి అతని భావం...అసలు ఆ పొగరు ఏంటి మనిషికి...అలా మధ్యలో వెళ్లిపోతాడేంటి??.." అంటున్న సంహిత రోషం వెనుక ఏమి దాగుందో తెలుసుకోవాలనిపించింది నాకు...


 [ To be continued in the 4th part...I will publish the 4th part on Sunday probably :-) ]

Saturday, 15 May 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 2


సంహిత కళ్ళు తెరిచే సరికి హాస్పిటల్ లో ఉంది. 
సుధీర్ చనిపోయాడన్న విషయం ఆమెకి గుర్తురాగానే దుఃఖం పొంగుకు వచ్చింది..తను ఇక లేడు అన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది..అతను ఎవరో ఏమిటో, అసలు అతని గురుంచి ఏమీ తెలియదు..పరిచయం కూడా చాలా తక్కువ, కానీ సర్వస్వం కోల్పోయినట్లు అనిపిస్తుంది ఆమెకు..అతనితో మాట్లాడింది కొన్ని మాటలే కావచ్చు, కానీ ఆమె హృదయం అతని హృదయంతో అనుక్షణం సంభాషిస్తూనే ఉంది..ఊసులాడుతూనే ఉంది...

నర్స్ లోపలి వస్తూనే "మీ నాన్న గారు, అమ్మ గారు హాస్పిటల్ కి బైల్దేరారు..కొద్దిసేపట్లో వచ్చేస్తారు..ఈ రోజు సాయంత్రం మిమ్మల్నిడిశ్చార్జ్ చేస్తారు .." అంది..
"నన్ను హాస్పిటల్ లో ఎవరు చేర్చారు..." అంది సంహిత
"ఎవరో ఒక అబ్బాయి చేర్చాడు...అతను పేరు కార్తీక్ అంట.." అంది నర్స్ సంహితకి టాబ్లెట్ ఇస్తూ..
"అలాగా..." అంది 
"మీరు రెస్ట్ తీసుకోండి..." అంటూ నర్స్ వెళ్ళిపోతుండగా..."నేను ఆ అబ్బాయితో ఒక సారి మాట్లాడాలి...పిలుస్తారా?" అంది సంహిత...
"అలాగే..." అంటూ వెళ్ళిపోయిన నర్స్ కార్తీక్ ని సంహిత దెగ్గరకు తీసుకువచ్చి తను వెళ్ళిపోయింది...

పాతికేళ్ళు ఉంటాయి అతనికి..ఆరడుగుల ఎత్తు,కోల మొహం..లేత గడ్డం,నూనూగు మీసాలు..ఫుల్ హాండ్స్ చొక్కాని చేతులు సగం మడిచి, చక్కగా ఇన్షర్ట్ చేసుకోని ఉన్నాడు...
"థాంక్స్..." అంది సంహిత అతన్ని చూస్తూనే..
"పర్లేదు...మీతో పాటే బస్సులో ఉన్నాను నేను...మిమ్మల్ని చాలా సార్లు నేను ఎక్కిన బస్సులోనే చూశాను ..నేను దిగిన స్టాప్ లోనే మీరూ దిగారు...మీరు ఎప్పుడూ దిగే స్టాప్ అది కాదు...మిమ్మల్నే కొద్ది దూరం అనుసరించాను...కానీ ఆ క్షణం మీరు..." అంటూ అతను ఇంకా ఏదో చెప్పబోతుండగా
"మీరు నాకొక చిన్న మాట ఇవ్వగలరా?" అందామె అతన్ని సూటిగా చూస్తూ 
"చెప్పండి" అన్నాడు అతను స్థిరంగా 
"ఆ స్పాట్ లో ఏం జరిగిందో మా అమ్మానాన్నలకు తెలియకూడదు...ఏదో స్కూటర్ తగిలి నేను క్రింద పడిపోతే, మీరు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారని చెప్పండి..ప్లీజ్.." అందామె బ్రతిమాలుతూ..
"నేను అర్థం చేసుకోగలను..." అన్నాడతను చిన్నగా తలాడిస్తూ..
"థాంక్స్...మీరు మరోలా అనుకోకపోతే ఇంకో సాయం చేస్తారా?.." అందామె
"చెప్పండి..."
"అక్కడ ఆక్సిడెంట్ లో చనిపోయిన అతన్ని ఏ హాస్పిటల్ మార్చురీలో ఉంచారో కొంచెం తెలుసుకొని చెప్తారా...నాకు అతని కడసారి చూపు దక్కాలి..." అందామె రాబోతున్న కన్నీటిని తుడుచుకుంటూ
"మీరు ఏం చెప్తున్నారో...." అంటూ అతను ఏదో చెప్తుండగా, సంహిత అమ్మానాన్నా వచ్చారు అక్కడికి...
"ఏమైంది తల్లీ..." అంటూ రాగానే కన్నీళ్ళు పెట్టుకుంది సంహిత తల్లి...
ఆమె కార్తీక్ వైపు చూసి చేతులు జోడించింది...
కార్తీక్ ఆమె చేతిని పట్టుకొని వద్దంటూ బైటకి వెళ్తూ...ఇక వస్తాను అన్నట్లుగా సంహిత వైపు చూసాడు..అతన్ని చూస్తుంటే ఎంతో దెగ్గరి ఆత్మీయుడిలా..ఓ గొప్ప స్నేహితుడిలా ...ఎప్పటి నుంచో తెలిసిన వాడిలా కనిపిస్తున్నాడు సంహితకి..
అతను వెళ్ళిపోతుండగా.."చంటి ...." అందామె..
చివాల్న వెనక్కి తిరిగి చూసాడు కార్తీక్...అతని కళ్ళలో నీళ్ళు..
ఇది కనిపెట్టిన సంహిత తండ్రి కార్తీక్ ని తీసుకోని రూం బయటి వెళ్లాడు..
"నా కూతురిని మళ్లీ నువ్వే కాపాడావు...నీ ఋణం ఎలా తీర్చుకోవాలి??" అన్నాడు ఆయన
"మీరు ఒక్కసారి చేసిన తప్పుకే పెద్ద శిక్ష అనుభవిస్తున్నారు...ఇంకా నా ఋణం గురుంచి ఎందుకులెండి.." అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు..తలదించుకున్న ఆ తండ్రి లోపలికి  వెళ్ళిపోయాడు

ఆ సాయంత్రం డిస్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక విషయం తెలిసి సంహితని చూడటానికి సుధ వచ్చింది
"ఎలా జరిగిందే..." అంది సుధ రాగానే కంగారుగా..
"స్కూటర్ గుద్దింది...తుళ్ళి క్రింద పడ్డాను..మరుక్షణమే సృహ కోల్పోయాను..కార్తీక్ అనే అబ్బాయి నన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసాడు.." అంది 
"ఆ తెలుసు...కార్తీక్ ఎవరో కాదు, తను నా కజిన్....తనే నాకీ విషయం చెప్పాడు..నువ్వు కూడా నేను చదివే కాలేజీలోనే చదువుతున్నావ్ అని తెలుసుకున్నడేమో, సంహిత అనే అమ్మాయి నీకు తెలుసా అని అడిగాడు నన్ను...తెలియకపోవడం ఏమిటి తను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసరికి మనోడికి షాక్..." అంటూ చిన్నగా నవ్వింది
"ఓ రియల్లీ...నేను కార్తీక్ తో ఓ సారి మాట్లాడాలి..." అంది సంహిత..
"అలాగే..తనని నీకు కాల్ చెయ్యమని చెప్తాలే.." అంది సుధ 
"ప్లీజ్ త్వరగా చెయ్యమని చెప్పు..." అంది సంహిత, ఆమెలో ఏదో తేడా కనిపిస్తుంది సుధకి..ఆమెలో ఏవో అంతర్లీనంగా ప్రకంపనలు..ఏదో బాధ కొట్టొచ్చినట్లు తెలుస్తుంది సుధకి...

"అలాగే...నువ్వు రెస్ట్ తీసుకో...నేను రేపు ప్రొద్దున్నే వస్తాను.." అంటూ లేచి వెళ్లబోతుండగా
"మన కాలేజ్ టాపర్ సుధీర్....తను...తను.." అంటున్న సంహిత వైపు తిరిగి వింతగా చూస్తుంది సుధ..
"తను....చనిపోయాడట కదా.." అంది సంహిత...ఆమె కనుసన్నల నుంచి ఉబుకుతున్న నీరు సుధ దృష్టి నుంచి తప్పించోకోలేదు...నమ్మలేనట్లుగా చూస్తుంది సంహిత వైపు...
"ఏం మాట్లాడుతున్నావ్...సుధీర్ ఎవరు??" అంది సుధ కంగారుగా...సంహితకి ఏమవుతుంది అన్న ఆందోళన కలుగుతుంది సుధకి..
"అదేంటే మాత్స్ గ్రూప్ టాపర్ సుధీర్..." అంది సంహిత
"సరే సరే...నువ్వు రెస్ట్ తీసుకో...నేను రేపు వస్తాను..." అంటూ వెళ్ళిపోయింది సుధ

"కార్తీక్ సంహిత నీతో మాట్లాడాలట....తనకు ఓ సారి ఫోన్ చెయ్యి .." చెప్పింది సుధ కార్తీక్ తో సంహిత నెంబర్ ఇచ్చి..
"తను ఏం అడుగుతుందో నాకు తెలుసు...కానీ నేను నిస్సహాయుడిని..." అన్నాడు కార్తీక్ 
"ఏం అడుగుతుంది తను ??"
"సుధా...నీకొక నిజం చెప్పాలి..."
"ఏంటది..." కొంచెం కంగారుగా అడిగింది
"సంహితను స్కూటర్ గుద్దడం అబద్దం...అలా అని తను చెప్పమంటే నేను చెప్పాను..."
"అవునా....మరి ఏం జరిగింది..."సుధకి అంతా అయోమయంగా ఉంది 
"తను నేను ఒకే బస్సులో వెళ్తున్నాం...నేను రోజు దిగే సిరిపురం సిగ్నల్ దెగ్గరే తనూ దిగింది..దిగడమే కంగారుగా దిగింది..నన్ను దాటుకుంటూ ముందుకు వెళ్ళింది...సిగ్నల్ దెగ్గరికి వెళ్లి అలాగే నిల్చుంది కాసేపు..నేను ఆమెనే అనుసరించాను...ఆమె వైపు చూసాను...వణుకుతూ ఉంది..కళ్ళ వెంబడి నీళ్ళు...ఇంతలోనే సుధీర్ అని గట్టిగా అరిచింది ఏడుస్తూ..ఆ అరుపుకు నాకే భయం వేసింది..ఆ క్షణం ఆమె కళ్ళలోకి చూస్తే...సర్వస్వం కోల్పోయిన బాధ, ఆక్రోశం ఆమెలో...అక్కడ వెళ్ళే వాళ్ళు ఆగి మరీ ఆమె వైపే చూస్తున్నారు...ఇంతలే ఉన్నట్లుండి అక్కడే కుప్పకూలిపోయింది..నేను వెంటనే ఆమెని హాస్పిటల్ కి తీసుకువచ్చాను..." అంటూ చెప్తున్న కార్తీక్ వైపు నిశ్చేష్టురాలై చూస్తుంది సుధ...సంహిత అలా ఎందుకు ప్రవర్తిస్తుంది..నో వే...ఏదో ఉంది ఇందులో...కానీ ఏమీ అర్థం కావడం లేదు సుధకి..."కాలేజీ టాపర్ సుధీర్ అని ఎందుకు చెప్పింది...టాపర్ పేరు కిరణ్ కదా.." అంతా అయోమయగా తోచింది సుధకి.

"సంహిత నన్ను ఒక సాయం అడిగింది...అక్కడ ఆక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి బాడీ ఏ మర్చారీలో ఉందొ తెలుసుకొని చెప్పమంది...తను కడసారి చూడలట.." చెప్పాడు కార్తీక్ 
"అక్సిడెంటా?? ..అక్కడ ఆక్సిడెంట్ జరిగిందా?" అడిగింది సుధ విస్తుపోతూ
"లేదు...." 
"మరి...అలా ఎందుకు అడిగింది.." తలపట్టుకు కూర్చుంది సుధ 
"తెలియదు....ఒకటి కారణం అయి ఉండొచ్చు..." అని చెప్పాడు ఆలోచిస్తూ 
"ఏమిటది...." ఆమె గొంతు తడబడుతుండగా అడిగింది కార్తీక్ ని..
"చెప్తాను...నిజానికి సంహిత నాకు నాలుగేళ్ళుగా తెలుసు...తెలుసు అని చెప్పడం చాలా చిన్న పదం...తనకి ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ప్రాణ స్నేహితులు.. ఒకరు నేనైతే, ఇంకొకరు.......సుధీర్...."అంటూ  కార్తీక్ చెప్పిన విషయం విన్న సుధకి నోట మాట రాలేదు..ఆమె వళ్ళంతా చెమటలు పట్టాయి...ఆమె వింటున్న విషయం ఆమెని నిస్చేష్టురాలిని చేస్తుండగా చేష్టలుడిగి స్థాణువై అక్కడే నిలబడిపోయింది..అతను చెప్తున్న ఒకొక్క విషయం ఆమెలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి....

                                       [To be continued in the third part........]

Thursday, 13 May 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 1


"సుధీర్ ని తప్ప నేను ఎవరినీ పెళ్ళిచేసుకోను...." తెగేసి చెప్పించి ఆమె..
"నా మాట గౌరవించని వాళ్లకు ఈ ఇంట్లో స్థానం లేదు..అది కూతురైనా సరే.." స్థిరంగా చెప్పసాగాడు ఆ తండ్రి "కూతురిగా నా గౌరవం నిలబెట్టాలి అనుకుంటే నేను చెప్పిన వాడినే పెళ్ళిచేసుకో..."
"నల్ల కోట్లు వేసుకునే వాళ్ళముందు మీ పరువు కాపాడటానికి, జీవితాంతం నా మనసుకి నేను నల్ల ముసుగు వేసుకొని జీవించలేను నాన్నా.." అంతే స్థిరంగా చెప్పింది ఆమె కూడా..
"అదే నీ నిర్ణయమయితే..." అని వాకిలికేసి వేలు చూపించాడు ఆమెకి..
అంతే ఆమె విసురుగా లోపలి వెళ్లి ఒక సూట్ కేసుతో బైటకి వచ్చి అతని వైపు ఓసారి చూసింది.
"వెళ్ళదల్చుకున్నవాళ్ళు ఆగడం దేనికి..." చేతులు వెనక్కి కట్టుకొని పక్కకి చూస్తూ అడిగాడు
"ఇదే చివరిసారి మీ కూతురు మిమ్మల్ని చూడటం అని తెలియజేయడానికి.." అని గుమ్మం దాటి వెళ్లిపోయిందామె

****************************************************

ఉలిక్కిపడి లేచిన సంహితకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు, మరుక్షణం అదంతా కల అని తెలిసి ఊపిరి పీల్చుకుంది..
"మార్నింగ్ బంగారం..." తన రూంకి అప్పుడే వచ్చిన ఆమె తండ్రి నవ్వుతూ పలకరించాడు...
సంహిత వింతగా చూస్తుంది తండ్రి వైపు..."అదే నీ నిర్ణయమయితే..." అని కలలో వాకిలికేసి వేలు చూపించిన తండ్రి ముఖమే ఆమెకి ఇంకా కనిపిస్తుంది...

వెంటనే తన తండ్రి దెగ్గరకు వచ్చి ఆయన చేతులని తన చేతుల్లోకి తీసుకొని "క్షమించు నాన్నా..." అని అక్కడినుంచి వెళ్ళిపోయింది...అతను ఏమీ అర్థం కానట్లు అలాగే నిల్చున్నాడు..

"అసలు ఆ కల నాకెందుకు వచ్చిందో అస్సలు అర్థం కావడంలేదే..." స్నేహితురాలు సుధతో రాత్రి కల గురుంచి చెప్పింది సంహిత కాలేజీకి వస్తూనే....
"అర్థం అవ్వడానికి ఏముంది...తొందరలోనే ఎవడితోనో నువ్వు జుంపు జోగినాధం అనమాట...నాకు చెప్పకుండా గ్రంథం ఎమన్నా నడుపుతున్నావా.." అడిగింది ఆమె నవ్వుతూ..
"నీ మొహం...ఈ ప్రేమలు దోమలు అంటేనే నాకు టెన్షన్..దానికి తోడు నాన్నని ఎదిరించి ఇంట్లోనుంచి వెళ్ళిపోవడమా!!..." అంది సంహిత క్లాస్ రూం వైపు నడుస్తూ...
"అబ్బో...సరేలే...నీ కలలో వచ్చిన ఆ హీరో ఎవరో ?" అడిగింది సుధ..
"నాకేం తెలుసు...పేరు మాత్రం గుర్తుంది...సుధీర్.." 

కాలేజీ నుంచి బస్సు స్టాపుకి వస్తుంటే సంహిత పుస్తకాలు జారి క్రింద పడ్డాయి...ఆమె తీసుకోనేలోపు, అటు ప్రక్కగా వెళ్తున్న ఆ యువకుడు వడివడిగా వచ్చి ఆమె పుస్తకాలు తీసి చేతికీ అందించాడు..
"థాంక్స్.." అందామె అతని వైపు చూస్తూ...
అతనిలో ఏదో తెలియని ఆకర్షణ మొదటిచూపులోనే ...
పర్వాలేదు అన్నట్లుగా చూసి చిన్నగా నవ్వి వెళ్ళిపోయాడు అతను...
అతని చూపులోని చురుకుదనం...అతని అమాయక మోములో నుంచి జారిన ఆ అరనవ్వు ఆమెని ఒక్క క్షణం కట్టిపడేసాయి...కొద్దిగా గుండె వేగం పెరిగింది...అతను వెళ్తున్న వైపు అలానే చూస్తూ శిలాప్రతిమలా నిలబడిన ఆమె, అంతలోనే తేరుకొని క్షణక్రితం తన చర్యని తలచుకొని బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కగా తనలో తానే చిన్నగా నవ్వుకొని వెళ్ళిపోయింది...

"సంహీ....సంహీ..." అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది సుధ సంహిత లైబ్రరీలో ఉండటం చూసి...
"సైలెన్స్..." అంటూ బల్ల మీద సుత్తితో కొట్టాడు లైబ్రేరియన్ సుధ వైపు చూసి..
'వీడొకడు...వీడి చేతికి సుత్తి ఇచ్చిన వాడిని, బాలయ్య దెగ్గర గొడ్డలి అప్పు తీసుకొని మరీ నరికేయ్యాలి...' అనుకుంటూ సంహిత కూర్చున్న బెంచ్ దెగ్గరికి వచ్చింది...
"ఏంటే ఆ కంగారు..." అంది సుధని చూస్తూ..
"థర్డ్ సెం రిజల్ట్స్ వచ్చేసాయి...నేను ఒక సబ్జెక్టులో డింకీ కొట్టా....అది పెద్ద విషయం కాదు, గత రెండు సెమిస్టర్స్ నువ్వే కదా కాలేజీ ఫస్ట్, ఇపుడు నిన్ను ఒకడు దాటేసాడు..." అంది గుక్క తిప్పుకోకుండా...
"అవునా??..ఎవరు అతను.." అడిగింది కొంచెం దిగాలుగా...
"ఏమో..పేరు తెలీదు..మాత్స్ గ్రూప్ అనుకుంటా..రేపు అసెంబ్లీలో అనౌన్స్ చేస్తారట టాప్ రిజల్ట్స్..." 

అందరూ ఓపెన్ ఎయిర్ ధియేటర్ లో అసంబుల్ అవ్వగా, ప్రిన్సిపాల్ రిజల్ట్స్ చదివాడు...
"మీ బాచ్ లో ఈసారి మొదటిసారిగా ఒక అబ్బాయి కాలేజీ ఫస్ట్ వచ్చాడు...హి ఈజ్ ఫ్రం మాత్స్ గ్రూప్ " అని అతను అనౌన్స్ చెయ్యగానే మాత్స్ గ్రూప్ అబ్బాయిలు ఈలలు..కేకలు మొదలెట్టారు..సంహితకి ఇక అక్కడ ఉండాలని అనిపించలేదు...వెళ్ళిపోవడానికి లేచిన ఆమె "ప్లీజ్ గివ్ అ బిగ్ హాండ్ టూ మిస్టర్ సుధీర్..." అన్న మాటలు విని చప్పున వెనక్కి తిరిగింది...

డయాస్ మీదకి అతను వస్తుండగా అందరూ చప్పట్లు కొడుతున్నారు...
కొన్ని వందల కళ్ళు అతన్ని చూస్తున్నాయి...కానీ ఆమె రెండు కళ్ళు మాత్రం అతన్ని చూస్తూ వర్షిస్తున్నాయి ...అది ఆనందమో ... దుక్కమో ... ఆశ్చర్యమో...ఆవేదనో...ఆమెకే అర్థం కావడం లేదు.. అప్పటిదాకా పరిచయం లేని పరవశం ఏదో ఆమెని ఆవహించగా..ఆమె ఎద బరువెక్కింది, ఆ బరువు తాళలేనన్నట్లు అక్కడే..అలాగే కుర్చీలో కూలబడింది...ఆమె ఎదసవ్వడి ఆమెకి స్పష్టంగా వినిపిస్తుంది...ఏంటో అతని నుండి చూపు మరల్చుకుంటే ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది ఆమెకు...రెప్ప వేయకుండా అతన్నే చూస్తుంది..అతను విసిరే చిరునవ్వు ఆమెని నిలువెల్లా వివసురాలుని చేస్తుంది..'రెండు రోజుల క్రితం చుసిన ఇతని గురుంచి నేను ఎందుకు ఇలా అవుతున్నాను...ఏమయింది నాకు..' ఆమెకి ఏడుపు వస్తుంది..


మరుసటి రోజు కాలేజీ బస్సు స్టాప్ లో బస్సు కోసం చూస్తున్న ఆమెకి ఏ బస్సు వచ్చినా ఎక్కాలని అనిపించడంలేదు..'ఒక్కసారి అతను కనిపిస్తే బాగుండు..' అంటూ ఆమె గుండె పదే పదే కొట్టుకుంటుంది... కోరుకుంటుంది...ఆ విషయం ఒప్పుకోవడానికి ఆమె మనసు మాత్రం సందేహిస్తుంది...తనది అంత చంచల మనస్తత్వం కాదని ఆమెకి తెలుసు..కానీ ఇతని విషయంలో తను ఎందుకు ఇలా అవుతుంది...ఆతను ఎవరో కుడా తెలియదు, కానీ కనిపిస్తే ప్రాణం పోతునట్లు అనిపిస్తుంది...వెళ్లి అతని కాలర్ పట్టుకొని ఎవరు నువ్వు..నన్నేం చేస్తున్నావ్ అని గట్టిగా అడగాలని అనిపిస్తుంది ఆమెకు...

"హలో..." అంటూ ఓ మృదువైన కంఠం ఆమెని పలుకరించగా..ఎప్పుడొచ్చాడో పక్కకి తిరిగి చూడగా అతనే...
చూస్తేనే ప్రాణం పోయేలా ఉంది ఆమెకి, ఇక దెగ్గరికి వచ్చి ఇలా మాట్లాడితే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి...గుటకలు మింగుతూ అలానే చూస్తుంది అతని వైపు...స్వేద బిందువులు ఆమె చెక్కిళ్ళు తాకి ఎరుపు రంగులో మెరుస్తున్నాయి...గుండె వేగం కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ని మించిపోయింది...

"గత రెండు సెమ్స్ లో మీరే టాప్...కాని ఈసారి నేను పోటి వచ్చానని కోపం లేదు కదా..." చిన్నగా నవ్వాడు..
చివాల్న మొహం తిప్పుకుంది...ఆమె అతని చిరునవ్వు తట్టుకోలేదు...తట్టుకొని అతన్ని కళ్ళలోకి చూడలేదు...చుస్తే ఆమె వశం తప్పి ఏం చేస్తుందో అన్న భయం..ఎంత నిగ్రహించుకోవలాన్నా ఆమె వల్ల కాకపోవడం ఆమెకి ఏడుపు తెప్పిస్తుంది...

"ఎనీ ప్రాబ్లెం..." అడిగాడు అతను 
'ఎస్...యు ఆర్ మై ప్రాబ్లం...హూ ఆర్ యు?..హూ యాం ఐ టూ యు?..' ఆమె మనసులోనే ఆగిపోయింది ఆమె ఆవేశం...ఆక్రోశం..
మెల్లిగా అతని వైపు తిరిగి "కంగ్రాట్స్ .." అని చెప్పగలిగింది...
"థాంక్స్...నేను ఈ సెమిస్టరు నుంచే ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను..." అన్నాడు..
"ఓ అలాగా..." అని 'ఎందుకు జాయిన్ అయ్యవురా బాబూ....నీవల్ల ఇక నేను అసలు చదువుతానా??..' అనుకొని దీనంగా పెట్టింది ముఖం 
ఇంతలో బస్సు రావడంతో "వస్తున్నారా మీరు కూడా .." అని అడిగాడు తను బస్సు ఎక్కబోతూ...
"లేదు...ఈ బస్సు మా ఏరియా వెళ్ళదు.." అంది 
"ఓకే...బాయ్ సంహిత..." అని చెప్పి అతను ఎక్కాడు...బస్సు కదిలింది...
అతను అలా దూరం అవుతున్న కొద్ది ఆమెలో తెలియని అలజడి ...ఆమె వెళ్ళాల్సిన బస్సు కూడా అదే అయినా నిగ్రహించుకొని అతని ఆహ్వానాన్ని తిరస్కరించినందుకు ఆమె మనసు ఆమెని ఛీత్కరించింది...పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బస్సుని అందుకోవాలన్న ఆవేశం వచ్చింది ఆమెలో..అంతలోనే ఏమీ చెయ్యలేని నిస్సహాయత..కళ్ళ వెంబడి జారి చెక్కిళ్ళు తడుపుతూ తడుముతున్న కన్నీళ్ళను తుడిచే వృధా ప్రయత్నం చేస్తుందామె...

తన కలలో వచ్చిన అతని పేరు సుధీర్...కాలేజీలో కలిసిన అతని పేరు కూడా సుధీర్..కలలో సుధీర్ కోసం తండ్రినే ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది..ఆమెకి ఆ కల మళ్లీ గుర్తుకు రాగానే ఏదో తెలియని భయం...అది కలే అని సర్దిపెట్టుకున్నా ఆమె మామూలుగా ఉండలేకపోతుంది...కాలేజీ సుధీర్ పై తనకి ఉన్నదీ కచ్చితంగా ఆకర్షణే..కానీ ఆ ఆకర్షణ ఇంత బలీయంగా ఉంటుందా అనేదే ఆమె నమ్మలేకపోతుంది...అతను దూరంగా వెళ్తున్నప్పుడు ఆమె పడ్డ మానసిక వేదన, ప్రియుడు ప్రియురాలు నుంచి శాశ్వతంగా విడిపోయినప్పుడు కలిగే వేదన కన్నా పదింతలు ఎక్కువ..నిలువునా దాహించివేసే బాధ ఆమెకి అనుభవంలోకి వచ్చిన క్షణం అది...అప్పటిదాకా ఎంతో మంది అందమైన అబ్బాయిలు కనిపించినా ఏనాడూ కనీసం ఎవరి గురుంచీ ఒక్క క్షణం కూడా ఆలోచించని ఆమె, ఇతని కోసం ఎందుకు ఇంతగా ఇదై పోతుంది...అతను కనిపించినపుడే...తొలిచూపులోనే..తొలినవ్వులోనే ఆమెని అంతగా ఎందుకు దోచుకున్నాడు...

తన బెస్ట్ ఫ్రెండ్ సుధాకి చెప్పాలనుకుంది ఈ విషయం...కానీ చెప్పలేకపోయింది...చెప్పాక ఆమె దెగ్గర తను అల్లరిపాలు అవుతానేమో అన్న భయం..సుధీర్ విషయం తేలికగా తీసుకుందాం అని ఆమెని ఆమె ఎంత సముదాయించుకున్నా, అది కేవలం అతను కనిపించే వరకు మాత్రమే..అతను తనకు కనిపించకూడదు అని మనసులో దేవుడిని కోరుకుంటూనే, ఆమె కళ్ళు అతని కోసం నలువైపులా వెతుకుతూనే ఉంటాయి అలుపెరగని సంద్రపు అలలులా..  ఒక్కసారి అతను ఎప్పుడైతే కనిపించాడో ఇక తను తను కాదు..అతని దెగ్గరికి వెళ్లి కనీసం హలో అయినా చెప్పకపోతే తను చచ్చిపోతుందేమో అన్న భయం..

ఓ రోజు ఆమె కాలేజీకి బస్సులో వస్తుండగా..ఒక నాలుగు రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ జాం...ఎంతసేపయినా బస్సు కదలడం లేదు...కాలేజీ కి లేట్ గా వెళ్తే అతను కనిపించడేమో..ప్రతి విషయంలోనూ అతని ఆలోచనలే..తన మీద తనకే జాలి కలిగింది...తన బుజ్జి మనసు అతన్ని అంతగా ఎందుకు కోరుకుంటుందో తెలియక ఒక నిస్సహాయపు నవ్వు విరిసింది ఆమె పెదవుల పైన...

"ఆక్సిడెంట్ అంట...పాపం స్పాట్ డెడ్ అంట ఎవరో..." పక్క సీట్ వాళ్ళు మాట్లాడుకోవడం వినపడ్డాయి ఆమెకు...
ఆమె కిటికీ లోనుంచి చూసింది..ఆ కూడలి వద్ద జనాలు గుమ్ము గూడి ఉన్నారు...
ఆమె కొద్ది సేపు చూసి...క్రిందకి దిగి, ఆ కూడలి వైపు నడుచుకుంటూ వెళ్ళింది..
జనాలు గుంపుగా ఉండటం వల్ల ఆమెకి ఎవరో కనపడలేదు....
కొద్దిగా జనాలని నెట్టుకుంటూ ముందుకు వెళ్ళింది...మోటార్ సైకిల్ ఒక లారీకి గుద్దుకున్నట్లు తెలుస్తుంది...
రక్తపు మడుగులో పడివున్న ఆ వ్యక్తిపై ఒక తెల్లటి దుప్పటి కప్పారు...
ఇంతలో అంబులెన్స్ రావడంతో, ఆ బాడీ అందులో ఎక్కించడానికి పైకి లేపారు, అప్పుడు..ఆ క్షణం ..అతని ముఖాన్ని కప్పి ఉన్న ఆ ముసుగు తొలగింది...అతని రూపం ఆమె కంట పడింది...ఆమె గుండె ఒక్క క్షణం ఆగింది..ఆమె కాళ్ళ క్రింద భూమి కంపించింది.."సుధీర్...." అంటూ ఆమె నోటి నుండి ఒక వెర్రి కేక...గుండెలు అవిసేలా...ప్రాణం పోయేలా...దిక్కులు పిక్కటిల్లేలా...చావుకే భయం పుట్టేలా...అతను విగత జీవుడై అంబులెన్స్ లో వెళ్తూ దూరం అవుతుండగా....ఆమె అక్కడే కుప్పకూలిపోయింది....


           [................ To be continued in the next part]



Thursday, 6 May 2010

షార్ట్ కట్ టు గోపాలపురం - 2


ఇంతలోనే.....
పెద్ద కేక...
వాళ్ళ గుండెలు ఆగినంత పని అయ్యింది..
వెనక్కి తిరిగి చూసారు..అంతే కోయ్యబోమ్మల్లా నిల్చుండిపోయారు ముగ్గురూ.......


ఇంతలోనే తేరుకొని ఒక్క ఉదుటున ముందుకుదూకి పరిగెత్తడం మొదలెట్టారు...వెనుక ఉన్న ఆ ఆకారం వాళ్ళని అంతే వేగంగా వెంబడించసాగింది...ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఎటు దొరికితే అటు పరిగెత్తసాగారు ముగ్గురు..కాసేపు పరిగెత్తిన తరువాత..ఆ ఆకారం వాళ్ళని వెంబడించడం లేదు అని నిర్ధారించుకున్న తరువాత..ఒకొక్కడు ఆగి వెనక్కి చూసుకున్నారు...అంతే అంత అర్థరాత్రిలోనూ అంత చలిలోనూ ఒక్కొక్కడికీ చొక్కాలు తడిసిపోయాయి...సురేష్ గాడికి అయితే రెండో సారి పాంట్ తడిసింది...!!

ఎందుకంటే ఎవడికి వాడు ఒంటరిగా మిగిపోయాడు...ఒకడికి ఇంకొకడు ఎటువైపు వెళ్ళాడో కూడా తెలియదు..సురేష్ గాడికి ఇక ఇంటికి క్షేమంగా వెళ్తానన్న ఆశ చచ్చిపోయింది..చుట్టూ చిక్కని చీకటి...ఎటువైపు నుంచి ఏం వస్తుందో అన్న భయంతో వాడికి నూటనాలుగు కొట్టింది...


గిరిగాడికి ఏం చెయ్యాలో అర్థంకావట్లేదు..సురేష్ గాడి పరిస్థితి తలచుకుంటేనే వాడికి దడ పుడుతుంది..వద్దన్నా తనే లాక్కొచ్చాడు, ఇప్పుడు వాడికి ఏమైనా అయితే  వీడిని కుమ్మేయ్యడం ఖాయం..టార్చ్ లైట్ పట్టుకొని వెతుకుతూ సురేష్ అని గట్టిగా అరస్తున్నాడు...

రవి గాడు పరిగెత్తుతూ ఏదో చెట్టుకు డీ కొట్టి పడిపోయి..లేచి..చుట్టూ చూసి మళ్లీ పడిపోయాడు..


సురేష్ గాడు ఆ చీకట్లో కళ్ళజోడు పోగొట్టుకున్న గుడ్డివాడిలా తడుముకుంటూ... పాకుతూ డేకుతూ కిందా మీదా పడి వెళ్తున్నాడు గమ్యం తెలియని బాటసారిలా...అలా వెళ్తుంటే ఒక చిన్న అరుగు లాంటిది కనిపించింది మసక మసకగా తెల్లగా..వెంటనే దాని మీద సెటిల్ అయిపోయాడు..కరెక్ట్ గా ఒక మనిషి పడుకోడానికి సరిపోయేలా ఉంది ఆ అరుగు..'ఇక్కడ అరుగు ఎవడు కట్టుంటాడో...' అనుకొని మెల్లిగా దాని మీద పడుకున్నాడు...టైం రెండు అయ్యుంటుంది..ఇంకొక మూడు గంటలు గడిస్తే తెల్లవారుతుంది..అప్పటిదాకా ఈ ప్రాణం పోకుండా చూసుకోవాలి..సంకల్పించుకున్నాడు మనోడు...

ఆ అరుగు మీద పడుకొని 'ఈ ఎదవ నాకొడుకులు ఎక్కడ సచ్చారో...' అనుకొని చుట్టూ చూసాడు..అప్పటిదాకా భయంకరంగా తోచిన ప్రదేశం ఇప్పుడు కొంచెం పర్వాలేదనిపించింది..ఎలాగోలా ఇక్కడే మూడు గంటలు టైం పాస్ చెయ్యాలి..ఈ చీకట్లో తడుముకుంటూ వెళ్ళడంకంటే ఇదే ఉత్తమం అనుకొని, తను చిన్నప్పుడు తన బామ్మ చెప్పిన "అక్బర్ బీర్బల్" కథలు గుర్తుకుతెచ్చుకుంటున్నాడు..అప్పుడే ..సరిగ్గా అప్పుడే తనకు వినిపించింది ఆ స్వరం...చాల దెగ్గరిగా..పక్కనే మాట్లాడినట్లు...ఇలా.. "ఒరేయ్ బైరిగా...నా ఆస్తి మొత్తం ఆ సానిదానికి తగలబెడతావా...నీ ఆటలు సాగానివ్వను రా.." అని...

అప్పటిదాకా అక్బర్ బీర్బల్ కథలో బీర్బల్ యొక్క సమయస్పూర్తిని చాకచక్యాన్ని మనసులోనే మెచ్చుకుంటూ..ఆ కథలో పూర్తిగా లీనం అయిన సురేష్ గాడు దెబ్బకి దడుసుకొని లేచి కూర్చుకున్నాడు...చుట్టూ చూసాడు...ఎవరూ లేరు..ఆ గొంతుక ఎవరో ముసలావిడది..తను స్పష్టంగా విన్నాడు..తను కలగనలేదు..మూడోసారి ప్యాంటు తడిసిపోడానికి రెడీ గా ఉంది....

"సురేష్...." అని కేక వినబడేసరికి మనోడికి ప్రాణం లేసోచ్చి "గిరిగా..." అని గట్టిగా అరిచాడు...గిరి గాడు టార్చ్ వేసి చూడగా సురేష్ గాడు దూరంగా కనిపించాడు..హమ్మయ్యా అనుకుంటూ మెల్లిగా సురేష్ గాడిని చేరుకొని...నోరువెళ్ళబెట్టి అలానే చూస్తున్నాడు వాడి వైపు.."ఏమైంది రా..." అడిగాడు సురేష్...

"నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావ్??" అడిగాడు అయోమయంగా 
"ఈ చీకట్లో గుడ్దోడిలా ఎటువైపని వెళ్ళను చెప్పు...అందుకే ఈ అరుగు మీద ఓ మూడు గంటలు టైం పాస్ చేద్దామని పడుకొన్నా...ఈ ప్లేస్ లో అరుగు ఎవడు కట్టించాడో.." అన్నాడు తనకు కాసేపు ఆశ్రయం ఇచ్చిన అరుగుని ప్రేమతో పాముతూ...
"ఎవడైనా కట్టిస్తాడు..ఊరిలో కాదు, ఇలాంటి ప్రదేశాల్లోనే కట్టిస్తాడు...కాకపోతే ఈ ప్రదేశంలో దీన్ని అరుగు అనకూడదు....సమాధి అనాలి..." అన్నాడు గిరిగాడు...తనేం వింటున్నాడో తెలిసేలోపే ఒక్క ఉదుటున ఆ సమాధి మీద నుంచి దూకేసాడు సురేష్ ..గిరి గాడు ఆ సమాధి మీదకి టార్చ్ ఫోకస్ చేసాడు 

కీ.శే. శ్రీమతి ఎర్రంశెట్టి వీరవెంకట సుకుమార లక్ష్మి
జననం : 1932
మరణం : 1995

అని ఉంది...
అది చూడగానే మనోడికి గండి కొట్టేసింది...ముచ్చటగా మూడోసారి...
ఓరినాయినో ఇప్పటిదాకా సమాధి మీద పడుకోవడమే కాక చిన్నప్పుడు బామ్మ చెప్పిన బీర్బల్ కథలు నెమరు వేసుకున్నానా??...అమ్మో ఆ ఆలోచన ఇప్పుడు ఎంత భయంకరంగా ఉంది అనుకున్నాడు సురేష్...
మొత్తానికి ఎలాగో గిరి గాడు కనిపించినందుకు కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు సురేష్..


"గిరిగా నాకు ఇందాక ఒక ముసలావిడ గొంతు క్లియర్ గా వినిపించిందిరా..చాలా  భయమేసింది...ఇక్కడ దెయ్యాలు ఉన్నాయంటావా?" అడిగాడు మెల్లిగా..
"ఆడవన్నాక జంతువులు..స్మశానం అన్నాక దెయ్యాలు ఉండక ఏం చేస్తాయి...వాటి అడ్డాకే వచ్చి వాటి ఉనికినే ప్రశ్నిస్తే ఎలా చెప్పు?" అన్నాడు సీరియస్ గా..
"ఒరేయ్ అలా భయపెట్టకు రా..." అన్నాడు భయంగా
"సరేలే ముందు ఇక్కడనుంచి వెళ్దాం పదా...రవి గాడు ఎక్కడున్నాడో .." అనుకొని నెమ్మదిగా టార్చ్ సహాయంతో నడుస్తూ 'రవీ...' అని గట్టిగా కేకలు వేసుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు...


"పాపం రవి గాడు ఏమైపోయాడో...ఈడికేదన్నా అయితే ఆ పిల్ల గతేం కాను..." అన్నాడు గిరిగాడు...
"ఏ పిల్లా..??" అడిగాడు సురేష్ 
"అదేనేహే..సర్పంచ్ కూతురు...జామపండురా...వీడు బ్రిడ్జి కడుతున్నాడుగా దానికి..."
"ఈడు కడితే సరిపోద్దా??..ఆ పిల్ల బ్రిడ్జి ఓపెనింగ్ సెయ్యోద్దూ...ఎనకటికి ఏదో సామెత ఉందిలే...అలా ఉంది నువ్వు చెప్పేది.." అన్నాడు సురేష్ టాపిక్ మారనివ్వకుండా...దెయ్యాల టాపిక్ కంటే ఇది బెటర్ కదా...
"ఎల్లేహే...ఈడి కంటే పోటుగాడు వస్తాడా దానికి...దాని బాబు గురుంచి తెలిసినోడు ఎవ్వడూ దీన్ని చేసుకోడు..."
"అలాగే చూస్తూ ఉండండి మీ ఇద్దరు...దాని బాబు అమెరికా ఇంజనీర్ ని తెచ్చి పెళ్లి చేస్తాడు...అప్పుడు మన రవిగాడు ఆళ్ళ ఫస్ట్ నైట్ కి 'ఇది తోలి రాత్రి...కదలని రాత్రి..' అని మజ్నులా పాటలు పాడుకుంటాడు.." అని సురేష్ అంటుండగా వినిపించాయి వాళ్లకి ఆ మాటలు...ఇలా .."అదే నిజం అయితే...మీ పక్కన ఉన్న సమాధి మీద ఒట్టు, దాన్ని లేపుకెళ్తా..." అని...

సురేష్ గాడికి వణుకుడు మొదలైంది.."నేను ఇందాక చెప్పాకదరా...ఏవో మాటలు విపించాయి అని..ఇదిగో మళ్లీ ఎవరో మాట్లాడారు..." అన్నాడు చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో....

"రవి గాడ్రా...!!" అన్నాడు టార్చ్ లైట్ వేసి చూపిస్తూ... ఆళ్ళకి పక్కగా ఉన్న మర్రిచెట్టు కింద పడుకొని ఉన్నాడు రవి గాడు...
"ఇక్కడ పడుకున్నావెంట్రా??..." అడిగాడు గిరి
"ఏముంది...చెట్టుకు గుద్దుకున్నాను..మైండ్ బ్లాక్ అయ్యి షట్ డౌన్ అయింది..అది మళ్లీ రీస్టార్ట్ అయ్యి చూసేసరికి...అంతా చీకటి..ఎవరూ కనిపించకపోయేసరికి మళ్లీ షట్ డౌన్ అయింది..ఇక్కడే కొంచెం మెత్తగా ఉండేసరికి పడుకొనిపోయానురా...ఇదిగో ఈనాకొడుకు మళ్లీ నా లవర్ పెళ్లి గురుంచి మాట్లాడుతుంటే, నా మైండ్ మళ్లీ రీస్టార్ట్ అయింది.." చెప్పాడు మెల్లిగా లేస్తూ..




"ఏమయ్యిందిరా మీకు....ఆడేమో సమాధి మీద పడుకొని అరుగు అంటాడు...నువ్వేమో మర్రిచెట్టు కింద పడుకొని మెత్తగా ఉంది అంటావ్...పిచ్చానాయాల్లారా..పదండి..." అంటూ బైల్దేరదీసాడు గిరిగాడు...

"అవునోరే...అసలు మనల్ని అంత స్పీడుగా తరుముకోచ్చింది...ఏంట్రా అది.." అడిగాడు రవిగాడు...
"అదా...కుక్క రా..." చెప్పాడు గిరిగాడు..
"కుక్కా ...!!!" నోరేళ్ళబెట్టారు  ఇద్దరూ...
"అవునెహే...సూపర్ ఫాస్ట్ అనుకుంట...బొంచేసి ఎన్నిరోజులయిందో పాపం పిచ్చిముండ...దొరికుంటే ఒకొక్కడి కండలు ఊడబీకి, ఆకలితో అలమటించే దాని మిత్రులతో మిడ్ నైట్ పార్టీ చేసుకునేది..." చెప్పాడు గిరిగాడు...


"కుక్కలు మనిషి మాంసం తింటాయా ?? " సందేహం వదిలాడు సురేష్ 
"మాములుగా తినవేమో...కానీ ఇవి దెయ్యపు కుక్కలు కదా..మనిషి మాంసం తప్ప పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టవ్??.." చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు గిరిగాడు
"దెయ్యపు కుక్కలా ?? !!" మళ్లీ నోరేళ్ళబెట్టారు  ఇద్దరూ..
"మీరు ఇంకా ఎదగాలిరా...అంటే త్రిష చెప్పినట్లు ఈ డైరెక్షన్ లో కాదు..చెప్తా వినండి..అర్థరాత్రి స్మశానంలో తిరిగే కుక్కల్లో దెయ్యాలు పూని మనిషి మాంసాన్ని వేటాడి తింటాయి..ఈ దెయ్యపు కుక్కకి చాలా రోజులుగా మనిషి మాంసం దొరకలేదేమో మనల్ని చూసి 'వీళ్ళని ఈరోజు డిన్నర్ లో తినకపోతే నా జన్మే వేస్ట్' అన్న రేంజ్ లో మనల్ని వెంటాడింది...చూసారుగా దాని స్పీడ్...మామూలు కుక్కలకి ఆ స్పీడ్ ఉండదు..."చెప్పాడు దెయ్యాలజీ సబ్జెక్టుని కాచివడపోసిన శాస్త్రవేత్తలా..


సురేష్ గాడికి నూటనాలుగు నుంచి నూటేడు కొట్టింది...
"మరి మనకు వినిపించిన అరుపు కుక్క అరుపు కాదె ??" శాస్త్రవేత్తనే తప్పు పట్టిన విద్యార్ధి మెరుపు తోణకిసలాడింది రవి గాడిలో..
"తోక్కలా ఉంది నీ డౌట్...అది దెయ్యపు కుక్క, అది ఎట్లా అయినా   అరుస్తాది...కేకలెడతాది..కుక్కాలాగానే మొరగాలని లేదు.." విద్యార్ధి మెరుపుని అణగదొక్కే శాస్త్రవేత్త గర్వం ఉట్టిపడింది గిరిగాడిలో...
ఇవన్నీ వింటూ సురేష్ గాడికి నాలుగోసారి గండి కొట్టేలా ఉంది పరిస్థితి...

**************************************

ఉదయం ఆరింటి కల్లా గోపాలపురం పడమటి వీధికి చేరుకున్నారు ముగ్గురూ..అక్కడే దెగ్గరిలో ఉన్న రామాలయం గుడి ప్రక్కన ఉన్న సురేష్ గాడి ఇంటికి చేరుకున్నారు ...రాత్రి అక్కడ నుంచే ముగ్గురు సినిమాకి బైల్దేరారు...

సురేష్ వాళ్ళమ్మ కంగారుగా అటూ ఇటూ తిరుగుతుంది...
వాళ్ళని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి "ఏరా సినిమాకి వెళ్ళారంటా..ఇందాకే సర్పంచ్ గారు వచ్చి చెప్పారు..మీ నాన్నకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా...అది సరే రాత్రంతా ఎక్కడ ఉన్నార్రా??" చాలా కంగారు పడుతూ అడిగారు వాళ్ళమ్మ సురేష్ ని..

"అమ్మ అదొక పెద్ద కథ..." అంటూ మొదలెట్టి వాడు నాలుగోసారి గండికోట్టడం వరకు చెప్పి..అంటే ఆ విషయం ఒక్కటి తప్పించి..."ఆ తర్వాతా అలా నడిచి కొంత దూరం వెళ్ళాక ఒక గుడిసె కనిపించింది...అందులో ఇంకా లాంతరు వెలుగుతూ ఉండేసరికి..మేము అక్కడికి వెళ్లి చూస్తె ఒక బామ్మ కర్ర పట్టుకొని కూర్చొని ఉంది...మేము ఆమెని ఎందుకు ఇంత రాత్రి వేళ ఇలా కూర్చొని ఉన్నావు అని అడిగితె...ఆమె పొలం అక్కడ ఉందని దాన్ని రాత్రి పూట నక్కలు రాకుండా ఇలా కాపలా కాస్తున్నాను అని చెప్పింది...మేము ఆమెకి ఎవరూ లేరా అని అడిగితె..ఒక పనికిమాలిన కొడుకు ఉన్నాడని చెప్పింది...అంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నారు అని మమ్మల్ని అడిగింది..మేము ఆమెకి మొత్తం చెప్పాము..ఆమె చాలా మంచిదమ్మ..రాత్రి పూట వెళ్ళడం ఆ దారిలో అంత మంచిది కాదు...ప్రొద్దుటి వరకు అక్కడే ఆమె గుడిసెలోనే ఉండమని చెప్పిందమ్మా...ఇంకా బోలెడు కబుర్లు చెప్పింది..మంచి మంచి కథలు కూడా చెప్పింది...అక్కడే మూడు గంటలు ఎలా గడిచిపోయాయో తేలీదు...ఈసారి ప్రొద్దున పూట అటువైపు వెళ్లి రాములోరి ప్రసాదం ఇస్తాను ఆమెకి.." చెప్పాడు సురేష్ గాడు..

"అవునా...చాలా మంచి బామ్మలా ఉంది..పాపం పనికిమాలిన కొడుకు ఉండటం వల్ల రాత్రిపూట ఆ వయసులో ఎక్కడో పొలంలో కాపు కాయాల్సిన అగత్యం పట్టింది ఆమెకు.." అంటూ వాళ్ళమ్మ ఆ బామ్మా మీద కాసేపు సానుభూతి ప్రకటించి..."బాబూ రవి..సర్పంచ్ గారు నిన్ను ఓ సారి ఆయనను కలవమన్నారు..ఇందాక చెప్పారు..." అంటూ లోపలి వెళ్తూ "నాయనలారా పళ్ళు తోముకోండి...వేడి వేడి కాఫీ తీసుకొస్తాను .." అంది..

కాఫీలు టిపినీలు అయ్యాకా ముగ్గురూ సర్పంచ గారి ఇంటి వైపు దారితీశారు...
"ఒరేయ్ నీ జామపండు ఏం చేస్తుందో..." కెలికాడు గిరిగాడు
"ఉండేహే...నా టెన్షన్ లో నేనుంటే .." చిరాగ్గా అన్నాడు రవి గాడు..
"అయినా ఒరే...ఆడి జామపండు మీద నీ ఇంట్రెస్ట్ ఏంట్రా...నిన్నటి చూస్తున్నా జామపండు జామపండు అని తెగ నీలుగుతున్నావ్..." చురకిచ్చాడు సురేష్ గాడు..

సర్పంచ్ ఇంటికి చేరుకున్నారు ముగ్గురు...జామపండు వరండాలో కూర్చొని చదువుకుంటుంది...'కనీసం పాస్ అవుద్దా ఇది' అనుకున్నాడు గిరిగాడు...  లోపలి నుంచి సర్పంచ్ మాటలు వినిపిస్తున్నాయి ...
"ఆపవే నీదొక గోల...మా అమ్మ పోయాక నువ్వు తగులుకున్నావా...ఆస్తి మొత్తం దేనికో సానికి దోసి పెడుతున్నాని ఓ తెగ ఇదైపోయేది..ఇప్పుడు నువ్వు కూడా అదే గోలా..నీ బాబు సొమ్మేం లేదిక్కడ.." అరుస్తున్నాడు వాళ్ళ ఆవిడతో...
ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లు అనిపించింది సురేష్ గాడికి...
ఎక్కడా అని ఆలోచిస్తుండగా రాత్రి అరుగు మీద..ఓ సారీ ..సమాధి మీద శయనించినప్పుడు వినిపించిన మాటలు గుర్తుకువచ్చాయి... 

సర్పంచ్ గారు బైటకి వచ్చి "ఏరా రాత్రంతా ఎక్కడున్నారు??...గోపాలపురం పరువు తీస్తున్నారు ఎదవల్లారా.." అన్నాడు.. 'నువ్వు సర్పంచ్ అయినప్పుడే పోయిందిలే గోపాలపురం పరువు..' పటపటా పళ్ళు కొరికాడు గిరిగాడు...
'నువ్ లోపలి ఎళ్ళి సదువుకోవే...బైట కూకుంటే ప్రతి నాకొడుకు ఎజ్జిబిషన్ సూసినట్టు సూడ్డమే' అన్నాడు కూతురిని చూసి రవి గాడిని ఉద్దేసించి...
ఇంతలో వరండా గోడకి వేలాడదీసిన ఫోటో వైపు చూసి దిమ్మతిరిగింది గిరిగాడికి...ఏదో ట్రాన్స్ లో ఉన్నవాడిలా అయిపోయి మిగతా ఇద్దరికీ ఆ ఫోటో చూపించాడు గిరి..వాళ్ళిద్దరూ ఆ ఫోటో చూసి మళ్లీ కోయ్యబోమ్మల్లా అయిపోయారు...

"సర్పంచ్ గారు ఆ ఫోటో ఉన్న ఆవిడ...??" గొంతులో తడి ఆరిపోతుండగా అడిగాడు గిరి గాడు...
"ఎవరేట్రా....మా అమ్మ..." చెప్పాడు సర్పంచ్...
"మేము ఈమె గుడిసెలోనే ఈమె తోనే రాత్రి మొత్తం......కథలు......కబుర్లు... ." అంటూ లీలగా వస్తున్న గిరిగాడి మాటలు గొంతుకలోనే ఆగిపోయాయి, ఆ ఫోటోలో క్రింద వ్రాసి ఉన్న అక్షరాలపై వాడి దృష్టి పడి...వాడు అక్కడే స్థాణువు అయ్యాడు..ఆ ఫోటో క్రింద ఇలా వ్రాసి ఉంది...

కీ.శే. శ్రీమతి ఎర్రంశెట్టి వీరవెంకట సుకుమార లక్ష్మి
జననం : 1932
మరణం : 1995

అది చూడగానే అయిదోసారి గండి కొట్టేసింది సురేష్ గాడికి...
ఆడు గండి కొట్టడం చూసి "ఛీ...ఛీ.." అంటూ పరిగెత్తిన జామపండు అరుపు లీలగా వినిపించింది మాకు...


******************సమాప్తం *****  జైహొ ******************